Tags

, ,

Image result for Is Donald Trump starting trade war

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక బఫూన్‌ కావచ్చు, కానీ అతగాడి వాణిజ్య యుద్ధం నిజం, ట్రంప్‌ ఎల్లవేళలా వాణిజ్య యుద్ధాన్ని కోరుకుంటాడు, ఇప్పుడు ఎన్నో తెచ్చుకున్నాడు, ట్రంప్‌ వాణిజ్య యుద్ధం ఎంతటి తప్పిదమో ఒక విదూషకుడు కూడా చెప్పగలడు, గనులు, రైతుల లక్ష్యంగా వాణిజ్య యుద్ధం ఇప్పటికే ట్రంప్‌ గుండెకాయను తాకింది, చైనా పన్నులు ఇప్పటికే ట్రంప్‌ ఓటర్లను దెబ్బతీస్తున్నాయి, ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు’.పత్రికలను తిరగేస్తే కనిపిస్తున్న కొన్ని వార్తల శీర్షికలివి. నిజంగా వాణిజ్య యుద్దమే వస్తే కలిగే లాభనష్టాలేమిటన్నది ప్రతి దేశమూ లెక్కలు వేసుకొంటోంది. గతంలో పెట్టుబడిదారీ వ్యవస్ధ విస్తరణ కోసం ప్రారంభించిన వాణిజ్య యుద్ధాలు చివరికి దేశాల ఆక్రమణలు, వలసలు, పలు ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అనేక ప్రాంతీయ కూటముల ఏర్పాటు ద్వారా మార్కెట్లను విస్తరించుకొనే, రక్షించుకొనే చర్యలకు పూనుకున్నారు. ఇప్పుడు సరికొత్త రక్షణాత్మక చర్యలకు పూనుకోవటమే తాజా వాణిజ్య యుద్ధ శంఖాల పూరింపు. ఇవి మార్కెట్ల విస్తరణ కాంక్షను, పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన తీవ్ర సమస్యలనూ వెల్లడిస్తోంది.

ట్రంప్‌ బఫూనా లేక వయస్సుతో వచ్చిన చిత్త చాంచల్యంతో ఇలా ప్రవర్తిస్తున్నాడా ? కొంత మందికి నిజంగా కలుగుతున్న సందేహాలివి. అమెరికా పీఠంపై ఒక విదూషకుడిని, ముది, మది తప్పిన ముసలివారిని కూర్చో పెట్టేందుకు అక్కడి కార్పొరేట్‌ శక్తులేమీ తెలివితక్కువవి కాదు. పెట్టుబడిదారీ ప్రపంచంలో తలెత్తే సంక్షోభాలను ఇతరుల మీదకు తోసి వేసేందుకు సామ,దాన, బేధోపాయాలు విఫలమైన తరువాత దండోపాయాన్ని ప్రయోగిస్తారు. దానిలో ఒక రంగం వాణిజ్య యుద్ధం. కమ్యూనిస్టు చైనా మీదే కాదు, పక్కనే వున్న తన అనుంగు దేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు అంతర్జాతీయ రంగంలో దుర్మార్గపు పనులు చేసేందుకు సై అంటే సై అని కలసి వచ్చే ఐరోపా ధనిక దేశాల మీద కూడా ట్రంప్‌ ఇప్పుడు బస్తీమే సవాలు అంటూ పలు రంగాలలో దాడులకు సిద్ధం అవుతున్నాడు. కొద్ది వారాల క్రితం చైనాతో వాణిజ్య యుద్ధం దాదాపు వచ్చినట్లే అనేంతగా వాతావరణం ఏర్పడినపుడు నాటకీయంగా పరిష్కారమైందని చెప్పారు. ఇప్పుడు తిరిగి మొదలైంది. ఈ రోజు మరణిస్తే రేపటికి రెండు అన్నట్లుగా అమెరికాను పక్కన పెడితే ఇంకా ఆరుగురం వున్నాం, జి6 బృందాన్ని ఏర్పాటు చేద్దాం అంటూ ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించటాన్ని చూస్తే వీటి పర్యవసానాలు అంత తీవ్రంగా వుంటాయా అంటే అవునని చెప్పలేము. ఎందుకంటే ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటంతో పాటు తమకు పోటీదారుగా తయారవుతున్న చైనాను వుమ్మడిగా తప్ప ఎదుర్కోలేమనే భావంతో వున్నాయి. అందువల్లనే పైకి బింకాలు పోయినా వాటి మధ్య రాజీకి అవకాశాలు వున్నాయి. గత మూడు దశాబ్దాల పరిణామాలను చూసినపుడు ధనిక దేశాల మధ్య విబేధాల గ్రాఫ్‌ వూర్ధ్వముఖంగా పయనిస్తోంది.

Image result for Is Donald Trump starting trade war cartoons

కెనడా, ఐరోపా యూనియన్‌, మెక్సికోల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకొనే వుక్కు వుత్పత్తులపై 25, అల్యూమినియంపై పదిశాతం పన్నులు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించాడు.ఇది అంతటితో ఆగకుండా కెనడా, జపాన్‌ ఆటోమొబైల్‌ రంగం మీద కూడా పన్నులు విధించే అవకాశం వుంది. జూలై నుంచి చైనా నుంచి వచ్చే దిగుమతులపై 50బిలియన్‌ డాలర్ల మేరకు పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. తాపీగా మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అన్నట్లుగా తాము కూడా అదే పని చేయకతప్పదని తనదైన శైలిలో చైనా ప్రకటించింది. ఈ వైఖరి చివరకు ప్రపంచ మాంద్యానికి దారి తీస్తుందా అన్న భయాలు తలెత్తుతున్నాయి. గతేడాది అమెరికా వాణిజ్య లోటు 566 బిలియన్‌ డాలర్లు,ఇది దాని జిడిపిలో 2.9శాతం. జి7 దేశాల మధ్య వాణిజ్య సుంకాలు చాలా తక్కువగా వున్నాయి. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై ఐరోపా యూనియన్‌ సగటున కేవలం మూడుశాతమే పన్ను విధిస్తోంది. మనదేదో ప్రపంచ పిగ్గీబ్యాంక్‌ అయినట్లు ప్రతివారూ దాన్నుంచి లబ్ది పొందుతున్నారు, ఇదింకేమాత్రం కుదరదని ట్రంప్‌ పదే పదే చెబుతున్నాడు. నిజానికి అమెరికాకు నష్టం అనేది తప్పుడు ప్రచారమే. అనేక రూపాలలో దానికి వచ్చే ఇతర ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటే అది మిగులులోనే వుంటుంది.

గుండెలు బాదుకుంటున్న అమెరికా వాణిజ్య లోటులో సగానికి పైగా (385బిలియన్‌ డాలర్లు) ఒక్క చైనాతోనే వుంది. అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలు కూడా వాణిజ్యలోటు విషయంలో చైనా పట్ల గుర్రుగా వున్నాయి. అదే సమయంలో వివిధ కారణాలతో అమెరికా మాదిరి చైనాతో యుద్ధానికి అవి సిద్దంగా లేవు. ఇదే సమయంలో తాత్కాలికంగా అయినా అమెరికాతో కలసి ఐక్యంగా దాడి చేసే స్ధితిలో కూడా లేవు. అమెరికాకు ఇప్పుడున్న అప్పును చూస్తే ప్రతివారికీ ఆందోళన కలుగుతోంది. మమ్మల్ని కాపాడుకోవటం మీకే శ్రేయస్కరం అన్నట్లుగా అమెరికా వైఖరి కనిపిస్తోంది. అనేక యుద్ధాలలో దెబ్బలు తిన్న అమెరికా ఒకవైపు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధాలతో పాటు రెండో వైపు వాణిజ్య యుద్ధాలకు తెరలేపుతోందని భావిస్తున్నారు. స్వేచ్చా వాణిజ్యం గురించి ఇంతకాలం చెప్పిన అమెరికా దానికి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతోంది. కెనడా, ఐరోపాయూనియన్‌, మెక్సికో వంటి తన మిత్రదేశాలతో పాటు రాజకీయంగా వ్యతిరేకించే చైనాతో యుద్ధానికి పూనుకుంది. సహజంగానే ఈ దేశాలు కూడా ప్రతి చర్యలకు పూనుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వర్గం తక్కువ వ్యయంతో ఎక్కడ వస్తువులు తయారైతే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ తన లాభాలను కాపాడుకుంటోంది. ఆ విధంగా చూసినపుడు ఆ దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా పన్నులు విధించటమంటే తన వినియోగదారులపై భారం మోపటం ఒకటైతే ఎగుమతి చేసే దేశంలో వుత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. అందువలన వుభయతారకంగా సమస్యను పరిష్కరించుకోవటం అందరికీ మేలు. కానీ ట్రంప్‌ అలా అనుకోవటం లేదు, తాను పన్నులు విధిస్తే ఇతర దేశాలు భయపడిపోయి తమ దగ్గర ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేస్తాయని, తద్వారా అమెరికన్‌ కార్పొరేట్ల లాభాలకు ముప్పు వుండదని భావిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయం, ద్రవ్యరంగం, సాఫ్ట్‌వేర్‌ రంగాలలో పెద్ద మొత్తంలో లాభాలు సంపాదిస్తోంది. అందుకనే వస్తూత్పత్తి రంగంలో వస్తున్న వడిదుడుకులను ఎదుర్కోగలుగుతోంది. చౌకగా తయారయ్యే దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుండటం, యాంత్రీకరణతో వస్తూత్పత్తి రంగంలో అమెరికన్లకు నానాటికీ పని లభ్యత తగ్గిపోతోంది. వేతనాలు తగ్గిపోతున్నాయి, అది కొనుగోలు శక్తి క్షీణతకు దారి తీస్తుంది. దాని వలన దేశీయంగా వస్తూత్పత్తి కూడా పడిపోతుంది. ఇది ఒక విష వలయం. ఇప్పటికిప్పుడు అమెరికా తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకొనే ధరలకు తయారు చేసి తన వినియోగదారులకు అందించగలదా? అంత సీను లేదు. అందుకే మిగతాదేశాలు కూడా కన్నుకు కన్ను పన్నుకు పన్ను సై అంటున్నాయి. ఇది మరింత ముదిరితే మిగతా దేశాలు తమ వస్తువులు,సేవలను కొనుగోలు చేయటం మానుకుంటే తమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అమెరికన్లలో వుంది. అమెరికా నుంచి వస్తున్న సేవలు, వస్తువులు ఆగిపోతే ఆయా దేశాలు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకుంటే నష్టపోయేది అమెరికాయే. లేదూ అదే వ్యాపారం ఇతర దేశాలకు పోయినా నష్టపోయేది అమెరికన్‌ కార్పొరేట్లే. ప్రతి దేశమూ కొన్నింటికి ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్ధితులలో అమెరికా కొండెక్కితే మిగతా దేశాలు కూడా అదే చేస్తాయి. అందుకే వాణిజ్య యుద్ధం తమకు నష్టదాయకమని అమెరికన్లు భావిస్తున్నారు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధానికి ఇప్పుడున్న లోటు కంటే భవిష్యత్‌లో ఎదురయ్యే పోటీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మేడిన్‌ 2025పేరుతో చైనా రోబోటిక్స్‌, ఏరోస్పేస్‌, పారిశ్రామిక యంత్రాలు, ఆటోమొబైల్‌ రంగాలలో వున్నత సాంకేతిక పరిజ్ఞాన వుత్పత్తుల తయారీ దిశగా ముందుకు పోతోంది. ఇప్పటి వరకు ఆ రంగంలో అగ్రగామిగా వున్న అమెరికాకు మరిన్ని సవాళ్లు ఎదురుకావటం అనివార్యం. అందుకే ముందుచూపుతో అదిరింపులు బెదిరింపులకు పూనుకుందనేది ఒక అభిప్రాయం.

అమెరికాలో వుపాధి తగ్గిపోవటానికి చైనా, ఇతర తక్కువ వ్యయమయ్యే దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటమే అనే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్‌ పాలకవర్గం ప్రయత్నిస్తోంది. ఇది పూర్తివాస్తవం కాదు. అమెరికాలో పెరిగిన యాంత్రీకరణ ఒక ప్రధాన కారణం అన్నది అనేక మంది చెబుతున్న నిజం. అదే విధంగా ఒక్కొక్క దేశం పట్ల ఒక్కో కారణం చెబుతోంది. చైనా అక్రమవాణిజ్య పద్దతులకు, సాంకేతికపరిజ్ఞాన చోరీకి పాల్పడుతున్నదంటూ ఆరోపిస్తుండగా కెనడా,మెక్సికో, ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి చేసుకొనే దిగుమతులు తమ రక్షణకు ముప్పు తెస్తున్నాయని అంటోంది. అమెరికాతో రెండవ పెద్ద వాణిజ్య సంబంధాలున్న కెనడా వుత్పత్తులను పన్నుల పెంపు నుంచి మినహాయిస్తామని చెప్పిన ట్రంప్‌ మాటతప్పాడు. గతేడాది రెండు దేశాల మధ్య వాణిజ్యంలో అమెరికాదే మిగులు. అమెరికా పాడి వుత్పత్తులపై 270శాతం పన్నులు విధిస్తోందంటూ కెనడాపై ట్రంప్‌ మండి పడ్డారు. కెనడాతో అమెరికా జరుపుతున్న 680 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంలో పాడి వుత్పత్తుల శాతం 0.1 మాత్రమే, 99శాతం వాణిజ్యంపై అసలు పన్నులే లేవు.కెనడా తన రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా గతేడాది అమెరికాతో మూడుబిలియన్ల లోటులోనే వుంది. పోనీ అమెరికా ఏమైనా వుదారంగా వుంటోందా అంటే లేదు. అక్కడి పొగాకు పరిశ్రమకు ఇతరుల నుంచి పోటీ లేకుండా చూసేందుకు దిగుమతులపై 350శాతం పన్నులు విధిస్తోంది.

ట్రంప్‌ చర్యకు ప్రతిగా చైనా ప్రారంభించిన ఎదురుదాడిలో భాగంగా 34బిలియన్‌ డాలర్ల మేరకు వ్యవసాయ వుత్పత్తులు, 16బిలియన్‌ డాలర్ల మేరకు బగ్గు, చమురు వంటి వాటిపై దిగుమతి పన్నులు పెంచింది. తరువాత మరికొన్నింటిని పెంచుతామని ప్రకటించింది. గత నెలలో సయోధ్య కుదిరిన సమయంలో తాము అమెరికా వ్యవసాయ వుత్పత్తుల కొనుగోలు పెంచుతామని చైనా పేర్కొన్నది ఇప్పుడు వాటిమీదే ఎక్కువ పన్నులు విధించింది.తొలి దఫా ప్రకటించిన 50బిలియన్‌ డాలర్ల పన్నులు గాకుండా తదుపరి మరో వంద బిలియన్ల మేరకు విధిస్తామని ట్రంప్‌ బెదిరించాడు.

Image result for Is Donald Trump starting trade war cartoons

ఆంబోతుల మధ్య లేగదూడలు నలిగినట్లు మన దేశ పరిస్ధితి వుంది. ఒకవైపు ఈ యుద్ధంతో మనం లాభపడవచ్చని కొందరు సంతోషపడుతున్నారు. నరేంద్రమోడీ ఏ దేశం వెళ్లినా ఆ నాయకులతో ఎంతో సాన్నిహిత్యం వున్నట్లు వెల్లడించేందుకు ఆలింగనాలు చేసుకుంటున్నారు. ట్రంప్‌తో కూడా అలాగే చేశారు. వుక్కు వుత్పత్తులపై 25, అల్యూమినియంపై 10శాతం పన్నుల నుంచి మన దేశాన్ని మినహాయించాలని వేడుకున్నా ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా తిరస్కరించింది. మన మంత్రి సురేష్‌ ప్రభు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఇప్పటి వరకు అమెరికాకు 30వస్తువుల విషయంలో ఇస్తున్న 24 కోట్ల డాలర్ల రాయితీలను వుపసంహరించనున్నట్లు ప్రకటించారు. స్వదేశంలో విమర్శలపాలైన మోడీ ఎంతగా విదేశాల్లో పర్యటించినా మన ఎగుమతులు నానాటికీ తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు.ఆర్‌సియిపిలోని పదహారింటిలో ఏడు దేశాలతో మన వాణిజ్య లోటు పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. 2017-18లో చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో మన వాణిజ్యలోటు 97.71బిలియన్‌ డాలర్లు, అంతకు ఏడాది 77.58 బిలియన్‌ డాలర్లు మాత్రమే వుంది. మన దేశంలో వుత్పాదకశక్తి తక్కువగా వున్నందున ఇతర దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా బలవంతులకు తప్ప మనకు పయోజనం వుండదు. నాలుగేండ్లుగా మోడీ మేకిన్‌ ఇండియా ప్రభుత్వ ప్రకటనలకే పరిమితం తప్ప అడుగు ముందుకు సాగలేదు. అమెరికా-చైనా-ఐరోపా యూనియన్‌ మధ్య ఒకవేళ నిజంగా వాణిజ్య యుద్ధమే జరిగితే మన వుత్పత్తులకు జరిగే ప్రయోజనం ఎంతో తెలియదు గానీ చైనా నుంచి మరిన్ని దిగుమతులు పెరగటం ఖాయం. అందువలన ధనిక దేశాల మధ్య తలెత్తిన వాణిజ్య యుద్ధ పరిణామ పర్యవసానాలు, పరిష్కారాలు ఎలా వుంటాయన్నదే ఆసక్తి కరం.