Tags

, ,

Image result for ab vajpayee, govindacharya

ఎం కోటేశ్వరరావు

మాజీ ప్రధాని ఏబి వాజ్‌పేయి దేశ రాజకీయ చరిత్రలో ఏ రకంగా చూసినప్పటికీ ఒక ప్రముఖుడనటం నిర్వివివాదాంశం. స్ధానిక, జాతీయ మీడియా సహజంగానే, అందునా కేంద్రంలో, రాష్ట్రాలలో వున్న ప్రభుత్వాలకు భయపడి లేదా భక్తితో గానీ భారీగానే ఆయన మరణవార్తలకు చోటు కల్పించింది. కేంద్ర సర్కార్‌ తీసుకున్న చర్యల వలన తన ఆదాయం రెట్టింపు అయిందని చత్తీస్‌ ఘర్‌ రాష్ట్ర రైతు మహిళ ఒకరు చెప్పిన అంశాన్ని నరేంద్రమోడీ పెద్ద ఎత్తున తన ప్రచారానికి వినియోగించుకున్నారు. అదెంత బూటకమో బయట పెట్టిన ఎబిపి న్యూస్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌, మరొక జర్నలిస్టులను రాజీనామా చేసి బయటకు పోయే విధంగా యాజమాన్యం వత్తిడి తెచ్చింది. దీని వెనుక కేంద్ర అధికార పార్టీ పెద్దల బెదిరింపులున్నాయన్నది బహిరంగ రహస్యం. తమ నేత వాజ్‌పేయి మృతికి తగినంత చోటు కల్పించలేదని ఆ పెద్దలు కినుక వహిస్తే… ఎందుకులే తంటా అని గావచ్చు లేదా వాజ్‌పేయి అంటే మీడియా యాజమాన్యాలకు వున్న భక్తి కావచ్చు.

వాజ్‌పేయి ఒక మాజీ ప్రధాని, అటువంటి వ్యక్తి మరణించినపుడు రాజకీయాలతో నిమిత్తం లేకుండా విచారం వెలిబుచ్చటం, నివాళి అర్పించటం ఒక సంస్కారం. అలా చేయటమంటే ఆయన రాజకీయాలను, ఇతర అంశాలన్నింటితో ఏకీభవించటం అని కానే కాదు. కమ్యూనిస్టు పార్టీలు సంతాప ప్రకటనలు చేయటాన్ని సామాజిక మాధ్యమంలో తప్పుపడుతూ, వ్యంగోక్తులు విసురుతూ కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాజ్‌పేయి రాజకీయ జీవితంలో వున్న ప్రతికూలతల కారణంగా ఆయన మరణానికి విచారం ప్రకటించకపోవటం ఒక విప్లవ చర్య అనే అర్ధం వచ్చేట్లుగా కొందరి తీరు వుంది. అలా అయితే హిట్లర్‌ మరణానికి కూడా సంతాపం ప్రకటించాలి కదా అనే తీరులో స్పందించారు కొందరు. దాని గురించి వదిలేద్దాం. వాజ్‌పేయికి సంతాపం ప్రకటించిన సిపిఐ(ఎం) ప్రకటన పూర్తి పాఠం ఇలా వుంది.(The Polit Bureau of the Communist Party of India (Marxist) expresses its grief at the death of former Prime Minister Shri Atal Behari Vajpayee.Shri Vajpayee had a distinguished political career in parliament, in government and as Prime Minister of India.As a political leader he commanded respect of all sections.) ‘మాజీ ప్రధాని శ్రీ అతల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ప్రధానిగా ప్రభుత్వంలోనూ, పార్లమెంటులోనూ వాజ్‌పేయి విలక్షణ రాజకీయ వురవడి కలిగినవారు. ఒక రాజకీయవేత్తగా అన్ని తరగతుల మెప్పు పొందారు.’ ఈ మాత్రపు ప్రకటన కూడా చేయకూడదని ఎవరైనా అనుకుంటే వారి అది వారికున్న స్వేచ్చ.

దేశ రాజకీయాలలో వాజ్‌పేయి పాత్ర గురించి మరణించిన సమయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం గురించి సామాజిక మాధ్యమంలో కొంతమంది పరివార్‌ అభిమానులు, కానివారు కూడా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బతికి వున్నపుడు, చురుకుగా రాజకీయాల్లో వున్నపుడు కూడా ఆయన గురించి తీవ్ర విమర్శలు చేసినపుడు కూడా ‘అభిమానులు’ పై మాదిరే వ్యవహరించారు.బిజెపికి వాజ్‌పేయి ఒక ముసుగు అని వర్ణించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త కెఎన్‌ గోవిందాచార్య గురించి తెలిసిందే. వాజ్‌పేయి మరణం సందర్భంగా దాని గురించి మాట్లాడుతూ తాను చెప్పిన మాటను ఒక తరగతి మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. బిజెపిలో వాజ్‌పేయి బహుళ ఆదరణ కలిగిన వారు, అత్యధికులు ఆమోదించే ముఖ రూపసి అని చెప్పానని అయితే ముఖ రూపసి బదులు ముసుగుగా మార్చారని గోవిందాచార్య అన్నారు. ఆ వుదంతంతో గోవిందాచార్య బిజెపి, రాజకీయాలలో కూడా చోటును కోల్పోయారు.
చరిత్రలో హిట్లర్‌ను కూడా నిస్సిగ్గుగా సమర్ధించేవారున్నారు. చరిత్రలో బతికి వున్నపుడు, మరణించిన తరువాత తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొనని రాజకీయనేతలు బహు కొద్ది మంది. అలాంటి వారిలో వాజ్‌పేయి లేరు. కొంత మంది తమ అభిమాన రాజకీయ నేతల విషయంలో అతిశయోక్తులను ముందుకు తెస్తారు. పని గట్టుకొని ప్రచారం చేస్తారు. వాజ్‌పేయి విషయంలోనూ అదే జరుగుతోందా ?

ఆగస్టు 17వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో 1942.. ఏ లవ్‌ స్టోరీ పేరుతో ఒక వార్త వచ్చింది. దాని సారాంశం ఇలా వుంది. 1942లో గ్వాలియర్‌ విక్టోరియా కాలేజీలో వాజ్‌పేయి తన సహాధ్యాయిని ప్రేమించి దాన్ని బహిరంగంగా చెప్పలేక ప్రేమలేఖ రాసి పుస్తకంలో పెట్టి ఆమెకు ఇచ్చారు. రెండు మూడు రోజులు గడిచినా ఏ స్పందనా లేకపోవటంతో తన లేఖను ఆమె చూడలేదని అనుకున్నారు. అయితే ఆమె కూడా అంగీకరిస్తూ రాసిన లేఖను అదే పుస్తకంలో పెట్టి వాజ్‌పేయికి ఇద్దామనుకున్నారు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతో వాజ్‌పేయి ఢిల్లీ వెళ్లినందున ఆ లేఖ ఆయనకు చేరలేదు. తమ ప్రేమ గురించి రాజకుమారి తలిదండ్రులకు చెప్పినా శాఖాబేధం కారణంగా వారు అంగీకరించలేదు. ఆమెకు 1947లో ఢిల్లీలో హడావుడిగా నిశ్చితార్ధం చేయించి ఆ తరువాత గ్వాలియర్‌ తీసుకువచ్చి పెళ్లి చేశారు. ప్రేమ విఫలం కావటంతో వాజ్‌పేయి పెళ్లి చేసుకోకుండా రాజకీయాలకు అంకితమై పోయారు. కొన్నాళ్ల తరువాత ఢిల్లీలో వాజ్‌పేయి అమెని కలిశారు. తరువాత వారింటికి తరచూ వెళ్లే వారు. భర్త చనిపోయిన తరువాత రాజకుమారి ఆయన అధికార నివాసానికి మకాం మార్చారు. వాజ్‌పేయితోనే వుండిపోయారు.’

అనేక మంది రాజకీయ నేతల మాదిరే వారి సంబంధం గురించి అనేక కధనాలు గతంలోనే వెలువడ్డాయి. వాటి మీద వాజ్‌పేయి స్పందించిందీ లేనిదీ తెలియదు. నాకు ఎక్కడా దొరకలేదు. ఆగస్టు 19నాటి ఈనాడు పత్రికలో వాజ్‌పేయీ స్వీయ నిర్బంధం ! అనే శీర్షికతో ఒక వార్తను బాక్సు కట్టీ మరీ ప్రచురించారు. దాని సారాంశం ఇలా వుంది. పెళ్లి అనే రెండు అక్షరాలకూ వాజ్‌పేయి బహుదూరం. వివాహానికి దూరంగా వుండిపోతే జీవితాన్ని జాతికి అంకితం చేసే వీలుంటుందన్నదే వాజ్‌పేయి అభిమతం అని ఆయన సన్నిహిత మిత్రుడు దివంగత గోరేలాల్‌ త్రిపాఠీ తనయుడైన విజయ ప్రకాష్‌ చెప్పారు. తొలి నుంచీ బ్రహ్మచర్య జీవితాన్నే ఇష్టపడేవారు. ఆయన పీజీ చేసే రోజులలో తలిదండ్రులు ఆయన వివాహం గురించి అనుకోవటం ఆయన చెవిన పడింది. కల్యాణమంటే విరక్తి పెంచుకున్న వాజ్‌పేయి కాన్పూర్‌లోని మిత్రుడి ఇంటిలో ఒక గదిలోకి వెళ్లి మూడు రోజులు తనను తాను బంధించుకున్నంత పని చేశారు.’

ఆంధ్రజ్యోతి వార్త ప్రకారం వాజ్‌పేయి ఒక భగ్న ప్రేమికుడు. ప్రేమికురాలు రాజకుమారి భర్త చనిపోయిన తరువాత ఆమె తన నివాసాన్ని వాజ్‌పేయి ఇంటికి మార్చి నాలుగు సంవత్సరాల క్రితం మరణించే వరకు అక్కడే వున్నారు. అందువలన పై రెండు వార్తలనూ పక్కపక్కనే పెట్టుకొని చదివితే పాఠకుడు గందరగోళంలో పడిపోతాడు. వాజ్‌పేయి గురించి ఈనాడు అతిశయోక్తులు రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వాజ్‌పేయి గురించి గతంలో పత్రికల్లో, మరణించిన తరువాత సామాజిక మాధ్యమంలో జరిగిన చర్చలో 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో అరెస్టయి అప్రూవర్‌గా మారి చెప్పిన సాక్ష్యంతో కొంత మందికి శిక్షలు పడ్డాయనే అంశం. ఆయన మరణించిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించటం ఏమిటి? ఆయన బతికి వుండగా విమర్శిస్తే సమాధానం చెప్పటమో, సరిదిద్దుకోవటమో చేసే వారు కదా అని కొంత మంది సామాజిక మాధ్యమ చర్చల్లో అభిప్రాయపడ్డారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర వుద్యమానికి దూరం. అలాంటి సంస్ధలో 1939లోనే చేరిన వాజ్‌పేయి 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో ఎలా పాల్గొన్నారు. ద్రోహం చేసినట్లు, కోర్టులో అంగీకరించిన ప్రకటన వలన ఆయన బయటపడినా కొందరికి శిక్షలు పడటం గురించి నిజా నిజాలేమిటి? దీనికి సంబంధించి ఫ్రంట్‌లైన్‌ పక్షపత్రిక 1998 ఫిబ్రవరి 7-20వ తేదీ సంచికలో ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. వాజ్‌పేయిని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తెచ్చే క్రమంలో ఆయనకు స్వాతంత్య్రవుద్యమంలో పాల్గన్న నేపధ్యం వుంది అని చెప్పేందుకు గాను సంఘపరివార్‌, బిజెపి తాపత్రయ పడింది, వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారని ప్రచారం చేశారు. చివరికి వాజ్‌పేయి కూడా స్వయంగా తాను క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్నట్లు చెప్పుకున్నారు. ఇక్కడే చిక్కువచ్చింది. ఇరవై ఒక్క రోజులు జైలులో వున్న తరువాత ఒక పత్రం రాసి ఇచ్చి బయటపడ్డారు. అయితే తాను ఎలాంటి పత్రం రాయలేదని, బ్రిటీష్‌ వారికి లొంగిపోలేదని వాదించారు. చివరకు మీడియా పరిశోధనలో వెల్లడైన అంశాల కారణంగా తాను పత్రంపై సంతకం చేసిన మాట నిజమే అని ఫ్రంట్‌లైన్‌ ప్రతినిధులతో అంగీకరించారు. 1942 సెప్టెంబరు ఒకటవ తేదీన ఆగ్రా జిల్లా సెకెండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు వుర్దూలో రాసిన పత్రంపై వాజ్‌పేయి ఆంగ్లంలో సంతకం చేశారు. దాదాపు అలాంటిదానినే ఆయన సోదరుడు ప్రేమ్‌ బిహారీ వాజ్‌పేయి కూడా మెజిస్ట్రేట్‌కు అంద చేశారు. ఇంతకీ ఎబి వాజ్‌పేయి రాసిచ్చిన పత్రంలో ఏముంది?

నా పేరు : అతల్‌ బిహారీ , తండ్రిపేరు : గౌరీ శంకర్‌, నా కులం: బ్రాహ్మణ, వయస్సు : 20, వృత్తి : విద్యార్ధి గ్వాలియర్‌ కాలేజి, చిరునామా : బాతేష్వర్‌, పిఎస్‌ బా, జిల్లా ఆగ్రా

మీరు దహనకాండకు పాల్పడ్డారని, నష్టపరిచారని చెబుతున్నారు, దీనికి సంబంధించి మీరేమి చెబుతారు. అన్న న్యాయూర్తి ప్రశ్నకు ‘ 1942 ఆగస్టు 27న బాతేష్వర్‌ బజార్‌లో ఆలా గానం నిర్వహిస్తున్నారు. సాయంత్రం రెండు గంటల సమయంలో కకువా అనే లీలాధర్‌ మరియు మహువా ఆలా దగ్గరకు వచ్చి ఒక వుపన్యాసం ఇచ్చి అటవీ చట్టాలను వుల్లంఘించాలని కోరారు. రెండువందల మంది జనం ఫారెస్ట్‌ ఆఫీసుకు వెళ్లారు, నేను నా సోదరుడు జనాన్ని అనుసరించాము బటేష్వర్‌ అటవీ కార్యాలయానికి చేరుకున్నాము. నా సోదరుడు, నేను కిందనే వున్నాము, జనం పైకి వెళ్లారు. నాకు కకువా మరియు మహువా తప్ప అక్కడున్నవారిలో మరే ఇతర వ్యక్తి పేరూ తెలియదు. ఇటుకలు కిందికి పడుతున్నట్లు నాకు కనిపించింది. గోడను ఎవరు పడగొడుతున్నారో తెలియదు కానీ గోడ ఇటుకలు మాత్రం పడుతున్నాయి. నేను నా సోదరుడితో కలసి మెయిపురా వెళ్లేందుకు బయలుదేరాము, జనం మా వెనుక వస్తున్నారు.పైన పేర్కొన్న వ్యక్తులు పశువుల శాల నుంచి మేకలను బలవంతంగా బిచికోలీ వైపు మళ్లించారు. అటవీ కార్యాలయంలో పది పన్నెండు మంది వున్నారు. నేను వంద అడుగుల దూరంలో వున్నాను. ప్రభుత్వ భవనాన్ని పడగొట్టటానికి నేను ఎలాంటి సాయం చేయలేదు. ఆ తరువాత మేము ఇండ్లకు వెళ్లాము.’

ఈ పత్రంపై అతల్‌ బిహారీ వాజ్‌పేయితో పాటు మెజిస్ట్రేట్‌ ఎస్‌ హసన్‌ కూడా సంతకాలు చేశారు. శిక్షా స్మృతి సెక్షన్‌ 164కింద ఈ ప్రకటనను నమోదు చేశారు. ఆ పత్రం మీద మెజిస్ట్రేట్‌ చేత్తో కింది విధంగా రాసి సంతకం చేశారు.

అతనెలాంటి తప్పు చేయలేదని గౌరీశంకర్‌ కుమారుడైన అతల్‌ బిహారీకి నేను వివరించాను, ఒకవేళ చేసి వుంటే ఏ తప్పయినా చేస్తే దానిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యంగా పరిగణిస్తామని చెప్పాను. ఈ విషయాలు అతను స్వచ్చందంగా వెల్లడించినట్లు నేను నమ్ముతున్నాను.ఇది నా సమక్షములో తీసుకున్నది, అతల్‌ బిహారికి చదివి వినిపించబడినది, దానిలో తాను చెప్పిన అంశాలే పూర్తిగా వున్నాయని, సరైనవే అని అతను అంగీకరించాడు.

కోర్టులో చేసిన ఈ ప్రకటనను బట్టి వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొనలేదు. ఆందోళనకారుల వెనుక వున్నందున ఆయనను కూడా అరెస్టు చేశారు. ఆ రోజు జరిగినదానితో తనకేమీ సంబంధం లేదని స్పష్టంగా చెప్పినందున తరువాత కేసు నుంచి ఆయన బయట పడ్డారు. నిజమైన స్వాతంత్య్ర సమర యోధులందరూ పోలీసులు, కోర్టుల ముందు తాము బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పాల్గొన్నట్లు వీరోచితంగా ప్రకటనలు చేసి చెరసాలలు, వురికొయ్యలకు తమ జీవితాలను అంకితం చేశారు. జైలు జీవితాలు, చిత్రహింసలను భరించలేని సావర్కర్‌ వంటి వారు లొంగిపోయి బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటామని, విధేయతతో వుంటామని లేఖలు రాసి బయట పడ్డారు. ఇక వాజ్‌పేయి కోర్టులో చేసిన ప్రకటనలో తన పేరు ప్రస్తావించినందున సాక్ష్యంగా చెప్పకపోయినా తన శిక్షకు కారణం అది కూడా ఒకటని కకువా అనే లీలాధర్‌ అభిప్రాయపడ్డారు. దాన్నే కాంగ్రెస్‌ నాయకులు ప్రచారంలో పెట్టి వాజ్‌పేయి లొంగుబాటు కారణంగా స్వాతంత్య్ర సమర యోధులకు శిక్షలు పడ్డాయని ప్రకటనలు చేశారు. చాలా కాలం పాటు వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్న సమర యోధుడని చేసిన ప్రచారం అవాస్తవమని తేలింది. తాను పాల్గొనలేదని, జరిగినదానితో జరిగినదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా కోర్టులో ప్రకటన చేశారు. వాజ్‌పేయి గానీ మరొక నేత గానీ ఎవరి గురించి అయినా అతిశయోక్తులు ప్రచారం చేసుకోవటానికి కొందిరికి ఎలా స్వేచ్చ వుంటుందో విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించటానికి కూడా ఎవరికైనా అలాంటి స్వేచ్చే వుంటుంది. ఎవరూ చరిత్ర విశ్లేషణలు, విమర్శలకు అతీతులు కాదు. అది సభ్య సమాజం ఆమోదించిన పరిమితులకు లోబడి వుండాలి. సానుకూలంగా లేదా ప్రతికూలంగా చేసే విమర్శలు లేదా ఆరోపణలకు ఆధారాలు చూపగలిగి వుండాలి. మేం చెప్పింది మా నమ్మకం, విశ్వాసం, ఇతరులు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారంటే కుదరదు.