ఎం కోటేశ్వరరావు
భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 125 ప్రకారం విడాకుల తరువాత ముస్లిం మహిళలు భర్త నుంచి భరణం పొందేందుకు అర్హులే అని సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు నిచ్చింది. ఇది తమ మత సాంప్రదాయాలు, వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ తీర్పును వమ్ము చేస్తూ కాంగ్రెస్ సర్కార్ ఏకంగా ఒక బిల్లునే పార్లమెంట్‌లో ఆమోదించింది. ఆ చర్యను వ్యతిరేకించిన బిజెపి అది ముస్లింల సంతుష్టీకరణ, ఓట్ల రాజకీయం అని విమర్శించింది. కానీ అదే పార్టీ నేడు ఇప్పటి వరకు ఆ డిమాండ్ చేయలేదుగానీ దాన్ని మద్దతు దారులు అదే డిమాండ్ చేస్తున్నారు. తీర్పును పునర్విచారణ జరపాలని బిజెపి కోరుతున్నది. గమనించాల్సిందేమిటంటే శని శింగనాపూర్ దేవాలయంలో అసలు మొత్తంగా మహిళలకు ప్రవేశం లేదు. అది చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారణ చేయాలని బిజెపి లేదా మహిళామోర్చా, ఇతర సంఘాలు గానీ డిమాండ్ చేయలేదు. పండలం మాజీ రాజకుటుంబం వారు షాబానో కేసు మాదిరి నరేంద్రమోడీ సర్కార్ కూడా శబరిమల తీర్పును రద్దు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి ఇంతవరకు బిజెపి లేదా కేంద్రం నోరెత్తలేదు. నెపాన్ని సిపిఎం మీద నెట్టాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలను పట్టించుకోవటం లేదని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి చెబుతున్నాయి. కమ్యూనిస్టులు కనుక వారి వైఖరి వారికి వుంటుంది. కానీ ఆర్‌ఎస్‌ఎస్ కొద్ది సంవత్సరాల క్రితం శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశించే అవకాశం ఇవ్వాలని కోరినపుడు భక్తులు గుర్తురాలేదా? ఎందుకీ అవకాశం వాదం, రెండు నాల్కల ధోరణి? కాంగ్రెస్ మైనారిటీ ముస్లిం ఛాందసవాదులను సంతృప్తి పరచేందుకు ప్రయత్నిస్తే నేడు బిజెపి మెజారిటీ హిందువుల ఓట్ల కోసం ఛాందసులను తృప్తి పరచేందుకు పూనుకుంది. కోర్టు తీర్పు అమలు గురించి చర్చించేందుకు రావాలని ఆలయ ప్రధాన పూజారి, ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. తీర్పుపై పునర్విచారణకు ప్రభుత్వం నిర్ణయించకుండా తాము చర్చలకు వచ్చేదని వారి ప్రతినిధులు ప్రకటించారు.
నాడు హిందూ కోడ్ బిల్లు ద్వారా హిందూ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆర్‌ఎస్‌ఎస్ వాదించిన విషయం ముందే చెప్పుకున్నాము. అదే సంస్ధ సృష్టి అయిన బిజెపి జమ్మూకాశ్మీర్‌లో మహిళల వారసత్వహక్కు విషయంలో వివక్ష చూపుతున్నారని మొసలి కన్నీరు కార్చుతున్నది. అసలు లక్ష్యం దానికి ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370కి ఎసరు తేవటం. ఇదే బిజెపి వుమ్మడి పౌరస్మృతి గురించి చెబుతుంది. దీని వెనుక ముస్లిం, క్రిస్టియన్ వ్యతిరేకత వుంది. ఒక వైపు ముస్లింలు, క్రైస్తవులు ఎలాంటి కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లలను ఎక్కువ మందిని కంటూ హిందూ జనాభాను మైనారిటీగా చేసేందుకు కుట్రపన్నారని చెబుతారు, మరోవైపు బిజెపిలోని నోటి తుత్తర గాళ్లు, పెండ్లీ పెటాకులు లేని సన్యాసులు, సన్యాసినులు హిందూ మహిళలు కుటుంబ నియంత్రణను పక్కన పెట్టి ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతారు.
లవ్‌జీహాద్ పేరుతో హిందూ యువతులు ఇతర మతాలకు చెందిన వారిని వివాహం చేసుకోకుండా చూసేందుకు సంఘపరివార్ సంస్ధలు నిరంతర ప్రచారం చేస్తున్నాయి. మత వుద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. వాలెంటైన్స్ డే రోజున వారంతా బృందాలుగా పార్కుల వెంట తిరుగుతూ కనిపించిన యువతీ యువకులను కొట్టటం, వివాహం చేసుకోమని బలవంత పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నిచ్చెన మెట్ల వంటి మన కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న అమ్మాయి ఎవరైనా కింది మెట్టులో వున్న అబ్బాయిని వివాహం చేసుకుంటే యువకులను హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అలాంటి చర్యలను సామాజిక మాధ్య మాల్లో నిస్సిగ్గుగా సమర్ధించేవారంతా పై తరగతికి చెందిన వారే అన్నది అందరికీ తెలిసిన నిజం. అనేక మంది బిజెపి అగ్రనేతల కుమార్తెలు, బంధువులు ముస్లింలను వివాహాలు చేసుకున్నారు. అది మాత్రం ఇలాంటి బాపతుకు లవ్ జీహాద్‌గా కనిపించదు. సుబ్రమణ్యస్వామి కుమార్తె సుహాసిని మాజీ అధికారి సల్మాన్ హైదర్ కుమారుడు నదీమ్‌ను, బిజెపినేతలు సికిందర్ భక్త్, షా నవాజ్ ఖాన్, ముక్తార్ అబ్బాస్ నక్వీ హిందూ యువతులను వివాహం చేసుకున్నారు. ఎల్‌కె అద్వానీ మేనకోడలు ఒక ముస్లింను వివాహం చేసుకుంది. సామాన్యులనే సమిధలుగా చేస్తున్నారు. మతకొట్లాటలను రెచ్చగొట్టేందుకు అలాంటి వుదంతాలను వినియోగించుకుంటున్నారు.
ఆమోదంతో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీని మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఎనిమిదేండ్ల పాటు ఈ కేసు నడిచింది. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న యోగి ఆదిత్యనాధ్ 2013లో బిజెపి పార్లమెంట్ సభ్యుడిగా వుండి ఏం మాట్లాడారో చూడండి. ‘ సామాజిక నీతికి స్వలింగ సంపర్కం ప్రమాదకరం, సామాజిక కట్టుబాట్లు, సరిహద్దులను చెరిపివేస్తే ఆ తరువాత మనిషి జంతువుకు తేడా వుండదు. చౌకబారు కుతర్కంతో మత గ్రంధాలకు వీటిని జత చేయటం పూర్తి అనైతికం, ఇంట్లో చేసే వాటిని నాలుగు రోడ్ల కూడలిలో చేస్తామని ఎవరైనా అంటే దాన్ని సమాజం అంగీకరించకూడదు. దానికి ఏవిధమైన రాజ్యాంగ బద్దత కూడా వుండకూడదు’ అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షం వున్న కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ 2011లో కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ ‘ దురదృష్టం కొదీ ఎయిడ్స్ వ్యాధి ప్రపంచానికి మన దేశానికి వచ్చింది. ఒక పురుషుడు మరొక పురుషుడితో కలిస్తే ఇది వస్తుంది. ఇది పూర్తిగా అసహజమైనది, జరగకూడనిది, కానీ జరుగుతోంది. బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి మరొక అడుగు ముందుకు వేసి 2013లో మాట్లాడుతూ స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేస్తే అది లాభదాయకంగా మారి అన్ని పట్టణాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో స్వలంగ సంపర్క బార్లను తెరవటానికి దారి తీస్తుంది’ అన్నారు. ఇప్పటికి ఎన్ని బార్లు తెరిచారో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తిరుగుతున్న నరేంద్రమోడీ సర్కార్ మనకు చెప్పాలి. ఇక ప్రతిదాన్నీ తన కంపెనీ లాభాల కోసం వినియోగించుకుంటున్న యోగా గురు బాబారామ్ దేవ్ ఈ అంశాన్ని కూడా వదల లేదు. స్వలింగ సంపర్కులు తన యోగాశ్రమానికి వస్తే దీనికి గ్యారంటీగా చికిత్స చేస్తామని చెప్పాడు. ఇది సాధారణంగా, సహజంగా మానవ మాత్రులెవరూ చేయకూడనిది అని టీవీల్లో బోధలు చేసే ముస్లిం పండితుడు జకీర్ నాయక్ చెప్పారు.
శబరి మల తీర్పుపై పునర్విచారణ పిటీషన్ వేయాలన్న డిమాండుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నదని ముస్లింలీగ్ జాతీయ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి ప్రకటించారు.భక్తుల మనోభావాలను గౌరవిస్తున్న కారణంగానే ఆలయపవిత్రతను కాపాడాలని యుడిఎఫ్ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు.కోర్టు తీర్పు కంటే భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వైఖరి వల్లనే అలజడి తలెత్తింది. నేడు ఇది శబరిమల విషయంలో జరిగింది రేపు దీని ప్రభావం ఇతర విశ్వాసాల మీద కూడా పడవచ్చు అన్నారు. శబరిమల తీర్పు అమలు హేతువాదులకు,నాస్తికులకు ఒక సమస్యగాకపోవచ్చుగానీ కోట్లాది భక్తులకు ఇది ప్రధాన సమస్య. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పునర్విచారణ పిటీషన్ దాఖలు చేయవచ్చు. మసీదుల్లో మహిళల ప్రవేశం గురించి కొన్ని ముస్లిం సంస్ధలు అనుమతించాలని కోరుతుండగా మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.
భక్తుల విశ్వాసాలను గౌరవించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మహిళలను వీధుల్లోకి సమీకరిస్తున్నాయి. తొలుత కోర్టు తీర్పుకు అనుకూలంగా మాట్లాడిన ఆ సంస్ధ వెంటనే ప్లేటు ఫిరాయించింది. సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ భక్తుల మనోభావాలను విస్మరించకూడదని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి సన్నాయి నొక్కులు నొక్కారు. సమీక్ష పిటీషన్ వేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇది జరిగిన మరుసటి రోజు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి నడిపే జన్మభూమి దినపత్రికలో జోషి ప్రకటన తరువాత ఆర్‌ఎస్‌ఎస్ మేధావి, భారతీయ విచార కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ అయిన ఆర్ సంజయన్ రాసిన ఒక వ్యాసంలో కోర్టు తీర్పును సమర్ధించటం గమనించాల్సిన అంశం. వున్నత న్యాయ స్ధానం తీర్పు ఆలయ మౌలిక సాంప్రదాయాలు, క్రతువులను ఏ విధంగానూ మార్పు చేయదని, వాస్తవానికి మరింత మంది మహిళా భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తే దాని ప్రాధాన్యత, ప్రజాదరణ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. పది-యాభై సంవత్సరాల మధ్య వయస్సున్న వారి మీద వున్న ఆంక్షలను మాత్రమే కోర్టు కొట్టివేసింది. అటువంటి సాంప్రదాయాలు సక్రమం అని నిరూపించటానికి తర్కబద్దంగా లేదా తగిన శాస్త్రీయ పద్దతులు కూడా లేవని స్పష్టం చేశారు. ఆలయ అధికారుల సహాయంతో గతంలో అన్న ప్రాసన కార్యక్రమాలు కూడా జరిగాయని, పిల్లలను కనే వయస్సులో వున్న మహిళ ప్రవేశంపై ఆంక్షలు విధించాలని 1991లోనే కేరళ హైకోర్టు ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. దేవాలయాన్ని సందర్శించాలా లేదా అనే, ఎప్పుడు ఆ పని చేయాలి అనే అంశాలను నిర్ణయించుకొనే స్వేచ్చ మహిళలకే వదలి వేయాలి.వారికి నిర్ణయించుకొనే సామర్ధ్యం వుంది, పితృస్వామ్య రోజులు అంతరించాయని ప్రతి ఒక్కరూ గుర్తించటం అవసరం అని కూడా పేర్కొన్నారు. తిరువనంతపురం లోని భారతీయ విచార కేంద్రం డైరెక్టర్, ఆర్‌ఎస్‌ఎస్ నేత అయిన పి పరమేశ్వరన్ 2006నవంబరులో త్రిసూర్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మహిళలు దేవాలయ సందర్శనను కోరుకుంటే వారిని అనుమతించాలి, అనుమతించకపోవటానికి ఎలాంటి కారణం లేదు అన్నారు.
మహిళలు కొండమీద వున్న ఆలయాన్ని చేరుకొనేందుకు ఎక్కలేరు, మహిళా కార్యకర్తలు తప్ప మూమూలు నిజమైన భక్త మహిళలెవరూ ఆలయాన్ని సందర్శించరు అనేవారు కొందరు. రెడీ టు వెయిట్ అంటే మాకు ఆలయ ప్రవేశ అర్హత వచ్చేంత వరకు వేచి చూస్తాం అనే నినాదంతో కొందరు మహిళలు ప్రచారం చేస్తున్నారు. మహిళలు అంత ఎత్తు ఎక్కలేరు, గంటల తరబడి వేచి వుండలేరు అని చెప్పే మహానుభావులారా అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న వారు అయ్యప్ప ఆలయానికి వెళ్లలేరా? వెళ్లాలా లేదా అనేది ఎవరిష్టం వారిది. వివక్ష కూడదన్నది సహజన్యాయం తప్ప బలవంతంగా వారిని గుళ్ల చుట్టూ తిప్పాలని ఏ కోర్టూ చెప్పలేదు, చెప్పదు. బస్సుల సౌకర్యం లేనపుడు ఏడుకొండలు ఎక్కి తిరుమలలో వెంకటేశ్వరుడిని మహిళలు దర్శించలేదా? ఇప్పుడు నడకదారిలో వెళుతున్నవారు లేరా ? శక్తి వున్న వారు నడుస్తారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశ అర్హత వున్న పదేండ్ల లోపు వారు, యాభై ఏండ్ల పైబడిన వారు నడవగలరని ఎవరైనా చెప్పగలరా? ఇక మహిళా కార్యకర్తలు మాత్రమే ఆలయాన్ని సందర్శిస్తారని వుక్రోషంతో చెబుతున్నమాట తప్ప మరొకటి కాదు, ఆ మాట చెప్పిన ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పద్మకుమార్ మహిళలకు సౌకర్యం కోసం వంద ఎకరాల స్ధలం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేయటం అవసరం. ఆసక్తి వున్న వారికి అవకాశం కల్పించమని అడగటం తప్ప ఆంక్షలను వ్యతిరేకించే కమ్యూనిస్టు పురుషులు, మహిళా కార్యకర్తలెవరూ అయ్యప్పమాల వేసుకొని దర్శనాలు గతంలో చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యరు.
శబరిమల తీర్పును ఆలిండియా కాంగ్రెస్ స్వాగతిస్తే కేరళ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితల మాత్రం అతని కంటే ఘనుడు ఆచంటమల్లన అన్నట్లు బిజెపి కంటే రెండాకులు ఎక్కువ చదివాడు. విశ్వాసం కంటే హేతుబద్దత పైచేయిగా వుండకూడదు అనటాన్ని నేను సమర్ధిస్తాను, తప్పుడు వాదాల ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తున్నది, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం, దేవస్ధానం బోర్డు భిన్నవైఖరులు తీసుకున్నాయి, తీర్పు పునర్విచారణ కోరాలి అని చెన్నితల వ్యాఖ్యానించారు. కోర్టు విచారణ ఒక రోజు ప్రారంభమై మరుసటి రోజుకు ముగియలేదు. సంవత్సరాల పాటు సాగింది, అదేమీ రహస్యంగా జరగలేదు, ఒక పక్షం తప్పుడు వాదాలు చేస్తే రెండవ పక్షం ఏమిచేసినట్లు? కోర్టు అంత గుడ్డిగా తీర్పు ఇచ్చినట్లా ? ప్రజాస్వామ్యంలో కోర్టు తీర్పు మీద అప్పీలు చేయవచ్చు.
ఎవరైనా ఒక వివాదంలో తనకు న్యాయం జరగలేదనుకున్నపుడు, తన వాదనను సరిగా పట్టించుకోలేదని భావించినపుడు కోర్టు తీర్పు మీద అప్పీలు చేసుకొనేందుకు, పునర్విచారణ కోరేందుకు అవకాశం, హక్కు వుంటుంది. శబరిమల కేసులో మహిళల ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు వుండరాదన్నది ఎల్‌డిఎఫ్ వైఖరి, దాన్నే కోర్టుకు సమర్పించింది, దానికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చింది. అందుకే అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తన వైఖరికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చినందున పునర్విచారణ కోరటం అనే సమస్య ప్రభుత్వం ముందు వుండదు. అయినా సరే కోరకపోవటం తప్పని సిపిఎం వ్యతిరేకులు దాడి చేస్తున్నారు. ప్రజలకు ప్రధాన శత్రువుగా ఏ పార్టీ వుంది, ఏ అంశం ముప్పు కలిగిస్తుంది అని ఎంచుకోవటం, దానికి అనుగుణ్యంగా ఎత్తుగడలు నిర్ణయించుకోవటం గురించి సిపిఎం తీసుకున్న నిర్ణయాలతో ఎవరైనా ఏకీభవించకపోవచ్చు, మంచి చెడ్డలను విమర్శించవచ్చు. అయితే సామాజిక విషయాల్లో ఇంతవరకు ఓట్లకోసమో, మరొకదాని కోసమో గతంలో ప్రకటించిన తన సూత్రబద్ద వైఖరులను నవీకరించుకుందేమోగాని ఒకసారి నిర్ణయించుకున్న తరువాత దానికి విరుద్దంగా మార్చుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు అనే అంశంలో దాని రాజకీయ వ్యతిరేకులు కూడా ఏకీభవించకతప్పదు. శబరిమల ఆలయ విషయంలో కూడా అదే రుజువైంది. విఎస్ అచ్యుతానందన్ ముఖ్య మంత్రిగా వుండగా ఇచ్చిన అఫిడవిట్‌లో ఆంక్షలను వ్యతిరేకించింది. తరువాత అధికారానికి వచ్చిన యుడిఎఫ్ దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టుకు మరొక అఫిడవిట్‌ను సమర్పించింది. ఐదేండ్ల తరువాత తిరిగి అధికారానికి వచ్చిన సిపిఎం తన పూర్వపు వైఖరినే కోర్టులో పునరుద్ఘాటించింది.
మాటతప్పదు, మడమ తిప్పదు అని ఎంతో మంది నమ్మే ఆర్‌ఎస్‌ఎస్ శబరిమల విషయంలో అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి ఇప్పుడు రెండు నాలికలతో మాట్లాడారు.దీని వెనుక వున్న కారణాన్ని తరువాత చెప్పుకుందాం. రెండు సంవత్సరాల క్రితం ఆలయ ప్రవేశం గురించి ఆర్‌ఎస్‌ఎస్ ఏం చెప్పిందో చూద్దాం. ‘ కొన్ని ప్రాంతాలలో కొన్ని అనుచిత సాంప్రదాయాల కారణంగా ఆలయ ప్రవేశం సమస్యపై ఏకాభిప్రాయం లేదు. ఎక్కడైతే అటువంటి సమస్యలు ముందుకు వచ్చాయో, తగిన చర్చల ద్వారా అలాంటి ఆలోచనా వైఖరిని మార్చేందుకు ప్రయత్నించాలి.సమాజ హితానికి వ్యతిరేకులైన కొందరు గత కొద్ది రోజులుగా మహిళల ఆలయ ప్రవేశంపై మింగుడు పడని వివాదాన్ని లేవనెత్తుతున్నారు. మత, ఆధ్యాత్మిక వ్యవహారాలు, ఆరాధన, విశ్వాసాల వంటి విషయాలలో స్త్రీ పురుషులు సహజంగానే సమాన భాగస్వాములు అనే ఒక వున్నత సాంప్రదాయాన్ని గతం నుంచీ పాటిస్తున్నాము. మహిళలు వేదాలు నేర్చుకుంటున్నారు, సహజపద్దతుల్లోనే వారు ఆలయ పూజారులుగా కూడా పని చేస్తున్నారు ‘ 2016 మార్చి రెండవ వారంలో రాజస్ధాన్‌లోని నాగౌర్ సమీపంలో జరిగిన మూడు రోజుల ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధుల సభకు సమర్పించిన నివేదికలో సురేష్ భయ్యాజీ ఈ మాటలు చెప్పినట్లు డక్కర్ హెరాల్డ్ పత్రిక వెల్లడించింది. శబరిమల ఆలయంలో కొన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశ నిషిద్ధం వెయ్యి సంవత్సరాల నాటి ఆచారం అని చెప్పినా అర్ధం లేదు, పురుషులకు ఏ పరిమితులు విధించారో మహిళందరికీ అవే వుండాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరుతోందని కూడా సురేష్ చెప్పారు. నాడు కేరళలో అధికారంలో వున్న కాంగ్రెస్ మహిళల ప్రవేశానికి వ్యతిరేకం. అదే సమయంలో మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం గురించి వివాదం నడుస్తున్నది. ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్‌లో ఒక వ్యాసం వచ్చింది, అంతకు ముందు అదే పత్రిక సంపాదకీయంలో గౌరవ ప్రదమైన చర్చ జరగాలని బోధ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రవేశానికి సుముఖత వ్యక్తం చేయగా మంత్రి పంకజ్ ముండే వంటి వారు వ్యతిరేకించారు.ఈ సమావేశంలోనే నిక్కర్లను విప్పేసి పాంట్లు( పురాణాలు, వేదాలు, ఛాందసవాదుల ప్రకారం నిక్కరు,పాంట్లు మన సంస్కృతి కాదు) వేసుకోవాలని తీర్మానించారు.
ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ, అనుసరించే సంస్ధలు విశ్వాసాలు, నమ్మకాలు, సాంప్రదాయాల మీద కోర్టులు తీర్పు చెప్పజాలవనే వాదనను చాలా కాలంగా ముందుకు తెస్తున్నాయి. కూల్చివేసిన బాబరీ మసీదు స్ధలంలోనే రాముడు పుట్టాడని, అక్కడి రామాలయాన్ని కూల్చి బాబరు కాలంలో మసీదు నిర్మి ంచారని వాదిస్తున్నది. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విశ్వాసాలకు ఆధారాలేమిటని ఎదురుదాడికి దిగుతున్నది. బాబరీ మసీదు స్థల యాజమాన్య హక్కుల గురించి దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు వివాదంలో అది తమకు అనుకూలంగా వస్తే ఈ శక్తులు మిన్నకుంటాయి లేకపోతే తమ విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఆ తీర్పును వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అందుకే శబరిమల, శని సింగనాపూర్ వంటి వాటిని ఆసరా చేసుకొని తమ వాదనలను ముందుకు తెస్తున్నాయి. అందుకు గాను మహిళలను ముందు నిలుపుతున్నాయి.
మత ప్రాతిపదికన జనాన్ని చీల్చి అధికారానికి రావాలన్న మతోన్మాదుల ఎత్తుగడల్లో ప్రార్ధనా స్దలాలను వివాదాస్పదం చేయటం. దానిలో భాగమే రామాలయాన్ని కూల్చివేసి బాబరీ మసీదును కట్టారనటం, వారణాసిలో ఔరంగజేబ్ కాలంలో నిర్మించిన జ్ఞానవాపి మసీదు కాశీవిశ్వనాధుని ఆలయమని వివాదాలను రేపిన విషయం తెలిసినదే. కేరళలో పట్టు సంపాదించేందుకు శబరిమల ఆలయం మీద క్రైస్తవులు కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా దానిలో భాగమే. ఆలయం పరిసర ప్రాంతాలలో క్రైస్తవులు ఎక్కువగా నివశిస్తున్నారు. అయ్యప్ప ఆలయ సమీపంలో పెద్ద చర్చిని నిర్మించి క్రైస్తవ యాత్రా కేంద్రంగా మార్చాలన్న కుట్ర వుందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి కేరళలో క్రైస్తవం ఎన్నో శతాబ్దాల క్రితమే వ్యాపించింది. బ్రాహ్మలతో సహా అనేక నిచ్చెన మెట్ల వ్యవస్ధలో ఎగువున వున్న కులాలవారు ఎప్పుడో క్రైస్తవులుగా మారిపోయారన్నది చరిత్రలో దాగని సత్యం. తెలుగు ప్రాంతాలలో రెడ్డి, కమ్మ క్రైస్తవుల మాదిరి కేరళలో సిరియన్ క్రైస్తవులంటే అగ్రకులాలకు చెందిన వారే. తెలుగు ప్రాంతాలలో మాదిరి తాళిబట్టుతో సహా అనేక హిందూ సంప్రదాయాలను వారు పాటిస్తారు. సిరియన్ క్రిస్టియన్లు అనేక రంగాలలో ప్రముఖులుగా, ధనికులుగా వున్నారు.వారే ఆ ప్రాంతంలో చర్చి నిర్మించతలపెట్టారన్నది ఆరోపణ. బాబరీ మసీదు నిర్మాణంలో రామాలయ నిర్మాణ స్ధంభాలను వుపయోగించారని ఆధారంలేని ప్రచారం చేస్తున్నట్లే శబరిమల ఆలయానికి 20కిలోమీటర్ల దూరంలోని నీలక్కల్ శివాలయంలో రెండువేల సంవత్సరాల నాటి కొయ్య శిలువ బయటపడిందని, దానిని సిరియన్ క్రిస్టియన్ సమూహ ఆద్యుడు సెయింట్ థామస్ స్వయంగా తీసుకువచ్చిన 1983లో ప్రచారంలోకి వచ్చింది. సెయింట్ థామస్ చర్యను సహించని తమిళ బ్రాహ్మడు ఆయనను కత్తితో పొడిచి చంపాడని ప్రచారం చేశారు. దాన్ని నమ్మిన క్రైస్తవులు ఆ ప్రాంతాన్ని సందర్శించటంతో పాటు చర్చి నిర్మాణానికి స్ధలం కావాలని కోరారు. దానికి నిరసనగా బిజెపి నేత, ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా వున్న కుమనం రాజశేఖర్ ఆందోళనకు నాయకత్వం వహించాడు.తరువాత అక్కడకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అటవీ భూమిని కేటాయించారు. నిజానికి రెండువేల సంవత్సరాల నాటి కొయ్య మన దేశవాతావరణ పరిస్ధితులలో చెక్కుచెదరకుండా వుండటం అసాధ్యం. అయితే తరువాత వచ్చిన వార్తల ప్రకారం బాబరీ మసీదు ప్రాంగణంలో దొంగతనంగా రాముడి విగ్రహాన్ని పెట్టినట్లే అక్కడి శివాలయంలో శిలువను పెట్టారని తేలింది.హైదరాబాదులో హుస్సేన్ సాగర్ చెరువుకు హిందూమతశక్తులు వినాయకసాగర్ పేరు పెట్టినట్లుగానే క్రైస్తవమతశక్తులు అయ్యప్ప కొండను సెయింట్ థామస్ కొండగా పిలవటం ప్రారంభించారు.సెయింట్ థామస్ హత్య వాస్తవం కాదని, ఆయన ఇటలీలోని ఓర్టానాలో మరణించాడని వాటికన్ తరువాత వివరణ ఇచ్చింది. నిజానికి సిరియన్ క్రిస్టియన్లు వలస వచ్చిన వారి వారసులు కాదని, స్ధానిక బ్రాహ్మలే మతం మార్చుకున్నారని 1883లోనే ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు. హిందూ మతశక్తులు ఎలా కుట్రలు చేస్తున్నాయో శబరిమల ప్రాంతంలోని క్రైస్తవ మతోన్మాదులు కూడా అలాంటి వాటిలోనే నిమగ్నమయ్యారని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి.