Tags

, , ,

Image result for brexit deal or no deal

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావన్ల ప్రకటనతో కన్యాశుల్కం నాటకం ఏ మలుపులు తిరిగిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఐరోపా యూనియన్‌(ఇయు)నుంచి విడిపోయిన(బ్రెక్సిట్‌) అనంతర సంబంధాల గురించి తాను కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆమె ప్రత్యర్దులు ఒప్పందాన్ని తిరస్కరించటం ద్వారా ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇయుతో తెగతెంపులు చేసుకోవాలనే కొత్త వాదనను తాజాగా ముందుకు తెస్తున్నారు. దాంతో ఒప్పందం వుంటే ఏమిటి లేకుంటే ఏమి జరుగుతుంది అన్న చర్చ ఇప్పుడు బ్రిటన్‌లో జరుగుతోంది. మరోవైపు బడాకార్పొరేట్‌ లాబీ ఇయు నుంచి బయటకు పోయినా తమ లాభాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొనే విధంగా ప్రయత్నిస్తున్నది. బ్రిటన్‌లోని వివిధ కమ్యూనిస్టు పార్టీలు బ్రెక్సిట్‌కు అనుకూలంగా రెండు సంవత్సరాల క్రితం ఓటు వేశాయి. ప్రధాన టోరీ, లేబర్‌ పార్టీలలో పునరాలోచన తలెత్తినప్పటికీ విడిపోయే విషయంలో కమ్యూనిస్టుపార్టీలు ఎలాంటి పునరాలోచన చేయటం లేదు. అయితే అక్కడి రాజకీయాలలో వీటి పాత్ర పరిమితం అన్న విషయం తెలిసిందే. పార్టీలోని పచ్చి మితవాదులు ప్రధాని థెరెసా మే మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తుండగా మరికొందరు అంతవరకు రాకుండా పార్టీలోనే సభా నాయకురాలిగా విశ్వాసతీర్మానం ఎదుర్కోవాలనే ప్రయత్నాల్లో వున్నారు. మరోవైపు ఒక వేళ ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి విడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాంకేతికపరమైన నోటీసుల పేరుతో ప్రభుత్వం అన్ని తరగతులకు సమాచారాన్ని తెలియ చేస్తున్నది. దీంతో ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ వేరు పడుతుందా అన్న వూహాగానాలకు తెరలేచింది. ఈ సమస్య చివరకు థెరెసా మే వుద్యోగం వూడగొతుందా? ఆమె ప్రత్యర్ధులు చిత్తవుతారా అనేది వెండితెరపై చూడాల్సిందే. అసలు సమస్య ఏమిటి?

రెండు సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా అనే అంశంపై ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. దాన్నే క్లుప్తంగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. వెళ్లిపోవాలనే అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు ఎలా వుపసంహరించుకోవాలనే అంశం మీద కూడా మరో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నాయి.ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ చేరటం నుంచి విడిపోవటం, అంతిమంగా ఎలా విడిపోవాలన్నది కూడా వివాదాస్పదం కావటం అంటే ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను వెల్లడించటమే. ఎలా విడిపోవాలి అనే అంశంపై కుదుర్చుకున్న ఒప్పందానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.మెరుగైన తన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని ప్రకటించిన 24 గంటలు కూడా గడవ ముందే బ్రెక్సిట్‌ మంత్రి, మరొకరు రాజీనామా ప్రకటించి వత్తిడి పెంచారు. స్వపక్షంతో పాటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూడా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది.

2016 జూన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52శాతం మంది ఇయు నుంచి బ్రిటన్‌ బయటకు రావాలని ఓటు వేయగా 48శాతం వుండాలని ఓటు వేశారు. బయటకు వస్తేనే సార్వభౌమత్వాన్ని తిరిగి పొందటం, వలసల విషయంలో భూభాగంపై మరింత అదుపు సాధ్యమని బ్రెక్సిట్‌ మద్దతుదార్లు పేర్కొన్నారు. బయటకు వస్తే ఆరోగ్య పరిరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు అవకాశం వుంటుందని ఓటర్లను తప్పుదారి పట్టించారు. దశాబ్దాల పాటు యూనియన్‌లో కొనసాగి ఇప్పుడు వుపసంహరించుకుంటే అనూహ్య సమస్యలు తలెత్తుతాయని సమర్ధకులు పేర్కొన్నారు.నిజానికి ఐరోపా యూనియన్‌లో వున్నప్పటికీ బ్రిటన్‌ కోల్పోయిందేమీ లేదు. మిగతా దేశాలన్నీ తమ కరెన్సీలను రద్దు చేసుకొని యూరోకు మారితే బ్రిటన్‌ తన పౌండ్‌ను అలాగే కొనసాగిస్తోంది. తన స్వంత వడ్డీ రేట్లు,ద్రవ్య విధానాలు, సరిహద్దులలో సందర్శకుల తనిఖీ స్వంత నిబంధనలు అమలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ చట్టబద్దమైనది కాదు. పార్లమెంట్‌ అనుమతి లేనిదే వుపసంహరణ ప్రక్రియ ప్రారంభం కారాదని బ్రిటన్‌ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో పార్లమెంట్‌ ఒక చట్టం చేయాల్సి వచ్చింది. ఐరోపా యూనియన్‌ నిబంధన ప్రకారం ఏ సభ్యదేశమైనా బయటకు వెళ్ల దలచుకుంటే ఆర్టికల్‌ 50 అమలు జరపాలని కోరాల్సి వుంది. ఆ మేరకు పరివర్తనా కాల వ్యవధి ముగిసే 2019, మే 29నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వుంది. ఈలోగా గతంలో కుదిరిన ఒప్పందాలు,భవిష్యత్‌ సంబంధాలపై బ్రిటన్‌ -ఇయు మధ్య ఒక ఒప్పందం జరగాల్సి వుంది. ఇప్పుడు ప్రధాని థెరేసా మే దాన్నే ప్రతిపాదించారు.

Image result for brexit deal or no deal cartoons

ఒప్పందానికి కట్టుబడతారో లేదో తేల్చుకోవాల్సింది బ్రిటన్‌ తప్ప బ్రెక్సిట్‌ విషయంలో ఎలాంటి పున:సంప్రదింపులు లేవని ఐరోపాయూనియన్‌ కరాఖండిగా చెప్పింది. పరివర్తన కాల వ్యవధి పొడిగింపు, అస్పష్టంగా వున్న కొన్ని అంశాల గురించి సంప్రదింపులు తప్ప ప్రధాన మార్పులకు అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ స్పష్టం చేసింది.యూనియన్‌ చర్చల ప్రధాన ప్రతినిధి మైఖేల్‌ బార్నియర్‌ విలేకర్లతో మాట్లాడుతూ బ్రిటన్‌లో రాజకీయ పరిస్ధితి ఎలా వున్నప్పటికీ ఇయు రాయబారులెవరూ వారితో విడిగా మాట్లాడవద్దని కోరారు. అనేక మంది ఐరోపా నేతలు బ్రిటన్‌ ప్రధాని వైఖరికి మద్దతుగా మాట్లాడటం విశేషం. వారిలో ఆస్ట్రియన్‌ ఛాన్సలర్‌ సెబాస్టియన్‌ కర్జ్‌ ఒకరు. ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయవద్దని డచ్‌ ప్రధాని మార్క్‌ రూటే వ్యాఖ్యానించారు. యూనియన్‌ నుంచి బయటకు వస్తే బ్రిటీష్‌ పౌరులకు బంగారు భవిష్యత్‌ వుంటుందని అక్కడి బాధ్యతారహితమైన అనేక మంది రాజకీయ నాయకులు జనానికి చెప్పారు, నిజం ఏమిటంటే ఆ నిర్ణయం వారికి కాళరాత్రి అవుతుంది అని ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 29లోగా ఒప్పందం కుదరకపోతే వెంటనే సంబంధాలు రద్దవుతాయి. ఎలాంటి పరివర్తన వ్యవధి వుండదు.

బ్రిటన్‌లో టోరీ లేదా లేబర్‌ పార్టీగానీ రెండూ మౌలికంగా పెట్టుబడిదారీ వర్గప్రతినిధులే.అయినా వాటి మధ్య అధికారం విషయంలో తగాదాలున్నాయి.వివరాలు వెల్లడైన మేరకు ఒక అభిప్రాయం ప్రకారం ఆ ఒప్పంద సారాంశాన్ని చెప్పాలంటే కార్పొరేట్‌, ఇతర ధనికుల ప్రయోజనాలను రక్షించేదిగా, వలస వచ్చే వారి మీద దాడి చేసేదిగా వుంది. గతంలో బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది మార్చినెలాఖరుకు ఐరోపా యూనియన్‌(ఇయు) నుంచి బయటకు వస్తుంది. ఆ తరువాత 21నెలల పాటు పరివర్తన కాలం వుంటుంది. ఆ సమయంలో అనేక ఐరోపా స్వేచ్చా మార్కెట్‌ నిబంధనలు వర్తించే కస్టమ్స్‌ పన్నుల పరిధిలో బ్రిటన్‌ వుంటుంది. తరువాత ఏమిటన్నది సమస్య. తరువాత కూడా కార్పొరేట్‌, ధనికులకు వుపయోగపడే విధంగా బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను రూపొందించాలన్న వత్తిడి మేరకు బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను పొందుపరిచారన్నది ఒక అభిప్రాయం.పరివర్తన వ్యవధిలో బ్రెక్సిట్‌ అనంతర సంబంధాలపై బ్రిటన్‌-ఇయు మధ్య ఒప్పందం కుదరకపోతే పరివర్తన కాలం పొడిగింపు వుంటుంది. అంటే యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా బ్యాంకింగ్‌, రవాణా, పౌరసేవల వంటి అంశాలలో బ్రిటన్‌కు కూడా ఇయు సభ్యదేశాలతో సమాన అవకాశాలు కల్పించాలన్నది బ్రిటన్‌ కార్పొరేట్ల డిమాండ్‌. పరివర్తన కాలం ముగిసిన తరువాత బ్రిటన్‌లో వున్న దాదాపు 30లక్షల మంది ఇయు వలస పౌరులు అక్కడే వుండేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బ్రిటన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఐదేండ్లనుంచి వుంటున్నట్లు రుజువు చేసుకున్నవారు అక్కడే స్ధిరపడిన స్ధితిలో కొనసాగవచ్చు. ఇదే నిబంధన ఇయు దేశాలలో వున్న బ్రిటన్‌ వలస పౌరులకు కూడా వర్తిస్తుంది.ఐరోపా యూనియన్‌ విధానాలను బట్టి ఇతర దేశాల వాసులు స్ధిరపడిన స్ధితిని బ్రిటన్‌ సర్కార్‌ రద్దు కూడా చేయవచ్చు. ఆర్ధికంగా సంపాదన లేని వారు తమ కుటుంబసభ్యులకు భారంగా లేమని తమకు తగినన్ని ఆర్ధిక వనరులు, సమగ్ర ఆరోగ్యబీమా వుందని రుజువు చేసుకోవాల్సి వుంది. వలస వచ్చిన వారికి బీమా సౌకర్యాన్ని వర్తింప చేయకూడదనే వత్తిళ్లు ఇప్పటికే వున్నాయి.వివాహ బంధంలో విడిపోయినపుడు భరణం చెల్లించటం గురించి తెలిసిందే.అలాగే విడిపోవాలని బ్రిటనే కోరుకుంది గనుక పరిహారంగా ఇయుకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వుంటుంది.

పాలక టోరీ పార్టీలో బ్రెక్సిట్‌ ఒప్పందం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అది చివరకు ఇద్దరు మంత్రుల రాజీనామా, ప్రధానిపై అవిశ్వాసతీర్మానం పెట్టాలనేంతవరకు దారితీశాయి. ఇయు నుంచి వెళ్లిపోవాలని గట్టిగా పట్టుబడుతున్నవారు పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని, వాణిజ్యం నుంచి వలసలు, వుత్పత్తుల క్రమబద్దీకరణ వరకు అన్నింటికీ బ్రిటీష్‌ చట్టాలు తప్ప ఇయు చట్టాలతో సంబంధం వుండకూడదని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నవారు బ్రిటన్‌-ఇయు మధ్య కొన్ని సంబంధాలను కానసాగించాలని, పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే దేశ ఆర్ధిక వ్యవస్ధకు, రాజకీయ స్ధిరత్వానికి విపత్కరమని వాదిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలే ప్రతిపక్ష లేబర్‌ పార్టీలోనూ వున్నాయి.బ్రెక్సిట్‌ తరువాత కూడా ఇయు కస్టమ్స్‌ యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగేందుకు వీలైన అంశం థెరేసా మే ఒప్పందంలో వుంది. ఐర్లండ్‌ అంతర్యుద్ధంలో వుత్తర ఐర్లండ్‌ ప్రాంతంలో మెజారిటీగా వున్న ప్రొటెస్టెంట్‌లు తాను బ్రిటన్‌లో భాగంగా వుండాలని కోరుకున్నారు. కాథలిక్కులు మెజారిటీ ఐర్లండ్‌లో వుండిపోయారు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యలో భాగంగా 1999లో కుదిరిన గుడ్‌ ఫ్రైడే ఒప్పందం మేరకు ఐర్లండ్‌ – వుత్తర ఐర్లండ్‌ మధ్య సరిహద్దు నిబంధనలు సులభతరంగా వున్నాయి. ఇప్పుడు బ్రిటన్‌ బయటకు పోయిన తరువాత ఐర్లండ్‌ గనుక ఇయు కఠిన నిబంధనలు అమలు జరిపితే అది 1999 ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. అందువలన సరిహద్దు నిబంధనలు సులభతరంగా వుండాలని బ్రిటన్‌ కోరుతోంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని బ్రిటన్‌ తన వుత్పత్తులను ఐర్లండ్‌లోకి పంపితే ఎలా అన్నది ఇయు సమస్య.

Image result for brexit deal or no deal

ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకోదలచిన ముసాయిదా పత్రంలోని అంశాలను వ్యతిరేకిస్తూ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా, వారి బదులు మరొక ఇద్దరిని వెంటనే నియమించారు. ఒప్పందం తనకోసం కాదని జాతీయ ప్రయోజనాలకోసమే అని ప్రధాని చెబుతున్నారు. తన ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని థెరెసా మే సోమవారం నాడు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ(సిబిఐ)కివిజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందం వలన తమకు చౌకగా దొరికే కార్మికుల కొరత ఏర్పడుతుందని, తద్వారా తాము నష్టపోతామని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి.ఒప్పందం కుదురుతుందన్న వార్తలు వెలువడగానే బ్రిటన్‌ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతున్నాయని ఒక కంపెనీ తూర్పు ఐరోపాకు తరలాలని నిర్ణయించినట్లు సిబిఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒప్పందం లేకుండా బ్రిటన్‌ విడిపోతే 50 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సిన అవసరం వుండదని కొందరు భాష్యం చెబుతుండగా ఒప్పందం వున్నా లేకపోయినా పరిహారం చెల్లించాలని మరికొందరు చెబుతున్నారు.ఈనెల 25న బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ నేతలతో ఆమె సమావేశం తరువాత బ్రిటన్‌లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో నాయకత్వ మార్పు సమస్యను ముందుకు తెచ్చినంత మాత్రాన జరిగేదేమీ వుండదని, సంప్రదింపులు ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు మరింత పెరుగుతుందని ఆమె హెచ్చరించారు.