Tags

, , , , ,

Related image

గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌  ఒప్పందం

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు మరో రెండు వారాలుండగా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యావత్‌ ప్రపంచాన్ని ముఖ్యంగా ఐరోపాను ఆందోళనకు గురిచేసే ప్రకటన చేశాడు. మూడు దశాబ్దాల క్రితం నాటి సోవియట్‌తో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. దీని మీద ఐరోపాలో మొత్తం మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది రష్యా వ్యాఖ్యానించినట్లు బెదిరింపా లేక చెప్పినట్లు నిజంగానే వైదొలుగుతుందా అన్నది చూడాల్సి వుంది. ఐరోపాలో వెల్లడయ్యే స్పందన వ్యతిరేకంగా వుంటే తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఒప్పందం నుంచి వైదొలగటం ఖాయం అని చెప్పవచ్చు. ప్రపంచానికి ట్రంప్‌ పిచ్చివాడనిపించవచ్చుగానీ ఒక పధకం ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా సెనెట్‌్‌ ఆమోదించిన ఒప్పందాలను దాని అనుమతి లేకుండా రద్దు చేసేందుకు లేదా వాటి నుంచి వుపసంహరించుకుంటామని ప్రకటించేందుకు అధ్యక్షుడికి అనుమతి లేదు. అయినా ట్రంప్‌ ప్రకటన తక్షణ ప్రయోజనం ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ విజయం దిశగా పయనిస్తున్నదన్న వార్తల పూర్వరంగంలో అధికారపార్టీ రిపబ్లికన్లకు లబ్ది చేకూర్చటమే. ఎన్నికల్లో లబ్దికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవటం ఒక ఎత్తుగడ కావచ్చుగాని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు మరొక ప్రచ్చన్న యుద్ధానికి తెరలేపేందుకు ఎప్పటి నుంచో చేస్తున్న సన్నాహాలలో భాగమే ఇది. నిజంగానే ఒప్పందం నుంచి వైదొలిగితే ఆ చారిత్రాత్మక ఎదురుదెబ్బకు బాధ్యురాలు అమెరికానే అవుతుంది.

అసలీ ఒప్పందం ఏమిటి ? ఐరోపాలో ఆయుధాల మోహరింపును అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూర్వరంగంలో మధ్య శ్రేణి అణు బలాల ఒప్పందం(ఐఎన్‌ఎఫ్‌) పేరుతో తమ వద్ద వున్న మధ్య,లఘు శ్రేణి క్షిపణులను తొలగించుకొనేందుకు 1987 డిసెంబరు ఎనిమిదిన గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌ మధ్య కాలపరిమితి లేని ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. తరువాత సోవియట్‌ రద్దు కావటంతో దాని వారసురాలిగా రష్యా ఒప్పందంలోకి వచ్చింది. ఆ మేరకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు వున్న లఘు, వెయ్యి నుంచి 5,500 కిలోమీటర్లకు వుండే మధ్య శ్రేణి అణు, సాంప్రదాయ క్షిపణులను రెండు దేశాలు తొలగించాల్సి వుంటుంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలో లేవు. ఒప్పందం ప్రకారం అమెరికా 846 సోవియట్‌ లేదా రష్యా 1,846 క్షిపణులను నాశనం చేశాయి. ఇవి ప్రధానంగా ఐరోపాలో యుద్ధానికి అనువుగా రూపొందించినవి కావటంతో వాటిని తొలగించటం ప్రాంతీయ భద్రతకు ఎంతో ముఖ్యమని ఐరోపా భావించింది.

ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇంతవరకు అమలు వుల్లంఘన గురించి కొన్ని ఫిర్యాదులు రెండువైపుల నుంచీ వున్నప్పటికీ పెద్ద వివాదాలేమీ బయటి ప్రపంచానికి తెలియదు. ఆకస్మికంగా ఈనెల 20న తాము వైదొలగాలనుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటన చేశాడు. ఈ ఒప్పందంతో చైనాకు ఎలాంటి ప్రమేయమూ లేదు, ఏ విధంగానూ భాగస్వామి కాదు. చిత్రం ఏమిటంటే తాము వైదొలగదలచుకుంటే అది అమెరికా తలనొప్పి అనుకోవచ్చు కానీ, ఈ సమస్యలోకి ట్రంప్‌ మహాశయుడు చైనాను లాగాడు.రష్యా మన దగ్గరకు రావాలి, చైనా మన దగ్గరకు రావాలి, అందరూ మన దగ్గరకు రావాలి. అందరం మంచిగా తయారవుదాం మనలో ఎవరమూ ఆ అయుధాలను తయారు చేయవద్దు అని చెబితే తప్ప మనం తయారు చేయాల్సిందే. కానీ రష్యా తయారు చేస్తూ, చైనా తయారు చేస్తూ వుంటే మనం ఒప్పందానికి కట్టుబడివుండాలంటే కుదరదు. రష్యా ఒప్పందానికి కట్టుబడి వుండటం లేదు కాబట్టి మనం కూడా కట్టుబడి వుండనవసరం లేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నాం అని ట్రంప్‌ ప్రకటించాడు. అంటే రష్యాతో ముడి పెట్టి చైనాను కూడా దెబ్బతీయాలనే లక్ష్యం ట్రంప్‌ ప్రకటన వెనుక వుందా ? ముగిసిందని ప్రకటించిన ప్రచ్చన్న యుద్ధాన్ని చైనా మీద ప్రారంభించదలచారా ? అంటే వెలువడుతున్న వ్యాఖ్యానాలను బట్టి అవుననే చెప్పాల్సి వుంది. ట్రంప్‌ ప్రత్యక్షంగా రష్యా, చైనాలను రంగంలోకి తెచ్చేందుకు పూనుకున్నప్పటికీ మరోవైపు ఐరోపా రాజ్యాలను మరింతగా తన అదుపులోకి తెచ్చుకొనే ప్రయత్నం కూడా లేకపోలేదు.

‘ ట్రంప్‌ ప్రచ్చన్న యుద్ధాన్ని పునరుద్ధరించవచ్చు , కానీ చైనా దాని గతిని మార్చగలదు’ అనే శీర్షికతో న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక వ్యాఖ్యానాన్ని ప్రకటించింది. బెదిరింపులు, అణ్వాయుధాలు పాతవయ్యాయి. కొద్ది రోజులుగా ఐరోపా, అమెరికాలో అనేక మంది నూతన ప్రచ్చన్న యుద్ధం ప్రారంభం అవుతున్నదని అనుకుంటున్నారు, నూతన గతులు దానికి తూట్లు పొడుస్తాయి ఎందుకంటే సంపద్వంతమైన, జాతీయవాద చైనా అవతరించిందని సదరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రష్యా, చైనాలతో గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎఎన్‌ఎఫ్‌ ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందని తమ ఎన్నికలు, అంతర్గత వ్యవహారాల్లో రష్యా జోక్యం చేసుకొంటోందని గత రెండు సంవత్సరాలుగా అమెరికా ఒక పధకం ప్రకారం ఆరోపణలు చేస్తోంది. మరోవైపున పెట్టుబడులు, వాణిజ్యం, మేథోసంపత్తి హక్కు చౌర్యం, ఇతర పద్దతుల్లో అమెరికా ప్రజాభిప్రాయాన్ని మలచేందుకు చైనా ప్రయత్నిస్తోందని ట్రంప్‌ అండ్‌కో ప్రచారం చేస్తోంది.దాన్ని అడ్డుకొనే పేరుతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆయుధపోటీకి కాలుదువ్వుతోంది.

1987నాటి రష్యాాఅమెరికా ఆయుధ నియంత్రణ ఒప్పందంలో చైనా లేని కారణంగా అది స్వంత అణ్వాయుధ మరియు అన్ని శ్రేణుల సాంప్రదాయ క్షిపణులను తయారు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని అమెరికా వ్యూహకర్తలు వాదిస్తున్నారు. దాన్నే ట్రంప్‌ వెళ్లగక్కాడు.ఈ ఒప్పందంలో చైనా భాగస్వామి కానప్పటికీ దాని దగ్గర వున్న క్షిపణులలో 95శాతం మధ్యశ్రేణివే అని దక్షిణ కొరియాలో రాయబారిగా పని చేసిన అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ అధిపతి హారీ హారిస్‌ ఒక నివేదికలో ఆరోపించాడు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఐరోపా కేంద్రంగా చేసుకున్నదని అమెరికాాచైనా మిలిటరీ బలాబలాలను పరిగణనలోకి తీసుకోవలేదని, ఆ అంశం ఇటీవలి కాలంలో అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిందని ఇటీవల కొందరు కొత్త వాదనలు లేవనెత్తారు. ఆసియాలో చైనా ఇతర దేశాలను బెదిరించేందుకు గాను సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్ధల కంటే భూతలం నుంచి ప్రయోగించే ఆయుధాల ఖర్చు అమెరికాకు కలసి వస్తుంది. అయితే మిత్రదేశాల అనుమతి లేకుండా చైనా లక్ష్యంగా పసిఫిక్‌ ప్రాంతం నుంచి క్షిపణులను ప్రయోగించే కేంద్రాలు పరిమితంగా వుండటం అమెరికాకు ఒక సమస్య. జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు అటువంటి వ్యవస్ధలను తమ భూభాగంపై నెలకొల్పేందుకు అంగీకరిస్తాయా అన్నది సందేహాస్పదమే. అలా చేయటం అంటే అమెరికా కోసం చైనాతో వైరం తెచ్చిపెట్టుకోవటమే.గత నాలుగు దశాబ్దాలుగా చైనా తన సంస్కరణలు, తన అభివృద్ధి తప్ప ఆయుధపోటీలో వున్నట్లు మనకు కనిపించదు.అలాంటి దానిని వాణిజ్యంలో తన షరతులను రుద్దటంలో విఫలమైన అమెరికా ఇప్పుడు మిలిటరీ రీత్యా ఆయుధపోటీకి దిగి చైనా దృష్టి మళ్లించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అణ్వాయుధాలతో పోల్చితే చైనా ఎంతో వెనుకబడి వుంది, దానికి వాటి అవసరం కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు అమెరికా కవ్వింపులకు దిగుతుండటంతో ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

ఇటీవలి కాలంలో అమెరికా అంతర్జాతీయ వ్యవస్ధ నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నది. వాతావరణ మార్పులు, భూతాపం తదితర అంశాలున్న పారిస్‌ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అణు ఒప్పందం, అంతర్జాతీయ పోస్టల్‌ యూనియన్‌ నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అవన్నీ ఒక ఎత్తయితే ఇది అత్యంత ప్రమాదకర చర్యల, అంతర్జాతీయ భద్రత మీద ఎంతో పభావం చూపనుంది. మొత్తంగా చూసినపుడు ఇటీవలి కాలంలో అనేక ఒప్పందాలను తిరగదోడుతోంది, కొత్తవి కావాలని వత్తిడి తెస్తోంది. అమెరికాకు అగ్రస్ధానం లేదా సింహభాగం రాబట్టుకొనేందుకు పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. తనకేమీ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఇది అమెరికన్లకేగాక యావత్‌ మానవాళికి హానికలిగించే పోకడ అని చెప్పకతప్పదు. ఒక పరిశీలన ప్రకారం చాలా సంవత్సరాలుగా అమెరికా వుపరితల ఆధారిత లఘు, మధ్యశ్రేణి క్షిపణులను అభివృద్ది చేయలేదు. ఇటీవలనే అందుకు నిధులు కేటాయించింది. వుపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులను మోహరించేందుకు ఏ ఐరోపా దేశం కూడా తమ భూ భాగాలను అనుమతించే అవకాశం లేదు. అయితే రష్యా దగ్గర అలాంటి ఆయుధాలు వున్నందున చాలా త్వరగా మోహరించే అవకాశాలున్నాయి. నిషేధిత శ్రేణిలో కొత్త క్షిపణులను రష్యా తయారు చేసిందని అయితే ఒప్పందం కారణంగా వాటి శ్రేణిని పెంచి ఖండాంతర క్షిపణిగా పేర్కొన్నదని అమెరికా అనుమానిస్తున్నది.

Image result for intermediate-range nuclear missile

తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినప్పటి నుంచి రష్యాను చక్రబంధంలో బిగించేందుకు నాటో కూటమిని విస్తరించేందుకు అమెరికన్లు ప్రయత్నించి ఇప్పుడు రుమేనియా, పోలాండ్‌ వంటి చోట్ల రష్యా ముంగిటికి తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు. దానికి ప్రతిగా అది కూడా తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.గురివిందగింజ మాదిరి తన చర్యల గురించి నోరెత్తని ట్రంప్‌ రష్యా మోహరింపులను సాకుగా చూపి ఒప్పందం నుంచి వైదొలుగుతాననటం ఒక సాకు మాత్రమే. మూడు దశాబ్దాలుగా ప్రశాంతంగా వున్న తమకు మరోసారి ఆయుధముప్పు తెచ్చిపెడుతున్నారనే అభిప్రాయం ఐరోపాలో వ్యక్తం అవుతోంది. రష్యాను అంకెకు తెచ్చేందుకు అమెరికా చేసే యత్నాలకు తాము మద్దతిస్తాం తప్ప ఒప్పందం నుంచి తప్పుకుంటామనే అమెరికా వైఖరిని ఐరోపా నాయకులు తప్పు పడుతున్నారు. నిరాయుధీకరణ ఒప్పందం ఐరోపా భద్రత అనే కట్టడానికి గత మూడు దశాబ్దాలుగా ఒక స్ధంభం మాదిరి వుంది, ప్రచ్చన్న యుద్ధాన్ని అంతం చేసేందుకు తోడ్పడింది అని ఐరోపా యూనియన్‌ విదేశాంగ విధాన విభాగ ప్రతినిధి ఫెడరేసియా మోఘెరిని ఒక రాత పూర్వక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం కారణంగా దాదాపు అణు, సాంప్రదాయ ఆయుధాలున్న మూడువేల క్షిపణులను తొలగించి నాశనం చేశారు. ప్రపంచానికి నూతన ఆయుధపోటీ అవసరం లేదు, దాని వలన ఎవరికీ లాభం లేకపోగా మరింత అస్ధిరత్వాన్ని తెస్తుందని పేర్కొన్నారు. స్వీడిష్‌ మాజీ ప్రధాని కార్ల్‌ బిడిట్‌ అమెరికా చర్య రష్యాకు ఒక బహుమతి లాంటిది. ఐరోపాకు అణుముప్పును పెంచుతుంది. ఎందుకంటే అమెరికా ఆయుధపోటీలో చేరటంతో రష్యా పెద్ద సంఖ్యలో నూతన ఆయుధాలను మోహరిస్తుందన్నాడు. ఇబ్బందులు రష్యా క్షిపణుల పరిధిలో వున్న ఐరోపావారికి తప్ప అమెరికన్లకు కాదని జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ పేర్కొన్నారు.ట్రంప్‌ ప్రకటన విచారకరమని ఒప్పందానికి కట్టుబడే అంశాలను పరిష్కరించాలని రష్యాను కోరారు. తాము అమెరికా వైఖరిని సమర్ధిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. ఈ చర్య ఎక్కడికి దారితీస్తుందో వాష్టింగ్టన్‌లోని వారికి నిజంగా అర్ధం కావటం లేదా అని ఒప్పందంపై సంతకం చేసిన సోవియట్‌ మాజీ అధ్యక్షుడు గోర్బచెవ్‌ ప్రశ్నించాడు.ఒప్పందం నుంచి వైదొలగటం ప్రమాకర అడుగు అవుతుందని, తమను బ్లాక్‌ మెయిల్‌ చేయటమే అని, అయితే దాన్ని అంగీకరించేది లేదని రష్యా తక్షణ స్పందనలో పేర్కొన్నది.

ట్రంప్‌ చర్యను అమెరికాలోని కొందరు మేథావులే తప్పు పడుతున్నారు. దౌత్యపరంగా హ్రస్వదృష్టి, మధ్యంతర ఎన్నికలకు ముందు ట్రంప్‌కు రాజకీయంగా ప్రమాదకరం, ముప్పుతో కూడుకున్నదని వాషింగ్టన్‌లోని ఆయుధాల అదుపు అసోసియేషన్‌ డైరెక్టర్‌ డారిల్‌ కింబాల్‌ వ్యాఖ్యానించారు. ఒప్పంద వుల్లంఘనకు రష్యా పాల్పడుతున్నదనే ఆందోళన ఒకవైపు వుండగా దాన్నుంచి అమెరికా వుపసంహరణ ప్రకటన చేయటంతో వైఫల్య నిందను నెత్తిన వేసుకున్నట్లయిందని కింబాల్‌ వాపోయారు. వివాద పరిష్కారానికి దౌత్య అవకాశాలు ఆవిరి కాలేదని, ట్రంప్‌ పాలనా కాలంలో ఆయన సలహాదారు బోల్టన్‌ మాస్కో పర్యటన కేవలం మూడవదేనని కూడా కిబాల్‌ చెప్పారు. రుమేనియాలో ఆమెరికా మోహరించిన క్షిపణులను అడ్డుకొనే కేంద్రాలను రష్యన్‌ నిపుణులు, ఆమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్న రష్యా 9ఎం729 వ్యవస్ధలను అమెరికా నిపుణులు పరస్పరం తనిఖీ చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు.

ట్రంప్‌ ప్రతినిధిగా మాస్కో పర్యటనలో వున్న బోల్టన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఒప్పందంలో పేర్కొన్న క్షిపణులు అనేక దేశాలు తయారు చేస్తున్నందున ప్రచ్చన్న యుద్ధకాలంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కాలదోషం పట్టిందని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌, ఇతర అమెరికకా నిపుణులు కోరుతున్నట్లు అణ్వాయుధ క్షిపణుల నిషేధ ఒప్పందంలో చైనా చేరే అవకాశాలేమాత్రం లేవని కింబల్‌ వ్యాఖ్యానించారు. దాని దగ్గర వున్న అణ్వాయుధాలు తక్కువ, వారి దగ్గర లఘు, మధ్య శ్రేణి క్షిపణులు ఎక్కువగా వున్నాయి. నిజంగా వారు ఒప్పందంలో చేరితే అది అమెరికా, రష్యాలకు విజయం, చైనాకు నష్టం అన్నారు. అమెరికా నిజంగా ఒప్పందం నుంచి తప్పుకుంటుందా అన్న ప్రశ్నకు కింబల్‌ ఇలా స్పందించాడు. గత కొద్ది వారాలుగా ఒప్పందాన్ని ఏమి చేయాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది.బోల్లన్‌ గనుకు చక్కగా వుండి వుంటే ఈ సమస్యను దీర్ఘకాలం నాన్చటం మంచిది కాదు, మీరు తదుపరి చర్యలు తీసుకోనట్లయితే మేము ఒప్పందం నుంచి వెనక్కు పోవచ్చు అని చెప్పేందుకు మాస్కో వెళ్లి వుండాల్సింది, కానీ గట్టిగా వ్యవహరించాలనే ప్రవత్తిగల ట్రంప్‌ ముందుగానే తుపాకిని ఎక్కు పెట్టి ఒప్పందాన్నుంచి వైదొలుగుతామని చెప్పాడు. రష్యా గురించి గట్టిగా మాట్లాడి రాజకీయంగా లబ్దిపొంద చూసేందుకు రాజకీయవేత్తలు ప్రయత్నిస్తున్నారని కొన్ని వర్గాలు పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్ధ నొవొస్తి పేర్కొన్నది.

ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం రద్దయితే పర్యవసానాలేమిటి? మరోసారి ఆయుధ పోటీకి అమెరికా తెరలేపినట్లు అవుతుంది. అని వార్యంగా రష్యా, చైనా ఇతర దేశాలు అందుకోసం అమెరికా అంతగాకపోయినా అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఐరోపా గడ్డమీద ఆయుధాలు పెరుగుతాయి. అక్కడి దేశాలు తమ రక్షణ ఖర్చును గణనీయంగా పెంచుకోవాల్సి వుంటుంది, అదిగాకుండా అమెరికా ఆయుధాలకు అదనంగా చెల్లించాల్సిన పరిస్ధితి. వీటన్నింటి వలన ప్రయివేటు రంగంలోని అమెరికా మిలిటరీ పరిశ్రమలకు లాభాలు పెరుగుతాయి. తన రాజకీయ వైఖరికి అనేక అంశాల్లో అడ్డుపడుతున్న రష్యాపై అనేక ఆంక్షలను అమలు జరుపుతున్న అమెరికా రాబోయే రోజుల్లో మరింగా విస్తరించవచ్చు. ఒప్పందం నుంచి అమెరికా వైదులుగుతున్న కారణంగా నాటో కూటమి, ఐరోపా యూనియన్‌ దేశాల మధ్య విబేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐరోపా తన భద్రతను తాను చూసుకోగలదు అంటున్న దేశాలు అమెరికా తెచ్చి పెట్టిన కొత్త సమస్యమీద ఎలా స్పందిస్తాయో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే !