ఎం కోటేశ్వరరావు
అలవిగాని ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు సోకితే తప్ప రైతు ఎంత ఎక్కువగా పెట్టుబడి పెడితే దిగుబడి అంత ఎక్కువగా వస్తుందన్నది అందరికీ తెలిసిన సత్యం. ఆ పెట్టుబడులు కూడా గుడ్డిగా కాకుండా శాస్త్రీయంగా వుంటే మరింత ప్రయోజనం. దానికి మార్కెట్ రక్షణ కూడా వుంటే నాలుగు డబ్బులు మిగులుతాయి. శాస్త్రీయ పద్దతులు, సమాచారం రైతులకు కావాలంటే ఎవరికి వారు సంపాదించుకోలేరు. అందరికీ ఆఫలాలు అందే విధంగా పభుత్వాలే సమకూర్చాలి. వాటినే పరిశోధన, అభివృద్ధి అంటున్నారు. కొత్త వాటి కోసం పరిశోధన, వున్నవాటిని మెరుగుపరటం అభివృద్ధి జరగాలి. అటువంటి దానికి ఏ దేశం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది అనేదాన్ని బట్టి ఫలితాలు వుంటాయి.
ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా అన్ని రంగాలలో చైనా ముందుకు దూసుకుపోతున్నది అనేది వాస్తవం. దాన్ని పాలించే కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో ఎవరైనా విబేధించవచ్చుగాని జనం కోసం చేస్తున్న వారి కృషిని కాదనలేరు. గత నెలలో చైనా వ్యవసాయ రంగ అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎలా వుపయోగపడుతున్నదో ఒక నివేదికను ప్రకటించారు. దాని వలన చైనాకు ఆహార భద్రత సమకూరటంతో పాటు రైతుల ఆదాయాలు పెరిగాయన్నది దాని సారాంశం. అయితే వుత్పాదక ఖర్చు ఇంకా ఎక్కువగానే వుందని, వుత్పత్తుల ధరలు ఒక పరిమితికి చేరాయని ఫలితంగా లాభాలు తగ్గుతున్నాయంటూ ఈ సమస్యతో పరిమిత వనరులు, పర్యావరణ కాలుష్యం, కీలకమైన పోటీ లేమి వంటి సవాళ్లను చైనా ఎదుర్కొంటున్నదని, వాటిని అధిగమించటానికి అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సి వుందని కూడా దానిలో పేర్కొన్నారు.
వాటిలో భాగంగా మరింత నాణ్యమైన పంటల రకాలు, స్వయం చాలిత యంత్రాలు, వ్యవసాయ, ఆహార వుత్పత్తుల తయారీ, సమర్ధ నీటి వినియోగం, కాలుష్య అదుపు, వ్యవసాయ వృధాను వుపయోగించుకోవటం, పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వ అకాడమీ ఐదు సంవత్సరాల ప్రణాళికను కూడా రూపొందించింది.వ్యవసాయ రంగంలో చైనా సాధించిన అంశాల గురించి ఆ నివేదికలో పేర్కొన్నవాటి సారాంశం ఇలా వుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన పురోగతి చైనా వ్యవసాయ అభివృద్దికి 2012లో 53.5శాతం దోహదం చేస్తే 2017నాటికి 57.5శాతంగా వుంది. ఆ పురోగతి వరి, పత్తిలో అధిక దిగుబడి, చీడపీడల నిరోధ రకాల రూపకల్పన, ప్రమాదరకర బర్డ్ ఫ్లూ నిరోధానికి సమర్ధవంతంగా పని చేసే వాక్సిన్ల తయారీ వంటి వాటిలో వుంది.వ్యవసాయ భూమి, మంచినీరు, ఇతర వనరుల లభ్యత తగ్గుతున్నా గత ఐదు సంవత్సరాలలో ఆహార ధాన్యాల వుత్పత్తి 60కోట్ల టన్నుల వద్ద స్ధిరంగా వుంది. జన్యుపరమైన పరిజ్ఞానంలో కనుగొన్న అంశాల ఆధారంగా పందులు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతుల సంతతి వృద్ధి గణనీయంగా పెరిగింది. అనేక పంటలకు జన్యుపరమైన మాప్‌లను తయారు చేశారు. వ్యవసాయ రంగంలోని యంత్రాలు, పరికరాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేశారు. పురుగుమందులను చల్లేందుకు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు.చైనాలో సాధించిన పురోగతి ప్రపంచంలోని అనేక దేశాలలో వ్యవసాయ రంగానికి వుపయోగపడుతోంది.
వివిధ పంటల దిగుబడులకు సంబంధించి 2015లో భారత్, చైనా, ప్రపంచ సగటు వివరాలు
హెక్టారుకు కిలోలు
పంట భారత్ చైనా ప్రపంచ సగటు
వరి 3608 6891 4604
గోధుమ 2750 5393 3317
జన్న 2597 5893 5538
పప్పులు 647 1741 950
చెరకు 71466 73121 70764
వేరుశనగ 1485 3562 1682
(ఆధారం: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసి 2017 పాకెట్ బుక్‌లో పేర్కొన్న వివరాలు )
ఒక దేశం సాధించిన పురోగతి గురించి చెప్పుకుంటున్నామంటే మనం సాధించినదాని గురించి తక్కువ చేయటం కాదు. పోటీ పడాలన్న వాంఛను వ్యక్తం చేయటమే.ప్రధాని నరేంద్రమోడీ వాగ్దానం చేసినట్లు 2022నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు ఆచరణ ఏమిటన్నది విమర్శనాత్మకంగా చూడటం అవసరం. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి మనం చేస్తున్న ఖర్చు చైనా కంటే మరీ అంత వెనుకబడి లేదని నీతి అయోగ్ సభ్యుడైన ప్రముఖవ్యవసాయ శాస్త్రవేత్త రమేష్ చంద్ ఆ మధ్య చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2017-18 ఆర్ధిక సర్వేలో పేర్కొన్నదాని ప్రకారం అన్ని రంగాలలో పరిశోధన, అభివృద్దికి ఆయా దేశాల జిడిపిలో దక్షిణ కొరియా 4.3, ఇజ్రాయెల్ 4.2,అమెరికా 2.8,చైనా 2.1 శాతాల చొప్పున ఖర్చు చేస్తుండగా మన దేశం గత రెండుదశాబ్దాలుగా 0.6-07శాతం మధ్య ఖర్చు చేస్తున్నది. మన కంటే అమెరికా, చైనా జిడిపిలు ఏడు, నాలుగు రెట్లు అధికం అని గమనంలో వుంచుకోవాలి. అయితే చైనా కంటే మనం పెద్దగా వెనుకబడిలేమని రమేష్ చంద్ ఎలా చెప్పారు? ఆ పెద్దమనిషి మన స్ధూలాదాయంలో వ్యవసాయరంగం నుంచి వస్తున్న మొత్తాన్ని లెక్కల్లోకి తీసుకొని దానిలో వ్యవసాయ అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తున్నామో చెప్పారు. దాని ప్రకారం ట్రేడింగ్ ఎకనోమిక్స్ డాట్‌కామ్ అందచేసిన వివరాల ప్రకారం చూస్తే దక్షిణాఫ్రికా 3.6, బ్రెజిల్ 1.82, అమెరికా 1.2, చైనా 0.62, భారత్ 0.30శాతం ఖర్చు చేస్తున్నాయి. దీన్ని చూపి చైనాకు మనకు పెద్ద తేడాలేదని రమేష్ చంద్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏదేశమైనా మొత్తంగా పరిశోధన, అభివృద్ధికి చేసే ఖర్చును చూసుకోవాలి. వుదాహరణకు ఒక డ్రోన్ తయారు చేస్తే దాన్ని ఏ ఖాతాలో వేయాలి? దానిని నిఘా, లేదా రహస్యంగా ఫొటోలు తీయటానికి, కొన్ని చోట్ల సరకు రవాణాకూ వినియోగిస్తున్నారు. వ్యవసాయంలో కూడా వినియోగపడుతోంది. అందువలన అంకెల గారడీ చేసి అధికారంలో వున్నవారిని మెప్పించవచ్చు. సామాన్య జనానికి ప్రయోజనం లేదు. మన దేశంలో స్వాతంత్య్రానికంటే ముందే 1880లోనే దేశంలో, ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయటం ద్వారా ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.1919లో ఇంపీరియల్ అగ్రికల్చర్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పారు. స్వాతంత్య్రం తరువాత వ్యవసాయ విశ్వవిద్యాలయాను ఏర్పాటు చేసి పరిశోధన, అభివృద్ది బాధ్యతలను వాటికి అప్పగించారు. దీని వల్లనే హరిత విప్లవం జయప్రదం అయింది. తాజా పరిస్ధితిని చూస్తే మనకు అవసరమైన శాస్త్రవేత్తలు, వసతులు వున్నప్పటికీ వాటికి తగిన మొత్తంలో నిధులు, అన్నింటికీ మించి ప్రభుత్వరంగంలో పరిశోధనలు చేయించాలన్న వుత్సాహం, చొరవ పాలకుల్లో లేదు. ఇప్పటికే విత్తనాభివృద్ధి సంస్ధలను నామమాత్రం చేసి ప్ర యివేటు రంగానికి అప్పగించారు. ఏ రంగంలో అయినా పరిశోధన అంటే తక్షణమే లాభాలు చేకూర్చదు, కొన్ని సార్లు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఫలితాలు కూడా రాకపోవచ్చు. దీర్ఘకాలంలో వచ్చే ఫలితాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. అది జరగటం లేదు.భిన్న వాతావరణ పరిస్ధితులున్న మన దేశంలో పరిశోధన అవసరం గురించి చెప్పనవసరం లేదు. వ్యవసాయం, హరిత విప్లవం అంటే గోధుమలు, వరి వుత్పత్తి పెంపుదల ఒక్కటే కాదు. మనదేశం ఆ రెండు పంటల విషయంలో గణనీయమైన పురోగతి సాధించిన తరువాత మన పాలకులు వ్యవసాయం మీద శ్రద్ద తగ్గించారు.ఫలితంగా వ్యవసాయ పెట్టుబడుల తగ్గింపు, వుత్పాదకత పెంపు, నీటి కొరతను అధిగమించటం, మార్కెటింగ్, ఆహార తయారీ వంటి అంశాలపై మన శాస్త్రవేత్తలు అవసరాలకు తగినట్లుగా స్పందించలేని స్ధితికి కారణం పాలకులు, వారి మెప్పు పొందేందుకు తాపత్రయపడే వున్నత విధాన నిర్ణాయక అధికార యంత్రాంగం తప్ప మరొకరు కాదు.భారతీయ రైతులకు మద్దతు, సరైన మార్గం అనే పుస్తకంలో రాసినదాని ప్రకారం ప్రకారం ఎరువుల సబ్సిడీకి ఒక రూపాయి ఖర్చు చేస్తే దాని మీద 88, విద్యుత్‌కు 79, రోడ్లకు 110, కాలువల మీద 0.31 పైసల వంతున తిరిగి ఆదాయం వస్తుంది, అదే వ్యవసాయ పరిశోధనకు ఒక రూపాయి ఖర్చు చేస్తే రు.11.20 ఆదాయం వస్తుందట. అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్ధ(ఐఎఫ్‌పిఆర్‌ఐ) అధ్యయనం ప్రకారం 2030సంవత్సరానికి నిరంతర అభివృద్ధి లక్ష్యాలుగా నిర్ణయించిన పదిహేడింటిలో సగం నెరవేరాలంటే వ్యవసాయమే కీలకమని, దాని మీద పరిశోధనకు చేసే ఖర్చు నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని, మిగతావాటితో పోల్చితే మరింతగా వనరుల సమపంపిణీ జరుగుతుందని తేలింది.
చైనా వ్యవసాయ పరిశోధనా రంగంలో ప్రభుత్వ వ్యవస్ధదే పైచేయి. ప్రయివేటు రంగం కూడా వుంది. ప్రభుత్వరంగ అదుపు అంటే వ్యవసాయ పరిశోధన ప్రజలకు చెందినది అన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహన. దాని మీద చేసే ఖర్చు ప్రజలదే, వచ్చే ఫలితాలు కూడా ప్రజలకే చెందాలి. ఒక ప్రయివేటు కంపెనీ ఒక అంశంపై కేంద్రీకరించి దాని మీదే పని చేస్తుంది. కానీ ప్రభుత్వం అలా వ్యవహరించలేదు. దీన్ని చూపి ప్రభుత్వ రంగం వుత్సాహాన్ని నీరుగార్చుతుంది అని కొందరు చిత్రించవచ్చు. అటువంటి స్ధితి నుంచి ఎలా ముందుకు పోవాలా అన్నది చర్చించవచ్చు, మార్గం కనుగొనవచ్చు. చైనా సర్కార్ ఈ అంశం మీద అభిప్రాయాలు, సూచనలు తీసుకొంటోంది.చైనా వ్యవసాయ రంగంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనం పని చేస్తున్నారు. అందువలన ఆ రంగాన్ని కమ్యూనిస్టు పార్టీ విస్మరించజాలదు. వ్యవసాయ అభివృద్ధికి చైనా ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఒక అధ్యయన పత్రం పేటెంట్ల రూపంలో వెల్లడించింది. 1985-2009 మధ్య స్ధానిక పేటెంట్ దరఖాస్తులు 69రెట్లు పెరగ్గా, విదేశీ పేటెంట్ల దరఖాస్తులు తొమ్మిది రెట్లు వున్నాయి. స్ధానిక దరఖాస్తులలో నవకల్పన లేదా సృష్టిగా 57.2శాతానికి గుర్తింపు వచ్చింది. విదేశీ దరఖాస్తుల విషయంలో అది 99శాతం వుంది.
వ్యవసాయానికి సబ్సిడీల ద్వారా చేయూత నివ్వటం బుద్దితక్కువ వ్యవహారమని మన దేశంలో కొందరి వాదన. సబ్సిడీలు ఇచ్చి అసమర్ధతను పెంచుతున్నారని, దాని కంటే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తేవటం వలన ఎక్కువ ప్రయోజమన్నది వారి భావం. యూరియాకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నందువలన దాన్ని దుర్వినియోగ పరచి అతిగా వాడి భూములు దెబ్బతినటానికి కారకులౌతున్నారని, అవసరం కంటే విలువైన నీటిని అధికంగా వాడి దుర్వినియోగం చేస్తున్నారని రైతుల మీద చేసే ఆరోపణ గురించి తెలిసిందే. మిగతా ఎరువులను సరసమైన ధరలకు అందిస్తే ఏ రైతూ తన భూమిని పనికిరాకుండా చేసుకోడు.అలాగే రైతాంగానికి సరైన మార్గదర్శనం చేస్తే నీటి దుర్వినియోగమూ వుండదు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు 1980-81లో 3.9శాతంవుండగా 2014-15 నాటికి 2.2శాతానికి( 2016-17లో 2.6) తగ్గిపోగా ఇదే కాలంలో పెట్టుబడుల సబ్సిడీల మొత్తం 2.8 నుంచి 8శాతానికి పెరిగిందని సపోర్టింగ్ ఇండియన్ ఫార్మర్స్, ది స్మార్ట్ వే( భారతీయ రైతులకు మద్దతు, సరైన మార్గం) అనే పేరుతో రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. పెట్టుబడులకు-సబ్సిడీలకు లంకె పెట్టటం అసంబద్దం. పెట్టుబడులు పెట్టద్దని ఏ రైతూ అడ్డుకోలేదు. ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాల కారణంగా ఎరువులు, విద్యుత్ వంటివి రైతాంగానికి భారం అవుతున్నాయనే విషయం తెలిసిందే.ఇలాంటి అంశాల గురించి మేథోమధనం, అధ్యయనాలు జరిపి ఒక మార్గం కనుగొనటం కష్టమేమీ కాదు. ఏ రంగంలో అయినా ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది అంటే దాని వలన వచ్చే లాభం పౌరులందరికీ చెందుతుంది. ప్రభుత్వాలు మిలిటరీ, పోలీసు, కరెన్సీ, దేశ సరిహద్ధు భద్రతల వంటి విషయాలకే పరిమితమై మిగిలిన అన్ని అంశాలను ప్రయివేటురంగానికి వదలి వేయాలన్నది ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి బహుళజాతి గుత్త సంస్ధల కనుసన్నలలో వాటి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసే సంస్ధలు ఆదేశం. ప్రపంచంలో ఏడు బడా కంపెనీలు వ్యవసాయ రంగంలో పరిశోధనకు ఏటా ఏడువందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ మొత్తం మన దేశంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఖర్చుకు ఏడు రెట్లు ఎక్కువ. మనం చేసే ఖర్చు మన అవసరాలకు తగినదిగా లేదన్నది స్పష్టం.