Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

తాతా మనవల వంటి డోనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ అన్‌ అనూహ్య భేటీ ముగిసింది. విశ్లేషకులందరూ ఎవరిది పైచేయి, ఎవరు తామనుకున్నది సాధించారు అనే మల్లగుల్లాల్లో తలమునకలై వున్నారు. ఎవరేం చెప్పినా ఒక చిన్న దేశమైన వుత్తర కొరియా ప్రపంచానికి ఒక పెద్ద సందేశం ఇచ్చింది. బలవంతమైన సర్పం చలిచీమల చేతుల్లో హతమౌతుందన్నది పాత అనుభవం అయితే ఒళ్లంతా అణుబాంబులు కట్టుకొని తిరిగే ప్రపంచంలోనే బలవంతుడైన అమెరికాను అదుపులోకి తెచ్చుకోవాలంటే ఒక్క అణుబాంబు, దానిని అమెరికా గడ్డ మీదకు ప్రయోగించగలిగిన క్షిపణి వుంటే చాలని వుత్తర కొరియా నిరూపించిందని చెప్పక తప్పదు. ప్రపంచ మానవాళిని వందసార్లు చంపటానికి అవసరమైనన్ని మారణాయుధాలు మా దగ్గర వున్నాయని ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. పిచ్చిపట్టిన అమెరికా అధ్య క్షుడెవరైనా అణుమీట ఒకసారి నొక్కితేనే ప్రపంచం భస్మీపటలం అవుతుంది, రెండోసారికే ఏమీ వుండదు, ఇంక వందసార్లకు అవకాశం ఎక్కడుంటుంది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే వారికి బాగా అర్ధం అయిన విషయం ఏమంటే తమ దేశం నుంచి బయలుదేరిన అణ్వస్త్రం మారణహోమం సృష్టించకముందే ఇతర దేశాలలో వున్న అణుమీటలు కూడా పని చేసి అన్ని వైపుల నుంచి అమెరికాను చుట్టుముడతాయని, అన్నీ ఒకేసారి అందరినీ హతమారుస్తాయని తెలుసు.

‘ఇప్పుడే విమానం దిగాను, సుదీర్ఘ ప్రయాణం, అయితే నేను పదవీ బాధ్యతలు స్వీకరించేనాటితో పోలిస్తే ఇప్పుడు మరింత సురక్షితం అని ప్రతి ఒక్కరు భావించవచ్చు. కిమ్‌ జోంగ్‌ అన్‌తో భేటీ చాలా ఆసక్తికరంగా ఎంతో సానుకూల అనుభవంతో జరిగింది. వుత్తర కొరియాకు మంచి భవిష్యత్‌ వుంది. నేను అధికారాన్ని స్వీకరించబోయే ముందు మనం వుత్తర కొరియాతో యుద్ధానికి దిగబోతున్నామని జనం అనుకుంటున్నారు. వుత్తర కొరియా మనకు అతి పెద్ద ప్రమాదకర సమస్య అని బరాక్‌ ఒబామా చెప్పాడు, అలాంటిదింకేమీ లేదు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి అని సింగపూర్‌ నుంచి అమెరికా గడ్డపై కాలు పెట్టగానే ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. అంటే అమెరికన్లలో ఎంత భయం గూడు కట్టుకొని వుందో, దానిని పోగొట్టటం అక్కడి ప్రభుత్వానికి ఎంత అవసరమో ఇవి విదితం చేయటం లేదా ?

కొరియాలో యుద్ధవిన్యాసాలు ఆపుతామని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. వచ్చే ఏడాది 716బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. కిమ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ కొరియా ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పాడు. అంతటితో ఆగలేదు, మా గువామ్‌ దీవి నుంచి విమానాలను తీసుకు వచ్చి దక్షిణ కొరియాలో విన్యాసాలు చేయించి తిరిగి ఆ దీవికి తీసుకుపోవాలంటే మాకు చాలా ఖర్చు అవుతోంది, సింహభాగం మేమే భరించాల్సి వస్తోంది అని వ్యాఖ్యానించి ఇంటా బయటా నవ్వుల పాలయ్యాడు. అడుసుతొక్కనేల కాలు కడగనేల. ఎవరు విన్యాసాలు చేయమన్నారు, ఎవరికోసం చేస్తున్నారు, ఖర్చు భరించటం చేతకానపుడు కొనసాగించటం ఎందుకు? అసలు యుద్ధ విన్యాసాలు ఆపమని వుత్తర కొరియా అసలు అడిగిందా? మా ప్రాంతం నుంచి తుండు తుపాకీ మొత్తంగా సర్దుకొని మీ దేశానికి వెళ్లిపోయి మా రెడు దేశాలను ఐక్యం చేసేందుకు అడ్డుతొలగండి అని డిమాండ్‌ చేస్తోంది తప్ప, విన్యాసాలకే పరిమితం కావటం లేదు. జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధపోరాటం ప్రారంభించి, తరువాత అమెరికాతో యుద్దంతో చేసి, గత ఆరున్నర దశాబ్దాలుగా అణ్యాయుధాల మోహరింపులు, యుద్ద విన్యాసాలు, బెదిరింపుల మధ్య పెరిగిన వుత్తర కొరియన్లను యుద్ద విన్యాసాలు ఏమాత్రం భయపెట్టలేదని రుజువైంది. గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్లు ప్రయోజనం లేని విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పినంత మాత్రాన కొరియా సమస్య పరిష్కారం కాదు.

కొరియా ద్వీపకల్పంలో అమెరికా తిష్ట ఎందుకు వేసిందో కమ్యూనిస్టులు చెబితే, ఆ వారు అంతకు మించి ఏమి చెబుతారులే అని చాలా మంది పట్టించుకోరు. సింగపూర్‌లో ట్రంప్‌ ప్రకటన తరువాత అమెరికాలోని స్వంత రిపబ్లికన్‌ పార్టీ నేతలే వ్యతిరేకించారు. తమ నేత తెలివి తక్కువ ప్రకటన చేశాడని పార్టీ ఎంపీ లిండ్‌సే గ్రాహమ్‌ వ్యాఖ్యానించాడు. చేస్తున్న ఖర్చు వూరికే పోవటం లేదని అసలు కొరియాలో దళాల తిష్ట చైనాకు హెచ్చరిక అంటూ కొనసాగించాలని కోరాడు. అంటే దుష్టఆలోచన మనసులో పెట్టుకొని గడ్డికొస్తావా పిల్లా అన్నట్లుగా దక్షిణ కొరియా రక్షణ పేరుతో ఇంతకాలం అమెరికా చేస్తున్న యుద్ధ విన్యాసాలు, బలగాల మోహరింపు చైనాకు వ్యతిరేకం అని గ్రాహమ్‌ చెప్పకనే చెప్పాడు. సమగ్రమైన ఒప్పందం మీద సంతకం చేశామని ట్రంప్‌ చెప్పాడు. గతంలో వుత్తర కొరియాతో కుదిరిన ఒప్పందాలతో పోలిస్తే ఇది ఒక స్పష్టత లేని, ఎలాగైనా భాష్యం చెప్పటానికి, చర్చకు దారితీసేదిగా వుందనే అభిప్రాయం అమెరికాలో వెల్లడైంది. ఎవరూ వ్యతిరేకించటం లేదు గానీ సంతోషించటానికి ఏముంది అని పెదవి విరుస్తున్నారు.2005లో కుదిరిన ఒప్పందంలో మరోనాలుగు ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వాములు ఇప్పుడు వాటి ప్రస్తావన లేదు.

వుత్తర కొరియా అణు సమస్య పరిష్కారం అంటే అది సమగ్రమైంది కాదు.దీనిలో రెండు అంశాలున్నాయి. వుత్తర కొరియా అణు కార్యక్రమం నిలిపివేత అంటే ఆయుధాల తయారీ తప్ప శాంతియుత ప్రయోజనాల కార్యక్రమాన్ని నిలిపి వేయటానికి ఏ దేశమైనా అంగీకరిస్తుందా? దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా మోహరించిన అణ్వాయుధఛత్రం, ఇతర ప్రమాదకర క్షిపణులు, సైన్యం మాటేమిటి? వీటి గురించి సింగపూర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు, ఒప్పందమూ కుదరలేదు. సమస్యల పరిష్కారానికి ఒక సూత్రప్రాయ అంగీకారం మాత్రమే కుదిరింది కనుక ప్రపంచమంతా ఈ పరిణామాన్ని సహజంగానే హర్షిస్తోంది. వుత్తర కొరియా పూర్తిగా అణుకార్యక్రమాన్ని నిలిపివేయాలంటే దానికి జరిగే నష్టాన్ని ఎలా భరిస్తారు, ఎవరు భరిస్తారు, ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను ఎలా, ఎంతకాలంలో తొలగిస్తారు, దానికి హామీ ఏమిటి అనేక అనేక అంశాలు పరిష్కారం కావాల్సి వుంది. వీటిపై గతంలో అంగీకరించిన ఒప్పంద నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన మచ్చ వుంది. ఒకవైపు వుత్తర కొరియాతో చర్చలు జరుపుతూనే అణు సమస్యపై ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగింది. అన్ని ప్రధాన దేశాలతో వాణిజ్యలోటు కలిగి వున్న అమెరికా అదిరించి బెదిరించి తన వుత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఈ క్రమంలో దానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిఘటన ఎదురవుతున్నది. వుత్తర కొరియాను అదుపు చేసే పేరుతో ఇంతకాలం పెద్ద మొత్తంలో అమెరికా నిధులు ఖర్చు చేసింది. అనుకున్నట్లుగా ఒప్పందం అమలు జరిగితే ఇప్పుడు సైనిక విన్యాసాలకు బదులు వుత్తర కొరియా రక్షణ గురించి ఖర్చు చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. దాన్ని ఎవరి మీద రుద్దుతుంది? ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి వుంది.

Image result for denuke deal with north korea

ఒప్పందాల విషయంలో గతంలో అమెరికా ఇతర దేశాల నిర్వాకం చూసిన తరువాత వుత్తర కొరియా తన రక్షణకు మరింత జాగ్రత్త పడుతుంది. వుదాహరణకు 30దేశాలు నిధులు అందచేసే కొరియా ద్వీపకల్ప ఇంధన అభివృద్ధి సంస్ధ(కెడో) ద్వారా 250 కోట్ల డాలర్లు వెచ్చింది ఒక అణుఇంధన రియాక్టర్‌ను నిర్మించారు. దానికి అమెరికా 50కోట్ల డాలర్ల విలువగల తేలిక జల ఇంధనాన్ని సమకూర్చేందుకు ఖర్చు చేసింది. చివరికి దాన్ని 2006లో మూసివేశారు. అయితే దానికి రెండువందల కోట్ల డాలర్లను సమకూర్చాయి. ఆమొత్తం సొమ్ము దానిని నిర్మించిన ఐరోపా యూనియన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ కంపెనీలకే తిరిగి చేరింది తప్ప వుత్తర కొరియాకు ఒరిగిందేమీ లేదు. ఒప్పందం విఫలం కావటంతో వుత్తర కారియా అప్పటి వరకు అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ పర్యవేక్షణలో వుంచిన ప్లూటోనియం రాడ్ల సీళ్లను తొలగించి తిరిగి అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి అమెరికాదే పూర్తి బాధ్యత.

ప్రాంతీయ రాజకీయాలు, దేశాలలో జోక్యం చేసుకోవటంలో అమెరికాను మించిన వారు ఇప్పుడు లేరు. వుదాహరణకు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తొత్తుగా చేసుకొని అమెరికా పాల్పడని జోక్యం లేదు. చివరకు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా తయారు చేసి కిరాయికి ప్రయోగిస్తోంది. అలాంటి అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో ఇరాన్‌ జోక్యం చేసుకొంటోందనే నెపంతో దానితో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇప్పుడు వుత్తర కొరియా నుంచి ప్రమాదం లేదు, హాయిగా నిదురపొండి అని తన జనానికి చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఇరాన్‌ గురించి ఏమి చెబుతారు? కొద్ది రోజుల తరువాత వుత్తర కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కూడా తూ నా బడ్డుబాలు అని చెప్పరన్న గ్యారంటీ ఏముంది? అందుకే అమెరికా అడుతోంది రాజకీయం తప్ప మరొకటి కాదు అని చెప్పాల్సి వస్తోంది. వుత్తర కొరియాలో నిర్బంధించిన అమెరికన్ల విడుదల కొరకు ఆదేశం ఎలాంటి మొత్తాన్ని డిమాండ్‌ చేయలేదు. ఇరాన్‌లో బందీలైన అమెరికన్లను విడిపించుకొనేందుకు 40కోట్ల యూరోలను విమానంలో తరలించి, దానిలోనే బందీలను వెనక్కు తీసుకువచ్చారు. అయితే ఆ సొమ్మును ఒప్పందం ప్రకారం సరఫరా చేయని మిలిటరీ పరికరాల కోసమని అమెరికా చెప్పుకొన్నది. అలాంటి మొత్తం అయితే ఇంకా 200 కోట్ల డాలర్ల వరకు అమెరికా చెల్లించాల్సి వుంది. ఇవన్నీ చూసినపుడు అమెరికా ఆడుతున్నది రాజకీయం తప్ప ప్రపంచశాంతి సమస్యపై దానికి చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం.