ఎం కోటేశ్వరరావు
‘మన పూర్వీకులు గాడిద మూత్రంతో విమానాలను నడిపారు. రుగ్వేదంలోనే కాంతి సంవత్సర వేగం గురించి చెప్పారు. ఇలాంటి విషయాలు అన్నింటికీ రుజువులున్నట్లు మేము చెప్పటం లేదు. అవి నిజమో కాదో పరిశోధించి చెప్పండి ‘ అంటున్నారు ఘనత వహించిన మన భారతీయ విద్యాభవన్ మేథావులు. మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనుకొనే చిత్తశుద్ది కల వారెవరూ ఇలాంటి బాధ్యతా రహిత సలహాలనిచ్చి మన యువత విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేయరు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఇలాంటి పుస్తకాలను ఇంజనీరింగ్ సిలబస్‌లో చేర్చేందుకు అంగీకారం తెలిపిన ఏఐసిటిఇ(ఆలిండియా సాంకేతిక విద్యా మండలి) పెద్దలు, కావాలంటే పుస్తక అంశాలపై సమీక్ష జరపవచ్చు అంటున్నారు. బహుశా ఇలాంటి ప్రబుద్ధులను చూసే యుద్ధం, మరొకటో లేకుండా ఒక దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఆ దేశ విద్యావిధానాన్ని చెడగొడితే చాలు అనే ఒక నానుడి సామాజిక మాధ్యమాల్లో తిరగటాన్ని చాలా మంది చూసే వుంటారు. దాన్ని ముందుగా ఎవరు చెప్పారోగానీ ఎంతో అనుభవం వుండి వుండాలి.
కొత్త ప్రాంతాలు, దేశాలను కనుగొనమని ఇతర ఖండాలలో ఔత్సాహికులను ప్రోత్సహించి కొత్త ప్రపంచానికి ఒకవైపు బాటలు వేసిన సమయంలో మన దేశంలో జరిగిందేమిటి? దేశం వదలి సముద్రయానం చేసి పరాయి దేశాలకు పోయే వారు మ్లేచ్చుల సంపర్కంతో మైలపడిపోతారు, త్రికాల సంధ్యావందనాలు, పూజలు, పునస్కారాలు చేయటానికి అవకాశం వుండదంటూ విధించిన నిషేధాలు మనలను బావిలోని కప్పలుగా మార్చాయి. మినహాయింపులు, ప్రాయచిత్తాల పేరుతో పరిహాస ప్రాయమైన శుద్ధి చేసుకుంటున్నారు తప్ప ఇప్పటికీ ఆ నిషేధాలను ఎత్తివేయలేదు. గతంలో వాటిని వుల్లంఘించిన వారికి శిక్షలు వేశారు. వీటికి తోడు కులాల వారీ పని విభజన, దీని వలన జరిగిందేమిటి? పారిశ్రామిక విప్లవం, దాని ఫలితాలకు మనం దూరమయ్యాయం. వర్తమానంలోకి వస్తే విద్య ప్రయివేటీకరణ పర్యవసానాలు ఎలాంటి విద్యావంతులను తయారు చేస్తున్నాయో చూస్తున్నాం. డిగ్రీలు చేతికి ఇవ్వటం తప్ప అవి కలిగిన వారి ప్రావీణ్యత ఎంత నాసిరకంగా వుందో తెలియంది కాదు. మన దేశాన్ని నాశనం చేసేందుకు విద్య ప్రయివేటీకరణ తన పని తాను చేస్తోంది.
రెండో అంశాన్ని చూద్దాం. మొగలాయీలు, బ్రిటీష్ వారు రాకముందే మన దేశంలో విదేశీ, సముద్ర యానాన్ని నిషేధించిన మనువాద ఛాందస శక్తుల వారసులు ఇప్పుడు మన విద్యారంగాన్ని దెబ్బతీసేందుకు రెండోవైపు నుంచి దాడిని మొదలు పెట్టారు. కాంతి వేగం, గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం గురించి రుగ్వేదంలోనే ఎంతో స్పష్టంగా చెప్పారంటూ రాసిన పుస్తకాలను మన ఇంజనీరింగ్ విద్యార్ధుల పాఠ్యాంశంగా పెట్టేందుకు నిర్ణయించారు. ఆలిండియా సాంకేతిక విద్యామండలి(ఏఐసిటిఇ), ఈ సంస్ధే దేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులిచ్చి డిగ్రీ ముద్రణా కేంద్రాలు తామరతంపరగా పెరిగేందుకు దోహదం చేసింది. ఇప్పుడు పురాతన జ్ఞాన వ్యవస్ధల అధ్యయనం పేరుతో వేదాల్లోనే అన్నీ వున్నాయష అనే భావజాలాన్ని రుద్దేందుకు పూనుకుంది. భారతీయ విద్యాసార్ అనే పేరుతో భారతీయ విద్యా భవన్ ప్రచురించిన ఒక పుస్తకాన్ని ఇంజనీరింగ్ విద్యార్ధులతో అధ్యయనం చేయించేందుకు నడుం కట్టింది. దీన్ని అడ్డుకోవాలని ముంబైకి చెందిన కొందరు శ్స్తావేత్తలు, విద్యావంతులు నడుం కట్టారు.
సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్న తిరోగామి శక్తులు గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ అధికార వ్యవస్ధలోకి చొచ్చుకువచ్చాయి.గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రయత్నాలు వూపందుకున్నాయి. అనేక అశాస్త్రీయ అంశాలను ముందుకు తెస్తున్నారు.మన దేశ సైన్సు, తత్వశాస్త్రాల చరిత్రను విద్యార్ధులకు తెలియచేయటంలో తప్పు లేదు. గతం, చరిత్ర లేకుండా భవిష్యత్ వుండదు.ఈ పుస్తకంలోని అంశాల గురించి శాస్త్రవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అంశాలేమిటి? రుషి అగస్త్యుడు ఎలక్ట్రోవాల్టయిక్ సెల్‌ను కనుగొన్నాడు. నీటి నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్‌లను వుత్పత్తి చేసే ఎలక్ట్రోలసిస్ పద్దతిని అగస్త్యుడు వివరించాడు. రుషి కణాదుడు తన వైశేషిక సూత్రాలలో న్యూటన్, ఇతర పలు గతి సూత్రాల గురించి చర్చించాడు. రుషి భరద్వాజుడు వేల సంవత్సరాల క్రితమే వైమానిక శాస్త్రం గురించి పుస్తకం రాశాడు. విమానాల నిర్మాణం గురించేగాక నడపటం, ఇంధనాలు, పైలట్లను సన్నద్ధం చేయటం గురించి కూడా పేర్కొన్నాడు.కాంతి వేగం, గురుత్వాకర్షణ శక్తి సూత్రం గురించి ఎంతో స్పష్టంగా రుగ్వేదంలోనే రాశారు వంటి అంశాలతో ఆ పుస్తకాన్ని నింపారు. ఏఐసిటియి కూడా విద్యార్ధుల భవిష్యత్‌ను తీవ్రంగా నష్ట పరుస్తోందని, పేరు ప్రతిష్టలున్న ఏ విశ్వవిద్యాలయం కూడా ఇటువంటి పుస్తకాలను విద్యార్దుల అధ్యయనానికి ఎంపిక చేయదని ముంబై విద్యావేత్తలు తమ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. దాని మీద ప్రస్తుతం వారు సంతకాలు సేకరిస్తున్నారు. ముంబైలోని హోమీబాబా సైన్సు విద్యాకేంద్రంలో పనిచేస్తున్న అనికేత్ సూలే ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ ఇది శాస్త్రవేత్తల సమూహానికి అపకారం చేస్తుంది , ఏఐసిటియి డైరెక్టర్ అనిల్ సహస్రబుద్ది ఒక అకడమిషియన్ మా అభ్యంతరాన్ని ఆయన గ్రహించగలరనుకుంటున్నాను, తరువాత మండలితో చర్చలు జరుపుతాము అన్నారు.
తమ పుస్తకంపై ఆన్‌లైన్ పిటీషన్‌తో విమర్శలు రావటంతో భారతీయ విద్యాభవన్ సమర్ధనకు పూనుకుంది. దానిలోని అంశాలన్నీ శాస్త్రీయంగా రుజువైనవని తాము చెప్పటం లేదని, విద్యార్ధులు పరిశోధన చేసి వాటిని రుజువు చేసేందుకు లేదా కాదని నిరూపించేందుకు సమర్ధులుగా వుండేందుకు వుద్ధేశించినవని పేర్కొన్నది. ఏఐసిటియు చైర్మన్ అనిల్ సహస్రబుద్ధి కూడా అదే పద్దతిలో స్పందించారు. వాస్తవాన్ని కనుగొనేందుకు ప్రపంచమంతటా జనాలు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి పరిశోధనలు చేయకుండా పిడివాదంతో ఎవరైనా దేన్నయినా ఎలా తిరస్కరిస్తారు, కనీసం ప్రయత్నం కూడా చేయకుండా తిరస్కరించటం శాస్త్రీయ పద్దతా అని ఎదురుదాడికి దిగారు. పుస్తకంలోని అంశాలన్నీ శాస్త్రీయంగా రుజువైనవి కానప్పటికీ మన పురాతన గ్రంధాలలో వున్న జ్ఞానాన్ని వెలికితీసే ఎంపిక , పరిశోధనలు చేసే అవకాశాన్ని విద్యార్ధులకు ఇవ్వాలని, పుస్తకాంశాలను ఏఐసిటియు కమిటీ సమీక్షించిందని భారతీయ విద్యాభవన్ ఇండాలజీ ప్రొఫెసర్ శశిబాల చెప్పారు.
కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో తిరోగామిశక్తులు పాలకులుగా వుండటంతో రాజుగారి మనసెరిగి మసలు కోవటం వుత్తమం అనే వెన్నెముకలేని ఒక తరగతి మేథావులు వారికి వంతపాడేందుకు సిద్దమయ్యారన్నది ఈ వుదంతం వెల్లడిస్తోంది. ఈ ధోరణి సైన్సు మీద దాడి తప్ప మరొకటి కాదు. అందుకు కొందరు మేథావులు పావులుగా మారటమే విచారకరం, గర్హనీయం. ప్రతి ఆధునిక అవిష్కరణ పురాతన హిందూ గ్రంధాలలో, వేదాలలో వున్నదే అనే ఒక వున్మాదపూరితమైన ధోరణిని పెంచి పోషించారు.దానికి అధికారిక ముద్రవేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది.ఐఐటిలు, నిట్‌లలో మినహా మూడువేల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్దులకు భారతీయ విద్యాభవన్ పుస్తకాలను అందచేస్తారు. బ్రిటీష్ వారు మనల్ని వందల సంవత్సరాలు పరిపాలించిన సమయంలో వారు కోరుకున్న విధంగా బ్రిటీష్ వారు నూతన ఆవిష్కరణలు ఎలా చేశారో మనకు బోధించారు, ఇప్పుడు మనం దాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని పుస్తకరచనలో భాగస్వామిగా వున్న ఒక ప్రొఫెసర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మన పురాతన జ్ఞాన వెలుగులో మన దేశాన్ని మరొకసారి అగ్రదేశంగా ముందుకు తీసుకుపోవాలని, గత రెండువేల సంవత్సరాలుగా ఆపని జరగలేదని వేదాల్లోనే అన్నీ వుషాయష అనే తరగతి చెబుతోంది.దానికి వంతపాడే పాలకులు దొరకటంతో హిందూత్వను జోడించి రెచ్చిపోతున్నారు. ఒక మాజీపైలట్, ఒక టీచరు కలసి మూడు సంవత్సరాలక్రితం ముంబై సైన్సు కాంగ్రెస్‌లో మన పూర్వీకులు విమానాలు కలిగి వున్నారని, వాటిని గాడిద మూత్రంతో నడిపినట్లు పురాతన పుస్తకాల్లో వుందని ఒక పత్రాన్ని సమర్పించారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ దానికి వంతపాడారు.
ఇప్పటికే పిచ్చి ముదిరి ఆవు మూత్రంపై పరిశోధనలు చేయిస్తున్నవారు రాబోయే రోజుల్లో భారతీయ విద్యాభవన్, ఏఐసిటియు చెబుతున్నదాని ప్రకారం గాడిదలను కూడా సమీకరించి వాటి మూత్రంతో మన ఇంజనీరింగ్ విద్యార్ధులు ప్రయోగాలు చేసి వాటి ద్వారా విద్యుత్ తయారు చేయవచ్చో లేదా నిరూపించాలన్నమాట. సర్వం తెలిసిన సంస్కృత పండితులుండగా వేరే వారు పరిశోధనలు చేయటం ఏమిటి? పిచ్చి ముదిరితే రోకలి తలకు చుట్టమనటం అంటే ఇదే. మన సంస్కృత గ్రంధాలలోని విజ్ఞానాన్నంతటినీ జర్మన్లు గ్రహించారని చెప్పే బాపతు మనకు కనిపిస్తుంది. అదే నిజమైతే వారు తమకు అవసరమైన చమురు కోసం రష్యా మరొక దే శంతో ఒప్పందాలు ఎందుకు చేసుకుంటున్నట్లు ? కావలసినన్ని గాడిదలున్న మన దేశం నుంచి వాటిని దిగుమతి చేసుకొని లేదా నరేంద్రమోడీ మేకిన్ ఇండియాలో భాగంగా గాడిద మూత్రాన్ని ఇక్కడి నుంచే సేకరించుకొని వారెందుకు తీసుకుపోవటం లేదో ఎవరైనా చెబుతారా ? భక్తితో ఆవు పేడను కొనుక్కొనే మన మూఢత్వాన్ని అమెరికా అమెజాన్ కంపెనీ సొమ్ము చేసుకుంటున్నది. గాడిద మూత్రానికి అంత సీన్ వుంటే వాటిని వదిలేదా ? ఆవులకు మంత్రిత్వశాఖలను ఏర్పాటు చేసిన బిజెపి పాలకులు గాడిదలకూ మంత్రులను నియమించి వుండేవారు.
ఆవు మూత్రంతో కాన్సర్ నయం అవుతుంది, మన పూర్వీకులు వేల సంవతత్సరాల నాడే గాడిద మూత్రంతో విద్యుత్ వుత్పత్తి చేసి వేల సంవత్సరాల నాడే ఖండాంత విమాన సర్వీసులు నిర్వహించారు, వేదాల్లోనే అన్నీ వున్నాయి, జర్మనీ వంటి వారు వాటిలోని విజ్ఞానాన్ని గ్రహించే అభివృద్ధి చెందారు వంటి అశాస్త్రీయ అంశాల ప్రచారాన్ని అడ్డుకోకపోతే కొంత కాలానికి అవే నిజమని నమ్మే తరాలు తయారవుతాయి. గతంలో ఇలాంటి అంశాలను చెప్పిన వారు చాదస్తులు అని సమాజం విస్మరించింది. ఇప్పుడు కేంద్ర మానవ వనరుల మంత్రి సత్యపాల్ సింగ్ వంటి వారు డార్విన్ పరిణామ సిద్ధాంతం తప్పు, దాన్ని పుస్తకాల నుంచి తొలగించాలన్నారు. క్రీస్తు పూర్వం 500-1500 సంవత్సరాల మధ్యలో భరద్వాజ మహర్షి రాశారని చెబుతున్న వైమానిక శాస్త్ర గ్రంధంలో విమానతయారీ, నడపటం గురించి వున్నదని కొందరు చెబుతున్నారు. రాసి వుండవచ్చు అది వూహకూడా కావచ్చు. 1903లోనే అమెరికాకు చెందిన రైట్ సోదరులు తొలి విమానాన్ని తయారు చేశారని వార్తలు వచ్చినపుడు అయినా సంస్కృత పండితులు మేల్కని విమానాన్ని ఎందుకు తయారు చేయలేకపోయారు? మన సంస్కృత విజ్ఞానాన్ని ఔపోసన పట్టారని చెబుతున్న జర్మన్లు ఎందుకు విమానాలను తయారు చేయలేకపోయారు? మనకు ఎక్కడా సమాధానాలు రావు. ఈ పిచ్చి ప్రచారం సంగతేమో చూద్దామని 1973,74లో ఐదుగురు బెంగళూరు శాస్త్రవేత్తలు పరిశీలించి వూహలు తప్ప అలా తయారు చేసే విమానాలు ఎగిరేవి కాదని తేల్చారు. వాటిలో ఒకటైన సుందర విమానాన్ని పూర్వీకులు గాడిద మూత్రంతో నడిపారని రాశారు. అయినా అవే అంశాలను 2015లో చాదస్తులు సైన్సు కాంగ్రెస్‌లో ఒక పత్రంగా ప్రవేశపెట్టారు. మన దేశానికి గణితంలో ఘనతమైన సంప్రదాయాలున్నాయి తప్ప అలాంటి విమానాలున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రొఫెసర్ రొడ్డం నరసింహ వంటి వారు చెప్పారు. ఎలాంటి ఆనవాళ్లను వదల కుండా సాంకేతిక పరిజ్ఞానం అంతర్ధానం కాదంటూ ఢిల్లీలో ఇనుప స్ధంభం నుంచి టిప్పు సుల్తాన్ రాకెట్ల వరకు లోహశాస్త్రంలో ఆధారాలున్నాయని విమానాలు వూహతప్ప మరొకటి కాదన్నారు.
భూమి చుట్టూ సూర్యుడు, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయనే సిద్ధాంతాన్ని తోసి పుచ్చుతూ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు నికొలస్ కోపర్నికస్. తన సిద్ధాంతాన్ని ప్రచురించిన వెంటనే వార్ధక్యం కారణంగా ఆయన మరణించాడు. తరువాత బైబిల్, కాథలిక్ విశ్వాసాలకు విరుద్ధంగా వున్నదంటూ చర్చి అధికారులు ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు.తొంభై సంవత్సరాల తరువాత ఆ సిద్ధాంతాన్ని బలపరిచిన మరో శాస్త్రవేత్త గెలీలియోను 1632 నుంచి 1642లో మరణించేవరకు గృహనిర్భంధం పాలు చేశారు. ఆనాడు బైబిల్ చెప్పిందానికి విరుద్ధంగా వున్నందుకు కొత్త సిద్ధాంతాన్ని బలపరిచినందుకు శాస్త్రవేత్తలు చర్చి, దాని ప్రభావంలో వున్న పాలకుల దాడులకు శాస్త్రవేత్తలు గురయ్యారు. నేడు మన దేశంలో కొత్త సిద్ధాంతాల ప్రతిపాదనకు ప్రోత్సాహం లేకపోగా ఆశాస్త్రీయ అంశాలను ముందుకు తెస్తున్నారు. ఎవరైనా వాటిని ప్రశ్నిస్తే హిందూత్వ శక్తులు, పాలకుల, ప్రభుత్వ అండ చూసుకొని ప్రశ్నించేవారిని అడ్డుకొనే ఒక వున్మాదం కనిపిస్తున్నది. సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ముంబైలోని పరేల్ దామోదర్ హాలులో విమాన శాస్త్రం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. భారత పున జాగృతం పేరుతో వ్యవహరిస్తున్న సంస్ధ దీనిని నిర్వహించింది. డిఐఎటి మాజీ వైస్ ఛాన్సలర్ , డిఆర్‌డిఓ మాజీ ప్రధాన కంట్రోలర్ డాక్టర్ ప్రహ్లాద రామారావు, ఏరోనాటికల్ ఇంజనీర్ వడ్డాది కావ్య వంటి వారు ఆ సంస్ధలో వున్నారు. గాడిద మూత్రంతో పూర్వీకులు విమానాలను నడిపిన అంశం గురించి చర్చ. అనికేత్ సూలే, మరికొందరు శాస్త్రవేత్తలు అశాస్త్రీయ అంశంపై ప్రశ్నలు సంధించటాన్ని సభ నిర్వాహకులు అభ్యంతర పెట్టారు. నిర్వాహకులు చెప్పేది తప్ప మీరు అడిగేవాటిని వినేందుకు మేము రాలేదంటూ సభకు హాజరైన వారు ప్రశ్నించిన వారి మీద దాడికి వచ్చారు. ఇది గుడ్డి నమ్మకం తప్ప జ్ఞానవంతమైన లక్షణం కాదు. ఆవు మూత్రం తాగితే కొందరు చెప్పినట్లు ప్రయోజనం లేకపోతే పోవచ్చు నష్టం లేదుగా తాగితే మీకు ఇబ్బందేమిటి, దేవుడు వున్నాడని మేం చెబుతున్నాం లేడని మీరు చెబుతున్నారు లేడని రుజువు చేయండి అనే వితండవాదాలను ముందుకు తెస్తున్నారు. శాస్త్రీయ సిద్ధాంతాన్ని బలపరిచినందుకు గెలీలియోను నాడు జైలుపాలు చేస్తే శాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నందుకు నేడు నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే, కులుబుర్గి వంటి వారిని మతోన్మాదులు హత్య చేస్తున్నారు. ‘అపకారానికి పాల్పడేవారు ప్రపంచాన్ని నాశనం చేయలేరు, దాన్ని చూస్తూ ఏమీ చేయకుండా వుండేవారి వల్లనే అది జరుగుతుంది’ అని అల్బర్ట్ ఐనిస్టీన్ చెప్పారు. కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందనిపించటం లేదా ?