ఎం కోటేశ్వరరావు
శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి కొన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై వున్న నిషేధాన్ని కొట్టి వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మీద సామాజిక మాధ్యమాల్లో దాన్ని వ్యతిరేకించేవారు విరుచుకుపడుతున్నారు. ప్రవేశాన్ని కోర్టులో ఆ రాష్ట్ర వామపక్ష, ప్రజాతంత్ర ప్రభుత్వం సమర్ధించినందుకే అసాధారణరీతిలో అక్కడ వరదలు వచ్చాయని, అయప్ప ఆగ్రహించారని ప్రచారం చేసిన ప్రబుద్ధుల గురించి తెలిసిందే. విచారణ సమయంలోనే పిటీషనర్లు, కాని వారి మీద బెదిరింపులు, సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారం కొనసాగించిన వారు తీర్పు తరువాత మరో రూపంలో ఆదాడి కొనసాగిస్తున్నారు. వాటి మంచి చెడ్డలను చూద్దాం.
కమ్యూనిస్టులే ఈ తీర్పు రావటానికి కారణం !
దీనికి ఒక్క నిదర్శనం కూడా లేదు. అయినా కమ్యూనిస్టు వ్యతిరేకుల వుద్దేశ్యం, లక్ష్యం, ప్రచారం ఏమైనప్పటికీ ఇలాంటి తీర్పు వచ్చినందుకు కమ్యూనిస్టులు గర్వపడతారు, సంతోషిస్తారు,స్వాగతిస్తారు. నిజానికి ఈ కేసుతో కమ్యూనిస్టులకు ఎలాంటి సంబంధం లేదు.అయ్యప్ప భక్తుడైన తమిళ సినిమా దర్శకుడు కె.శంకర్ నిర్మించిన సినిమా చిత్రీకరణ తాజా వివాదానికి నాంది. ‘ నంబినార్ కెడువత్తిల్లై ‘సినిమా షూటింగ్ 1986 మార్చి 8-13 తేదీలలో అయ్యప్ప దేవాలయం వద్ద జరిగింది. పవిత్రంగా భావించే గుడి పద్దెనిమిది మెట్ల ముందు వయస్సులో వున్న ఐదుగురు యువతులు జయశ్రీ, సుధాచంద్రన్,అను, వాదివక్కురసి, మనోరమ నృత్యం చేసి అపవిత్రం చేసినందున వారి మీద, దర్శకుడు శంకర్,దేవస్ధానం బోర్డు అధ్యక్షుడు ఎన్. భాస్కరన్ నాయర్, సభ్యులు సరస్వతి కుంజి కృష్ణన్, హరిహర అయ్యర్‌లను నిందితులుగా చేస్తూ చర్య తీసుకోవాలంటూ వి.రాజేంద్రన్ అనే పౌరుడు రన్నీ కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఐదుగురు డాన్సర్లలో మనోరమకు 50 ఏండ్లు పైబడిన కారణంగా ఆమెను మినహాయించి మిగిలిన వారికి వెయ్యి రూపాయల చొప్పున , చిత్రీకరణకు అనుమతి ఇచ్చినందుకు బోర్డు సభ్యులకు ఏడున్నరవేల రూపాయల జరిమానా విధించారు. తరువాత దేవస్ధానం అధికారి కూతురు నిబంధనలను అతిక్రమించి దేవాలయానికి వచ్చిందంటూ మరొక పౌరుడు హైకోర్టుకు ఫిర్యాదు చేయటంతో నిబంధనలను పక్కాగా పాటించాలని 1991లో కోర్టు ఆదేశించింది.కొంత కాలం క్రితం దేవాలయంలోకి మహిళ ప్రవేశించిన ఆనవాళ్లు వున్నాయని 2006లో ఒక జ్యోతిష్కుడు ప్రకటించాడు. ఆ వెంటనే కన్నడ నటి జయమాల తాను 28 సంవత్సరాల వయస్సులో 1987లో ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా దేవాలయంలో ప్రవేశించి దేవుడిని తాకానని, ఇదంతా పూజారి అనుమతితోనే చేసినట్లు బహిరంగంగా ప్రకటించింది. అదే ఏడాది ఈ ఆరోపణ గురించి విచారణ జరిపించాలని కేరళ సర్కార్ పోలీసులను ఆదేశించింది, తరువాత కేసును వుపసంహరించుకుంది. తరువాత ఇండియా యంగ్ లాయర్స్ అసోసియేషన్ మహిళా లాయర్లు మహిళలకు ప్రవేశ నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఒక ప్రజాప్రయోజన పిటీషన్ దాఖలు చేశారు. దానికి మద్దతు తెలుపుతూ 2007 విఎస్ అచ్యుతానందన్ నాయకత్వంలోని నాటి వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన సర్కార్ కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. రాజ్యాంగహక్కులకు విరుద్దంగా వున్న ఆటంకాలు రద్దు చేయబడతాయని 2008లో ఆ పిటీషన్ల విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తరువాత 2011లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ సర్కార్ అంతకు ముందు ఎల్డిఎఫ్ సర్కార్ తీసుకున్న దానికి విరుద్దమైన వైఖరిని తీసుకొని మహిళలపై ఆంక్షలకు మద్దతు తెలిపింది.తరువాత ఈకేసులు ఇతరులు ప్రతివాదులుగా చేరారు.తాము కేసును వుపసంహరించుకుంటామని పిటీషనర్లు కొందరు కోర్టుకు విన్నవించారు. అయితే ప్రజాప్రయోజవ్యాజ్యాన్ని ఒకసారి విచారణకు తీసుకున్న తరువాత దాన్ని వుపసంహరించుకొనే అవకాశం లేదని కోర్టు తిరస్కరించింది. ఐదు సంవత్సరాల తరువాత తిరిగి అధికారానికి వచ్చిన ఎల్డిఎఫ్ ఆంక్షలకు తాము వ్యతిరేకం అంటూ కోర్టుకు మరొక అఫిడవిట్‌ను సమర్పించింది.కేసు విచారణ పూర్తి చేసిన సుప్రీం కోర్టు మహిళలపై నిషేధాన్ని కొట్టివేసింది.
మసీదుల్లో మహిళల ప్రవేశాన్ని కమ్యూనిస్టులు అమలు చేస్తారా, డిమాండ్ చేస్తారా ?
పిటీషన్ దాఖలు చేసిన మహిళ అయ్యప్ప భక్తురాలా- కాదు,
పిటీషన్ దాఖలు చేసింది అయ్యప్ప భక్తులైన హిందువా- కాదు,
ఇండియాలో కేవలం హిందువుల పట్లనే ఇలా జరుగుతోందా- అవును
ఇవన్నీ జనాన్ని మత ప్రాతిపదికన రెచ్చగొట్టేందుకు మీడియాలో, సామాజిక మీడియాలో మహిళా వ్యతిరేకులు ముందుకు తెచ్చిన వాదనలు. ఈ ప్రశ్న వేసే వారు మహిళలు అయ్యప్ప దేవాలయ ప్రవేశాన్ని వ్యతిరేకించే శక్తులు తప్ప అనుకూలమైన వారు కాదు. కనుక నైతికంగా వారికి ఆ ప్రశ్న అడిగే హక్కులేదు.పిటీషన్ దాఖలు చేసిన వారి చూస్తే వారిలో హిందువులే ఎక్కువ మంది వున్నారు. అసలు అది ఒక సమస్య కానే కాదు. లౌకిక దేశంలో ఎవరు ఏ వివక్షను అయినా ప్రశ్నించవచ్చు. దాన్ని నిర్ణయించాల్సింది కోర్టులు తప్ప మతాలు కాదు. అన్ని రకాల వివక్షలకు కమ్యూనిస్టులు కాని అభ్యుదయవాదులు కూడా వ్యతిరేకమే. మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లో దేవాలయంలో మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా వుద్యమం నడిపిన తృప్తి దేశాయ్ కమ్యూనిస్టు కాదు. దేవాలయాల్లో షెడ్యూలు కులాలు, తెగలవారికి ప్రవేశ నిషేధానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర వుద్యమ కాలంలో వుద్యమించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. హిందూమతానికి మాయని మచ్చగా తయారైన సతీసహగమనాన్ని వ్యతిరేకించిన రాజా రామ్మోహన్ రాయ్, వితంతు వివాహాలను ప్రోత్సహించిన నవయుగ వైతాళికుడు వీరేశలింగం పంతులు కమ్యూనిస్టులు కాదు. ఇలా పెద్ద జాబితానే చెప్పుకోవచ్చు.
ఒక్క మసీదే కాదు, ఏ మతం లేదా వాటి ప్రార్ధనా మందిరాల్లో జరిగే కార్యక్రమాలకు జనాన్ని వెళ్లమని కమ్యూనిస్టులు తమ సభ్యులు, అనుయాయులు లేదా సాధారణ ప్రజానీకానికి కూడా చెప్పరు. అంతే కాదు వారుగా పూనుకొని అన్ని రకాల మతాల జనాన్ని సమీకరించి ఆయా మత ప్రార్ధనా కేంద్రాలలో పూజలు చేయించే కార్యక్రమాన్ని పెట్టుకోరు. అటువంటి కార్యక్రమం వారి అజెండాలో లేదు.మసీదుల్లోకి తమను అనుమతించాలని ఎవరైనా మహిళలు ముందుకు వచ్చి డిమాండ్ చేస్తే దాన్ని కమ్యూనిస్టులు బలపరుస్తారు. లేదా కోర్టులలో కేసులు దాఖలైతే కోర్టులు కోరితే కమ్యూనిస్టులు తమ అభిప్రాయాన్ని తెలియచేస్తారు.ఇటీవలి కాలంలో ఎక్కడైనా షెడ్యూలు కులాలు, తెగలవారిని వివక్షతో దురహంకారులు దేవాలయాల్లో ప్రవేశించేందుకు నిరాకరిస్తే, తమకు మద్దతు కావాలని బాధితులు అడిగితే అనేక చోట్ల కమ్యూనిస్టులే ఆందోళనకు ముందుండి నడిపించుతున్నారు.లేదా కులవివక్ష వ్యతిరేక సంఘాల వారు కార్యక్రమాలు తీసుకుంటే వాటిని బలపరుస్తున్నారు. ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుంటే, వివక్ష చూపుతుంటే దాన్ని ప్రశ్నించటానికి అర్హతలు అవసరం లేదు.
హిందూ మతానికి ముప్పు తెస్తున్నారు, ఇతర మతాల వారిని వదలివేస్తున్నారు !
ఇది రెచ్చగొట్టే, తప్పుదారి పట్టించే వాదన. ఏదైనా ఒక మతానికి కీలకమైన అంశం ఏమిటి? దానికి కాస్త అటూ ఇటూగా ఏదైనా అయితే ఆ మత మౌలిక స్వభావమే మారిపోతుందా? అయ్యప్ప బ్రహ్మచారి, హనుమంతుడు కూడా బ్రహ్మచారే, ఆయనకు కూడా దేవాలయాలు వున్నాయి. అయ్యప్ప గుడుల్లో వయస్సులో వున్న మహిళకు వున్న నిషేధం, హనుమంతుడి గుడుల్లో లేదే ! 1972 శేషమ్మాల్-తమిళనాడు కేసులో కోర్టు ఒక స్పష్టత నిచ్చింది. ఒక మతానికి కీలకమైన అంశం అని దేనినైతే భావిస్తున్నారో దానిని తొలగిస్తే లేదా ఆచరణను నిలిపివేస్తే సదరు మత మౌలిక స్వభావమే మారిపోతే, విశ్వాసమే దెబ్బతింటే దానిని కీలకమైన అంశంగా భావించి దానికి మార్పులు చేర్పులు చేయరాదు, దానిని రాజ్యాంగం రక్షిస్తుంది అన్నది దాని సారాంశం. కొన్ని అంశాలు అటు వంటి మౌలిక స్వభావం కలిగినవి కాదంటూ కోర్టు గతంలో అభిప్రాయపడింది, సమర్ధించింది. ఎవరైనా వాటితో ఏకీభవించకపోతే తమ వాదనలను వినిపించుకోవచ్చు తప్ప నేను అంగీకరించను అంటే కుదరదు. బక్రీదు సందర్భంగా జంతుబలి ఇస్లాం మతంలో కీలకమైన అంశం అన్న వాదనను సుప్రీం కోర్టు 1995లో తిరస్కరించింది.అందుకు ఇస్లాం మత గ్రంధాలను వుదహరించింది. బాబరు చక్రవర్తి గోవధ నిషేధాన్ని అమలు చేస్తే తనయుడు హుమాయున్ కూడా తరువాత దాన్ని కొనసాగించాడని కోర్టు పేర్కొన్నది. తమ విశ్వాసాలు, ప్రబోధల ప్రకారం మారణాయుధాలు, కపాలాలు, బతికి వున్న పాములతో బహిరంగంగా నృత్యాలు చేయటం తమ హక్కని ఆనంద మార్గీయులు చేసిన వాదనను సుప్రీం కోర్టు 1983లో అంగీకరించలేదు.తాజాగా మూడుసార్లు తలాక్ చెప్పటం ఇస్లాం మతంలో కీలకమైన అంశమేమీ కాదంటూ దాని ఆచరణను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.ముంబైలోని హాజీ అలీ దర్గా కేసులో మహిళలకు దర్గాలో ప్రవేశం కల్పించాలని ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చింది.
1993లో కేరళ హైకోర్టు బెంచ్ తన తీర్పులో నిషేధాన్ని సమర్ధించింది. అయితే అయ్యప్పస్వామి దేవస్ధానం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో 10-50 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు అన్న ప్రాసనల సందర్భంగా అంతకు ముందు పలుసార్లు దేవాలయ ప్రవేశం చేసినట్లు స్వయంగా అంగీకరించింది.ఆ విషయాన్ని హైకోర్టు తన తీర్పులో కూడా నమోదు చేసింది.అటువంటి కార్యక్రమాలకు వసూలు చేసే రుసుములకు దేవస్ధానం రసీదులు కూడా ఇచ్చింది. ప్రతి మళయాల నెలలో మొదటి ఐదు రోజులు అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం లేదని,41రోజుల దీక్షలను పాటించటం సాధ్యం కాదని కూడా దేవస్ధానం బోర్డు తన అఫిడవిట్లో పేర్కొన్నది. మండలం, విషు,మకరావిలక్కు సందర్భాలలో మాత్రమే మహిళలకు నిషేధం వున్నట్లు హైకోర్టు గమనించింది.గతంలో తిరువాన్కూరు రాజు తన రాణి, దివానుతో కలసి దేవాలయాన్ని సందర్శించినట్లు, దేవస్ధానం మాజీ కమిషనర్ తన మనవరాలి అన్నప్రాసన సందర్భంగా దేవాలయ ప్ర వేశం చేసినట్లు అంగీకరించారు. అంతే కాదు అయ్యప్ప సేవాసంఘం కూడా 1993కేసులో ఇచ్చిన సాక్ష్యంలో అంతకు ముందు పది పదిహేను సంవత్సరాలలో కొందరు మహిళలు దేవాలయ ప్రవేశం చేసినట్లు అంగీకరిచింది. తాజాగా సుప్రీం కోర్టు ఈ అంశాలనే పరిగణనలోకి తీసుకుంది. ప్రతి మళయాల నెల తొలి ఐదు రోజులు మహిళలను అనుమతించినపుడు అయ్యప్ప బ్రహ్మచారితనం ఏమైనట్లు, విగ్రహం అంతర్ధానమైందా అని జస్టిస్ నారిమన్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తీర్పులో ఇలా వ్యాఖ్యానించారు. ‘ప్రార్ధనల కోసం శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించటం ద్వారా ఏ విధంగానూ హిందూ మతస్వభావంలో మౌలిక మార్పు జరిగినట్లు మార్చినట్లు వూహించలేము.అది శబరిమల ముఖ్య విశ్వాసం కాదు’ అని పేర్కొన్నారు.
హిందూ-ముస్లిం దొందూ దొందే !
మహిళల విషయాల్లో హిందూ, ముస్లిం మతాలు దొందూ దొందే. బహిష్టు అ య్యే వయస్సులోని మహిళలు అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించకూడదని హిందూమతం వారు చెబుతుంటే, హాజీ ఆలీ దర్గా కేసులో కూడా ముస్లిం మత పెద్దలు అదే వాదన చేశారు. ఒక చోట అయ్యప్ప బ్రహ్మచారి అని కారణం చెబితే మరో చోట పురుష దేవదూత సమాధి దగ్గరకు మహిళలు రాకూడదని దర్గాలో అభ్యంతరం చెప్పారు.
అయ్యప్ప జన్మగురించి న్యాయమూర్తి చెప్పిందేమిటి?
తీర్పును ఇచ్చిన వారిలో ఒకరైన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్న అంశాలు గమనించాల్సినవి. దేశంలో అనేక అయ్యప్ప దేవాలయాలు వున్నప్పటికీ శబరిమల దేవాలయంలోని అయ్యప్పను నైష్టిక బ్రహ్మచారిగా పేర్కొంటున్నారు.లైంగిక కార్యకలాపాలకు దూరంగా వున్న కారణంగా ఆయనకు శక్తులు వచ్చినట్లు, ఆయన శివుడికి మోహినీ రూపంలో వున్న విష్ణువుకు జన్మించినట్లు చెబుతారు. మరొక కధ ప్రకారం పండలం రాజు రాజశేఖర వేటకు వెళ్లినపుడు పంబానది తీరంలో కనిపించిన బాలుడిని తీసుకు వస్తాడు. తరువాత రాజుకు మగపిల్లవాడు పుడతాడు. అధికారాన్ని గుంజుకోవాలని చూసిన మంత్రి రాణిని రోగం వచ్చినట్లు నటించమని చెప్పి అందుకు పులిపాలు కావాలంటాడు. వాటికోసం అయ్యప్పను అడవులకు పంపుతారు. అయ్యప్ప ఏకంగా పులులనే వెంటపెట్టుకు వచ్చి తన మహిమలు చూపి తరువాత అంతర్ధానమౌతాడు. ఆయన స్మారకంగా తరువాత గుడిని నిర్మించారని న్యాయమూర్తి వుటంకించారు.
తీర్పు గురించి ఎవరు ఎలా స్పందించారు?
తక్షణమే తీర్పును అమలు చేయాలని ముఖ్య మంత్రి పినరయ్ విజయన్ దేవస్ధానం అధికారులను ఆదేశించారు.నలభైశాతం భక్తులు పెరిగే అవకాశం వున్నందున అదనపు వసతుల కల్పనకు వంద ఎకరాలు కావాలని అడగ్గా నీలక్కల్ వద్ద కేటాయించేట్లు చూస్తామని సిఎం చెప్పినట్లు అధికారులు ప్రకటించారు. అయితే తీర్పును సమీక్షించాలని కోరేందుకు దేవస్ధానం బోర్డు ఆలోచిస్తున్నది. తీర్పును కొట్టి వేస్తూ ఒక నిర్ణయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు పండలం మాజీ రాజ కుటుంబం ఆలోచిస్తున్నది. తీర్పును వ్యతిరేకిస్తూ సోమవారం నాడు కొన్ని సంస్ధలు హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి.వాటిలో ఒకటైన శివసేన వరద సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగే అవకాశం వున్నందును పిలుపును వెనక్కు తీసుకున్నట్లు ప్ర కటించింది.
దేవస్ధాన ప్రధాన పూజారి, రాజకుటుంబ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, సమీక్షకోసం పిటీషన్ వేస్తామని, అయితే తీర్పు అమలుకు తగిన చర్య తీసుకుంటామని దేవస్ధానం బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్ చెప్పారు. తాము అధికారంలో వుండగా మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ తీర్పును అంగీకరించతప్పదని ప్రకటించింది. సిపిఎం స్వాగతం పలికింది. బిజెపి మాత్రం పూజారులు, రాజకుటుంబం, హిందూ మతమనోభావాలను గమనంలోకి తీసుకొని ఏకాభిప్రాయాన్ని సాధించాలని సన్నాయి నొక్కులు నొక్కింది.
కేసు పిటీషన్ దాఖలు చేసింది ముస్లిమా ?
శబరిమల కేసులో పిటీషన్‌దారు ఎవరో తెలుసా? నౌషద్ అహమ్మద్ ఖాన్. వారి తల్లులు జీవితమంతా భయంతో గడిపితే వారి భర్తలు మాత్రం 1.మరో ముగ్గురు భార్యలను తెచ్చుకుంటారు, 2.వారికి ఎస్ఎంఎస్ ద్వారా విడాకులు ఇవ్వవచ్చు, 3.హలాలా అత్యాచారానికి వారిని బలవంతం చేయవచ్చు, ఇతరుల ఇండ్లలో దారిద్య్రం గురించి అడుక్కొనే వారు ఆందోళన చెందుతునా నంటూ ఒక పోస్టును సామాజిక మాధ్యమంలో మతోన్మాదశక్తులు తిప్పుతున్నాయి.
మొదటి విషయం : నౌషద్ అహమ్మద్ ఖాన్ అసలు పిటిషన్ దారు కాదని, అతనికి బెదిరింపులు వస్తున్న దృష్టా రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా 2016 జనవరి 18న ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ముస్లిం విశ్వాసి అయిన ఖాన్ హిందూ వ్యవహారాలలో జోక్యం కల్పించుకుంటున్నాడని ఆరోపిస్తూ ఒక వీడియో సామాజిక మాధ్యమంలో తిప్పుతున్న విషయం గురించి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాన్ని తాము అదుపుచేయలేమని, అలాంటి వుద్ధేశ్యం కూడా లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్‌కు ఖాన్ అధ్యక్షుడిగా వున్నారు. ఆ సంస్ధ కూడా పిటీషన్‌దార్లలో ఒకటి, దాని తరఫున దాని ప్రధాన కార్య దర్శి భక్తి పాసిరిజా అనే మహిళా న్యాయవాది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతావారిలో ప్రేరణ కుమారి, సుధాపాల్, లక్ష్మీశాస్త్రితో ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ ఇంటర్వూ చేసింది. తమకు హిందూ ఆచారాలు పూర్తిగా తెలియకుండానే పిటీషన్‌పై సంతకాలు చేసినట్లు చెప్పారని అది వార్త ప్రచురించింది. తనకు బెదిరింపులు వస్తున్న దృష్ట్యా కేసును వుపసంహరించుకొనేందుకు అనుమతివ్వాలని నౌషద్ ఖాన్ సుప్రీం కోర్టును కోరాడు. అయితే అప్పటికే ఇతరులు ఆ కేసులో తోడయ్యారు. ఒకసారి ప్రజావ్యాజ్య పిటీషన్‌ను కోర్టు ఆమోదించిన తరువాత దానిని వుపసంహరించుకొనే హక్కు పిటీషనర్లకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందువలన విధిలేక వారు కేసును కొనసాగించాల్సి వచ్చింది.
సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకంచే శక్తులు బంద్‌కు పిలుపు ఇవ్వటం అంటే కోర్టులను, న్యాయవ్యవస్ధనే ప్రభావితం చేసే చర్యతప్ప వేరు కాదు. ఒక వివాదం కోర్టుకు వెళ్లిన తరువాత వచ్చే తీర్పు తమకు నచ్చినా, నచ్చకపోయినా అంగీకరించటం తప్ప మరొకదారి లేదు. షాబానో మనోవర్తి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తమ మతంలో జోక్యం చేసుకోవటంగా ఆరోపిస్తూ కొన్ని ముస్లిం సంస్ధలు ఆందోళనలు నిర్వహించాయి. తమ ఓటు బ్యాంకు ఎక్కడ గండి పడుతుందో అని భయపడిన కాంగ్రెస్ పార్టీ ఆ తీర్పును వమ్ము చేస్తూ పార్లమెంటులో ఏకంగా ఒక చట్టాన్నే తీసుకు వచ్చింది. ఆ చట్టాన్ని వ్యతిరేకించిన వారిలో వామపక్షాలతో పాటు బిజెపి కూడా వుంది. ముస్లింలను సంతుష్టీకరించే చర్యగా బిజెపి అభివర్ణించింది. ఇప్పుడు శబరిమల ఆలయ తీర్పును కూడా వమ్ము చేస్తూ పార్లమెంట్ ఒక చట్టం తీసుకురావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మెజారిటీ ఓటు బ్యాంకుపై కన్నేసిన బిజెపి పార్లమెంటులో తనకున్న మెజారిటీని ఆసరా చేసుకొని గతంలో కాంగ్రెస్ మాదిరే కొత్త చట్టాన్ని తీసుకు వస్తుందా, దాని చెప్పుల్లోనే కాళ్లు దూరుస్తుందా? ఓట్లకోసం మఠాలు, స్వామీజీల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న కాంగ్రెస్ కూడా అందుకు సై అంటుందా?