Tags

, , ,

Image result for Freedom of the media, protection for journalists a mirage in the world

ఎం కోటేశ్వరరావు

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం

నరజాతి సమస్త పరపీడన పరాయణత్వం

అలాగే ఏదేశ చరిత్ర చూసినా ఎక్కడున్నది మీడియా స్వేచ్చ, జర్నలిస్టులకు రక్షణ అన్న ప్రశ్న తలెత్తుతోంది. మే మూడవ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్చాదినం, నవంబరు రెండున జర్నలిస్టులపై నేరాలు చేసిన వారిని శిక్షించకుండా వదల వద్దని కోరే అంతర్జాతీయ దినం, నవంబరు 16న భారత పత్రికా దినం !! ఎన్నిదినాలు జరిపినా ఎంతగా గొంతెత్తినా అనేక చోట్ల పరిస్ధితులు మరింత దిగజారుతున్నాయి. వాటిలో ఒకటి మన దేశం.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు గనుక నోరు మెదపలేదు

తదుపరి వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికనేతను కాదు గనుక మాట్లాడలేదు

తదుపరి వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు గనుక నోరు విప్పలేదు

తరువాత నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం మాట్లాడేవారెవరూ మిగల్లేదు

ఈ ప్రఖ్యాత కవిత రాసింది ఒక కమ్యూనిస్టు వ్యతిరేకి మార్టిన్‌ నియోమిల్లర్‌. జర్మనీలో లూధరన్‌ పాస్టర్‌ అయిన ఈ పెద్దమనిషికి కమ్యూనిజం అంటే పడదు గనుక వారి బద్దవ్యతిరేకి అయిన నాజీ హిట్లర్‌ అధికారానికి రావటానికి సహకరించిన వారిలో ఒకడయ్యాడు.రక్తం రుచి మరిగిన పులికి కావలసింది మనిషి తప్ప కమ్యూనిస్టా కమ్యూనిస్టు వ్యతిరేకా అన్నది దానికి అవసరం లేదు. ప్రపంచమంతా తన పాదాక్రాంతం కావాలనుకున్న హిట్లర్‌ మతాన్ని ఎలా వదలి పెడతాడు. మతం కూడా అధికారానికి లోబడి వుండాల్సిందే అని హుకుం జారీ చేయటంతో నియోమిల్లర్‌ వంటి ఎందరికో భ్రమలు తొలిగి పోయాయి. పర్యవసానం కారాగారవాసం. అక్కడే పై కవితను అక్షరబద్దం గావించాడు.

ప్రతి ఏటా ప్రపంచ వ్యాపితంగా అంతర్జాతీయ పత్రికా స్వేచ్చా దినాలు జరుగుతున్నా, అంతర్జాతీయ సంస్ధలు నిరసిస్తున్నా జర్నలిస్టుల మీద దాడులు తగ్గటం లేదు. నమోదైన కేసుల్లో విచారణను సాగదీయటం, శిక్షలు పడకపోవటం ఒక ప్రధాన అంశంగా తయారైంది. ప్రతి పది కేసుల్లో ఒకదానిలో మాత్రమే శిక్షలు పడుతున్నట్లు తేలింది. మన దేశంలో షెడ్యూలు కులాలు, తెగలు, మహిళల మీద జరిగిన దాడులు, అత్యాచారాలు, హత్య కేసులలో శిక్షలు పడేవి తక్కువనే అంశం కొంత మందికే తెలుసు. జర్నలిస్టుల మీద కేసుల్లో ఆ మాత్రం శిక్షలు కూడా పడటం లేదన్న నగ్నసత్యం చాలా మందికి కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల జరిగినదాడుల కేసుల సారాంశమిదే. కనీసం రెండు చోట్ల అధికార పార్టీ ఎంఎల్‌ఏలు లేదా వారి ముఖ్య అనుచరులు జర్నలిస్టుల మీదాడులకు దిగినా ఎలాంటి చర్యలు లేవు. అనేక చోట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించిన వుదంతాలలో వాటిని పట్టించుకొని అధికారపార్టీకి మచ్చతేవద్దని ఆయా సంస్ధల యాజమాన్యాలు దాడులకు గురైన తమ సిబ్బందిని హెచ్చరించటం కొసమెరుపు. గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన, అధికారుల బాధ్యతారాహిత్యం అని అందరికీ తెలిసినా మీడియానే కారణమని సోమయాజులు కమిషన్‌ పేర్కొన్న అంశాన్ని ఏ మీడియా సంస్ధా కనీసం ఖండించలేదు.

మన దేశంలో 1956లో ఏర్పాటు చేసిన తొలి ప్రెస్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు 1966 నవంబరు 16న ప్రెస్‌ కౌన్సిల్‌ ఏర్పడింది. అందువలన ఆ రోజును జాతీయ పత్రికా దినంగా పాటిస్తూ 1997 నుంచి ప్రెస్‌ కౌన్సిల్‌ ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. స్వేచ్చాయుతమైన, జవాబుదారీతనంతో కూడినదిగా మీడియా వుండాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఆచరణలో స్వేచ్చను హరించే వారిని, అడ్డగోలుగా వ్యవహరించే మీడియా సంస్ధలనూ సరైన దారిలో పెట్టటంలో ప్రెస్‌ కౌన్సిల్‌ విఫలమైంది. ఘటనలపై విచారణలు జరపటం, సిఫార్సులు చేయటం, సుభాషితాలు చెప్పటం తప్ప దానికి ఎలాంటి అధికారాలు లేవు. అది కూడా ఎవరు అధికారంలో వుంటే వారికి వంతపాడేదిగా మారటంతో అది ఇచ్చిన పిలుపును జర్నలిస్టులు పెద్దగా పట్టించుకోవటం లేదు.చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లు మన దేశంలో ప్రెస్‌ కౌన్సిల్‌ నేడు ఆశ్రితులకు, అవకాశవాదులకు పునరావాస కేంద్రంగా మారింది. అటు తప్పు చేసిన యాజమాన్యాలను, ఇటు మీడియా స్వేచ్చను హరిస్తున్న ప్రభుత్వాలను నిలదీయలేని అటూ ఇటూగాని స్ధితిలో వుంది. గతంలో పత్రికలే వున్నందున ఏర్పడిన సంస్ధకు ప్రెస్‌ కౌన్సిల్‌ అని పేరు పెట్టారు. దాన్ని మీడియా కౌన్సిల్‌గా మార్చాలని, ప్రజాతంత్ర పద్దతుల్లో ప్రతినిధుల ఎంపిక జరగాలని, తగిన అధికారాలు ఇవ్వాలన్న న్యాయమైన డిమాండ్లను ఎవరూ పట్టించుకోవటం లేదు. యాజమాన్యాలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో అన్న భయంతో మరో మీడియా కమిషన్‌ వేయాలన్న డిమాండ్‌ను అటు కాంగ్రెస్‌ ఇటు బిజెపి రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవటం లేదు.

నవంబరు 2వ తేదీ దినం విషయానికి వస్తే ‘ అంతర్జాతీయ భావ ప్రకటనా స్వేచ్చ పరస్పర మార్పిడి ‘ (ఇంటర్నేషనల్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఎక్సేంజ్‌-ఐఎఫ్‌ఇఎక్స్‌) అనే ఒక ప్రపంచ పౌర సంస్ధల యంత్రాంగం ప్రతి ఏడాది నవంబరు 23న ‘జర్నలిస్టులపై నేరాలు చేసిన వారిని శిక్షించకుండా వదల వద్దని కోరే అంతర్జాతీయ దినం’ 2011లో నిర్ణయించింది. ఆ తేదీని ఎందుకు ఎంచుకున్నారంటే 2009 నవంబరు 23న ఫిలిప్పయిన్స్‌లోని మాగుయిండానా ప్రాంత గవర్నర్‌ ఎన్నికలో ఒక అభ్యర్ధి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గనేందుకు ఇతరులు, ఆ వార్తను సేకరించేందుకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు కూడా వెళ్లారు. వారి వాహన శ్రేణిపై విరుచుకు పడిన సాయుధ ముఠా దానిలో వారందరూ అభ్యర్ధి మద్దతుదారులుగా భావించి వారందరినీ కిడ్నాప్‌ చేసి కాల్చిచంపింది. ఈ దారుణకాండలో 58 మంది మరణించగా వారిలో 34 మంది జర్నలిస్టులే వున్నారు. 2013లో ఐఎఫ్‌ఇఎక్స్‌ సభ్యులు, భావప్రకటనా స్వేచ్చను కోరుకొనే ఇతర పౌరసమాజ కార్యకర్తల వినతి, పరిస్ధితి తీవ్రత మేరకు 2013 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవం సందర్భంగా జనరల్‌ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించి నవంబరు రెండవ తేదీని ‘జర్నలిస్టులపై నేరాలు చేసిన వారిని శిక్షించకుండా వదల వద్దని కోరే అంతర్జాతీయ దినం’పాటించాలని నిర్ణయించింది. అదే సంవత్సరం నవంబరు రెండున మాలీ దేశంలో వార్తల సేకరణకు వెళ్లిన ఇద్దరు ఫ్రెంచి జర్నలిస్టులు ఘిష్‌లైన్‌ డ్యూపాంట్‌, క్లాడె వెర్లోన్‌లను హత్య చేశారు. అప్పటి నుంచి జర్నలిస్టుల మీద నేరాలు చేసిన వారెవరినీ వదలవద్దంటూ ఐఎఫ్‌ఇఎక్స్‌ సంస్ధ ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.ప్రతి ఏటా ఆ రోజు ఐరాస సభ్య దేశాలు తమ దేశాలలోని జర్నలిస్టుల కేసులను సమీక్షించాలని, దోషులకు శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని నివేదికలు ప్రకటించాలని యునెస్కో సభ్యదేశాలకు లేఖలు రాయటమే గాకుండా ప్రతి సంవత్సరం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నది.

ప్రతి ఏటా ప్రపంచ వ్యాపితంగా మే మూడవ తేదీన అంతర్జాతీయ పత్రికా స్వేచ్చాదినంగా పాటిస్తున్నాము. దీన్ని విండ్‌ హాక్‌ ప్రకటన అని కూడా పిలుస్తారు. నమీబియా రాజధాని విండ్‌హాక్‌లో 1991 ఏప్రిల్‌ 29 నుంచి మే మూడవ తేదీ వరకు యునెస్కో నిర్వహించిన ఒక సెమినార్‌లో ఆఫ్రికా జర్నలిస్టులు రూపొందించిన ప్రకటనను ఐరాస ఆమోదించింది. ప్రకటన జారీ చేసిన మే మూడవ తేదీని అంతర్జాతీయ దినంగా పాటించాలని కోరింది. తరువాత అనేక ప్రాంతీయ ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఈప్రకటనను అనేక దేశాలు సూత్రప్రాయంగా ఆమోదించినప్పటికీ ఆచరణలో మీడియా స్వేచ్చను మేడిపండుగా మార్చివేశాయి. మన రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్చకు హామీ వున్నప్పటికీ దీనికి మన దేశం మినహాయింపు కాదు. ప్రపంచంలో ఎత్తయిన విగ్రహం ఎక్కడుంది అంటే భారత్‌ అని చెప్పుకొనే విధంగా వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని సమున్నతంగా నిలబెట్టారు. అదే మోడీ పాలనలో మీడియా స్వేచ్చ విషయంలో మనదేశం నూట ఎనభై దేశాలలో 138 స్ధానంలో పాతాళంలో వుంది.

గత పన్నెండు సంవత్సరాలలో ప్రపంచంలోని పలు దేశాలలో దాదాపు వెయ్యి మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యకు గురయ్యారు. మన దేశంలో గతేడాదిలో 12 మంది హత్యకు గురయ్యారు. నిజానికి అంతం లేదంటూ ప్రతి ఏటా అనేక సంస్ధలు గళమెత్తుతూనే వున్నాయి. ప్రతి ఏటా మే మూడవ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్చా దినం సందర్భంగా ‘సరిహద్దులు లేని విలేకర్లు'( రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌-ఆర్‌డబ్ల్యుబి) ప్రపంచ దేశాల సూచికలను ప్రకటిస్తుంది. మనం పాకిస్ధాన్‌ కంటే కొద్దిగా ఎగువన వున్నాం. ఒక వైపు దేశంలో పరిస్ధితులు ఎలా వున్నాయో తెలిసి కూడా మన ప్రెస్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చంద్రమౌళి కుమార్‌ ప్రసాద్‌ ఈ సూచికను తాము ఆమోదించటం లేదని ప్రకటించారు. సమాచార ప్రాతిపదికన గాకుండా అభిప్రాయాల కనుగుణంగా సూచికలను రూపొందించారని వ్యాఖ్యానించటం నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకొనే పిల్లిమొగ్గ తప్ప మరొకటి కాదు. జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య గురించి నరేంద్రమోడీ మాట్లాడతారని ఎవరూ అనుకోలేదు కనీసం ట్విటర్‌ నుంచి కూడా ఖండన ప్రకటన రాలేదు. కొన్ని మీడియా సంస్ధలు, జర్నలిస్టులపై దాడులకు కొన్ని సంస్ధలు, కిరాయి హంతకులకు పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకుండా జరగలేదన్నది అందరికీ తెలిసిందే. మన దేశంలో భావ ప్రకటనా స్వేచ్చ గురించి ప్రముఖ న్యాయవాది ఒక సందర్భంగా చేసిన వ్యాఖ్యకు ఎంతో ప్రాధాన్యత వుంది.’ అసలు సమస్య మాట్లాడటానికి స్వేచ్చ కాదు, మాట్లాడిన తరువాత స్వేచ్చ. మీరు కోరుకున్న విధంగా మాట్లాడటానికి అనుమతి వుంటుంది, కానీ మాట్లాడిన తరువాత మిమ్మల్ని పట్టుకొనేందుకు, బయటికి తీసుకుపోయేందుకు ఒక వ్యక్తి సిద్దంగా వుంటాడు కనుక మీరు స్వేచ్చగా మాట్లాడలేరు.’ అన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశాలలో మాట్లాడిన దానికి విరుద్దంగా నకిలీ వీడియోలను తయారు చేసి అధికారంలో వున్నవారి మెప్పు, అర్ధిక ప్రయోజనం కోసం ప్రసారం చేసిన మీడియా సంస్ధల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించక తప్పదు.

Image result for Freedom of the media, protection for journalists a mirage in the world

స్వాతంత్య్రానికి ముందు కూడా మీడియాలో రెండు తరగతులు వుండేవి. ఒకటి స్వాతంత్య్ర లక్ష్యం కోసం ప్రధానంగా పని చేసినవి, రెండవ తరగతి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులతో ఘర్షణ పడకుండా స్వామికార్యం, స్వకార్యం నెరవేర్చుకొనేవి. తరువాత దేశ మీడియాలో ఆగీత చెరిగిపోయింది. ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద కేంద్రీకరణ లేదు. ఎవరు అధికారంలో వుంటే వారి భజనచేస్తూ లాభాల వేటే ప్రధాన వ్యాపకంగా మారింది. అందుకోసం వార్తను,దృశ్యాన్ని ఒక వ్యాపార సరకుగా మార్చివేశారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ వారిని వ్యతిరేకిస్తూ పత్రికలు పెట్టిన ఎందరో తమ ఆస్ధులను కరగదీసుకున్నారు. ఇప్పుడు వామపక్షాలకు చెందిన పత్రికలు తప్ప ప్రతి ఒక్కటీ లాభాలను అరగదీస్తున్నవే. మా పత్రిక ధర మీరు కొనే సమోసా కంటే తక్కువే అని గతంలో ఒక మీడియా సంస్ధ ప్రచారం చేసుకుంది. ఇప్పటికీ పత్రికలు సమోసా కంటే తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఒక్క పత్రికలు తప్ప ప్రపంచంలో ఏ వస్తువూ తయారీ ధరకంటే తక్కువకు లభ్యం కావటం లేదు. దీని అర్ధం వాటి నిర్వాహకులకు అందుకు తగిన ఆదాయం, లాభాలు వస్తుండటమే కారణం. టీవీ ఛానల్స్‌ కూడా అంతే. కొన్ని పార్టీలు, వాటి నేతలు, వ్యాపార సంస్ధల వార్తలను ఇస్తే కాసులు కురుస్తాయి, కొన్నింటికి ఎలాంటి ప్రతిఫలమూ వుండదు. అందుకే నేడు నూటికి తొంభై తొమ్మిది సంస్ధలు మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిఫలం రాదు అనుకున్న గ్రామీణ, రైతులు, కార్మికులు, ఇతర కష్టజీవుల అంశాలను విస్మరిస్తున్నాయి. అలాంటి వాటికి భావ ప్రకటనా స్వేచ్చ వుంటేనే లేకపోతేనేం.అందుకే నేడు మీడియా సంస్ధలను డబ్బులు సంపాదించే మేనేజర్లు నడుపుతున్నారు తప్ప సంపాదకులు కాదు. వార్తలను అమ్ముకోవటానికి, పాకేజీలకు అడ్డుపడిన సంపాదకులు ఇంటిదారి పట్టటం తప్ప మరొక మార్గం లేదు. అందుకే గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బిజెపి ఎవరు అధికారంలో వున్నా మీడియాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. లంగని వాటి ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు, తద్వారా వాటి మూతకు ప్రయత్నిస్తున్నారు. ఈ పూర్వరంగంలో మీడియా స్వేచ్చకు ముంచుకువస్తున్న హాని గురించి కూడా ఒక్క మాట కూడా రాయలేని సంపాదకులను నేడు మనం చూస్తున్నాం. ఫోర్త్‌ ఎస్టేట్‌గా మన్నననలను పొందిన మీడియా రియలెస్టేట్‌గా మారిపోయిందనే వ్యంగ్యవ్యాఖ్యానాలను వినాల్సి వస్తోంది. మీడియా యజమానులు, రాజకీయనేతలకు మధ్య వున్న గీత దాదాపుగా చెరిగిపోయింది. వారి ప్రయోజనాలను వీరు వీరి ప్రయోజనాలను వారు కాపాడుకుంటున్నారు. కొందరు రాజకీయనేతలు స్వయంగా మీడియా సంస్ధలను ఏర్పాటు చేసుకున్నారు. అధికారంలో వున్నపుడు దానిని అడ్డుపెట్టుకొని లాభాలు సంపాదించటం, ప్రతిపక్షంలో వున్నపుడు వాటినే పెట్టుబడిగా పెట్టి నిలుపుకోవటం గతంలో జరిగింది. ఇప్పుడు రాజకీయ నేతలు, వారి కనుసన్నలలో మెలిగే మీడియా సంస్ధలు ఎక్కడ అధికారం వుంటే ఆవైపే చేరటం రివాజుగా మారింది. అలాంటి మీడియా సంస్ధలకు మీడియా స్వేచ్చతో పని లేకపోవటమే కాదు, స్వేచ్చకు ముప్పు తెచ్చిన పార్టీలను నిస్సిగ్గుగా సమర్ధించటం కూడా చూస్తున్నాము. దేశంలోని గుత్త పెట్టుబడిదారీ సంస్ధలు మీడియా రంగంలో ప్రవేశించటం కూడా పైదానిలో భాగమే. దేశవ్యాపితంగా పలుభాషా ఛానళ్లు కలిగిన రిలయన్స్‌ గ్రూప్‌ ద్వారా రానున్న పార్లమెంట్‌, రాష్ట్రాల ఎన్నికలలో లబ్ది పొందే ఎత్తుగడలో భాగంగానే మోడీ సర్కార్‌ రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రభుత్వరంగ సంస్ధ హాల్‌ను పక్కన పెట్టి రిలయన్స్‌ కంపెనీని ఎంచుకొనే విధంగా ప్రభుత్వం పావులు కదిపింది. ఆ కుంభకోణ వార్తలను ప్రసారం చేసినందుకు ఎన్‌డిటివి, ప్రచురించినందుకు నేషనల్‌ హెరాల్ట్‌ పత్రిక మీద రిలయన్స్‌ 15వేల కోట్లరూపాయలకు పరువు నష్టం దావా వేసింది. మీడియా స్వేచ్చ అణచివేతలో కార్పొరేట్‌ కంపెనీల పాత్రకిది నిదర్శనం. అంతకు ముందు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడి వ్యాపారలాభం విపరీతంగా పెరిగిన తీరును ప్రచురించిన వైర్‌ వెబ్‌ పోర్టలప్‌పై వందకోట్లకు దావా వేసిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ రైతు అనుకూల విధానాల ఫలితంగా తన ఆదాయం రెట్టింపు అయిందని చత్తీస్‌ఘర్‌లోని ఒక గిరిజన మహిళా రైతు చెప్పటాన్ని బిజెపి, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. అయితే అధికారులు పనిగట్టుకొని అలా చెప్పించినట్లు ఎబిపి వార్తా ఛానల్‌ జర్నలిస్టులకు ఆ యువతే స్వయంగా చెప్పింది. ఆ వార్తను ప్రసారం చేసినందుకు ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వ,బిజెపి పెద్దలు పతంజలి కంపెనీ మీద వత్తిడి తెచ్చి ఎపిబి చానల్‌తో కుదుర్చుకున్న వంద కోట్ల యాడ్ల ఒప్పందాన్ని రద్దు చేయించారు. అంటే కార్పొరేట్ల, పాలకుల బండారాన్ని బయటపెట్టిన మీడియా సంస్ధల ఆర్ధికమూలాలను దెబ్బతీయటం ద్వారా మీడియాను తమ పాదాక్రాంతం చేసుకొనేందుకు కార్పొరేట్లు, పాలకపార్టీలు ఎలా ప్రయత్నిస్తున్నాయో స్పష్టం అవుతోంది. ఇలాంటి విషయాల్లో ఇష్టమైన వారితో పాకేజ్‌లు కుదుర్చుకోవటంలో ఇష్టం లేని వారిని ఇబ్బందులపాల్జేసి తమ దారికి తెచ్చుకోవటంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రస్తుత ముఖ్య మంత్రుల తీరుతెన్నులు అందరికీ తెలిసిందే.

Image result for Freedom of the media, protection for journalists  in india cartoons

మీడియా స్వేచ్చ సూచికలో 2012లో 131, 2014లో 140 లేదా ఈ ఏడాది 138వ స్థానం మనది అంటే అటు కాంగ్రెస్‌,ఇటు బిజెపి కూడా ఎడం కన్ను, కుడి కన్ను తేడా తప్ప ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయన్నది స్పష్టం. అందువలన వాటి గురించి చర్చించుకోవటం వృధాప్రయాస. గతంలో కాంగ్రెస్‌ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మీడియా వార్తలపై ప్రత్యక్ష సెన్సార్‌షిప్‌ విధించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ లేదా బిజెపి వాటితో జట్టుకట్టే పాలకవర్గ ప్రాంతీయ పార్టీలు మీడియా మీద పరోక్ష సెన్సార్‌ను అమలు జరుపుతున్నాయి. వారికి ఇష్టం లేని వార్త అసలు రాకపోవటం లేదా కనిపించీ కనిపించకుండా ఒక మూలనపడవేయటమో జరుగుతోంది.తమ విధానాలను ప్రశ్నించిన మీడియా సంస్దలకు ప్రకటనలు నిలిపివేయటం, టీవీ ఛానల్స్‌ అయితే కేబుల్‌ నిర్వాహకులను బెదిరించి ఛానల్స్‌ ప్రసారాలను అడ్డుకోవటాన్ని చూశాము. దొంగే దొంగ అని అరచినట్లుగా కుహనా వార్తలకు ఆద్యులుగా వున్న శక్తుల ప్రతి నిధులు తిష్టవేసిన కేంద్ర ప్రభుత్వం కుహనా వార్తలు రాసే జర్నలిస్టు ఎక్రిడిటేషన్‌ రద్దు చేయాలని సర్కార్‌ మార్గదర్శక సూత్రాలను సవరించింది. వాటి ప్రకారం తొలి తప్పుడు వార్తకు ఆరునెలలు, రెండోదానికి ఏడాది అక్రిడిటేషన్‌ సస్పెండ్‌ చేయాలి. మూడోసారి రాస్తే శాశ్వతంగా రద్దు చేయాలి. వీటిపై జర్నలిస్టుల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో మోడీ సర్కార్‌ తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. జర్నలిస్టుల నిరసన కంటే కుహనా వార్తల తయారీ ఫ్యాక్టరీలను పెట్టి పుంఖాను పుంఖాలుగా వుత్పత్తి చేస్తున్న వారందరూ సంఘపరివార్‌కు చెందిన వారే అన్నది బహిరంగ రహస్యం. వెనుకా ముందు చూసుకోకుండా లేదా తెలిసీ అలాంటి వార్తలను ప్రచురించిన, ప్రసారం చేసిన మీడియా సంస్ధలు కూడా ప్రభుత్వ అనుకూలమైనవే. అందువలన నిజంగా వేటు పడితే అది తమ మీదే అని వారే ఎక్కువగా వత్తిడి తెచ్చారు. చిత్రం ఏమిటంటే అసలు కుహనా వార్తలు అంటే ఏమిటో, ఎవరికి, ఏ ప్రాతిపదికన ఫిర్యాదు చేయాలో కూడా నిర్ణయించకుండానే ఆ మార్గదర్శక సూత్రాలను జారీ చేశారంటే వారి స్ధితిని అర్ధం చేసుకోవచ్చు. మీడియా సంస్ధలలో రిపోర్టర్లతో పాటు కార్యాలయాల్లో పని చేసే సబ్‌ ఎడిటర్లు కూడా వార్తలు రాస్తారని, వారికి అక్రిడిటేషన్లు వుండవని(తెలుగు రాష్ట్రాలలో కొత్తగా సబ్‌ ఎడిటర్లకు అక్రిడిటేషన్లు ఇచ్చారు) అక్కడే కుహనా వార్తలు ఎక్కువగా వుత్పత్తి అవుతాయని, అన్నింటికంటే వెబ్‌ సైట్లు అలాంటి వార్తలతో జనాన్ని ముంచెత్తుతున్నాయని మార్గదర్శకాలు జారీ చేసిన వారికి తెలియదనుకోవాలా ? లేక తమ విధానాలు, వైఖరులను ఎంగడుతున్న కవులు, కళాకారులు, మేథావులు ఇలా ప్రతిఒక్కరి నోరు మూయించాలని చూస్తున్నట్లుగానే జర్నలిస్టులను కూడా బెదిరించాలనే వూపులో ఈ పని చేశారా ?

Image result for Freedom of the media, protection for journalists  in india

ఇటీవలి వరకు సమాచార రంగం మీద గుత్తాధిపత్యం వున్న సామ్రాజ్యవాద,పెట్టుబడిదారీ దేశాలు తాము వార్త అనుకున్నదానినే ప్రపంచానికి అందచేసేవి. ఆక్రమంలో తప్పుడు వార్తలను కూడా గణనీయంగా సృష్టించాయి. వాటిని ప్రాతిపదికగా చేసుకొని వియత్నాంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి అక్కడ కీలుబమ్మ సర్కార్‌ను ఏర్పాటు చేయాలని అమెరికన్లు నిర్ణయించారు.దానికోసం 1964 ఆగస్టునాలుగవ తేదీ అర్ధరాత్రి నాటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ టీవీలో ఒక ప్రకటన చేస్తూ అంతర్జాతీయ సముద్రజలాలైన టోంకిన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో తమ నౌకలపై వియత్నాం దాడి చేసిందని ప్రకటించటమే కాదు, దాని మంచి చెడ్డల విచారణకోసం ఆగకుండా ఐక్యరాజ్యసమితితో నిమిత్తం లేకుండా వెంటనే వియత్నాం మీద యుద్దం ప్రకటించి పది సంవత్సరాల పాటు అకృత్యాలకు పాల్పడ్డారు. తీరా చూసే ్త అసలు టోంకిన్‌ గల్ఫ్‌లో అమెరికా నౌకల మీద ఎలాంటి దాడి జరగలేదని తేలింది.ఇప్పటికీ అమెరికన్లు ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు సిద్దపడటం లేదు. మన కళ్ల ముందే ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోశారని తప్పుడు వార్తలను ప్రచారంలో పెట్టి దాని మీద జరిపిన దాడిని చూశాం. ఇప్పుడు సిరియాలో జరుపుతున్నదాడులు కూడా అలాంటి నకిలీవార్తల పర్యవసానాలే. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మన దేశంలో గత ఐదు సంవత్సరాలుగా కుహనా వార్తలు సామాజిక మాధ్యమాన్ని ముంచెత్తుతున్నాయి. నిజం నాలుగు అడుగులు వేసే లోగా అబద్దం నలభై అడుగుల ముందు వుంటోంది. అవన్నీ ఒక పధకం ప్రకారమే వెలువడుతున్నాయి. ఏది నిజమో ఏది కాదో తెలుసుకోలేని గందరగోళంలో జనాన్ని పడవేసేందుకు, నిజాన్ని కూడా ఒక పట్టాన నమ్మకుండా చేసేకుట్ర దీనిలో వుంది. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ ప్రభుత్వంలో మంత్రిగా వున్న గోబెల్స్‌ ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుంది అన్న సూత్రంతో పని చేశాడు. ఇప్పుడు మనిషి మనిషికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావటంతో గోబెల్స్‌లు వికటాట్టహాసం చేస్తున్నారు. వెనుకా ముందూ చూడకుండా వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఎత్తిపోస్తున్నారు. నిజమైన జాతీయవాదుల మీద అవాస్తవాలు, వక్రీకరణలు ప్రచారం చేస్తూ, నకిలీలను నిజమైన వారిగా చిత్రించటం మనం చూస్తున్నదే. జాతీయవాదం, దేశభక్తి వంటి పదాలకు అర్ధాలనే మార్చివేస్తున్నారు. ప్రధాన స్రవంతి మీడియా సంస్ధలు కూడా ఇందుకు తమవంతు తోడ్పాడును అందిస్తున్నాయి. అందువలన నిజమైన వార్తలు, నిజమైన పత్రికా, మీడియా స్వేచ్చ అంటే జనం కూడా గందరగోళానికి గురి అవుతున్నారు. పరాయి పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని జాతీయవాదులుగా పిలిచిన రోజులను మరుగున పడవేస్తున్నారు. పరాయి పాలకులకు అడుగులకు మడుగులత్తిన వారిని, హిందూత్వ పేరుతో పరాయి మతాలమీద ద్వేషభావాన్ని రెచ్చగొట్టిన వారిని అసలు సిసలు జాతీయవాదులుగా ప్రచారం చేస్తున్నారు. గాంధీని హత్య చేసిన గాడ్సే అందుకు వుదాహరణ. ఈ రోజు జాతీయవాదులుగా చెప్పుకుంటున్నవారు గాంధీ ఎందుకు హత్యకు గురయ్యాడు అన్నదాని కంటే గాడ్సే గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే సమర్ధనాంశాన్ని ముందుకు తెస్తున్నారు.నేడు దేశంలో అత్యధిక మీడియా సంస్ధలు, జర్నలిస్టులు జర్మన్‌ పాస్టర్‌ ఆత్మావలోకనం చేసుకొని అనుభవసారాన్ని గ్రహించటం లేదు. తమదాకా రాలేదు కదా, వచ్చినపుడు చూద్ధాంలే అని భావిస్తున్నారు. తీరా వచ్చాక అయ్యో అన్యాయం అనే వారెవరూ మిగలరని గుర్తించకపోవటమే విచారకరం. భరతమాత శృంఖలాను బద్దలు చేసేందుకు,స్వేచ్చా స్వాతంత్య్రాల కోసం ప్రాణాలర్పించిన దేశం మనది. వాటికి భంగం కలిగితే తిరిగి అలాంటి తిరుగుబాటు చేసే చేవ వున్న జాతి మనది.