Tags

, , , ,

Image result for threat to india's independence

ఎం కోటేశ్వరరావు

డెబ్బయి రెండవ స్వాతంత్య్రవేడుకలకు దేశం సిద్దం అవుతోంది, మరోసారి అధికారానికి వచ్చి 75వ వేడుకలను కూడా తానే ప్రారంభించాలని ప్రధాని నరేంద్రమోడీ కోరుకుంటున్నారు. తన ప్రసంగంలో వుండాల్సిన అంశాల మీద సలహాలు ఇవ్వాలని కోరారు. జనాభిప్రాయానికి తలొగ్గే పాలకుడిగా కనపడే ప్రచార ఎత్తుగడలో భాగమిది. మూకదాడుల గురించి దేశ అత్యున్నత న్యాయస్ధానం ఒక చట్టాన్ని రూపొందించండని చెప్పటం సమస్య తీవ్రతకు నిదర్శనం. అయినా ఈ సమస్యపై మన ప్రధాని మౌనంగానే వున్నారు. అలాంటి పెద్దమనిషి సామాన్య జనం చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకుంటారంటే నమ్మటమెలా ? వంచనగాకపోతే నిత్యం జనంతో వున్నామని చెప్పుకొనే నేతలకు జనాభిప్రాయాలేమిటో స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా చెప్పేదేమిటి?

ఐదవసారి ఎర్రకోట మీద మువ్వన్నెల జండా ఎగురవేయబోతున్న ప్రధాని ముందు ఒక పెద్ద ప్రశ్న వుంది. నిజానికి అది యావత్తు దేశ ప్రజల ముందున్న సవాలు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా వున్న మన విదేశాంగ విధానాన్ని నిర్దేశిస్తున్నది ఎవరు అన్నదే ఈ స్వాతంత్య్రదినోత్సవ ప్రత్యేకత అని చెప్పవచ్చు. వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవవేడుకల ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను మన ప్రభుత్వం ఆహ్వానించింది. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చిన కొన్ని వార్తలు ఈ ఆహ్వాన ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీల విషయంలో అమెరికా ఆంక్షలకు తలగ్గకపోతే చెల్లించే మూల్యం భారీగా వుంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికే ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిన మన దేశం 2030 నాటికి మూడవ స్ధానానికి చేరుకోనున్నదని వార్తలు వచ్చాయి. ఆ బాటలో వున్న మనం భారీ మూల్యం చెల్లించాల్సినంత దుర్బలంగా వున్నామా? అమెరికా అడుగుల్లో నడవటం స్వాతంత్య్రపిపాసకులకు మింగుడు పడని అంశమే. ఒక చిన్న దేశం విధిలేక ఒక పెత్తందారు అడుగులకు మడుగులొత్తిందంటే అర్ధం చేసుకోగలం కానీ జనాభారీత్యా, ఘనమైన గతంతో వున్న మనదేశం అమెరికా కనుసన్నలలో నడుస్తోందంటే మన ఆత్మగౌరవం ఏమైనట్లు? నరేంద్రమోడీ లేదా ఎన్‌డిఏ పక్షాలకు ఇవేవీ తెలియకనే ట్రంప్‌కు ఆహ్వానం పలికారా? పాండవుల పక్షాన నిలవాలని ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణుడు ధుర్యోధనుడితో ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జున జూచితి అని చెప్పినట్లుగా అన్నీ తెలిసే మోడీ సర్కార్‌ ట్రంప్‌కు ఎర్రతివాచీ పరచేందుకు నిర్ణయించింది అనుకోవాలి. దేశభక్తులమని చెప్పుకొనే వారు చేయాల్సినపనేనా ఇది?

చైనా మన పొరుగుదేశం. రెండు దేశాల మీద బ్రిటీష్‌ పాలకులు పెత్తనం చేశారు. వాస్తవంలో ఏ ప్రాంతం ఎవరికింద వుంది అన్నది చూడకుండా ఆఫీసుల్లో కూర్చొని సరిహద్దుగీతలు గీసిన కారణంగా చైనాతో తలెత్తిన సరిహద్దు పంచాయతీలు ఇంకా పరిష్కారం కాలేదు. దేశాన్ని బ్రిటీషోడు విడదీసినపుడు మనవైపు మొగ్గిన కాశ్మీర్‌లో కొంత ప్రాంతాన్ని పాకిస్ధాన్‌ ఆక్రమించుకుంది, దాన్నొక విముక్తి ప్రాంతంగా, స్వతంత్రమైనదిగా ప్రకటించింది. ఆ సమస్య కారణంగా దానితో సంబంధాలు సజావుగా లేవు. తరువాత కాలంలో అమెరికా ప్రోద్బలంతో కాశ్మీర్‌ వేర్పాటు వాదులను రెచ్చగొట్టటం, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెట్టి దుర్మార్గాలకు పాల్పడటం వంటి చర్యలు తెలిసినవే. నిత్యం సరిహద్దుల్లో పోరుకు బదులు వాటిని వారూ మనం పరిష్కరించుకోవాలి. మిగతా ప్రపంచ దేశాలతో మనకు ఎలాంటి పేచీలు లేవు. స్నేహసంబంధాలే వున్నాయి, ఇప్పుడు అమెరికా వాడు వాటిని దెబ్బతీసేందుకు పూనుకోవటం ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం?

మనకు ఒక స్వతంత్ర విధానం వుంది, గతంలో సోవియట్‌ లేదా అమెరికా కూటమిలోకో మొగ్గు చూపకుండా అలీన విధానం అవలంభించాం. దాని మేరకు మన రక్షణ అవసరాల రీత్యా అణ్వాయుధాలను తయారు చేస్తున్నాం, వాటిని పరీక్షిస్తున్నాం. అందుకే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేసేందుకు ఇంతకాల నిరాకరించాం, ఇప్పటికీ అదే వైఖరి కొనసాగుతోంది.దీనిపై సంతకం చేయని వాటిలో మనతో పాటు పాకిస్ధాన్‌,ఇజ్రాయెల్‌, 2011లో స్వాతంత్య్రం పొందిన దక్షిణ సూడాన్‌ వున్నాయి. ఈ ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు శాంతియుత అవసరాలకు అణుశక్తిని వినియోగించవచ్చు తప్ప అణ్వాయుధాలను తయారు చేయటానికి లేదు.

ఇరాన్‌తో ఆరు దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా ఏకపక్షంగా ప్రకటించింది. అంతవరకు పరిమితమైతే అదొకదారి, ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించింది. దానితో వ్యాపారలావాదేవీలు జరిపేవారికి కూడా అవి వర్తిస్తాయని పేర్కొన్నది. పంచాయతీ వుంటే ఆ రెండు దేశాలు తేల్చుకోవాలి తప్ప ఇతర దేశాల మీద కూడా తన ఆంక్షలు అమలు జరుగుతాయని చెప్పటం పెద్దన్న వైఖరి తప్ప ప్రజాస్వామ్యపూరితం కాదు. ఇరాన్‌తో మన సంబంధాలు ఈనాటివి కాదు. దాని అవసరాల నిమిత్తమే కావచ్చు మిగతా చమురు సరఫరా దేశాలేవీ ఇవ్వని రాయితీలను అది మనకు ఇస్తోంది, కొంత మేరకు మన రూపాయి చెల్లింపులను అంగీకరిస్తోంది. ఇది మనకూ ప్రయోజనమే కనుక మన ఇంధన అవసరాలలలో ఎక్కువభాగం అక్కడి నుంచే పొందుతున్నాము. ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షలు ఇరాన్‌తో సంబంధాలున్న అన్ని దేశాలకూ వర్తిస్తాయి. గతంలో కూడా ఆంక్షలున్నప్పటికీ టర్కీ బ్యాంకుల ద్వారా మనం సొమ్ము చెల్లించి చమురు దిగుమతి చేసుకొనే వారం. ఇప్పుడు అలాంటివి కూడా కుదరదని ట్రంప్‌ తెగేసి చెప్పాడు. గతంలో మన దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సమయంలో రెండు దేశాలూ సమాన భాగస్వాములు అంటూ వూదరగొట్టిన అమెరికన్లు ఇప్పుడు మనల్ని పాలేర్లకింద జమడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

Image result for us diktats to india

ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించగానే వాటితో తమకు సంబంధం లేదని, ఏ దేశంపై అయినా ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. ఆంక్షలు మూడోపక్ష దేశాలకూ వర్తిస్తాయని వెల్లడించగానే నెల రోజులు కూడా గడవక ముందే ఇరాన్‌ బదులు నవంబరు నుంచి మరొక దేశం నుంచి చమురు దిగుమతి ఏర్పాట్లు చేసుకోవాలని మన చమురు మంత్రిత్వశాఖ చమురుశుద్ధి కర్మాగారాలకు లేఖ రాసింది. తాము చెల్లింపులు జరపలేమని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇది అమెరికా వత్తిడికి లొంగటం కాదా ? మన అలీన విధానం ఏమైనట్లు? ఈ పూర్వరంగంలోనే ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలను విధిస్తామన్న అమెరికా బెదిరింపుకు భారత్‌ ఎలా స్పందించాలన్న ప్రశ్నకు అమెరికాకు తలొగ్గకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ చెప్పారు.’ ఇదొక ప్రధాన ఆర్ధిక సమస్య గాక విదేశాంగ విధానపరమైన నిర్ణయం కూడా ఇమిడి వుంది. గతం కంటే మరింత కఠినంగా అమలు జరుపుతామని అమెరికా స్పష్టంగా చెప్పటం కనిపిస్తోంది, దీని అర్ధం మినహాయింపులు పరిమితంగా వుంటాయి. అదే జరిగితే మనం చమురుకోసం ఇతర వనరులను చూసుకోవాలి, అమెరికా చెప్పింది వినకపోతే మూల్యం చాలా ఎక్కువగా వుంటుంది. ప్రతి అంతర్జాతీయ వ్యవస్ధలో డాలరు ప్రవేశిస్తోంది, అది ఒక్క వ్యాపారానికే పరిమితం కావటం లేదు ఒక చెల్లింపు సంవిధానంగానూ ద్రవ్య మార్కెట్లలో ఒక సాధనంగా మారింది, దానికి అనుగుణంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంది.’ అన్నారు.

ఏ దేశపెత్తనానికి తలొగ్గం అని చెప్పుకొనే ప్రభుత్వానికి సలహాలిచ్చే పెద్దమనిషి చెప్పిన ఈ మాటలకు అనుగుణంగానే మోడీ సర్కార్‌ వ్యవహరిస్తున్నది. ఇరాన్‌పై ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికాకు రాత పూర్వకంగా ఇంతవరకు ఇవ్వలేదు తప్ప ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను తగ్గించింది. దీని అర్ధం ఏమిటి? మరోవైపు అమెరికా ఆంక్షలను తాము ఖాతరు చేయబోమని చైనా, టర్కీ ప్రకటించాయి.తామే అసలైన జాతీయవాదులం, దేశభక్తులం అని చెప్పుకుంటున్న బిజెపికి ఈ పరిణామం పెద్ద పరీక్ష. అలీన విధానం, స్వతంత్ర వైఖరినుంచి వైదొలగి అమెరికా వైపు మొగ్గుచూపటమే. ఆగస్టు ఆరవ తేదీ నుంచి అమెరికా ఆంక్షల తొలి చర్యలు అమలులోకి వస్తాయి. వీటి వలన మనకు ఎలాంటి ఇబ్బందులు రావు, చమురు లావాదేవీలపై ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీ నుంచి వర్తిస్తాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న మనం ఇరాన్‌తో సంబంధాలు వదులుకొంటే మరింత ఇబ్బందులు పడటం ఖాయం. అమెరికా వత్తిడికి లొంగితే ప్రపంచంలో మనపరువు గంగలో కలుస్తుంది. మనతో భాగస్వామ్యానికి మిగతా దేశాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.

భారత ఇబ్బందులను తాము అర్ధం చేసుకోగలమని, అయితే ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీలు నిలిచిపోతాయని, భారత సర్వసత్తాక నిర్ణయ హక్కును తాము గౌరవిస్తామని ఇరాన్‌ రాయబారి ప్రకటించారు. అమెరికా నుంచి ఇలాంటి ప్రకటన రాకపోగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నికీహాలీ న్యూఢిల్లీ వచ్చి ప్రధానితో సమావేశమై ఇరాన్‌తో సంబంధాలను సవరించుకోవాలని ఆదేశం మాదిరి మాట్లాడి వెళ్లారు. అంతకు ముందే తమ ఆంక్షలలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా ప్రకటించింది. ఒక దేశాధినేతతో అమెరికా వ్యవహరించే తీరిది. అయితే అమెరికా బెదిరింపు పని చేసిందనేందుకు నిదర్శనమా అన్నట్లు జూన్‌లో ఇరాన్‌ నుంచి మన చమురు దిగుమతులు 16శాతం తగ్గాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి మన చమురు దిగుమతులు రెట్టింపు అయ్యాయి. రూపాయలతో కొంత మేరకు కొనే చమురును ఇప్పుడు పెరిగిన డాలర్లతో కొనాల్సిన అగత్యం ఏర్పడింది.

మన రక్షణ ఏర్పాట్లు మనం చేసుకోవాలి. అవసరాలకు అనుగుణంగా మనం ఎవరి దగ్గర ఆయుధాలు కొనుగోలు చేయాలి, ఏ సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలనేది మన సర్వసత్తాక హక్కు. దీనిలో కూడా అమెరికా జోక్యం చేసుకొంటోంది. తన చట్టాలు, నిర్ణయాలను సర్వవ్యాపితంగా రుద్దాలని, అమలు చేయాలని చూస్తోంది. మన అవసరాలకు తగినవిగా రష్యా తయారీ ఎస్‌-400 గగన రక్షణ క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణ శాఖ నిర్ణయించింది. రష్యా మీద తాము ఆంక్షలను విధించిన కారణంగా రష్యాలో తయారయ్యే ఆయుధాలను కొనుగోలు చేసిన వారికి అవి వర్తిస్తాయని అమెరికా చెబుతోంది. తమకు ఐక్యరాజ్యసమితి నిబంధనలు, చట్టాలు వర్తిసాయి తప్ప అమెరికావి కాదని మన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ అమెరికాకు చెప్పినప్పటికీ వాటి కొనుగోలుకు మనల్ని నిరోధించే విధంగా అమెరికా వత్తిడి చేయటం మానుకోలేదు. ఒకేసారి 400 కిలోమీటర్ల పరిధిలోని 36 లక్ష్యాలను చేరుకోగలిగిన అధునాతన పరికరాలివి. మన విదేశాంగ విధానంలో జోక్యం చేసుకొనేందుకు, వత్తిడి చేసేందుకు, భారాలు మోపేందుకు ఇతర దేశాలకు అవకాశం ఇస్తున్నది ఎవరు? ఎందుకీ పరిస్ధితి ఏర్పడింది. అమెరికాకు దాసోహం అన్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ బూట్లలో కాళ్లు పెట్టి బిజెపి నరేంద్రమోడీ నడుస్తున్నారు. రష్యా క్షిపణి వ్యవస్ధల కొనుగోలు వ్యవహారంలో వెనక్కు తగ్గితే అది మన రక్షణకే ముప్పు, అందువలన వాటి కొనుగోలుకే కట్టుబడి వుండటంతో తమ ఆంక్షలను మన దేశానికి మినహాయింపు నిచ్చేందుకు అమెరికా పార్లమెంట్‌ ఒక బిల్లును ఆమోదించాల్సి వచ్చింది. మిగతా విషయాలలో మన సర్కార్‌ అంతగట్టిగా మన వైఖరికి ఎందుకు కట్టుబడి వుండదు ?

దేశాన్ని దీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడింది, తప్పిదాలు చేసిందనే విమర్శను తప్పుపట్టాల్సిన పనిలేదు. తిరుగులేని వాస్తవం, అందుకు ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష గుర్తింపు హోదా కూడా లేని పార్టీగా దిగజారి భారీ రాజకీయ మూల్యం చెల్లించింది. పాలనలో అలాంటి పార్టీ ప్రభావం, రూపురేఖలను పూర్తిగా చెరిపివేయాలనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలేమిటి అన్నది జనం ముందున్న ప్రశ్న. వాటిలో ఒకటి ప్రణాళికా సంఘం, విధానాలను రద్దు చేయటం. గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా అభివృద్ధిలో ప్రణాళికా విధానం కీలకమైనది అని రుజువైంది.ఆరున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం పనికిరానిదిగా తయారైంది అంటూ దానిని రద్దు చేసి నీతి ఆయోగ్‌ పేరుతో రూపాంతరం చెందుతున్న భారత్‌ కోసం జాతీయ సంస్ధ(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా)ను 2015 జనవరి ఒకటి నుంచి అమలులోకి తెచ్చారు. ఇది పదిహేను సంవత్సరాల మార్గం, ఏడు సంవత్సరాల దృష్టి, వ్యూహం, కార్యాచరణతో పని చేస్తుంది. అంటే ఐదేండ్లకు బదులు ఏడు సంవత్సరాల ప్రణాళిక అనుకోవాలా? రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగి, ప్రభుత్వాలు మారటానికి అవకాశం వున్నపుడు పేరు ఏది పెట్టినా ఏడు సంవత్సరాల ప్రణాళికలంటే వచ్చే ఇబ్బందుల గురించి చెప్పనవసరం లేదు. మధ్యలో మార్చుకోకూడదా అంటే మార్చుకోవచ్చు. ఇక్కడ సమస్య అది కాదు.

1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో అమలు చేస్తున్న విధానాలు ప్రణాళికలు అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే కొన్ని కార్యక్రమాలుగా మారిపోయాయి. అప్పటి నుంచి ప్రభుత్వాలు ఒక్కొక్క బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. వుదాహరణకు పెరుగుతున్న జనాభా, అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్ధల ఏర్పాటు, మెరుగుపరచటంపోయి వాటిని ప్రయివేటు రంగానికి వదలి వేశారు. ఆ విధానాలలో భాగంగానే ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేశారు. ఈ కారణంగానే ఒక్క రక్షణ సంబంధిత రంగాలలో తప్ప ఇతరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పిన పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. విద్యుత్‌ రంగంలో ప్రయివేటు విద్యుత్‌ ఖర్చు ఎక్కువగా వుండటం వలన గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయటం, ఒకటీ అరా కొత్తగా స్ధాపించటం తప్ప ఆ రంగంలోనూ పరిమితం చేశారు. వ్యవసాయ రంగంలో గణనీయంగా తగ్గించిన కారణంగా పరిశోధన, అభివృద్ధి లేకుండా పోయింది. బహుళజాతి గుత్త సంస్ధలు వ్యవసాయరంగంలో ప్రవేశించి విత్తన రంగాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.పర్యవసానంగా విత్తన ధరలు పెరిగాయి. ఎరువులపై ధరల నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ శక్తులకు వదలివేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పరిమితం చేసి దానినే అందచేస్తున్నారు. దీనిలో కొత్త పద్దతుల్లో అక్రమాలకు తెరలేవటం అందరికీ తెలిసిందే.

స్వాతంత్య్రానికి ముందు, తరువాత కాలంలో కార్మికవర్గ రక్షణ కోసం రూపొందించిన అనేక చట్టాలను నీరుగార్చటం, అమలుకు నోచుకోకుండా ఆటంకాలు, ఆంక్షలు విధించటం వంటి విషయాలు తెలిసిందే. మొత్తం శ్రమ జీవులందరికీ సామాజిక భద్రత కల్పించాల్సిన ప్ర భుత్వాలు వున్న వారికి వర్తింపచేస్తున్న వాటిని రద్దు చేశాయి. నూతన పెన్షన్‌ పధకం(ఎన్‌పిఎస్‌) పేరుతో 2004 తరువాత చేరిన వారికి పాత పద్దతిలో వుపయోగకరమైన పెన్షన్‌ రద్దు చేశారు. దానిని రూపొందించిన ఖ్యాతి వాజ్‌పేయి నాయకత్వంలోని గత ఎన్‌డిఏ ప్రభుత్వానిదైతే దానిని తు.చ తప్ప కుండా అమలు జరిపిన చరిత్ర తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ, రాష్ట్రాలలో అధికారంలో వున్న బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీల గురించి తెలిసిందే. నూతన పెన్షన్‌ పధకాన్ని రద్దు చేసి పాతదాన్ని పునరుద్దరించాలని వుద్యోగులు పోరుబాట పట్టారు. ఒక్క వామపక్షాలు తప్ప మిగతా పార్టీలేవీ దాని గురించి పట్టించుకోవటం లేదంటే ఆమోదం, అమలుకు అంగీకరించినట్లే.

Image result for us diktats to india

మన దేశంలో వునికిలోకి వచ్చిన ప్రతి చట్టం వెనుక ఆయా తరగతులు జరిపిన వుద్యమాల వత్తిడి, త్యాగాలు వున్నాయి. వ్యాపార సులభతరం పేరుతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. బిజెపి పాలిత రాజస్ధాన్‌ పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి స్వాతంత్య్ర పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. ఇలాంటి వన్నీ బ్రిటీష్‌ వలసదారులు చేశారంటే అర్ధం వుంది, స్వతంత్ర భారత్‌లో చేయటం అంటే పరాయి పాలనకు వ్యతిరేకంగా కార్మికోద్యమం చేసిన త్యాగాలన్నీ వృధా అయినట్లే. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన అపర ప్రజాస్వామిక నడత ఘనత బిజెపి ఖాతాలో చేరింది. అంబేద్కరిస్టులు లేదా దళిత అస్ధిత్వవాదులు చేసే ప్రకారం ఈ దేశంలో కార్మికులందరూ దళితులే. అంటే వారి అవగాహన ప్రకారం కార్మిక రంగంలో చేస్తున్న మార్పులన్నీ దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది.ఇదా స్వాతంత్య్రం ! అది ఎవరికి వుపయోగపడుతోంది?

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇదేదో నరేంద్రమోడీ హయాంలోనే ప్రారంభమైందని కాదు, ఆయన ఏలుబడిలో వేగం పెరిగింది. దానికి నిదర్శనం సులభతర వాణిజ్యంలో మన స్దానం పైకి ఎగబాకటమే. తన ప్రభుత్వ ఘన విజయాలలో అదొకటని మోడీ సర్కార్‌ చెబుతోంది. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌. స్వాతంత్య్రానికి ముందు మనం ఏ లక్ష్యాల కోసం పోరాడాము, తరువాత ఇప్పటి వరకు వాటికి మనం ఎంతవరకు కట్టుబడి వున్నాము, లక్ష్యాలు, గత ఆచరణ నుంచి కూడా ఇప్పుడు మనం వైదొలగుతున్న తీరు మన స్వాతంత్య్రాన్ని ఏమి చేయనున్నది అని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలోనే కాదు ప్రతి క్షణం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. నాడు బ్రిటీష్‌ తెల్లదొరల దుర్వివిధానాలకు వ్యతిరేకంగా పోరాడినట్లుగానే ఆ స్వాతంత్య్రానికి, సర్వసత్తాక అధికారానికి ముప్పు తెస్తున్న నేటి అమెరికన్‌ దొరల వత్తిడికి లంగిపోతున్న నల్లదొరల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పరిరక్షణకోసం మరోమారు వుద్యమించాల్సిన పరిస్ధితి ఏర్పడలేదా ? ఆలోచించిండి !