Tags
direct and indirect sanctions, Donald trump, Donald trump trade war, NATO, TRADE WAR, us encircling india, US SANCTIONS, US-CHINA TRADE WAR
ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే, ప్రధాని నరేంద్రమోడీ
ఎం కోటేశ్వరరావు
జూలై ఆరు, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు ! చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూరించిన వాణిజ్య సమర భేరి దాడులకు నాంది పలికే గడువు అది. సామరస్యపూర్వకంగా పరిష్కారం కానట్లయితే ఆ దినం నుంచి చైనా వస్తువులపై ప్రకటించిన పన్ను పెంపుదల అమలులోకి వస్తుంది. కొద్ది రోజుల క్రితం వరకు నిజంగా వాణిజ్య యుద్ధం జరుగుతుందా? సర్దుబాటు చేసుకుంటారా అన్న పద్దతిలో సాగిన విశ్లేషణలు ఇప్పుడు నిజంగానే జరుగుతుందని, జరిగితే ఎంత విలువ వుంటుంది? ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మీద చూపే ప్రభావాలు ఎలా వుంటాయనే వైపు మళ్లాయి. ఒక లక్ష బిలియన్ డాలర్ల వరకు వుంటుందని ఒక అంచనా. వాణిజ్య యుద్ధం వ్యాపారలావాదేవీలకు మాత్రమే పరిమితం కాదు. అనేక రంగాలను అది ప్రభావితం చేస్తుంది.
గత కొద్ది రోజులుగా ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, చర్యలు కేవలం వాణిజ్య యుద్ధానికే పరిమితం కాలేదు. అవి ప్రపంచ దేశాల సమీకరణలను వేగవంతం చేస్తున్నాయా ? వాటి స్వభావమేమిటి ? పర్యవసానాలు ఎలా వుంటాయన్నది ప్రపంచమంతా వుగ్గపట్టుకొని ఆసక్తితో చూస్తున్నది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను మా మిత్ర దేశాలు కూడా పాటించాల్సిందే, లేకుంటే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం, ఎవరికీ మినహాయింపులు లేవు అని ట్రంప్ చేసిన ప్రకటనతో నరేంద్రమోడీ సర్కార్ ఏం చేయాలో తోచక కాళ్లు తొక్కుకుంటున్నది. చిన్నది కావచ్చుగానీ ఐరోపా యూనియన్ కూడా చైనా మాదిరి చెడ్డదే. చూడు మక్రాన్ మనిద్దరికీ చైనా సమస్య వుంది కనుక కలసి పని చేద్దాం, చైనా కంటే ఐరోపా యూనియన్ అధ్వాన్నంగా వుంది, నాఫ్టా ఎంత చెడ్డదో నాటో కూడా అలాంటిదే, అది అమెరికాకు భరించరాని ప్రియంగా వుంది. ఇవన్నీ ట్రంప్ బహిరంగంగా చేసినవీ, అంతర్గత సంభాషణల్లో వెల్లడించిన అభిప్రాయాలుగా మీడియాలో తిరుగుతున్నవి. ప్రపంచ దేశాల మీద అమెరికా ఒక్క వాణిజ్యయుద్ధానికే పరిమితం కాలేదు, ఇతర రంగాలలో కూడా తన పెత్తనాన్ని, భారాలను రుద్దేందుకు పూనుకుంది అన్నది స్పష్టం. నాటో కూటమికి అయ్యే ఖర్చును సభ్య దేశాలన్నీ భరిస్తాయో లేదో చెప్పాలంటూ ఐరోపా దేశాలకు జూన్ నెలలో ట్రంప్ లేఖలు రాశాడు.
కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మన విదేశాంగ విధానాన్ని నిర్దేశించేది మన ప్రభుత్వమా లేక డోనాల్డ్ ట్రంపా అన్న అనుమానం తలెత్తక మానదు. నరేంద్రమోడీ సర్కార్ పులిలా గాండ్రించి చివరికి పిల్లిలా మ్యావ్ మ్యావ్ మంటూ తోకముడుస్తోంది. ఇరాన్‌తో కుదిరిన అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. ఆంక్షలను అమలు జరుపుతామని ప్రకటించింది. ఆ సమయంలో మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ ఏకపక్షంగా అమెరికా ప్రకటించిన ఆంక్షలను భారత్ పరిగణనలోకి తీసుకోదని ఐక్యరాజ్య సమితి వాటినే గుర్తిస్తుందని ప్రకటించారు. అలాంటిది నెల రోజులు కూడా గడవక ముందే నరేంద్రమోడీ సర్కార్ వైఖరిలో మార్పు వచ్చింది, అదీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారీ నికీహాలే ఢిల్లీ పర్యటన మరుసటి రోజే కావటం గమనించాల్సిన అంశం. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీని అమలులోకి వస్తాయి. అప్పటికి ఇరాన్ నుంచి గణనీయంగా దిగుమతులను తగ్గించుకోవటం లేదా పూర్తిగా మానుకోవాలని చమురుశుద్ధి కర్మాగారాలకు మన చమురు మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అదే జరిగితే మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయన్నది చమురు రంగ విశ్లేషకుల అభిప్రాయం.ఇరాన్‌తో చమురులావాదేవీలకు స్వస్తి పలుకుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. ఇరాన్ చమురుతో ప్రయాణించే నౌకలు లేదా దానిని శుద్ధి చేసే కర్మాగారాలకు బీమా వర్తింప చేయబోమని ఆ కంపెనీలు ప్రకటించేఆలోచనలో వున్నాయి. ఇరాన్ మనకు కొన్ని రాయితీలు ఇస్తున్నది. వాటిని వదులుకొని ఇతర దేశాల దగ్గర కొనటం అంటే అమెరికాను సంతృప్తిపరచటమే కాదు, అందుకోసం మన జనం మీద భారాలు మోపేందుకు మోడీ సర్కార్ పూనుకుంది. ఇరాన్‌కు రూపాయిల చెల్లింపులతో మోడీ పెద్ద విజయం సాధించినట్లు ఆయన భక్తులు ప్రచారం చేశారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే రూపాయల బదులు ఇతర దేశాలకు చెల్లించేందుకు మనం డాలర్లను మరింతగా సమకూర్చుకోవటం అంటే మన కరెన్సీ విలువ మరింత పతనం కావటమే. గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన దేశానికి ఆంక్షలను మినహాయించాడు. అలాంటివేమీ కుదరవని ట్రంప్ ప్రకటించాడు. మన దేశాన్ని తన ఆదేశాలను పాటించే పాలేరు అనుకుంటున్నాడా ? జవాబుదారీతనంతో వ్యవహరించే ఏ దేశమైనా ఇతరుల బెదిరింపులను అనుమతించని బాధ్యతతో వ్యవహరించాల్సి వుంటుంది. అమెరికా వత్తిడికి మోడీ సర్కార్ తీసుకున్న చర్యతో పాటు దీర్ఘకాలంగా ఇరాన్‌తో వున్న సంబంధాలు ప్రమాదంలో పడటమేగాక అంతర్జాతీయంగా మన పరువు ఎక్కడ కలుస్తుందో తెలియదు. మన బలహీన దౌత్యానికి ఇది సూచిక. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో సగాన్ని చైనా, భారత్, టర్కీ దిగుమతి చేసుకుంటున్నాయి.అమెరికా ఏకపక్ష ఆంక్షలను తాము ఆమోదించేది లేదని మిగిలిన రెండు దేశాలు ప్రకటించాయి.
అనేక దేశాల మధ్య తంపులు పెట్టి, రెచ్చగొట్టి అటూ ఇటూ ఆయుధాలు అమ్ముకొని లబ్దిపొందే ఎత్తుగడను అమెరికా ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. మన దేశం-పాకిస్ధాన్ విషయంలో అదే చేసి పాకిస్ధాన్‌కు పెద్ద ఆయుధ అమ్మకందారుగా మారింది. సోవియట్ యూనియన్ కూల్చివేత తరువాత మన పాలకులు అమెరికాకు దగ్గర కావటంతో ఇప్పుడు పాక్ కంటే పెద్ద బడ్జెట్ వున్న మనం ఆత్మీయులుగా కనపడటం గురించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల తరబడి సోవియట్ ఆయుధాల మీద ఆధారపడిన మనం వెనువెంటనే అమెరికా ఆయుధాలతో మన మిలిటరీని సాయుధం చేసే అవకాశం లేదు కనుక ఇప్పటికీ ఆ లావాదేవీలు కొనసాగుతున్నాయి. రష్యా నుంచి ఎస్-400 క్షిపణులు కొనుగోలు చేసినట్లయితే భారత్ మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించింది. మన వాయుసేన దాదాపు ఐదింటిని కొనుగోలు చేసే ఒప్పందం ఖరారు దశలో వుంది. ఈనెల ఆరున భారత్-అమెరికా మధ్య రక్షణ, భద్రతా సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు విదేశాంగ, రక్షణశాఖల మంత్రుల తొలి సమావేశం జరగాల్సి వుండగా కొద్ది రోజుల ముందు అనివార్య కారణాల వలన దానిని రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పోంపియో ఏకపక్షంగా మన మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలియ చేశారు. ఇరాన్‌తో సంబంధాల గురించి భారత్ పునరాలోచించుకోవాలని జూన్ 27న ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే మన ప్రధాని నరేంద్రమోడీని కలసి కోరిన సమయంలోనే ఈ సమావేశ రద్దును తెలిపారు.
దీనికి ముందుగా జూన్ 19న అమెరికా అంతర్గతంగా తన చట్టాలకు ఆమోదించిన సవరణల ప్రకారం రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేస్తే గతంలో వున్న అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు అవుతుంది. మన అవసరాలకు అమెరికాలో తయారైన పేట్రియాట్ పిఏసి-3 క్షిపణి 70కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని చేరుతుంది. అదే రష్యా ఎస్ 400 క్షిపణి నాలుగు వందల కిలోమీటర్ల లక్ష్యం కలిగినదిగా వుండటంలో నలభైవేల కోట్ల రూపాయలతో ఐదు క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణశాఖ నిర్ణయించింది. దీన్ని దెబ్బతీసేందుకు ఆంక్షలు విధించేందుకు అమెరికా బెదిరింపులకు పూనుకోవటంతో పాటు సమావేశాన్ని రద్దు చేసింది. ఇవేగాదు రష్యా నుంచి మరొక 12బిలియన్ డాలర్ల విలువగల ఇతర ఆయుధాల కొనుగోలుపై కూడా ఆంక్షలు విధించే అవకాశం వుండటంతో అమెరికా ఇలాంటి బెదిరింపులకు పూనుకున్నట్లుగా భావిస్తున్నారు.
అమెరికాకే అగ్రతాంబూలం అన్న పద్దతిలో వ్యవహరిస్తున్న ట్రంప్ వైఖరి నుంచి తమను కాచుకొనేందుకు గాను ఐక్యంగా వ్యవహరించాలని, ప్రపంచ వ్యవస్ధను నిలబెట్టాలని చైనా, ఐరోపా యూనియన్ నిర్ణయించాయి. ప్రపంచ స్వేచ్చా వాణిజ్య వ్యవస్ధ ఏర్పాటుకు తాము సహకరించామని దానిని కాపాడుకోవాల్సిన అవసరం వుందని ఐరోపా యూనియన్ నేతలు చెబుతున్నారు. సోవియట్ యూనియన్ ప్రారంభంలో రష్యన్ కమ్యూనిస్టులకు వాల్‌స్ట్రీట్ పెట్టుబడిదారులు రహస్యంగా సాయం చేశారని, 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా ప్ర వేశానికి అమెరికా సెనేట్ అత్యధిక మెజారిటీతో ఆమోదం తెలిపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా తన వైఖరి మార్చుకుంటే తామెందుకు అనుసరించాలని పరోక్షంగా పశ్నిస్తున్నారు. అదే కమ్యూనిస్టు చైనాతో కలసి తమ ప్రయోజనాలను రక్షించుకోవాలని వుద్బోధిస్తున్నారు. ఈ నెలలో బీజింగ్‌లో చైనా-ఐరోపా యూనియన్ సమావేశంలో ఒక ప్రకటన వెలువడుతుందని వార్తలు వచ్చాయి.
ఒకవైపు ఐరోపా యూనియన్ దేశాలపై వాణిజ్య ఆంక్షలను ప్రకటించిన ట్రంప్ మరోవైపు నాటో కూటమి ఖర్చులో సింహభాగాన్ని మీరు భరిస్తారో లేదో చెప్పాలని వత్తిడి తెస్తున్నాడు.త్వరలో బ్రసెల్స్ సమావేశంలోగా ఏదో ఒకటి తేల్చాలంటున్నాడు. ఏప్రిల్‌లో మీ పర్యటన సందర్బంగా మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని దేశాలు వాగ్దానం చేసిన మాదిరి నిధులు కేటాయించటం లేదని జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నాడు. ఐరోపా రక్షణకు మేము పెద్ద మొత్తంలో వనరులను కేటాయించటం ఇంకేమాత్రం సాధ్యం కాదని, మా దేశంలో అసంతృప్తి పెరుగుతున్నదని కూడా పేర్కొన్నాడు. నాలుగు సంవత్సరాల నాడు వేల్స్ సమావేశంలో ప్రతి దేశం జిడిపిలో రెండుశాతం మొత్తాన్ని దేశభద్రతకు ఖర్చు చేయాలని అంగీకరించిన మేరకు అమలు జరపటం లేదన్నది అమెరికా ఫిర్యాదు. మిగతా దేశాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాయని అలాంటిది మీరు కూడా చేయాల్సిన మేరకు ఖర్చు చేయటం లేదని జర్మనీని కూడా విమర్శించాడు. విదేశాలలో అమెరికన్ సైనికులు ప్రాణాలు అర్పించటం లేదా తీవ్రంగా గాయపడే త్యాగాలు చేస్తున్నపుూ వుమ్మడి రక్షణ భారాన్ని కొన్ని దేశాలు ఎందుకు పంచుకోవటం లేదు అని అమెరికా పౌరులు అడుగుతుంటే సమర్ధించుకోవటం ఇంకేమాత్రం సాధ్యం కావటం లేదని కూడా ట్రంప్ పేర్కొన్నాడు. దక్షిణ కొరియాలో సైన్యం గురించి కూడా ఇదే వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.
ట్రంప్ లేఖలపై ఐరోపాలో విమర్శలు వచ్చాయి.’ నాటో అంటే ఒక క్లబ్ అని, దానికి మీరు బకాయి చెల్లించకపోతే పర్యవసానాలు అనుభవిస్తారు లేదా సోమరులైన ఈ ఐరోపా వారందరూ సెలవులు గడపటానికి వచ్చి కూర్చున్నారని, వారందరినీ అమెరికా రక్షిస్తోందనే భావనలోనే ఇంకా ట్రంప్ వున్నట్లుగా కనిపిస్తోంది’ అని అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి డెరెక్ చోలెట్ వ్యాఖ్యానించారు. ‘ వాణిజ్యం మీద దూకుడుగా వున్న ట్రంప్ వ్యాఖ్యలను ఎలా అమలు చేస్తారు, భద్రతా విషయాలలో కూడా అలాగే చేస్తారా అని ఐరోపావారు చూస్తున్నారు అని కూడా అన్నారు.
అమెరికా మొరటుగా వాణిజ్య యుద్ధానికి పూనుకుంటే అనేక దేశాలతో ఇదే విధంగా ఇతర రంగాలలో కూడా తన పెత్తందారీ, బలప్రయోగానికి పాల్పడే అవకాశాలున్నాయి. అయితే వాణిజ్య యుద్ధం జరిగితే తమకు సంభవించే లాభనష్టాల గురించి అమెరికాలో తర్జన భర్జన జరుగుతోంది. లాభం అనుకుంటే ట్రంప్ ముందుకు పోతాడు. వాణిజ్య యుద్ధంలో గెలిచే అవకా శాలు లేవని బలంగా వినిపిస్తున్న పూర్వరంగంలో ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గే అవకాశాలూ లేకపోలేదు. సంక్షోభం, సమస్యలు ముదిరితే పర్యవసానాలను అంచనా వేయటం కష్టం.