Tags

, , ,

Image result for narendra modi hitting  below the belt with currency cartoons

ఎం కోటేశ్వరరావు

కత్తులతో పని లేకుండా కంటి చూపుతో ఖతం చేస్తా అన్న హీరోలను సినిమాల్లో చూశాము. రూపాయితో 135కోట్ల జనాన్ని చావు దెబ్బలు కొడుతున్న హీరో ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడో పెద్ద విజయగాధను చెప్పుకోకతప్పదు. నరేంద్రమోడీ పాలనలో హిందూ మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని సంసారాలతో పని లేని యోగులు, యోగినులు చేసిన ప్రచారం వల్లకానీయండి, మరో విధంగా గానీ నరేంద్రమోడీ తన ఖాతాలో మరొక విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2015 నుంచి ఈ విశ్లేషణ రాసే సమయానికి ప్రపంచంలో మన జనాభా శాతం 17.73 నుంచి 17.74శాతానికి పెరిగింది. ఇదే సమయంలో చైనా వాటా 18.92 నుంచి 18.54కు పడిపోయింది. యోగులు, యోగినులు కూడా సన్యాసాన్ని త్యజించి, భార్యలను వదిలేసిన భర్తలు కూడా ఒకింటి వారై సంతానోత్పత్తిలో పాల్గని వుంటే మన జనాభా ఇంకా పెరిగి వుండేది, చౌకగా శ్రమను ధారపోసి మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేసి వుండేవారు.

మన సమాజం ఎంతటి నేరాన్ని అయినా సహించింది, క్షమించింది. నాడు నేడు రేపు నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించదు. 2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు. ఆ గడువు తీరిపోయి త్వరలో పెద్ద నోట్ల రద్దు రెండవ వార్షికోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. ప్రతి నెలా మన్‌కీ బాత్‌ పేరుతో మాట్లాడుతూనే వున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన పెద్ద నోట్ల రద్దు వుద్ధేశ్యం ఏమేరకు నెరవేరిందో చెప్పలేదు. హైదరాబాదు వంటి మహానగరంలో ఇది రాస్తున్న సమయానికి కూడా కొన్ని ఎటిఎంలలో గరిష్టంగా ఒకసారికి ఐదువేలకు మించి డబ్బుతీసుకొనే పరిస్ధితి లేదు. ఎక్కువసార్లు తీసుకుంటే బ్యాంకుల బాదుడు మీకు తెలిసిందే.

పోనీ రిజర్వుబ్యాంకు అయినా నిజం చెప్పిందా ! బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఏ రోజుకు ఆరోజు ఖరారు అవుతాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇచ్చిన గడువు ప్రకారం ఏ రోజు ఎన్ని రద్దయిన నోట్లు వచ్చాయో తెలుసుకోవటం కష్టం కాదు. గడువు ముగిసి నెలలు, సంవత్సరం గడిచినా ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయో చెప్పలేదు. కొద్ది రోజులు నోట్ల లెక్కింపుపూర్తి కాలేదని చెప్పారు. ఈలోగా జనం మరచి పోయారు. ఎంతకాలం దాచినా ఏదో ఒక నివేదికలో వాస్తవాలను ప్రచురించకతప్పదు కనుక తాజాగా రిజర్వుబ్యాంకు నివేదికలో వెల్లడించకతప్ప లేదు. దాని ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.రాని వాటి విలువ కేవలం గాకపోయినా మరుసటి రోజుకు ఆన్‌లైన్‌లో లెక్కలు సరి చూసి 10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.

Image result for demonetisation, rbi report cartoons

కనీసం మూడు లక్షల కోట్ల రూపాయల విలువగల నోట్లు వెనక్కు రావని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య ఆదాయం వస్తుందని మోడీ సర్కార్‌ లెక్కలు వేసుకుంది. నోట్ల రద్దు వలన ఎలాంటి ఫలితం వుండదని అనేక మంది నిపుణులు ముందే చెప్పారు. వారందరూ నల్లధనాన్ని కలిగి వున్నవారి మద్దతుదార్లుగా చిత్రించారు. రద్దయిన నోట్లను మార్చుకొనేందుకు, కొత్త నోట్లు తీసుకొనేందుకు బ్యాంకుల ముందు గంటల తరబడి వరుసలలో నిలబడటం దేశభక్తికి చిహ్నంగా అనేక మంది నిజంగానే భావించారు, భ్రమించారు. ఎవరైనా నోట్లరద్దును విమర్శిస్తూమాట్లాడితే దేశద్రోహి అన్నట్లు అసహ్యించుకొని చూసినవారు, కొట్టేందుకు వచ్చిన వారు కూడా లేకపోలేదు. నోట్ల రద్దు చర్య తీసుకున్నవారు గానీ దానిని సమర్ధించిన వారుగానీ తేలు కుట్టిన దొంగల మాదిరి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నోట్ల రద్దు ఎవరికీ తెలియదు నరేంద్రమోడీ తీసుకున్న అత్యంత గుప్త నిర్ణయం అని అప్పుడు అందరూ మోడీకీర్తిని పెంచేందుకు ప్రచారం చేశారు. అది వికటించిన తరువాత ఇతరుల మీద నెపం మోపేందుకు అవకాశం లేకపోవటంతో ఎన్ని విమర్శలు వచ్చినా దాని గురించిన వివరాలు బయటపెట్టకుండా అడ్డుకున్నారు.

Image result for demonetisation, rbi report cartoons

ఇంతకాలం తరువాత అయినా నోట్ల రద్దు తప్పిదమనే నిజాయితీ ఎక్కడా ప్రదర్శితం కావటం లేదు. దాని వలన వచ్చిన లాభం ఏమిటో నష్టాలు ఏమిటో అధికారికంగా చెప్పే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదా రిజర్వుబ్యాంకుకు లేదు. అనేక సర్వేలు చేస్తున్న బ్యాంకు నష్టాల గురించి ఇంతవరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు, లేదా రహస్యంగా చేసి వుంటే బయటకు చెప్పటం లేదు. దేశం, జనాభాపట్ల జవాబుదారీతనం అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.నష్టాల గురించి ఎవరైనా మాట్లాడిదే దానిని రాజకీయంగా మార్చి పక్కదారి పట్టిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. నోట్ల రద్దు ఫలితంగా ఒక శాతం జిడిపి నష్టం జరిగిందని 2017 జనవరి-ఏప్రిల్‌ మాసాల మధ్య పదిహేను లక్షల వుద్యోగాలు హరీ మన్నాయన్నది(సిఎంఐయి) అంచనా. ఈ నష్టం సంగతి ఏమిటి? కొత్త నోట్ల మార్పిడి లేదా ఎటిఎంలు, బ్యాంకుల ముందు తమ డబ్బు తాము తీసుకోవటానికి వెచ్చించిన పని గంటలు, పెట్టిన సెలవులు దీనికి అదనం. మాజీ అర్ధిక మంత్రి పి చిదంబరం చెప్పిన లెక్కల ప్రకారం ఏడాది కాలంలో జిడిపి 1.5శాతం నష్టం విలువ 2.25లక్షల కోట్లు, అనేక వారాల పాటు 15కోట్ల మంది రోజువారీ కూలీలు పని కోల్పోయారు, నోట్ల కోసం వరుసల్లో నిలబడి వంద మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, ఫలితంగా లక్షల మంది కార్మికులకు పని పోయింది. ఆ నష్టం ఎంతో ఎవరూ లెక్క గట్టలేదు. ఐదు వందలకు బదులు వెయ్యి, రెండు వందలు, యాభై కొత్త నోట్లను ఎటిఎం యంత్రాలలో అమర్చేందుకు వాటిని మూసివేసినపుడు జనం అనుభవించిన యాతనలు చెప్పనవసరం లేదు. యంత్రాలలో మార్పులు చేర్పులకు ఆయా బ్యాంకుల మీద పడిన భారం గురించి కూడా ఎవరూ నోరు విప్పటం లేదు. ఎవరైనా చెబితే అది నేరుగా నరేంద్రమోడీకే తగులుతుంది, సదరు అధికారి బలి ఖాయం. ఇలా బయటకు చెప్పుకోలేని,లోపల తట్టుకోలేని ఇబ్బందులెన్నో. రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. నోట్లు రద్దు చేయటానికి ముందు అంటే 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆర్‌బిఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా 65,876 కోట్లు ఇచ్చింది, నోట్ల రద్దు తరువాత 2016-17లో ఆ మొత్తం 30,659 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. తదుపరి ఏడాది చెల్లించిన మొత్తం కూడా 50వేల కోట్లకు మించలేదు. అంటే కేవలం రెండు సంవత్సరాలలోనే 55వేల కోట్ల మేరకు కేంద్రానికి ఆదాయ నష్టం జరిగింది. ఇతర వాణిజ్యబ్యాంకులకు నిరర్ధక ఆస్ధులు పెరిగిపోవటంతో నష్టాలు వచ్చాయి, మరి రిజర్వుబ్యాంకు లాభాలు ఎందుకు పడిపోయినట్లో ఎవరైనా చెబుతారా ? దేవగిరి-ఢిల్లీ మధ్య రాజధానులను మార్చిన మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ చర్యకు సైన్యం, పరివారమే ఇబ్బంది పడింది. నరేంద్రమోడీ చర్యకు యావత్‌ దేశం ఇబ్బంది పడింది. ఇద్దరిలో ఎవరు మెరుగు ?

నోట్ల రద్దుకు ముందు అంటే 2016నవంబరు నాలుగున మన వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా కూడా చెప్పినట్లు కొంత మంది బాత్‌ రూముల్లో దాచుకున్నదానితో సహా దేశంలో 17.97లక్షల కోట్ల రూపాయల నగదు చెలామణిలో వుంది. ఈ ఏడాది మార్చి నాటికి చెలామణిలో వున్న నగదు 18.03లక్షల కోట్లు, అయినా సరే బ్యాంకుల్లో వున్న తమ డబ్బును తీసుకోవాలంటే అడిగినంత మొత్తం ఇవ్వలేమని బ్యాంకులు ఎందుకు చెప్పినట్లు? అంటే తిరిగి బాత్‌రూముల్లోకి పోయిందా? పోకుండా మోడీ సర్కార్‌ ఏం చేస్తున్నట్లు ? స్వయం సేవకులతో సహా చెప్పేవారెవరూ లేరు…… పోతే పోనీ గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే వుందే అన్న ముతక సామెత మాదిరి నోట్ల రద్దు వలన జరిగిన నష్టం కంటే వచ్చిన ఫలితాలు బాగున్నాయని ఇప్పటికీ అధికారపక్ష పెద్దలూ, వారికి అనుగుణంగా, కొందరు మేథావులూ, అధికారులూ అతిశయోక్తులు చెప్పటం విశేషం. నోట్ల రద్దు వలన పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణమే ఎక్కువగా ప్రభావితమైందని ఒక అధ్యయనంలో ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. గురుచరణ దాస్‌ అనే ఆర్ధికవేత్త మాట్లాడుతూ ఇండ్లలో దాచుకున్న సొమ్ము బ్యాంకుల్లోకి వచ్చింది, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారందరూ భవిష్యత్‌లో పన్ను చెల్లింపుదారులుగా మారతారు, డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ వేగంగా పెరిగింది అన్నారు. అయితే సానుకూల ఫలితాలు రావటానికి ఇది(పెద్ద నోట్ల రద్దు) మార్గం కాదు. జనాలు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువగా వుంది. నా అంచనా ప్రకారం ఒక ఏడాది ఆర్ధిక అభివృద్ధిని మనం నష్టపోయాము. దేశంలో వుపాధి సమస్యను పరిష్కరించాలంటే మనం ఏటా ఎనిమిదిశాతం చొప్పున 20సంవత్సరాల పాటు పెరగాలి అని కూడా దాస్‌ చెప్పారు.

Image result for demonetisation, rbi report cartoons

రాజుగారు నందంటే నంది, పందంటే పంది గురించి చెప్పగలిగిన సమర్ధులు మన వున్నతాధికారులు.కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్క్‌ నోట నోట్ల రద్దు విజయగానంలో చోటు చేసుకున్న అంశాలు ఇలా ఆవు వ్యాసంలో విషయాల మాదిరి వున్నాయి. గతంమాదిరే కరెన్సీ వ్యవస్ధ కొనసాగి వుంటే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు నోట్ల చలామణి తక్కువ వుండేది. మూడు లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకింగ్‌ వ్యవస్ధకు దూరంగా వుండేది, నోట్ల రద్దు తరువాత రెండులక్షల కోట్ల మేరకు బ్యాంకులకు చేరింది. ఆదాయపన్ను శాఖ 1.75లక్షల కోట్ల రూపాయల మొత్తంతో ప్రమేయమున్న అనుమానిత ఖాతాల గురించి పరిశీలన చేస్తున్నది. పద్దెనిమిది లక్షల మందికి ఆదాయానికి మించి ఆదాయం వున్నట్లు గుర్తించారు. వారిమీద చర్యల ద్వారా నల్లధనం మీద దాడి లక్ష్యం నెరవేరుతుంది. గతంలో నకిలీనోట్లు పెద్ద ఎత్తున చలామణిలో వుండేవి. నోట్ల రద్దు తరువాత అవి పెద్దలెక్కలోకి వచ్చేవిగా లేవు. ఇప్పుడు ఎవరైనా ఆ నోట్లను గుర్తించగలరు, ఎవరినీ మోసం చేయలేరు. నగదు రహిత(డిజిటల్‌ ) లావాదేవీలు పెరిగి ఒక నెలలో 25కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి, మార్చినెలల్లో నగదుకు కొరత వుండేది ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇలా బూతద్దంలో చూపేందుకు గార్గ్‌ ప్రయత్నించారు.

పెద్ద మొత్తంలో కరెన్సీ చలామణిలోకి వచ్చిందని ఏలుబడిలో వున్నవారు చెబుతుంటే కొన్ని కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చలామణిలో వున్న కరెన్సీ విలువ 19.38లక్షల కోట్ల రూపాయలని, పొదుపు 2.8శాతానికి పెరిగిందని అంగీకరిద్దాం. ఇదే సమయంలో పొదుపు సొమ్ము బ్యాంకులు లేదా కార్పొరేట్‌ డిపాజిట్లలో ఐదు దశాబ్దాల కనిష్టం 2.9శాతానికి ఎందుకు పడిపోయిందన్నది విశ్లేషకుల ప్రశ్న. డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరిన మొత్తంలో కొంత నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌ వ్యవస్ధ నుంచి వెళ్లిపోయింది. వడ్డీ రేటు తగ్గటంతో వ్యక్తిగతంగా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం తగ్గింది. అంతకు ముందు సంవత్సరంలో 6.3శాతం వున్న డిపాజిట్లు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో 2.9శాతానికి పడిపోయాయి.

నోట్ల రద్దుతో జనం మీద దాడి చేసిన మోడీ ఇప్పుడు కరెన్సీ విలువతో దాడికి దిగినట్లు కనిపిస్తోంది. మోడీకి దీనికి సంబంధం ఏమిటని కొందరు అడ్డు తగల వచ్చు. మోడీ సర్వాంతర్యామి, ఇందుగలదందు లేడను సందేహము వలదు లేదా అన్నీ నేనే అని గీతాకారుడు చెప్పినమన భూమిలో కరెన్సీలో ఆయన లేకుండా ఎలా వుంటాడు. నోట్ల రద్దు తన స్వంత నిర్ణయం చెప్పిన పెద్ద మనిషి పడిపోతున్న రూపాయి విలువకు కారణాలేమిటో, తన ప్రమేయం లేకపోతే జనాన్ని ఎలా ఆదుకుంటారో రాజధర్మంగా అయినా చెప్పాలి కదా ? శుక్రవారం నాడు మార్కెట్‌ వేళలు ముగిసే సమయానికి డాలరుతో మారకానికి రు.70.94గా పతనం చెంది సరికొత్త రికార్డు నమోదు అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల కెళితే ఏ జబ్బుకైనా ఒకే రంగు గోళీలు, నీళ్ళ మందుపోస్తారని ప్రతీతి. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకొనేందుకు గత కొద్ది రోజులుగా మన రిజర్వుబ్యాంకు అటువంటి పనే చేసింది. జబ్బు ఒకటైతే నీళ్ల మందు చికిత్సలకు తగ్గుతుందా? ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ కరెన్సీ నివేదిక ప్రకారం చమురు ధరలు ఎక్కువగా వున్నంత వరకు మన వంటి దేశాల కరెన్సీ విలువ పతనం కొనసాగుతూనే వుంటుంది. రూపాయి విలువ 70.45-70.90 లేదా అంతకు దిగువకు పడిపోవచ్చు. ఆ జోశ్యాన్ని కూడా మన రూపాయి వమ్ము చేసి ఆగస్టు 31న 70.96 నమోదు చేసింది. దిగుమతిదారులకు 70.20, ఎగుమతిదారులకు 69.75 స్ధాయిల్లో వుంటుందనే అంచనాతో లావాదేవీలను సాగించుకోవచ్చని ఐఎఫ్‌ఏ సలహా ఇచ్చింది. దిగుమతిదారుల నుంచి డిమాండ్‌ పెరగటం, మరింత పతనం అవుతుందేమో దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే ముందుచూపుతో విదేశీ మదుపుదారులు తమ సొమ్మును వెనక్కు తీసుకోవటం ఎక్కువగా చేస్తుండటంతో రూపాయి పతనం కొనసాగుతోంది. అది త్వరలో 71లేదా 72కు చేరనుందని అనేక మంది చెబుతున్నారు.ఇప్పటికే ఈ ఏడాది పదిశాతం పతనమై ఆసియాలో అత్యంత అధ్వాన్నంగా మారిన కరెన్సీగా రూపాయి పేరు తెచ్చుకుంది.

దేశంలోపలివా, వెలుపలివా కారణాలు ఏవైనప్పటికీ డాలర్లకు డిమాండ్‌ పెరగటం మన రూపాయి విలువ పతన కారణాల్లో ఒకటి. పెట్రోలు, డీజిలు లేకపోతే గడవదు కనుక ఎన్ని డాలర్లయినా ఇచ్చి తెచ్చుకోవాలనుకుందాం.విదేశీ లిప్‌స్టిక్‌లు,లో దుస్తులు, పై దుస్తులు, నగలు, వాచీలు, బంగారం చివరికి అమెరికా నుంచి బాదం పప్పు, దోసకాయల వంటి నిత్యావసర వస్తువులు లేకపోతే తమకు గడవదు అనుకొనే వారికి కూడా మన జనం మొత్తం తరఫున అధిక ధరలకు డాలర్లను కొని ఇస్తున్నాం. ఇరాన్‌ మీద అమెరికా వాడికి కోపం వస్తే పెరిగే చమురు ధరలకు మన ఇతర దేశాల నుంచి కొనాలి తప్ప చౌకగా ఇచ్చే ఇరాన్‌ నుంచి కొనుగోలు చేయం. ఎందుకంటే ట్రంప్‌కు మన మీద కోపం వస్తుంది. ఇలాంటి వాటి కారణంగా మన కరెంట్‌ ఖాతాలోటు పెరుగుతోంది. మనం చేసుకొనే దిగుమతులకు చెల్లించే మొత్తం, మన ఎగుమతుల ద్వారా సంపాదించే ఆదాయ మొత్తానికి మధ్య వుండే తేడానే కరెంట్‌ ఖాతా లోటు లేదా మిగులు అంటాం.మరో విధంగా చెప్పాలంటే పెట్టుబడులు సంపాదించటానికి, పలుకుబడి పెంచే పేరుతో విదేశాలకు విమానాల్లో తిరగటానికి, రోజుకో కొత్త కోటు వేసుకోవటానికి మన మోడీకి అయ్యే ఖర్చు ఆయన సంపాదించిన దాని కంటే ఎక్కువ వుంది అనుకోండి.

2018 ఆర్ధిక సంవత్సరంలో మన కరెంట్‌ ఖాతా లోటు జిడిపిలో 1.9శాతం వుంటే అది 2019కి 2.8కి పెరుగుతుందని అంచనా. ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం తగ్గుతోంది. మన దేశ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు, ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చేవారు ఇంతకు ముందు గణనీయంగా పెరిగారు. ఇప్పుడు ఎందుకైనా మంచిదని వెనక్కు వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50వేల కోట్ల రూపాయల మేర వెనక్కు తీసుకున్నారు. మనకు అప్పులు ఇచ్చేవారు డాలర్లలో ఇస్తారు, డాలర్లలోనే తీసుకుంటారు. మనరూపాయలను అంగీకరించరు. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో తొలిసారిగా మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి నాటి గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 71రూపాయలను ఏక్షణంలో అయినా దాటేట్లు వుంది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే నరేంద్రమోడీ పాలనలో కూడా అదే స్ధాయిలో జరిగింది, త్వరలో నూతన రికార్డులను కూడా నమోదు చేయవచ్చు. మోడీ అధికారానికి వచ్చినపుడు మనం ఒక వంద డాలర్లు అప్పు తీసుకున్నామనుకుంటే అసలు రు.5843. దానికి మార్కెట్లో వున్న రేటున బట్టి వడ్డీ చెల్లించాలి.( అలాగాక చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మా ణానికి అప్పుకు అధికవడ్డీ రేటు ఇచ్చినట్లుగా ఇస్తే అది వేరే.) చైనాతో పేచీ వచ్చింది, మాక్కూడా డాలర్ల అవసరం పెరిగింది మా సొమ్ము మాకివ్వండని అమెరికా వాడు అడిగాడనుకోండి. గత నాలుగేండ్లుగా చెల్లించాల్సిన బారు లేదా చక్ర వడ్డీగాక, అసలే 7096కు పెరిగిపోయింది. మన రూపాయి విలువ పతన పర్యవసానమిది.

దీన్నే మరో విధంగా చెప్పుకోవటం అవసరం. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అక్కడి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అమెరికా, ఇతర ధనిక దేశాలలో వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించారు. వుదాహరణకు ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ అనే వెబ్‌సైట్‌ విశ్లేషణ ప్రకారం అమెరికాలో సంక్షోభ సమయంలో వడ్డీ రేటు 3.6శాతం వుండగా ఒక ఏడాదిలో అది 0.25శాతానికి పడిపోయింది.2016 వరకు అదే కొనసాగి, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రెండుశాతానికి పెరిగింది. అంతకంటే ఎక్కువగా మన దేశంలో వడ్డీ రేట్లు వున్నాయి కనుక. డాలరు బాబులు మనకు వుదారంగా అప్పులిచ్చారు. ఇప్పుడు తమ దగ్గరే వడ్డీ రేట్లు పెరిగాయి, ఇంకా పెంచుతామని అమెరికా ఫెడరల్‌ రిజర్వు( రిజర్వుబ్యాంకు వంటిది) ప్రకటించింది. గనుక మనకు అప్పు లేదా పెట్టుబడులు పెట్టటం కంటే తమ దేశమే నయమని ఎవరికి వారు వెనక్కి తీసుకుంటున్నారు. ఇది కూడా మన రూపాయి పతనానికి దారి తీస్తోంది.

మన వాణిజ్యమంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్‌ా జూలై నెలల్లో మన చమురు దిగుమతుల విలువ 46.98 బిలియన్‌ డాలర్లు. అదే నెలల్లో ఒక ఏడాది క్రితం ఆ మొత్తం 31.02 బిలియన్లు మాత్రమే. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగటమే దీనికి కారణం. ఇది ప్రామాణిక బ్రెంట్‌ ముడిచమురు ప్రస్తుతం పీపా ధర 78 డాలర్లు వుంది. ఈ ఏడాది అది 80 దాట వచ్చని అంచనా. చమురు ధరలు అంతకు మించి 90 డాలర్లకు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు 3.6శాతానికి చేరుతుందని అంచనా. ఇదే జరిగితే జనంలో గగ్గోలు చెలరేగకుండా వుండాలంటే చమురు మీద పెంచిన పన్నులను అయినా తగ్గించాలి. లేదా పెరిగిన భారాన్ని జనం మీద మోపాలి. తగ్గిస్తే ప్రభుత్వం అదనంగో నోట్లను ముద్రించాలి, అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే ధరలు పెరుగుతాయి. భారం తగ్గించకపోయినా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. కరంట్‌ ఖాతా లోటు పెరిగితే అప్పులు తెచ్చి లేదా జనం మీద భారాలు మోపీ చెల్లింపులు చేయాల్సి వుంటుంది. ఏది జరిగినా భరించాల్సింది జనమే.

గతంలో చూసిన అనుభవాల కారణంగా విదేశీమారక ద్రవ్యనిల్వలకు ఆర్‌బిఐ కొన్ని చర్యలు తీసుకుంది. వాటి నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య 14.5బిలియన్‌ డాలర్లను విక్రయించి డాలర్లకు డిమాండ్‌ను తగ్గించేందుకు తద్వారా రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూసేందుకు ప్రయత్నించింది. రూపాయి బాండ్లను ప్రవేశపెట్టటం, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచటం ద్వారా డాలర్ల డిమాండ్‌ను తగ్గించటం వంటి చర్యలు తీసుకుంది. రూపాయి విలువ పతనాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని మన దేశానికి పంపుతున్నారు. మన కరెన్సీ ఎంత పతనమైతే వారికి అంతగా కష్టపడకుండానే ఎక్కువ రూపాయలు వస్తాయి మరి. చైనాలో కరెన్సీ విలువ మన మాదిరి పతనం కాలేదు, డాలరుతో పోటీ పడుతోంది కనుక ప్రవాస చైనీయులు మనవారి కంటే ఐదు బిలియన్‌ డాలర్లు తక్కువ పంపారట. చమురు ధరలు తక్కువగా వున్నాయి గనుక సొమ్ము చేసుకుందామని పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన విమాన కంపెనీలు ఇప్పుడు దివాలా బాటలో వుండటానికి చమురు ధరలు పెరగటమే కారణం.రాబోయే రోజుల్లో దిగుమతి చేసుకొనే ఆధునిక పరికరాలు ధరలు పెరిగి టెలికాం కంపెనీలపై భారం పెరగనున్నదని అప్పుడే వార్తలు వస్తున్నాయి. మన్మోహన్‌ సింగ్‌ చివరి రోజుల్లో అంటే 2013లో ఆరునెలల దిగుమతి అవసరాలకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలుంటే ఇప్పుడు మోడీ చివరి రోజుల్లో పది నెలలకు సరిపడా వున్నాయి. అనూహ్యపరిస్ధితులు తలెత్తితే పరిస్ధితి ఇంకా దిగజారి మరోసారి అప్పుల చిప్ప పట్టుకోవాల్సి వచ్చినా ఆశ్చర్య ం లేదు. ఇటువంటి విధానాలతో లబ్ది పొందేవారి కంటే నష్టపోయేవారే ఎక్కువ.1991 తరువాత అధికారంలో వున్నవారు వరుసగా రెండవ సారి ఎన్నిక అవటం 2009 ఒక్క మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే జరిగింది. మరే పార్టీ వరుసగా అధికారంలోకి రాలేదు. అందుకే పరిస్ధితులు మరింతగా దిగజారకముందే ఓటర్ల ముందుకు వెళితే ఫలితం వుంటుందేమో అన్నఆశతో నరేంద్రమోడీ ముందస్తు ఎన్నికల గురించి దూరాలోచన చేస్తున్నారు.