Tags

, , ,

Related image

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా స్విడ్జర్లాండ్‌లోని ప్రతి కుటుంబం రెండున్నరవేల ఫ్రాంక్‌లు(స్విస్‌ కరెన్సీ) దేశ వ్యవసాయ విధానాల అమలుకు మూల్యంగా చెల్లించాల్సి వస్తోందని సెప్టెంబరు రెండవ వారంలో ఒక వార్త వచ్చింది. ఇది రాసే సమయానికి ఒక ఫ్రాంక్‌ విలువ 75రూపాయలకు పైబడి వుంది. అంటే ప్రభుత్వం నుంచి ఏటా లక్షా తొంభైవేల రూపాయలు రైతాంగానికి సబ్సిడీ లేదా మరో రూపంలో అందుతున్నది. దేశ ఆర్ధిక వ్యవస్ధకు వ్యవసాయ రంగం నుంచి వస్తున్న ఆదాయం 340 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగానికి దేశం ఖర్చు చేస్తున్న మొత్తం 1990 కోట్ల ఫ్రాంక్‌లుగా వుందని, ఇలా ఇంకెంత మాత్రం కొనసాగకూడదని తాజాగా ఒక సంస్ధ తన అధ్యయనంలో పేర్కొన్నది. కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలు నేరుగా ఇస్తున్న మొత్తాలు, పన్నుల రాయితీలు 490, దిగుమతుల ఆంక్షల కారణంగా వినియోగదారులకు ధరలు పెరిగి 460, ఎగుమతుల కోసం ఇస్తున్న రాయితీలు 310, పర్యావరణ నష్టం 730 కోట్ల ఫ్రాంక్‌ల వంతున వున్నట్లు దానిలో తేల్చారు. పురుగు మందుల వాడకం, మాంసం కోసం పెంచే పశువుల పెంపకం, మాంస పరిశ్రమల ద్వారా జరిగే పర్యావరణ నష్టాల వంటివాటిని వ్యవసాయానికి చేస్తున్న ఖర్చుగా లెక్కించారు.

ఐరోపాలో వ్యవసాయానికి రాయితీలు ఇచ్చే దేశాల వరుసలో నార్వే, ఐస్‌లాండ్‌, స్విడ్జర్లాండ్‌ మొదటి మూడు స్ధానాల్లో వున్నాయి. స్విస్‌లో వ్యవసాయ రంగానికి అవుతున్న మొత్తం ఖర్చు పైన చెప్పుకున్నట్లుగా 1990 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగం ద్వారా వచ్చే మొత్తం 340 కోట్లకు వ్యవసాయ వస్తువులపై విధించే దిగుమతి పన్ను ద్వారా వచ్చే 60కోట్లను కూడా కలుపుకుంటే నికరంగా ప్రభుత్వం అంటే జనం భరించే మొత్తం 1590 కోట్ల ఫ్రాంక్‌లని, ప్రతి కుటుంబానికి 4,500 ఫ్రాంక్‌లైతే పర్యావరణ నష్టాన్ని మినహాయించి లెక్కవేస్తే 2,570 ఫ్రాంక్‌లను భరించాల్సి వస్తోందని లెక్కలు చెప్పారు. ఈ నివేదిక చదివిన,విన్న,కన్నవారు ఇంత భారం మోపి వ్యవసాయం చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది, కావాల్సినవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే పోదా అనుకోవటం సహజం.ఈ లెక్కలు అక్కడి పాలకులకు తెలియవా ? అసలు విషయం ఏమంటే వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేయాలనేవారి కుతర్కమిది. స్విస్‌ వ్యవసాయ- ఆహార పరిశ్రమ ద్వారా ఏటా జిడిపికి 9000 కోట్ల ఫ్రాంక్‌లు సమకూరుతున్నాయి.వ్యవసాయం లేకపోతే దానికి ముడిసరకులు ఎక్కడి నుంచి వస్తాయని కొన్ని పార్టీల వారు ఆ నివేదిక మీద ధ్వజమెత్తారు. ప్రస్తుతం అక్కడ వున్న వ్యవస్ధలో పన్నెండుశాతం మంది రైతులు నష్టపోతున్నారన్నది వాస్తవమని ఒక పత్రిక రాసింది.

అయినప్పటికీ 2018ా21మధ్య 78.9 కోట్ల ఫ్రాంక్‌ల సబ్సిడీ కోత పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.2014 వివరాల ప్రకారం అక్కడి రైతు కుటుంబం సగటున ఏడాదికి 65వేల ఫ్రాంక్‌ల రాయితీలు పొందుతున్నది. వ్యవసాయ పంటల మీద వచ్చే నిఖరాదాయం 3000 ఫ్రాంక్‌లు, ఇతర ఆదాయం 26వేలు కలుపుకుంటే మొత్తం 94వేల ఫ్రాంక్‌లు పొందుతున్నట్లు అంచనా వేశారు. 2004ా14 మధ్య సగటున అక్కడి రైతు కుటుంబాల ఆదాయం 12శాతం పెరిగింది. గమనించాల్సిన అంశం ఏమంటే వ్యవసాయం ద్వారా వచ్చే నిఖరాదాయం ఇదే కాలంలో 13 నుంచి మూడు వేల ఫ్రాంక్‌లకు పడిపోయింది. మరి పెరుగుదల ఎలా సాధ్యమైందంటే సబ్సిడీలు 37శాతం, వ్యవసాయేతర ఆదాయం 22శాతం పెరుగుదల ఫలితం. భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ రైతాంగంలో కొంత మంది ఇప్పటికీ దారిద్య్రంలోనే వున్నారు.మన దగ్గర దారిద్య్రం గోచిపాతరాయుళ్ల రూపంలో కనిపిస్తే అక్కడ సూటు, కోటు వేసుకొని కనిపిస్తారు. దాదాపు 50శాతం వరకు రాయితీలు పొందుతున్న రైతుల పరిస్ధితే అలా వుంటే మన దగ్గర రోజు రోజుకూ సబ్సిడీలు తగ్గిస్తున్న పాలకులు మరోవైపు రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు.

తల్లికి తిండి పెట్టని వాడు పిన్నమ్మ చేతికి బంగారు గాజులు వేయిస్తానంటే నమ్మగలమా ! గతంలో రైతులకు ఇచ్చిన రాయితీలకు కోత పెడుతూ, మేం ఇచ్చిన రాయితీలు మీతో అంగీకరించిన వ్యవసాయరాబడిలో పదిశాతం మొత్తానికి లోబడే వున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్ధకు సంజాయిషీ ఇస్తున్న మన పాలకులు రాబోయే రోజుల్లో రాయితీలు తగ్గించటం తప్ప పెంచే అవకాశాలు లేవని ముందుగా తెలుసుకోవాలి. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు పదిశాతం మేరకు పెరిగినట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు మీడియా పేర్కొన్నది. ఎరువుల సబ్సిడీ 64970 కోట్ల రూపాయల నుంచి 70100 కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు. దేశ స్ధూల జాతీయోత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది, త్వరలో చైనాను అధిగమిస్తాం, దానికి మా నరేంద్రమోడీఏ కారణమంటూ ఒక వైపు భజన సాగుతోంది. దానికి అనుగుణ్యంగా లేదా ద్రవ్యోల్బణం మేరకు రైతాంగానికి సబ్సిడీలు మాత్రం పెరగటం లేదు. 2008-09లో మిశ్రమ ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ 65554 కోట్లు యూరియాకు 33940 కోట్లు మొత్తం 989494 కోట్ల రూపాయలకు గాను తాజా బడ్జెట్‌లో కేటాయింపుపైన పేర్కొన్న మొత్తం. అంటే 30వేల కోట్లకు కోత పడింది. తాజా 70వేల కోట్లలో యూరియా సబ్సిడీ 45వేల కోట్లు అయితే మిశ్రమ ఎరువులకు 25వేల కోట్లు మాత్రమే. అంటే మిశ్రమ ఎరువులు వాడే రైతుల మీద ఈ కాలంలో 40వేల కోట్ల అదనపు భారం పడుతున్నట్లే. నూతన ఎరువుల రాయితీ విధానం ప్రకారం నూట్రియంట్‌లను బట్టి రేటు నిర్ణయిస్తున్నారు.2013-14లో అంటే మోడీ అధికారానికి రాక ముందు ఎన్‌పికె,సల్పర్‌ ఎరువులను ఒక్కొక్క కిలో చొప్పున కొన్న రైతుకు రు.20.875,18.679,18.833,1.677 అంటే మొత్తం రు.60.06లను ప్రభుత్వ సబ్సిడీగా ఇచ్చింది. ఇదే ఎరువులను మోడీ హయాంలో అంటే ఇప్పుడు కొనుగోలు చేస్తే ఆ మొత్తం రు.47.96కు తగ్గిపోయింది. ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ శక్తులకు వదలి వేసింది. నిర్ణీత మొత్తాన్ని రాయితీగా ఇస్తోంది. 2011-12నుంచి ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత అప్పటి నుంచి సబ్సిడీ మొత్తం 70వేల కోట్లకు అటూ ఇటూగానే వుంటోంది. రాబోయే రోజుల్లో ఒక వేళ యూరియా ధరలను పెంచితే ఇంతకంటే తగ్గవచ్చు తప్ప పెరిగే అవకాశాలు లేవు. కొన్ని ఎరువుల ధరలు ఎలా పెరిగాయో చూద్దాం. డిఏపి 2017 ఏప్రిల్‌లో టన్ను రు. 21,818, 2018 మార్చి నాటికి 23,894కు చేరింది. జూలై నెలలో 25,706 వున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిత్వశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. టన్నుకు నాలుగు వేలు పెరిగింది. అన్నింటికీ ఇంత పెద్ద ఎత్తున లేనప్పటికీ గణనీయంగా పెరిగాయి.

దేశంలో వినియోగించే డీజిల్‌ ప్రతి వందలో 14 లీటర్లు వ్యవసాయానికి అవుతోంది. వ్యవసాయ వుత్పత్తులను రవాణా చేసే ట్రక్కులది కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. డీజిల్‌ ధరలపై నియంత్రణను మోడీ సర్కార్‌ ఎత్తివేసింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు ఢిల్లీలో ఒక రైతు ట్రాక్టర్‌కు ఒక రోజు పది లీటర్ల డీజిల్‌ను వాడితే 2014 మార్చినెల ఒకటవ తేదీన రు 554.80 చెల్లించాడు. లీటరుకు రు.8.37 చొప్పున 83.70 సబ్సిడీ పొందాడు. అదే రైతు 2018 సెప్టెంబరు 17న అదే ఢిల్లీ బంకులో రు.738.70 చెల్లించాడు. నాలుగేండ్ల క్రితం పీపా అన్ని ఖర్చులతో 126.93 డాలర్లకు దిగుమతి చేసుకున్నాం. సెప్టెంబరు 17న 93.45 డాలర్లకే వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ జరిగిన మార్పేమిటంటే దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర తగ్గింది, ఇతరులతో పాటు రైతులకు వచ్చే రాయితీ ఎగిరిపోయింది, 180 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. నాలుగేండ్ల క్రితం ఒక లీటరు డీజిలుపై ఎక్సయిజు పన్ను రు.3.56, దాన్ని మోడీ గారు రు.15.33 చేశారు.

మోడీ అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ 58 అయితే ఇప్పుడు 73వరకు పతనమైంది. దీని వలన రైతాంగం వినియోగించే పురుగుమందులలో దిగుమతి చేసుకొనే వాటి ధర ఆ మేరకు పెరుగుతుంది. ఒక లీటరు మందును నాలుగు సంవత్సరాల క్రితం 58కి కొంటే ఇప్పుడు 73 చెల్లించాల్సిందే. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ 45-50 మధ్యనే వుంది. రానున్న రోజుల్లో ఇంకా పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను కొనసాగిస్తున్నాయి. అమెరికా 95, బ్రెజిల్‌ 75శాతం స్ధాయికి చేరుకుంటే డీజిల్‌ వినియోగం ఇంకా పెరుగుతుంది. వ్యవసాయ ఖర్చు తగ్గించే పేరుతో యాంత్రీకరణ, దానికి డీజిల్‌ ఖర్చు తడిచి మోపెడైతే బాగుపడేది యంత్రాలను తయారు యజమానులు, చమురు కంపెనీల వారు, పన్నులతో జనాల జేబులకు కత్తెర వేసే ప్రభుత్వం తప్ప ఇంక రైతాంగానికి మిగిలేదేముంటుంది.

Image result for double the farmers income

ఇప్పటికే వున్న సబ్సిడీలు రద్దు లేదా నామమాత్రం అవుతున్నాయి. వాటి కంటే మోయలేని కొత్త భారాలు పడుతున్నాయి. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు గద్దెనెక్కినా లేదా వాటికి మద్దతు పలికి భుజాలు నొప్పి పుట్టేట్లు మోసిన ప్రాంతీయ పార్టీల వారు గానీ రైతాంగానికి, మొత్తంగా జనానికి నిజాలు చెప్పటం లేదు. మన దేశంలో ఆహార భద్రతలో భాగంగా పౌరపంపిణీ వ్యవస్ధ ద్వారా సరఫరా చేసే ఆహార ధాన్యాలకు ఇచ్చే రాయితీలు లేదా నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా కొన్ని సందర్భాలలో వ్యవసాయ రాయితీలలో భాగంగా చూపుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో మోడీగారు ఆబగా కౌగలించుకొనే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఫిర్యాదులో సారాంశమిదే. కనీస మద్దతు ధరల ప్ర కటనను కూడా రాయితీల కిందనే జమకడుతోంది. పౌర పంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలని, రాయితీలు ఇవ్వాలనుకుంటే లబ్దిదార్లకు నేరుగా నగదు ఇవ్వాలని, ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోళ్లను నిలిపివేసి మొత్తం వ్యాపారాన్ని ప్రయివేటు రంగానికి వదలి వేయాలన్నది అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ సంస్కరణల పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు వంతపాడుతున్నాయి. అందుకు అంగీకరించిన మోడీ సర్కార్‌ తొలి దశలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఛండీఘర్‌, పాండిచ్చేరిలో చౌకదుకాణాలను ఎత్తివేసింది. క్లబ్బుడాన్సర్‌లు ఒంటి మీది దుస్తులను ఒకటకటి తొలగించే మాదిరి మన పాలకులు సబ్సిడీలను ఎత్తి వేస్తున్నారు.ఎఫ్‌సిఐకి చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పుగా మార్చివేస్తోంది. 2015-16లో లక్షా35వేల కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ కాగా మరుసటి ఏడాది దానిని లక్షా ఐదువేల కోట్లకు తగ్గించి 25వేల కోట్ల రూపాయలను జాతీయ చిన్నపొదుపు మొత్తాల నిధి నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పుగా అందచేశారు. కేటాయించిన మొత్తాలను కూడా చెల్లించకుండా బకాయి పెట్టి మరుసటి ఏడాది ఆ బకాయిలను కూడా చెల్లింపులలో చేర్చి ఆహార సబ్సిడీ మొత్తాన్ని పెంచినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

వివిధ కారణాలతో కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరల్లో పెరుగుదల లేకపోవటం లేదా తగ్గుదల కనిపిస్తోంది. ఈ సమయంలోనే మోడీ సర్కార్‌ రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తానంటూ ముందుకు వచ్చింది. ప్రపంచ మార్కెట్‌తో పోల్చితే కొన్ని సందర్భాలలో మన దేశంలో ధరలు ఎక్కువగా వున్నాయి. అవి తమకు గిట్టుబాటు కావటం లేదని మన రైతాంగం గగ్గోలు పెడుతోంది. ఈ పరిస్ధితులలో అనేక దేశాలు తమ రైతాంగాన్ని ఆదుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. 2015లో అమెరికాలో ఒక్కొక్క రైతుకు సగటున 7,860 డాలర్లు, బ్రిటన్‌లో 28,300 పౌండ్లు, జపాన్‌లో 14,136, న్యూజిలాండ్‌లో 2,623 డాలర్లు చెల్లించగా మన దేశంలో 417 డాలర్లు మాత్రమే ఇచ్చినట్లు తేలింది. రైతుల ఆదాయాల రెట్టింపు చేయాల్సిన అవసరం, వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక గురించి నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ ఒక పత్రాన్ని రూపొందించారు. 2004-05 నుంచి 2011-12 మధ్య దేశంలో వ్యవసాయదారుల సంఖ్య 16.61 కోట్ల నుంచి 14.62కోట్లకు పడిపోయింది. ఈ ధోరణే కొనసాగితే 2015-16 నుంచి 2022-23 మధ్య మరొక కోటీ 96లక్షల మంది అంటే రోజుకు 6,710 మంది వ్యవసాయం మానుకొంటారని అంచనా వేశారు. జనం తగ్గుతారు గనుక వ్యవసాయ ఆదాయం పెరుగుతుందని, కనుక సబ్సిడీలు తగ్గించవచ్చని కొందరు వాదించేవారు లేకపోలేదు.

అన్ని తరగతుల వారికీ టోకరా వేసి వచ్చే ఎన్నికలలో ఏదో విధంగా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పూనుకున్న పెద్ద మనుషులు అమాయకపు రైతాంగాన్ని వదలి పెడతారా ? 2022 అంటే మనకు స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడిచే నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది నరేంద్రమోడీ అండ్‌ కో చేసిన వాగ్దానం. దాన్ని ఎలా అమలు జరుపుతారు,ఆ దిశలో ఎంతవరకు పయనించారు అని అడుగుదామంటే కుదరదు.ఎందుకంటే ఆ పెద్దమనిషి చెప్పరు, అడుగుదామంటే మీడియాతో మాట్లాడరు. భజనపరులకు అడిగే ధైర్యం ఎలాగూ వుండదు. మౌనమునిగా మన్మోహన్‌సింగ్‌ను వర్ణించిన బిజెపి పెద్దలు తమలో అంతకంటే పెద్ద మహామౌన మునిని పెట్టుకొని లేనట్లే ప్రవర్తిస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల పాలనా కాలంలో మూడు సార్లు మీడియాతో మాట్లాడితే నరేంద్ర ముని ఐదేండ్లలో ఇంతవరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. రైతు జనోద్ధారకుడిగా రాబోయే రోజుల్లో ఓటర్ల ముందుకు వెళ్లేందుకు అమలులో వున్న మూడు పాత పధకాలను కలిపి స్వల్పమార్పులతో కొత్తగా ప్రధాన మంత్రి ఆషా పేరుతో అమలు జరుపుతామని ప్రకటించారు.

రైతాంగ ఆదాయాల రెట్టింపు అన్నది ఆషామాషీ సమస్య కాదు. దానిలో ఎన్నో అంశాలు ఇమిడి వున్నాయి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపధ్యంలో వారి బాగుకోసం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ నానాటికీ పెరుగుతున్నది. స్వామినాధన్‌ కమిషన్‌ వున్నంతలో ఒక శాస్త్రీయ సూత్రాన్ని చెప్పింది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేయటం గురించి ఇంతవరకు ఎలాంటి సర్వే జరపలేదు, ఒక ప్రాతిపదికను ఏర్పరచలేదన్నది పచ్చి నిజం.ఈ విషయాన్ని వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్‌ రూప్లా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2013లో జరిపిన జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) తప్ప తరువాత ఇంతవరకు అలాంటిది జరగలేదు. దానిలో ( 2012 జూలై 2013జూన్‌ మధ్య జరిపిన సర్వే) వ్యవసాయ రంగం పరిస్ధితి మదింపు సర్వే అంశాలనే పార్లమెంట్‌కు సమర్పించారు.

ఆ నివేదికలో వున్న అంశాలేమిటి? దేశ రైతు కుటుంబ తలసరి నెలసరి ఆదాయం రు.6,426, బీహార్‌లో అతి తక్కువ రు.3,558, పశ్చిమ బెంగాల్‌లో రు.3980, వుత్తరా ఖండ్‌లో రు.4,701 కాగా అత్యధికంగా పంజాబ్‌లో రు.18,059, హర్యానాలో రు.14,434, జమ్మూకాశ్మీర్‌లో రు.12,683 వున్నాయి. ఇక తెలుగురాష్ట్రాలకు వస్తే తెలంగాణా రు.6,311, ఆంధ్రప్రదేశ్‌ రు.5,979 చొప్పున వున్నాయి. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కేరళ రు.11,888, కర్ణాటక రు.8,832, తమిళనాడు రు.6,980. నాబార్డు రూపొందించిన నివేదిక ప్ర కారం 2015-16లో దేశ తలసరి కుటుంబ నెలాదాయం రు. 8,931కి పెరిగింది. అత్యధికంగా మొదటి మూడు రాష్ట్రాలైన పంజాబ్‌లో రు.23,133, హర్యానాలో రు.18,49,, కేరళలోరు.16,927 వున్నాయి. చివరి మూడు రాష్ట్రాలైన వుత్తర ప్రదేశ్‌లో 6,668,ఆంధ్రప్రదేశ్‌లో రు.6,920, ఝార్ఖండ్‌లో రు.6,991 వుంది. తెలంగాణాలో రు.8,951, తమిళనాడులో రు.9,775, కర్ణాటకలో రు.10,603గా నమోదైంది.

Image result for cutting down the farm subsidies,india cartoons

ఈ రెండు నివేదికల మధ్య ఆదాయ పెరుగుదల దేశ సగటు 39శాతం వుంది. మహారాష్ట్ర ఒక్కటే దేశ సగటును కలిగి వుంది. వివిధ రాష్ట్రాల మధ్య అంతరాలను పరిశీలిస్తే నాలుగు రాష్ట్రాలలో ఒకటి నుంచి 16.5శాతం వరకు తగ్గగా గరిష్టంగా మూడు రాష్ట్రాలలో 94.9 నుంచి 130.9శాతం వరకు పెరుగదల వుంది. దేశ సగటుకు ఎగువన తొమ్మిది రాష్ట్రాలు 39-65.7శాతం మధ్య వున్నాయి. మిగిలిన చోట్ల తక్కువ నమోదైంది. తెలంగాణాలో 41.8శాతం పెరగ్గా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 15శాతమే వుంది. మూడు సంవత్సరాలలోనే ఇంతటి ఎగుడుదిగుడులు వున్నపుడు ఆదాయాల రెట్టింపునకు ప్రాతిపదిక దేనిని తీసుకోవాలి అన్నది సమస్య. భిన్న ప్రాంతాలు, భిన్న వాతావరణం, భిన్న పంటలు, వనరులు ఇలా అనేక అంశాలలో ఏ ఒక్క రాష్ట్రమూ మిగతావాటితో వాటితో పోల్చటానికి లేదు. ఈ పూర్వరంగంలోనే నీతి ఆయోగ్‌ తొలిసారిగా ఏడాదికేడాది రైతుల ఆదాయాన్ని మదింపు వేసేందుకు పూనుకుంది, వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి వుంది. ఒక అంచనా మేరకు నిజధరల ప్రకారం ప్రస్తుతం రైతుల ఆదాయం ఏటా 3.8శాతం పెరుగుతున్నది. మరోవైపు మార్కెట్‌ ధరల ప్రకారం 11శాతం పెరుగుదల చూపుతున్నది. ఈ లెక్కన మోడీ చెబుతున్నట్లు 2022 నాటికి ఆదాయాలు రెట్టింపు ఎలా అవుతాయి? నిజధరల మేరకు ఆదాయాలు రెట్టింపు కావాలంటే రెండుదశాబ్దాలకుపైనే పడుతుంది. ఈ లోగా వచ్చే మార్పుల సంగతేమిటి?

వ్యవసాయం, పశుసంపద, చేపల పెంపకాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ ఆదాయం లెక్కలు వేస్తున్నారు. కేరళ, హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలలో అడవి మీద ఆధారపడే వారు గణనీయంగా వున్నారు. వారిని ఎలా లెక్కిస్తారు. మిగతా రాష్ట్రాలలో అడవుల నుంచి వచ్చే ఆదాయాన్ని కలిపి వాటికి తేడాలు రావా ? ఆదాయం ఎక్కువగా వున్న పంజాబ్‌, హర్యానా, లేదా దేశ సగటుకు దగ్గరగా వున్న మహారాష్ట్రల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభం కనిపిస్తున్నది. గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఏటా 16.5శాతం వ్యవసాయ అభివృద్ధిని సాధిస్తున్నది. చిత్రం ఏమిటంటే గిట్టుబాటు ధరలు కావాలని, రుణాల రద్దును కోరుతూ అక్కడ పెద్ద ఎత్తున రైతులు వీధుల్లోకి వచ్చారు. అందువలన అభివృద్ధి అంటే ఏమిటి? ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే తరువాత మూడు సంవత్సరాలలో సగటున రైతుల ఆదాయం 39శాతం పెరిగిందని నాబార్డు నివేదిక చెప్పింది. ఈ కాలంలో పాత విధానాల కొనసాగింపు తప్ప ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలేమీ లేవు. ఆ నివేదికే వాస్తవం అనుకుంటే కొన్ని చోట్ల రెట్టింపు ఆదాయాలు ఇప్పటికే వచ్చాయి, మరికొన్నిచోట్ల వున్న ఆదాయాలకే గండిపడింది. వీటిని ఎలా చూడాలి? ఏనుగు ఎలా వుందని అడిగితే తలా ఒక వర్ణన చేసినట్లుగా ఎవరి అవగాహనకు అనుగుణంగా వారు నివేదికలు ఇస్తున్నట్లు మనకు స్పష్టం అవుతున్నది. దారీ తెన్నూ నిర్ధారించుకోలేని మోడీ సర్కార్‌ రైతాంగాన్ని ఎక్కడికో తీసుకుపోతోంది తప్ప ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు.