ఎం కోటేశ్వరరావు
రూపాయి విలువ పతనం మీద ఆర్ధిక మంత్రి అరుణ్ జెట్లీ వ్యాఖ్యానం చూసినపుడు మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంలో వున్న ఘటోత్కజుడు వివాహ ప్రహసనంలో లక్ష్మణ కుమారుడి పాదాన్ని తొక్కినపుడు నొప్పి పెడుతున్నా ఏడవ లేక నవ్విన దృశ్యం గుర్తుకు రాకమానదు. ఆ సంగతి జనం చూసుకుంటారు వదిలేద్దాం ! గురువారం నాడు రూపాయి విలువ 72.11కి దిగజారి 71.99 వద్ద ముగిసింది. ( ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో తెలియదుగానీ దాదాపు రోజూ జరుగుతున్నదానికి వరుసగా కొత్త రికార్డులంటూ రాసి రాసి చదువరులకు బోరు కొట్టించదలచుకోలేదు.) మన రూపాయి లేదా చైనా యువాన్ విలువ పతనమైతే ఎగుమతులు పెరుగుతాయి కదా అలాగే అమెరికా కూడా తన డాలరు విలువను తగ్గించుకొని ఎగుమతులు పెంచి వాణిజ్య లోటును ఎందుకు తగ్గించుకోకూడదు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.
2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం, చైనా నుంచి దిగుమతుల కారణంగా కోల్పోయిన వుద్యోగాలను తిరిగి కల్పించేందుకు డాలరు విలువ తగ్గించాలన్న వూహలతో అధికారానికి వచ్చాడు డోనాల్డ్ ట్రంప్. అయితే అది ఎంత నష్టదాయకమో వెంటనే తెలిసి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏం జరిగి పరిణామాలు ఎలా వుంటాయో చెప్పలేము గాని ప్రపంచంలో ఇప్పుడొక వినూత్న పరిస్ధితి ఏర్పడిందని చెప్పక తప్పదు.
ప్రపంచంలో అమెరికా ఎంత పెద్ద ధనిక దేశమో దానికి అప్పులు కూడా అంత ఎక్కువగా వున్నాయి. మొత్తం అప్పు19.19లక్షల కోట్ల డాలర్లు.దానిలో విదేశీ అప్పు 5.35 లక్షల కోట్ల డాలర్లు వుంది. డాలరు విలువ తగ్గితే అప్పులు పెట్టిన వారందరూ గగ్గోలు పెడతారు. అప్పులిచ్చిన విదేశాలలో చైనా 1.1877లక్షల కోట్లతో ప్రధమ స్ధానంలో వుండగా జపాన్ 1.0435 లక్షల కోట్లు, ఐర్లండ్ 317.9 బిలియన్ డాలర్లతో మూడో స్ధానంలో వుంది. మన విదేశీ అప్పు 500 బిలియన్‌డాలర్లకు మించి వుంది. అయితేనే మనం కూడా అమెరికాకు 157 బిలియన్ డాలర్ల అప్పిచ్చి 11వ స్ధానంలో వున్నాం.(అరవై వేల జనాభాగల కేమాన్ దీవులు 242.9 బిలియన్లిచ్చి ఏడవ స్ధానంలో వుంది) అమెరికా అప్పు దాని జిడిపికి 106శాతం వుంది. 2017లో అప్పులకు చెల్లించిన వడ్డీ రేటు 2.26శాతం. కొందరు ఇంకా తక్కువ వడ్డీరేటుకే అప్పు ఇచ్చారు.
ఒక్కసారిగా డాలరు విలువ తగ్గితే వారంతా ఏం కావాలి. దివాలా తీయాలి, చలికాచుకొనేందుకు నోట్లను వుపయోగించాలి. తక్కువ వడ్డీకి ఇచ్చిన వారికి డాలరు విలువ పెరిగితే లాభం తప్ప తగ్గితే మిగిలేది బూడిదే. అందువలన దాని విలువలో స్వల్ప మార్పులను అనుమతించటం తప్ప అధికారంలో ఎవరున్నా విలువ పతనం కాకుండా చూస్తారు. ప్రస్తుతం మన దేశంతో లావాదేవీలలో అమెరికా 23బిలియన్‌డాలర్ల మేరకు వాణిజ్యలోటు కలిగి వుంది. దాన్ని పూడ్చుకోవాలంటే రానున్న మూడు సంవత్సరాలలో పది బిలియన్ డాలర్ల మేరకు అదనంగా తమ నుంచి దిగుమతులు చేసుకోవాలని అమెరికన్లు మన మీద వత్తిడి చేస్తున్నారు.(సెప్టెంబరు 6 హిందూ పతాక శీర్షిక) ఇదే విధానాన్ని చైనా, ఇతర దేశాల మీద కూడా రుద్దాలని చూస్తోంది. డాలరు విలువ తగ్గనుంది అనే వార్త వచ్చిందో డాలరు పెట్టుబడులన్నీ ఇతర మెరుగైన కరెన్సీలకు మారిపోతాయి. మన రూపాయి విలువ తగ్గటంతో డాలర్లు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అందువలన విశ్వం అంతమౌతుందనుకున్నపుడే చివరి చర్యగా డాలరు విలువను తగ్గిస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మన రూపాయి విలువ తగ్గుతున్నమేరకు మనం దిగుమతి చేసుకొనే పెట్రోలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. డాలరు విలువ తగ్గితే అమెరికాలో కూడా అదే జరుగుతుంది. రోజువారీ వాడే వస్తువులన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆ పరిణామం ఎగుమతి చేసే దేశాలకు కూడా మంచిది కాదు. డాలరు విలువ తగ్గితే వాటి కరెన్సీ విలువ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాకు నామమాత్రపు లేదా అసలేమీ వడ్డీ లేకుండా విదేశీ పెట్టుబడులు, రుణాలు వస్తున్నాయి, దాని కరెన్సీ విలువ తగ్గితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. అమెరికాలో ఇప్పుడున్న వేతనాలతో చైనా, భారత్ మాదిరి చౌక ధరలకు వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేయటం కష్టం. వేతనాలు తగ్గిస్తే సామాజిక సంక్షోభం తలెత్తుతుంది. డాలరు విలువ ఎక్కువగా వుంటే ఎగుమతులు గిట్టుబాటుగాక వుత్పత్తి పడిపోతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా డాలరు ఇప్పుడు రిజర్వు కరెన్సీగా వుంది. అనేక దేశాలు, కార్పొరేట్ సంస్ధలు పెద్ద మొత్తంలో వాటిని నిల్వ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలు, పెట్టుబడులకు వాటిని వినియోగిస్తాయి. రిజర్వు కరెన్సీ కలిగిన ఏ దేశమైనా చౌకగా ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. బ్రిటన్ ప్రాభవం కోల్పోవటంతో దాని పౌండ్ స్ధానంలో తన డాలరును అలాంటి కరెన్సీగా చేయాలని అమెరికా నిర్ణయించుకుని అమలు చేస్తోంది. సాంప్రదాయ వస్తూత్పత్తి పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్యపెట్టుబడిదారులది ఎప్పుడు పైచేయి అయిందో అప్పటి నుంచి డాలరును ముందుకు తెచ్చారు. దీని వలన ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, అప్పులు తీసుకోవటం ద్వారా అమెరికా తన లోటును పూడ్చుకొంటోంది. ద్రవ్యపెట్టుబడిదారుల ఆధీనంలోని బ్యాంకుల పలుకుబడి, లావాదేవీలు, లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. డాలరును ఆయుధంగా చేసుకొని అమెరికా కార్పొరేట్ సంస్ధలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో, ఆయా దేశాలలో చొరబడటంతో పాటు ప్రపంచ మిలిటరీ వుద్రిక్తతలలో అమెరికా జోక్యం, ఎక్కడైనా లేకపోతే సృష్టించటం జరుగుతున్నది. వాటి ద్వారా కార్పొరేట్ల ఆయుధ పరిశ్రమలు మూడుపువ్వులు ఆరుకాయలుగా లాభాలు పొందుతున్నాయి. వాటికి దెబ్బ తగుల కుండా వుండాలంటే ఒక చోట వుద్రిక్తతలు సడలితే, ముగిస్తే మరొక చోట తలెత్తేట్లు చేస్తున్నారు. మిలిటరిజం, సామ్రాజ్యవాదం ఒకదానితో ఒకటి కలసి పెరుగుతున్నాయి. డాలరు విలువను తగ్గిస్తే ఇది సాధ్యం కాదు.
చైనా పెద్ద మొత్తంలో అమెరికాకు అప్పు ఇచ్చినందున డాలరు విలువ తగ్గితే ఎక్కువగా నష్టపోయేది కూడా ఆ దేశమే. చైనా కనుక తన అప్పును తగ్గించుకుంటే, మిగతా దేశాలు కూడా దాని బాటనే నడిస్తే తక్షణం డాలరు విలువ పతనం అవుతుంది. చైనా కొత్తగా డాలర్లను కొనుగోలును తగ్గించినా సమస్యలు తలెత్తుతాయి. మొత్తం మీద అమెరికా లేదా చైనా ఏ విపరీత చర్యకు పాల్పడినా రెండు దేశాలతో పాటు ప్రపంచం సంక్షోభంలో మునుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే తెలిసిగానీ లేక తెలియకగానీ ట్రంప్ దూకుడు మీద వున్నాడు. పిచ్చి పనులు చేస్తే ఫలితాలు, పర్యవసానాలను అనుభవిస్తాడు. మన రూపాయితో పోలిస్తే జపాన్ ఎన్ విలువ ఇంకా తక్కువ, శుక్రవారం నాడు ఒక డాలరుకు 110.6 ఎన్‌ల వద్ద వుంది. దీని కంటే చాలా ఎక్కువగా వుండే చైనా యువాన్ విలువను పెంచాలని అమెరికా డిమాండ్ చేస్తోందిగానీ జపాన్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. రాబోయే రోజుల్లో జపాన్‌తో వాణిజ్య సమస్య మీద కూడా కేంద్రీకరిస్తానని ట్రంప్ ప్రకటించటంతో డాలర్ విలువ స్వల్పంగా పతనమైనట్లు వార్తలు వెలువడ్డాయి.