Tags
BJP Vote Politics, flying Modi, Narendra Modi, Patel Statue, Sardar patel on Kahmir issue, world tallest statue
ఎం కోటేశ్వరరావు
అనుకోకుండా ఒక ప్రయాణంలో తోటి వారితో జరిగిన మాటా మంతీలో చిన్ననాటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అదే రోజు పత్రికలో ప్రపంచంలో ఎత్తయిన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ వార్త చదవటంతో ప్రపంచంలో పెద్ద నది ఏది, ఏ కట్టడాన్ని ఎవరు కట్టించారు వంటి అంశాలలో క్విజ్‌లో ముందున్న రోజులు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎత్తయిన విగ్రహం ఏది, దానిని ఎవరు పెట్టించారు అంటే పటేల్, నరేంద్రమోడీ అని టక్కున చెప్పే పిల్లలు గుర్తుకు వచ్చారు. బాల్యం కాదు గనుక తాజ్‌మహల్‌ను కట్టించిన వారు కాదు, దానికి రాళ్లెత్తిన కూలీలెవరన్న మహాకవి శ్రీశ్రీ ప్రశ్న నేపధ్యంలో మూడువేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి పేరు కొట్టేసిన నరేంద్రమోడీ నిర్వాకం మదిలోకి రాక మానదు కదా !
చరిత్రలో అనేక మంది పెద్ద విగ్రహాలు పెట్టించి, కట్టడాలు కట్టించినవారున్నారు. ఆ సరసన నరేంద్రమోడీ చేరారు, రేపు చెప్పుకొనేందుకు ఫలానా అని లేని మరొకరు అంతకంటే పెద్ద విగ్రహం పెట్టించవచ్చు. చిత్రం ఏమిటంటే దేశం, మన సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నేపధ్యంలో ఇలాంటి రికార్డులు, ర్యాంకుల గురించి జనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవటం లేదు. ఒక ప్రధానిగా ఏడాదికి సగటున ఎక్కువ దేశాలు తిరిగిన, విదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపిన ప్రధాని ఎవరు , ఒక ప్రధానిగా ఐదేండ్ల కాలంలో మీడియాతో మాట్లాడని ప్రధాని ఎవరు ఇలాంటి అనేక ప్రశ్నలకు నరేంద్రమోడీ అనే అసాధారణ రికార్డులను మోడీ ఇప్పటికే సాధించారు. సమీప భవిష్యత్‌లో మరొకరు ఆ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు కనిపించటం లేదు. క్వారా డాట్‌కామ్ ప్రశ్నకు వచ్చిన వివరాల ప్రకారం ఇందిరా గాంధీ మొత్తం మీద ఎక్కువగా 113, తరువాత 93తో మన్మోహన్ సింగ్, మోడీ 79, జవహర్‌లాల్ నెహ్రూ 70 విదేశీ పర్యటనలు చేశారు. వీరిలో మోడీ తప్ప మిగిలిన వారంతా ఎక్కువ కాలం పదవిలో వున్నారు. అందువలన సగటున ఏడాదికెన్ని అంటే నరేంద్రమోడీ 19.5, మన్మోహన్ సింగ్ 9.3, ఇందిరా గాంధీ 8, నెహ్రూ 4.1 పర్యటనలు చేశారు. చిత్రం ఏమిటంటే ఈ అంకెలతో నరేంద్రమోడీ భక్తులెవరూ విబేధించలేదు. సమాచార హక్కు చట్టం కింద నాలుగు సంవత్సరాలలో మోడీ గారు ఎన్ని దేశాలు తిరిగారు అంటే 52 అని కేంద్ర ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం కూడా ఏడాదికి 13దేశాలతో మోడీయే ముందున్నారు.
ఎందుకు ఇలా ఎడా పెడా తిరిగారయ్యా అని ఎవరైనా అడిగితే విదేశీ పెట్టుబడుల కోసం అని తడుముకోకుండా తొలి సంవత్సరాలలో బిజెపి నేతలు చెప్పే వారు. ఇప్పుడు నోరెత్తటం లేదు, నో కామెంట్ అంటూ తప్పుకుంటున్నారు. ఎందుకని నాలుగేండ్లలో ఏమి జరిగింది? మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మన కంపెనీలలో విదేశీయులు పెట్టిన పెట్టుబడులు, మన రుణపత్రాలు కొనుగోలు, తదితర రూపాలలో పెట్టే పెట్టుబడులను ఎఫ్‌పిఐ అంటారు. అవి 2014 నుంచి 2017వరకు వరుసగా 2,18,511-82,793-43,428-1,83,334 కోట్ల వంతున వచ్చాయి.2018లో ఇప్పటి వరకు పదినెలల్లో లక్ష కోట్ల రూపాయలు వెనక్కు పోయాయి. ఈ వార్తలను చదువుతున్న సమయంలోనే సులభతర వాణిజ్య ర్యాంకులో మన దేశం 2014లో 142వ స్ధానంలో వున్నది కాస్తా 2018లో 77కు చేరుకుంది. అంటే విదేశీయులు, స్వదేశీయులు వాణిజ్యాన్ని అంత సులభంగా చేసుకోవచ్చు అని ప్రపంచబ్యాంకు చెప్పింది. అలాంటపుడు ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెనక్కు ఎందుకు పోయినట్లు ? మంచి రాంకుకు పెట్టుబడులకు సంబంధం లేదా ? లేక ఇక్కడ వ్యాపారం లాభసాటిగా లేదని విదేశీయులు గ్రహించారా ? ర్యాంకుల సర్వే జరిగిన సమయంలో పరిస్ధితికి ఇప్పటికి తేడా వచ్చిందా ? వస్తే ఎందుకు ? ఏతా వాతా చివరకు తేలిందేమంటే రాంకు వచ్చినా సంతోషించే స్ధితిలో నరేంద్రమోడీ లేరు. ఇదే ర్యాంకు గతంలో వచ్చి వుంటే మీడియా ఎంత హడావుడి చేసి వుండేదో కదా !
అతి పెద్ద పటేల్ విగ్రహాన్ని ఐక్యతా ప్రతీకగా మోడీ సర్కార్ చిత్రించింది. కాలం కలసి రాకపోతే తాడే పామైకరుస్తుందంటారు. విగ్రహం గురించి చర్చ కంటే సిబిఐలో చెలరేగిన కుమ్ములాటల్లో నరేంద్రమోడీ పాత్ర, రిజర్వుబ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, వివాదాస్పద బాబరీ మసీదు స్ధల యాజమాన్య కేసు విచారణ జనవరికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు, దాన్ని జీర్ణించుకోలేని ఆర్‌ఎస్‌ఎస్ ఆగ్రహం, రామాయణంలో పిడకల వేటలో పటేల్‌తో పోలిస్తే మరుగుజ్జు వంటి విగ్రహాన్ని రాముడికి పెడతామని వచ్చిన వార్తల్లో పటేల్ విగ్రహ వార్తను జనం మరచి పోయారు. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల గురించి అన్నట్లుగా బిజెపి నిత్యం చెప్పేది ఐక్యత, చేసేది విచ్చిన్నం, అదే బిజెపి అసలు రూపం !
సంస్ధానాల విలీనం అనేది స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఎవరు అధికారంలో వున్నా చేసే పనే. లేకపోతే దేశ భద్రతకే ముప్పు. దానికి నాయకత్వం వహించాల్సింది హోంశాఖ, దానికి మంత్రిగా ఎల్లయ్య వున్నా పుల్లయ్య వున్నా యంత్రాంగం చేస్తుంది తప్ప రాజకీయ నాయకత్వం కాదు. ఆ సమయంలో వల్లభాయ్ పటేల్ వున్నారు. అంతే. నాటి మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు జరిపారు. ఆయన వల్లనే విలీనం జరిగిందని అంటేనే అభ్యంతరం, వాస్తవ విరుద్ధం. పటేల్ లేనట్లయితే ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైళ్లు వుండేవి కావని నరేంద్రమోడీ సెలవిచ్చారు. ఇది కాశ్మీరు విషయంలో పటేల్ పాత్రకు పూర్తి విరుద్దం.
చరిత్ర తెలియకపోవటం తప్పు కాదు, తెలుసుకోకుండా వ్యాఖ్యానించటం తొందరపాటు అవుతుంది. అన్నింటికీ మించి చరిత్ర గురించి సంఘపరివార్ చరిత్రకారులు చెప్పే అంశాలను గుడ్డిగా నమ్మి వ్యాఖ్యలు చేస్తే వూబిలో పడతారు. కాశ్మీరు సంస్ధానంలో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందూరాజు. మేము పాకిస్ధాన్‌లో లేదా భారత్‌లోగానీ కలిసేది లేదు, యథాతధ స్ధితిలో వుంటాము అని పాక్‌తో కాశ్మీర్‌రాజు హరి సింగ్ ఒప్పందం చేసుకున్నాడు. భారత్‌తో కూడా అలాంటి ఒప్పందం చేసుకొనేందుకు సిద్దపడ్డాడు. నాటి నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ నేత షేక్ అబ్దుల్లా తాము భారత్‌తోనే వుంటామని ప్రకటించాడు. ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు ? అయితే 1947 సెప్టెంబరు నాటికే పాకిస్ధాన్ పాలకులు కాశ్మీర్ ఆక్రమణకు పాల్పడ్డారు. అక్టోబరులో విధిలేక హరిసింగ్ విలీనానికి అంగీకరించటంతో కేంద్ర ప్రభుత్వం మిలిటరీని పంపింది, అప్పటికే ఈ రోజు మనం ఆక్రమిత కాశ్మీర్‌గా పిలుస్తున్న ప్రాంతాన్ని పాక్‌సేనలు ఆక్రమించాయి. అయితే పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తాము విలీనం చేసుకోలేదని అంతకు ముందు రాజు ప్రకటించినట్లుగా స్వతంత్య్ర రాజ్య ఏర్పాటులో భాగంగా విముక్తి చేశామని ఆ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీర్ అని ప్రకటించారు. దానికి ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూర్వరంగంలో నాటి కేంద్ర ప్రభుత్వం తాము కూడా కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి భారత్‌లో అంతర్భాంగా చేస్తామని ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. జునాఘడ్, హైదరాబాదు సంస్ధానాలను భారత్‌లో విలీనం చేస్తే కాశ్మీర్ దేశంలో విలీనంగాకపోయినా మేము దానిని శత్రువుగా చూడబోమని వల్లభాయ్ పటేల్ తనకు స్పష్టంగా హామీ ఇచ్చినట్లు నాటి బ్రిటీష్ పాలకుడు మౌంట్‌బాటన్ పేర్కొన్నాడు. అయితే కాశ్మీర్‌లోని వాస్తవ పరిస్ధితి, మిగతా నాయకుల వ్యతిరేకత కారణంగా వెంటనే పటేల్ కూడా తన వైఖరిని మార్చుకున్నట్లు చెబుతారు. కాశ్మీరులో మెజారిటీ ముస్లింలు వున్నందున ఆ తలనొప్పి భారత్‌కు ఎందుకు అని పటేల్ భావించినట్లు చెబుతారు.
ఇప్పుడు పటేల్ భారత రాజకీయాలలో చూపే ప్రభావమేమీ లేదు. అందువలన పటేల్ గురించి అతిశయోక్తులు చెప్పకుండా వుంటేనే ఆయన గౌరవం నిలుస్తుంది. 1947 అక్టోబరులోనే కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌కు సైన్యాన్ని పంపి నేటి ప్రాంతాన్ని కాపాడింది. కాశ్మీర్‌కు ప్రత్యేక పత్తి ఇవ్వటాన్ని తప్పుపడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ను రద్దు చేస్తానని బిజెపి చెప్పటం అంటే మన దేశం నుంచి కాశ్మీర్ వేరుపడి పోవాలని కోరుకొనే దేశద్రోహులకు అక్కడి జనాన్ని రెచ్చగొట్టేందుకు అవకాశం ఇవ్వటమే.
ఇక నిజాం రాజు ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన సమయంలో నిజాం భారత్‌లో విలీనం కాలేదు. 1948 ఆగస్టు 21న నిజాం రాజు ఐరాసకు ఫిర్యాదు చేశాడు. పరిస్ధితి చేయిదాటి పోతోందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 13న పోలీసు చర్యకు పూనుకుంది. మొత్తం అన్ని సంస్ధానాలను విలీనం చేసింది. దానిలో పటేల్ ప్రత్యేకత ఏమీ లేదు. నిజానికి ఆయన రాజకీయ చరిత్రలో సంస్ధానాలకు వ్యతిరేకంగా లేదా సంస్ధానాల ప్రజల సమస్యల మీద పోరాడిన చరిత్ర కూడా లేదు.
ప్రపంచంలో అతి పెద్ద విగ్రంగా పటేల్‌ది పెట్టినంత మాత్రాన ఆయనకు కొత్తగా వచ్చే ఖ్యాతి ఏమీలేదు. దేశ ఐక్యతకు చిహ్నంగా పటేల్‌ను కొత్తగా వర్ణిస్తున్న బిజెపి నాయకత్వం కాశ్మీర్ విషయంలో దేశద్రోహకరమైన వైఖరిని తీసుకుంటూ మరోవైపు దేశంలో సామాజిక అనైక్యతకు, నిర్మించిన వ్యవస్ధలను ఒకదాని తరువాత ఒకదానిని నాశనం చేస్తూ మరోవైపు పటేల్ విగ్రహం పెట్టి ఐక్యత గురించి కబుర్లు చెప్పటమే బిజెపి చేస్తున్న మోసం. ఇలాంటి వారిని గుండెలు తీసిన బంట్లు అంటారు.
మోడీ పాలనలో దేశ ఆర్ధికాభివృద్ధి చైనా కంటే ఎక్కువగా వుందని, త్వరలో దాన్ని అధిగమించబోతున్నామని చెబుతున్నారు. 2018 ప్రపంచ ఆకలి సూచిక తయారీకి తీసుకున్న 120 దేశాలలో చైనా 25వ స్ధానంలో వుంటే మనది 103, మన కంటే పేద దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ 72,86 స్ధానాల్లో వున్నాయి. మనం 106దిగా వున్న పాకిస్ధాన్‌తో పోటీ పడుతున్నాం. ప్రపంచంలో రక్తహీనత జనాభాలో మనమే మొదటి స్ధానంలో వున్నాం. కుష్టు, క్షయ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలలో గత నాలుగు సంవత్సరాలలలో మనమే ముందున్నాం. దేశాన్ని డిజిటల్ యుగంలోకి తీసుకుపోతామని చెబుతున్నవారి పాలనలో పరిష్కారం సంగతి దేవుడెరుగు , కనీసం ఏ ఒక్కదానిలో అయినా పురోగతి వుందా ? రోగాలు, రొష్టులతో మనం ఎంత నష్టపోతున్నామో తెలుసా? రైతులు వ్యవసాయం చేసి అప్పులపాలవుతుంటే సాధారణ జనం రోగాలతో అప్పులపాలవుతున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. వీటన్నింటి గురించి ప్రధాని మన్‌కీ బాత్‌లో ఎప్పుడైనా ప్రస్తావించారా? వాటిని పట్టించుకోవటం మాని మూడువేల కోట్ల రూపాయలు పెట్టి ఒక విగ్రహాన్ని నెలకొల్పటం అవసరమా? అంత మొత్తం ఖర్చును భరించే స్ధాయి మన జనానికి వుందా ? ఆర్ధికంగా నాలుగు సంవత్సరాలలో చెప్పుకొనేందుకు సాధించిందేమీ లేదు, వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని దర్జాగా దేశం దాటి పోతున్న నేరంగాండ్లను ఒక్కడంటే ఒక్కడిని పట్టుకోకుండా వదలి వేయటం, ఓట్లను దండుకొనేందుకు ఎక్కడ వివాదాస్పద అంశం దొరుకుతుందా అని చూసే దేశవ్యాపిత మత రాజకీయాలు, విగ్రహాల రాజకీయాలు, వేల కోట్ల అవినీతికి తెరలేపిన రాఫెల్ విమాన కొనుగోలు అవినీతి అక్రమాలు, వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు, నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు సిబిఐ, ఆర్‌బిఐ వంటి అనేక వ్యవస్ధలను నాశనం చేసే ప్రమాదకర పోకడలు. అందువలన ప్రపంచంలో ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పటమే కాదు, పైన చెప్పుకున్న వాటన్నింటి ఘనత కూడా కచ్చితంగా నరేంద్రమోడీకే దక్కాలి !