ఎం కోటేశ్వరరావు
ముందస్తు ఎన్నికలు మదిలో వున్న కారణంగానే సాగు ప్రారంభమైన నెల రోజుల తరువాత నరేంద్రమోడీ పంటల కనీస మద్దతు ధరలను ఆలస్యంగా ప్రకటించారని విమర్శలు ఎదుర్కొన్నారు. వెనుకో ముందో ప్రభుత్వం ఏదో ఒకటి చేసిందిగా, పెంపుదలను అభినందిస్తారా లేదా అని మోడీ మద్దతుదారులు అడగటం సహజం. 2022 నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామని మోడీ నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే వున్నారు. ఇందుకు గాను మోడీ అధికారానికి వచ్చిన రెండేళ్ల తరువాత 2016లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది ఇంతవరకు 14నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. అంతిమ నివేదికను సమర్పించాల్సి వుంది. దానిలో ఏమి సిఫార్సు చేస్తారో ఇంతవరకు వెల్లడి కాలేదు అయినా సరే నాలుగు సంవత్సరాల పాలన తరువాత తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చానని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించారు.
వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న కొన్ని సమస్యలను చూద్దాం. వ్యవసాయ ధరల, ఖర్చుల కమిషన్(సిఏసిపి) వ్యవసాయ ఖర్చును మూడు రకాలుగా చూపింది. వుదాహరణకు ధాన్య వుత్పత్తి వాస్తవ ఖర్చు ఎ2 రు.865, రెండవది వాస్తవ ఖర్చు ఎ2, వాస్తవ ఖర్చు ఎ2 ప్లస్ (రైతు శ్రమ) ఎఫ్‌ఎల్,రు.1166, మూడవది సి2 రు 1560 ( దీనిలో వాస్తవఖర్చు ఎ2, ఎఫ్‌ఎల్, కౌలు, బ్యాంకు వడ్డీలు, ఇతరాలు అన్నీ వున్నాయి.) గిట్టుబాటు ధర నిర్ణయించేటపుడు ప్రభుత్వాలు సి2ను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి బదులు రు.1166ను మాత్రమే తీసుకొని దానిలో యాభైశాతం కలిపితే వచ్చే మొత్తాన్ని నిర్ణయించి, ఇదే గిట్టుబాటు ధర, మా వాగ్దానాన్ని నెరవేర్చామని మోడీ సర్కార్ చెబుతోంది. సి2ను పరిగణనలోకి తీసుకుంటే ధాన్యం ధర రు.2,340 కావాలి. కానీ కేంద్రం రు.1750,1770 వంతున నిర్ణయించింది. అన్ని పంటలకూ ఇదే తీరు. పత్తికి రు 6,771కి గాను 5150,5450 వంతున నిర్ణయించింది.
వ్యవసాయ పెట్టుబడులలో భాగమైన ఎరువులు, పురుగు మందులు, పెట్రోలు, డీజిలు వంటి వాటిని అంతర్జాతీయ ధరల ప్రాతిపదికన(ఎరువులకు స్వల్ప రాయితీలు మినహా) ఎలాంటి రాయితీలు లేకుండా రైతాంగం కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఇదే సమయంలో మద్దతు ధరల నిర్ణయంలో అంతర్జాతీయ మార్కెట్ ధరలను కూడా పరిగణనంలోకి తీసుకోవాలని, మనం ఎగుమతులలో పోటీ పడేలా వుండాలని కేంద్రం చెబుతోంది. ఇక్కడే పొంతన కుదరటం లేదు. ధనిక దేశాలన్నీ అటు రైతాంగానికి, ఇటు వ్యాపారులకు రాయితీలు ఇచ్చి మరీ ఎగుమతులు చేయిస్తున్నాయి, వినియోగదారులకు అందిస్తున్నాయి. మన దగ్గర అటువంటి పరిస్ధితి లేదు.
మన దేశంలో నూతన ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత 1995 నుంచి ఇప్పటి వరకు జాతీయ నేర రికార్డుల బ్యూరో సమాచారం మేరకు రోజుకు సగటున 46 మంది రైతులు బలవన్మరణం పాలవుతున్నారు. దీనికి ఆర్ధిక, సామాజిక, భౌతిక పరమైనవిగా కారణాలను మూడు తరగతులుగా చూస్తున్నారు. ఏ కారణం ఎక్కువగా వుందన్న విశ్లేషణలో పంటలు దెబ్బతినటం, ధరలు పడిపోవటం వాటి పర్యవసానాలైన అప్పుల పాలు కావటం వంటి అంశాలే ప్రధానంగా పనిచేస్తున్నాయని తేలింది. రైతాంగ ఆత్మహత్యలు ఒక సాధారణ అంశంగా మారాయి. ప్రపంచీకరణలో ద్రవ్యీకరణ లేదా ధనీకరణ మార్కెట్లను ప్రభావితం చేస్తూ అన్ని రంగాలను అతలాకుతలం చేస్తున్నది. ఈ ప్రక్రియలో ఎక్కడా ప్రమేయం లేని రైతు అంతిమంగా ప్రభావితం అవుతున్నాడు.
అమెరికా వ్యవసాయ శాఖ 2018 జూలై రెండవ వారంలో విడుదల చేసిన సమాచారం ప్రకారం కొన్ని పంటల దిగుబడులు (ఒక హెక్టారు(రెండున్నర ఎకరాలు)కు టన్నులలో, పత్తి కిలోలు) 2016-17 సంవత్సరంలో ఆయా దేశాలలో ఎలా వున్నాయో చూద్దాం. పత్తి దిగుబడులు బర్మాలో 634, పాకిస్ధాన్‌లో 699, సిరియాలో 1089, మెక్సికోలో 1520, ఆస్ట్రేలియాలో 1602, బ్రెజిల్‌లో 1626, టర్కీలో 1742, కిలోలు వుంది.
పంట ప్రపంచం అమెరికా ఐరోపా చైనా రష్యా భారత్ ఈజిప్టు
గోధుమ 3.39 3.54 5.34 5.33 2.69 2.88 6.43
వరి 4.50 8.11 6.80 6.86 0.00 3.74 8.18
ముతక ధాన్యం 4.15 10.27 5.19 5.83 2.69 1.73 7.05
పత్తి 781 972 000 1708 000 542 673
మొక్కజన్న 5.77 10.96 7.21 5.97 5.51 2.69 8.00
తెల్ల జన్న 1.43 4.89 5.53 4.78 000 0.78 5.36
పై వివరాలను గమనించినపుడు దిగుబడి రీత్యా దాదాపు అన్ని పంటలలో మన దేశం ఎంతో వెనుకబడి వుంది. పెట్టుబడులు, మార్కెట్ ధరల విషయంలో ప్రపంచ మార్కెట్లకు అనుగుణ్యంగా మన రైతాంగం వ్యవహరించాల్సి వస్తోంది. దిగుబడి రీత్యా ఎంతో వెనుకబడి వుండటంతో ప్రపంచ మార్కెట్ ధరలు మన రైతాంగానికి ఏ మాత్రం గిట్టుబాటు కావు.
దిగుబడులు పెంచటానికి అవసరమైన వంగడాల సృష్టికి ఖర్చుతోకూడిన పరిశోధనలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఫలితంగా పత్తి దిగుబడి హెక్టారుకు మన దేశంలో గత పది సంవత్సరాలలో 5 నుంచి4.8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రపంచ సగటు ఎనిమిది క్వింటాళ్లు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో 35.9 నుంచి 19.1శాతం వరకు దిగుబడులు తగ్గటం గమనించాల్సిన అంశం. 2008-12 మధ్య దేశ సగటు దిగుబడి ఐదు క్వింటాళ్లు కాగా తెలుగు రాష్ట్రాలలో 5.4 వుంది, అదే 2013-17 మధ్య దేశ సగటు 4.8 కాగా తెలుగు రాష్ట్రాలలో 4.4కు పడిపోయింది. అనేక పంటల దిగుబడులలో మన దేశం చాలా వెనుక బడి వుందో దిగువ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీస్తోంది.(హెక్టారుకు కిలోలు)
పంట ప్రపంచ సగటు గరిష్టం భారత్ రాష్ట్రాలు
ధాన్యం 4,636.6 చైనా6,932.4 2,400.2 పంజాబ్ 3974.1
మొక్కజన్న 5,640.1 అమెరికా10960.4 2,567.7 తమిళనాడు 7010
పప్పులు 731.2 ఆస్ట్రేలియా 5540.3 656.2 గుజరాత్ 931
కందిపప్పు 829.9 కెన్యా 1612.3 646.1 గుజరాత్ 1124.8
సోయాబీన్స్ 2,755.6 అమెరికా 3,500.6 738.4 ఎంపి 831
వేరుశనగ 1,5,90.1 అమెరికా 4118.6 1,464.9 తమిళనాడు 2,574.3
లోపాలతో కూడిన కనీస మద్దతు ధరల నిర్ణయం ఒకటైతే అసలు వాటిని అమలు జరిపే యంత్రాంగం లేదు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్దలు అరకొరగా కొనుగోళ్లు, అదీ ప్రయివేటు మార్కెట్ కనుసన్నలలో మాత్రమే చేస్తున్నాయి. వుదాహరణకు పత్తి విషయం తీసుకుందాం. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్(సిఏసిపి) 2018-19 ఖరీఫ్ నివేదికలో అందచేసిన వివరాల ప్రకారం 2013-17 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో క్వింటాలు ముడి పత్తి(పొట్టి పింజ) కనీస మద్దతు సగటు ధర రు. 3,763. ఇదే కాలంలో దేశీయ మార్కెట్లో రైతుకు వచ్చిన సగటు ధర రు. 4616, అంతర్జాతీయ మార్కెట్లో లభించినది రు.4674. అంటే కనీస మద్దతు ధర మార్కెట్ ధర కంటే తక్కువగానే వుంది. పత్తికి వ్యవసాయ ధరల కమిషన్ లెక్కింపు ప్రకారం అన్ని ఖర్చులను కలుపుకుంటే క్వింటాలుకు రు 6,771నిర్ణయించాల్సి వుండగా 5150,5450 వంతున నిర్ణయించింది. చైనా పత్తి రైతు సగటున హెక్టారుకు 1,708 కిలోల దిగుబడి సాధిస్తుండగా మన రైతు ప్రపంచ సగటు 781 కిలోల కంటే కూడా బాగా తక్కువగా 542కిలోలు మాత్రమే పొందుతున్నపుడు ఏ చిన్న వడిదుడుకు వచ్చినా తక్షణమే ప్రభావితం అయ్యే అవకాశం వుంది.
, దిగుబడులు పెరగక, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రైతులకు ప్రతిఫలం రాకపోవటం మరొక తీవ్ర సమస్య. రైతాంగ ఆదాయాల రెట్టింపునకు జాతీయ వర్షాధారిత సంస్ధ సిఇవో అశోక్ దళవాయి ఆధ్వర్యంలో ఏర్పాటయిన కమిటీ ఒక నివేదికలో ఇలా చెప్పింది. ‘ మొత్తం మీద 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో ఒక హెక్టారు వుత్పత్తి విలువ వాస్తవ ధరలలో ఎక్కువ పంటలకు పెరిగింది. అయితే అదే సమయంలో వుత్పత్తికి అయ్యే పెట్టుబడి ఖర్చు అంతకంటే ఎక్కువగా పెరిగింది.ఫలితంగా వ్యవసాయంలో అత్యధిక పంటలకు నిఖరంగా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. 2002-03 నుంచి 2012-13 మధ్యకాలంలో వ్యవసాయ కుటుంబాల ఆదాయ పెరుగుదల 3.6శాతమే వుంది, ఇది నిజ జిడిపి అభివృద్ధి రేటు కంటే చాలా తక్కువ. అసోంలో 2009-10 నుంచి 2013-14 మధ్య కాలంలో సగటున ఒక హెక్టారుకు ఆరువేల రూపాయలకు పైగా ధాన్య రైతులు నష్టపోతే అంతకు ముందు ఐదు సంవత్సరాల సగటు రు.3,930 మాత్రమే వుంది. అదే బెంగాల్లో నష్టం 3,146 నుంచి 5,625 రూపాయలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలలో కూడా ధాన్య రైతుల సగటు ఆదాయం తగ్గిపోయింది.
ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని సమయాలలో రైతులను దెబ్బతీస్తున్నాయి. గత ఎన్‌డిఏ పాలనా కాలంలో 2001జూలై నుంచి పత్తి ఎగుమతులపై పరిమాణ ఆంక్షలను ఎత్తివేసి సాధారణ ఎగుమతుల జాబితాలో చేర్చారు. దేశీయంగా ధరలు పెరుగుతుండటంతో మిల్లు యజమానుల వత్తిడికి లొంగిన యుపిఏ సర్కార్ 2010 ఏప్రిల్‌లో క్వింటాలు పత్తి (దూది) ఎగుమతిపై రు.2500 సుంకం విధించి నిరుత్సాహపరచింది. ఎగుమతులను పరిమితుల ఆంక్షల జాబితాలో పెట్టింది.ు ఎగుమతులతో పాటు దిగుమతులను కూడా మన సర్కార్ ప్రోత్సహించింది. ఈ చర్య రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. మన పత్తి ఎగుమతులలో ఎగుడుదిగుడులు కూడా రైతాంగానికి లభించే ధరపై ప్రభావం చూపుతున్నాయి. గరిష్టంగా 2013-14లో గరిష్టంగా 18.6లక్షల టన్నుల పత్తి ఎగుమతి జరిగింది. అది 2016-17 నాటికి 9.1లక్షలకు పడిపోయింది.
ప్రపంచ మార్కెట్లో మన మొక్కజొన్నల కంటే రేట్లు తక్కువగా వుండటంతో ఇటీవలి కాలంలో దాదాపు ఎగుమతి ఆగిపోయింది. 2012-13లో 47.9లక్షల టన్నులు చేస్తే 2016-17 నాటికి 5.7లక్షల టన్నులకు పడిపోయింది. పప్పు ధాన్యాలన్నీ అంతర్జాతీయ ధరలకంటే మన దేశంలో ఎక్కువగా వుండటంతో తక్కువ ధరలకు వ్యాపారులు దిగుమతిచేసుకుంటున్నారు. మన మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా గతేడాది రైతాంగానికి రాలేదు. గత రెండు సంవత్సరాలలో బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధరలకంటే తక్కువకే రైతాంగం అమ్ముకోవాల్సి వచ్చింది. గత రెండు సంవత్సరాలలో పప్పుధాన్యాల ధరలు కనీస మద్దతు కంటే మార్కెట్లో తక్కువ వున్నాయి. మన వ్యవసాయ ఎగుమతులు 2013-14 నుంచి 2016-17వరకు 268.7 నుంచి 233.6 బిలియన్ డాలర్లకు పడిపోగా, దిగుమతులు 109.7 నుంచి 185.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
ఎన్నికలకు ముందు గత యుపిఏ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అది నడచిన బాటలోనే ఎన్‌డిఏ నడుస్తోంది. వుదాహరణకు గత పద్దెనిమిది సంవత్సరాలలో పత్తి ధరలను పెంచిన తీరు చూద్దాం. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ అసలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 2000-01 నుంచి 2003-04 వరకు పొడవు పింజ పత్తి కనీస మద్దతు ధరను 1825,1875,1895,1925 మాత్రమే చేసింది. తరువాత అధికారానికి వచ్చిన యుపిఏ ఒకటి 2009 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని 2007-08లో వున్న 2030 ధరను ఏకంగా 3000కు పెంచింది. తరువాత 3000,3300కు పెంచి తరువాత 2014 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆమొత్తాన్ని 4000 చేసింది.నరేంద్రమోడీ సర్కార్ దానిని 4050 నుంచి నాలుగు సంవత్సరాలలో 4,320కి పెంచి ఇప్పుడు రు.5450 చేసింది. ఈ విషయంలో మన్మోహన్ సింగ్, నరేంద్రమోడీ ఇద్దరూ దొందూ దొందే అంటే కరెక్టుగా వుంటుందేమో !
రైతులు మరొకరు ఎవరిపట్ల అయినా ప్రభుత్వాలు, పాలకులు నిజాయితీతో వ్యవహరించాల్సి వుంది. అది గతంలో లేదు, ఇప్పుడూ కనిపించటం లేదు. రైతాంగాన్ని ఆదుకొనేందుకు అనుసరించే ఇతర విధానాలు, చర్యలతో పాటు వాటిలో వచ్చే వడిదుడుకులను మిగతా అంశాల కంటే బలంగా ఒక మేరకు తట్టుకొని నిలిచే దిగుబడుల పెంపు అన్నది మన దేశంలో తక్షణం తీసుకోవాల్సిన చర్య.