Tags

, , , ,

Image result for vote politics behind ayodhya,ayyappa stirs

ఎం కోటేశ్వరరావు

దేశంలో వుత్తరాదిన ప్రారంభం కానున్న ఒక ఆందోళన. దక్షిణాదిన జరుగుతున్న ఒక అరాచకం. రెండింటి నిర్వాహకులూ ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ శక్తులే. నవంబరు 25న ధర్మ సభ పేరుతో ఆయోధ్యలో నిర్వహించే కార్యక్రమానికి విశ్వహిందూపరిషత్‌ ఒక లక్ష మందిని, ఆర్‌ఎస్‌ఎస్‌ మరో లక్షమందిని సమీకరించనున్నట్లు ప్రకటించాయి. వారి నుంచి అయోధ్య-ఫైజాబాద్‌ జంటనగరాలలోని మైనారిటీలపై దాడులు జరిగే అవకాశం వుందనే సమాచారంతో రాష్ట్ర బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలను అమలు చేస్తోంది. శివసేననేత వుద్దావ్‌ థాకరే నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. తాను రామభక్తుడిగా ఆ రోజు అయోధ్యకు వస్తానని తనను ఎవరు ఆపుతారో చూస్తానన్నట్లుగా థాకరే ప్రకటించాడు. డిసెంబరు తొమ్మిదిన ఢిల్లీలో సభ తరువాత దేశ వ్యాపితంగా ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు.

మరొకటి శబరిమల. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఆలయ సందర్శనకు వస్తున్న హిందూ మతానికి చెందిన మహిళలను కూడా తాము రానిచ్చేది లేదంటూ ఆ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న సంస్ధల నుంచి తలెత్తిన ముప్పును నివారించేందుకు, భక్తుల ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని అడ్డుకొనేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం 144వ సెక్షన్‌ ప్రకటించింది. అయోధ్యలో ఆంక్షల గురించి పల్లెత్తు మాట్లాడని వారు శబరిమల విషయంలో ప్రభుత్వం భక్తులను అడ్డుకుంటున్నట్లు నానా యాగీ చేస్తున్నారు.దొంగే దొంగని అరవటం అంటే ఇదేనేమో !

దేశంలో మత లేదా మతోన్మాద శక్తులు అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. వారు కోరుకున్నది ఒకటి వస్తున్న ఫలితం మరొకటి. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఒక వైపు వ్యతిరేకిస్తూ ఆలయ సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు. తమ ఆందోళన అసలు లక్ష్యం సిపిఎం నాయకత్వంలోని ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అని బిజెపి నేత బాహాటంగా చెప్పాడు. అయోధ్య, శబరిమల రెండు చోట్లా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారి గురించి జనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

శబరిమల వుదంతంలో కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూసి తాము అనుకున్నదానికి వ్యతిరేకంగా వచ్చే సరికి అయ్యప్పను వీధుల్లోకి లాగుతున్నారు. వయస్సులో వున్న ఆడవారు తనను చూడకూడదని అయ్యప్ప చెప్పటాన్ని తాము స్వయంగా విన్నామన్నట్లుగా మాట్లాడుతున్న వారు మరోవైపు అదే వయస్సులో వున్న మహిళలను ముందుకు తెచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే తాము కోరుకున్న విధంగా కేంద్రం ఒక చట్టాన్ని చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని రామమందిరం నిర్మించాలంటున్నారు. తాము కోరుకున్నది తప్ప కోర్టులు ఇచ్చిన తీర్పులను, ఇవ్వబోయే తీర్పులను కూడా తాము అంగీకరించేది లేదని రాజ్యాంగమూ, కోర్టులు, చట్టాలను తాము పట్టించుకొనేది లేదని ప్రకటించే వుగ్రవాద సంస్ధలకూ వీటికి తేడా ఏమిటో జనం ఆలోచించాలి.

పరిష్కారమైన శబరిమల కేసును తిరిగి వివాదంగా మార్చ చూస్తున్నది మతశక్తులు. దశాబ్దకాలం పాటు సాగిన కోర్టు విచారణలో తమ వాదనలకు అనుకూలంగా వున్న నిషేధ ఆధారాలను సమర్పించటంలో విఫలమయ్యారు. రెండు వందల సంవత్సరాల నాడే బ్రిటీష్‌ పాలకుల హయాంలో పిల్లలను కనే వయసులో వున్న మహిళలకు ఆలయ ప్రవేశ నిషేధం వున్నట్లు ఆధారాలు దొరికాయని ఇటీవల ఒక పెద్దమనిషి ప్రకటించాడు. నిజానికి అదేమీ కొత్త అంశం కాదు. అన్ని వయసుల వారినీ ఆలయ ప్రవేశానికి అనుమతించాలన్న మెజారిటీ తీర్పును వ్యతిరేకించిన ఐదవ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా ఆ అంశాన్ని తన వ్యతిరేక నోట్‌లో పేర్కొన్నారు. వాటన్నింటినీ పరిశీలించిన తరువాతే ఆ తీర్పు వెలువడింది. అయినా ఇదేదో కొత్తగా కనుగొన్న అంశం మాదిరి మీడియాలో పెద్ద ఎత్తున ఆ వార్తలకు ప్రాచుర్యం కల్పించటం గమనించాల్సిన అంశం. నిజంగా అలాంటి పక్కా ఆధారాలు వున్నపుడు వాటి మీద విశ్వాసం వున్నవారు వెంటనే సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను విరమించాలి. కోర్టులో అనేక పునర్విచారణ పిటీషన్లు దాఖలయ్యాయి, వాటిని పరిశీలించేందుకు కోర్టు కూడా అంగీకరించినందున ఆ సమయంలో తమకు దొరికిన బలమైన సాక్ష్యాన్ని కోర్టుకు సమర్పించి తీర్పును తిరగరాయమని కోరవచ్చు. కానీ ఆపని చేయటం లేదు, అందుకోసమే ఓట్ల కోసం రాజకీయం చేయాలన్న నిర్ణయం ప్రకారం నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Image result for vote politics behind ayyappa stirs

బాబరీమసీదు వివాదంలో సదరు స్ధలం ముస్లింలదే అని తీర్పు వచ్చే అవకాశం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్ధలు భావిస్తున్నాయా? అందుకే ప్రత్యేక చట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయా? కేంద్రంలో పూర్తి మెజారిటీ వున్న బిజెపి ప్రభుత్వం వుండగా నాలుగున్నర సంవత్సరాల పాటు వేచి వుండి ఆ డిమాండ్‌ను ఇప్పుడెందుకు ముందుకు తెచ్చినట్లు ? ఈనెల 25నుంచి దేశవ్యాపితంగా తలపెట్టినట్లు చెబుతున్న ఆందోళనల అసలు లక్ష్యం ఏమిటి? ఇలా పరిపరి విధాలుగా తలెత్తుతున్న అంశాలను కూడా జనం ఆలోచించాలి. బాబరీ మసీదు స్థల వివాద కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించారా? స్ధల వివాద కేసులో వున్న అప్పీళ్లు జనవరిలో విచారణకు వస్తాయని, ఆ లోగా విచారించి తేల్చాల్సిన అత్యవసరమేమీ లేదని, వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం, అఖిల భారత హిందూమహాసభ తదితరులు చేసిన వినతిని నవంబరు రెండవ వారంలో సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు ఆ కేసు తేలదని స్పష్టమై పోయింది. అసలింతకీ ఆ కేసు ఏమిటి? దాని మీద వచ్చే తీర్పు పర్యవసానాలేమిటి?

సుప్రీం కోర్టులో నడుస్తున్న వివాదం ఆస్ధి పరమైనది. అయోధ్యలో వివాదాస్పద బాబరీ మసీదు స్దలాన్ని సేకరించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేసిన కేసులో ఇస్లాం మతావలంబనలో మసీదులు తప్పనిసరేమీ కాదని సుప్రీం కోర్టు 1994లో చెప్పింది.ఈ తీర్పును ప్రాతిపదికగా చేసుకొని 2010లో అలహాబాద్‌ హైకోర్టు 2.77 ఎకరాల బాబరీ మసీదు స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక ముక్కను ముస్లింలకు, ఒక ముక్కను నిర్మోహీ అఖారాకు, మూడో ముక్కను రామాలయానికి ఇవ్వాలని చెప్పింది. ఆ తీర్పును ముస్లిం సంస్ధలు సవాలు చేశాయి. 1994 సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించాలన్న వినతిని ఇటీవల సుప్రీం కోర్టు 2-1 మెజారిటీతో తిరస్కరించింది. తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తి అశోక్‌ భూషణ్‌ ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఆ తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొనగా మరో న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ విబేధించి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. 1994నాటి తీర్పు మతానికి సంబంధించింది కాదని భూసేకరణ సంబంధమైనదని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పగా సమగ్ర పరిశీలన లేకుండానే నాటి తీర్పు ఇచ్చారని అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఆ కేసులో చేసిన వ్యాఖ్యలు అలహాబాద్‌ హైకోర్టును ప్రభావితం చేశాయని అన్నారు. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 14 అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించకుండా న్యాయమైన నిర్ణయానికి రాలేరని ముస్లిం సంస్ధల ప్రతినిధులు వాదిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 27న 1994నాటి తీర్పును పునర్విచారణకు తిరస్కరించిన సుప్రీం కోర్టు తమ విచారణ వాస్తవాలపైనే ఆధారపడి వుంటుందని, గత తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ విచారణను వేగంగా నిర్వహించాలని హిందూ సంస్ధలు చేసిన వినతిని నవంబరు 12న సుప్రీం కోర్టు తిరస్కరించింది. జనవరిలో చేపడతామని పేర్కొన్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని అనేక మంది ముఖ్యంగా హిందూ సంస్ధలు భావించాయి. ఈ కేసు విచారణ వచ్చే ఏడాది ఎన్నికల తరువాత జరపాలని గతేడాది డిసెంబరులో న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.

ఈ పూర్వరంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంఘపరివార్‌ సంస్ధలు, శివసేన రంగంలోకి దిగాయి. ఆదివారం నాడు జరిగే ధర్మ సభ ఆఖరిదని తరువాత ఇంకెలాంటి సభలు వుండవని తదుపరి కార్యాచరణ రామాలయ నిర్మాణమే అని విశ్వహిందూపరిషత్‌ ప్రకటించింది. ప్రతి సారీ ఎన్నికల ముందు రామాలయ నిర్మా ణాన్ని లేవనెత్తి అక్కడే నిర్మిస్తామని చెబుతున్నారని ఎంతకాలమిలా జనాన్ని వెర్రి వెంగళప్పలను చేస్తారని శివసేన నేత వుద్దావ్‌ రెచ్చగొడుతున్నారు. ఇదంతా రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందువలన ధర్మ సభ తరువాత ఈ శక్తులు ఎన్ని అధర్మాలకు, అరాచకాలకు పాల్పడతాయో చెప్పలేము. 1992 డిసెంబరు ఆరు నాటి బాబరీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి బిజెపి సీనియర్‌ నేతలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఓట్ల రాజకీయం గాకపోతే ఇంతకూ విశ్వహిందూపరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరి మీద ఆందోళనలకు దిగుతున్నట్లు? అటు కేంద్రంలోనూ ఇటు అత్యధిక రాష్ట్రాలలోనూ బిజెపి అధికారంలో వుంది. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోంది. ఎవరు అడ్డుకున్నారు ? లేదా బాబరీ మసీదు వివాదంలో కోర్టు తీర్పులు చెల్లవు, ప్రభుత్వం చేసేదే అంతిమ నిర్ణయం అని ఒక చట్టం చేసినా అడ్డుకొనే శక్తి ప్రతిపక్ష పార్టీలకు లేదు. హిందూత్వ సంస్ధలు చేసే ఆందోళన దేశమంతటినీ మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిద్రపోయే వారిని లేపగలం తప్ప నటించే వారిని లేపలేము. తన ప్రభుత్వ అన్ని రకాల వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని అనేక మంది పరిశీలకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.