Tags
100 years of the KKE, 20 IMCWP, 20th International Meeting of Communist and Workers’ Parties, Communist Party of Greece
ఎం కోటేశ్వరరావు
కమ్యూనిస్టు , కార్మికోద్యమాలను బలపరిచే, సంరక్షించుకొనే కృషిలో భాగంగా 2019లో వచ్చే ముఖ్యమైన స్మారకోత్సవాల సందర్భంగా బహుముఖ కార్యక్రమాలను నిర్వహించాలని, వక్రీకరణలను తిప్పి కొట్టి సోషలిజం గొప్పతనాన్ని జనానికి చెప్పాలని గ్రీసు రాజధాని ఏథెన్స్‌లో జరిగిన 20వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశం పిలుపు నిచ్చింది. గ్రీసు కమ్యూనిస్టు పార్టీ తన వందవ వార్షికోత్సవం సందర్భంగా నవంబరు 23-25 తేదీలలో ఆతిధ్యమిచ్చిన ఈ సమావేశానికి 73 దేశాల నుంచి 90 పార్టీల ప్రతినిధులు హాజరై తమ అనుభవాలను కలబోసుకున్నారు. ‘ వర్తమాన కార్మికవర్గం మరియు దాని మైత్రి(సమాశ్రయం). దోపిడీ మరియు సామ్రాజ్యవాదుల యుద్ధాల వ్యతిరేక పోరాటం, శాంతి, సోషలిజం కోసం, కార్మికులు మరియు పౌరుల హక్కుల పరిరక్షణ వుద్యమాల్లో ముందుండే కమ్యూనిస్టు మరియు కార్మిక పార్టీల రాజకీయ లక్ష్యాలు.’ అనే ఇతి వృత్తంతో జరిగిన ఈ సమావేశంలో పాల్గన్న ప్రతి పార్టీ అంతర్జాతీయ, ప్రాంతీయ, దేశీయ పరిస్ధితులపై తన అనుభవాలు, పాఠాలను సోదర పార్టీలతో పంచుకుంది. మన దేశం నుంచి సిపిఐ(ఎం), సిపిఐ పార్టీల ప్రతినిధి వర్గాలు పాల్గన్నాయి.
పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి లేదా సంక్షోభంలో బహుముఖాలుగా పెట్టుబడిదారీ దేశాలు వాటి కూటముల మధ్య పోటీ మరియు వైరుధ్యాలు తీవ్రమౌతున్నాయని, ఆ క్రమంలో బలాబలాల పునరేకీకరణ అంతర్జాతీయంగా ముందుకు వస్తున్నదని సమావేశం గుర్తించింది. సామ్రాజ్యవాదుల జోక్యం, దిగ్బంధాలు మరియు మధ్యవర్తిత్వాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ సిరియా, ఎమెన్, లిబియా అదే విధంగా అజర్‌బైజాన్‌లో యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రజావ్యతిరేక కీవ్ పాలకుల కారణంగా వుక్రెయిన్‌లో భాతృహత్యా సంబంధమైన యుద్ధం జరుగుతోంది. మిలిటరీ ఆయుధీకరణ మరియు యుద్ధ సన్నాహాలు పెరుగుతున్నాయి. అమెరికా, నాటో, ఐరోపా యూనియన్ మరియు వాటి మిత్ర సామ్రాజ్యవాదుల పధకాలు మరియు రాజకీయ వైఖరులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల నుంచి అనేక అనుభవాలు లభించాయి.
వైరుధ్యాలు తీవ్రతరం కావటంతో సంపదను వుత్పత్తి చేసే వనరులపై అదుపు, మార్కెట్లు, చమురుపైప్‌లైన్లపై ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాల ముప్పు ఇమిడి వుంది. శాంతి, నిరాయుధీకరణ కోసం ఇది విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని పటిష్టపరిచేందుకు వుపేక్షించరాని లక్ష్యాలను కమ్యూనిస్టులు మరియు శ్రామికోద్యమాల ముందుంచింది. బడా పెట్టుబడిదారుల లాభదాయకత కోసం పని చేసే బూర్జువా ప్రభుత్వాల వైఖరి మరియు సామాజ్రవాదుల దురాక్రమణ,యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాటాలను వుధృతం చేయాల్సి వుంది.
అక్టోబరు విప్లవ వందసంవత్సరాల వార్షికోత్సవం, కారల్‌మార్క్స్ 200వ జన్మదినోత్సవాల సందర్భంగా 2017,18 సంవత్సరాలలో తీసుకున్న చొరవను సమావేశం సానుకూలంగా విశ్లేషించింది. సిరియా, పాలస్తీనా, సైప్రస్, లెబనాన్, సూడాన్, క్యూబా, వెనెజులా, బ్రెజిల్, ఇరాన్ ఎదుర్కొంటున్న సామ్రాజ్యవాదుల దాడులు, బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి అంతర్జాతీయ సౌహార్ద్రతను పునురుద్ఘాటించింది. పోలాండ్, వుక్రెయిన్, సూడాన్, కజకస్తాన్, పాకిస్ధాన్లలో కమ్యూనిస్టు వ్యతిరేక మరియు ప్రజాస్వామిక హక్కులపై జరుగుతున్న దాడులను, రష్యా తదితర చోట్ల కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్న చట్టపరమైన, రాజకీయ ఆటంకాలను సమావేశం ఖండించింది.
2019లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ స్ధాపనవందేండ్ల వుత్సవం, చైనా విప్లవ 70, క్యూబా విప్లవ 60వ వార్షికోత్సవాల వంటి ముఖ్యమైన స్మారకోత్సవాలు వున్నాయి. ప్రజా విజయాలకు కమ్యూనిస్టు వుద్యమం ఇచ్చిన తోడ్పాటు, అంతర్జాతీయ కార్మికోద్యమాన్ని పటిష్టపరచాల్సిన అవసరం, చారిత్రక వాస్తవాలను వక్రీకరించి ఫాసిస్టుల అత్యాచారాలతో సమంగా కమ్యూనిజాన్ని చూపే యత్నాలు, తప్పుడు ప్రచారాలను ఎండగట్టటం, కార్మికుల, ఇతర తరగతుల సామాజిక విజయం కోసం జరిపే పోరాటాల పురోగతికి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సమావేశం పిలుపునిచ్చింది.
నాటో 70వ వార్షికోత్సవం సందర్భంగా దానికి వ్యతిరేకంగా అనేక రూపాలలో మరింత మిలిటరీ కేంద్రీకరణ జరుపుతున్న ఐరోపాయూనియన్ చర్యలకు వ్యతిరేకంగా 2019 ఏప్రిల్ నాలుగవ తేదీన, అణ్వాయుధాలు, విదేశీ సైనిక స్ధావరాలకు, హిరోషిమా-నాగసాకీ అణుమారణకాండకు వ్యతిరేకంగా ఆగస్టు ఆరు మరియు తొమ్మిదిన, రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమై 80సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటిన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం కోరింది. కమ్యూనిస్టు వుద్యమ చరిత్రను, అంతర్జాతీయ కార్మిక సౌహార్ద్రత విలువలను పరిరక్షిస్తూ, కమ్యూనిస్టు వ్యతిరేకత, కమ్యూనిస్టు, కార్మికోద్యమాల అణచివేతకు వ్యతిరేకంగా మార్చినెల రెండవ తేదీన వందేండ్ల కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ వుత్సవం సందర్భంగా, అక్టోబరు విప్లవ 102వ వార్షికోత్సవం సందర్భంగా సోషలిజం సాధించిన విజయాల గురించి ప్రచారం, పెట్టుబడిదారీ విధానం, దోపిడీ, అణచివేత వంటి అమానుష ధోరణులకు వ్యతిరేకంగా లోతైన సైద్ధాంతిక చర్చ, ఆచరణాత్మక కార్యక్రమాల గురించి బహుముఖ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
సోషలిస్టు క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా అమలు జరుపుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, వెనెజులా బలివేరియన్ విప్లవాన్ని వమ్ము చేసేందుకు చేస్తున్న బెదిరింపులు, జోక్యాలకు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరుల పోరాటం, కొరియాల ఐక్యతకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది. మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సం, మే డే, ఫాసిజం, నాజీజాల మీద ప్రజా విజయం రోజున తిరిగి తలెత్తుతున్న ఆ శక్తులకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టాలని ఏథెన్స్ సమావేశం పిలుపునిచ్చింది.
వంద సంవత్సరాల గ్రీసు కమ్యూనిస్టు పార్టీ 1918 నవంబరు 17న గ్రీసు సోషలిస్టు లేబర్ పార్టీగా ఏర్పడింది.పైరాస్ పట్టణంలో తొలి మహాసభ జరిగింది. 1924లో గ్రీసు కమ్యూనిస్టు పార్టీగా మారింది. నాజీల దురాక్రమణకు ప్రతిఘటన వుద్యమంలో గణనీయమైన పాత్ర పోషించింది.1967 ఏప్రిల్ 21న గ్రీసుకు కమ్యూనిస్టు ముప్పు తలెత్తిందనే పేరుతో మిలిటరీ తిరుగుబాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను నిషేధించింది. మరుసటి ఏడాది గ్రీసు కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చి ఒక వర్గం యూరోకమ్యూనిజం పేరుతో మితవాదబాట పట్టింది. మరొక వర్గం మిలిటరీ పాలకులపై సాయుధపోరుకు దిగింది.1974లో మిలిటరీ పాలన అంతమైన తరువాత తిరిగి కమ్యూనిస్టు పార్టీ బహిరంగ కార్యకార్యకలాపాల్లోకి వచ్చింది. వందవ వార్షికోత్సవ సభ మొదటి మహాసభ జరిగిన పైరాస్ పట్టణంలోనే శాంతి, స్నేహ స్టేడియంలో పెద్ద ఎత్తున రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగింది.తొంభై కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధుల సమక్షంలో వేలాది మంది గ్రీసు పార్టీకార్యకర్తలు, పౌరులు పాల్గన్నారు. గతంలో మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టిన యోధులు, ఎర్రజెండాను సమున్నతంగా నిలబెడుతున్న యువ కమ్యూనిస్టులు వేలాది మందిని ఈ సందర్భంగా గ్రీసు పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్ కౌటుసోంబస్ సన్మానించారు.
ఈ సందర్భంగా దిమిత్రిస్ మాట్లాడుతూ ‘మేం ఏటికి ఎదురీదాం, బిగ్గరగా చేసిన విమర్శలను తట్టుకోలేక చెవులు మూసుకున్నాం, మృదువుగా మృదువుగా వుందాం అని చెప్పిన కొందరు స్నేహితులు, కామ్రేడ్లను మేము కలవర పెట్టాము. వారు మమ్మల్ని రాజీపడమని కోరారు. మేమా పని చేయకపోవటమే సరైందని రుజువైంది. అలా చేసి వుంటే చివరకు రాజీ మాత్రమే మిగిలి వుండేది. మేమా పని చేయలేదు. ఎందుకంటే వంద సంవత్సరాల పార్టీ అనుభవం మమ్మల్ని తప్పులు చేయనివ్వలేదు. ఏటికి ఎదురీదిన కారణంగానే మేము ముందుకు పోవటానికి, ప్రతిదాడి చేసేందుకు, నూతన మిలిటెంట్ల సచేతనత్వం పొందటానికి తోడ్పడింది. యజమాని లేకుండా నడపవచ్చుగానీ కార్యకర్తలనే గొలుసు లేకుండా బండిని నడపలేము.’ అంటూ కార్యకర్తలను వుత్సాహపరిచారు.