Tags

, , , ,

Image result for trade war

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ పౌరుల ఆకాంక్షలకు విరుద్దంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రలో అతిపెద్ద ప్రపంచ వాణిజ్య యుద్ధం ప్రారంభసూచికగా జూలై ఆరవతేదీ అర్ధరాత్రి చైనా మీద తొలి తూటా పేల్చాడు. గతంలో కూడా వాణిజ్య యుద్ధాలు జరిగినప్పటికీ తాజా పరిణామం పర్యవసానాలు తీవ్రంగా వుంటాయనే అభిప్రాయాలు, భయాలు వెలువడుతున్నాయి. చైనా, ఇతర దేశాల మీద ప్రారంభించిన యుద్ధంతోతాము ఎంతో కొంత లాభపడవచ్చనే ఆశ అమెరికన్‌ కార్పొరేట్లలో అంతర్గతంగా వుంది. అయితే అదే సమయంలో జరిగే నష్టాల గురించి కూడా అంతే భయపడుతున్నా. లాభాల గురించి బహిరంగంగా చెప్పుకోలేరు, ఇదే సమయంలో ప్రతికూలతల గురించి మీడియాలో ఎన్నో హెచ్చరికలు వెలువడుతున్నాయి. అమెరికా దిగుమతులపై విధించిన పన్నుద్వారా వసూలయ్యే మొత్తాన్ని అమెరికా ఆంక్షలతో ప్రభావితమయ్యే చైనా కంపెనీలు, కార్మికుల కోసం వినియోగిస్తామని చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. అమెరికా-చైనా రెండూ కూడా దీర్ఘకాల వాణిజ్య యుద్ధానికి సిద్దపడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా వుత్పత్తులపై అదనపు పన్ను వసూలు ప్రారంభించిన చైనా మరోవైపు గతంలో నిలిపివేసిన తమ కోడి మాంస దిగుతులకు అనుమతించినట్లు జర్మనీ మంత్రి ప్రకటించారు.

వాణిజ్య యుద్ధాలను, వాటిలో భాగంగా దిగుమతి పన్నులను విధించేందుకు అధ్యక్షుడికి వున్న అధికారాలను పరిమితం చేయాలని నేషనల్‌ టాక్స్‌ పేయర్స్‌ ఫౌండేషన్‌ విశ్లేషకుడు ఆండ్రూ విల్‌ఫోర్డ్‌ ‘యుఎస్‌ఏ టుడే’లో పేర్కొన్నాడు. దాని సారాంశం ఇలా వుంది. 1962లో చేసిన వ్యాపార విస్తరణ చట్టంలోని అవకాశాలను ట్రంప్‌ వినియోగిస్తున్నాడు. నిర్దిష్ట జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వాటికోసం చేసిన చట్టాలను దుర్వినియోగపరుస్తూ దేశ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందున, పార్లమెంట్‌ జోక్యం చేసుకొని అధ్య క్షుడిని నిలువరించాలి. అల్యూమినియం, వుక్కు దిగుమతుల ద్వారా దేశభద్రతకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే 2010-15 మధ్య దేశీయంగా వుత్పత్తి అయిన వుక్కులో కేవలం సగటున మూడుశాతం లోపే జాతీయ భద్రతకు వినియోగిస్తున్నట్లు తేలింది, అవసరానికి మించి దేశంలో వుత్పత్తి వుంది, అదే విధంగా దిగుమతి చేసుకున్న వుక్కులో జాతీయ భద్రతకు వినియోగిస్తున్నది సగటున 2.4నుంచి 2.8శాతం మధ్యనే వుంది, ఆ దిగుమతులలో కూడా అత్యధిక భాగం భాగస్వామ్య లేదా మిత్ర దేశాల నుంచే వున్నాయి. వుక్కు పరిశ్రమలో వుపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఐదు పెద్ద కంపెనీలు మార్కెట్‌ కాపిటలైజేషన్‌ను రెట్టింపు చేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వుత్పాదకత గణనీయంగా పెరిగింది.అల్యూమినియం, వుక్కు దిగుమతులపై పన్నుల విధింపు కారణంగా నిఖరంగా 4.7లక్షల వుద్యోగాలు పోతాయి. ఇవి అమెరికా వుక్కు పరిశ్రమలో పని చేస్తున్న లక్షా 40వేల మందికి మూడు రెట్లు. బలమైన ఆర్ధిక వ్యవస్ధ లేకుండా బలమైన జాతీయ భద్రత సాధ్యం కాదని వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ స్వయంగా చెప్పాడు. పన్నుల విధింపు తగదని వంద మంది రిపబ్లికన్‌ ఎంపీలు లేఖ రాశారు. ట్రంప్‌ వినియోగిస్తున్న చట్టంలోని నిబంధనను 1979,82 సంవత్సరాలలో ఇరాన్‌, లిబియా చమురు దిగుమతుల నిరోధానికి వినియోగించారు.

రక్షణాత్మక చర్యలను చేపట్టబోయే ముందు వస్తువుల నిజమైన జాతీయత ఏమిటో తెలుసుకోవాలని లాసానే విశ్వవిద్యాలయ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ స్టెఫానే గారెలీ హితవు చెప్పాడు. ఆయన వాదన ఇలా వుంది. ప్రపంచీకరణ యుగంలో వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం అంత సులభం కాదు. కొద్ది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా, లాస్‌ ఏంజల్స్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఒక ఐపాడ్‌లోని 431భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు.ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చిన ఆ భాగాలను చైనాలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఐపాడ్‌గా రూపొందిస్తారు. అంతిమ వుత్పత్తిపై చైనా జోడించే విలువ ఐదుశాతం మించటం లేదు. అయితే అమెరికా కస్టమ్స్‌ శాఖ వద్దకు వచ్చే సరికి అది చైనా తయారీ వుత్పత్తిగా పరిగణించబడుతోంది. అది నిజంగా చైనా వుత్పత్తా ? అమెరికా వాణిజ్యలోటు అది చేసుకొనే దిగుమతుల కారణంగా ఏర్పడుతోంది. మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే వాటిలో 40శాతం మెక్సికోలోని అమెరికన్‌ కంపెనీలు లేదా అమెరికాకు మాత్రమే ఎగుమతి చేసే మెక్సికో స్ధానిక కంపెనీల నుంచి వుంటున్నాయి. చైనా నుంచి చేసుకొనే దిగుమతులు కూడా అలాంటివే. వాణిజ్య వ్యూహాలలో భాగంగా స్మార్ట్‌ ఫోన్ల తయారీకి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వుచితంగా సాప్ట్‌వేర్‌ను అందచేస్తున్నది. దానికి గనుక ధర నిర్ణయిస్తే ఏడాదికి రెండువందల బిలియన్‌ డాలర్లు వుంటుంది. ఆ మొత్తం అమెరికా వాణిజ్యలోటులో సగం.

వాణిజ్యం యుద్ధం విస్తరిస్తే అమెరికా అధ్య క్షుడు జర్మన్‌ ఆటో పరిశ్రమకు కూడా ముప్పు తెస్తున్నట్లే. బిఎండబ్ల్యు సౌత్‌ కరోలినా లోని స్పార్టన్‌బర్గ్‌, అలబామాలోని వాన్స్‌లో మెర్సిడెస్‌, టెనెసీలోని ఛాటూంగాలో ఓక్స్‌వాగన్‌ కార్లు తయారవుతాయి. ఇవి ఎగుమతుల కోసం కూడా తయారు చేస్తాయి. గతేడాది బిఎండబ్ల్యు తయారు చేసిన వాటిలో 70శాతం ఎగుమతి చేశారు. వీటిని అమెరికన్‌ కార్లు అనాలా జర్మనీవి అనాలా ? వాణిజ్య యుద్ధానికి ముందు అమెరికా తయారీ కార్లపై చైనా దిగుమతి పన్ను తగ్గించిన కారణంగా ఫోర్డ్‌, టెల్సా వంటి కంపెనీలు కొద్దివారాల ముందు చైనాలో పదిహేనుశాతం వరకు కార్లధరలను తగ్గించాయి. అమెరికా ప్రారంభించిన యుద్ధంతో చైనా విధించిన ప్రతికూల సుంకాల కారణంగా ఇప్పుడు 40శాతం పన్నుతో ధరలు పెరిగాయి. ఈ పన్నులను వినియోగదారుల నుంచి వసూలు చేయటం తప్ప తాము భరించలేమని బిఎండబ్ల్యు చైనా ప్రకటించింది.1974 నుంచి అమలులోకి వచ్చిన కొయొటో ఒప్పందం ప్రకారం ఒక వస్తువు తయారీలో కనీసంగా స్ధానిక అంశం ఎంత వుంది లేదా చివరి తయారీ క్రమం పాత్ర ఎంత అనేది నిర్ధారించవచ్చు. అయితే ప్రపంచీకరణ మరియు డిజిటలైజేషన్‌ సంక్లిష్టతను పెంచాయి. వివిధ విడిభాగాలతో తయారైన ఒక వస్తువులు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఆయాప్రాంతాల సామర్ధ్యం, ధరలను బట్టి మారిపోతుంటాయి.

ప్రపంచీకరణ కారణంగా ఒక ఆర్ధిక వ్యవస్ధను వేరు చేసి చూడటం కష్టం అనే విషయాన్ని బ్రెక్సిట్‌ మద్దతుదారుల మాదిరి అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. ఇతర దేశాలలో అమెరికా ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది, అలాగే ఇతర దేశాలు అమెరికాలో ఏడులక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. మొత్తం మీద ప్రపంచ జిడిపిలో ప్రత్యక్ష పెట్టుబడులు 35శాతం వరకు వుంటాయి. ఎనిమిది కోట్ల మందికి వుపాధి కల్పిస్తున్నాయి. ప్రయివేటు జీవితంలో వివాహం చేసుకోవటం కంటే విడిపోవటం ఎంతో సంక్లిష్టం, ఖరీదైనది. అంతర్జాతీయ వాణిజ్యం మీద చూపే ప్రభావాన్ని స్పష్టంగా చూడాలంటే కస్టమ్స్‌ లెక్కల నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేదానికంటే ఒక వస్తువు వుత్పత్తిలో విలువ జోడింపు మీద కేంద్రీకరించాలి. బ్లాక్‌ చెయిన్‌ ద్వారా నమోదయ్యే లావాదేవీల ద్వారా వికేంద్రీకరణ చెందిన మరియు నిరాకార ప్రపంచంలో ఎవరు దేనికి యజమానులో ఎలా చెప్పగలం? జాన్‌మైేునార్డ్‌ కీన్స్‌ చెప్పినట్లు సమస్యలన్నీ ఆర్ధిక పరమైనవి అయితే పరిష్కారాలన్నీ రాజకీయ పరమైనవి అయినందున ట్రంప్‌తో మనం జీవించాల్సి వుంది.

వాణిజ్య యుద్ధం జరిగితే నష్టపోయేది అమెరికా అని గతంలో బిల్‌క్లింటన్‌ హయాంలో సహాయ విత్తమంత్రిగా చేసిన ప్రొఫెసర్‌ జె బ్రాడ్‌ఫోర్డ్‌ డెలాంగ్‌ స్పష్టం చేశారు. మోటార్‌ సైకిళ్ల తయారీలో పేరెన్నికగన్న హార్లే డేవిడ్స్‌న్‌పై ఇటీవల డోనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడటం అమెరికా ప్రజాస్వామ్యం మీదే దాడి వంటిదని, నవంబరులో జరిగే ఎన్నికలలో వుభయ సభలలో ఒకదానిలో అయినా మెజారిటీ సంపాదించగలిగితే తప్ప ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టకు చేసిన నష్టాన్ని సరిచేయలేమని అన్నారు. బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో హార్లే డేవిడ్స్‌న్‌ అధికారులు, యూనియన్‌ నేతలతో ట్రంప్‌ ఒక సమావేశం జరిపారు. ఈ కంపెనీ అమెరికాలో వస్తువులను తయారు చేస్తున్నది, నేను చూస్తుండగానే దాన్ని విస్తరించాలని చెప్పాడు. ఏడాది తిరగ్గానే పరిస్ధితులు మారిపోయాయి. దిగుమతి చేసుకున్న అల్యూమినియం, వుక్కుపై పన్నులు విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన కారణంగా ఐరోపా యూనియన్‌ ప్రతికూల చర్యలకు గురికాని ప్రాంతాలకు కొన్ని కార్యకలాపాలను తరలిస్తామని మోటార్‌ సైకిల్‌ కంపెనీ ప్రకటించింది. దాన్ని చూడగానే ట్రంప్‌ ఆ కంపెనీ మీద దాడి చేశాడు. ఒకసారి బయటకు పోయిన తరువాత తిరిగి అమెరికాలో పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా అమ్ముతామంటే కుదరదు అని హెచ్చరించాడు. వారు మరొక దేశంలో ఫ్యాక్టరీ నిర్మించటానికి వీల్లేదంటే వీల్లేదు, వారు ఇక్కడి నుంచి తరలటం అంటే అంతానికి ఆరంభం అని ట్వీట్లలో వాగాడు.

వాణిజ్య యుద్ధం తధ్యమనే అభిప్రాయంతో చైనాలోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలించేందుకు ఆలోచన చేశాయి, ఇంకా చేస్తున్నాయి. అక్కడ పెరుగుతున్న వేతనాలతో అనేక కంపెనీలు ఎప్పటి నుంచో తక్కువ వేతనాలకు శ్రమ దొరికే చోటికి తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్యంలో చైనాకు ఎంతో మిగులున్న కారణంగా చైనాను లంగదీసుకోవచ్చనే అభిప్రాయం కొంత మందిలో లేకపోలేదు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐదువందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల మీద పన్ను విధిస్తానంటున్నాడు ట్రంప్‌, దానికి పోటీగా చైనా ఎంతపన్ను విధించినా 130 బిలియన్‌ డాలర్ల మేరకే దాని దిగుమతులున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు మంచివి, విజయం సాధించటం సులభం అని ట్రంప్‌ చెప్పారు, వాస్తవం ఏమంటే వాటిలో పాల్గనేవారే కాదు వాణిజ్య యుద్ధాలు ప్రతి ఒక్కరినీ నష్టపరుస్తాయి, ఎవరూ గెలవజాలరని ఆస్ట్రేలియా సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రికలో ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒక వేళ విజయం సాధించినా అది పరిమితం. ట్రంప్‌ తన కలలను నిజం చేసుకోవాలంటే చైనా లేదా ఐరోపా యూనియన్‌ అందచేసే వస్తువులను స్ధానికంగా తయారుచేసేందుకు మరిన్ని ఫ్యాక్టరీలను పెట్టాలి, వాటిద్వారా మరిన్ని వుద్యోగాలను కల్పించవచ్చు. అయితే అలా తయారు చేసే వస్తువులు ఎంతో ప్రియమైనవిగా పరిమితంగా వుంటాయి.

వాణిజ్యయుద్ధ తుపాకి గుండు పేల్చాలన్న నిర్ణయం దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఒక్క చైనాకే పరిమితం చేయలేదు, కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద కూడా పన్నులు విధించాడు. అదే జరిగితే అమెరికా దిగుమతి చేసుకొనే 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై కూడా ఐరోపా యూనియన్‌ పన్నులు విధిస్తుంది. ప్రభావాలు, అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి. ఐరోపా యూనియన్‌, ఇతర అమెరికా మిత్రదేశాలకు చైనాతో స్వంత సమస్యలు వున్నాయి. ట్రంప్‌ గనుక వాణిజ్యదాడిని ఒక్క చైనాకే పరిమితం చేసి వుంటే వారంతా కలసి వచ్చేవారు. దానికి బదులుగా ఐరోపా యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, కెనడా, మెక్సికోలపై చర్యల ద్వారా అమెరికాను ఒంటరిపాటు చేశాడని ఆస్ట్రేలియా పత్రిక పేర్కొన్నది.

తొలి దఫా పన్నుల అర్ధం వాణిజ్య యుద్ధ పూర్తి స్ధాయి ప్రభావం ఎలా వుంటుందో అనుభవించటానికి అమెరికన్‌ వినియోగదారులు ఒక అడుగు దగ్గర కావటమే అని నేషనల్‌ రిటైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాథ్యూ సాహే అన్నారు. విధించే పన్నులు అమెరికా వుద్యోగాలనేమాత్రం కాపాడలేవు, కానీ అవి పన్నుల సంస్కరణద్వారా పొందిన లబ్దిని దెబ్బతీస్తాయి, అనేక వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి, తమ గదులకు అవసరమైన చిన్న ఫ్రిజ్‌లకు విద్యార్ధులు అధిక మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది, ఏకపక్షంగా పన్నులు విధించటం తప్పుడు పద్దతి, దానిని వెంటనే నిలిపివేయాలి అని కూడా సాహే చెప్పారు.

ఇరవై లక్షల కోట్ల పెద్ద అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే వాణిజ్య యుద్ధం, దానిలో 34బిలియన్‌ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించటం సముద్రంలో కాకిరెట్ట వంటిదని, దీని వలన కొంత మంది నష్టపోతారు, కొందరు లాభపడతారు అని ఓక్స్‌ డాట్‌కామ్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. చట్టపరంగా చెప్పాలంటే 34బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై 25శాతం పన్ను విధింపు అక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్న చైనాను శిక్షించటమే. ట్రంప్‌ వాక్పటిమలో 300బిలియన్‌ డాలర్లపై పన్ను విధిస్తామని చెప్పాడు. ఇరవైలక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ కలిగిన అమెరికాకు గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న 478బిలియన్‌ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ. మరో విధంగా చెప్పాలంటే 2017లో ఏడాదికి 150 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న పార్లమెంట్‌ తీర్మానంతో పోలిస్తే 25శాతం పన్ను విధింపుద్వారా ఏడాదికి వచ్చే 8.5బిలియన్‌ డాలర్లు ఏపాటి? వాషింగ్‌మెషిన్ల పరిశ్రమకు పన్నుల మొత్తం పెద్దగా వుండవచ్చుగాని ఒక మిషన్‌ కొనే పౌరుడికి పెద్ద భారం అనిపించదు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సమాచారం ప్రకారం 1977 తరువాత తొలిసారిగా జనవరిలో పన్నులు పెంచిన కారణంగా మార్చినెల నుంచి వాషింగ్‌ మెషిన్ల ధరలు 16శాతం పెరిగాయి. పౌరులు వాటిని రోజూ కొనరు కదా ! అయినప్పటికీ 2015లో వున్న ధరలకంటే ఇప్పుడు చౌకగానే వున్నాయి. అనేక పరికరాల ధరలు గత కొద్ది సంవత్సరాలుగా పడిపోతున్నాయి, ట్రంప్‌ వాటిని కొద్దిగా పెంచారు. దాని కధనం ఇలా సాగింది.

Image result for trade war

వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో ధరలు పెరిగి, అభివృద్ధి దిగజారుతుందని ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో పేర్కొన్నది.తొలుత 34 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై విధించిన 25శాతం పన్నుతో అటు చైనా, ఇటు అమెరికాపై ఆర్ధికంగా పెద్దగా ప్రభావం చూపదు. నష్టం తరువాత పెరుగుతుంది. గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 506బిలియన్‌ డాలర్లు కాగా అవసరమైతే తాను 550 బిలియన్‌ డాలర్ల వస్తువులపై పన్ను విధిస్తానని ట్రంప్‌ పేర్కొన్నాడు. పన్నులను విస్తరించే కొద్దీ వినియోగదారులకు ధరలు పెరుగుతాయి, దిగుమతి చేసుకొనే విడిభాగాలపై ఆధారపడిన కంపెనీల ఖర్చు పెరుగుతుంది.ద్రవ్యమార్కెట్‌లు దడదడలాడతాయి.కొంత మందిని లేఆఫ్‌ చేయవచ్చు, చైనాతో ట్రంపేమైనా రాజీకి వస్తారా అని వాణిజ్యపెట్టుబడులపై నిర్ణయం తీసుకొనేందుకు వేచి చూస్తారు. గతేడాది పన్నుల తగ్గింపు ద్వారా కల్పించిన అనేక ఆర్ధిక లబ్దులు ప్రమాదంలో పడతాయి. పూర్తి స్ధాయి వాణిజ్య యుద్దం జరిగితే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇతరులు హెచ్చరించినట్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయే ప్రమాదముంది. అమెరికా సోయాలో 60శాతం దిగుమతి చేసుకుంటున్న చైనా హెచ్చరిక కారణంగా గత నెలలో 17శాతం మేరకు ధరలు పడిపోయాయి. ఇదే సమయంలో చైనా కరెన్సీ విలువ డాలరు మారకంతో గతనెలలో 3.5శాతం పడిపోయింది. ఇది అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి చైనా కంపెనీలకు వూతమిస్తుంది. అమెరికా వినియోగదారుల మీద ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం చైనా పారిశ్రామిక వస్తువుల మీదనే తొలుత కేంద్రీకరించింది. అయితే ఆ చర్య ద్వారా కంపెనీల యంత్రాల ధరలు పెరిగితే ఆ భారాన్ని అవి చివరికి తమఖాతాదారులు, వినియోగదారులమీదనే మోపుతాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది.

అమెరికా-చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు కలిగించవచ్చని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్ధికవేత్త పాల్‌ గ్రుయెన్‌వాల్‌ హెచ్చరించాడు. వర్ధమాన దేశాల మార్కెట్లనుంచి మంచి వడ్డీ రేట్లు వస్తున్న అమెరికాకు మదుపుదార్లు తమ పెట్టుబడులను తరలిస్తున్నారని, మిగతా ఆసియా దేశాలతో పోల్చితే ఇండోనేషియా, భారత్‌లకు ఎక్కువ ముప్పు వుందన్నాడు.పతనమౌతున్న ఇండోనేషియా కరెన్సీ రుపయా విలువ నిలబెట్టేందుకు, స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడుల వుపసంహరణను నివారించేందుకు మే, జూన్‌ నెలల్లో వడ్డీ రేట్లను పెంచింది. పెట్టుబడులరాక మందగించటం, వున్న పెట్టుబడులు బయటకు పోతుండటంతో భారత్‌ కూడా నాలుగేండ్లలో తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. క్రమంగా పెరుగుతున్న వేతనాలు ఆర్ధిక వ్యవస్ధపై విశ్వాసాన్ని కలిగిస్తూ చైనా ఆర్ధిక పురోగతిని కొనసాగిస్తున్నాయి, అది బ్యాంకింగ్‌ వ్యవస్ధలో డబ్బును మదుపు చేయటానికి జనాన్ని ప్రోత్సహిస్తున్నది, ఆ సొమ్మును కంపెనీలకు రుణాలుగా ఇస్తున్నారని, ఈ వలయం తిరుగుతున్నంత వరకు బయటకు పోయే అవకాశం లేదు, తరువాత ఆ విధానం కొనసాగుతుంది, ఒక వేళ విశ్వాసం కోల్పోయినట్లయితే కరెన్సీ మారకపు విలువమీద, విదేశీమారపు నిల్వల మీద వత్తిడి పెరుగుతుందని గ్రుయెన్‌వాల్‌ పేర్కొన్నాడు.

వాణిజ్య యుద్ధం ప్రారంభమై ఇంకా వారం కూడా గడవ లేదు. దాని ప్రభావం గురించి ప్రారంభానికి ముందూ వెనుకూ ఎలా వున్నాయో చూశాము. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు, ప్రభావాలు వెల్లడవుతాయి.