Tags

, , , ,

Image result for historic agreement between china and vatican

ఎం కోటేశ్వరరావు

ఒకవైపు వాటికన్‌తో చర్చలు మరోవైపు బుల్‌డోజర్లతో చైనా క్రైస్తవాన్ని అదుపు చేయాలని చూస్తున్నదనే శీర్షికతో న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రెచ్చగొట్టే ఒక విశ్లేషణ ప్రచురించింది. చైనాలో బిషప్పుల నియామకం గురించి అక్కడి ప్రభుత్వం-వాటికన్‌ చర్చి మధ్య సెప్టెంబరు 22న కుదిరిన తాత్కాలిక ఒప్పందం గురించి ప్రపంచ మీడియాలో, క్రైస్తవ మతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానిలో భాగమే ఇది. దేవుడు లేడని నమ్మే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంతో వున్నట్లు విశ్వసించే వాటికన్‌ ఒప్పందం చేసుకోవటం ఏమిటని అటు కమ్యూనిస్టులుగా వున్నవారు, ఇటు మతాన్ని పాటించే వారు దిగమింగలేకుండా వున్నారు. ఇదే సమయంలో ఆమోదించిన వారే ఎక్కువ అనేందుకు అసలు ఆ ఒప్పందం కుదరటమే నిదర్శనం. దాని ప్రకారం చైనాలో వాటికన్‌తో నిమిత్తం లేకుండా పని చేస్తున్న బిషప్పులను పోప్‌ ఆమోదిస్తారు. చైనా ప్రభుత్వ ఆమోదం లేని అనధికార బిషప్పులు కొందరు రాజీనామా చేస్తారు. ఇరు పక్షాలు కలసి రాబోయే రోజుల్లో కొత్త బిషప్పులను నియమిస్తాయి.

కొన్ని చోట్ల క్రైస్తవం కావచ్చు, మరికొన్ని చోట్ల ఇస్లాం, ఇతర మతాలు కావచ్చు. కాలక్రమంలో అంతరించాల్సిన మతాన్ని నిషేధాలు, అణచివేతల ద్వారా తెల్లవారే సరికి పరిష్కరించటం జరిగేది కాదు. సోషలిస్టు, కమ్యూనిస్టు వున్నత మానవాళి అవతరించినపుడే అది సాధ్యం. ఈ నేపధ్యంలో మతంతో సంబంధాలు అనేవి ప్రపంచ సోషలిస్టు, కమ్యూనిస్టు వుద్యమానికి ఎదురైన ఒక వాస్తవిక, పరిష్కారం కావాల్సిన సవాలు. దీనిని కమ్యూనిస్టు వుద్యమం విస్మరించజాలదు. సర్వేజనా సుఖినో భవంతు అన్న ఆశయాన్ని కమ్యూనిజం పుట్టక ముందే ప్రకటించారు. అది అమలు జరగలేదు గనుక ప్రకటించిన వారిని తప్పు పడతామా? సోషలిస్టు భావన కూడా అదే అయినప్పటికీ, అమలుకు ఒక కార్యాచరణను ప్రకటించటమే దాని ప్రత్యేకత. అందువలన దాని అమలులో తలెత్తే సమస్యలను పరిష్కరించటం వాస్తవికత.

ప్రపంచంలో అనేక చోట్ల మతాన్ని ఒక ఆయుధంగా చేసుకొని తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు దోపిడీ శక్తులు తీవ్రంగా ప్రయత్నించటాన్ని మనం చూస్తున్నాం. దానిలో భాగమే మతవిద్వేషాలను రెచ్చగొట్టటం. చైనా-వాటికన్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది అంటే అర్ధం అక్కడ మత సమస్య పరిష్కారమైందని కాదు. సోషలిస్టు వ్యవస్ద నిర్మాణబాటలో ఎదురయ్యే అనేక ఆటంకాలను తొలగించుకుంటూ పోవటం తప్ప దగ్గరదారి లేదు.దానిలో భాగమే ఇది అని చెప్పవచ్చు. ఇది సరైనదా కాదా అన్న విషయం మీద ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పటం సాధ్యం కాదు. సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించేందుకు, దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా కమ్యూనిస్టులు అలాంటి శక్తులను సహించరు. చైనా కమ్యూనిస్టు పార్టీ అందుకు మినహాయింపు అనుకోజాలం.

చైనాలో క్రైస్తవం మైనారిటీ మతం. ఎంత మంది దాన్ని అవలంభిస్తున్నారన్నది స్పష్టంగా తెలియదు. మీడియాలో వచ్చే అంకెలు పొంతన లేకుండా వున్నాయి. ఒప్పందం గురించి సహజంగానే ఎవరికి వారు ఏమి చెప్పుకున్నప్పటికీ చైనాలోని చర్చ్‌లపై వాటికన్‌ పోప్‌ అధికారాన్ని పరిమితంగానే అయినా కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించటం, మత వ్యవహారాలలో ప్రభుత్వాల పాత్రను అంగీకరించం అనే వాటికన్‌ తన వైఖరిని సడలించుకోవటం ఒక చారిత్రక ముందడుగు. క్రైస్తవంతో సహా ఏమతమైనా సామాన్యుల బాధలు, గాధల పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చింది తప్ప వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోరాడేవారిని నిర్వీర్యం చేసేందుకు మతాన్ని ఒక మత్తు మందుగా పాలకవర్గాలు ప్రయోగించాయి. ప్రధమ శ్రామికవర్గ రాజ్యం సోవియట్‌లో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని, ప్రపంచం మొత్తంగా కమ్యూనిస్టు భావజాలాన్ని క్రైస్తవం వ్యతిరేకించింది. సామ్రాజ్యవాదంతో చేతులు కలిపింది. అందువల్లనే సోవియట్‌ యూనియన్‌ వునికిలో వున్నంత కాలం వాటికన్‌తో అధికారిక సంబంధాలు లేవు. అదొక అపరిష్కృత సమస్యగానే వుండిపోయింది.

క్రైస్తవంలో తలెత్తిన సంస్కరణ, ఇతర వుద్యమాల కారణంగా అనేక మొత్తం మీద ఏసును ప్రభువుగా గుర్తిస్తూనే మత కర్మకాండల విషయంలో భిన్న ధోరణులు, పలు చర్చి సమూహాలు వునికిలోకి వచ్చాయి. వాటికి పాలకవర్గాల మద్దతు లభించింది తప్ప ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఎవరికి ఇష్టమైన చర్చిని వారు అనుసరించారు. దేవుడి వునికిని అంగీకరించని, రాజ్యానికి మతానికి సంబంధం వుండకూడదని కోరుకొనే కమ్యూనిస్టులు పాలకులుగా వచ్చిన తరువాత సరికొత్త సమస్య తలెత్తింది. అప్పటి వరకు తమలో తాము ఎంతగా కుమ్ములాడుకున్నప్పటికీ కమ్యూనిజం తమ వునికినే వ్యతిరేకిస్తున్న కారణంగా ముందుగా దాన్ని వ్యతిరేకించాలంటూ అన్ని రకాల చర్చ్‌లు ఏకమయ్యాయి. వాటి కుట్రలను ఎదుర్కొంటూనే సోషలిస్టు దేశాలన్నీ తమ పౌరులకు మత స్వేచ్చను ఇచ్చాయి. సోషలిస్టు వ్యవస్ధను కూల్చేందుకు ప్రయత్నించే ఇతర శక్తులతో సమంగా మతశక్తులనూ చూశాయి, చూస్తున్నాయి. కమ్యూనిస్టులు బిషప్పుల నియామకంలో వాటికన్‌ ఏకపక్ష పెత్తనం చైనా గడ్డమీద చెల్లదని ప్రభుత్వం రుజువు చేసిందని, రహస్య కార్యకలాపాలను నిర్వహించే అనధికార చర్చ్‌లను మూసివేయటానికి తోడ్పడుతుందని మరోవాదన.ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొందరు బిషప్పులను బాధ్యతల నుంచి తొలగించేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం చేసుకున్నప్పటికీ దానికి చైనా నాయకత్వం పెద్ద ప్రచారం కల్పించదలచలేదు, ఒక సాదాసీదా వ్యవహారంగానే చూడాలని నిర్ణయించినట్లు అధికార మీడియాలో క్లుప్తంగా వార్తలు ఇచ్చిన తీరే నిదర్శనం.

కొన్ని నెలల క్రితం చైనా లక్షణాలతో కూడిన మత కార్యకలాపాలు వుండాలనే ప్రచారానికి చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ శ్రీకారం చుట్టారు. చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్దను నిర్మించాలనే లక్ష్యం కలిగిన చైనా రాజ్యాంగానికి కట్టుబడే అన్ని మతకార్యకలాపాలుండాలని నిబంధనలు చెబుతున్నాయి.దానికి భిన్న మైన వైఖరి వ్యక్తమైన చోట్ల సరి చేసేందుకు, చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వెనుకాడటం లేదు. దీన్ని వ్యతిరేకించే శక్తులు వాటిని చిలవలు పలవలుగా పెంచి ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఇలాంటి ఒప్పందం కుదుర్చుకొనేందుకు సముఖత వ్యక్తమైనప్పటి నుంచీ గత మూడు సంవత్సరాలుగా పని గట్టుకొని ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముస్లింలను లక్షలాది మందిని శిబిరాలలోకి చేర్చి బలవంతంగా పందిమాంసం తినిపిస్తున్నారని, సాంప్రదాయ దుస్తులు వేసుకోరాదని, బురఖాలు, గడ్డాలను తీసివేయాలని వత్తిడి చేస్తున్నారని, క్రైస్తవ చర్చ్‌లను కూల్చివేస్తున్నారని, శిలువల ప్రదర్శనలను అనుమతించటం లేదని, మత కేంద్రాలలో పార్టీ పెత్తనాన్ని ఆమోదించాలని, కమ్యూనిస్టు నాయకుల ఫొటోలు పెట్టాలని వత్తిడిచేస్తున్నారంటూ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయా దేశాల వారు చైనాను ప్రశ్నించరేమని రెచ్చగొడుతున్నారు. మన దేశంలో నిత్యం ఇస్లాం, క్రైస్తవ మతాల మీద విద్వేషం రెచ్చగొట్టి, దాడులకు పాల్పడే శక్తులు కూడా మొసలి కన్నీరు కారుస్తూ తమ చైనా వ్యతిరేక ప్రచారానికి దీన్ని వాడుకుంటున్నాయి. టిబెట్‌ బౌద్ధ మతాధికారి దలైలామా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటు చేసి పారిపోయి మన దేశంలో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించేందుకు నిరాకరిస్తున్న దలైలామా సామ్రాజ్యవాదుల చేతిలో పావుగా మారి చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనా అంతర్బాగÛంగా గుర్తిస్తున్నప్పటికీ దలైలామాకు ఆశ్రయం ఇవ్వటం గమనించాల్సిన అంశం. దలైలామా నియమించే మతాధికారులకు చైనాలో గుర్తింపు లేదు. దలైలామా కూడా చైనా రాజ్యాంగాన్ని ఆమోదించి, టిబెట్‌ను అంతర్భాంగా అంగీకరిస్తే తిరిగి చైనాలో ప్రవేశించేందుకు అభ్యంతరం వుండకపోవచ్చు.నేరాలేమైనా వుంటే రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.

Image result for historic agreement between china and vatican

‘ నేడు పోప్‌ ప్రతినిధి సింహద్వారం నుంచే బీజింగ్‌ వెళ్ల వచ్చు. రహస్య సంప్రదింపులు ఇంకేమాత్రం అవసరం లేదు. అయితే అధికారిక ఒప్పందం పోప్‌ను, చైనా కాథలిజం గౌరవాన్ని గుర్తించిందని’ వాటికన్‌తో దగ్గరి సంబంధాలున్న ఇటలీ మాజీ మంత్రి ఆండ్రియా రికార్డీ ఒప్పందం గురించి వ్యాఖ్యానించాడు. దీంతో చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఇంతకాలం ఒక దేశంగా వాటికన్‌ ఇచ్చిన గుర్తింపు రద్దయినట్లే. ఈ ఒప్పందం గురించి పశ్చిమ దేశాలలో చైనా వ్యతిరేక మీడియా ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. అరెస్టులు, నిర్బంధాలకు గురై రహస్యంగా మతకార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని ఫణంగా పెట్టి ఈ ఒప్పందం ద్వారా చైనా ప్రభుత్వానికి వాటికన్‌ అమ్ముడు పోయిందని, తోడేళ్లకు మేకలను బలిపెట్టినట్లయిందని హాంకాంగ్‌ మాజీ కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌ విషంగక్కాడు. చైనాలో ఎంత మంది బిషప్పులున్నారన్నది ఒక సమస్య. వాటికన్‌ లెక్క ప్రకారం 145 మంది వుండగా, చైనా లెక్కలో 96 వున్నట్లు హాంకాంగ్‌లోని ఒక సంస్ధ పేర్కొన్నది.

చైనా ప్రభుత్వ గుర్తింపుతో పని చేస్తున్న కాథలిక్‌ సంస్ధలు ఒప్పందాన్ని స్వాగతించాయి. దేశాన్ని, మతాన్ని ప్రేమించే సాంప్రదాయానికి తాము కట్టుబడి వున్నామని దానికి సోషలిస్టు సమాజమే మార్గమని, స్వతంత్రంగా పని చేయాలనే సూత్రాన్ని పాటిస్తామని చైనీస్‌ పేట్రియాటిక్‌ కాథలిక్‌ అసోసియేషన్‌(సిపిసిఏ), బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ కాథలిక్‌ చర్చ్‌ ఇన్‌ చైనా( బిసిసిసిసి) తమ ప్రకటనల్లో పేర్కొన్నాయి. మొదటి సంస్ధ 1957లో ఏర్పడగా, రెండవ సంస్ధ సాంస్కృతిక విప్లవం తరువాత 1980లో ఏర్పడింది. ఆ కాలంలో అన్ని మతాలను రద్దు చేయాలనే విపరీత ధోరణి కొందరు నేతల్లో వ్యక్తమైన విషయం తెలిసినదే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం బహిరంగంగా మతకార్యకలాపాలు నిర్వహించటం, కట్టడాలు నిర్మించటం, సాహిత్యం అమ్మటం తదితర అంశాలపై కొన్ని ఆంక్షలున్నాయి. వాటి మేరకు అనుమతి లేని చర్చ్‌లను కూల్చివేయటాన్ని మొత్తం చర్చ్‌లు కూల్చివేయటంగా పశ్చిమ దేశాల మీడియా వక్రీకరించింది.

ఈ ఒప్పందం గురించి కాథలిక్‌ న్యూస్‌ సర్వీస్‌ ప్రకటించిన విశ్లేషణలోని అంశాలు ఇలా వున్నాయి. ఇప్పుడు కావలసింది ఐక్యత, విశ్వాసం, ఒక నూతన ప్రేరణ. గతంలో వున్న అపోహలు, ఇటీవలి వుద్రిక్తతలతో సహా గతంలో తలెత్తిన వాటిని అధిగమించాలని వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పారోలిన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. బిషప్పుల నియామకం, పని వాటికన్‌-చైనా సంబంధాలలో ఒక ముఖ్యమైన ఆటంకం. బిషప్పులను పోప్‌ నియమించాలని వాటికన్‌ పట్టుబడుతుండగా, అలా చేయటం తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని చైనా భావించింది. ప్రభుత్వం ఆమోదించిన మత సంస్ధలు నియమించిన బిషప్పులను అనుసరించటానికి కొందరు కాథలిక్కులు తిరస్కరించారు. అనేక మందిని స్ధానికంగానే ఎన్నుకున్నారు,అయినప్పటికీ వారు పోప్‌కు విధేయత ప్ర కటించారు. చైనాలో బిషప్పుల నియామకం పూర్తిగా తమ అదుపులోనే వుండాలని తాము ఆశించటం లేదని, ముందు అక్కడి వారికి స్వేచ్చ, భద్రత కోరుకుంటున్నామని వాటికన్‌ అధికారులు ఎల్లపుడూ చెబుతూనే వున్నారు.

తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం బిషప్పుల నియామక ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఒప్పంద ప్రతిని వాటికన్‌ విడుదల చేయలేదు. ఒప్పందానికి ముందు వచ్చిన వార్తల ప్రకారం బిషప్పుల నియామకానికి ఒక ప్రక్రియను రూపొందిస్తారు. భవిష్యత్‌లో జరిగే నియామకాలకు సబంధించి డయోసిస్‌ పరిధిలోని వారితో ప్రజాస్వామిక ఎన్నికల పద్దతి ద్వారా బిషప్పులను ఎన్నుకుంటారు. ఫలితాలను పరిశీలనకు ప్రభుత్వానికి అంద చేస్తారు, వాటి నుంచి జాబితాను అధికారికంగా పోప్‌కు పంపుతారు. ప్రభుత్వం, పోప్‌ కూడా జాబితాలోని వారిని వీటో చేయవచ్చు. ఎన్నిక సక్రమంగా జరిగిందా లేదా అన్నది పోప్‌ దర్యాప్తు చేయవచ్చునని జెసూట్‌లు నడిపే అమెరికన్‌ మాగజైన్‌ తెలిపింది. వీటో జరిగినపుడు చైనా-వాటికన్‌ ప్రతినిధులు సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నిస్తారు, సాధ్యం కానపుడు చైనా మరోపేరును ప్రతిపాదిస్తుంది. అంతిమ నిర్ణయం పోప్‌దిగానే వుంటుంది. ఈనెల 20వ తేదీన ఒప్పందంపై సంతకాలకు ముందు కార్డినల్‌ పారోలిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఇది ఒక ముందుడుగు అని భావిస్తున్నాం ఇక నుంచి అంతా సులభంగా జరిగిపోతుందని అనుకోవటం లేదు, అయితే ఇది మాకు సరైనదారి అనిపించింది అన్నారు. ఇది మతపరమైనది తప్ప రాజకీయమైంది కాదని ఒప్పందం గురించి వాటికన్‌ మీడియా డైరెక్టర్‌ గ్రెగ్‌ బుర్కే వ్యాఖ్యానించారు.

ఏ దేశంలో ఏ మత చరిత్ర చూసినా అది పాలకవర్గాల ఆయుధంగా వుంది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం కొనసాగిన కాలంలో మెజారిటీ చర్చి అధికారులు దానికి వ్యతిరేకంగా వున్నారు, వ్యతిరేకులతో చేతులు కలిపారు, విదేశాలకు వెళ్లిపోయారు తప్ప సామాన్య జన పక్షాన లేరు, దోపిడీ నుంచి వారు విముక్తికావాలని కోరుకోలేదు. అందువలన సహజంగానే కమ్యూనిస్టు పార్టీ కూడా దానికి అనుగుణ్యంగానే వ్యవహరించింది. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిగతా సామ్రాజ్యవాదుల మాదిరే వాటికన్‌ కూడా ఆ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది. శత్రువులతో చేతులు కలిపిన అనేక మంది విదేశీ చర్చి ప్రతినిధులను చైనా దేశం నుంచి పంపివేసింది. స్ధానికంగా వున్న వారిని కొంత మంది మీద విచారణ జరిపి దోషులుగా చేరిన వారి మీద చర్య తీసుకుంది. తరువాత అక్కడి మతాభిమానులు చైనా దేశభక్త కాధలిక్‌ అసోసియేషన్‌ పేరుతో బిషప్పులతో సహా పూజారులను నియమించుకొని కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మతంపై కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదు, కొందరు ప్రచారం చేసినట్లు ఒక్క చర్చిని కూడా కూల్చలేదు. ఈ పూర్వరంగంలో ఏడు దశాబ్దాల తరువాత చైనా-వాటికన్‌ మధ్య ఒప్పందం కుదరటం చారిత్రాత్మకమే.

ఈ ఒప్పందం గురించి కరడుగట్టిన మతవాదులు, అలాగే కొందరు విపరీత అభ్యుదయ వాదులు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయటం సహజమే. వందలు, వేల సంవత్సరాలుగా వేళ్లూనుకున్న మత భావనలను తెల్లవారే సరికి పోగొట్టగలమని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. మతం మత్తు మందు అని నమ్మేకమ్యూనిస్టులు ఒక మతంతో రాజీ పడటం ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కమ్యూనిస్టులు చైతన్యంతో ఒక అడుగు ముందుండాలే తప్ప జనాన్ని వదలి దూరంగా వుంటే లాభం లేదు. మతం మత్తు మందు అని తాము నమ్మితే చాలదు, ఇంకా దాని మత్తులో వున్న విస్తార జనంలో దాన్ని వదిలించాలి. అంతిమ లక్ష్యమైన సోషలిస్టు సమాజ నిర్మాణానికి వర్గశత్రువుతో ఎలాగూ పోరాటం చేయక తప్పదు. మతాన్ని నమ్మిన సామాన్యులందరూ సోషలిజానికి శత్రువులు కాదు. ప్రతి దేశంలో ఏదో ఒక మతాన్ని అనుసరించే శ్రమజీవులే కదా కమ్యూనిస్టుల నాయకత్వాన విప్లవాలను జయప్రదం చేసింది. సామాన్యులందరూ మతోన్మాదులే అయితే ఇది సాధ్యమయ్యేదా? ఆ లక్ష్యాన్ని దెబ్బతీయటానికి మతాన్ని ఆయుధంగా చేసుకొనేశక్తులను అనుమతించకుండా, సామాన్యులను శత్రువులుగా చేసుకోకుండా ఎత్తుగడగా అయినా కొంత కాలం మతంతో రాజీపడటం వాస్తవానికి దగ్గరగా వుంటుంది. రాజీ వేరు లంగిపోవటం వేరు. హేతు, భౌతిక వాదాన్ని ఫణంగా పెట్టి మతాన్ని సంతృప్తి పరచటం వేరు. చైనా సర్కార్‌ చర్యలో అలాంటిదేమీ కనిపించటం లేదు. మతానికి సంబంధించి తన విధానాన్ని నవీకరించుకున్న తరువాతే ఈ పరిణామం జరిగింది.

రాజీ, సర్దుబాటు అన్నది అటు కమ్యూనిస్టు చైనాకు, ఇటు క్రైస్తవ వాటికన్‌కు రెండింటికీ అవసరం అయ్యాయనవచ్చు. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ వర్గంతో కలసి క్రైస్తవులను సోషలిజం, కమ్యూనిస్టు వ్యవస్దలకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు చర్చి నిరంతరం ప్రయత్నిస్తున్నది. తూర్పు ఐరోపా, సోవియట్‌ వ్యవస్ధల కూల్చివేతలకు పోప్‌ రెండవ జాన్‌ పాల్‌ సామ్రాజ్యవాదులతో చేతులు కలిపారన్నది బహిరంగ రహస్యం. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో ఇతర అనేక అంశాలతో పాటు కాథలిక్‌ చర్చి జోక్యం ముఖ్యంగా పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి బయటకు తెలిసినదాని కంటే చైనా కమ్యూనిస్టుపార్టీకి ఇంకా వివరంగా తెలుసన్నది వేరే చెప్పనవసరం లేదు.

తదనంతరం కాలంలో పశ్చిమ దేశాల మీడియా చైనాలో క్రైస్తవులను అణచివేస్తున్నారని, దాంతో రహస్యంగా ప్రార్ధనలు చేసే వారు పెరుగుతున్నారని పశ్చిమ దేశాల మీడియాలో ఒక పధకం ప్ర కారం ప్రచారం ఎక్కువైంది.కమ్యూనిస్టులు మతాన్ని నిషేధించరు, అణచివేయరు, స్వేచ్చను ఆటంక పరచరు అని లోకానికి తెలియటం అవసరం. తైవాన్‌ను ఒంటరి చేయాలంటే వాటికన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకోవటం ఒక మార్గం. ఈ పూర్వరంగంలో తెలివైన వారెవరైనా ప్రధాన అంశాల మీద కేంద్రీకరించి, మిగతావాటి మీద సర్దుబాటుకు ప్రయత్నిస్తారు. చైనా నాయకత్వం కూడా అదే చేసినట్లు కనిపిస్తోంది. తాను ఒక మెట్టుదిగి చైనా సర్కార్‌ ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే లాభం లేదని వాటికన్‌ కూడా అనుభవంలో తెలుసుకుంది. ఏదో ఒక పరిష్కారం కుదుర్చుకొనేందుకు చొరవ చూపాలనే వత్తిడి కూడా క్రమంగా పెరిగింది. ఇదీ నేపధ్యం. ఈ ఒప్పందం కుదరటానికి పశ్చిమ దేశాల మీడియా లేదా మరికొందరు వర్ణిస్తున్నట్లు కమ్యూనిస్టు పోప్‌ ఫ్రాన్సిస్‌ కారణం అనుకుంటే పొరపాటు. ఆయన హయాంలో ప్రయత్నాలు వేగవంతం అయితే అయి వుండవచ్చుగానీ సర్దుబాటు లేదా రాజీకి పునాది పోప్‌ బెనెడిక్ట్‌-16 హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఒక అంగీకారానికి రావటం ఇరు పక్షాలకూ కత్తిమీద సాము వంటిదే. పోప్‌ 16వ బెనెడిక్ట్‌ హయాంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాటికన్‌ విదేశాంగశాఖ మంత్రిగా వున్న ఆర్చిబిషప్‌ పిట్రో పారోలిన్‌ 2009లోనే తన ప్రయత్నాలను ప్రారంభించారని, చైనాతో ఒక అవగాహనకు వచ్చారని మిలన్‌ కాథలిక్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ అగొస్టినో జివాంగ్నోలీ చెప్పారు. ఆ ఏడాదే పారోలిన్‌ వెనెజులాకు వాటికన్‌ ప్రతినిధిగా వెళ్లారు.అయితే తరువాత ఎలాంటి పురోగతి లేదు. 2013లో పోప్‌ ప్రాన్సిస్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే అధ్యక్షుడిగా ఎన్నికైన జింపింగ్‌కు అభినందనలు పంపారు. తరువాత ఒక పోప్‌ ప్రయాణించే విమానాన్ని తొలిసారిగా తన భూభాగం మీదుగా అనుమతించి పోప్‌ ఫ్రాన్సిస్‌ దక్షిణ కొరియా పర్యటనకు చైనా అవకాశమిచ్చింది. ఆ వెంటనే అర్జెంటీనా రాజకీయవేత్త రికార్డో రోమనో ద్వారా ఒక లేఖ పంపిన పోప్‌ తాను చైనా నాయకుడితో చర్చలకు ఆహ్వానం పంపారు. ఆ తరువాత చైనా నూతన సంవత్సరం సందర్భంగా జీకి శుభాకాంక్షలు పంపారు. మెక్సికో నుంచి రోమ్‌ వెళుతూ విమానంలో విలేకర్లతో మాట్లాడిన పోప్‌ తాను చైనా సందర్శనను నిజంగా ప్రేమిస్తానని బహిరంగంగా చెప్పారు.2014లో రోమ్‌లో వుభయ ప్రతినిధులు సమావేశమయ్యారు. చైనాతో చర్చలు కొనసాగించి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని పోప్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఒక అధికారి రెండు సంవత్సరాల క్రితమే రాయిటర్స్‌ వార్తా సంస్ధకు చెప్పారు. ఆ తరువాత ప్రతినిధి వర్గాల సమావేశాలు, తాజా ఒప్పందానికి దారి తీశాయి.

చైనా కమ్యూనిస్టు పార్టీ హేతువాద, భౌతికవాద దృక్పధం కలిగింది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం అధికారయుతంగానే బౌద్ధం,తావో, ఇస్లాం, క్రైస్తవంలో ప్రొటెస్టెంట్‌, కాథలిక్‌ మతాలను గుర్తించి రాజ్యాంగ పరిధిలో మతారాధన, అవలంబన స్వేచ్చ హక్కులను ఇచ్చింది. మతం పేరుతో తమ దేశంలోని వారిని విదేశాలలో వున్న వారు అదుపు చేసే లేదా మార్గదర్శనం చేయటాన్ని అంగీకరించటం అంటే అదొక ముప్పుగా భావించింది. అందుకే కొన్ని పరిమితులు, పరిధిని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో వున్న మతాలలో ఒక్క కాథలిక్‌ మతానికే ప్రపంచ కేంద్రం వుంది. అందువలన దాన్ని అవలంభించేవారు దాని ఆదేశాలు, మార్గదర్శనం కోసం ఎదురు చూస్తారు. మతపరంగా దానికే విధేయులై వుంటారు. చైనా విప్లవ కాలం, కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నియమించిన మతాధికారులు మొత్తం మీద కమ్యూనిస్టుల వునికి, విప్లవం, ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించారు. సోవియట్‌ యూనియన్‌లోని కొన్ని రిపబ్లిక్‌లలోని అతి పెద్దదైన రష్యా, ఇతర చోట్ల కాథలిక్‌ చర్చి ఆధిపత్యాన్ని అంగీకరించని ఆర్ధొడాక్‌ చర్చ్‌ ప్రభావం ఎక్కువ. అది కూడా సోషలిజాన్ని వ్యతిరేకించింది, తరువాత రాజీపడి కొనసాగింది. 1989లో సోవియట్‌ చివరి రోజులలో గోర్బచెవ్‌ నాటి పోప్‌ను తొలిసారిగా సోవియట్‌ నేత హోదాలో కలిశారు. తరువాత రెండు సంవత్సరాలకే దాన్ని కూల్చివేశారు.

వాటికన్‌తో ఒప్పందం విషయంలో చైనా నాయకత్వంలో కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. పద్దెనిమిది సంవత్సరాల క్రితం హాంకాంగ్‌, మకావో దీవులు చైనాలో విలీనమయ్యాయి. ప్రజాస్వామ్యం పేరుతో హాంగాంగ్‌లో నిర్వహిస్తున్న చైనా వ్యతిరేక ఆందోళనలో స్దానిక కాథలిక్‌ అధికారులు, ఇతర విదేశీ మిషనరీల పాత్ర సుపరిచతం. చర్చలు ప్రారంభమైన తరువాత కూడా హాంకాంగ్‌ మాజీ బిషప్‌ జోసెఫ్‌ జెన్‌ వంటి వారు తమ చైనా వ్యతిరేకతను దాచుకోలేదు. అందువలన పోప్‌ను నమ్మవచ్చా, ఒప్పందం కుదిరిన తరువాత చైనా అంతర్గత వ్యవహారాలలో వాటికన్‌ జోక్యం చేసుకోకుండా వుంటుందా? మతభావనలు మరింతగా పెరిగే అవకాశాలేమైనా వుంటాయా; అప్పుడేమి చెయ్యాలి? అనే తర్జన భర్జనలు జరగకపోలేదు. వాటన్నింటి తరువాతే ఒప్పందం కుదిరింది. విదేశీ పెట్టుబడులకు,సంస్థలకు ద్వారాలు తెరిచినపుడు సంస్కరణలకు ఆద్యుడు డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. గాలి కోసం కిటికీ తెరిచినపుడు దానితో పాటు హాని కలిగించే క్రిమి కీటకాలు కూడా ప్రవేశిస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో తెలుసు అన్నారు. ఇప్పుడు వాటికన్‌తో ఒప్పందం విషయంలో కూడా అదే జాగ్రత్తలతో చైనా నాయకత్వం వుంటుందని ఎందుకు అనుకోకూడదు ?