ఎం కోటేశ్వరరావు
విదేశీ పర్యటనల సమయంలో లేదా విదేశీ అతిధులు మన దేశాన్ని సందర్శించినపుడు మన ప్రధాని నరేంద్రమోడీ అందచేసే బహుమతుల గురించి ఒక పెద్ద పరిశోధనే చేయవచ్చునంటే అతిశయోక్తి కాదు. ఆయన రూటే వేరు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ఆవులతో కూడా దౌత్యనీతిని ప్రదర్శించవచ్చని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన రాజనీతిజ్ఞుడిగా కూడా చరిత్రకెక్కారు. దేశంలో మోడీ మాతృసంస్ధ సంఘపరివార్, దాని అనుబంధ రాజకీయ, ఇతర సంస్ధల కార్యకర్తలందరూ ‘గోరక్షణ కర్తవ్యం పేరుతో’ ముస్లింలపై మూకదాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. గోరక్షణకు కంకణం కట్టుకున్నానని నమ్మబలుకుతున్న నరేంద్రమోడీ దేశ ప్రజల అదృష్టం లేదా ఖర్మకొద్దీ ప్రధానిగా వున్నందున ప్రస్తుతానికి గోరక్షణ కార్యక్రమాలలో పాల్గనే అవకాశాలు లేవు. విదేశీ అతిధులు మన దేశానికి వచ్చినా, నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు జరిపినా పురుష నేతల భుజాలపై చేతులు వేయటం లేదా కౌగలించుకొని ఎంతో ఆత్మీయతను ప్రదర్శించటం తెలిసిందే. బ్రిక్స్ సమావేశంలో పాల్గనేందుకు దక్షిణాఫ్రికా వెళుతూ దానితో పాటు కోటీ 20లక్షల జనాభా వున్న ర్వాండా అనే దేశాన్ని సందర్శించిన మోడీ అక్కడి వారికి 200 ఆవులను బహుమతిగా ఇచ్చి ఇటు జాతీయంగా ప్రతిపక్షాల వారిని అటు అంతర్జాతీయంగా తామే తిరుగులేని తలపండిన పెద్ద దౌత్యవేత్తలమని విర్రవీగుతున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పకతప్పదు. ర్వాండా అధ్యక్షుడికి గోవుల పంపిణీ ఇష్టమని మనసెరిగి గోపాలుడి అవతారమెత్తిన నరేంద్రమోడీ ఒక గ్రామానికి ప్రత్యేకంగా వెళ్లి కార్యక్రమంలో పాల్గని ఆ దేశాధ్యక్షుడిని పడేశారు.
మోడీ ప్రయాణించే విమానంలో మన దేశం నుంచి గోవులను రవాణా చేయటం కుదరదు, ఇక్కడి హిందూ గోమాతలు ఆఫ్రికా వాతావరణానికి సరిపడతాయో లేదో తెలియదు, అన్నింటికీ మించి అక్కడి క్రైస్తవ, ముస్లిం ఆచార వ్యవహారాలతో సరిపడక వాటి మనోభావాలు దెబ్బతినవచ్చు. సంకరంతో వ్రతం చెడవచ్చు. అందువలన ఎవరి మనోభావాలకు దెబ్బతగుల కుండా స్ధానికంగా దొరికే మెజారిటీ క్రైస్తవ గోమాతలనే కొనుగోలు చేయించి వాటిని అక్కడి వారికి బహుమతిగా ఇచ్చి ర్వాండాతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నించారు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్రకెక్కారు.
ర్వాండా పేదల సంక్షేమ పధకాలలో భాగంగా గిరింకా పేరుతో అధ్యక్షుడు పాల్ కగామే ఆవుల పంపిణీ పధకం చేపట్టినట్లు మోడీ సర్కార్ తెలుసుకుంది. అందువలన దానికి సంబంధించిన బహుమతి ఇచ్చి అక్కడి ప్రభుత్వాన్ని ఆకట్టుకోవచ్చని మోడీ సలహాదారులు భావించి వుండాలి.ఆవుల పంపిణీ కార్యక్రమంపై ర్వాండా అధ్యక్షుకి స్వయంగా ఆసక్తి వున్నందున దానిలో మన దేశం కూడా భాగస్వామి కావటం ప్రాముఖ్యత సంతరించుకుందని విదేశీ వ్యవహారాల ఆర్ధిక సంబంధాల కార్యదర్శి టిఎస్ తిరుమూర్తి విలేకర్లతో స్వయంగా చెప్పారు. దాని ఫలితమే ఆవుల బహుమతి. ర్వాండాతో సోదర, సౌహార్ధ్ర సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
గిరింకా పధకం ప్రకారం ప్రభుత్వం పేదలకు ఆవులను బహుమతిగా ఇస్తుంది. వాటిని పొందిన వారు సదరు ఆవులకు పెయ్య దూడలు పుడితే వాటిని పొరుగు పేదలకు బహుమతిగా ఇవ్వాలి. ఇలా మూడున్నరలక్షల ఆవులను పంపిణీ చేయాలని అధ్యక్షుడు నిర్ణయించాడు. ఆవుల పధకంతో కుటుంబాలకు అవసరమైన పాలతో పాటు వ్యవసాయానికి కావాల్సిన ఎరువు సమకూరుతుంది, వట్టిపోయిన తరువాత ఆవులను, కోడెదూడలను మాంసానికి వినియోగిస్తారు కావున పోషకాహారలేమితో బాధపడుతున్న దేశంలోని పిల్లలకు దానిని సరఫరా చేయాలన్నది ఆ పధక లక్ష్యం. ర్వాండా జనాభాలో అత్యధికులు క్రైస్తవులు. వారి ఆహారంలో గొడ్డు మాంసం ముఖ్యమైనది. మనకు ప్రతి వూరిలో హోటల్‌లో ఇడ్లీ, దోసె దొరికినట్లుగా అక్కడ అది దొరుకుతుంది.
గో గూండాలు మరోమారు విజృంభించి మరొకరి ప్రాణం తీసిన వుదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చిన తరుణంలోనే మోడీ గో దౌత్యం గురించి కూడా ఆ వార్తలతో పాటు దీన్ని చదువుకున్నాం గోవధను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నిషేధించారు, దేశమంతటా అమలు చేయాలని హిందూత్వ శక్తులు పట్టుబడుతున్న తరుణంలో దానికి అనుగుణంగానే గో గూండాలు చెలరేగుతున్నారు. మూక హత్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి దేశానికి అసలు సిసలైన ప్రతినిధిని అని చెప్పుకుంటున్న మోడీ గొడ్డు మాంసం లేనిదే ముద్ద దిగని దేశంలో ఆవులను బహుమతిగా ఇవ్వటంపై గో అభిమానులే పరిహాసాలాడుతున్నారు.కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు అన్నట్లు పేటెంట్ కలిగి వుండకపోయినా గోవుల స్వంతదారుల మాదిరి ప్రవర్తిస్తున్నవారు ఏం చేసినా తప్పులేదని ఎవరైనా వాదించినా ఆశ్చర్యం లేదు.
‘ బుగెసెరాలో ఏర్పాటవుతున్న అతి పెద్ద గోమాంస(పరిశ్రమ) కబేళాకు ప్రేమతో 200 గోవులను బహుమతిగా ఇచ్చిన నరేంద్రమోడీ ‘ అన్నది వాటిలో ఒకటి. పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంలో గోవులు, ఇతర పశుసంపదను పెంచి, వాటి నుంచి మాంసం వుత్పత్తి చేసేందుకు ఒక పెద్ద పరిశ్రమ బుగెసెరా అనే చోట దశలవారీ ఏర్పాటు అవుతున్నది. దానికి దేశాధ్యక్షుడు పాల్ కగామే అనుమతి ఇచ్చారు. ఏటా 1200 గోవులతో ప్రారంభమై 2018నాటికి మూడువేల స్ధాయికి పెంచనున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఒక్కో ఆవు నుంచి 160కిలోల మాంసం తయారవుతుంది. దేశం మొత్తంలో 2015లో 86వేల టన్నులుగా వున్న వుత్పత్తిని 2018 నాటికి 2,30,000 టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పశువును 120 రోజులు బాగా మేపి తరువాత కబేళాకు తరలిస్తారు. గో మాంస ఎగుమతులకు బుగెసెరాలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా వినియోగించుకుంటారు. గోవులను పెంచేందుకు, కబేళాల ఏర్పాటుకు ప్రభుత్వమే భూములను కౌలుకు ఇస్తుంది.
‘ మోడీ ర్వాండాకు 200 గోవులను బహుమతిగా ఇవ్వటం కొంత గందరగోళం కలిగిస్తోంది. ఆ దేశంలో ప్రతి చోటా ఆవులు వుండాలని ఆరు కోరుకుంటారు, ప్రత్యేకించి భోజన బల్లల మీద, త్వరిత గతిన దూకే గోరక్షక దళాన్ని ఏర్పాటు చేయాల్సి రావచ్చు, వారిని తెల్లవారే సరికి పారా చూట్ల ద్వారా దించటాన్ని నేను చూడగలను’
‘ గోరక్షకులందరికీ సామూహిక అప్రమత్త సందేశం, ర్వాండాలో ఈ ఆవులను రక్షించేందుకు దయచేసి వెళ్లండి, వెళ్లండి, ఇప్పుడే వెళ్లండి’ ‘ ర్వాండాకు రెండువందల ఆవులను తరలిస్తున్న స్మగ్లర్ కనిపించాడు.’ ‘ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు ఆవులను తరలిస్తున్న ఒక వ్యక్తిని వధించారు, మరొక వ్యక్తి 200 ఆవులను భారత్ నుంచి ర్వాండాకు తరలిస్తున్నట్లు నేను ఇప్పుడే విన్నాను. అయితే అతనికేమీ కాకూడదని ఆశిస్తున్నాను, అతని కోసం నేను ప్రార్ధిస్తాను.’ ‘200 ఆవులను ర్వాండాకు స్మగ్లింగ్ చేస్తున్నందుకు యునెస్కో మోడీకి అతి పెద్ద ఆవుల స్మగ్లర్ అనే అవార్డు ఇచ్చింది. వావ్ మోడీ వావ్, ప్రియమైన భక్తులారా మన ప్రధానిని వధించవద్దు, ఎందుకంటే ఆయన భాగీదారు తప్ప చౌకీదారు కాదు ‘
మాంసం కోసం లేత ఆవులు, కోడె దూడలను వధించటం, అతిధులకు దానిని వడ్డించటం ఒక మర్యాదగా మన దేశంలో ఒకప్పుడు విలసిల్లింది. మా మనోభావాలను గాయపరిచారనే పేరుతో పుక్కిటి పురాణ పాత్రలను విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఆవు పేరుతో ఎలాంటి తప్పు చేయని ఒక మనిషిని మూకదాడిలో చంపితే తోటి మనుషుల మనోభావాలు దెబ్బతినకపోగా మరింతగా జరగాలని ప్రోత్సహిస్తున్నవాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇది సామూహిక వున్మాదం తప్ప వ్యక్తిపరమైన సమస్య కాదు.వ్యక్తికి, ఇంటికి పరిమితం చేయాల్సిన దేవుడు, దేవతలను ఓట్లకోసం వీధుల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపుగానే ఆవును గోమాతను, దేవతను చేశారు. ఓట్ల కోసం మన దేశంలో ఆహారం కోసం గోవును వధించకూడదని నానా రాద్దాంతం చేస్తున్న వారు, మరో దేశంలో మార్కెట్, పెట్టుబడుల కోసం పడుతున్న పాట్లలో భాగంగా అక్కడ గోవులను తింటారని, ఆ దేశాధ్యక్షుడికి గోపంపిణీ అంటే ప్రీతి అని తెలిసి గోవులనే బహమతులుగా ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మనోభావాలు ఏమైనట్లు? ప్రతిదానికీ మా మనోభావాలు గాయపడ్డాయంటూ నానా యాగీ చేస్తున్న వారు ఇప్పుడేమంటారు? ఇప్పుడేం చేస్తారు? ప్రాణ, విత్త, మానభంగములందు ఆడి తప్పవచ్చు అని మినహాయింపులిచ్చినట్లుగానే పెట్టుబడిదారులు, వ్యాపారుల లాభాల కోసం వధిస్తారని తెలిసీ నరేంద్రమోడీ గోవులను బహుమతిగా ఇచ్చినపుడు, జీవనోపాధికోసం తప్ప వధించటానికి కాదు మేము గోవులను కొనేదీ అమ్మేదీ అని నెత్తీ నోరు కొట్టుకుంటున్న ముస్లింల గోడును ఆయన అనుయాయులు, మద్దతుదారులు ఎందుకు పట్టించుకోరు? మోడీ మాదిరి మనోభావాలకు అతీతంగా వ్యవహరించలేరా !