Tags

, , , ,

Image result for Far right  in india cartoons

ఎం కోటేశ్వరరావు

దేశంలో పచ్చి మితవాద శక్తులు చెలరేగిపోవటం ఒకవైపు వాటి భావాజాలానికి విరుద్దంగా కొన్ని పురోగామి తీర్పులను సుప్రీం కోర్టు వెలువరించటం ఒక చిత్రమైన స్ధితి. అధికారంలో వున్న బిజెపి కొన్ని తీర్పుల మీద ఎలాంటి వైఖరులను వెల్లడించటం లేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి శబరిమల వివాదంలో మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ, మహిళలపై ఆంక్షలను కొనసాగించాలన్న న్యాయమూర్తి తీర్పును సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. దానికి వ్యక్తిగత అభిప్రాయమనే షరతు పెట్టారు. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగాó నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఎవరు అడిగారు? బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలు ఒకవైపు సదరు న్యాయమూర్తి తీర్పుతో ఏకీభవిస్తూ, మెజారిటీ బెంచ్‌ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన తరువాత ఆమెనుంచి అంతకు మించి ఎవరైనా ఎలా ఆశించగలరు?

ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ గోడమీద పిల్లి వాటంగా వ్యవహరిస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి సరేసరి. వామపక్షాలు మాత్రమే తమ సూత్రబద్దమైన వైఖరులను స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు పురోగామి శక్తుల కంటే ప్రజాకర్షక నినాదాలతో తిరోగామి భావజాలానిదే పైచేయిగా వున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో దానికి గురయ్యేవారిలో పురుషులతో పాటు మహిళలూ వుంటారు. ఐరోపాలోని అనేక దేశాలలో నయా నాజీలు, ఫాసిస్టులు పెరుగుతున్నారు. మన దేశంలో ఈ భావజాలంతో పనిచేస్తున్న శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేశాయి. మరింతగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాయి. నాజీలు యూదువ్యతిరేకతను రెచ్చగొట్టి ఐరోపాలో మారణహోమం సృష్టిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారు. మన దేశంలో ముస్లింలతో పాటు క్రైస్తవ వ్యతిరేకతను కూడా జోడించారు. ఎందుకిలా జరుగుతోంది. సమగ్రంగా చర్చ, పరిశోధన జరగాల్సి వుంది. ప్రజాకర్షక నినాదాలంటే సంక్షేమ కార్యక్రమాలే కానవసరం లేదు.అసోం, త్రిపురల నుంచి బంగ్లాదేశీయులను ఒకవైపు వెళ్లగొట్టాలంటున్న బిజెపి మరో వైపు గుజరాత్‌లో వుత్తరాది రాష్ట్రాల వారిని వెళ్లగొడుతుంటే అచేతనంగా వుంది.

వస్తు వ్యాపారం చేసే ఒక సాధారణ వ్యాపారి కంటే డబ్బుతో వ్యాపారం చేసే ఒక వడ్డీ వ్యాపారిని చూస్తే సామాన్యులు ఎక్కువగా భయపడతారు. పెట్టుబడిదారీ వ్యవస్దలో సంభవిస్తున్న సంక్షోభాలను అధిగమించటానికి ఒక వైపు ప్రయత్నిస్తూనే రెండోవైపు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదం తీవ్రంగా నిమగ్నమైంది. మొదటి అంశంలో భాగంగా నయా వుదారవాద విధానాలను ముందుకు తెచ్చింది, రెండవ అంశంలో సోషలిస్టు వ్యవస్ద నిర్మాణంలో జరిగిన లోపాలను ఆసరా చేసుకొని, కుట్రలు చేసి ప్రధమ సోషలిస్టు రాజ్యాన్ని, దాని సాయంతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలను కూల్చివేయటంలో జయప్రదమయ్యారు. సాధారణ వడ్డీ వ్యాపారి స్ధానంలో పట్టణాలలో గూండా వడ్డీవ్యాపారుల మాదిరి నయావుదారవాదం కార్మికవర్గం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నది. దాని దెబ్బకు వుదారవాద ముసుగులు వేసుకున్న సోషలిస్టు, లేబర్‌ పార్టీల వంటివి జనం మీద భారాలు మోపటంలో మితవాదుల కంటే తక్కువేమీ కాదని ఈ కాలంలో రుజువు చేసుకున్నాయి. సాంప్రదాయ పార్టీల మీద జనానికి విశ్వాసం పోయింది. మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్ధలో అంతరాలు పెరగటంతో పాటు నయావుదారవాద విధానాలు ఎంత వేగంగా పెట్టుబడిదారుల సంపదలను పెంచుతాయో సంక్షోభాలను కూడా అంతేవేగంగా ముందుకు తెస్తాయని తేలిపోయింది. సోషలిస్టు వ్యవస్ధలకు ప్రత్యామ్నాయం పెట్టుబడిదారీ విధానమే అంటూ చూపిన రంగుల కలలు పాతికేండ్లలో కల్లలయ్యాయి. సోషలిజం, కమ్యూనిజాల మీద చేసిన తప్పుడు ప్రచారం, వాటికి తగిలిన తీవ్రమైన ఎదురుదెబ్బలను చూసిన తరువాత జనానికి తాత్కాలికంగా అయినా ఎటుపోవాలో తెలియని స్ధితి మితవాద శక్తుల పెరుగుదలకు అనువుగా తయారైందని చెప్పవచ్చు. అవి అనేక చోట్ల జనాకర్షక నినాదాలతో ముందుకు వస్తున్నాయి.అసంతృప్తి, ప్రత్యామ్నాయం గురించి అవగాహనలేని, విశ్వాసంలేని యువత ఇటువంటి శక్తుల వెనుక చేరటం గతంలో కూడా జరిగింది. ఈ స్ధితి ఎంతోకాలం వుండదని గత చరిత్ర రుజువు చేసింది.

పచ్చి మిత, తీవ్రవాద భావాలను రాజీకీయాలు, సమాజంలో మరింతగా వ్యాప్తి, అమలు చేసే క్రమంలో వాటిని అందంగా, మహిళీకరణ(ఫెమినైజ్‌కు ఈ పదం దగ్గరగా వుంటుందని ప్రయోగించాను, అంతకంటే మెరుగు, అర్ధవంతమైన పదాన్ని సూచిస్తే స్వీకరిస్తాను) చేయటం కనిపిస్తోంది. మరోసారి యూదులను చూపి ద్వేషం రెచ్చగొట్టే పరిస్ధితులు పునరావృతం అవుతాయా ? ఇప్పటికైతే అలాంటి సూచనలు లేవు. దాని స్ధానంలో ముస్లింలపట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టటం, కొంత మేరకు జనాన్ని తప్పుదారి పట్టించగలిగినట్లు చెప్పవచ్చు. ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోవచ్చుగాని వుగ్రవాదులందరూ ముస్లింలే అనే ఒక ప్రమాదకరవాదన రూపంలో ద్వేషాన్ని పెంచుతున్నారు. ఫ్రెంచి మితవాద రాజకీయ వారసత్వ క్రమంలో మూడవతరానికి చెందిన యువతి మరియం మార్చల్‌ లీపెన్‌. ఆమె తన తాత మారీ లీపెన్‌, పిన్ని మారినే లీపెన్‌ బాటలో ముందుకు వచ్చింది.తాత కంటే పిన్ని ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించింది. ఇరవై మూడు సంవత్సరాలకే పార్లమెంట్‌కు ఎన్నికైన మరియం లీపెన్‌ పుట్టినప్పటి నుంచి మితవాద భావాల వుగ్గుపాలతో పెరిగా నంటూ తన భావాలను మరింత స్పష్టంగా చెబుతోంది. జాతీయవాదం కూడా నాజీజమే. మీరు కనుక జాతీయ ప్రయోజనాలను సమర్ధిస్తే వేదనామయ క్రమాన్ని ప్రారంభించినట్లే, అది యుద్దము, ప్రళయానికి దారి తీస్తుందని అంటోందా అమ్మడు.28ఏండ్ల మార్చెల్‌ లీపెన్‌ పచ్చి ముస్లిం వ్యతిరేకి. ఇస్లామ్‌ను మనం అంతమొందించాలి లేదా అదే మనల్ని పదే పదే చంపుతుంది అని విద్వేషాన్ని వెళ్లగక్కారు. నేషనల్‌ పార్టీలో వున్న వారికి ఈమె ప్రతిరూపం. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రస్తుతం నేషనల్‌ ర్యాలీ పార్టీ నేతగా మారీ లీపెన్‌ పని చేస్తున్నారు. తండ్రి నాయకత్వస్ధానాన్ని ఆమె అందుకున్నారు. ఐరోపా రాజకీయాలలో ఇలాంటి వారసత్వ ధోరణులు ఇటీవలి వరకు లేవు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఈమె తొలి రౌండులో 21.3శాతం ఓట్లు తెచ్చుకొని అంతిమపోటీలో 33.9శాతం తెచ్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

Image result for Far right  in india cartoons

బ్రిటన్‌లో రంగంలోకి వచ్చిన మరొక ముస్లిం వ్యతిరేక సంస్ధ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఇండిపెండెన్స్‌ పార్టీ(యుకెఐపి). ఇది ఐరోపాయూనియన్‌లో బ్రిటన్‌ చేరటాన్ని, వలస కార్మికుల, ముస్లిం వ్యతిరేకపార్టీ. పురుటి సమయంలో ఇచ్చే వేతనాలకు, ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు ధరించేందుకు ఇది వ్యతిరేకం. దీని వత్తిడి కారణంగానే 2016లో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలా లేదా అన్న ప్రజాభిప్రాయ సేకరణ జరపటం, వైదొలగాలని తీర్పు రావటం తెలిసిందే. వలస కార్మికుల రాకను వ్యతిరేకిస్తున్న కారణంగా బ్రిటన్‌ కార్మికవర్గం గణనీయ భాగానికి దీనిపట్ల సానుకూల అభిప్రాయం వుందని వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో ఇదే మూడవ పెద్ద పార్టీ. స్ధానికంగా వున్నవారి కంటే వలస వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారనే అభిప్రాయం యువతలో పెరుగుతున్నది.

అబార్షన్లను వ్యతిరేకించటంతో సహా మహిళపట్ల అనేక తిరోగమన ధోరణులు కలిగిన జిమ్‌ డౌసన్‌ బ్రిటన్‌లో కంటికి కనిపించని పెద్ద మితవాది అని టైమ్స్‌ పత్రిక వర్ణించింది. ఇలాంటి నీచులైన మగవారందరూ ఇస్లాం నుంచి మహిళలను రక్షించేవారుగా తమకు తామే ముందుకు వస్తున్నారని డేనియల్‌ ట్రిల్లింగ్‌ అనే రచయిత ‘క్రూరమైన నీచులు: బ్రిటన్‌లో పచ్చి మితవాదుల పెరుగుదల’అనే తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరంగా వుండే భావజాలాల పట్ల ఆసక్తిని రేకెత్తించటంలో ఇంటర్నెట్‌ కూడా కూడా దోహదం చేస్తోందని, పచ్చి మిత వాద వైఖరులకు యువతగురి అవుతోందని కూడా పేర్కొన్నారు. కుహనా వార్తల యుగంలో అసంఖ్యాక వనరులు ఈ భావాలకు ఆసరా అవుతున్నాయి ప్రత్యేకించి ఈ మితవాదులలో అనేక మంది ప్రధాన స్రవంతి మీడియాను నమ్మటం లేదని ట్రిల్లంగ్‌ పేర్కొన్నారు.

జర్మనీలో ఇటీవల వునికిలోకి వచ్చి గత ఏడాది ఎన్నికలలో 709 స్ధానాలున్న పార్లమెంటులో 94సీట్లతో మూడవ పెద్ద పార్టీగా ఆల్టర్‌నేటివ్‌ ఫర్‌ జర్మనీ(ఎఎఫ్‌డి) అవతరించింది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత 39 సంవత్సరాల ఎలిస్‌ ఎలిజబెత్‌. ఈ పార్టీ ముస్లిం, వలస కార్మికులకు వ్యతిరేకత, ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలని చెబుతుంది.దేశంలోకి ప్రవేశించేవారిని అడ్డుకొనేందుకు అవసరమైతే మారణాయుధాలను వుపయోగించమని అంటోంది. నాజీల అత్యాచారాలను గుర్తు చేసుకోవటం ఆపివేయాలని, వాటి గురించి తక్కువ మాట్లాడాలని కోరుతోంది.

నార్వేలో అధికారంలో వున్న సంకీర్ణ కూటమిలోని ప్రోగ్రెస్‌ పార్టీ మితవాది. దేశాన్నీ ముస్లిమీకరణ చేస్తున్నారని, పోలీసు యూనిఫాంలో హిజబ్‌ ధరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించే ఈమె ఇజ్రాయెల్‌ను పచ్చిగా సమర్ధిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇలా అనేక దేశాలలో వున్న ఇలాంటి మహిళల ద్వేషపూరిత వైఖరి, మాటలకు మన దేశంలో సాధ్వుల మని చెప్పుకుంటూ నోరుపారవేసుకొనే వారికి పెద్ద తేడా లేదు. మచ్చుకు ఢిల్లీని పాలించేందుకు రాముడి అంశలో పుట్టిన వారు కావాలో లంజలకు పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని సాధ్వి నిరంజన జ్యోతి గత ఎన్నికలలో ప్రసంగాలు చేసిన విషయం తెలిసినదే.ఈమె నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇక యోగులుగా చెప్పుకొనేవారి గురించి చెప్పనే అవసరం లేదు. చిత్రం ఏమిటంటే వీరందరూ బిజెపి మద్దతుదారులు, నేతలే కావటం విశేషం. ఏ విత్తనం వేస్తే ఆ కాయలే కాస్తాయి మరి.

మన దేశంలో పచ్చి మితవాద శక్తులతో నిండిన ఆర్‌ఎస్‌ఎస్‌, అది ఏర్పాటు చేసిన సంఘాల నాయకులు అనేక సందర్భాలలో తమ తిరోగామి భావాలను ఎలాంటి శషభిషలు లేకుండా వెల్లడిస్తూనే వున్నారు. అయినా అనేక మంది విద్యావంతులైన మహిళలు ఇలాంటి శక్తులను అనుసరిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలకు ప్రవేశం లేదనే విషయం వేరే చెప్పనవసరం లేదు. ఎందుకు లేదో చెప్పరు. 2013 జనవరి ఆరున పిటిఐ ఒక వార్తను అందించింది.ఇండోర్‌ పట్టణంలో జరిగిన ఒక సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన వుపన్యాసంలోని అంశాలు ఇలా వున్నాయి.’ భర్త మరియు భార్య మధ్య ఒక ఒప్పందం వుంటుంది. దాని ప్రకారం నువ్వు నా ఇంటిని జాగ్రత్తగా చూడు, నేను నీ అవసరాలన్నింటినీ తీరుస్తాను, నిన్ను సురక్షితంగా వుంచుతాను అని భర్త చెబుతాడు. కాబట్టి భార్య ఒప్పందానికి అనుగుణ్యంగా వున్నంత వరకు భర్త కాంట్రాక్టు నిబంధనలను అనుసరిస్తాడు, భార్యతో వుంటాడు. భార్య ఒప్పందాన్ని వుల్లంఘిస్తే అతను ఆమెను వదిలించుకోవచ్చు ‘. ఈ వుపన్యాసం గురించి సిపిఎం నాయకురాలు బృందాకరత్‌ స్పందిస్తూ ‘ఇలా మాట్లాడటం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు అంతిమంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఇదే. అందుకే దీనిని రాష్ట్రీయ తిరోగమన సంఘ్‌ అని నేనంటాను. అధికారంలో వున్న బిజెపి పెద్దలు మనుస్మృతి ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఆయనిలాంటి భాషలో మాట్లాడారంటే తన భావజాలాన్ని ప్రతిబింబించినట్లే ‘ అన్నారు.

అంతకు ముందు అసోంలోని సిల్చార్‌లో మాట్లాడుతూ పశ్చిమ దేశాల ప్రభావం కారణంగా ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోనే మానభంగాలు జరుగుతున్నాయి, దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో జరగవు అని ఇదే భగవత్‌ గారు సెలవిచ్చారని కూడా పిటిఐ వార్తలో పేర్కొన్నది.’దేశ పట్టణ ప్రాంతాలలో మహిళలపై నేరాలు జరగటం సిగ్గు చేటు, ఇది ప్రమాదకర ధోరణి. అయిటే అటువంటి నేరాలు ‘భారత్‌ లేదా దేశ గ్రామీణ ప్రాంతాలలో జరగవు. మీరు గ్రామీణ ప్రాంతాలు లేదా అడవులకు వెళ్లండి అక్కడ సామూహిక మానభంగాలు లేదా లైంగిక పరమైన నేరాలు వుండవు. పశ్చిమ దేశాల సంస్కృతి ప్రభావంతో భారత్‌ ఎప్పుడు ఇండియాగా మారిందో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నారు. సమాజంలోని ప్రతి దొంతరలో నిజమైన భారతీయ విలువలు మరియు సంస్కృతిని చొప్పించాలి, అక్కడ మహిళను తల్లిగా చూస్తారు’ అన్నారు. భగవత్‌కు భారత్‌ గురించిగానీ ఇండియా గురించీ తెలియదు, ప్రభుత్వ లెక్కల ప్ర కారం గరిష్టంగా జరుగుతున్న అత్యాచారాలు పేదలు, దళితులు, గిరిజనుల మీదే అని బృందాకరత్‌ వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాపితంగా సామాజిక మీడియాలో మితవాద శక్తులు పెరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా వంటి చోట్ల మితవాదానికి శ్వేతజాతి జాతీయవాదం తోడవుతున్నది. మన దేశంలో హిందూత్వ జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నారు. దీనికి కులదురహంకారం, వెనుకబడిన తరగతులు, షెడ్యూలు కులాల పట్ల ద్వేషం తోడవుతున్నదని ఇటీవల జరిగిన ప్రణయ్‌ హత్యతో సహా అనేక వుదంతాలు వెల్లడించాయి. అనేక మంది యువతులు ఫేస్‌బుక్‌లో వీడియోలను పెట్టి తిరోగమన భావాలను వెల్లడించటం కొత్త పరిణామం. సమాజంలోని వున్నత తరగతులకు చెందిన మహిళలు పచ్చి మితవాద శక్తులు, వారు జరిపే ఆందోళనలవైపు మొగ్గటం గతంలో కూడా వున్నది ఇటీవలి కాలంలో పెరగటం గమనించాల్సిన అంశం. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు పచ్చిమితవాదులను మహిళా రక్షకులుగా అంగీకరించటం తప్ప ఇది వేరు కాదు. తమను యాజమాన్యాలకు అమ్మివేసే తొత్తులను కార్మికులు నమ్మినాయకత్వ స్ధానాలలో కూర్చో పెట్టటాన్ని చూస్తున్నాం. అలాంటిదే ఇది, గుండెలు బాదుకొని ఆందోళన చెందినందువలన ప్రయోజనం లేదు.