Tags
2008 financial crisis, 2008 meltdown, Another financial crisis, Collapse of Lehman brothers, Great Depression
ఎం కోటేశ్వరరావు
2008, ప్రపంచ ధనిక దేశాలలో తలెత్తిన మరొక మహా సంక్షోభానికి పది సంవత్సరాలు. అమెరికాలోని లేమాన్ బ్రదర్స్ బ్యాంకు 2008 సెప్టెంబరు15న దివాలా ప్రకటన చేయటాన్ని చాలా మంది మరచిపోయి వుంటారు. ప్రపంచ ధనికులు మాత్రం మెలకువగానే వున్నారు. వారిలో ఒకడిగా 92బిలియన్ల సంపదకలిగిన బిల్‌గేట్స్ ‘ఎప్పుడు అన్నది చెప్పటం కష్టంగానీ 2008 వంటి మరో సంక్షోభం రావటం తప్పని సరి ‘ అని ఈ ఏడాది మార్చి2న ఒక ఆస్ట్రేలియా మీడియాలో అడిగిన ప్రశ్నకు చెప్పారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తిరుగులేని విధంగా తెలిసినట్లే ఒకదాని తరువాత ఒక సంక్షోభం రావటం పెట్టుబడిదారీ విధానంలోనే ఇమిడి వున్న లక్షణం అని గేట్స్ వంటి వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అందుకే తాము మునిగి పోకుండా వుండేందుకు నిరంతరం దారులు వెతుకుతుంటారు. పదేళ్ల నాటి సంక్షోభం దెబ్బకు అమెరికాలో 87లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. సంక్షోభం నుంచి కోలుకున్నట్లు చెబుతున్నా ఇప్పటికీ పూర్వపు స్ధితికి చేరుకోలేదు.
ఇప్పటికీ ప్రధాన స్రవంతి మీడియా లేదా వామపక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలు జనానికి ఇలాంటి వాటి గురించి వాస్తవాలు చెప్పటం లేదు. తప్పుడు నిర్ణయాలు, విధానాలతో దివాలా తీసిన సంస్ధలన్నింటినీ అమెరికా, ఇతర దేశాల పాలకులు ప్రజల సొమ్ముతో రక్షించారు. 1980దశకం నుంచి స్వేచ్చా మార్కెట్ విధాన సంస్కరణలను ముందుకు నెట్టటంలో ప్రముఖుడైన అమెరికా ఫెడరల్ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) మాజీ అధ్య క్షుడైన అలాన్ గ్రీన్‌స్పాన్ 2008 మేనెలలో ఒకప్రకటన చేస్తూ 2007లో ప్రారంభమైన తనఖా సంక్షోభం మీద వ్యాఖ్యానిస్తూ ‘ ద్రవ్య సంక్షోభంలో అనర్ధం ముగిసింది లేదా త్వరలో ముగియ నుంది’ అన్నాడు. లేమాన్ బ్రదర్స్ దివాలా ప్రకటన వెలువడగానే తాను చాలా తొందరపడ్డానని, తన స్వేచ్చామార్కెట్ సిద్ధాంతంలో లోపాలున్నట్లు గుర్తించానని చెప్పాడు.
2001లో డాట్‌కాం బుడగ పేలటం, మాంద్యం తలెత్తటంతో ద్రవ్య సంస్ధలు లాభాల కోసం కొత్త మార్గాలు వెతికాయి. వడ్డీ రేట్లు తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పరిమితమైంది. వడ్డీ రేట్లు తక్కువగా వుండటంతో ద్రవ్య సంస్ధల నిధుల సేకరణ సులభతరం, ఖర్చు తక్కువగావటం,మరిన్ని ఆస్ధుల కొనుగోలుకు, అధిక వడ్డీల కోసం తనఖా వంటి ముప్పుతో కూడిన రుణాలు ఇవ్వటానికి దారితీసింది.2004నాటికి రుణాలు తీసుకున్నవారు విపరీతంగా పెరగటంతో పాటు వాయిదాల చెల్లింపుల సమస్య తలెత్తింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు పెంచింది. ఇండ్ల ధరలు పతనమయ్యాయి. అప్పులు తీర్చాలంటే అందుకోసం కొత్త అప్పులు చేద్దామంటే పుట్టని స్ధితి. తనఖా అంటే అనకాపల్లిలో అయినా అమెరికాలో అయినా వడ్డీ రేటు ఎక్కుగా వుండటంతో పాటు అసలుకు ముప్పు కూడా వుంటుంది. తీర్చగలరా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అధికవడ్డీలకు దురాశ పడిన ఆర్ధిక సంస్ధలు అప్పులు తెచ్చి మరీ అడిగిన ప్రతివారికీ రకరకాల తనఖాలు, షరతులతో గృహ రుణాలు ఇచ్చాయి. కొన్ని సంస్ధలు నేరుగా రుణాలు ఇవ్వక పోయినా ఇతర సంస్ధలు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకొనేందుకు వాటిని కొనుగోలు చేశాయి. తీసుకున్న వారికి రుణ చెల్లింపులు భారంగా మారటం, బుడగపేలిపోయినట్లుగా ఇండ్ల ధరలు పతనం కావటంతో రుణాలు తీసుకున్నవారితో పాటు ఇచ్చిన ఆర్ధిక సంస్ధలు, బ్యాంకులు కూడా 2007లో కుప్పకూలాయి. తనఖా పత్రాల విలువ 6.8లక్షల కోట్ల డాలర్లని తేలింది. మన సత్యం కంప్యూటర్స్ అసత్య లెక్కలు రాసి కుప్పకూలినట్లుగానే 2008లో లేమాన్ బ్రదర్స్ లెక్కల బాగోతం బయటపడి దివాలా ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా అమెరికాలో తిరిగి తనఖా రుణాలు పెరుగుతున్నాయని, మన దేశంతో సహా అనేక చోట్ల ఇస్తున్న గృహ రుణాలు చెల్లింపులో వైఫల్యం తప్పదని అనేక మంది చెబుతున్నారు. లసుగుల గురించి సామాన్యుల కంటే బిల్‌గేట్స్ వంటి వారికి ఎక్కువ తెలుసు కనుక వారు చెప్పిన ముప్పు ఏ క్షణంలో అయినా ఎదురు కావచ్చు.
పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాగైనా లాభాలు సంపాదించటానికి ప్రాధాన్యత ఇస్తారు, వాటిలో అప్పు మీద ఆధారపడటం ఒకటి. కాసినో లేదా జూదశాలల్లో జూదాలు నిర్వహించేవారు మనకు కనపడరు. డబ్బు పోగొట్టుకున్నా, ఎప్పుడన్నా సంపాదించినా జూదాలు కాసేవారు, వాటిని నిర్వహించే మధ్యవర్తులే మనకు కనిపిస్తారు.లేమాన్ బ్రదర్స్ అలాంటి మధ్యవర్తిగా డబ్బు జూదంలో నిలిచింది.దానితో రకరకాల ద్రవ్యలావాదేవీలు జరిపిన ఇతర బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల వారు అది ఇచ్చే లాభాలను చూశారు తప్ప రాసే తప్పుడు లెక్కలను గమనించలేక చివరికి మునిగిపోయారు. సంక్షోభం బద్దలు అయింతరువాత బ్యాంకులు బిలియన్లకొద్దీ డాలర్లను నిరర్దక ఆస్ధులుగా ప్రకటించాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడాయి. వ్యాపారాలకు కూడా రుణాలు దొరకటం గగనమైంది. వ్యాపారం తగ్గిపోయి దాని ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ మీద పడింది. పెట్టుబడితగ్గి డిమాండ్, వుత్పత్తి తగ్గుదలకు దారి తీసి, వుద్యోగాల రద్దుకు కారణమైంది.మాంద్యం తలెత్తింది.సంక్షోభం అమెరికా నుంచి ఐరోపాకు, ఇతర ప్రాంతాలకూ పాకింది. వెంటనే రంగంలోకి దిగిన అమెరికా సర్కార్ పరిస్ధితులు మెరుగుపడిన తరువాత తిరిగి అమ్మే ప్రాతిపదిక మీద 700 బిలియన్ డాలర్ల పాకేజితో దివాలా తీసిన సంస్ధల బాండ్లు, ఇతర విలువ పడిపోయిన ఆస్ధులను కొనుగోలు చేసేందుకు పూనుకుంది. మెరుగుపడక పోగా ఇంకా దిగజారటంతో మరో 250 బిలియన్ డాలర్లను ఇతర చిన్న సంస్దలలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది.
మరోవైపున వినియోగాన్ని పెంచేందుకు బ్రిటన్ సర్కార్ వ్యాట్‌ను 17.5 నుంచి 15శాతానికి తగ్గించింది. అనేక బ్యాంకులకు నిధులు సమకూర్చి నిలబెట్టింది.బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను 5నుంచి 0.5శాతానికి తగ్గించింది. 2009లో లండన్లో సమావేశమైన జి20 సమావేశం ఆర్ధిక వినాశనాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలోకి 681బిలియన్ పౌండ్లను అందించాలని నిర్ణయించింది. బ్రిటన్‌లోని రాయల్ స్కాటిష్ బ్యాంక్(ఆర్‌బిఎస్) దివాలా తీసిన వాటిలో ఒకటి. పది సంవత్సరాల తరువాత కూడా అక్కడి జనం దివాలాకు మూల్యం చెల్లిస్తున్నారు. పది సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆర్‌బిఎస్ తన వాటాదార్లకు గత నెలలో రెండు పెన్నీల డివిడెండ్ ప్రకటించింది.( బ్రిటీష్ పౌండుకు వంద పెన్నీలు, ఒక పెన్నీ మన 93పైసలకు సమానం). పదేండ్ల క్రితం దివాలా తీసిన సదరు బ్యాంకును నిలబెట్టేందుకు బ్రిటన్ సర్కార్ 45.5బిలియన్ పౌండ్లను అందచేసింది. ఇప్పటి వరకు నాలుగు బిలియన్ పౌండ్లు నష్టపోయింది.గతంలో 84శాతంగా వున్న వాటాలను(జనం సొమ్ము) నష్టాలకు విక్రయించి 62శాతానికి తగ్గించుకుంది. ప్రభుత్వం ఆదుకొనేందుకు ఇచ్చిన సొమ్ములో 21బిలియన్ పౌండ్లను ఖాతాదారులతో వివాద పరిష్కారాలకు, అపరాధరుసుములు చెల్లించేందుకు బ్యాంకు ఖర్చు ఖర్చు చేసింది.
150 సంవత్సరాల క్రితమే కారల్ మార్క్స్ వుత్పాదక రంగంలో చేసే పెట్టుబడికి, ద్రవ్య వుత్పత్తుల్లో పెట్టే పెట్టుబడికి వున్న తేదాను వివరిస్తూ బ్యాకింగ్ బుడగలు ఎలా పెరుగుతాయో, పేలిపోతాయో పేర్కొన్నారు. మరో సంక్షోభం సంభవించే వరకు పెట్టుబడిదారులు జనానికి ఏదో ఒక ఆశచూపుతూనే వుంటారు. వుత్పాదక రంగంలో తమ పెట్టుబడికి ఆకర్షణీయమైన లాభాలు రానపుడు పెట్టుబడిదారులు తమ సొమ్మును ద్రవ్య మార్కెట్లో పెట్టుబడులుగా పెడతారు. బడా కంపెనీల, దుకాణాల పోటీలో నిలదొక్కుకోలేని అనేక మంది చిన్న మదుపుదారులు దగ్గర మార్గంగా వడ్డీ వ్యాపారాన్ని ఎంచుకోవటం తెలిసిందే. గ్రామాలలో వస్తువ్యాపారం చేసే వారు తమ మిగులును వడ్డీ, తాకట్టు వ్యాపారాలకు మళ్లించటాన్ని మనం చూస్తున్నదే. ద్రవ్య పెట్టుబడి లాభాలు వుత్పాదకరంగం పెట్టుబడిపై ఆధారపడి వుంటాయి. నిజమైన ఆర్ధిక వ్యవస్ధలో సంభవించే మార్పులు ద్రవ్యవ్యాపారంపై ప్రభావం చూపుతాయి. నిజ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడితే ద్రవ్య పెట్టుబడి( బ్యాంకింగ్) రంగం కుప్పకూలిపోతుంది.
బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి వారు ఏ క్షణంలో అయినా మరో ద్రవ్య సంక్షోభం రావచ్చని చెబుతున్నారంటే దానికి ప్రాతిపదిక లేకపోలేదు.2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా స్టాక్ మార్కెట్ డౌజోన్స్ సూచి 350శాతం పెరగ్గా, వాస్తవ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదల కేవలం 15శాతమే. తెలుగు ప్రాంతాల్లో సప్తగిరి, వుమ్మిడియార్స్ నుంచి కరక్కాయల పొడి వరకు అనేక మంది మోసగాళ్లు సగం ధరలకే వస్తువులు, అధిక వడ్డీలు, లాభాల ఆశచూపుతూనే వున్నారు. అలాంటివి ముంచుతాయని తెలిసినా ముందుగా పెట్టుబడి పెట్టి తాము తప్పించుకోవచ్చని ఎవరికి వారు దురాశకు లోనై నష్టపోవటం చూస్తున్నాము. ద్రవ్య పెట్టుబడిలో సంభవించే నష్టాలు ఆయా సంస్ధల యజమానుల కంటే జనాన్ని ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. భూగోళంలో ఒక ప్రాంతంలో తలెత్తిన సంక్షోభం దానికే పరిమితం కాదు. ప్రపంచీకరణ పేరుతో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముడివేయటంతో తరతమ తేడాలతో ప్రపంచ వ్యాపితంగా ప్రభావం, పర్యవసానాలు పడతాయి.
పది సంవత్సరాల తరువాత నెలకొన్న పరిస్ధితి గురించి మెకెన్సీ సంస్ధ ప్రతినిధి సుసాన్ లండ్ చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ఐరోపా, అమెరికాలోని బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే వాటి దగ్గర వున్న పెట్టుబడి ఎక్కువగా వుంది. దీని అర్ధం అవి మరింత స్ధిరంగా వున్నాయి, భవిష్యత్‌లో తలెత్తే నష్టాలను తట్టుకోగలవు. అయితే వడ్డీ రేట్లు, రుణాలకు డిమాండ్ తక్కువగా వుండటం, పెట్టుబడిమీద వచ్చే ఆదాయం తక్కువగా వుండటం బ్యాంకుల అభివృద్ధికి పరిమితులను సూచిస్తున్నాయి. ద్రవ్య సంక్షోభం తరువాత బ్యాంకులకు పెట్టుబడిమీద వచ్చే ఆదాయం సగం తగ్గింది, దీంతో లాభాల కోసం నూతన వాణిజ్య పద్దతుల కోసం కుస్తీ పడుతున్నాయి. పదేండ్ల నాటి సంక్షోభం తరువాత ప్రపంచ రుణ భారం స్ధిరంగా వుండటం లేదా పడిపోవటంగాక 72లక్షల కోట్ల డాలర్లు పెరిగింది.
బ్యాంకుల వంటి ద్రవ్య సంస్ధలను ఇబ్బందుల నుంచి బయటపడవేసేందుకు పాలకవర్గ ప్రభుత్వాలు ఆ భారాన్ని జనం మీదనే మోపుతాయి. పొదుపు చర్యలు, సంక్షేమ పధకాలకు కోత, ప్రభుత్వ ఆస్ధుల విక్రయం, జనం మీద అదనపు పన్నులు ఇలా అనేక రూపాలలో వుంటున్నాయి.పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా కేంద్రీకరణ ముప్పుకు సూచన. గతేడాది ప్రపంచ జిడిపికి 217శాతం ఎక్కువగా అప్పు వున్నట్లు తేలింది. పదేండ్ల నాటి సంక్షోభానికి ముందు కంటే ఇది 40శాతం ఎక్కువ. లేమాన్ బ్రదర్స్ కుప్పకూలిపోగానే పెద్ద బ్యాంకులు, ద్రవ్య సంస్ధలను చిన్నవిగా చేయాలనే ఆలోచన చేశారు. అయితే మన దేశంతో సహా అనేక చోట్ల పోటీని తట్టుకోవాలంటే పెద్దవిగా వుండాలంటూ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎస్‌బిఐలో విలీనం చేసిన విషయం తెలిసిందే. 2007లో అమెరికాలోని బ్యాంకు ఆస్ధులలో 44శాతం కేవలం ఐదింటి చేతిలో వుండగా ఇప్పుడు ఆ మొత్తం 47శాతానికి పెరిగింది. ఒక శాతం మ్యూచ్యువల్ ఫండ్ సంస్ధల చేతుల్లో 45శాతం స్టాక్స్, బాండ్లు, ఇతర ఆస్ధులు వున్నాయి. ఇవిగాక షాడో బ్యాంకులు అంటే తెరవెనుక లావాదేవీలు నిర్వహించేవి కూడా వున్నాయని ఒక నగ్నసత్యం. 2010లో వాటి ఆస్ధుల విలువ 28లక్షల కోట్లయితే ఇప్పుడు హీనాతి హీనంగా లెక్కవేసినా 45లక్షల కోట్ల డాలర్లని చెబుతున్నారు. బ్యాంకుల మీద నియంత్రణలు పెరిగే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి. అందువలన వీటిలో ఏ ఒక్కటి మునిగినా పదేండ్ల నాటి సంక్షోభంతో పోల్చితే నష్టం కొన్ని రెట్లు ఎక్కువగా వుంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో సంక్షోభం బద్దలవుతుందో తెలియదు.