Tags
AMLO, Andres Manuel Lopez Obrad, Lopez Obrador, Mexican Lopez Obrador, MORENA, The 2018 Mexican election
ఎం కోటేశ్వరరావు
ఆదివారం నాడు మెక్సికోలో జరిగిన ఎన్నికలలో వామపక్షవాది ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రాడార్ (ఆమ్లో) ఘన విజయం సాధించినట్లు మీడియా ప్రకటించింది. తొంభై మూడు శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి అధ్యక్ష ఎన్నికలలో లోపెజ్‌కు 53శాతం, సమీప ప్రత్యర్ధులకు వరుసగా 22.5,16.4,5.1,0.1 ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదుగురు అభ్యర్ధులలో ముగ్గురు మూడు కూటముల తరఫున పోటీ చేయగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు. ఓట్ల లెక్కింపు పూర్తయితే దాదాపు ఇదే శాతాలు ఖరారు కావచ్చు లేదా స్వల్పతేడాలుండవచ్చు. పార్లమెంట్ వుభయ సభలలో కూడా లోపెజ్ నాయకత్వంలోని ‘కలసి కట్టుగా మేము చరిత్రను సృష్టిస్తాం’ అనే పేరుతో ఏర్పడిన కూటమి ఐదువందల స్ధానాలున్న ఛాంబర్ డిప్యూటీస్(మన లోక్‌సభ మాదిరి)లో 312, 128 సీట్లున్న సెనెట్(రాజ్యసభ మాదిరి)లో 69 స్ధానాలతో సంపూర్ణమెజారిటీ సాధించవచ్చునని విశ్లేషణలు వెలువడ్డాయి. లోపెజ్‌ను ‘మెక్సికో బెర్నీశాండర్స్’ అని కొందరు వర్ణించారు, అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో ‘సంస్కరణవాది’ అని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికలు, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికలు అన్నీ ఒకేసారి జరిగాయి. అన్నింటా ఈ కూటమి ఘన విజయం సాధించింది. అధ్యక్షుడు ఐదు సంవత్సరాల పది నెలలు, పార్లమెంటు దిగువ సభ మూడు సంవత్సరాలు, ఎగువ సభ ఆరు సంవత్సరాల పాటు వుంటుంది.
ఈ కూటమిలో జాతీయ పునరుజ్జీవన పార్టీ,మావోయిస్టులతో కూడిన వర్కర్స్ పార్టీ, క్రైస్తవ మత మితవాదులతో నిండిన సోషల్ ఎన్‌కౌంటర్ పార్టీ వున్నాయి. పార్లమెంటులో వీటికి వరుసగా 193,54,58 వస్తాయని ఓటింగ్ సరళి తెలిపింది. మున్సిపల్ ఎన్నికలలో 80శాతంపైగా స్ధానాలు తెచ్చుకుంది. జాతీయ పునరుజ్జీవన పార్టీ నేత లోపెజ్ మన దేశంలో సోషలిస్టులుగా జీవితం ప్రారంభించి వివిధ పార్టీలు మారిన జార్జిఫెర్నాండెజ్, ములాయం సింగ్ యాదవ్ వంటి పాలకవర్గాలకు చెందిన వారితో పోల్చదగిన రాజకీయ నేపధ్యం వుంది. మెక్సికోలో 1929 నుంచి 2000 వరకు ఎలాంటి విరామం లేకుండా అధికారంలో వున్న పిఆర్‌ఐ పార్టీ కార్యకర్తగా 1976లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ పార్టీపోకడలు నచ్చక దాన్నుంచి విడివడిన వారు 1986లో డెమోక్రటిక్ రివల్యూషన్ పార్టీ(పిఆర్‌డి)గా ఏర్పడ్డారు. లోపెజ్ 1989లో దానిలో చేరి 1994లో ఒక రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేశారు.2000 సంవత్సరంలో మెక్సికో నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 2005లో మేయర్ పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ తరఫున పిఆర్‌డి, పౌర వుద్యమం, లేబర్ పార్టీ కూటమి తరఫున 2006 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేశారు.స్వల్పతేడాతో ఓడిపోయారు. పిఆర్‌ఐ పార్టీ అక్రమాలకు పాల్పడిందని, అందువలన తాను ఓటమిని అంగీకరించనంటూ కొన్ని నెలలపాటు ఆందోళన నిర్వహించారు. తరువాత 2012 ఎన్నికలలో కూడా అదే కూటమి తరఫున పోటీచేసి రెండవ స్ధానం తెచ్చుకున్నారు. ఆ సందర్భంగా తనకు మద్దతు కూడగట్టేందుకు జాతీయ పునరుజ్జీవన వుద్యమం(మొరెనా) పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. ఓటమి తరువాత పిఆర్‌డి నుంచి విడిపోయి, అంతకు ముందు ఏర్పాటు చేసిన సంస్ధను 2014లో రాజకీయ పార్టీగా నమోదు చేశారు. ఇప్పుడు దాని నాయకత్వాన ఏర్పడిన కూటమి తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు.
విద్యార్ధులు, వృద్ధులకు ఆర్ధిక సాయాన్ని పెంచాలని, కొంత మంది మాదక ద్రవ్య నేరగాండ్లకు క్షమాభిక్ష ప్రసాదించాలని, ప్రభుత్వ కాలేజీలలో అందరికీ ప్రవేశం కల్పించాలని, నూతన అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేయాలని, ఇంధన సంస్కరణలు చేపట్టాలని, ప్ర భుత్వ రంగ చమురు సంస్ధ గుత్తాధిపత్యాన్ని తొలగించాలని, వ్యవసాయానికి వుద్దీపన కలిగించాలని, ఎన్నికలు ముగిసే వారకు నాఫ్టా గురించి చర్చలు నిలిపివేయాలని, కొత్తగా చమురుశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయటం, సాంఘిక సంక్షేమానికి ఖర్చు పెంచటం, ప్రజాప్రతినిధుల వేతనాల తగ్గింపు లేదా పన్నుల పెంపుదల, అధికారాల వికేంద్రీకరణ, రాష్ట్రాలకు బదలాయింపు వంటి అంశాలను లోపెజ్ ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు ప్రచారం, వాగ్దానాలు చేశారు.
ఈ ఎన్నికలలో మొరెనా, పిఆర్‌డి,పిటి, సిటిజన్స్ వుద్యమం(ఎంసి) కలసి పోటీ చేయటం గురించి ప్రతిపాదనలు వచ్చాయి. గతేడాది మెక్సికో రాష్ట్ర ఎన్నికల సమయంలో తలెత్తిన విబేధాల కారణంగా ఆ కూటమిని లోపెజ్ వ్యతిరేకించారు. తాము ఎన్నికలలో కలసి పోటీ చేసే అవకాశం వుందని గతేడాది చివరిలో క్రైస్తవ మతవాద సోషల్ ఎన్‌కౌంటర్ పార్టీ(పిఇఎస్), మొరేనా ప్రకటించాయి. చివరకు ఈ రెండు పార్టీలతో పాటు మావోయిస్టులతో కూడిన వర్కర్స్ పార్టీ కలసి ఐక్యంగా మేము చరిత్రను సృష్టిస్తాం అనే పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. వర్కర్స్, పిఇఎస్ పార్టీలు దిగువ సభలో 75, ఎగువ సభలో 16స్ధానాల చొప్పున పోటీ చేసేందుకు మిగిలిన వాటిలో మొరేనా బరిలో నిలిచేందుకు ఒప్పందం కుదిరింది. పిఇఎస్‌తో కూటమి కట్టడంపై విమర్శలు వచ్చాయి.
వాయిస్ ఆఫ్ అమెరికా ఎన్నికలకు ముందు చేసిన విశ్లేషణ సారాంశం ఇలా వుంది.ట్రంప్‌కు వ్యతిరేకంగా ధృడ వైఖరి అనుసరించాలనే ప్రజాకర్షక వామపక్ష వాది అధ్యక్ష ఎన్నికల రంగంలో ముందున్నాడు. ఆయన విజయం సాధిస్తే మెక్సికో త్వరలో ఒక వామపక్ష, ప్రజాకర్షక, జాతీయవాది అధికారంలో వుంటారు. విజయం తధ్యమని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. ప్రస్తుతం అధికారంలో వున్న పిఆర్‌ఐ అధ్యక్షుడు అవినీతి పట్ల మెతక వైఖరిని తీసుకున్నకారణంగా ఓటర్లు పెను మార్పులకు సిద్ధంగా వున్నారు. మెక్సికోలో ఇవి అతి పెద్ద ఎన్నికలు. అన్ని స్ధాయిలలో 3,400 మందిని ఎన్నుకుంటారు.భవిష్యత్‌లో పెద్ద మార్పులు తీసుకు వస్తానని లోపెజ్ వాగ్దానం చేసినందున సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతున్నది.మెక్సికో గురించి మీరు(అమెరికన్లు) తెలుసు కోవాల్సిందేమంటే అతను ఒక జాతీయ వాద వామపక్ష అభ్యర్ధి.ఏమైనా సరే సంస్కరణలు కావాలనే ధోరణిలో ఓటర్లు వున్నందున ముగ్గురు ప్రత్యర్ధుల కంటే ఎంతో ముందంజలో వున్నారు. అతను ఇంతకు ముందు రెండుసార్లు పోటీ చేసినప్పటి కంటే ఓటర్లు ఇప్పుడు ఓటర్లు ప్రభుత్వంతో విసిగిపోయి వున్నారు. మొత్తం మీద ప్రజాస్వామ్యం మీదే ఆశాభంగం కనిపిస్తున్నదని కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పాబ్లా పికాటో అన్నారు.అసమానతలు, అవినీతి మీద పోరు సలుపుతానని లోపెజ్ వాగ్దానం చేశాడు. విప్లవాత్మక చర్యలని నేనంటున్నానంటే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవినీతి, అన్యాయాల వేళ్లను పెకలిస్తాను అని ఆయన ఒక సభలో చెప్పాడు.నలుగురు అభ్యర్ధులు ఒక విషయంలో ఒకే విధంగా వున్నారు. వారు నిజంగా, నిజంగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇష్టపడటం లేదు. ఆర్ధిక ప్రగతికి అమెరికాతో కలసి పని చేస్తూనే ట్రంప్ జగడాల మారి విధానాల పట్ట ధృడ వైఖరి తీసుకుంటామని వాగ్దానం చేశారు. వుత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా)పై సమీక్ష జరపాలని ట్రంప్ చెప్పారు.లోపెజ్ వైఖరి ఇప్పుడు అనుకూలంగానే వున్నప్పటికీ అతని జాతీయవాదభావాలు భవిష్యత్‌లో కీడును సూచిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే బలమైన అధ్య క్షుడు కావాలని మెక్సికో ఓటర్లు కోరుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాల గురించి న్యూయార్క్‌టైమ్స్ పత్రిక ఇలా వ్యాఖ్యానించింది.’ దశాబ్దాల కాలంలో తొలిసారిగా లోపెజ్ ఒబ్రడోర్ విజయం లాటిన్ అమెరికాలోని రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ ఆధికార కేంద్రంలో ఒక వామపక్ష వాదిని కూర్చోబెట్టింది. దేశంలోని వున్నత వర్గ భీతి, కోట్లాది మంది మెక్సికన్ల ఆశాభావం కారణంగా ఇది జరిగింది. గత పాతిక సంవత్సరాలుగా మధ్యేవాద హద్దులలో నడక మరియు ప్రపంచీకరణ అమలు తమకేమీ ఒరగబెట్టలేదనే భావానికి గురైన మెక్సికన్లు దేశంలోని యధాతధ స్ధితిని స్పష్టంగా తిరస్కరిస్తున్నారని ఫలితం సూచిస్తున్నది.’ ఆర్ధిక విధానాలు దేశంలో అసమానతలను తీవ్రంగా పెంచాయి.శాంతి భద్రతలు దిగజారాయి. ఈ ఎన్నికలు మెక్సికో చరిత్రలో అత్యంత హింసాత్మకమైనవిగా మారాయి. నలభై ఎనిమిది మంది అభ్యర్ధులతో సహా 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక రోజే ముగ్గురు మహిళా అభ్యర్ధులను కాల్చి చంపారు.మున్సిపల్ స్ధాయిలో నేరస్ధ గుంపులు రెచ్చిపోయాయి.బెదిరింపుల కారణంగా ఆరువందల మంది పోటీ నుంచి వెనక్కు తగ్గారు. వీటికి తోడు తమ దేశంలో ప్రవేశించిన మెక్సికన్ల గురించి యూదుల గురించి హిట్లర్, నాజీల మాదిరి డోనాల్డ్ ట్రంప్, అమెరికన్లు చులకనగా మాట్లాడటం, వాణిజ్య యుద్ధం ప్రకటించటం, లోపెజ్ ట్రంప్ వ్యతిరేకి అనే భావం బలంగా వ్యాపించటం కూడా ఈ ఎన్నికలలో బాగా పని చేసినట్లు కనిపిస్తోంది. అమెరికా మీద ఆధారపడకుండా మెక్సికో ఆర్ధిక స్వాతంత్య్ర సాధనకు తద్వారా వుపాధి కల్పనకు కృషి చేస్తాననే జాతీయవాద భావాన్ని కూడా లోపెజ్ ప్రచారం చేశారు. ఒక ఏడాదిలోపే తనను గద్దెదించటం ఎలా అనే కర్తవ్యాన్ని అమెరికా గూఢచార సంస్ధలకు లక్ష్య నిర్దేశం చేస్తారని లోపెజ్ ఎన్నికలు ముగిసిన వెంటనే పేర్కొన్నారు.మెక్సికో నగర మేయర్‌గా లోపెజ్ పని చేసిన కాలంలో వృద్దాప్య పెన్షన్లు పెంచటం, రోడ్ల విస్తరణతో రద్దీ తగ్గించటం, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య పద్దతిలో పాతనగర అభివృద్ధి వంటి చర్యల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనటం అమెరికాలో సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ను గుర్తుకు తెచ్చిందని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానించారు. లాటిన్ అమెరికాలో వెనుక పట్టు పట్టిన గులాబి అలలను ఆమ్లో విజయం పునరుద్ధరిస్తుందని గార్డియన్ పత్రిక వ్యాఖ్యానించింది. బ్రెజిల్ వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు గ్లెసిస్ హాఫ్‌మన్ ఈ ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ లాటిన్ అమెరికాలో పురోగామి గాలుల పునరాగమనానికి ఇది చిహ్నమని పేర్కొన్నారు. ఇది ఒక్క మెక్సికో విజయం మాత్రమే కాదు మొత్తం లాటిన్ అమెరికాదని బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ వ్యాఖ్యానించారు. మొత్తం ఈ ప్రాంత ఆశలకు ఆమ్లో ప్రతినిధి అని అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా కిర్చినర్ పేర్కొన్నారు.
అమెరికాతో సంబంధాల కారణంగా దెబ్బతిని ప్రధాన పార్టీలకు దూరమైన చిన్న తరహా వాణిజ్యవేత్తలు, ఒక తరగతి మేథావులు, కొందరు బడా వాణిజ్యవేత్తల మద్దతును కూడగట్టటం కూడా లోపెజ్ విజయానికి దోహద పడింది. దేశ జనాభాలో 46శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన వుండటం, అనేక ప్రాంతాలను మాదకద్రవ్యమాఫియా ముఠాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవటం, వాటికి అధికారగణం, పాలక పిఆర్‌ఐ, మితవాద పాన్ పార్టీల మద్దతు కారణంగా గత పది సంవత్సరాలలో మాదక ద్రవ్య మాఫియా చేతుల్లో రెండులక్షల మంది హతులు కావటం మరో 30వేల మంది అదృశ్యమయ్యారు.2014లో 43 మంది విద్యా ర్ధుల అదృశ్యం, హత్యకు ఎవరు కారకులో ఇప్పటికీ అధికారికంగా నిర్ధారించలేదు. స్కాలర్‌షిప్పులు పొందే విద్యార్ధులు కావాలి తప్ప కాంట్రాక్టు హంతకులు మనకు వద్దని ఇచ్చిన లోపెజ్ నినాదం బహుళ ఆదరణ పొందింది.
మెక్సికో ఎన్నికలలో ఎవరు గెలిచినప్పటికీ నష్టపోయేది కార్మికులే అని ఎన్నికలకు ముందే మెక్సికో కమ్యూ నిస్టుపార్టీ వ్యాఖ్యానించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధ పరిధిలో బూర్జువా పార్టీల మధ్య అధికార కుమ్ములాటలు తప్ప ఆ వ్యవస్ధ కొనసాగింపునకే లోపెజ్ నాయకత్వంలోని సోషల్ డెమోక్రటిక్ మొరేనా, మావోయిస్టులు ఏర్పాటు చేసిన వర్కర్స్ పార్టీకూడా తోడ్పడుతున్నాయని పేర్కొన్నది. ప్రగతి వాదులమని చెప్పుకొనే పిఆర్‌డి, మొరేనా, పిటి పార్టీలు మితవాదులతో కలవటానికి సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నిస్తూ అవి నిజమైన వామపక్షాలు కాదని స్పష్టం చేసింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న సంక్షోభ పరిష్కారం గురించి కొన్ని తేడాలు వుండవచ్చు తప్ప అవి ముందుకు తెచ్చే నయా వుదారవాదం లేదా నయా కీనీసియనిజం(పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర సంక్షోభం లేదా మాంద్యానికి గురైనపుడు ప్రభుత్వ పెట్టుబడులు పెంచటం, వస్తువినిమయ డిమాండ్ పెంచేందుకు అవసరమైన చర్యల గురించి కీన్స్ సూచించిన పరిష్కార మార్గం) కార్మికవర్గ జీవన పరిస్ధితులను మెరుగుపరచదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. సోషల్ డెమోక్రసీ తురుపు ముక్కలను ప్రయోగిస్తామని చెప్పటమే తప్ప ఆట అడదని గ్రీసులోని సిరిజా, స్పెయిన్‌లోని పొడెమాస్ లక్షణాలు మొరేనాలో వున్నాయని వ్యాఖ్యానించింది. 2000సంవత్సరాలో మెక్సికో నగర మేయర్ ఎన్నికల్లో లోపెజ్ పోటీ చేసినపుడు కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా వుందని, ఎన్నిక తరువాత కూటమి పట్ల విశ్వాసాన్ని కనపరచలేదని, తన వర్గ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడని గుర్తు చేసింది. గుత్తాధిపతులకు ఇష్టమైనవారిలో ఒకరిగా లోపెజ్ వున్నారని, ఇదే సమయంలో ఆకలి, దారిద్య్రాలతో అలమటించుతూ విసిగిపోయిన వారిలో ఆశను కూడా కలిగిస్తున్నాడని, తరువాత అసంతృప్తికి గురవుతారని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. మెక్సికో కార్మికవర్గ సమస్య పెట్టుబడిదారీ విధానం, దానిని మార్చేందుకు లోపెజ్ ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోగా దానిని బలపరచాలని కోరుకుంటున్నారని, అందువలన ఓటు వేసినా వేయకపోయినా ఒరిగేదేమీ లేదని, అయితే జరుగుతున్న పరిణామాలలో కార్మికవర్గం జోక్యం చేసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది.
సోషల్ డెమోక్రాట్లు తమను వామపక్షవాదులుగా పిలుచుకోవటం, మీడియా కూడా అదే ప్రచారం చేస్తున్నది. ఫ్రాన్స్‌లో సోషలిస్టు పార్టీ, బ్రిటన్‌లో లేబర్ పార్టీ, అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ వంటి వన్నీ ఈకోవకే వస్తాయి. వాటిలో కొంత మంది సంస్కరణవాదులు,కొందరు వామపక్ష వాదులు వుండవచ్చు తప్ప మౌలికంగా అవి పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడేవే తప్ప వ్యతిరేకించేవి కాదని ఇప్పటికే రుజువు చేసుకున్నాయి. బూర్జువావర్గంలో అధికారంకోసం జరిగే పెనుగులాటలో ఇలాంటి పార్టీలు అనేకం పుట్టుకు వస్తాయి, అంతరించి, కొత్త రూపాలలో రావటం తప్ప మౌలిక స్వభావంలో మార్పు వుండదు. మెక్సికో మొరేనా పార్టీ నాయకత్వంలోని కూటమి కూడా అలాంటిదే. దాని మీద భ్రమలు పెట్టుకోనవసరం లేదు.