ఎం కోటేశ్వరరావు
భాయియోం, బహెనోం దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం 4.0 వైపు నడిపిస్తున్నానంటూ మన ఘనత వహించిన ప్రధాని నరేంద్రమోడీ అక్టోబరు పదకొండవ తేదీన ఒక మహోపన్యాసం చేశారు. ప్రపంచ ఆర్ధిక వేదిక న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా వున్న సమయంలో మాట్లాడితే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతానని చెప్పేవారు.ప్రధాని నరేంద్రమోడీ కంటే పక్షం రోజుల ముందే నాలుగున్నరేండ్లయినా రాజధాని శాశ్వత భవనాలను కట్టలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి వచ్చారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో చేసిన ఒక వుపన్యాసంలో ఒక రూపాయి పెట్టుబడి అవసరం లేని ‘ఆవు’ వ్యవసాయం గురించి కూడా ప్రపంచానికి వివరించి వచ్చారు. నాలుగోపారిశ్రామిక విప్లవంలోని ప్రధాన అంశాలలోని ఐటి, బయోటెక్నాలజీ నిపుణులు కూడా వాటిని పక్కన పడేసి ఆవు వ్యవసాయానికి పూనుకొని అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించాలని సలహా కూడా ఇచ్చివచ్చినట్లు మనం వార్తలు చదువుకున్నాం. ఒకే నోటితో పరస్పర విరుద్ధ అంశాలు మాట్లాగల నేర్పరులు కొందరు రాజకీయవేత్తలు. అసలు నాలుగో పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి? అందుకు మన దేశంలో పరిస్ధితులు అనువుగా వున్నాయా?
నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకొనే ముందు మన దేశంలో మొదటి మూడు విప్లవాలు జరిగాయా, ఎంతవరకు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. వుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా- వుట్టి కొట్టలేనయ్య ఆకాశాన్ని అందుకుంటాడా ! మొదటి విషయం ఏ విప్లవం అయినా ఒక రోజులో లేదా ఒక తేదీనో ప్రారంభం కాదు, ముగియదు. ప్రధమ సోషలిస్టు విప్లవం రష్యాలో 1917 అక్టోబరు ఏడున జరిగింది అని చెబుతాం. దానర్ధం ఆ రోజు విప్లవపరిణామలు ఒక మలుపు తిరిగి మరోపరిణామానికి నాంది పలికింది అని తప్ప విప్లవం జయప్రదమైందని కాదు. అలాగే పాఠాల్లో మనం చదువుకొనే పారిశ్రామిక విప్లవం కూడా అలాంటిదే. ఒక తేదీ ఏమీ లేదు.1760 నుంచి 1820-40సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న వుత్పాదకపద్దతులు అంటే చేతితో తయారు చేసే ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టటం, వాటిని నడిపేందుకు ఆవిరిని వుపయోగించటం, రసాయనాల తయారీ వంటి పరిణామాలన్నీ ఆ 80సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చెందాయి. రెండవ పారిశ్రామిక విప్లవకాలంలో అంటే 1870-1914 సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న పరిశ్రమలను కొనసాగించటం, కొత్తవాటిని ఏర్పాటు చేయటంతో పాటు ఆవిరి స్ధానంలో యంత్రాలను నడిపేందుకు విద్యుత్ వినియోగం, చమురును కనుగొనటం, వాటితో వుత్పత్తిని ఇబ్బడి ముబ్బడి చేయటం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తరువాత నుంచి 1980, నేటి వరకు జరిగిన సాంకేతిక అభివృద్ధిని మూడవ పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పుకొనే ముందు దీని ప్రధాన లక్షణాలను చెప్పుకోవాల్సి వుంది.రోబోలు, కృత్రిమ మేథ, డిజిటల్, నానో టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,3డి ప్రింటింగ్, డ్రైవర్‌తో పని లేకుండా నడిచే వాహనాల వంటివి దీనిలో వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక(అదే మన చంద్రబాబు నాయుడు సిఎంగా వున్నపుడు ప్రతి సంవత్సరం దవోస్ వెళ్లి వస్తుంటారు. ఎందుకు వెళతారో, దాని వలన రాష్ట్ర ప్రజలకు చేతి చమురువదలటం తప్ప సాధించిందేమిటో ఇంతవరకు మనకు తెలియదు)ను ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ క్లాస్ ష్కవాబ్ నాలుగో పారిశ్రామిక విప్లవం అనే ఒక పుస్తకాన్ని రాశారు. మిగతా మూడు విప్లవాలం కంటే ఆధునాత సాంకేతిక పరిజ్ఞానమే నాలుగోదాని ప్రత్యేకత అంటారు. ఈ పరిజ్ఞానంతో వందల కోట్ల జనం ఇంటర్నెట్ వెబ్‌తో అనుసంధానం అవుతారని, వాణిజ్య, ఇతర సంస్ధల సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుందని, మెరుగైన సంపదల యాజమాన్య పద్దతులతో సహజపర్యావరణాన్ని తిరిగి సృష్టించేందుకు తోడ్పడవచ్చునని చెప్పారు.2016లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశ ఇతివృత్తానికి ‘నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సంపూర్ణత సాధన’ అని నామకరణం చేశారు. ఈ పద ప్రయోగం ఇదే మొదటి సారి. అదే ఏడాది అక్టోబరు పదిన శాన్ ఫ్రాన్సిస్‌కో నగరంలో నాలుగవ పారిశ్రామిక విప్లవ కేంద్రం పేరుతో విప్లవ పరిణామాలను అధ్యయనం చేయటానికి, సలహాలు ఇవ్వటానికి ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల తరువాత మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రపంచ ఆర్ధిక వేదిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసి అలాంటి కేంద్రానికే అక్టోబరు 11వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేశారు.
ఆ రోజు మోడీగారు చెప్పిందాని సారాంశం ఇలా వుంది. మొదటి, రెండవ పారిశ్రామిక విప్లవాలు జరిగే నాటికి భారత దేశం స్వతంత్రంగా లేదు. మూడవది జరిగిన సమయంలో అపుడే వచ్చిన స్వాతంత్య్రంతో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనేందుకు కుస్తీలు పడుతోంది. ఇప్పుడు నాలుగవ పారిశ్రామిక విప్లవానికి పెద్ద ఎత్తున దోహదపడుతుంది. సాంకేతిక పురోగతితో వుపాధి నష్టం జరుగుతుందని భయపడనవసరం లేదు, వుద్యోగాల స్వభాన్నే మార్చివేస్తుంది, మరిన్ని అవకాశాలను పెంచుతుంది.దీని ఫలితాలను పొందేందుకు అవసరమైన విధానపరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుంది. ప్రపంచ పరిశోధన మరియు అమలు కేంద్రంగా మారేందుకు అవసరమైన అవకాశాలు భారత్‌లో వున్నాయి. ఇంతకు ముందు వచ్చిన విప్లవాలు భారత్‌ను ఏమార్చాయి, నాలుగో విప్లవానికి భారత్ వంతు విస్మయకారిగా వుంటుంది.
ఇలా సాగిన వుపన్యాసంతో పాటు పనిలో పనిగా తన ప్రభుత్వం సాధించిన ఘనత గురించి కూడా చెప్పుకున్నారనుకోండి. తమ కారణంగానే టెలిఫోన్ సాంద్రత 93శాతానికి పెరిగిందని, 50కోట్ల మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నారని, ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ డాటా వాడుతున్నారని తక్కువ రేట్లకు దొరుకుతోందని, వినియోగం నాలుగు సంవత్సరాలలో 30రెట్లు పెరిగిందని, 120 కోట్ల మందికి ఆధార కార్డులు ఇచ్చామని, తాను అధికారంలోకి వచ్చిన 2014నాటికి కేవలం 59 గ్రామాలకు ఆప్టిక్ ఫైబర్ లైన్లు వుంటే త్వరలో రెండున్నర లక్షలకు చేరనున్నాయని చెప్పుకున్నారు. ఇది కూడా మరొక అర్ధ. అసత్యం. నేషనల్ ఆప్టికల్ ఫైబర్‌నెట్ వర్క్(నోఫెన్) అనే కేంద్ర ప్రభుత్వ పధకానికి 2011లో అనుమతి ఇచ్చారు.దీన్నే డిజిటల్ ఇండియా పేరుతో ఏదో తానే ప్రారంభించినట్లు మోడీ గొప్పలు చెప్పుకుంటారు. ఆ పధక కార్యాచరణ ప్రణాలిక ప్రకారం 2012 అక్టోబరు నాటికి రాజస్ధాన్,ఆంధ్రప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలలోని 59గ్రామాలలో పైలట్ పధకాన్ని అమలు చేయాలి. 2014 మార్చి, 2015 మార్చి నాటికి ఏటా లక్ష చొప్పున రెండులక్షల గ్రామాలకు, 2015సెప్టెంబరు నాటికి 50వేల గ్రామాలకు ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని 2016 డిసెంబరు వరకు పొడిగించారు. మోడీగారు చెప్పినట్లే గడువు తీరి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి లక్ష గ్రామాలకే విస్తరించింది. తన అసమర్ధపాలనలో ఎప్పటికి పూర్తవుతాయో మోడీగారు చెబితే నిజాయితీగా వుండేది. నాలుగున్నర సంవత్సరాలలో లక్షగ్రామాలకు కూడా నెట్ వర్క్ విస్తరించలేదు, ఏర్పాటు చేసింది కూడా ఎంత వేగంతో పని చేస్తుందో తెలియని స్ధితిలో మోడీగారు మనకు డిజిటల్ విప్లవం గురించి చెబుతారు, నాలుగవ పారిశ్రామికవిప్లవంలో భాగస్వాములను చేస్తామంటున్నారు.
డిజిటల్ టెక్నాలజీ ఎంతో ప్రయోజనకారి అన్నది వాస్తవం. అన్న ప్రాసన నాడే ఆవకాయ అన్నట్లుగా, మెట్లు ఎ్క కుండానే మేడ ఎ్కవచ్చు అన్నట్లు అభివృద్ధిలో మిగతాదేశాలు అధిగమించిన దశలను మనం దాటకుండానే ఒక గెంతువేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చని, అభివృద్ధి చెందిన దేశాలలో అందుబాటులోకి వచ్చినవన్నీ మన కోసం కూడా సిద్దంగా వున్నాయని, అసలు ఇప్పటికే మనం ఆ దశలో ప్రవేశించిన విషయాన్ని అనేక మంది గుర్తించటం లేదని కొందరు చెబుతునాారు. వుపాధిని ఫణంగా పెట్టి ప్రవేశపెట్టే యాంత్రీకరణ సామాన్యులకు మేలు చేస్తుందా? ఎలా చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే పెట్టుబడిదారులు లేరు. అమెరికా, ఇతర అనేక దేశాలలో యాంత్రీకరణ ఎంతో ఎక్కువ, దాని వలన కార్పొరేట్లకు లాభాలు పెరిగాయి తప్ప అదనంగా వుత్పత్తి అయిన సంపదలో జనానికి దక్కిన వాటా ఎంత? అక్కడ ఆర్ధిక అసమానతలు భరించరాని విధంగా పెరిగాయని పెట్టుబడిదారీ మేథావి అయిన థామస్ పికెటీ చెప్పిన విషయాన్ని ఎలా మరచిపోగలం.ఇప్పటికే వుపాధిరహిత అభివృద్ధి జరుగుతోంది. పని చేసే జనం తక్కువగా వున్న దేశాలకు ఆటోమేషన్ లేదా రోబోలు అవసరం గావచ్చు. ఏటా కోటీ ఇరవై నుంచి కోటీ 30లక్షల మంది వరకు యువత తమకు వుపాధికావాలని వస్తున్న మన దేశంలో మన పరిశ్రమలలో వాటిని ప్రవేశపెడితే జరిగేదేమిటి? బెంగలూరులోని కెనరా బ్యాంకులో కన్నడం మాట్లాడే ఒక రోబో ఏ కౌంటర్‌కు వెళ్లాలో కస్టమర్లకు చెబుతుందట. సదరు బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు ఏ కౌంటర్ ఎక్కడుందో తెలిపే సూచనలు ప్రదర్శిస్తే సరిపోయేదానికి గొప్పలు చెప్పుకోవటానికి గాకపోతే ఎంతో ఖర్చు పెట్టి రోబోను పెట్టాల్సిన అవసరం ఏముంది? కన్నడేతరులు వస్తే ఏ భాష రోబో దగ్గరకు వెళ్లాలి.
మన దేశంలో ఆటోమేషన్ జరిగితే ఇప్పుడున్న ప్రతి నాలుగు వుద్యోగాలకు ఒకటి పోతుందని ఒక అంచనా. శ్రమశక్తి మీద ఆధారపడిన పరిశ్రమలు,వ్యవసాయం, వృత్తులు మిగతా దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ వున్న మన దేశంలో ఇంకా అంతకంటే ఎక్కువే పోయినా ఆశ్చర్యం లేదు. మూడు సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన ఒక నివేదిక ప్రకారం నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాపితంగా వుపాధిని దెబ్బతీస్తుందన్నది నిరాకరించజాలని అంశమని తేలింది. ఆఫీసు,అడ్మినిస్ట్రేషన్, వుత్పాదకత, తయారీ, నిర్మాణ రంగాల మీద ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. కొన్ని పరిశ్రమలను మూతవేయాలి, అనేకాన్ని అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అధునాత వుత్పాదకయంత్రాలు, పద్దతుల వలన వుత్పత్తి ఇబ్బడి ముబ్బడి అవుతుంది, ఆ మేరకు వుపాధిపెరగదు, అంతకు ముందుకంటే తగ్గినా ఆశ్చర్యం లేదు. అందువలన వుపాధి చర్చను పక్కన పెట్టి ముందుకు పోవాలని పెట్టుబడిదారులు సహజంగానే కోరుకుంటారు.ప్రతి పారిశ్రామిక విప్లవం సమాజంలో అసమానతలను పెంచింది తప్ప సంపదల పంపిణీని సమంగా పంచలేదు. సాంకేతిక ప్రగతి పెరిగిన కొద్దీ కొద్ది మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదల వాటా కూడా పెరిగిపోతోంది.
ఎవరు కాదన్నా అవునన్నా మన దగ్గర వున్న కొనుగోలు శక్తి కలిగిన మధ్యతరగతి మార్కెట్‌ను ఎలా సొమ్ము చేసుకుందామా అని చూడటం తప్ప ప్రయివేటు రంగానికి మరొకటి పట్టదు. అదే చైనాలో మధ్యతరగతి మార్కెట్‌ను పెంచటంతో పాటు దిగువన వున్నవారిని కూడా మధ్యతరగతిగా మార్చే విధంగా సంపదల పంపిణీ జరగటమే దాని విజయానికి మూలం. మన జనానికి స్మార్ట్ ఫోన్ ఇస్తే దానిని ఎంత మంది వినియోగించగలరు అన్నది ప్రశ్నార్ధకంగా వున్న తరుణంలో అంతకు మించిన పరిజ్ఞానంతో ప్రమేయం వుండే నాలుగోపారిశ్రామిక విప్లవం గురించి మాట్లాడుకుంటున్నాం. దేశంలోని గ్రామాలన్నింటినీ విద్యుదీకరించామని నరేంద్రమోడీ ఘనంగా ప్రకటించిన వారం తిరగక ముందే 125కోట్ల మంది జనాభా వున్న భారత్‌లో 15శాతం మందికి(అంటే21కోట్ల మందికి) విద్యుత్ అందుబాటులో లేదని ప్రకటించింది. వారికి సెల్‌ఫోన్లు ఇచ్చినా ఛార్జింగ్ చేసుకోలేరు. ఈ ఏడాది జనవరి నాటికి మన దేశంలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారు నూటికి 26శాతం మందే వున్నారట. ప్రస్తుతం మన దేశానికి ఏటా వచ్చే ఆదాయం ఒక రూపాయి అనుకుందాం. దానిలో వ్యవసాయరంగంలో వున్న 51శాతం కార్మికుల నుంచి 12పైసలు, 22శాతం మంది పని చేస్తున్న పారిశ్రామిక రంగం నుంచి 28, సేవారంగాలలో పని చేస్తున్న 27శాతం మంది నుంచి 60పైసల ఆదాయం వస్తోందని లెక్కలు చెబుతున్నాయి. మన జిడిపిలో 60శాతం సేవారంగం నుంచి వుండటం ఒక అస్ధిరతకు సూచిక. పశ్చిమ దేశాల ఆర్ధిక స్ధితిపై ఆధారపడి ఐటి, పొరుగుసేవల ఆదాయం వుంటుంది. అవి సజావుగా వున్నంత వరకు ఇబ్బంది లేదు, దెబ్బతింటే మనమూ నష్టపోతాం. చైనా విషయానికి వస్తే వ్యవసాయం నుంచి 2017లో 7.9శాతం, పరిశ్రమల నుంచి 40.5, సేవారంగం వాటా 51.6శాతం వుంది. ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా పేరుపొందిన చైనా మాదిరి మనం కూడా పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.కృత్రిమ మేధస్సు అంటే ఆటోమేషన్ యంత్రాలు, రోబోలు రానున్న దశాబ్దంలో 20శాతం వుద్యోగాలను హరించనున్నాయని అంచనా. టాక్సీ డ్రయివర్లు, చేపలు పట్టటం, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలలో అయితే 80-90శాతం వుద్యోగాలు పోతాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆటోమేషన్, రోబోలతో పనులు చేయించేందుకు అవసరమైన అత్యున్నత నైపుణ్యం కలిగిన కొద్ది మందికి డిమాండ్ వుంటుంది.గతంలో దేశం నీకేమిచ్చిందనే కంటే దేశానికి నీవేమిచ్చావనేది దేశభక్తి అని నూరిపోశారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో వుద్యోగాలు హరించే అవకాశాన్ని ముందుగానే తెలిసిన పెట్టుబడిదారీ మేథావులు మనకు వుద్యోగభద్రత కంటే నైపుణ్యం ముఖ్యమని చెబుతున్నారు.
మన నరేంద్రమోడీగారు 2022 నాటికి(చాలా మంది ఈ సంవత్సరం ఎందుకు అని అడుగుతున్నారు అప్పటికి మన స్వాతంత్య్రానికి 75ఏండ్లు నిండుతాయి) రైతాంగ ఆదాయాలు రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్నారు. అదే సంవత్సరానికి మన పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానం వుపయోగించటం గురించి కూడా లక్ష్యాలను నిర్ణయించింది.మనలో చాలా మందిమి కార్లు,బస్సులను గడిగేందుకు మనుషుల బదులు యంత్రాలను వాడటం చూసి వుంటాము. పరిశ్రమల్లో పని చేసే ప్రతి వేల మంది కార్మికులకు ఎన్ని పారిశ్రామిక రోబోలు వున్నాయనే అంశాన్ని రోబో సాంద్రత అని పిలుస్తున్నారు. 2016లెక్కల ప్రకారం ప్రపంచ రోబో సాంద్రత సగటు 74. మన దేశంలో మూడు, అత్యధికంగా దక్షిణ కొరియాలో 631. సింగపూర్ 488,జర్మనీ 309, జపాన్ 303, అమెరికా 198,బ్రిటన్ 71, చైనా 68, బ్రెజిల్ 10, రష్యా 3తో వుంది. మన దేశంలో ఏటా 24శాతం పెంచుకుంటూ పారిశ్రామిక రోబోలను మన పారిశ్రామికవేత్తలు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో మొత్తంగా రోబో సాంద్రత మూడే అయినప్పటికీ ఆటోమొబైల్ రంగంలో అది 58గా వుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు పోటీబడి రాయితీలు ఇచ్చేది రోబోల ఏర్పాటుకు తప్ప కార్మికులకు వుపాధి కల్పించేందుకు కాదు.
ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, రోబోల మీద పని చేసే నిపుణులైన మానవశ్రమ శక్తి తప్ప కండలను కరగించే శారీరక శ్రమ చేసే వారు కాదని పెట్టుబడిదారీ ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ ఎప్పుడో గుర్తించాయి. అలాంటి వారిని తయారు చేయాలంటే ధనిక దేశాలలో ఎంతో ఖర్చు అవుతుంది. కనుక మన వంటి దేశాలలో ఇంజనీరింగ్,మెడికల్ కాలేజీలను ఇబ్బడి ముబ్బడిగా పెట్టాలని సలహాయిచ్చి చౌకగా దొరికే ఇంజనీర్లను తయారు చేయాలని కోరింది. దాని ఫలితమే చెట్టుకొకటి పుట్టకొకటిగా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు. మన విద్యావ్యాపారులు కొన్ని చోట్ల కొందరు నిపుణులను తయారు చేస్తున్నప్పటికీ అత్యధికులకు నైపుణ్యం తప్ప సర్టిఫికెట్‌లు ఇచ్చి జనాన్ని మార్కెట్లోకి తోలుతున్నాయి. వారి ప్రతిభా, ప్రావిణ్యాల గురించి 2017లో యాస్పరింగ్ మైండ్స్ అనే సంస్ధ ఒక సర్వే చేసి నమ్మలేని నిజాలను వెల్లడించింది. విద్యావ్యాపారులు దాన్ని తోసిపుచ్చగా ఐటి కంపెనీల యజమానులు నిర్ధారించారు.తొంభై అయిదు శాతం ఇంజనీరింగు పట్టభద్రులు సాప్ట్‌వేర్ అభివృద్ధి వుద్యోగాలకు పనికి రారన్నది సర్వేసారం. పోనీ అది అతిశయోక్తితో కూడింది అనుకుందాం. పది సంవత్సరాల క్రితం మెకెన్సీ సంస్ధ పాతికశాతం మంది మాత్రమే వుద్యోగాలకు పనికి వస్తారు అన్నది. ఇలాంటి పరిస్ధితికి కారకులు ఎవరు? అన్నింటినీ మాకు వదలి పెట్టండి దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతామో చూడండి అనే ప్రయివేటు రంగం కాదా ! విద్యావ్యాపారంలో లేని పారిశ్రామిక సంస్ధను ఒక్కదానిని చూపమనండి, ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో అదే లాభసాటి వ్యాపారం. ఈరోజు ఇంజనీరింగ్ చదివి వుద్యోగం పేరుతో పనిచేస్తున్న అనేక మందికి చాలా మంది అడ్డామీది రోజువారీ కూలీకి వస్తున్న మొత్తాలకంటే తక్కువే అన్నది చేదు నిజం. గతంలో విదేశీ తెల్లజాతి మెకాలే తమకు అవసరమైన గుమస్తాలను తయారు చేసే విద్యావిధానం, వ్యవస్ధలను ఏర్పాటు చేస్తే నేటి మన నల్లజాతి మెకాలేలు కారుచౌక ఇంజనీరింగ్ గుమస్తాలను సరఫరా చేస్తున్నారు.’ఈ రోజు ఢిల్లీలో 60శాతం మార్కులు తెచ్చుకున్నవారు కూడా బిఏ ఇంగ్లీష్ కోర్సు సీటు తెచ్చుకోలేరుగాని ఇంజనీరింగ్‌కాలేజిలో సులభంగా చేరిపోతున్నారని’ టెక్ మహీంద్రా సిఇఓ సిపి గుర్నానీ వ్యాఖ్యానించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి చెబుతున్న మన రాజకీయవేత్తలు, విధాన నిర్ణేతలకు ఏ నిపుణులు ఎందరు కావాలో, అందుకు అనుసరించాల్సిన ప్రణాళికలేమిటో ఎవరైనా చెప్పగలరా ? ఇంజనీరింగ్,మెడికల్ కాలేజీల్లో సంపూర్ణ అర్హతలు కలిగిన బోధకులు వున్నారా, అవసరమైన ప్రయోగశాలలు వున్నాయా లేదా అని ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీరు దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవంలోకి దేశాన్ని తీసుకుపోతారా? మనం నమ్మేయాలా ?
ఇటీవలి కాలంలో నైపుణ్య అభివృద్ధి గురించి ప్రధాని మోడీ, మాట్లాడని ముఖ్యమంత్రి లేరు. అందుకోసం వందల కోట్లరూపాయలు తగలేస్తున్నారు.నివేదికల్లో అసంఖ్యాకంగా నిపుణులను సృష్టిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్ చర్యల వలన ఇప్పటికే తన ఆదాయం రెట్టింపైందని చత్తీస్‌ఘర్‌కు చెందిన గిరిజన మహిళా రైతు చెప్పిన అంశాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకుంది. తీరా చూస్తే అధికారులు తనను అలా చెప్పమన్నారని ఆమె ఒకటీవి బృందానికి చెప్పింది. ఆ వార్తను ప్రసారం చేసిన సదరు ఎడిటర్, యాంకర్‌ను వుద్యోగాల నుంచి ఇంటికి పంపే విధంగా మోడీ సర్కార్ టీవీ ఛానల్ యాజమాన్యంపై వత్తిడి తెచ్చిన వుదంతం తెలిసిందే. అలాంటి వారందరినీ లెక్కలోకి తీసుకున్నా మన దగ్గర వున్న నిపుణులైన పనివారలెందరో చూస్తే దిమ్మదిరుగుతుంది. మన దగ్గర నిపుణులైన పనివారలే తక్కువ, అవసరమైన వృత్తి శిక్షణ ఇచ్చే సామర్ధ్యం కూడా మన దగ్గర లేదని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం కార్మికుల సంఖ్యతో పోలిస్తే వృత్తిశిక్షణ సామర్ధ్యం చైనాలో 11.5శాతం కాగా అమెరికాలో 6.7, అదే మన దేశంలో 0.8శాతం మాత్రమే. దేశాల వారీగా దక్షిణ కొరియాలో 96, జపాన్‌లో 80, జర్మనీలో 75, బ్రిటన్‌లో 68శాతం మంది వున్నారు. రెండుశాతమే మన దగ్గర అని చెప్పుకోకపోవటమే మంచిది.
ఒక వైపు ప్రధాని నరేంద్రమోడీ పురోగామి మహోపన్యాసాలు మరోవైపు ఆయన అనుయాయులేమో స్త్రీల రుతుస్రావం అపవిత్రమంటూ వీధుల్లో అల్లరి, దాడులు చేస్తుంటారు. పనిలేని వారు ఏదో చేశారన్నట్లుగా కొందరు అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గానూ, సిమ్లాను శ్యామలాగా మార్చేందుకు, మసీదులను పడగొట్టి గుడులు ఎలా కట్టాలా అని, మరి కొందరు అయ్యప్ప గుడికి వచ్చే మహిళా భక్తులు మీద ఎలా దాడులు చెయ్యాలా అని తిరుగులేని తిరోగామి ఆచరణలో మునిగి తేలుతుంటారు. మోడీ, ఆయన అనుయాయులను తయారు చేసిన ఆర్‌ఎస్‌ఎస్ దళం చేస్తున్న వాదనల ప్రకారం రాజారామ్మోహన్ రాయ్ బ్రిటీష్ వారితో చేతులు కలిపి మన పవిత్ర సతీసహగమన ఆచారాన్ని మట్టికలిపారు. వితంతు పునర్వివాహ నిషేధం, బహుభార్యాత్వం, దేవదాసీ వంటి మన హిందూ ఆచారాలు సాంప్రదాయాలను తిరిగి పునరుద్దరించాల్సిందే. అవి లేకుండా పోయిందని చెబుతున్న మన గత గౌరవం, ఘనత తిరిగిరాదు. వాటన్నింటి పునరుద్ధరణ ప్రపంచంలో మరోమారు మన దేశాన్ని వున్నత స్ధానంలో వుంచుతుంది. అందుకుగాను వున్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. మనువు కంటే ముందే మన ఆచారాలు వున్నాయి గనుక వాటిని క్రోడీకరించటం తప్ప కొత్తగా చేసిందేమీ లేని మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టాలి. సాంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ పేరిట సామాజిక మాధ్యమం, వీధుల్లో వేస్తున్న వీరంగాలను చూస్తే అంతపనీ చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే అంతరకు వచ్చినపుడు ఏం చేయాలో, ఏ వైపున వుండాలో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఆలోచించుకోవటం మంచిది. ఇలాంటి వారి నాయకత్వంలో మహా అయితే కుక్కతోకపట్టుకొని గోదావరి కాక పోతే గత నాలుగేండ్లలో మరింతగా మురికి అయిందని వార్తలు వచ్చిన గంగానదిని ఈదగలమేమోగానీ నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రవేశించగలమా ?