Tags

, , , ,

TDB says Only real women devotees expected to visit Sabarimala temple

ఎం కోటేశ్వరరావు

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచ్‌ మెజారిటీ (4ా1) తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో బిజెపి అనుబంధ విభాగమైన మహిళా మోర్చా,యువమోర్చా తదితర సంస్ధలు రంగంలోకి దిగాయి. ప్రదర్శనలు, ఇతర రూపాల్లో ఆందోళనలు చేయిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా వచ్చిన తీర్పులను బిజెపి ఎంత రెచ్చగొట్టినా మహిళలే వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటం ఏమిటని అనేక మందిలో ఆశ్చర్యం, ఆవేదన, ఆందోళన కలిగి వుండవచ్చు.వేలు, లక్షల సంఖ్యలో రైతులు, కార్మికులు, వుద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ఒక్క ముక్క కూడా వార్తలు, చిత్రాలను ప్రచురించని పత్రికలు వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు అతిశయోక్తులను జోడించటం కూడా చాలా మందికి మింగుడుపడటం లేదు. సమాజం మొత్తం మీద చూసినపుడు వెనుకబడిన వారిలో మహిళలు అత్యంత వెనుకబడిన వారని, ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో వున్న పరిస్ధితులు, పరిణామాలను గుర్తిస్తే ఇలాంటి ప్రదర్శనల గురించి ఆశ్చర్యపడాల్సిన పని వుండదు. తిరోగామి భావజాల ప్రభావం సామాజికంగా వెనుకబడిన వారి మీద ఎక్కువగా వుంటుంది. మహిళలకు మినహాయింపు ఎలా వుంటుంది. అనేక వుదంతాలలో వారిని వారిని ముందుకు తెచ్చిన ఫ్యూడల్‌, ఇతర తిరోగామి శక్తులను చూశాము. అనేక ఆందోళనలు అవి రిజర్వేషన్లకు వ్యతిరేకం నుంచి దళితుల మీద దాడులు, వేర్పాటు వాదం నుంచి విచ్చిన్న వాదాల ఆందోళనల వరకు జరిగిన వాటిలో మహిళలు గణనీయంగా పాల్గనటం తెలిసిందే. అలాంటి వాటి గురించి వార్తలను గుప్పించటం, ఆందోళనలు, పోరాటాలను విస్మరించటం కార్పొరేట్‌, పాలకవర్గాల మీడియా వర్గదృష్టిలో భాగమని వేరే చెప్పనవసరం లేదు.

శబరిమల తీర్పు వివిధ రాజకీయపార్టీల, స్వచ్చంద లేదా సాంస్కృతిక సంస్ధల ముసుగులో వున్న శక్తుల బండారాన్ని, ఫ్యూడల్‌ శక్తుల సంతుష్టీకరణకు పడే తాపత్రయాన్ని బయట పెడుతున్నది. చిత్రం ఏమిటంటే మహిళల పట్ల మత విషయాలలో నాణానికి బమ్మా బరుసు వంటి బిజెపి-ముస్లింలీగ్‌ ఒకే పాట పాడుతున్నాయి, ఆ బృందగానంలో కాంగ్రెస్‌ గొంతు కలిపింది. శబరిమల ఆలయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకొనేందుకు సాంప్రదాయ ముసుగు వేసుకొని రంగంలోకి దిగటమే కాదు, ఓట్ల రూపంలో సొమ్ము చేసుకొనేందుకు బిజెపి, కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌, ఇతర శక్తులు పోటీ పడుతున్నాయి. తీర్పుపై పునర్విచారణకు అప్పీలు చేయరాదని నిర్ణయించినందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. కారాలు మిరియాలు నూరుతున్నాయి. మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను ముఖ్యంగా మహిళ్లో రెచ్చగొట్టేందుకు పూనుకున్నాయి.ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదనే ముద్రవేయాలన్నది కుటిలనీతి. ఒక పురోగామి తీర్పు, పరిణామాన్ని అడ్డుకోవాలంటే దానికి సాంప్రదాయ ముసుగువేయి అన్నది మతోన్మాద, కులోన్మాద శక్తులు, వాటికి అంటకాగే అవకాశవాద శక్తులఎత్తుగడ. వివిధ సందర్భాలలో ఇది వెల్లడైంది. మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష శక్తులన్నీ ఏకమైన తరుణంలో ఆచితూచి వ్యవహరించేందుకు అక్కడి వామపక్ష ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా అరవై సంవత్సరాల క్రితం ఇదే కేరళలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతసంస్ధలు, వాటి రాజకీయ ప్రతినిధులు, వారికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌కు అమెరికా గూఢచార సంస్ధ డబ్చిచ్చి మరీ విమోచన సమరం పేరుతో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఆధ్వర్యాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది. ఇప్పుడు శబరిమల పేరుతో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అని ఇప్పుడే చెప్పలేము గాని శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం కనిపిస్తున్నది. నంబూద్రిపాద్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ కమ్యూనిస్టు విప్లవ అజెండాలోనివి కాదు, ప్రజాస్వామిక స్వభావం కలిగినవే. స్వాతంత్య్రవుద్యమంలో ముందుకు వచ్చిన భూ సంస్కరణల అమలుకు పూనుకుంది. కౌలుదార్లకు రక్షణ కల్పించటం, వ్యవసాయ కార్మికుల కనీసవేతనాలు పెంచటం, ప్రయివేటు విద్యా సంస్ధలలో వుద్యోగనియామకాల క్రమబద్దీకరణ, వేతనాలను ట్రెజరీల ద్వారా చెల్లించాలని, చట్టాన్ని వుల్లంఘించిన విద్యా సంస్ధలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి సాధారణ అంశాలు మాత్రమే వున్నాయి. నిజానికి వీటి మీద వాగ్దానాలు చేయని పార్టీ లేదు. కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన ‘నేరం’ ఏమిటంటే చేసిన వాగ్దానాన్ని అమలు జరపటమే. దీనికి వ్యతిరేకంగా సర్వమత శక్తులతో పాటు నేతిబీరలో నెయ్యి మాదిరి సోషలిస్టు పార్టీల ముసుగులో వున్న శక్తులు కూడా మతశక్తులు, కాంగ్రెస్‌తో చేతులు కలిపి తమ బండారాన్ని తాము బయట పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆందోళనకు దిగిన అంశం కూడా కమ్యూనిస్టు అజెండాలోనిది కాదు. చట్టబద్దమైన పాలనకు కట్టుబడడిన వారిగా శబరిమల తీర్పును అమలు జరుపుతామని ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ప్రకటించటంతో రాజకీయ లబ్ది పొందేందుకు అన్ని రకాల శక్తులు రంగంలోకి దిగాయి. గతంలో చేసిన కుట్రలను జయప్రదంగా తిప్పి కొట్టిన కమ్యూనిస్టులు ఈ సారి దానిని ఎలా అధిగమిస్తారన్నదే ఆసక్తి కలిగించే అంశం.

మన దేశంలో పురోగమన వాదానికి కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయ వాదులు, తిరోగమన వాదానికి ఆర్‌ఎస్‌ఎస్‌, దాని భావజాలంతో ఏకీభవించే బిజెపి, శివసేన, వాటిఅనుబంధ సంస్థలు, ఏది వాటంగా వుంటే ఆవైపు మొగ్గే అవకాశవాదానికి ప్రతీకలుగా కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ బూర్జువా పార్టీలని స్థూలంగా చెప్పవచ్చు. వూహాజనితమైన, భావోద్రేకాలను రెచ్చగొట్టే అంశాలను ముందుకు తెచ్చి దేశాన్ని పట్టి పీడిస్తున్న తక్షణ సమస్యలుగా చిత్రించటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెట్టింది పేరు. వుదాహరణకు లవ్‌ జీహాద్‌. ముస్లిం యువకులు హిందూ బాలికలను ఆకర్షించి వివాహాలు చేసుకొని ముస్లింలుగా మార్చివేస్తున్నారన్నది వాటిలో ఒకటి. అందుకోసం హిందూ కుటుంబాలన్నింటినీ కలసి దాని గురించి చెప్పాలని పిలుపునిస్తారు. వాలెంటైన్స్‌ డే రోజున ఏడాదికి ఒకసారి పార్కుల వెంట తిరిగి ప్రేమికుల కోసం వెతకటం రెండవది. ఈ బాపతు భాషలో చెప్పాలంటే రుక్మిణిని లేపుకు పోయి వివాహం చేసుకున్న కృష్ణుడిని మాత్రం ఆదర్శ పురుషుడిగా కొలుస్తారు.

మూడుసార్లు తలాక్‌ చెప్పటం ద్వారా విడాకులు చెల్లవని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము ముస్లిం మహిళలను విముక్తి చేశామని, అందువలన వారంతా బిజెపికే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి మహిళల పట్ల ఆ పార్టీకి లేదా దానిని సృష్టించిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి చిత్తశుద్ది లేదు. హిందూకోడ్‌ బిల్లు విషయంలో అదెలా వ్యవహరించింది చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ గాంధీ తరువాత భారత్‌ అనే తన పుస్తకంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ధర్మశాస్త్రాల ప్రాతిపదికన ఏర్పడిన హిందూ చట్టాలలో జోక్యం చేసుకొనేందుకు రాజ్యాంగపరిషత్‌కు ఎలాంటి హక్కు లేదంటూ 1949లోనే ఆలిండియా యాంటీ హిందూకోడ్‌ బిల్‌ కమిటీ ఏర్పడింది. దేశమంతటా సభలు పెట్టారు. వుపన్యాసాలు చేసిన వారు, పాల్గన్న వారంతా ధర్మ యుద్ధ సైనికులుగా పోరాడతామన్నారు. ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సభను ఏర్పాటు చేసింది. హిందూ సమాజంపై బిల్లు ఆటంబాంబు వంటిదని ఒక వక్త వర్ణించాడు. రౌలట్‌ చట్టం బ్రిటీష్‌ రాజ్య పతనానికి నాంది పలికినట్లుగా ఈ బిల్లు నెహ్రూ ప్రభుత్వపతనానికి దారి తీస్తుందన్నారొకరు. మరుసటి రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రాజ్యాంగపరిషత్‌ భవనం వద్ద ప్రదర్శన చేశారు. నెహ్రూ, అంబేద్కర్‌ దిష్టిబమ్మలను తగులబెట్టారు. ఒక అంటరాని వ్యక్తికి బ్రాహ్మ ణులు కాపాడే విషయాలతో పనేమిటని కరపత్రిజీ మహరాజ్‌ అనే పెద్దగా తెలియని ఒక స్వామిజీ అంబేద్కర్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. పురుషులు రెండో వివాహం చేసుకోవటం గురించి యాజ్ఞవల్క్యుడే స్వయంగా ఇలా చెప్పాడంటూ సమర్ధించాడు. దాని ప్రకారం భార్యకు నిరంతరం మద్యం తాగే అలవాటు వుంటే, పిల్లలు పుట్టరని తేలితే, మాయలాడి, పెద్ద నోరుగలది, మగ పిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలను మాత్రమే కన్నపుడు, భర్తను ద్వేషించినపుడు మొదటి భార్య జీవించి వున్నా భర్త రెండవ వివాహం చేసుకోవచ్చనిచెప్పాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం విడాకులు నిషేధం ఇలా సాగింది స్వామీజి సమర్దన. బిల్లుకు వ్యతిరేకంగా ద్వారకా పీఠ శంకరాచార్య ఒక ఫత్వా జారీచేశారు.

ఈ పూర్వరంగంలో లింగవివక్ష నివారణ, మహిళలకు సమాన స్థాయి కల్పించే లక్ష్యంతో రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడు అంబేద్కర్‌ నాటి ప్రధాని నెహ్రూ మద్దతుతో 1951లో హిందూ కోడ్‌ బిల్లును ప్రతిపాదించారు. దానిలో మహిళలకు వారసత్వం, విడాకులు,భరణపు హక్కులను ఇవ్వటంతో పాటు వివాహవయస్సు పెంపు, బహుభార్యాత్వానికి వ్యతిరేకత, వితంతు వివాహాలు, బాల్యవివాహాల నిరోధం వంటి అనేక పురోగామి అంశాలను దానిలో చేర్చారు. ఈ బిల్లును ఆనాడు హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌, నేటి బిజెపి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అది హిందూ జీవన విధానాన్ని, మహోన్నతంగా నిర్మితమైన హిందూ సంస్కృతిని నాశనం చేస్తాయని నాశనం చేస్తాయని గగ్గోలు పెట్టాయి. వారికి మిగతా మితవాద సంస్థలు, కాంగ్రెస్‌లోని మితవాదులు తోడయ్యారు. ఇహ సంఘపరివార్‌ వంటి సంస్థలున్న తరువాత పుకార్లకు కొదవేముంటుంది. తన కుమార్తె ఇందిరా గాంధీ విడాకులకోసమే నెహ్రూ ఈ బిల్లును తెచ్చారని ప్రచారం చేశారు. వత్తిడికి తలగ్గిన నెహ్రూ బిల్లును వాయిదా వేయించారు. దానికి నిరసనగా అంబేద్కర్‌ రాజీనామా చేశారు. 1952తొలి పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ బిల్లును ఒక సమస్యగా చేసి ప్రచారం చేసిన నెహ్రూ ఆ తరువాత 1956లో అదే బిల్లు ఆమోదానికి దోహదం చేశారు.

ఇటీవల కాలానికి వస్తే రూప్‌ కన్వర్‌ అనే ఒక 18ఏండ్ల యువతి రాజస్ధాన్‌లోని దేవరాల గ్రామంలో మరణించిన ఆమె భర్తతో కలిపి సజీవ దహనం చేశారు. అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం ఆమె తప్పించుకొని పారిపోతే అత్తమామలు, ఇతర బంధువులు లాక్కొచ్చి మరీ చితిపై పడవేశారు. ఈ దుర్మార్గాన్ని కొందరు సతికి సహకరించటంగా వర్ణించి సమర్ధించారు.దీన్ని సమర్ధించటంలోనూ, అనుకూలంగా ప్రదర్శనలు, ఆందోళనలు చేయటంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వంటి మతోన్మాద సంస్ధలు ముందున్నాయని మరచిపోకూడదు.( సాంప్రదాయం ఇతరులకే గాని తమకు కాదు అన్నట్లుగా ఆ దురాచారాన్ని నిస్సిగ్గుగా సమర్ధించిన బిజెపిలో ఏ ఒక్కరు కూడా సతికి పాల్పడినట్లు మనకు ఎక్కడా వార్తలు కనిపించవు). అది రాజపుత్రుల సాంప్రదాయమని, స్వచ్చందంగానే సతికి పాల్పడతారని ప్రచారం చేశారు. ఈ వుదంతంలో కూడా కాంగ్రెస్‌ అవకాశవాద వైఖరి కనిపించింది. అందుకు పాల్పడిన వారి మీద కేసు నమోదు చేసేందుకు, తీరా నమోదు చేసినా కేసు నిలిచేందుకు వీలుగా వ్యవహరించటంలో విఫలమైంది. కేసులో సాక్షులుగా పేర్కొన్నవారు అడ్డం తిరగటంతో అది వీగిపోయింది. హిందూకోడ్‌ బిల్లును తన కుమార్తె విడాకుల కోసం నెహ్రూ తెచ్చాడని ప్రచారం చేసిన వారి వారసులే, రూపకన్వర్‌ వుదంతంలో నెహ్రూమనవడు, ప్రధానిగా వున్న రాజీవ్‌ గాంధీ పట్ల కూడా అలాగే వ్యవహరించారు. ఒక పార్సీ అయిన ప్రధాని రాజీవ్‌ గాంధీ ఒక విదేశీ మహిళను వివాహం చేసుకొని హిందూ మతాన్ని అవమానిస్తున్నారని భక్తిలాల్‌ అనే రాజస్ధాన్‌ మాజీ ఎంపీ ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. తరువాత సతి నిరోధక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు బిజెపి దానిని వ్యతిరేకించింది. సతి రాజపుత్రుల సంప్రదాయమని దానిని విధిగా రక్షించాలని వాదించింది.

శబరిమల ఆలయ పవిత్రతను రక్షించాలని కోరే వారిలో ఆధునిక ఛాందసవాద మహిళలేమీ తక్కువ తినలేదు. రెడీ టు వెయిట్‌ అంటే తమకు ఆలయ సందర్శన అర్హత వచ్చేవరకు(50నిండేవరకు) వేచి చూస్తాం అనే వారికి ఒక మనవి, ఒక సవినయ ప్రశ్న. ఆలయ సందర్శన మీ ఇష్టం, వెళ్లే వారిని అడ్డుకోవద్దు అని చెప్పటం తప్ప మిమ్మల్ని దేవాలయ ప్రవేశానికి బలవంతం చేసేవారెవరూ లేరు. ఇక్కడ తర్కంతో ఆలోచిస్తే ఈ నినాదం ఇచ్చేవారు ఇబ్బందుల్లో పడతారు. సాంప్రదాయాలను కాపాడాలి, పాటించాలి, అమలు జరపాలి అనే వారు ఒక్క శబరిమల ఆలయానికే పరిమితమా లేక ఇతర సాంప్రదాయాలన్నింటి విషయంలో అదే వైఖరిని కలిగి వుంటారా? సతి కూడా సాంప్రదాయమే దాని పరిరక్షించాలి, అనుమతించాలని రెడీ టు వెయిట్‌ పూర్వీకులు గతంలో ప్రదర్శనలు చేసిన విషయాన్ని వారు గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ఈ విషయంలో రెడీ టు సతి బర్న్‌ (సతి చితిమంటలకు సిద్ధం) అని పిలుపిస్తారా? బహుభార్యాత్వం కూడా మన సాంప్రదాయంలో భాగమే, అందుకు కూడా సిద్దపడతారా ? పురాణ పురుషుడు కౌశికుడికి వేశ్యకొంపల వెంట తిరిగే అలవాటుంది.కుష్టువ్యాధి సోకినా ఆ బుద్ది పోలేదు, ఏకంగా భార్యనే వారి వద్దకు తీసుకుపొమ్మని చెప్పిన అంశం తెలిసిందే. తెల్లవారే సరికి మరణించాలని దారిలో మాండవ్యముని శాపానికి గురైన భర్తను రక్షించుకొనేందుకు కౌశికుడి భార్య తన ప్రాతివ్రత్యంతో సూర్యోదయాన్నే నిలిపివేయించిందట. అంత చేయకపోయినా సాంప్రదాయాలను పాటించాలి, వాటికి కట్టుబడివుండాలని చెబుతున్నవారు కౌశికుడి భార్య బాటలో నడచి భర్తలను వేశ్య కొంపల వెంట తిప్పుతారా? సూర్యోదయాన్ని ఆపలేకపోయినా కనీసం పోలీసు అరెస్టులనైనా అడ్డుకుంటారా? వుద్రేకం వివేచనను లేకుండా చేస్తుంది, అవి వేరు ఇవి వేరు అని అవకాశవాదంతో మాట్లాడకండి. ఇలాంటి వాటిని అడ్డుకుంటే తిరోగామి శక్తులు వదలి వేసిన పనికి మాలిన సాంప్రదాయాలకు ఘనత ముసుగు తొడిగి స్త్రీలను తిరిగి వెనుకటి స్ధితిలోకి నెట్టినా ఆశ్చర్య పడనవసరం లేదు. నిదానంగా ఆలోచించండి !