Tags

, , , ,

Image result for illogical and inconsistent arguments in social media on  Sabarimala verdict

ఎం కోటేశ్వరరావు

ఏ మతం వారి ఆచార వ్యవహారాలలోని మంచి చెడ్డలను ఆ మతాల వారే ప్రశ్నించాలి, అంతేనా మతం పట్ల నమ్మకం వున్న వారే అందుకు అర్హులు, దేవుడు, దేవత, దేవదూత, ప్రవక్త, దేవుని బిడ్డల మీద ప్రశ్నించే వారికి నమ్మకం వుందని రుజువు ఏమిటి? ఒక మతం వారు మరొక మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. సామాజిక మాధ్యమంలో, సాంప్రదాయక మాధ్యమాల్లో వస్తున్న,వేస్తున్న, వేయిస్తున్న ప్రశ్నలివి.ఈ వాదన అక్కడితో ఆగటం లేదు, హిందూ దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై ఆంక్షలు కూడదన్న కోర్టు మసీదుల్లో ప్రవేశాలకు ఆదేశాలు జారీ చేస్తాయా, ముస్లిం మహిళల బురఖాలను తీసివేయిస్తాయా, అన్ని మతాల ఆచార, వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాయా? ఇలా చర్చ సాగుతోంది. ఈ తర్కంలో పరస్పర వైరుధ్యాలు, వుక్రోషం, అవకాశవాదం వున్నాయి.

ఈ క్రమంలో మసీదుల్లో మహిళల ప్రవేశానికి అనుమతించాలని ఆదేశాలివ్వాలంటూ కేరళ హిందూ మహాసభ నేత స్వామి దత్తాత్రేయ శాయి స్వరూపనాధ్‌ ఆ రాష్ట్ర హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్య పిటీషన్‌ను న్యాయమూర్తులు తిరస్కరించారు. తన వాదనకు తగిన ఆధారాలను చూపటంలో విఫలమైన కారణంగా పిటీషన్‌ విచారణ అర్హం కాదని కొట్టి వేశారు. తగిన సాక్ష్యాలతో మరొకరు ఎవరైనా అవసరమైతే అలాంటి కేసులు వేసుకోవచ్చు లేదా ముస్లిం మత పెద్దలు అంతవరకు తెచ్చుకోకుండా మసీదుల్లోకి మహిళలను అనుమతించే వివేచనను అయినా చూపవచ్చు. అయ్యప్ప ఆలయంలో అలాంటి వివక్ష వుందని బలమైన ఆధారాలు, సాక్ష్యాలు వుండబట్టే అయ్యప్ప కేసు విచారణకు నిలిచింది, తీర్పును ప్రకటించాల్సి వచ్చింది. వివక్షను పాటించే వారు తమ వాదనలకు తగిన సాక్ష్యాలను చూపలేకపోయినందున కేసును ఓడిపోయారు.

పైన పేర్కొన్న వాదనలను సామాన్యులు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన మార్కండేయ కట్జూయే ఎలాంటి ఫీజు లేకుండా ఇలాంటి వాదనలు, సుప్రీం కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు పూనుకున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు మీద కట్జూ స్పందించారు.’ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఆ కేసు తీర్పును పునర్విచారణ చేసేందుకు ఏడుగురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేయాలి లేదా దేశమంతటా మసీదుల్లో మహిళల ప్రవేశాన్ని అమలు చేయించాలి. సిద్దాంత రీత్యా మసీదుల్లో మహిళల ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు లేవు, మక్కా, మదీనాల్లో అనుమతిస్తున్నారు, ఇండ్లలో ప్రార్ధనలు చేసుకోవాల్సిన మహిళలను భారత్‌లో ఒకటి రెండు శాతం మసీదుల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. మసీదుల్లో తగినంత స్ధలం లేదన్నది సాధారణంగా సమర్ధనకు చెబుతున్నారు. అదే కారణం అయితే పురుషులకే ప్రాధాన్యత ఎందుకు? మహిళలు మసీదుల్లో పురుషులు బయట ఎందుకు చేయకూడదు. లేదా సగం సగం పద్దతిలో వేర్పాటు చేయాలి. కాబట్టి దీనిలో మీరు దేన్ని ఎంచుకుంటారు ‘ అని ప్రధాన న్యాయమూర్తిని ప్రశ్నించారు. అంతే కాదు, ఎవరైతే మత ఆచారాలను పాటిస్తున్నారో వారికే సమానత్వం గురించి అడిగే హక్కు వుందని, సదరు ఆచారం హేతుబద్దమైనదా కాదా అని నిర్ణయించే అధికారం కోర్టుకు లేదని శబరిమల కేసులో మిగతా నలుగురితో విబేధించిన ఐదవ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా వాదనను కట్జూ సమర్ధించారు.

మనది లౌకిక రాజ్యం. ఏ మతానికి లేదా మత ఆచారాలకు రాజ్యాంగంలోని అంశాల నుంచి మినహాయింపు ఇవ్వలేదు. అలాగని ఏ మత ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అంశాలు కూడా లేవు. అవసరమని భావిస్తే ఏ ప్రజా ప్రయోజన లేదా సంబంధ అంశంపై అయినా కోర్టు స్వయంగా జోక్యం చేసుకోవచ్చు. ఏ రూపంలోనూ ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేందుకు, వివక్ష పాటించేందుకు వీలు లేదు. ఈ పరిమితులకు లోబడే కోర్టులు తీర్పులు చెబుతున్నాయి.భర్త నుంచి మనోవర్తి పొందేందుకు ముస్లిం మహిళలకు హక్కు వుందని షాబానో కేసులో తీర్పు చెప్పిన కోర్టు మూడుసార్లు తలాక్‌ చెబితే విడాకులు చెల్లవని కూడా చెప్పింది.ఈ కేసులను ఇస్లాంను పాటించే ముస్లిం న్యాయమూర్తులే విచారించాలి,న్యాయవాదులే వాదించాలి, ముస్లింలు మాత్రమే కోర్టులో గుమస్తాలుగా వుండాలి అని ఆ మతానికి చెందిన వారితో సహా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. లేదా శబరిమల ఆలయ కేసు విచారణ సమయంలోనూ ఏ వ్యక్తి లేదా ఏ సంస్ధా కేసులో పైన పేర్కొన్న వాదనతో ప్రతివాదులుగా చేరలేదు.

ఇప్పుడు అలాంటి వాదనలు ఎందుకు చేస్తున్నట్లు ? మూలం, పర్యవసానాలు ఏమిటి? అస్థిత్వ భావజాలం. సమాజంలో నిరాదరణకు గురయ్యే మైనారిటీ తరగతులు తమ ప్రయోజనాల పరిరక్షణకు ఈ భావనను ముందుకు తెచ్చారనే అభిప్రాయం వుంది. అది ప్రారంభంలో అభివృద్ధికరంగానే వున్నప్పటికీ ఒక పరిధి దాటిన తరువాత అదే ఆటంకంగా మారటంతో పాటు దోపిడీ వర్గాలు శ్రామిక వర్గాన్ని విభజించి పాలించేందుకు ఆ భావజాలాన్ని పెంచి పోషించాయనే అభిప్రాయం కూడా వుంది. వుదాహరణకు ఇటీవల సిపిఎస్‌(కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. నిజానికి కార్మిక, వుద్యోగ, వుపాధ్యాయ సంఘాలు ఈ అంశం మీద గట్టిగా కేంద్రీకరించి వ్యతిరేకించి వుండాల్సింది, అది జరగలేదు. ఆ పధకం కింద వుద్యోగంలో చేరిన వారికి కూడా ప్రారంభంలో దాని వలన కలిగే హానితెలియలేదు, పట్టించుకోలేదు. ముందు వుద్యోగం చాలనుకున్నారు. ఇప్పుడు వుద్యమంలో పాత పధకంలో వున్నవారు దానికి వ్యతిరేకంగా జరిగే వుద్యమంలో అంతగా ఆసక్తి చూపుతున్నారా అన్నది ప్రశ్న. కాడర్‌ వారీ సంఘాల ఏర్పాటు కూడా ఈ భావజాల పుణ్యమే. ఒక క్యాడర్‌ సమస్య మీద వుద్యమిస్తే మరో కాడర్‌లో స్పందన వుండదు. ప్రారంభంలో ఎలా వున్నప్పటికీ ఇప్పుడు అస్ధిత్వ భావజాలం ఐక్యతకు ఆటంకంగా మారిందనేందుకు ఇలా అనేక దృష్టాంతాలను పేర్కొనవచ్చు. స్ధూలంగా అస్థిత్వ రాజకీయాలుగా నామకరణం జరిగిన ఈ అంశం అన్ని జీవన రంగాల్లో ప్రబలంగా వ్యాపించింది. దళితుల సమస్యల మీద పోరాడాలంటే దళితులే నాయకత్వం వహించాలి, వారికి తెలిసినంతగా వారి సమస్యలు,వేదన ఇతరులకు అర్ధం కాదు. ఇదే తర్కాన్ని మహిళలకు వర్తింప చేశారు.కార్మిక సంఘాలకు కార్మికులే నాయకత్వం వహించాలి, బయటి రాజకీయ నాయకులు, ఇతరులు వుండకూడదు అని కార్మికుల కంటే యజమానులే గట్టిగా చెబుతున్నారు. ఆ మేరకు చట్ట సవరణ కూడా చేయాలనే డిమాండ్‌ ముందుకు తెచ్చారు. ఏ మతంవారి దురాచారాలను ఆ మతం వారే, అందునా వాటిని పాటించే వారే ప్రశ్నించాలి అనే తర్కానికి ఇదే మూలం. ఈ దేశంలో దేవుడు,దేవత, మతం, కులంతో ప్రమేయం లేకుండా జీవించాలని కోరుకొనే స్వేచ్చ, దేనినైనా ప్రశ్నించే హక్కు పౌరులకు వుంది అనే విషయాన్ని కొంత మంది మరచిపోతున్నారు.

ఆచారాలు, అలవాట్లను పాటించేవారే ప్రశ్నించేందుకు అర్హులు అనే వితండవాదానికి తావిస్తే గోవధ నిషేధించాలని డిమాండ్‌ చేసే హక్కు గోమాంసం తినని వారికి, వధించని వారికి ఎక్కడిది? ఆ పనిచేసే వారి నుంచే అది రావాలి కదా ! ఇలాంటి వాదనలు సమాజం యథాతధంగా వుండాలని కోరుకొనే తిరోగమన వాదులకు, మన రాజ్యాంగాన్ని వ్యతిరేకించే లేదా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసే శక్తులకు మాత్రమే సంతోషం కలిగిస్తాయి.మెజారిటీ పౌరులు హిందువులు కనుక హిందూ రాజ్యంగా వుండాలని, వారు చెప్పిందే అమలు జరగాలంటూ మనువాద పున:ప్రతిష్ట చేయాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దాని ప్రకారం మనం మతరాజ్యాల్లోకి మారిపోవాలి, రాజ్యాంగమెందుకు, పార్లమెంట్‌, కోర్టులెందుకు ?

మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని కోర్టులెందుకు జోక్యం చేసుకోవు లేదా అమలు జరిపించవు అనే వాదనను చూద్దాం.మొదటి విషయం మన రాజ్యాంగం న్యాయవ్యవస్ధకు అలాంటి కార్యనిర్వాహక అధికారం ఇవ్వలేదు. మన రాత పూర్వక రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల ప్రకారం న్యాయం జరుగుతున్నదా లేదా తీర్పు చెప్పటానికి, జరగటం లేదని కోర్టుకు స్వయంగా తెలిసినపుడు లేదా భావించినపుడు అమలు జరపాలని ప్రభుత్వాలకు మార్గదర్శనం, రాజ్యాంగ విరుద్దం అయితే ఆదేశాలు ఇస్తాయి. రాజ్యాంగం ప్రకారం నిర్ణీత వయస్సు వచ్చిన యువతీ యువకులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. కానీ రోజూ ఏదో ఒక మూల అలాంటి వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి, వేటాడి చంపుతున్న వుదంతాలు దేనికి సూచిక, అలాగే అంటరాని తనం నేరం, శిక్షార్హం. సమాజంలో అదింకా కొనసాగుతున్నదా లేదా ? ఆ వివక్ష, నేరానికి వ్యతిరేకంగా లేదా తమకు న్యాయం చేయాలని ఎవరైనా కోర్టు తలుపు తడితేనో లేదా ఆ దురాచారం కొనసాగుతున్నతీరు గురించి మీడియా ఇచ్చిన వార్తలను చూసి స్పందిస్తేనో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అంతే తప్ప కోర్టులు ప్రతి ఇంటికి లేదా ప్రతి ప్రార్ధనా స్ధలానికి వెళ్లి అంటరానితనాన్ని పాటిస్తున్నారా లేదా అని చూడవు. మసీదులైనా అంతే. ఎవరైనా తమను ఫలానా మసీదులో ప్రవేశానికి ఆటంకం కలిగిస్తున్నారని కోర్టుకో, పోలీసులకో ఫిర్యాదు చేయకుండా ఆ వ్యవస్ధలు ఎలా స్పందిస్తాయి. మహిళలను మసీదులకు వెళ్లటాన్ని ఎవరు అడ్డగించారు, వెళ్ల వచ్చు అన్నది ఒక వాదన. వెళ్ల వచ్చు నిజమే, వెళ్లటం లేదన్నది వాస్తవం. ఎవరు అడ్డగించారు అని ఎదురు ప్రశ్న వేసే వారే ఎందుకు వెళ్లటం లేదో సమాధానం చెప్పాలి. ప్రతి మతంలోనూ సంస్కరణోద్యమాలు రావాలి, దీనికి ఇస్లాం మినహాయింపు కాదు. మా మతం మా ఇష్టం అంటే కుదరదు.

ముస్లిం మహిళల చేత బురఖాలు తీసేయిస్తారా అన్నదొక ప్రశ్న. కొన్ని దేశాలలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే లేదా వ్యతిరేక చర్యల్లో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు లేదా ప్రతిపాదిస్తున్నారు. వాటిని చూసి ఇక్కడి ముస్లిం వ్యతిరేకులు ఈ అంశాన్ని తలకెత్తుకుంటున్నారు. ఫలాన దుస్తులు వేసుకోవాలి, ఫలానావి వేసుకోకూడదు, ఫలనాది తినకూడదు, ఫలానాదే తినాలి అనే తాలిబాన్ల ఫర్మానాలు కూడా ఇలాంటి వాటి మీద ప్రభావం చూపుతున్నాయి. బురఖా లేదా ముసుగు ధరించేది ఒక్క ముస్లిం మహిళలేనా? పూర్తిగా ముఖాన్ని కప్పి వుంచుతూ హిందువుల్లో అలాంటి వేషధారణ వున్నవారి సంగతేమిటి? వాటికి ఏ పేరు పెట్టినా వారిని కూడా ముసుగులు తొలగించే విధంగా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలా?

ఇంకా మరికొన్ని వాదనలు, అయ్యప్ప బ్రహ్మచారి కనుక వయస్సులో వున్న యువతులు సందర్శిస్తే ఆయన వ్రత భంగం అవుతుంది. హిందూ పురాణాల ప్ర కారం కార్తికేయుడు కూడా బ్రహ్మచారే, ఆయన సోదరుడు వినాయకుడూ, రామ భక్త హనుమంతుడూ బ్రహ్మచారే. వారు కూడా బ్రహ్మచర్యాన్ని నిష్టగా పాటించినట్లు చదివాం తప్ప మినహాయింపులు తీసుకున్నట్లు తెలియదు. వారి దేవాలయ ప్రవేశాలకు ఎలాంటి ఆంక్షలు లేవు. వారి వ్రతానికి మహిళలు ఎలాంటి భంగమూ కలిగించటం లేదు. ఖురాన్‌ ప్రకారం బహిష్టులో వున్న మహిళలు నమాజు చేయటానికి లేదు, దానికి కూడా మనం వ్యతిరేకంగా పోరాడదాం. సుప్రీం కోర్టు దేవుడైతే భక్తుల మనోభావాలను గౌరవించాలి తప్ప సంస్కారం లేని మహిళావాదులను కాదు, ఇంకా ఇలాంటి అనేక వాదనలను ముందుకు తెచ్చారు. వీటన్నింటిని మొత్తంగా బేరేజు వేస్తే కోర్టు తీర్పు హిందూమతానికి వ్యతిరేకంగా ఇచ్చిందనే భావాన్ని కలిగించేందుకు తీవ్ర ప్రయత్నం కనిపిస్తోంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే హిందూయేతర మతాల్లో వున్న వివక్ష లేదా అసంబద్దతలను గుర్తించటానికి, తొలగించటానికి ఈ తీర్పు దోహదం చేస్తుందన్నది పురోగామి వాదుల అభిప్రాయం అని చెప్పవచ్చు.