రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -3
ఎం కోటేశ్వరరావు
రూపాయి విలువ పతనానికి వాణిజ్య యుద్దం, చమురు ధరల పెరుగుదల వంటి బయటి అంశాలే కారణం, మనకు సంబంధం లేదు, కనుక రూపాయి దానికదే సర్దుకుంటుంది. రూపాయి విలువ పతనమైనందున పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినంత మాత్రాన వాటి మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు. తాజా పరిస్ధితులపై నరేంద్రమోడీ సర్కార్ అనధికార స్పందన లేదా అధికార యంత్రాంగం లీకుల ద్వారా వెల్లడి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో తర్కం ఇది. అయినా సరే ఇంకా మోడీని సమర్ధించేవారు, బిజెపిని నెత్తికెత్తుకునే వారు వున్నారు. ప్రజాస్వామ్యం మనది, ఎవరి స్వేచ్చ వారిది.
వస్తుమార్పిడి పద్దతి నుంచి నగదు లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ప్రతి దేశ కరెన్సీ ఏదో ఒక విధంగా ప్రభావితమౌతూనే వుంది. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతూ వుండటం, నిత్యం పెట్రోలు, డీజిలు ధరల పెంపుదల ప్రకటనలు వెలువడుతుండటంతో కరెన్సీ విలువపై చర్చ జరుగుతోంది. బుధవారం వుదయం (11.20) రూపాయి విలువ మరింతగా దిగజారి ఒక డాలరుకు రు. 71.71గా నమోదైంది . ఇంత జరుగుతున్నా మన కరెన్సీ ఇంకా పతనమైనా ఫరవాలేదు అన్నట్లుగా కొందరు చెబుతున్నారు. నరేంద్రమోడీ తీరు తెన్నులను చూసినపుడు దేశమంతా చర్చనీయాంశం అయిన, ఆందోళన చెందిన విషయాల మీద సకాలంలో సూటిగా మాట్లాడిన వుదంతం ఒక్కటంటే ఒక్కటీ లేకపోవటం ఆశ్చర్యకరంగాకపోయినా ఆందోళనకరం. రూపాయి పతనాన్ని అరికడతారో లేక కొనసాగింపును అనుమతిస్తారో ఏదో ఒకటి చెప్పాల్సిన రాజధర్మం ఏమైనట్లు ?
కరెన్సీ విలువలను ప్రస్తుతం ఎక్కువ దేశాలు మార్కెట్ శక్తులకు వదలి వేశాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు తెరచాటున విలువ నిర్ణయ అధికారాన్ని తమ చేతుల్లోనే వుంచుకున్నాయి. చైనా సర్కార్ తన యువాన్ విలువను నియంత్రిస్తున్నదని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. అలాంటిదేమీ లేదని చైనా చెబుతోంది. ఇటీవలి కాలంలో మన కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకు డాలర్లను కొన్నింటిని అమ్మిందని అవి 20బిలియన్ల వరకు వున్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకు గానీ, కేంద్రం గానీ తాము తీసుకోబోయే చర్యల గురించి జనానికి చెప్పటం లేదు. మొత్తం మీద పరిణామాలను చూసినపుడు మార్కెట్ శక్తులకు వదలివేసినా అదుపు తప్పినపుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. లేకపోతే వాటి పుట్టి మునుగుతుంది కదా !
గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విధానాలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందుకే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే నిర్ధారణలకు వస్తున్న యువత అక్కడ నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో చైనా తనదైన తరహా సోషలిస్టు పద్దతుల్లో ముందుకు పోతోంది, కొన్ని ఎగుడుదిగుడులున్నా సంక్షోభాలకు దూరంగా వుంది. అనేక దేశాలు అమెరికా నుంచి అధిక ధరలకు యంత్రాలు, పరికరాలు, ఇతర వస్తువులను కొనే బదులు తామే తయారు చేయటం, ప్రత్యామ్నాయాలను చూసుకోవటంతో పాటు ఎగుమతుల్లో అమెరికాకు పోటీగా తయారయ్యాయి. తన కరెన్సీ విలువను అధికంగా వుంచుతూ ఆధరకు తన వస్తువులను కొనాలంటూ ఇతర దేశాల మీద అమెరికా వత్తిళ్లు తెస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోంది. చైనాపై ప్రారంభించిన వాణిజ్య యుద్ద సారమిదే. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు పరిమితంగా అయినా తన కరెన్సీ విలువ తగ్గింపును చైనా ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూసుకోవటం, వున్న మార్కెట్లలో దెబ్బ తగలకుండా చూసుకొనేందుకు కరెన్సీ విలువను పరోక్షంగా నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది.
1930దశకంలో తలెత్తిన మహా ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడేందుకు అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి బడాదేశాలన్నీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్ధాయిలో 40శాతం వరకు తమ కరెన్సీ విలువలను తగ్గించాయి.బంగారంతో కరెన్సీ విలువ లింక్‌ను విస్మరించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారం చెల్లించిన జర్మనీ యుద్ధ భారాలను తట్టుకోలేక తన కరెన్సీకి కావాలనే విలువ లేకుండా చేసింది. ఒక డాలరుకు వందకోట్ల మార్క్‌లుగా విలువ పతనం అయింది. తద్వారా కారుచౌకగా తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్మి ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కిందిగానీ సామాన్య జర్మన్లు భారీ మూల్యం చెల్లించారు. ఆ దశలో అధికారానికి వచ్చిన హిట్లర్ జర్మన్ ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే పేరుతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన విషయం తెలిసిందే. చరిత్రలో అతిపెద్ద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డోనాల్డ్ ట్రంప్ చర్యలు ఏ పర్యసానాలకు దారి తీస్తాయో ?
గత ఆరునెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే అంతర్గత ఇబ్బందులను అధిగమించటం కోసం అమెరికా తన వడ్డీ రేట్లను పెంచటం, ఇంకా పెంచనున్నట్లు ప్రకటించటం, చైనా, ఇతర దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగటం, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను ప్రకటించటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు పెరగటం, టర్కీ లీరా, అర్జెంటీనా పెసో పతనం వంటి ముఖ్య పరిణామాలన్నీ ప్రపంచ కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓట్ల కోసం ట్రంప్ తీసుకొనే చర్యల కారణంగా నవంబరులో అమెరికాలో జరిగే పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం వుంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మన వంటి దేశాల పౌరుల పరిస్ధితి తయారైంది. కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలతో ప్రతి దేశానికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని కష్టాలు వుంటాయి. వుదాహరణకు ఐటి వుత్పత్తులను ఎగుమతి చేసే మన కంపెనీల వాటాల ధరలు దూసుకుపోతుండగా దిగుమతులు చేసుకొనే కంపెనీలవి డీలా పడుతున్నాయి. వాణిజ్యలోటు వున్న మన వంటి దేశాలకు కరెన్సీ పతనం ప్రయోజనకరం అయినా మిగులు వున్న చైనా వంటి దేశాలకు వాటి సమస్యలు వాటికి వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్లను కొనుగోలు చేయటం అంటే మిగతా కరెన్సీలను విక్రయించటం కూడా ఇమిడి వుంటుంది. ఏ లావాదేవీ జరిగినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు వీటిని తమకు అనుకూలంగా నియంత్రిస్తారు.
ప్రతి దేశమూ అధికారిక లావాదేవీలను జరిపే సమయంలో ఒక నిర్ణీత విలువతోనే ఖరారు చేసుకుంటుంది. ఒక పరిధి నిర్ణయించుకొని దానికి లోబడి మార్పులున్నంత వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. దాటినపుడు చర్యలకు వుపక్రమిస్తుంది. కొన్ని దేశాలు ప్రయివేటు రంగంలో కూడా నిర్ణీత విలువను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి చోట్ల డాలర్ల క్రయ విక్రయాలు బ్లాక్ మార్కెట్‌కు చేరే అవకాశాలూ లేకపోలేదు. పీకల్లోతు నీరు వచ్చింది తప్ప ప్రాణాలకు ముప్పు లేదు, అయినా వచ్చిన వరద వచ్చినట్లే పోతుంది లేదా స్ధిరపడుతుంది ఆందోళన అవసరం లేదన్నట్లుగా మన అధికార యంత్రాంగం వుంది. రూపాయి పతనానికి వాణిజ్యం యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణాలు, వాటిని ప్రభుత్వం ఏమీ చేయగలిగింది లేదు, రూపాయి దానంతట అదే స్ధిరపడుతుందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు అనధికారికంగా వ్యాఖ్యానించారు. పతనం మరింతగా కొనసాగుతుందనటానికి తగినన్ని కారణాలున్నాయని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ చెప్పారు.
డబ్బు బయటకు పోకుండా చర్యలు తీసుకోవటం ద్వారా కరెన్సీ పతనాన్ని కొంతమేరకు అరికట్టిన వుదంతాలు వున్నాయి. గతంలో చైనా అలా వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్ధానిక కరెన్సీని విక్రయించకుండా ఆర్ధిక సంస్ధలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి అదుపు చేయటం, వుల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకపద్దతి. రిజర్వుబ్యాంకులు బయటకు ప్రకటించకుండానే ఒక నిర్ణీత ధరను సూచించటం మరొకటి. లావాదేవీలపై పరిమితులు విధించటం, అన్నింటిని విధిగా నమోదు చేయటం వంటివి మరికొన్ని చర్యలు.
అమెరికాలో వడ్డీ రేట్లను ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి అక్కడికి తరలటం ప్రారంభించాయి. ఆ ప్రవాహాన్ని ఆపేందుకు మన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి, రూపాయి పతనం ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలున్నాయి. చివికి పోయిన వస్త్రానికి ఒక దగ్గర మాసిక వేస్తే మరో చోట చిరిగి పోతుందన్నట్లుగా ఒకదాని కోసం ఒక చర్య తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. జనం మీద విపరీత భారం, ప్రభుత్వాలకు ద్రవ్యలోటు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఒక దేశ కరెన్సీ విలువ పెరగటం కూడా ఒక్కోసారి నష్టదాయకమే. వుదాహరణకు స్విడ్జర్లాండ్ వుదంతం. బలమైన మారకపు విలువ కారణంగా అక్కడ డబ్బు దాచుకోవటం ఎంతో భరోసాగా భావించి ఒకప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనమంతా స్విస్ బ్యాంకులకు చేరేది. దాంతో వాటి లాభాలు ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. అయితే స్విస్ ఫ్రాంక్ విలువ పెరిగి ఆ దేశ ఎగుమతులు ఖరీదయ్యాయి. పారిశ్రామికవేత్తలు లబోదిబో మన్నారు. దాంతో నల్లధన ప్రవాహాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటంతో నల్లధన కుబేరులు వేరే దేశాల బాట పట్టారు.