Tags

, , ,

Image result for all india radio

ఎం కోటేశ్వరరావు

ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లు అవసరమా అని ఎవరైనా అడిగితే నవతరం అవేమిటి, ఎందుకు అనే ప్రశ్నలు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. వాటికి ఒక్క ముక్కలో అవుననిగానీ లేదనిగానీ చెప్పటం సులభం కాదు. సమస్య అవసరం అని జనం ఎందుకు బలంగా భావించటం లేదు? దేశ స్వాతంత్య్ర ప్రకటన తొలిసారిగా జనం విన్నది ఆలిండియా రేడియో ద్వారానే, జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఏ రోజువి ఆరోజు వినాలంటే రేడియో తప్ప మరొక సాధనం లేదు. పత్రికలు ప్రచురణ కేంద్రాలకు దూరంగా వున్న ప్రాంతాలకు రెండో రోజు మాత్రమే చేరే పరిస్ధితులలో వార్తల కోసం జనం పంచాయతీ ఆఫీసు రేడియో ముందు గుంపులుగా చేరి వినటం, అలాంటి దృశ్యాలను చూడటం నిజంగా ఒక తీపి జ్ఞాపకమే. దూర దర్శన్‌ అందుబాటులోకి వచ్చిన రోజుల్లో నలుపు తెలుసు టీవీలు కొనుగోలు చేసిన ధనికుల ఇండ్లలో చుట్టుపక్కల వారు తిష్టవేయటం కూడా అలాంటిదే. గతంతో పోల్చితే ఇప్పుడు రేడియోలను వింటున్నవారు ఎందరు అన్న ప్రశ్న ఒకటైతే, కేబుల్‌ నెట్‌ వర్క్‌ ద్వారా దూరదర్శన్‌ ఛానల్స్‌ అందుబాటులో వున్నప్పటికీ వాటిని చూస్తున్నవారు చాలా పరిమితం అన్న విషయం తెలిసిందే. ఎందుకిలా అయింది?

ప్రభుత్వ ప్రసార మాధ్యమాలలో పరిమితంగా ప్రతిపక్ష వాణికి చోటు దొరికి నప్పటికీ వాటిని అధికారపక్ష బాకాలుగా మార్చివేయటం మొదటి కారణం. చదువరులు పెరగటంతో ప్రయివేటు పత్రికల ప్రచురణల కేంద్రాలు విస్తరించటం, తెల్లవారే సరికి గ్రామాలకు చేరవేసే ఏర్పాట్లు జరగటంతో రేడియో, దూరదర్శన్‌లను అధికారపక్ష భజన కేంద్రాలుగా మార్చిన విషయం మరింతగా బహిర్గతమైంది, వాటి వార్తలపై ఆసక్తి సన్నగిల్లింది. ప్రయివేటు టీవీ ఛానల్స్‌ వచ్చిన తరువాత రోజంతా వినోద, వార్తా ప్రసారాలతో పాటు మీడియా వార్తల విశ్లేషణలు, సమకాలీన రాజకీయ,ఇతర అంశాలపై అధికార, ఒకింత ఎక్కువగా ప్రతిపక్షవాణికి ప్రాధాన్యత పెరగటం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్ధలను దెబ్బతీస్తున్నట్లుగానే వీటికి కూడా అదే గతి పట్టిస్తున్నట్లు తీరు తెన్నులు వెల్లడిస్తున్నాయి.

ప్రయివేటు మీడియా సంస్ధలతో డబ్బున్న రాజకీయ పార్టీలు, నేతలు పాకేజీలను కుదుర్చుకొని వార్తల ముసుగులో తమ డబ్బా కొట్టించుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న పాలకపార్టీలు ఎలాంటి పాకేజీలు లేకుండానే ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లతో తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ పని చేస్తున్నాయి. భిన్నాభిప్రాయానికి, రెండో పక్షం ఏమి చెబుతోంది అని తెలుసుకోవాలంటే వీటికే పరిమితం అయితే కుదరదు. ఒకప్పుడు దాదాపు నలభైవేల వరకు వున్న సిబ్బందిలో నాలుగోవంతుకు పైగా కుదించారు. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయటం లేదు. కొద్ది రోజులు పోతే కొన్ని విభాగాలు పూర్తిగా ఖాళీ అయి పొరుగుసేవల సిబ్బందితో నిండినా ఆశ్చర్యం లేదు. పని చేస్తున్న సిబ్బంది వుత్సాహాన్ని నీరుగార్చటం, పాతిక, ముఫ్పై సంవత్సరాల నుంచి పని చేస్తున్న వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వపోవటం, కొత్త రక్తాన్ని ఎక్కించకపోవటం, వాటిని కూడా ఆదాయం తెచ్చే సాధనాలుగా పరిగణించి, తగినంత ఆదాయం లేదని పైకి చెప్పకపోయినా గణనీయంగా బడ్జెట్‌ కుదించటం, కొత్త నియామకాలు చేపట్టకపోవటం, వంటి అనేక కారణాలు ఈ సంస్ధలను రోజు రోజుకూ ప్రజల నుంచి మరింతగా దూరం చేస్తున్నాయి. ఈ సంస్ధలలో పని చేస్తున్న వివిధ విభాగాల సిబ్బంది ముఖ్యంగా కార్యక్రమాల విభాగంలోని సిబ్బంది, అధికారులు పోరుబాట పట్టారు. గత కొద్ది రోజులుగా శాంతియుత నిరసనల్లో భాగంగా ప్లకార్డులతో ఆయా సంస్ధల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వుధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Image result for all india radio

వీరి ఆందోళనలో రెండు అంశాలున్నాయి. ఒకటి తమ వుద్యోగాలు, ప్రమోషన్లు, కొత్త నియామకాల డిమాండ్లు ఒకటైతే, సంస్ధల పరిరక్షణ, అభివృద్ధి రెండవది.గత కొద్ది సంవత్సరాలుగా ప్రసార భారతి అధికారుల అనుచిత వైఖరి కారణంగా కార్యక్రమాల సిబ్బందిలో అసంతృప్తి పేరుకుపోతోంది. ప్రోగ్రామ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం నియమావళిని తుంగలో తొక్కి ఖాళీలను పూర్తి చేయకపోవటం ఒకటైతే ఇతర విభాగాల నుంచి కీలకమైన పోస్టులలో అధికారులుగా నియమించటం మరొకటి. ఈ ఏడాది ఏప్రిల్‌ 28నాటికి ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రోగ్రామ్‌ సర్వీసులో మంజూరైన 1,038 పోస్టులకు గాను 1,032 ఖాళీగా వున్నాయని ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. అంటే రిటైర్మెంట్‌, ఇతర కారణాలతో ఖాళీ అయిన వాటిని నింపటం నిలిపివేశారన్నది స్పష్టం. అయితే పని ఎలా జరుగుతున్నదన్న అనుమానం ఎవరికైనా రావచ్చు. వున్న సిబ్బందిలో దశాబ్దాల సర్వీసు వున్నప్పటికీ ప్రమోషన్లు ఇవ్వకుండా చేరిన క్యాడర్‌తోనే పని చేయించుకోవటం, కీలకమైన పోస్టులలో ఇతర విభాగాల నుంచి డెప్యుటేషన్‌, ఇతర పద్దతులలో తీసుకురావటం వంటివి చేస్తున్నారు. రేడియో, టీవీలలో కార్య క్రమాలు అంటే సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, నైపుణ్యం, కళా, సాహిత్యరంగాలలో అనుభవం వంటివి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒక కార్యక్రమం శ్రోతలు, వీక్షకులకు అందాలంటే వాటి ప్రణాళికను రూపొందించే, తయారు చేసే, ప్రసారం చేసే మూడు విభాగాల సమష్టి కృషి, సమన్వయం వుంటుంది. 1038లో 1032 ఖాళీ అంటే కార్యక్రమాలను రూపొందించేవారెవరు, అవి లేనపుడు పాతవాటినే పున:ప్రసారాలు చేస్తే శ్రోతలు, వీక్షకులు తగ్గిపోక ఏం చేస్తారు. ప్రమోషన్ల ద్వారా నింపాల్సిన 814 పోస్టులలో ప్రస్తుతం కేవలం ముగ్గురు మాత్రమే వుండగా సంవత్సరాల తరబడి 224 మంది తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తుండగా 587 పూర్తి ఖాళీగా వున్నాయంటే ప్రసార భారతి యాజమాన్య తీరు ఎలా వుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

డిఫెన్స్‌ ఎస్టేట్స్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌, బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజనీరింగ్‌, టెలికాం సర్వీసుల నుంచి అధికారులను దిగుమతి చేసి రేడియో, దూరదర్శన్‌ కార్య క్రమాల పర్యవేక్షణకు నియమించుతున్నారని, కార్య క్రమాల సిబ్బంది విమర్శిస్తున్నారు. కళా, సంస్కృతి, విద్య, కార్యక్రమాలు రూపొందించే అంశాలలో ప్రమేయం, పర్యవేక్షణలో కనీసం 17 సంవత్సరాల అనుభవం వున్న వారిని అదనపు డైరెక్టర్‌ జనరల్‌(కార్యక్రమాలు) పోస్టులలో నియమించాల్సి వుండగా ఇటీవల ఇద్దరు టెలికాం సర్వీసు అధికారులను ఆ పోస్టులకు తీసుకువచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి అధికారులు ప్రసార భారతిలో తిష్టవేస్తే ఇంక కొత్తవి, జనరంజకమైన కార్యక్రమాల గురించి ఆలోచించాల్సిన పనేముంది?

రెండవ అంశం. సామాజిక న్యాయం. ప్రపంచంలో మన రేడియో, దూరదర్శన్‌ వ్యవస్ధ అతిపెద్దది. వాటి కార్యక్రమాలు 90శాతం భూభాగానికి 99శాతం జనాభాకు అందుబాటులో వున్నాయి. అన్నింటికంటే ఇది ప్రజల ఆస్ధి, మాధ్యమం. ప్రజల పట్ల జవాబుదారీతనంతో పనిచేయాల్సిన కీలక సంస్ధలివి. ఇరవై మూడు భాషలు, 180 మాండలికాలలో కార్య క్రమాలను అందించటం సామాజిక న్యాయంలో భాగమే. విస్మరణకు గురైన భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించాలంటే వాటిని రికార్డు చేసి, చిత్రీకరించి పదిల పరచాల్సిన కర్తవ్యాన్ని ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు, సంస్దలు తప్ప కేవలం లాభాలకోసమే పని చేసే ప్రయివేటు ప్రసార మాధ్యమాలు ఎందుకు చేపడతాయి. ప్రభుత్వ ప్రసార మాధ్యమాల దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలి. ముందు వాటిని బతికించుకోవాలి. ఒక వ్యవస్ధను నిర్మించటానికి దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుంది. కూల్చివేయటానికి కొన్ని క్షణాలు చాలు. ఈ పూర్వరంగంలో ప్రసార కార్యక్రమాల సిబ్బంది చేస్తున్న, తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోని పక్షంలో భవిష్యత్‌లో చేయతలపెట్టిన వుద్యమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాల్సి వుంది. ఇదేదో కేవలం వారి ప్రమోషన్లు, వుద్యోగాల సమస్య కాదు. మనలో భాగమే. అందువలన ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లను మెరుగుపరచటానికి, జనానికి మరింత చేరువ కావటానికి, సిబ్బంది చేసే ఆందోళనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం వుంది.