Tags

, , , ,

Image result for india’s external debt, modi 2018

ఎం కోటేశ్వరరావు

లేని ప్రతిష్టకోసం అనేక మంది రాజులు, రంగప్పలు భట్రాజులు, కిరాయి కవులను పోషించినట్లు విన్నాం. ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం నరేంద్రమోడీ గురించి అలాంటి కిరాయిబాపతు రేయింబవళ్లు పని చేస్తున్నది. వారు సృష్టించిన అవాస్తవాలు, వక్రీకరణలను అనేక మంది అమాయకులు నిజమని నమ్మటమే కాదు, వారు కూడా జీతం భత్యం లేని ప్రచారకర్తలుగా పని చేస్తున్నారు. అలాంటి వాటిలో గత నాలుగు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో ఒక్క రూపాయి కూడా విదేశీ అప్పులు చేయలేదు అనే హిమాలయపర్వత మంత అబద్దాన్ని ప్రచారం ఒకటి.. నిజం నిదానంగా ఒక అడుగు వేసేసరికి అబద్దం వంద అడుగుల ముందు వుంటుంది. ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారంతా బాగా చదువుకున్న ప్రబుద్ధులు కావటమే విచారకరం, ఆందోళన కలిగించే అంశం.

ప్రతి మూడు మాసాలకు ఒకసారి మన అప్పుల గురించి రిజర్వుబ్యాంకు అధికారికంగా వివరాలను ప్రకటిస్తుంది. దానిలో అప్పుల తీరుతెన్నుల గురించి వుంటాయి. అయినా సరే రిజర్వుబ్యాంకు వివరాలను ఎంత మంది చూస్తారు, నిజం తెలిసే లోపల మనం చెప్పే అబద్దాలను జనం గుడ్డిగా నమ్ముతారు, ప్రయోజనం నెరవేరుతుందనే తెంపరితనంతో మోడీ పరివారం వ్యవహరిస్తోంది.

అసలు గత నాలుగేండ్లలో మా మోడీ సర్కార్‌ అప్పులే చేయలేదని చెబుతారు. అది అవాస్తవమని రుజువు చూపితే తేలు కుట్టిన దొంగల మాదిరి దాని గురించి మాట్లాడరు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సరికి అంటే 2014 మార్చి 30 నాటికి మన విదేశీ అప్పు 446.2 కోట్లు, అది 2018 మార్చి నాటికి ఖరారుగాని అంకెల ప్రకారం 529 బిలియన్‌ డాలర్లకు చేరింది. రిజర్వుబ్యాంకు వివరాలివి. దీనితో మోడీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతారా? ఒకవేళ అదే ప్రాతిపదిక అయితే గత పాలకులకు కూడా సంబంధం వుండదు. అలాంటపుడు మోడీ అప్పు చేయలేదని ఎలా చెబుతారు. ఈ వివరాల సంగతేమిటి అని అడిగితే, గత ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో చేశాయి, మోడీ చేసింది తక్కువ అని కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లుగా వాదనలు చేసే వారి గురించి చెప్పాల్సిందేముంది?

గతంలో అప్పు చెయ్యలేదని ఎవరు చెప్పారు. అవసరమైతే తీసుకోవచ్చు. అది అవమాన షరతులు లేదా మన ఇల్లు గుల్ల అయ్యేట్లుగా వుండకూడదు. అప్పుల కోసం ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ షరతులను అమలు జరిపారనే కదా వామపక్షాలు విమర్శలు చేశాయి. దివాలాకోరు, ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరిపిన కారణంగానే మన ఆర్ధిక వ్యవస్ధలో ఇన్నేండ్లలో ధనికులు మరింత ధనికులయ్యారు, సంపద అంతా కొద్ది మంది చేతిలో పోగుపడుతోంది. ఫలితంగా మెజారిటీ జనంలో కొనుగోలు శక్తి లేక మన అభివృద్దికి పరిమితులు ఏర్పడ్డాయి. ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను బార్లా తెరవటంతో విదేశీ సరకులతో మన దుకాణాలు నిండుతున్నాయి. లాభాల పేరుతో సంపద విదేశాలకు తరలిపోతోంది. ఆ విధానాలను బిజెపి పూర్తిగా సమర్ధించింది, వ్యతిరేకించిన చరిత్ర దానికి లేదు. ఆ విధానం నుంచి మోడీ సర్కార్‌ వైదొలగదలచుకుంటే ఎవరు అడ్డు పడ్డారు. 2016లో 484బిలియన్‌ డాలర్ల అప్పును మోడీ 2017నాటికి 471కి అంటే 13 బిలియన్‌ డాలర్లు తగ్గించిన ఘనుడని మోడీ భక్తులు బాజా వాయిస్తున్నారు. దీన్నే అతి తెలివి అంటారు. ప్రవాస భారతీయులు చేసే డిపాజిట్లు కూడా మన విదేశీ రుణాల్లో కలసి వుంటాయి. పైన పేర్కొన్న 13 బిలియన్‌ డాలర్ల అప్పు తగ్గటానికి ఆ ఏడాది ప్రవాసభారతీయుల డిపాజిట్లలో పది బిలియన్‌ డాలర్లు తగ్గాయి. అది కూడా మోడీగారి గొప్పతనమే అంటారా? విదేశాల్లో వుపాధి లేదా డబ్బు సంపాదన ధ్యేయంగా వున్నవారు మాత్రమే ప్రవాస భారతీయులు. వారు సంపాదించిన ఒక డాలరు మరొక డాలరును ఎలా జత చేసుకుంటుంది అనేదే వారికి ప్రధాన లక్ష్యంగా వుంటుంది. అందువలన ఆయా పరిస్ధితులను బట్టి ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడ తమ సొమ్మును డిపాజిట్లుగా పెడతారు. ఇక్కడ దేశభక్తి మరొకటో సమస్యగా రాదు. ఇలాంటి కారణాలతో విదేశీ రుణాలలో ఒక ఖాతాలో తగ్గవచ్చు, ఒకదానిలో పెరగవచ్చు. మొత్తంగా అప్పు పెరుగుతోందా తగ్గుతోందా అన్నదే గీటురాయి. 2018 మార్చి నాటికి చూపిన అంచనాల్లో వాణిజ్య రుణాలు, స్వల్పకాలిక రుణాలలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అందువల్లనే 471 నుంచి 529 బిలియన్‌ డాలర్లుగా ఆర్‌బిఐ పేర్కొన్నది. అసలు నాలుగేండ్లలో అప్పులే చేయలేదు అని ప్రచారం చేసే వారు లేదా దానిని నమ్ముతున్న వారు ఆర్‌బిఐ ఖరారు చేసిన అంకెల ప్రకారం మోడీ పాలన తొలి ఏడాదే అప్పు 446.2 బిలియన్‌ డాలర్ల నుంచి 474.7 బిలియన్‌ డాలర్లకు ఎలా పెరిగిందో చెబుతారా ? రాజు కంటే మొండి వాడు బలవంతుడు అన్నట్లుగా అడ్డగోలు వాదనలు చేసే వారిని ఎవరేమీ చేయలేరు.

Image result for india’s external debt, modi

రిజర్వుబ్యాంకు అంకెల ప్రకారం 2006-14(మార్చి31) మధ్యకాలంలో మన విదేశీ అప్పు సగటున జడిపిలో 17.5 శాతం వుంది. అదే మోడీ నాలుగేండ్లపాలనలో 21.95 శాతం వుంది. ఇదే సమయంలో విదేశీ అప్పులపై మనం చెల్లించిన వడ్డీ యుపిఏ ఎనిమిదేండ్ల సగటు 5.23 శాతం కాగా మోడీ పాలనలో అది 8.05 వుంది, మొత్తం రుణాలలో రాయితీలతో కూడినవాటి శాతం తొమ్మిదేండ్ల యుపిఏ కాలంలో 17.36 శాతం కాగా మోడీ ఏలుబడిలో 9.07 శాతానికి పడిపోయాయి. ఇన్ని చేదు నిజాలను రిజర్వుబ్యాంకు మనకు అందిస్తుంటే గతంలో చేసిన అప్పులతో పోలిస్తే మోడీ కాలంలో పెరుగుదల శాతం తక్కువగా వుంది కనుక ఈ మంచిని విమర్శకులు చూడటం లేదనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది మొత్తంగా ఫలితం, పర్యవసానాలు ఏమిటి అన్నది. వాటిని చూసినపుడు మోడీని అభినందించాల్సిందేమీ కనిపించటం లేదు.

మన విదేశీ అప్పులలో ప్రభుత్వం చేసేవి, ఇతర వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల లేదా విదేశీయుల డిపాజిట్లన్నీ కలిసే వుంటాయి. రిజర్వుబ్యాంకు అందచేసిన వివరాల ప్రకారం ప్రభుత్వ అప్పుల తీరుతెన్నులు చూద్దాం. 2014-16 మధ్య మన ప్రభుత్వ అప్పు 83.7 నుంచి 93.4 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అది 2018 నాటికి 111.9 బిలియన్లకు చేరింది. అంటే నాలుగేండ్లలో మోడీ సర్కార్‌ చేసిన అప్పు 83.7 నుంచి 111.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తం పెరిగినా అది జిడిపితో పోలిస్తే శాతాల రూపంలో తగ్గింది. ఇది ఒక్క ప్రభుత్వ రుణాలకే కాదు, ప్రయివేటు రుణాలకూ వర్తిస్తుంది. మన విదేశీ అప్పు పెరుగుదల తగ్గుదలలో రూపాయి విలువ ప్రమేయం కూడా వుంటోంది. రూపాయి విలువ తగ్గితే కొత్త అప్పులు తీసుకోకపోయినా మన అప్పు కొండలా పెరిగిపోతుంది.

మన విదేశీ అప్పులో 2007లో ప్రవాస భారతీయుల డిపాజిట్లు, వాణిజ్య రుణాలు దాదాపు సమంగా వున్నాయి. ఆ ఏడాది మొత్తం అప్పు 172 బిలియన్‌ డాలర్లయితే 41 చొప్పున డిపాజిట్లు, వాణిజ్య రుణాలు వున్నాయి. 2018 నాటికి అవి 126-189 బిలియన్‌ డాలర్లుగా మారిపోయాయి. మన విదేశీ రుణాలలో అత్యధిక భాగం డాలర్‌లో ముడి పెట్టి వున్నాయి. రూపాయి విలువ పెరిగితే మనకు లాభం తగ్గితే అదనపు భారం అవుతుంది. యుపిఏ పాలన అయినా నరేంద్రమోడీ ఏలుబడి అయినా మన రూపాయి విలువ తగ్గటం తప్ప పెరగటం లేదు. ఫలితంగా మనకు తెలియకుండానే విదేశీ అప్పులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నాము. మన అప్పులో (2017 డిసెంబరునాటికి) 78.8శాతం ప్రభుత్వేతర ప్రయివేటు కంపెనీల రుణాలే వున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇంత వరకు మన రూపాయి విలువ ఏడుశాతం పతనమైంది. ఈ మేరకు ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్దలైనా డాలర్‌ చెల్లింపులకు అమేరకు అదనంగా రూపాయలు చెల్లించి డాలర్లను కొనుగోలు చేయాల్సిందే. చమురు ధరలు పెరుగుతున్న కారణంగా చెల్లింపులకు అదనపు డాలర్లు అవసరమయ్యాయి. దీంతో డాలర్లకు డిమాండ్‌ పెరిగంది. రూపాయి విలువ తగ్గింది. రూపాయి విలువ పతనం గాకుండా కాపాడాల్సిన బాధ్యత దాని నిర్వహణ చూస్తున్న కేంద్ర ప్రభుత్వానిది, దాని నేత నరేంద్రమోడీదే. ఆయన భక్తులు చెబుతున్నట్లు అప్పులు తక్కువగా చేసినందుకు మోడీ ఖాతాలో ఎన్ని అభినందనలు వేస్తే రూపాయి విలువ పతనం కారణంగా అదే మోడీ ఖాతాలో అక్షింతలు కూడా వేస్తే రెండూ సమానం అవుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచగానే మన దేశం నుంచి డాలర్ల ప్రవాహం అటు తిరిగింది. దాంతో మన రూపాయి పతనానికి అదొక కారణమైంది. ఇప్పటికే ఈ ఏడాది రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఈ ఏడాది ఆఖరికి మరో రెండుసార్లు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన రూపాయి మరింత పతనం అయ్యే ముప్పు వుంది. ఈ ముప్పును తప్పించేందుకు మన రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఒకసారి వడ్డీరేట్లను పెంచింది. ఇది మన దేశం నుంచి డాలర్లు తరలిపోకుండా చేసేందుకు తీసుకున్న చర్య. వడ్డీ రేట్లను ఇంకా తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్న వాణిజ్య, పారిశ్రామికవర్గాలకు ఇది ఎదురుదెబ్బ. మొత్తం జనం మీద అదనపు భారాలకు కారణం అవుతుంది. ఈ పరిస్ధితిని నివారించేందుకు మోడీ దగ్గర వున్న మంత్రదండాన్ని బయటకు తీయమని ఆయన భక్తులు డిమాండ్‌ చేయాలి తప్ప విమర్శకుల మీద ఎదురు దాడి చేస్తే ప్రయోజనం ఏముంది ?