Tags

, , ,

Image result for adultery law : challenged by men, ruling and discussion focused on women

ఎం కోటేశ్వరరావు

‘భర్త అంటే భార్యకు యజమాని కాదు, వేరొకరి భార్యతో మరో పురుషుడు సంబంధం పెట్టుకుంటే ఆ కారణంగా విడాకులు కోరవచ్చు అది తప్పిదం తప్ప ఆ చర్య శిక్షార్హమైన నేరపూరితమైది కాదు ‘ సుప్రీం కోర్టు మన శిక్షా స్మృతిలోని 158 ఏండ్ల నాటి చట్టం చెల్లదంటూ కొట్టి వేస్తూ ఇచ్చి తీర్పు సారాంశమిది. అయితే ఈ తీర్పు వివాహితుల విశృంఖలతకు, వివాహ వ్యవస్ధ విచ్చిత్తికి దోహదం చేస్తుందంటూ ఆడమగా తేడా లేకుండా కొందరి నుంచి తీవ్ర వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(ఈ రచయిత న్యాయ నిపుణుడు కాదు, కనుక పరిమితులు వున్నాయని గమనించ మనవి). న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారిచ్చే ఏ తీర్పునైనా విమర్శించ వచ్చు కనుక వారికా స్వేచ్చ వుంది. ఇక తాజా తీర్పు విషయానికి వస్తే అసలు ఈ కేసును దాఖలు చేసిన వ్యక్తి వుద్ధేశ్యం వేరు. ఇప్పుడున్న చట్టం పురుషుల పట్ల వివక్షతో కూడుకున్నదని తన స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడిన కారణంగా ఆ వివక్షను సవాలు చేస్తూ పగబట్టిన మహిళలు, వారి భర్తల నుంచి వివాహేతర సంబంధాల విషయంలో పురుషులను రక్షించేందుకు తాను కేసు దాఖలు చేసినట్లు కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు జోసెఫ్‌ షైనీ చెప్పాడు. అతను ఇటలీలో ఒక హోటల్‌ నిర్వహిస్తున్నాడు. దీనిపై వెలువడిన తీర్పు, దాని మీద జరుగుతున్న చర్చ మహిళల సమానత్వం, ఇతర అంశాల చుట్టూ తిరగటం విశేషం.

రంకుతనం నేరపూరితమైనదిగా నిర్దేశించిన భారతీయ శిక్షా స్మృతిలోని 497వ సెక్షన్‌ చెల్లదని ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. భారతీయ శిక్షా స్మృతిలో రంకుతనం గురించి చెబుతున్న సెక్షన్‌ 497 ప్రకారం దానికి పాల్పడిన మహిళలను శిక్షించే అవకాశం లేదు. భర్త అంగీకారం లేకుండా అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడు మాత్రమే నేరం చేసినట్లుగా అది చెబుతున్నది. ఎవరైనా రంకుతనానికి పాల్పడితే భాగస్వామి ఆ కారణంగా విడాకులు కోరవచ్చు. ఈ సెక్షన్‌ భర్తను ఒక యజమానిగా పరిగణిస్తున్నదంటూ కోర్టు కొట్టి వేసింది. రంకుతనం(వివాహేతర సంబంధం) అంటే ఒక వ్యక్తి అంగీకారం లేదా చూసీచూడనట్లుగా వుంటే తప్ప అతని భార్యతో ఎవరైతే లైంగిక సంబంధం కలిగి వున్నారో దాన్ని రంకుతనంగా పరిగణిస్తారు. అటు వంటి సంబంధం అత్యాచార నేరం కిందికి రానప్పటికీ రంకుతనపు నేరస్దుడిగా పరిగణించబడతాడు. అందుకుగాను జరిమానాతో లేదా జరిమానా లేకుండా, లేదా జరిమానాతో సహా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అలాంటి కేసులలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిందంటూ భార్యను శిక్షించటానికి వీలు లేదు.

ఈ భాష్యం అనేక అంశాలను ముందుకు తెచ్చింది. రంకుతనం నేరంలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిన వ్యక్తిగా వివాహిత మహిళను పరిగణించరు. అంటే రంకుతనానికి పురుషులను తప్ప మహిళలను బాధ్యురాలిగా చూడటం లేదు. వివాహంగాని ఒక మహిళ ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుంటే ఈ సెక్షన్‌ వర్తించదు. ముందే చెప్పినట్లు భర్త అనుమతించినా, చూసీచూడనట్లు వ్యవహరించినా ఆ రంకుతనం నేరం కాదు. రంకుతనానికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయటానికి సదరు వివాహిత మహిళ భర్తకు మాత్రమే హక్కు వుంది. సదరు పురుషుడి భార్య హక్కు గురించి ఏమీ చెప్పలేదు. అంటే ఒక మహిళ ఒక పురుషుడికి చెందినది మాత్రమే అని, ఒక వేళ ఆమె వివాహేతర సంబంధానికి అంగీకరించినప్పటికీ ఆమెకు స్వంతంగా ఎలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు వుండవని సెక్షన్‌ పరిగణిస్తున్నది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 మరియు 15ను వుల్లంఘిస్తున్నదని అందువలన దాని మీద విచారణ జరపాలంటూ 2017 డిసెంబరులో సుప్రీం కోర్టు ముందు ఒక జోసెఫ్‌ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సుప్రీం కోర్టు విచారణకు అనుమతించింది.

రాజ్యం ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టపరమైన సమాన రక్షణను నిరాకరించజాలదని ఆర్టికల్‌ 14 చెబుతుండగా కుల, మత, తెగ, లింగ, పుట్టిన ప్రాంతం తదితరాలు కారణాలుగా ఏ పౌరుడి పట్ల వివక్ష చూపరాదని ఆర్టికల్‌ 15చెబుతున్నది. జోసెఫ్‌ పిటీషన్‌ స్వీకరించిన కోర్టు 497 సెక్షన్‌ను సవాలు చేసిన తొలి పిటీషన్‌ ఇది కాదని 1954 నుంచీ సవాలు చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి, కేసులున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పెద్ద ప్రయాస లేకుండానే దీని గురించి నిర్ణయించవచ్చని పేర్కొన్నది. చట్టాలు లింగ సంబంధంగా తటస్ధంగా వుండాలని భావించింది. పురుషుల పట్ల వివక్ష చూపుతున్నదని పిటీషన్‌దారు వాదించాడు. ఈ పిటీషనర్‌ వాదనను అంగీకరిస్తే ఇప్పటి కంటే వివాహేతర సంబంధాలు మరింత స్వేచ్చగా చెలరేగుతాయని, దీని బదులు సంస్కరణల కమిటీ సూచించినట్లుగా ‘ మరొక వ్యక్తి భాగస్వామి లేదా మరొకరితో ఎవరు లైంగిక సంబంధాలు నెరిపినా దానిని రంకుతనంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఆగస్టు ఒకటిన వాదనలు వినటం ప్రారంభించిన కోర్టు సెప్టెంబరు 27న ఆ సెక్షన్‌ చెల్లదంటూ ఐదుగురు సభ్యుల బెంచ్‌ తీర్పు చెప్పింది.

తీర్పు పట్ల పిటీషనర్‌ జోసెఫ్‌ హర్షం వ్యక్తం చేశారు. తన స్నేహితుడితో కలసి పని చేస్తున్న వుద్యోగిని ఒకరు ఒకరు తప్పుడు అత్యాచార ఆరోపణ చేయటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ వుదంతం తనను పిటీషన్‌ వేసేందుకు ప్రేరేపించిందని చెప్పాడు. మహిళలు ఇష్టపూర్వకంగానే భాగస్వాములై వుండవచ్చు, కానీ భర్తలు ఫిర్యాదు చేసినపుడు సంబంధం పెట్టుకున్న పురుషుడు బాధితుడు అవుతున్నాడు. ఇలాంటి ఫిర్యాదులు దాఖలైనపుడు పురుషుడు ఒంటరి తనం ఫీలవుతాడు. తట్టుకోలేకపోవచ్చు. ఈ సెక్షన్‌ రద్దు ఒక ప్రాధమిక చర్య, అది అనేక మార్పులకు దారి తీయవచ్చు అన్నాడు. కేరళ పురుషుల్లో రంకుతనం విచ్చలవిడిగా వున్నప్పటికీ బయటకు ఖండిస్తారు అన్నాడు.

భారతీయ సంస్కృతి ఏమౌతుందో అని ఆవేదన చెందే వారు ఈ తీర్పు వివాహేతర సంబంధాలకు ఇప్పటి వరకు వున్న బంధనాలను ఛేదించి స్వేచ్చ ప్రసాదించిందని, దీన్ని అవకాశంగా తీసుకొని స్త్రీ, పురుషులు ఇక తెగబడతారని, ఇంక పెళ్లెందుకు అని ఈసడించుకుంటున్నారు. గతాన్ని ఒకసారి అవలోకించటం అవసరం. ఇక్కడ ఇతిహాసాలు, మనుస్మృతి లేదా పురాణాల వుదంతాలను ప్రస్తావిస్తున్నామంటే అర్ధం వాటిన నమ్మిలేదా అవి మంచివి అని అర్ధం కాదు. వాటి ప్రభావం సమాజం మీద తీవ్రంగా వుందన్నది కాదనలేని వాస్తవం. కొన్ని సందర్భాలలో తమకు వాటంగా వుందనుకున్నపుడు వాటిని మన సంస్కృతిగా చూపుతూ రక్షణగా తీసుకోవటం, ఇష్టం లేనపుడు వాటికి విరుద్దంగా వాదించే అవకాశవాద వైఖరి మన సమాజంలో కనిపిస్తుంది. దాన్ని చెప్పేందుకే వాటి ప్రస్తావన పరిమితి. మిర్యాలగూడెం ప్రణయ్‌-అమృత వివాహ విషయాన్నే చూడండి.మిర్యాల గూడెం అమృత, ప్రణయ్‌ వివాహ వుదంతంలో తొమ్మిదో తరగతిలో ప్రేమ ఏమిటి అని బుగ్గలు నొక్కుకుంటున్న వారు రుక్మిణిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న సమయంలో కృష్ణుడి వయసెంతో చెబుతారా ? రుక్మిణికి 13 లేదా 14, కృష్ణుడికి 14, కొన్ని పురాణాల ప్ర కారం ఎనిమిది, 16, ఆ సమయానికి కృష్ణుడు ఇంకా సెటిల్‌ కాలేదు. సీతారాముల వివాహ సమయంలో వారి వయస్సు 12-6 సంవత్సరాలట. ఆ వుదంతాలను లట్టలు వేసుకుంటూ భక్తి పారవశ్యంతో చూస్తాం. మరి దీన్నెందుకు ద్వేషిస్తున్నాం. వారు అవతారపురుషులు అనేట్లయితే, ముందే రాసి పెట్టిన దాని ప్రకారం ఎలాగూ వివాహం అవుతుంది కదా? అంత చిన్న వయస్సులో అలా చేసుకోవాల్సిన ఖర్మేం పట్టింది. మనుస్మృతిలోని ఒక శ్లోకం ప్రకారం యుక్త వయస్సు వచ్చిన యువతి తనను చేపట్టే పెండ్లికొడుకు కోసం మూడు సంవత్సరాలు ఆగాలి. పెండ్లికొడుకులు రానపుడు ఆయువతే తనకు కావాల్సిన వాడిని చూసుకోవచ్చు.అని కామకోటి.ఓఆర్‌జిలో రాశారు.వీటన్నింటినీ చూసినపుడు చూసినపుడు ప్రణయ్‌-అమృత బాల్య వివాహం చేసుకోలేదు. చట్ట ప్రకారం వయస్సు వచ్చిన తరువాతే చేసుకున్నారు.శివుడిని తన కుమార్తె పార్వతి వివాహం చేసుకోవటం ఇష్టం లేని దక్షుడు వారిమానాన వారిని వదలి వేశాడు తప్ప శివుడ్ని చంపించేందుకు సుపారీ ఇచ్చి ఏర్పాట్లు చేయలేదే. విధి రాతను తప్పించలేం అని నమ్మేట్లయితే అందుకు విరుద్దంగా హత్య చేయించటం విధిని వెనక్కు తిప్పే ప్రయత్నమే కదా? అలాంటి మారుతీరావుకు మద్దతుగా ప్రదర్శనలు జరపటం, సామాజిక మాధ్యమాల్లో మద్దతు ప్రకటించట అంటే సమాజరీతిని వెనక్కు నడిపించాలని చూడటం తప్ప వేరు కాదు.

మహాభారతంలో పాండు రాజు ఇతరుల నుంచి పిల్లలను కనాలని కుంతిని స్వయంగా ప్రోత్సహించాడు. కుంతి తొలుత అంగీకరించలేదు. భార్య ఒక భర్తకే కట్టుబడి వుండాలన్న ఆంక్షలేవీ లేవని చెబుతాడు. ఆమె ఒకరికి పరిమితం కాకుండా ఒకరిని అనధికారికంగా ఐదుగుర్ని ఐదుగురితో అధికారికంగా కన్నదనుకోండి అది వేరే విషయం. ద్రౌపది ఆ పాండవులను ఐదుగుర్నీ భర్తలుగా చేసుకుంది. దాని వలన మన సమాజానికి హాని కలిగిందని ఎవరూ చెప్పలేదు. ఏదో ఒకసాకుతో ఆమోదించారు. వుద్ధాలకుడి కుమారుడు శేవత్‌కేతు తన తల్లి ఇతరులతో సంబంధాలను కలిగి వుండటాన్ని చూసి భార్యలు భర్తలకే పరిమితం కావాలన్న కొత్త నిబంధనను తీసుకువచ్చిన విషయమూ తెలిసిందే. భర్త చనిపోయినపుడు నియోగి విధి పేరుతో అంబిక, అంబాలిక పిల్లలను కనవచ్చని వ్యాసుడే చెప్పాడు. ఇప్పుడెవరైనా ఆ పని చేస్తే అంగీకరిస్తారా? రామాయణం విషయానికి వస్తే కొంత కాలం పరపురుషుడి పంచన వున్న ఒక మహిళ పవిత్రంగా ఎలా వుంటుందన్న మాటలు విన్న రాముడు సీత పవిత్రతను నిరూపించుకొనేందుకు అగ్ని ప్రవేశం చేయమన్న విషయం తెలిసిందే. అదే రాముడి సాయం పొందిన సుగ్రీవుడు తన భార్య రుమ వాలి చెరలో వున్నప్పటికీ ఆమె పవిత్రను నిరూపించుకోమని కోరలేదు. రాముడు కూడా దాన్ని రుద్దలేదు. మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం మహిళలు పురుషుల ఆస్తులుగానే వున్నారు తప్ప వారి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు. మనుస్మృతి ప్రకారం ఒక మహిళ ఎగువ తరగతి కులపు వ్యక్తితో సంభోగిస్తే అది శిక్షించదగిన చర్య కాదు. అదే దిగువ కులపు పురుషుడితో చేస్తే శిక్షార్హమేకాదు ఆమెను విడిగా వుంచాలి. దిగువ తరగతి పురుషుడు ఎగువ తరగతి మహిళతో సంబంధం కలిగి వుంటే అతనికి వురి శిక్ష విధించాలి. ఎవరైనా పురుషుడు (భార్యకాని) తన స్వంతకులపు మహిళతో తన ఇచ్చ తీర్చుకుంటే అతడు ఆమెకు పరిహారం చెల్లించాలి. ఈ తీరు తెన్నులను మన గత ఘన సంస్కృతి అని కీర్తిద్దామా?

ఎవరి వాదనలు వారు, ఎవరి తర్కం వారు చెప్పవచ్చు. తమకు నచ్చని భావాలను వ్యతిరేకించటం,అసహనాన్ని ప్రదర్శించవద్దు.తమ భావాలను ఇతరుల మీద రుద్ద వద్దు. సమాజం తనకు ఆటంకం కలిగించే వాటిని నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టివేసి ముందుకు పోతుంది. వివాహేతర సంబంధాలు నేరాలు కావని చెప్పటమంటే అలాంటి సంబంధాలు పెట్టుకోమని చెప్పినట్లు కాదు. చట్టం వున్నప్పటికీ రోజూ జరుగుతున్న అనేక నేరాలకు అవే కారణమని మనకు తెలిసిందే. అందువలన రంకుతనం అనేది చట్టం వుంటే అదుపులో వుంటుందని లేకపోతే విచ్చలవిడిగా పెరిగిపోతుందని వాదించటం అంటే మనమీద మనకే నమ్మకం లేకపోవటం. అనేక దేశాలలో ఇలాంటి బూజుపట్టిన చట్టాలు ఎప్పుడో రద్దయ్యాయి. అక్కడ వివాహవ్యవస్ధ, కుటుంబ జీవనం లేదా, నైతిక విలువలు లేవా? ఏ సమస్య మీద అయినా మధనం జరగనివ్వండి, ఎవరికి వారిని మంచి చెడ్డలను నిర్ణయించుకోనివ్వండి.