ఎం కోటేశ్వరరావు
జూలై ఆరున తాను ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కొనసాగించటంపై అమెరికా, తనను తాను రక్షించుకోవటంపై దాడికి గురైన చైనా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన ఈ పోరు మీద ఇప్పటికీ అనేక కోణాల నుంచి విమర్శలే ఎక్కువగా వస్తున్నాయంటే ప్రపంచ పెట్టుబడిదారులు దీనిని ‘ మంచి యుద్ధం’ గా పరిగణించటం లేదనే అనేకోవాలి. తాజా పరిణామాలు, విశ్లేషణలను బట్టి వాణిజ్య దాడులను దీర్ఘకాలం కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ చర్యలు చైనా నాయకత్వ పట్టుదలను మరింత పెంచుతాయని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిజ్ హెచ్చరించాడు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నుల పెంపుద్వారా మోపిన భారాన్ని అమెరికన్ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వినియోగదారులపై మోపటం ప్రారంభమైంది. పంటల ధరలు పడిపోవటంతో రైతులకు 12బిలియన్ డాలర్ల మేర చెల్లించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రకటన వెలువడగానే మా సంగతేమిటని పారిశ్రామికవేత్తలు అడగటం ప్రారంభించారు. ఇదే సమయంలో అమెరికా దాడి ప్రభావం చైనాపై పెద్దగా పడిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గటంతో చైనా ఎగుమతులపై పెద్ద ప్రభావం లేదన్నది వాటి సారాంశం. వెలువడుతున్న విమర్శలు, వాణిజ్య యుద్ధం ఇరుపక్షాలకూ నష్టం కలిగిస్తుందనే విశ్లేషణల పూర్వరంగంలో రెండు దేశాలూ మరోమారు చర్చలకు పూనుకోవచ్చన్నది తాజా వార్త.
అమెరికా తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు ఐరోపా యూనియన్ వుత్పత్తులపై కూడా దిగుమతి పన్నుల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెరతీసింది. అయితే జూలై నెల మూడవ వారంలో ఐరోపా కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జుంకర్-డోనాల్డ్ ట్రంప్ మధ్య రాజీకుదిరింది. అమెరికా నుంచి సోయా, సహజవాయువు(ఎల్‌ఎన్‌జి), ఐరోపా నుంచి కార్లు మరియు ఆటో విడి భాగాలను పరస్పరం దిగుమతులు చేసుకొనేందుకు, ఆటోయేతర పారిశ్రామిక వుత్పత్తులపై ఎగుమతులు, దిగుమతులపై ఆటంకాలు, పన్నులు, సబ్సిడీలను ఎత్తివేసేందుకు అంగీకరించారు. అయితే పన్నులను పూర్తిగా రద్దు చేయటం అన్నది ఎంత మేరకు సాధ్యం అన్నది ప్రశ్న. అంతిమంగా కుదిరే ఒప్పందాన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఈ చర్య బహుముఖాలుగా దాడులు చేయటం తనకు మంచిది కాదన్న గ్రహింపు అమెరికాకు వచ్చినందునే ఈ తాత్కాలిక రాజీ, దానికి అది ఎంత కాలం కట్టుబడి వుంటుందన్నది కూడా సందేహమే. మా తల మీద తుపాకి గురి పెట్టి మమ్మల్ని ఒప్పించాలని చూస్తే కుదరదని ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు అమెరికాకు స్పష్టం చేశాయి. అందువల్లనే ట్రంప్ ఒక అడుగు వెనక్కు వేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చొక్కా నలగకుండా, అటూ ఇటూ ఆయుధాలను విక్రయించి లాభపడిన అమెరికాను ఎదుర్కోవాలంటే, విజయం సాధించినప్పటికీ ఎంతో నష్టాన్ని మూటగట్టుకొని, వికలాంగులుగా మారిన తాము ఐక్యంగా వుంటే తప్ప సాధ్యం కాదని గ్రహించిన ఫలితమే నేటి ఐరోపా యూనియన్. అందువలన వాటి రెండింటి మధ్య ఇప్పటికీ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అనూహ్యంగా తమకు సవాలుగా పరిణమించిన చైనాను ఎదుర్కోవటంలోనూ అవి చేతులు కలిపేందుకు వెనుకాడవు. కమ్యూనిస్టు ్యవతిరేకత, మార్కెట్లను ఆక్రమించుకోవటంలో అవి ఏవీ తక్కువ కాదు. అందువలన తమపై దాడి ప్రారంభించిన అమెరికా మీద ఐరోపా ధనిక దేశాలు వత్తిడి తెస్తాయనే భ్రమలు, తమతో చేతులు కలుపుతాయనే ఆశలు చైనాకు లేవు. అతి పెద్ద దేశంగా వున్నందున జిడిపి ఎక్కువగా వున్నట్లు కనిపించినా, అమెరికా, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నదేశమే, ఈ కారణంగానే ప్రపంచ వాణిజ్య సంస్ధలో కొన్ని రాయితీలను పొందుతున్నది.
అమెరికా తరువాత మరో ధనిక దేశమైన జపాన్ కూడా ఇటీవలే ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక బహిరంగ వాణిజ్య ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. జపాన్ నుంచి చేసుకొనే దిగమతులలో 99శాతం వస్తువులపై పన్నులను ఐరోపా యూనియన్ రద్దు చేస్తుంది. అమెరికా-ఐరోపా యూనియన్ కూడా ఇదే మాదిరి ఒప్పందానికి వస్తే అప్పుడు చైనా ఇతర దేశాలతో వాణిజ్యం చేయటం కష్టం అవుతుంది లేదా వత్తిడికి లంగి తన దిగుమతి పన్నులను తగ్గించి మరింతగా తన మార్కెట్‌ను తెరవాల్సి వుంటుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో చైనా ప్రారంభించిన సంస్కరణలకు నలభై సంవత్సరాలు నిండాయి. పశ్చిమ దేశాలకు పెద్ద ఎత్తున మార్కెట్ ద్వారాలు తెరిచిన కారణంగా పరస్పరం లబ్దిపొందాయి. ఈ క్రమంలో అది వాణిజ్య మిగులు దేశంగా మారింది. ఇంకా తమ వస్తువులను అదనంగా కొనాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధ మూలకారణమిదే. చైనా ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ పశ్చిమ దేశాలతో పోల్చితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటికీ వెనుకబడే వుంది. తమ వైపు నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపును అడ్డుకుంటే చైనా దారికి రావచ్చన్నది పశ్చిమ దేశాల వూహ. అమెరికా ఇప్పుడు క్రమంగా వాణిజ్య యుద్ధాన్ని 500బిలియన్ డాలర్ల మేరకు విలువగల వస్తువులకు పెంచుతానని బెదిరించింది. దీనితో పాటు చైనా పశ్చిమ దేశాల ఆధునిక పరిజ్ఞాన కంపెనీలను కొనుగోలు చేయకుండా చూడటంతో పాటు వాణిజ్య సంస్ధలో సంస్కరణల పేరుతో కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టాలని కూడా అమెరికా నిర్ణయించింది. అంటే చైనాను చక్రబంధంలో బిగించి దారికి తెచ్చుకోవాలన్నది వ్యూహం.
‘చైనాతో వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. అంటే వాణిజ్య యుద్ధం నిరవధికంగా కొనసాగవచ్చు, ఇతర దేశాల ద్వారా చైనా వుక్కు అమెరికా చేరకుండా వుండాలంటే ప్రపంచం అంతటి నుంచి వచ్చే వాటి మీద పన్నులు విధించటమే ఏకైక మార్గం ‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జర్ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పారు. అమెరికా మరో వాణిజ్య ప్రతినిధి డెనిస్ షెయా చైనా కమ్యూనిస్టుపార్టీపై విరుచుకుపడుతూ చైనా ప్రభుత్వ ఒప్పందాలకు విరుద్దంగా కమ్యూనిస్టు పార్టీ వాణిజ్య విధానాన్ని ఆదేశిస్తున్నదని, చైనా ఆర్ధిక విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యులు నష్టపోవాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యురాలిగా లబ్ది పొందిన చైనా 2005-16 మధ్య 9.5శాతం నిజ జిడిపి అభివృద్ధి రేటుతో రెండవ ఆర్ధికశక్తిగా ఎదిగిందని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ధనిక దేశాలన్నీ చైనా మీద కత్తి గట్టటానికి సన్నద్ధం అవుతున్నాయి.
ముందు తన ఇంటిని చక్కదిద్దుకొని వాణిజ్య లోటు ఏర్పడకుండా దేశీయంగా పొదుపును పెంచుకోవాలని చైనా తిప్పి కొట్టింది. వాణిజ్య యుద్ధం ప్రారంభం సాంకేతికంగా జూలై ఆరున ప్రారంభమైనప్పటికీ దానికి నిర్ణయం, సన్నాహాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అనేక సంవత్సరాలుగా తమ సరకులను ఎక్కువగా కొనుగోలు చేసి వాణిజ్య లోటును తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తోంది. ఇదే సమయంలో ధనిక దేశాలపై ఆధారపడిన తన ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధకు వున్న పరిమితులను చైనా నాయకత్వం గుర్తించకపోలేదు. తమ పౌరుల కొనుగోలు శక్తిని పెంచటం, వెనుక బడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ వంటి అంతర్గత చర్యలతో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో సహా అన్ని ఖండాలలో తన వాణిజ్య అవకాశాలను పెంచుకొనేందుకు పూనుకుంది, ఆ దిశగా అనేక చర్యలను చేపట్టింది. తమ పన్నుల దాడి నుంచి కాచుకొనేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏ దేశమైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే లాభాలతో పాటు నష్టాలు కూడా వుంటాయి. కరెన్సీ విలువ తక్కువగా వుంటే ప్రపంచ మార్కెట్‌లో ధరలపోటీలో నిలబడవచ్చు. అదే సమయంలో సదరు దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతాయి. చైనా దగ్గర డాలర్ నిల్వలు భారీగా వున్నందున తన కరెన్సీ విలువ తగ్గించి కుక్క కాటుకు చెప్పు దెబ్బమాదిరి ప్రతీకారం తీర్చుకోవచ్చన్నది ఒక వాదన. పదకొండువందల వస్తువులపై అమెరికా విధించిన 25శాతం దిగుమతి పన్ను భారాన్ని తమ కంపెనీలపై తగ్గించేందుకు వాణిజ్య యుద్ధం ప్రారంభానికి ముందు నుంచే అంటే తన కరెన్సీ విలువ పతనాన్ని ప్రోత్సహించిందని, గత మూడునెలల్లో డాలరుతో 7.7శాతం పడిపోయిందని చెబుతున్నారు. ఇదే కాలంలో మన దేశంతో సహా అనేక దేశాల కరెన్సీ విలువలు పడిపోయాయి.’ చైనా, ఐరోపా యూనియన్‌లు కరెన్సీ విలువలను తిమ్మిని బమ్మిని చేస్తున్నాయి, వడ్డీ రేట్లు తక్కువగా వుంచుతున్నాయని’ ట్రంప్ స్వయంగా ట్వీటర్‌లో ఆరోపించాడు. దీనికి తగిన ఆధారాలు కనిపించటం లేదు. జర్మనీలో పదేండ్ల బాండ్లపై 0.5, అమెరికాలో 2.6 శాతం వడ్డీ వస్తుండగా చైనాలో 3.75శాతం వస్తున్న కారణంగా ఏప్రిల్‌కు ముందు పన్నెండు నెలల కాలంలో వంద బిలియన్ డాలర్లు చైనాకు తరలి వచ్చాయి. చైనా వడ్డీ రేటును స్ధిరంగా వుంచుతుందనే నమ్మకమే దీనికి కారణమని కొందరి విశ్లేషణ. కరెన్సీ విలువ తగ్గితే విత్త (వడ్డీ) వ్యాపారులు చైనా నుంచి బయటకు పోతారు. చైనాకు సంపదలతో పాటు అప్పులు కూడా భారీగానే వున్నాయి, అలాంటపుడు విదేశీ నిధులు బయటకుపోతే ఎన్నో చిక్కులు తలెత్తుతాయి కనుక చైనా నాయకత్వం అలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోదు అని కొందరి వాదన.
ఒక దేశంలో కరెన్సీ విలువ పడిపోతే అది దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు పెరుగుతాయి. యువాన్ విలువ తగ్గితే చైనాలో అమెరికా వస్తువులు ప్రియం అవుతాయి. జూలై ఆరు తరువాత ఇప్పటి వరకు యువాన్ విలువ రెండున్నర శాతం తగ్గింది. అయితే ఇలాంటి హెచ్చు తగ్గులు గతంలో కూడా వున్నాయి. గతనెలలో చైనా పిఎంఐ సూచిక 51.2గా వుంది. అంతకు తగ్గితే ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడినట్లు. ఏమైనా ప్రభావం, పర్యవసానాల గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము. గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకొనేందుకు రష్యా తన కరెన్సీ విలువను తక్కువగా వుంచిందని, చైనా కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని కొందరు అంటున్నారు.అయితే రష్యాకు దాని వలన కొన్ని సమస్యలు కూడా తలెత్తకపోలేదు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు అటు చైనా ఇటు అమెరికా మీద మెల్లగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో సోయా, ఇతర వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనం కావటంతో రైతులను ఆదుకొనేందుకు ట్రంప్ సర్కార్ 12బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమెరికాకు ప్రతిగా తాము విధించిన పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభావితమయ్యే పరిశ్రమలు, సంస్ధలకు రాయితీల రూపేణా అందిస్తామని చైనా ఎప్పుడో ప్రకటించింది. రైతులకు రాయితీలు ప్రకటించటంతో మిగతా పరిశ్రమల వారు కూడా తమ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా రాయితీలు ఇస్తే 39బిలియన్ డాలర్లు అవుతాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. గతంలో తాము ఎన్నో మాంద్యాలు, అంతర్యుద్ధాల కాలంలో కూడా నిలబడ్డామని కానీ ఇప్పుడు వాణిజ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మనుగడ కష్టమని 1839 నుంచి వునికిలో వున్న బ్రిన్లీ-హార్డీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. వుక్కు ధరలు 33శాతం పెరిగాయని వాపోయారు. అనుచిత యుద్ధం, అసమర్ధులైన సైన్యాధికారులు, ప్రజల మద్దతు లేనపుడు గెలవటం అసాధ్యమని, ట్రంప్ ప్రారంభించి వాణిజ్య యుద్దం కూడా అలాంటిదే అని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిజ్ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు ఏమైనప్పటికీ 2020 నాటికి అమెరికా ఆర్ధిక లోటు లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే జరిగితే పెట్టుబడులు, దిగుమతులు పడిపోవటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం వుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సమస్య చైనా కాదని, దేశీయంగా పొదుపు చాలా తక్కువగా వుండటం అసలు సమస్య అన్నారు. ట్రంప్ కోరుతున్నట్లు అమెరికా నుంచి చైనా మరింతగా చమురు, గ్యాస్ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మితే చైనాతో వాణిజ్యలోటు తగ్గించానని ట్రంప్ చెప్పుకోవటానికి తప్ప పెద్ద తేడా ఏమీ వుండదు, రవాణా ఖర్చులు పెరుగుతాయి అన్నారు. చైనా వస్తువులకు డిమాండ్ తగ్గితే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే దాని కరెన్సీ విలువ బలహీనమౌతుంది, అప్పుడు ఇతర దేశాలతో చైనా పోటీతత్వం పెరుగుతుంది. 2015లో చైనా ఆమోదించిన మేడిన్ చైనా 2025 విధానాన్ని అడ్డుకొనేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లయితే కచ్చితంగా విఫలమౌతాడు, మరోవైపు నూతన ఆవిష్కరణలు, సాంకేతికంగా పైచేయి సాధించాలన్న చైనా నేతల పట్టుదలను మరింత పెంచినవారవుతారు, తాము ఇతరులపై ఆధారపడలేమని వారు గుర్తించిన తరువాత అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అని స్టిగ్జిజ్ చేసిన హెచ్చరికను ట్రంప్ పట్టించుకుంటాడా?