డాక్టర్ కదిరె కృష్ణ
ఈనెల 7వ తేదీన ప్రముఖ రచయిత వనం జ్వాలా నరసింహారావు ”వాల్మీకి బోయవాడేనా?” అన్న శీర్షికతో నవ తెలంగాణలో అచ్చయిన నా వ్యాసానికి స్పందిస్తూ ”వాల్మీకి రామాయణంలో ఏముంది?” శీర్షికన మరో వ్యాసం రాశారు. వాల్మీకిని బోయవాడుగా ఎందుకు చేశారు? అనే నా ప్రశ్నకి సమాధానం అన్నట్టు రామాయణం రాసినవాడు బోయవాడా? బ్రాహ్మణుడా అనే కంటే ఆయన రామాయణంలో ఏముంది? అది ఎందుకు అవశ్యపఠనీయం? అనే దృష్టితో పటిస్తేకానీ దానిలోని తత్వం బోధపడదు అంటూ సెలవిచ్చారు. దరిమిలా రామాయణాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేశాను. నా అజ్ఞానాన్ని మరోసారి రామాయణ పారాయణంతో కడిగేసుకుందామనీ కృషిచేసాను. లాభంలేకపోయింది! తిరిగేసి మర్రేసి చదివినా నరసింహరావుగారు అన్న మంత్ర పూతం, ఉపనిషత్ సారం, అంత:కరణ శుద్ది మహత్వం ఏమీ కనిపించలేదు. పైగా రామాయణం చదివినంతసేపు మనోవేదనకు గురియ్యాను. ఈ కావ్యం శూద్రాతి శూద్ర కులాలను/జాతులను ఘోరంగా అవమానించింది. బాలకాండ మొదలుకొని యుద్దకాండ వరకు (పూర్వ ఉత్తరాకాండ సహా) బ్రాహ్మణాధిక్యత, ఆర్య రాజ్య విస్తరణ తప్ప మరో శాస్త్ర మర్మం నాకు ఇందులో కనిపించలేదు.
రామాయణం, వర్ణ ధర్మాన్ని కాపాడటానికి వ్రాయబడ్డదని ఇప్పటికే మహాత్మాపూలే, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ ఇ.వి. రామస్వామి సవివరణాత్మకంగా నిరూపించారు. అయినా వీరి వాధనలతో తృప్తి చెందకనే రామాయణం సభక్తితో పఠిస్తుంటే భక్తిరసం భగమై జాతి వివక్ష, అకారణ హింస నా జాతి కడగండ్లు కండ్లముందు సాక్షాత్కారమై కన్నీటి పర్యంతమయ్యాను. నా నోట ”మానిషాద…” శ్లోకం రాలేదు, నా శోకమూ ఆరలేదు. రామాయణంలోని బాలకాండ ప్రథమ సర్గలో వాల్మీకి ఫలశ్రుతిని ఇలా చెప్పారు ”పఠన్ ద్విజో వాగృష భత్వమీయాత్/ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వ మీయాత్/వణిగ్జన: పణ్యఫలత్వ మీయాత్/ జనశ్చశూద్రో2పి మహత్వమీయాత్” అనగా ”రామాయణం పఠించిన ద్విజులు వేదవేదాంగముల యందును, శాస్త్రములలోనూ పండితులగుదురు. క్షత్రియులు, రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభము కలుగును.
శూద్రులు పై వారికి సేవ చేసిన మహత్వమును పొందుదురు”. వివిక్ష ఎంత స్పష్టంగా ఉందో పై శ్లోకమే రూఢి చేస్తుంది. రామాయణం పఠించినా శూద్రుడు పండితుడు కాలేడు. రాజ్యాధికార ప్రసక్తి లేనేలేదని పై వాక్యాలు స్పష్టంగానే ప్రవచిస్తున్నాయి. అందరికీ రామాయణం ఒకే ఫలాన్ని ఎందుకు ఇవ్వడంలేదు? ఆ కావ్యానికి ఆ వాల్మీకికి ఎందుకింత వివిక్ష శూద్రులమీద ఈ విషయాలేమీ తెలుసుకోలేక ప్రస్తుతం శూద్రులే (బి.సి.లు) ఈ రామాయణాన్ని, ఆ దేవుడ్ని భుజాలు కాయలు కాసేలా మోస్తున్నారు. వాస్తవాన్ని జాతికి తెలియజేయాల్సిన అవసరం
ఉన్నదనేదే నా వ్యాస ఫలశృతి. జ్వాలా నరసింహారావుకి చివరికి ఇందులో గాయత్రి మంత్ర మహత్వం గోచరించింది. ఆయన ఈ విషయాన్ని తన వ్యాసంలో వివరించారు. వనం వారిది ఆర్య బ్రాహ్మణ దృష్టి. మసి పూసి మారేడుకాయలు చేసే జంతర్‌మంతర వాదన. శూద్రునికి ఇలాంటి గతి ఎందుకు పట్టింది అని ఆలోచించే బదులు గాయత్రి చివరి అక్షరంతో ముగించాడని పై శ్లోకానికి పవిత్రత, ఆధ్యాత్మికత జోడించే ప్రయత్నం చేశాడు. ఇదే మనువాదం, మయావాదం. ఇంకా వనం వారికి జ్ఞానోదయం కలిగించే శ్లోకం అదే సర్గ నుండి ”చాతుర్వర్ణ్యం చ లోకే 2 అస్మిన్ స్వేస్వే ధర్మే నియోక్ష్యతి” అంటే చాతుర్వర్ణ్యాలను సధర్మంగా నడపడమే రామాయణపు అంతిమ లక్ష్యం. రాముడు, బ్రాహ్మణులకు ఎందుకింత ప్రీతిపాత్రుడయ్యాడు? అతనికి ఎందుకంతగా దైవకత్వాన్ని ఆపాదించారు. ఈ ప్రశ్నకు బాలకాండలోనే మళ్ళీ సమాధానం దొరుకుతుంది. ”గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధి పూర్వకమ్/ అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశా:” దీనిర్ధం కోట్లాది గోవులను అపరిమితమైన ధనధాన్యములను రాముడు, బ్రాహ్మణులకు దానిమిచ్చును. కేవలం ఆర్యుడైనందుకేకాదు బ్రాహ్మణులకు సంతర్పణలు సజావుగా సాగించినందుకు ఆయన దైవత్వాన్ని పొందాడు.
అసలు బ్రాహ్మణ రక్షణార్దమే జన్మించానని శ్రీరాముడు ప్రకటించినందుకు ఆయన్ని దేవుణ్ణి ఆ కావ్యాన్ని మహత్వం గల రచనగా వృద్ది చేసి ప్రచారం చేసి కట్టుకథలకు రంగులు పూసిన ఘటికులు ఈ ఆర్య బ్రాహ్మణులు. రాముడు పితృవాక్య పాలకుడు అంటారు. అంటే బ్రాహ్మణులను నెత్తికెత్తుకొనేవాడని అసలు రహస్యం. బయటకు చెప్పేది అంతగా సరిపోయేలాలేదనడానికి ఈ కావ్యంలోనే సాక్ష్యాలున్నాయి. కోసలను పరిపాలించిన దశరధుడు అతని రాజధాని అయోద్య, ఆయన పాలనలోని ప్రజా వర్ణన మనకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. అయోధ్యను ఎవరు నిర్మించారు? ”అయోధ్య నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా/ మనునా మానవేంద్రేణయాపురీ నిర్మితా స్వయమ్” మనువు నిర్మించాడని రామాయణం చెబుతుంది. మనువు నిర్మించిన నగరంలో మూలవాసి బహుజనులకు ఏ స్థానం ఉంటుందో గ్రహించడం పెద్ద కష్టమేమీకాదు. ఇంతటి కుల వివక్షకు భారతీయ సమాజ విధ్వంసానికి కారకుడైన మనవు నిర్మించిన పట్టణంలో శూద్రుల పరిస్థితిని సులభంగానే పసిగట్టగలం. ఆ నగరంలోని బ్రాహ్మణులు మహా పండితులట. క్షత్రియులు, బ్రాహ్మణుల యెడల గౌరవము కలిగి ఉండేవారట. వర్ణ సంకరులు లేనేలేరట (కశ్చిదాసీ దయోధ్యాయాం న చ నిర్వృత్త సంకర:) అంటే వర్ణ వ్యవస్థను చాలా భద్రంగా కాపాడుకున్నరాజు దశరధుడు. వర్ణ సంకరం తప్పా? తప్పనే చెబుతుంది రామాయణం. అంతటి మహాపట్టణంలో నా ప్రజలు ఎంతటి గౌరవాన్ని పొందారోనని మరింత కుతూహలంతో ఇంకా శ్రద్దగా చదివాను. అయ్యో! గుండె లక్షముక్కలయ్యింది. ఇప్పుడు కన్నీళ్ళ బదులు నెత్తురు కారే వాతావరణం నెలకొన్నది. ”శూద్రా: స్వధర్మనిరతా: త్రీన్ వర్ణానుపచారిణ:” అంటూ శ్లోకం తగలనే తగిలింది. ప్రొ|| కంచె ఐలయ్య చెప్పినట్టు ”స్వయం గౌరవంలేని జీవితాలనే మాకు తగిలించారు తప్ప వృత్తి గౌరవంగానీ సామాజిక గౌరవంగానీ ఈ జాతులకు కల్పించే ఔదార్యం ఈ బ్రాహ్మణ గ్రంధాలకు గానీ, బ్రాహ్మణ రచయితలకుగానీ లేదు”. ఇంతకీ పై పద్యానికి అర్ధం ఏమిటంటే అయోధ్యనగరంలోని శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచూ, పై మూడు వర్ణముల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వారిని సేవించిచుండెడివారు. ఈ శ్లోకార్ధం బోధపడ్డాక మనస్సు కకలావికలంకాక మరేమవుతుంది. నెత్తురు సలసలకాగింది. కడలి కల్లోలం అయ్యింది.
వనం వారు ఈ ఆక్రోశాన్ని, ఆవేదనను, తీవ్రవాదమో, నాస్తికవాదమో, చాదస్తమోనని కొట్టిపారేస్తారేమో!? విషయానికొస్తే దశరధుడు ఏ విధంగానైతే వర్ణ ధర్మాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ప్రశ్నేలేని శిక్షలు విధిస్తూ రాజ్య పాలన చేశాడో, రాముడు కూడా అలాగే నూటికి నూరు పాలు ఆచరించి చూపాడు. అందుకే ఆయన పితృవాక్య పాలకుడయ్యాడు. నా వాదానికి బలమైన సాక్ష్యాన్ని రామాయణంలో బాలకాండ నుండే గ్రహించాను. రాముడు, తాటకను సంహరించే సందర్భంలో ”గో బ్రాహ్మణ హితార్ధాయ దేశస్యాస్య సుఖాయచ / తవ చైవా ప్రమేయస్య వచనం కర్తు ముద్యత:” అంటాడు. ఈ శ్లోక భావము ఏమంటే గో రక్షణము, బ్రాహ్మణుల హితము… కొరకు మీ వచనమును (మాటలను) పాటించుచూ ఈ తాటకను చంపుటకు పూనుకొనుచున్నాను అని రాముడు విశ్వామిత్రుడితో చెప్తాడు. ఇదే పితృవాక్య పాలన అంటే. (పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన గౌరవాత్). ఇంకా స్పష్టత కావాలంటారా వనం నరసింహారావు పండితోత్తమా!? ఈ దేశ మూలవాసి మహారాణి, నేటి శూద్రాతిశూద్ర కులాల ప్రతినిధి అయిన తాటకిని చంపడం పితృవాక్య పాలనేనా? అంటే స్త్రీలను చంపటం, మాతృస్వామ్య రాజ్యాలను ద్వంసం చేయడం పితృవాక్యపాలనన్నమాట. అలాగే మాతృస్వామ్య వ్యవస్థ నిర్మాతలైన మూలవాసీ భారతీయ తత్త్వ విరోధి, విద్వంశకుడు, పితృస్వామ్య పాలకుడు ఈ దేశ స్త్రీలకు ఎలా దైవంగా మారాడే నేటి మహిళా మేధావులకు ఇంకా బోధపడకపోవడానికి కారణం? అలాగే ఇహపర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి రామాయణ పఠనమే అవశ్యకర్తవ్యమని ప్రబోధించాడు మహానుభావుడు వనం జ్వాలా నర్సింహారావు. ఈలోకంలోనే ఇలా వెట్టి చాకిరీతో సుఖపెట్టిన శూద్రాతి శూద్ర జాతులను పరలోకంలో ఎంత సుఖపెడతారో చాలానే అర్దమవుతుంది. దశరధుని రాజ్యంలో బ్రాహ్మణుల భోగలాలసత్వానికి, ధనధాన్యాలకు, గోదానాలకు, కొదవేలేదు. బ్రాహ్మణుల ఆదిక్యతను తెలిపే కథను ఒకదాన్ని రామాయణ బాలకాండ వివరిస్తుంది. అది ”రుష్యశృంగుని కథ” పూర్వం అంగరాజ్యాన్ని రోమపాదుడు పాలించే క్రమంలో అతడు ధర్మం తప్పాడట. ధర్మం తప్పడం అంటే బ్రాహ్మణులను తృప్తిపరచకపోవడం, వర్ణ ధర్మాన్ని పాటించకపోవడం. బహుశా రోమపాదుడు సమానత్వం, ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి చూపెట్టి ఉంటాడు. అయితే కొంతకాలానికి వర్షాలు లేక కరువు వచ్చిందట. దానికి కారణం వర్ణ ధర్మాన్ని విస్మరించడమేనని బ్రాహ్మణులు ప్రచారం చేశారు. రోమపాదుడు బుద్దిష్ట్ లేదా జైనమతస్తుడై ఉంటాడు. ఆ ప్రచారంతో రాజ్యంలో కలకలం రేగేలా చేశారు. దానికి పరిష్కారం బ్రాహ్మణుడు, యజ్ఞకర్మల్లో నిష్ణాతుడైన రుష్యశృంగున్ని ఆహ్వానించి యజ్ఞం చేయించడమేనని నమ్మబలికారు.
చివరికి రోమపాదుడు బ్రాహ్మణ తంత్రానికి తలొగ్గక తప్పలేదు. రుష్యశృంగుడు రాజ్యంలో అడుగు పెట్టగానే వర్షం భీకరంగా కురిసిందట. దానికి రాజు తృప్తిపడి విపరీత దానాలతో పాటు కూతురునిచ్చి వివాహం చేశాడట. ఈ మోసపూరిత కథ ద్వారా వారిచ్చే సందేశం ఏమంటే బ్రాహ్మణులు పరమ పవిత్రులని. వారు రాజ్యంలో ఉంటే రాజ్యంలో వర్షాలు కురవడం, సుభిక్షంగా ఉండటం. ఇక్కడ రెండు ప్రశ్నలు 1) వర్ణ సంకరాన్ని వ్యతిరేకించే రామాయణం, బ్రాహ్మణుడైన రుష్య శృంగునికి క్షత్రియుడైన రోమపాదుడు కూతురునిచ్చి వివాహం చేయడాన్ని ఎలా సమర్ధించింది? 2) వర్ణ సంకరమే రుచించని దశరధుడు, వర్ణ సంకరానికి పాల్పడిన రుష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్ర కామేష్టి యాగం ఎలా చేశాడు? అప్పుడు దశరధుని గురించి రామాయణం చెప్పింది శుద్ద తప్పు కదా? ఈ కథను ప్రచారం చేసి మొత్తం రాజ్యంలోని బ్రాహ్మణులు తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. ఇలాంటి ఉన్నత స్థానం బ్రాహ్మణులకిచ్చి నీచస్థానం శూద్రులకిచ్చిన రామాయణం నరసింహారావుగారు అన్నట్టు నా చాలా సందేహాలను నివృత్తి చేసింది. రామాయణం ద్వారా ఆర్యులు సాధించదలచుకున్న ప్రయోజనాలు చాల ానే
ఉన్నాయి. మాతృస్వామ్యాన్ని నాశనం చేయడం, క్షత్రియులపైన స్థానాన్ని ఆక్రమించుకోవడం (క్షత్రియుల స్థానాన్ని దిగువకు నెట్టివేయడం రామాయణంలో చాలా చోట్ల కన్పిస్తుంది)” మరో ముఖ్యమైన ప్రయోజనం మూలవాసి చక్రవర్తులను హతమార్చి ధర్మ పరిరక్షకులుగా కీర్తించబడటం. డా|| ఎస్.వి. రారు ”సింధూ నాగరికతకు ప్రధానమైన మొహెంజోదారోను జయించడానికి ఆర్యులు చేసిన యుద్దం చుట్టూ రామకథను అల్లారు” అంటాడు. అంతేగాక దక్షిణ భారతదేశంలోకి ఆర్య సంస్కృతిని, ఆర్యుల దురాక్రమణను పరోక్ష రూపంలో వనవాసం పేరుతో దండయాత్రగా సాగించాడు రాముడు. అందుకు వాల్మీకి రామాయణంలోని బాలకాండనే ప్రత్యక్షసాక్ష్యం. రాముడు తనసహచరి సీతతో, లక్ష్మణుని కలుపుకుని దండకారణ్యంలోకి ప్రవేశించాడు. నేటి దండకారణ్యమే ఆనాటిది కూడా. ఆ దండకారణ్యంలోకి రాముడు ఎందుకు ప్రవేశిస్తాడు. ఆరాజ్యం రాముడిది కాదు.
పరాయి రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించే అర్హత మరో రాజుకు ఉంటుందా? ఇది రాజనీతి అవుతుందా? మూల వాసీ చక్రవర్తి రావణుడు ఆ రాజ్యాధిపతి. అందుకు ఈ శ్లోకమే నిర్ధారణ. ”తేన తత్రైవ వసతా జనస్థాన వాసినీ” (బాలకాండ 1వ సర్గ 46వ శ్లోకం) దండకారణ్యంలో జనస్థానమనే ప్రాంతం ఉంది. అది రావణుని రాజ్యంలో భాగం.
ఆ రాజ్యానికి శూర్పణఖ రక్షకాధిపతి. ఆ ప్రాంతంలో ఆర్యులు అక్రమంగా ఆశ్రమాల నెపంతో దురాక్రమణ చేస్తుంటే సహజంగానే శూర్పణఖ వారిని తరిమి కొడుతుంది. ఇది ఏరాజైనా, రాణైనా చేసే రాజనీతి. ఆర్యులు వెంటనే దండకారణ్య సమీపంలోని రామున్ని దర్శించారు. రెచ్చగొట్టారు. రాముడు దండకార్యాన్ని ఆక్రమించి ఆ ప్రాంతం నుండి రక్షసులను (రాక్షసులనేది వారి భాష) ఆ ప్రాంతం నుండి తరిమి వేస్తానని ప్రతినబూనాడు. దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అంతే సహజంగా రక్షసులు వీరి ప్రవేశాన్ని ఎదిరించారు. వరుసగా అడ్డుకున్నవారందరిని హతమార్చాడు రాముడు. క్రూరాతిక్రూరంగా రాజనీతికి, యుద్ధ నీతికి వ్యతిరేకంగా ఈ హింసాకాండ జరుగుతున్న తీరుకు సీత చలించిపోయింది. ఎంతైనా తల్లి హృదయం కదా! ఆమె, రాముణ్ణి నివారించే ప్రయత్నం చేసింది. అకారణంగా ఈ అటవీ రక్షకులను సంహరించడం అన్యాయం అని అర్దించింది. ఈ సందర్భంలో సీతామాత పలికిన దయార్ద్ర వచనములు రామునికి చెవికెక్కలేదు. ”ప్రతిజ్ఞా తస్త్వయా, వీర! దండకారణ్య వాసినామ్/ ఋషీణాం రక్షణార్ధాయా వధస్సంయతి రక్షసామ్” ఇది దండకారణ్యమ్ ఇది వారి నివాస స్థలం (రాక్షసులు). వారు ఇక్కడ నివసించడమే ధర్మం. వారి ప్రాంతంలోనికి అనధికారికంగా ప్రవేశించి వారినే సంహరించడం అధర్మం. ఏ వైర భావం లేకున్నను వీరిని హతమార్చుట తగునా? అని ప్రశ్నించడమే పై శ్లోకం. సీత మరింత లోతుగా న్యాయాన్యాయ వివేచన, ధర్మాధర్మ ఆచరణ నిబద్దతను స్పృశించింది. ”క్వచ శస్త్రం క్వచ వనం క్వచక్షాత్రం తప: క్వచ/ వ్యావిద్దమిదమ స్మాభి: దేశ ధర్మస్తు పూజ్యతామ్” (అరణ్యకాండ తొమ్మిదో సర్గ 27వ శ్లోకం). అంటే మనమిప్పుడు వనవాసంలో ఉన్నాం. వన జీవన ధర్మమగు తప: వృత్తిని ఆచరించాలి. అలా కాక అస్త్రము ధరించి ఇలా హత్యా కాండకు పూనుకొనడం సరికాదు. శస్త్రదారణమెక్కడీ వనవాసమెక్కడీ క్షత్రియ ధర్మమెక్కడీ తపో వృత్తి యెక్కడీ ఇవి పరస్పర విరుద్దములు. కావాలంటే అయోధ్య చేరిన తరువాత వనవాసం ముగిసిన వెంటనే మీ క్షత్రియ ధర్మమైన యుద్దాన్ని కొనసాగించండి అంటూ మరోసారి ధర్మ పరిశీలన చేసింది.
ఈ మాటలు రాముడికి వంటబట్టలేదు. బ్రాహ్మణులకు మాట యిచ్చాను. ఏదిఏమైనా ఈ రాక్షసులను హతమార్చి తీరుతాను అంటూ ఆమె నోరు మూయించాడు. దండకారణ్య ప్రవేశాన్ని వ్యతిరేకించినందుకే రాముడు, శూర్పణఖ ముక్కు, చెవులు కోయించాడు. కామరూపత అనేది వట్టి శాకు. పిచ్చికుక్కను చేసి చంపే కుట్ర ఇందులో దాగి ఉంది. అంతేకాదు ఆ దండకారణ్య సైనాన్ని శ్రీరాముడు ఊచకోత కోశాడు.
(బాలకాండ 1వ సర్గ శ్లోకం 48) ”వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినామ్ / రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్ధశ”. అనగా ఖరుడు, ధూషణుడు, త్రిశరుడు మొ|| వీర యోధులను దాదాపు 14 వేల మంది సైనాన్ని హతమార్చారు రామ లక్ష్మణులు. అక్రమంగా తమ రాజ్యంలోనికి ప్రవేశించి తమ సోదరి ముక్కు చెవులు కోసి 14 వేల మంది తమ సైన్యాన్ని నెత్తుటి యేరులో ముంచి నరమేదం సృష్టించినా రావణుడికి కోపం రాకూడదా? ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆ దేశం చేస్తున్న కవ్వింపు చర్యలే ఆనాటి ఆర్యులు చేసిన ఉదంతం ఇది. కాదంటారా నరసింహారావు తత్వ వివేచకా?! దీన్ని మాబోటి శూద్రులు ఏ దృష్టితో పారాయణం చేయమంటారు? ఈ నరమేధాన్ని ఎలా అర్ధం చేసుకోమంటారు? తప్పొప్పులను ఏ మర్మాలతో అంచనా కట్టమంటారు.
దీనికి కారణం ఏ వాల్మీక దృక్ఫధం నిర్వచిస్తుంది. చివరగా వాల్మీకి బోయవాడా? కాదా? తేల్చేందుకు నరసింహారావు ఒక కథను ఉటంకించారు. అందులో ఋషులకు ఎదురైన వాల్మీకిని నీచ బ్రాహ్మణుడా? అంటూ సంభోదిస్తారు. బోయవాని వేషంలో ఉన్న వాల్మీకిని బోయవాడా అని సంబోధించక బ్రాహ్మణుడా అని సంబోధించడంలోని మర్మమేమంటారు జ్వాలాగారు? ఇకనైనా చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని శూద్రాతి శూద్రులకు ఈ ఆర్య గ్రంధాలు చేసిన అపరాదాన్ని నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాలి. ఈ గ్రంధాల్లోని కుట్రలను గ్రహించి బహుజనులు ఏకమై రాజ్యాధికారం దిశగా సాగాలి. ఇదే పరిష్కారం.
డాక్టర్ కదిరె కృష్ణ పేస్ బుక్ పోస్టు సౌజన్యంతో