Tags

, , , ,

Image result for why narendra modi delayed msp announcement

ఎం కోటేశ్వరరావు

ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాశారు. ఇది ముందస్తు ఎన్నికల తరుణమని అందుకే నరేంద్రమోడీ పంటల కనీస మద్దతు ధరలను ఆలస్యంగా ప్రకటించారని విమర్శలు ఎదుర్కొన్నారు.వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి మార్చి నెలలోనే సమర్పించింది. రేపేమవుతుందో తెలియని స్ధితిలో వున్నంతలో ఏ పంటకు ధర ఆకర్షణీయంగా వుంటే రైతాంగం వాటిని ఎంచుకొనేందుకు వీలుగా సాగుకు ముందే ప్రకటించాల్సిన వాటిని సాగు ప్రారంభమైన నెల రోజుల తరువాత కేంద్రం ప్రకటించింది. ఎన్నికల కోసం ఆలస్యం చేశారని విమర్శకులు తప్పుపడితే ఆశ్చర్యం ఏముంది, తప్పేముంది?

వెనుకో ముందో ప్రభుత్వం ఏదో ఒకటి చేసింది, పెంపుదలను అభినందిస్తారా లేదా అని మోడీ మద్దతుదారులు అడగటం సహజం. నాలుగు సంవత్సరాల పాలన తరువాత తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చానని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించారు. అంటే స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరిగినట్లే రైతాంగం భావించాలి. సగటు వుత్పత్తి ధరపై 50శాతం అదనంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) నిర్ణయించాలన్నది 2004-06 మధ్య కాలంలో ఆయన సమర్పించిన నివేదికలలో చేసిన సిఫార్సులలో ఒకటి. దానిని ఇప్పుడు అమలు చేశామని మోడీ, బిజెపి నేతలు చెబుతున్నారు. దీన్ని అమలు జరిపేందుకు ప్రభుత్వానికి పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని కేంద్రహోం మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ప్రకటించారు. ఇంత స్వల్ప భారం మాత్రమే పడేదానికి నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టిందన్నది ప్రశ్న.

ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారం, వాదన, ధరల నిర్ణయానికి తీసుకున్న ప్రాతిపదికలు మోసపూరితమైనవని ఆలిండియా కిసాన్‌సభ వంటి సంస్ధలు పేర్కొన్నాయి. ఎన్నికల తాయిలం అని కాంగ్రెస్‌ పేర్కొన్నది. క్వింటాలు ధాన్యం వుత్పత్తికి రైతుకు రు.1166 ఖర్చు అవుతుందని లెక్కగట్టి దాని మీద యాభైశాతం కలిపితే రు. 1750 వచ్చేందుకు గాను గత ఏడాది వున్న ధరమీద 200 రూపాయలు పెంచారు. ఇలాగే మిగతా పంటల ధరలను నిర్ణయించారు. వివిధ రాష్ట్రాలలో ఒకే పంటల వాస్తవ సాగు వ్యయం భిన్నంగా వుంటుంది. అందువలన కేంద్రం ప్రాతిపదికగా తీసుకున్న ధర శాస్త్రీయమైనది కాదన్నది స్పష్టం. తెలంగాణాలో వాస్తవ వ్యయం క్వింటాలుకు రు2,158 అని వ్యవసాయశాఖ లెక్క కడితే కేంద్రం తీసుకున్న సగటు ప్రాతిపదిక రు. 1166, నిర్ణయించిన ధర రు. 1745. ఇలాగే అన్ని పంటల విషయంలోనూ జరిగింది. పత్తి (పొట్టి, మధ్య రకం పింజ) సాగు ఖర్చు రు.3433 గా లెక్కించి మద్దతు ధరను రు.5150గానూ పొడవు పింజ( తెలుగు రాష్ట్రాలలో పండించే రకాలు)కు రు.5450గా నిర్ణయించారు. ఇవి వాస్తవ ఖర్చును ప్రతిబింబించేవి కాదన్నది వేరే చెప్పనవసరం లేదు.

ధరల నిర్ణయ ప్రాతిపదికలోపాల తీరుతెన్నులను చూద్దాం.వ్యవసాయ ధరల, ఖర్చుల కమిషన్‌(సిఏసిపి) వ్యవసాయ ఖర్చును లెక్కించేందుకు ఎంచుకున్న పద్దతిలోనే లోపం వుంది. అది మూడు రకాలగా ఖర్చులను చూపింది. వుదాహరణకు ధాన్య వుత్పత్తికి అది రు.865 వాస్తవ ఖర్చు ఎ2, రు.1166 వాస్తవ ఖర్చు ఎ2 ప్లస్‌ రైతు శ్రమ ఎఫ్‌ఎల్‌, రు 1560 సి2( దీనిలో వాస్తవఖర్చు ఎ2, రైతు శ్రమ ఎఫ్‌ఎల్‌, కౌలు, బ్యాంకు వడ్డీలు, ఇతరాలు సి2, అన్నీ వున్నాయి.) గిట్టుబాటు ధర నిర్ణయించేటపుడు ప్రభుత్వాలు సి2ను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి బడుదు ఎ2ప్లస్‌ ఎఫ్‌ల్‌ 1166ను మాత్రమే తీసుకొని దానిలో యాభైశాతం కలిపితే వచ్చే మొత్తాన్ని కేంద్రం నిర్ణయించి, ఇదే గిట్టుబాటు ధర, మా వాగ్దానాన్ని నెరవేర్చామని చెబుతోంది. సి2ను పరిగణనలోకి తీసుకుంటే ధాన్యం ధర రు.2,340 కావాలి. కానీ కేంద్రం రు.1750,1770 వంతున నిర్ణయించింది. అన్ని పంటలకూ ఇదే తీరు. పత్తికి రు 6,771కి గాను 5150,5450 వంతున నిర్ణయించింది.కేరళ ధాన్యానికి క్వింటాలుకు రు.780 బోనస్‌గా ఇస్తోంది.1016-17లో కేరళలో రోజు వారీ వ్యవసాయ కార్మికుల సగటు వేతనం రు. 673 కాగా దేశ సగటు 270, అంతకంటే ఎక్కువగా తమిళనాడు 411, హిమచలప్రదేశ్‌ 394, హర్యానా 365, పంజాబ్‌ 314, కర్ణాటక 318, రాజస్ధాన్‌ 281, ఆంధ్రప్రదేశ్‌ 276లు దేశ సగటు కంటే తక్కువగా పశ్చిమ బెంగాల్‌ 259, మహారాష్ట్ర 258, అసోం 256, యుపి 249, బీహార్‌ 230, గుజరాత్‌ 223, ఒడిసా 217 ఎంపీ 202 ఇస్తున్నాయి. ఇలాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా దేశమంతటికీ రూళ్ల కర్ర సిద్ధాంతాన్ని అమలు జరపటం శాస్త్రీయం అవుతుందా?

కనీస మద్దతు ధరలను నిర్ణయించటం ఒక ఎత్తు. దానిలో లోపాల సంగతి చూశాము. వాటిని అమలు జరిపే యంత్రాంగం లేదు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్దలు అరకొరగా కొనుగోళ్లు, అదీ ప్రయివేటు మార్కెట్‌ కనుసన్నలలో మాత్రమే చేస్తున్నాయి. కొన్ని పంటల ధరలు కనీస మద్దతు కంటే ఎక్కువ వుంటున్నాయి. వుదాహరణకు పత్తి విషయం తీసుకుందాం. కనీస మద్దతు కంటే ధరపడిపోయినపుడు సిసిఐ రంగంలోకి వచ్చి మద్దతు ధరకే పరిమితం అవుతోంది. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికలో అందచేసిన వివరాల ప్రకారం 2013-17 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో క్వింటాలు ముడి పత్తి(పొట్టి పింజ) కనీస మద్దతు సగటు ధర రు. 3,763. ఇదే కాలంలో దేశీయ మార్కెట్లో రైతుకు వచ్చిన సగటు ధర రు. 4616, అంతర్జాతీయ మార్కెట్లో లభించినది రు.4674. అంటే కనీస మద్దతు ధర మార్కెట్‌ ధర కంటే తక్కువగానే వుంది. కొన్ని త్రైమాసిక సగటు ధరలను చూసినపుడు కొన్ని సార్లు దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే ఎక్కువగానూ, కొన్నిసార్లు తక్కువగానూ వున్నాయి. ఐదేండ్ల సగటు స్వల్పంగా ఎక్కువగా వున్నాయి. ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని సార్లు రైతాంగాన్ని దెబ్బతీస్తున్నాయి.

ప్రభుత్వ నియంత్రణల విధానానికి స్వస్తిపలికినట్లు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిన వుదంతాలు వున్నాయి. గత ఎన్‌డిఏ పాలనా కాలంలో 2001జూలై నుంచి పత్తి ఎగుమతులపై పరిమాణ ఆంక్షలను ఎత్తివేసి సాధారణ ఎగుమతుల జాబితాలో చేర్చారు. దేశీయంగా ధరలు పెరుగుతుండటంతో మిల్లు యజమానుల వత్తిడికి లంగిన యుపిఏ సర్కార్‌ 2010 ఏప్రిల్‌లో క్వింటాలు పత్తి (దూది) ఎగుమతిపై రు.2500 సుంకం విధించి నిరుత్సాహపరచింది. ఎగుమతులను పరిమితుల ఆంక్షల జాబితాలో పెట్టింది. అదే ఏడాది ఆగస్టు నెలలో ఎలాంటి పన్ను లేకుండా ఎగుమతులను అనుమతించింది. ఒక వైపు ఎగుమతులతో పాటు దిగుమతులను కూడా మన సర్కార్‌ ప్రోత్సహించింది. కొన్ని సంవత్సరాలు ఐదు, పదిశాతం దిగుమతి విధిస్తే కొన్నేండ్లు ఎలాంటి పన్ను లేకుండా అనుమతించింది. ఈ చర్య రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. మన పత్తి ఎగుమతులలో ఎగుడుదిగుడులు కూడా రైతాంగానికి లభించే ధరపై ప్రభావం చూపుతున్నాయి. గరిష్టంగా 2013-14లో గరిష్టంగా 18.6లక్షల టన్నుల పత్తి ఎగుమతి జరిగింది. అది 2016-17 నాటికి 9.1లక్షలకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం చైనా దిగుమతులను గణనీయంగా తగ్గించిందని చెబుతున్నారు. అది వాస్తవమే అయినప్పటికీ నరేంద్రమోడీ సర్కార్‌, సంఘపరివార్‌ నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పత్తి దిగుమతులపై ప్రభావం చూపిందా అన్న కోణంలో కూడా ఆలోచించటం అవసరం. వ్యవసాయ మన రైతాంగానికి గిట్టుబాటు గాకపోవటానికి ప్రభుత్వాలు పెట్టుబడిని తగ్గించటమే. దిగుబడులు పెంచటానికి అవసరమైన వంగడాల సృష్టికి ఖర్చుతోకూడిన పరిశోధనలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఫలితంగా పత్తి దిగుబడి హెక్టారుకు మన దేశంలో గత పది సంవత్సరాలలో 5 నుంచి4.8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రపంచ సగటు ఎనిమిది క్వింటాళ్లు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో 35.9 నుంచి 19.1శాతం వరకు దిగుబడులు తగ్గటం గమనించాల్సిన అంశం. 2008-12 మధ్య దేశ సగటు దిగుబడి ఐదు క్వింటాళ్లు కాగా తెలుగు రాష్ట్రాలలో 5.4 వుంది, అదే 2013-17 మధ్య దేశ సగటు 4.8 కాగా తెలుగు రాష్ట్రాలలో 4.4కు పడిపోయింది. పంటల దిగుబడులలో మన దేశం చాలా వెనుక బడి వుంది. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీస్తోంది.(హెక్టారుకు కిలోలు)

పంట             ప్రపంచ సగటు     గరిష్టం               భారత్‌                రాష్ట్రాలు

ధాన్యం           4,636.6      చైనా6,932.4      2,400.2      పంజాబ్‌ 3974.1

మొక్కజన్న     5,640.1      అమెరికా10960.4  2,567.7      తమిళనాడు 7010

పప్పులు         731.2       ఆస్ట్రేలియా 5540.3    656.2       గుజరాత్‌ 931

కందిపప్పు       829.9      కెన్యా 1612.3         646.1       గుజరాత్‌ 1124.8

సోయాబీన్స్‌      2,755.6    అమెరికా 3,500.6     738.4         ఎంపి 831

వేరుశనగ      1,5,90.1      అమెరికా 4118.6       1,464.9  తమిళనాడు 2,574.3

ప్రపంచ మార్కెట్లో మన మొక్కజన్నల కంటే రేట్లు తక్కువగా వుండటంతో ఇటీవలి కాలంలో దాదాపు మొక్క జన్నల ఎగుమతి ఆగిపోయింది. 2012-13లో 47.9లక్షల టన్నులు ఎగుమతి చేస్తే 2016-17 నాటికి 5.7లక్షల టన్నులకు పడిపోయింది. పప్పు ధాన్యాలన్నీ అంతర్జాతీయ ధరలకంటే మన దేశంలో ఎక్కువగా వుండటంతో తక్కువ ధరలకు వ్యాపారులు దిగుమతిచేసుకుంటున్నారు. మన మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా గతేడాది రైతాంగానికి రాలేదు. గత రెండు సంవత్సరాలలో బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధరలకంటే తక్కువకే రైతాంగం అమ్ముకోవాల్సి వచ్చింది. గత రెండు సంవత్సరాలలో పప్పుధాన్యాల ధరలు కనీస మద్దతు కంటే మార్కెట్లో తక్కువ వున్నాయి. వాటిని అమలు జరిపిన దిక్కులేదు. మన వ్యవసాయ ఎగుమతులు 2013-14 నుంచి 2016-17వరకు 268.7 నుంచి 233.6 బిలియన్‌ డాలర్లకు పడిపోగా, దిగుమతులు 109.7 నుంచి 185.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

చివరిగా మోడీ సర్కార్‌ ప్రకటన ఎన్నికలకోసం చేసినదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి జిమ్మిక్కులు గత యుపిఏ ప్రభుత్వం చేసింది. అది నడచిన బాటలోనే ఎన్‌డిఏ నడుస్తోంది. వుదాహరణకు గత పద్దెనిమిది సంవత్సరాలలో పత్తి ధరలను పెంచిన తీరు చూద్దాం. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ అసలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 2000-01 నుంచి 2003-04 వరకు పొడవు పింజ పత్తి కనీస ధరను 1825,1875,1895,1925 మాత్రమే చేసింది. తరువాత అధికారానికి వచ్చిన యుపిఏ ఒకటి 2009 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని 2007-08లో వున్న 2030 ధరను ఏకంగా 3000కు పెంచింది. తరువాత 3000,33300కు పెంచి తరువాత 2014 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆమొత్తాన్ని 4000 చేసింది.నరేంద్రమోడీ సర్కార్‌ దానిని 4050 నుంచి నాలుగు సంవత్సరాలలో 4,320కి పెంచి ఇప్పుడు రు.5450 చేసింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ ఇద్దరూ దొందూ దొందే అంటే కరెక్టుగా వుంటుందేమో !