రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -2
ఎం కోటేశ్వరరావు
మన రూపాయే కాదు చైనా యువాన్ కూడా అంతకంటే ఎక్కువగానే పతనమైంది కదా, దాని గురించి మాట్లాడరేమని ఒక విమర్శ. ఈ విషయంలో చైనాతో పోల్చేవారు మిగతా అంశాలలో కూడా ఆ దేశంతో పోల్చితే నిజాయితీగా వుంటుంది. మన కంటే బాగా అభివృద్ధి చెంది, జపాన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదిగింది అంటే అది కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామిక దేశం అని వితండవాదం.మనకంటే అనేక దేశాలలో ప్రజాస్వామ్యమేగా వుంది, వాటితో సమంగా లేదా దగ్గరగా అయినా ఎందుకు ఎదగలేదు అంటే సమాధానం వుండదు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి మనకంటే యువాన్ పతన శాతం ఎక్కువ కాదు, గణనీయంగానే మనకు దగ్గరగా పడిపోయింది. మన కంటే పొరుగున వున్న పాక్ రూపాయి డాలరు మారకంతో మరింతగా పతనమైంది. దాన్ని చూసి మన దేశం మోడీ పాలనలో వెలిగిపోతున్నట్లు భావించాలా ?
కరెన్సీ విలువల పనితీరు గురించి చెప్పేటపుడు పోలిక సాధారణం. కరెన్సీ పతనమైన దేశాలన్నీ ఏదో ఒక తీవ్ర సమస్యను ఎదుర్కొంటాయి. పతనం కాని దేశాలన్నీ సజావుగా వున్నాయనుకుంటే పప్పులో కాలేసినట్లే ! ఒక దేశ కరెన్సీ విలువ పతనం లేదా పెరుగుదల అన్నది వాటి పరిస్ధితులు, అంతర్గత విధానాల మీద ఆధారపడి వుంటాయి. తెలిసి లేదా తెలియకగానీ చైనాను ముందుకు తెస్తున్నారు గనుక దాని గురించే చూద్ధాం. మన దేశం దాదాపు ప్రతి దేశంతో వాణిజ్యలోటులోనే వుంది. అంటే మనం చేసే ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. అందువల్లనే మన విదేశీమారక ద్రవ్య ఎప్పటి కప్పుడు ఎన్నినెలల దిగుమతులకు సరిపడా వుంటుంది అని లెక్క పెట్టుకుంటూ వుంటాము. చైనాకు మరికొన్ని దేశాలకు అటువంటి దురవస్ధలేదు. 2013లో మన దగ్గర ఆరునెలల దిగుమతులకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలుంటే ఇప్పుడు పది నెలలకు సరిపడా వున్నాయి. కొందరు వూహిస్తున్నట్లు త్వరలో రూపాయి పతనం 74కు చేరితే ఆ నిల్వలు హరించుకుపోతాయి. చైనాలో అంతర్భాగమైన హాంకాంగ్‌లో మన కంటే ఎక్కువగా డాలర్లు వున్నాయి. చైనా గురించి చెప్పనవసరం లేదు. మన నిల్వలు 400 బిలియన్ డాలర్లకు అటూ ఇటూగా వుంటే చైనా వద్ద 3,110 బిలియన్లు వున్నాయి. తరువాత స్ధానంలో జపాన్ 1,250 బిలియన్ డాలర్లతో వుంది. డాలర్ విలువతో పోల్చితే చైనా,జపాన్ కరెన్సీల విలువ తక్కువే. సెప్టెంబరు మూడున( 2018 ) ఒక చైనా యువాన్‌కు మన రు.10.43, జపాన్ ఎన్‌కు రు.1.56 మారకపు విలువగా వున్నాయి.
ప్రతి దేశం తన కరెన్సీ విలువను పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయించుకుంటుంది. ప్రజల ప్రయోజనాలను పట్టించుకోదు. చైనా,వియత్నాం, క్యూబా, వుత్తర కొరియా వంటి సోషలిస్టు దేశాల పాలకవర్గం కార్మికవర్గమే కనుక దాని ప్రయోజనాలకు అనుగుణంగా వాటి విధానాలు వుంటాయి. అయితే అవి ఇతర పెట్టుబడిదారీ దేశాలతో కూడా ముడిపడి వున్నాయి కనుక వాటికి కూడా కొన్ని సమస్యలు వుంటాయి. ప్రస్తుతం ద్రవ్య పెట్టుబడి పెత్తనం నడుస్తోంది కనుక దాని ప్రయోజనాలకు అనుగుణంగా కరెన్సీల విలువ నిరంతరం మారుతూ వుంటుంది. వుదాహరణకు ఒక యూరో లేదా బ్రిటీష్ పౌండ్‌తో ఇప్పుడు రెండు అమెరికన్ డాలర్లు కొనే అవకాశం వుంది. మొదటి రెండు కరెన్సీలు తమ విలువను కొంత తగ్గించుకుంటే అప్పుడు ఒకటిన్నర డాలర్లే వస్తాయి. అధికారికంగా చేస్తే విలువ తగ్గింపు లేదా మార్కెట్ శక్తుల కారణంగా తగ్గితే దాన్ని పతనం అంటారు. మన రూపాయి విలువలో జరిగిన మార్పుల క్రమం ఇలా వుంది.
స్వాతంత్య్రం పొందిన సమయంలో మన రూపాయి బ్రిటీష్ పౌండ్‌తో ముడివడి వుంది. ఒక పౌండుకు ఒక రూపాయి విలువ వుండేది.1949లో బ్రిటన్ తన కరెన్సీ విలువను తగ్గించటంతో మనది కూడా ఆమేరకు తగ్గింది.1966లో మన దేశం తొలిసారిగా చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్నది, దానికి తోడు దుర్భిక్షం, పాకిస్ధాన్‌తో యుద్దం తదితర కారణాలు తోడయ్యాయి. అప్పు కావాలంటే దేశ ఆర్ధిక వ్యవస్ధలోకి విదేశాలకు మార్కెట్లు తెరవాలని, రూపాయి విలువను తగ్గించుకోవాలని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ షరతులు విధించాయి. తొలిసారిగా వాటిని అంగీకరించి రూపాయి విలువను 36.5శాతం తగ్గించి డాలరుకు 4.76 నుంచి 7.50కు పడిపోయేట్లు ప్రభుత్వమే చేసింది. దాని పర్యవసానాలతో 1967 ఎన్నికలలో కాంగ్రెస్ తొలిసారి తొమ్మిది రాష్ట్రాలలో ఏర్పడటం, పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తి తదుపరి చీలి పోవటం వంటి పరిణామాలు, దాని కొనసాగింపుగానే 1975లో అత్యవసర పరిస్ధితికి దారి తీసింది. 1971లో రూపాయిని డాలర్‌తో ముడివేశారు.1972లో తిరిగి రూపాయిని బ్రిటీష్ పౌండ్‌తో ముడివేశారు.1975లో ప్రధాన కరెన్సీలతో మారకపు విలువలను ముడివేశారు, కాలనుగుణ్యంగా కొన్ని మార్పులు చేసినా ఆ సంబంధాలను 1991వరకు కొనసాగించారు. ఆ ఏడాది ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధానాలలో భాగంగా 19శాతం వరకు రూపాయి విలువను తగ్గించటమే గాక క్రమంగా 1994నాటికి వాణిజ్యం కోసం స్వేచ్చగా మార్కెట్ శక్తులకు మన రూపాయిని వదలి వేశారు. అప్పటి నుంచి డాలరుకు రు. 31.37గా వున్న విలువ క్రమంగా పతనమౌతూ మోడీ హయాంలో 71 దాటి కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇది తప్పుడు విధానమని, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమైనదని రుజువైంది. కాంగ్రెస్ ప్రారంభించిన ఈ క్రమాన్ని బిజెపి తు.చ తప్పకుండా అనుసరిస్తోంది.
హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మోర్నింగ్ పోస్టు పత్రిక(ఇదేమీ కమ్యూనిస్టు అనుకూలం కాదు) తాజా విశ్లేషణ సారాంశం ఇలా వుంది. రాబోయే రోజుల్లో అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే ఏమోగాని యువాన్ విలువ ఒక శాతం పతనమైతే చైనా ఎగుమతులు 0.6శాతం పెరుగుతాయి. జూన్ మధ్యనాటికి ఐదుశాతం పతనమైనందున నాలుగో త్రైమాసికం నుంచి మూడుశాతం ఎగుమతులు పెరుగుతాయి.(తాజా విలువల ప్రకారం యువాన్ ఎనిమిదిశాతం పతనం అయింది) దీని వలన అదనంగా వచ్చే 68.4బిలియన్ డాలర్లు చైనా వస్తువులపై అమెరికా విధించిన దిగుమతి పన్ను కంటే ఎక్కువ.
ఆర్ధికవేత్తల విశ్లేషణల ప్రకారం వాణిజ్య మిగులు కారణంగా ముందే చెప్పుకున్నట్లు చైనా దగ్గర డాలర్ల నిల్వలు మూడులక్షల కోట్ల డాలర్లకు పైగా వున్నాయి. వాటిలో 1.4లక్షల కోట్ల డాలర్లను అమెరికా అప్పుగా తీసుకుంది. ఇప్పుడు గనుక చైనా అప్పు వసూలు చేసుకొనేందుకు అమెరికా బాండ్లను విక్రయిస్తే డాలరు విలువ పతనం అవుతుంది. చైనా యువాన్ విలువ పెరుగుతుంది. చైనా ఇంకే మాత్రం డాలర్ల ఆస్ధులను కొనుగోలు చేయకపోయినా, అమెరికాతో కరంటు ఖాతా మిగులు వున్నందున డాలర్లు చైనా వ్యవస్ధలోకి ప్రవేశించినపుడు దాని కరెన్సీ విలువ పెరుగుతుంది. అందువలన అవసరం వున్నా లేకపోయినా డాలరు ఆస్ధులను కొనుగోలు చేసి తన కరెన్సీ విలువ బలహీనంగా వుంచటం ద్వారా తన ఎగుమతులు మరింతగా గిట్టుబాటు అయ్యేట్లుగా చూసుకోగలుకు తుంది. పరిమితంగా డాలర్ల నిల్వలున్న దేశాలకు వాటిని విక్రయించి తమ కరెన్సీలను కొనుగోలు చేసేందుకు అవకాశాలు తక్కువగా వుంటాయి.
ఈ నేపధ్యంలో మన నరేంద్రమోడీ సర్కార్ ఏమి చేయగలదో, ఏమి చేస్తోందో ఎవరైనా చెబుతారా, ఇంతవరకు అలాంటి ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. మోడీ హయాంలో 58 నుంచి 71కి మన రూపాయి పతనమైంది. మన కరెన్సీ విలువ పడిపోయినా ఒక్క ఐటి సేవల ఎగుమతులు తప్ప ఇతర వస్తు ఎగుమతులు నేలచూపులు చూడటం తప్ప పైకి లేవలేదు. ఎక్కడుందీ వైఫల్యం ?