Tags
china communist party, china reforms, Forty years of China Reforms, Socialism with Chinese Character
ఎం కోటేశ్వరరావు
మన దేశంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కమ్యూనిస్టు వుద్యమ సైద్ధాంతిక చర్చలో రష్యా మార్గం, చైనా మార్గం అనే మాటలు వినిపించేవి. సారాన్ని సులభంగా అర్ధం చేసుకొనేందుకు ఆ పదజాలాన్ని వాడినప్పటికీ దేశంలో సోషలిజాన్ని ఎలా తీసుకురావాలి అనేదే ఆ చర్చ. కొందరు మాది చైనా మార్గం మావోయే మా చైర్మన్ అనేంత వరకు వెళ్లగా మరికొందరు తమది రష్యా మార్గమన్నారు. వామపక్ష వుద్యమంలో ప్రధాన భాగంగా వున్న సిపిఐ(ఎ) తమది చైనా కాదు రష్యా కాదు భారత మార్గం అని స్పష్టం చేసింది. అంటే ఏ దేశంలో వున్న పరిస్ధితులను బట్టి దానికి అనుగుణ్యంగా విప్లవశక్తుల కార్యాచరణ వుండాలి తప్ప ఏదో ఒక దేశాన్ని అనుసరించటం కాదని చెప్పటమే. అయితే ఆ మార్గం మంచి చెడ్డలు, అనుసరిస్తున్న ఎత్తుగడలు, విధానాల గురించి ఎవరైనా విమర్శించవచ్చు, విబేధించవచ్చు, చర్చించి పరిపుష్టం చేయవచ్చు అది వారికి వున్న స్వేచ్చ. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తరచూ చేసే వ్యాఖ్యానాలలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద నిర్మాణం, సమాజం వంటి అంశాలుంటాయి.
నిజానికి ఇది సైద్ధాంతిక అవగాహనకు సంబంధించినది. ఆచరణకు రానంత వరకు ఏ కొత్త భావజాలమైనా ఎంతగానో ఆకర్షిస్తుంది, ఆదర్శంగా వుంటుంది. దూరం నుంచి చూస్తే కొండలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. వాటి దగ్గరకు వెళ్లి ఎక్కాల్సివచ్చినపుడు ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతాయి. శక్తి రూపాలను మార్చుకున్నట్లుగానే దోపిడీ రూపాలు మారవచ్చు గానీ అనుమతించే వ్యవస్ధలున్న చోట దోపిడీ అంతం కాదు.మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం-ఆచరణకు సంబంధించి శాస్త్రీయమైనది. ఈ సిద్ధాంతాన్ని ఆయా దేశ, కాల పరిస్ధితులకు అన్వయించుకోవాల్సి వుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ విప్లవం ద్వారా అధికారాన్ని పొంది నూతన వ్యవస్ధ నిర్మాణానికి పూనుకుంది. సుదీర్ఘంగా సాగిన విప్లవకాలంలోనూ తరువాత మూడు దశాబ్దాల వరకు మావోఆలోచనా విధానం పేరుతో చైనా పరిస్దితులకు అన్వయించిన అంశాలను అమలు జరిపారు. మావో బతికి వుండగానే వచ్చిన అనుభవాల ప్రాతిపదికగా మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్ హయాంలో సంస్కరణల విధానాన్ని అనుసరించారు. అప్పటి నుంచి చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అంటున్నారు. నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన చైనా సంస్కరణలు ఇప్పుడు 1980దశకం మాదిరే వుండవు. ఇప్పటి అవసరాలకు తగిన మార్పులు చేర్పులు వుండాలి. జనాభా అవసరాలకు అనుగుణంగా వుపాధి, కనీస అవసరాలు తీరాలంటే ఆర్ధిక వ్యవస్ధ వేగంగా అభివృద్ధి చెందాలి. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ అధికారం కింద సోషలిజానికి కట్టుబడి వుంటూనే మార్కెట్ సంస్కరణలను అమలు జరిపేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాజీలు పడ్డారు.
గతంలో ఏ సోషలిస్టు దేశంలోనూ ఇలాంటి ప్రయోగం జరపలేదు. మార్కెట్ విధానాలు పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్ధ పద్దతుల్లో లేవు, ప్రణాళికలు పూర్తిగా సోషలిస్టు పద్దతిలోనూ లేవు. చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుంది, భౌతిక సంపద స్ధాయి తక్కువగా వుంది, సోషలిస్టు సమ సమాజం తరువాత కమ్యూనిస్టు సమాజానికి దారి తీయాలంటే ముందు ఆర్ధిక పురోగతి సాధించాలి, దానికి గాను మార్కెట్ ఆర్ధిక విధానాలు సాధనమని అధికారానికి వచ్చిన రెండున్నర దశాబ్దాల తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహనకు వచ్చింది. నిజానికి చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుందని 1950దశకం చివరిలోనే కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. పరివర్తన దశలో వుత్పాదక శక్తులు బలహీనంగా వున్నాయని ఆర్ధికవేత్తలు హెచ్చరించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్దలలోనే సోషలిస్టు విప్లవం జయప్రదం అవుతుందన్న మార్క్సిస్టు తత్వవేత్తల అంచనా తప్పింది.పురోగామి వుత్పాదక సంబంధాలు వుత్పత్తిని పెంచుతాయన్న మావో ఆలోచన ఆచరణ రూపం దాల్చలేదు. సోవియట్ తరహా ప్రణాళికాబద్ద విధానాలు కూడా జయప్రదం కాలేదు. పెట్టుబడిదారీ విధానంలో లాభాలు వచ్చే వాటికే ప్రాధాన్యత వుంటుంది. సోషలిస్టు వ్యవస్దలో ప్రజల అవసరాలకు వుపయోగపడే వస్తూత్పతికి ప్రాధాన్యత వుంటుంది. ఈ రెండింటినీ మేళవించి అమలు జరిపిన విధానం కారణంగా చైనా శరవేగంతో అభివృద్ది చెందుతోంది.
చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్ 1984చేసిన ఒక వుపన్యాసంలోచెప్పిన అంశాలను మననం చేసుకోవటం అవసరం. వాటి సారాంశం ఇలా వుంది. ప్రజా రిపబ్లిక్ ఏర్పాటు చేసే నాటికి పాత చైనాను నాశమైన ఆర్ధికవ్యవస్ధను వారసత్వంగా తెచ్చుకున్నాము. పరిశ్రమలు దాదాపు లేవు. సోషలిజాన్ని ఎందుకు ఎంచుకున్నారని కొందరు అడుగుతారు. పెట్టుబడిదారీ విధానం చైనాలోని గందరగోళాన్ని లేదా దారిద్య్రం వెనుకబాటు తనాన్ని తొలగించదు. అందుకే మార్క్సిజానికి, సోషలిస్టు బాటకు కట్టుబడి వున్నామని పదే పదే చెబుతున్నాము. అయితే మార్క్సిజం అంటే మన అర్ధం చైనా పరిస్ధితులకు దానిని అసుసంధానించటం, సోషలిజం అంటే చైనా పరిస్ధితులకు అనుగుణ్యంగా ప్రత్యేకించి చైనా లక్షణాలతో రూపొందించుకోవటం. సోషలిజం, మార్క్సిజం అంటే ఏమిటి ? గతంలో దీని గురించి అంత స్పష్టత లేదు. వుత్పాదకశక్తుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతతో మార్క్సిజం ముడిపడి వుంది. కమ్యూనిజానికి ప్రాధమిక దశ సోషలిజం అని చెప్పాము. ఆ వున్నత దశలో ప్రతి ఒక్కరూ శక్తి కొద్ది పని చేయటం, అవసరం కొద్దీ వినియోగం వుంటుంది. దీనికి వున్నతంగా అభివృద్ధి చెందిన వుత్పాదకశక్తులు,సరిపడా సరకుల తయారీ అవసరం వుంది. ప్రజా రిపబ్లిక్ ఏర్పాటు చేసిన తరువాత వుత్పాద శక్తుల అభివృద్ధికి తగిన శ్రద్ధ పెట్టకపోవటం ఒక లోపం. సోషలిజం అంటే దారిద్య్రాన్ని తొలగించటం, బికారితనం సోషలిజం కాదు. పశ్చిమ దేశాలలో పారిశ్రామిక విప్లవం సంభవించినపుడు చైనా తన తలుపులు మూసుకున్న విధానం అనుసరించింది. విప్లవం తరువాత ఇతర దేశాలు చైనాను దిగ్బంధనం కావించాయి. ఈ స్ధితి ఇబ్బందులను కలిగించింది. చైనా జనాభా 80శాతం గ్రామాలలోనే వుంది. వాటి నిలకడమీదనే చైనా స్ధిరత్వం ఆధారపడి వుంది. విదేశీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పద్దతులకు స్వాగతం పలికాము. అవి సోషలిజాన్ని పూర్వపక్షం చేస్తాయా, అవకాశం లేదు, ఎందుకంటే చైనా ఆర్ధిక వ్యవస్ధలో సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ ప్రధాన భాగం.సహజంగానే విదేశీ పెట్టుబడులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. సానుకూల అంశాలతో పోలిస్తే ప్రతికూల ప్రభావాలు అంత ముఖ్యమైనవి కాదు. మరొక సందర్భంలో మాట్లాడుతూ సోషలిజం-పెట్టుబడిదారీ వ్యవస్ధల మధ్య ప్రణాళికా బద్ద మరియు మార్కెట్ శక్తులనేవి అనివార్యమైన విభేదం కాదని చెప్పారు. సోషలిజం అంటే ప్రణాళికా బద్ద ఆర్ధిక వ్యవస్ధ అనే నిర్వచనమేమీ లేదని పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాదిరి ప్రణాళికాబద్ద మరియు మార్కెట్ శక్తుల ఆర్దిక వ్యవస్ధ సోషలిజంలో కూడా వుంటుందని రెండు శక్తులు ఆర్దిక వ్యవస్ధలను అదుపు చేస్తాయన్నారు.
ప్రపంచంలో సమసమాజం ఎలా స్ధాపించాలనే విషయంలో తలెత్తిన సైద్ధాంతిక సమస్యలు దోపిడీని ఎలా కొనసాగించాలనే అంశం మీద వ్యక్తం కాలేదు. ఈ కారణంగానే చైనాలో సాధించిన అభివృద్ధిని స్వాగతించేవారు కూడా ప్రస్తుతం అక్కడ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు, బిలియనీర్లు, ధనికుల సంఖ్యలను చూసి వారెక్కడ విప్లవాన్ని వమ్ము చేస్తారో అని భయపడుతున్నారు. మరోవైపు పెట్టుబడిదారుల్లో చైనా నాయకత్వం గురించి భయ సందేహాలు ఎలా పెరుగుతున్నాయో చూడటం అవసరం. 2018 అక్టోబరు మూడవ తేదీన అమెరికాకు చెందిన న్యూయార్క్‌టైమ్స్ పత్రిక ‘ఆధునిక చైనాను నిర్మించిన ప్రయివేటు వాణిజ్యాలు, ఇపుడు వెనక్కు నెడుతున్న ప్రభుత్వం ‘ అనే శీర్షికతో ఒక విశ్లేషణ ప్రచురించింది. ప్రయివేటు వాణిజ్యాలను అనుమతించే బీజింగ్ అనుజ్ఞార్ధకం గతకొద్ది సంవత్సరాలుగా అల్లుకుపోతూ ముందుకు సాగింది. నియంతృత్వం(పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు చైనా కమ్యూనిస్టు పాలనను అలాగే వర్ణిస్తారు) మరియు స్వేచ్చా మార్కెట్ మధ్య దీర్ఘకాలంగా వున్న వుద్రిక్తలు ఇప్పుడు సందిగ్దబిందువు వద్దకు చేరుకున్నాయని చైనాలో కొందరు చెప్పారని వక్కాణించారు. ఆ విశ్లేషణ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.
వ్యాఖ్యలు మెళకువతో కూడిన భాష వెనుక నక్కాయి, కానీ చైనా దిశ గురించిన హెచ్చరిక స్పష్టంగా వుంది. సంపదలతో పెరిగేందుకు తనలో భాగం మార్కెట్ శక్తులను ఆలింగనం చేసుకొన్నది. పొసగని గళాలతో ఇప్పుడు ప్రయివేటు సంస్ధలను ఖండిస్తున్నది. ఈ దృగ్విషయాన్ని గమనించాల్సివుంది అని మార్కెట్ అనుకూల ఆర్ధికవేత్త 88 ఏండ్ల వు జింగాలియన్ వ్యక్తం చేసిన అసాధారణ అధికారిక స్వరం చైనా వ్యాపార, ఆర్దికవేత్తలు, చివరికి కొంత మంది ప్రభుత్వ అధికారులలో కూడా పెరుగుతున్న ఆందోళనకు ప్రతిధ్వని. ప్రపంచంలో ఆర్ధికంగా రెండవ స్ధానంలోకి తీసుకుపోయిన స్వేచ్చా మార్కెట్, వాణిజ్య అనుకూల విధానాల నుంచి చైనా వెనక్కు తగ్గవచ్చు, గత నాలుగు దశాబ్దాలుగా నియంతృత్వ కమ్యూనిస్టు అదుపు మరియు స్వేచ్చగా తిరిగే పెట్టుబడిదారీ విధానం మధ్య చైనా వూగుతోంది. అక్కడ ఏమైనా జరగవచ్చు, లోలకం తిరిగి ప్రభుత్వంవైపే వూగవచ్చని కొందరికి కనిపిస్తోంది.
ఒకప్పుడు ప్రయివేటు వాణిజ్య సంస్దలు ముందుపీఠీన వున్న చోట పారిశ్రామిక వుత్పత్తి,మరియు లాభాలవృద్ధిలో రోజురోజుకూ ప్రభుత్వ అదుపులోని కంపెనీల వాటా పెరుగుతోంది. ఇంటర్నెట్ వ్యాపారం, రియలెస్టేట్, వీడియోగేమ్స్‌ను నియంత్రించేందుకు చైనా రంగంలోకి దిగింది. కంపెనీలు పన్నుల పెంపుదల, వుద్యోగులు పొందే లబ్ది ఖర్చును ఎక్కువగా భరించాల్సి రావచ్చు. కొందరు మేథావులు ప్రయివేటు సంస్ధలను పూర్తిగా రద్దు చేయాలని పిలుపులనిస్తున్నారు. అధ్యక్షుడు గ్జీ జింపింగ్ ప్రయివేటు సంస్ధలకు తమ ప్రభుత్వ మద్దతు వుంటుందని హామీ ఇస్తూ ప్రభుత్వరంగంలోని పెద్ద కంపెనీలకు పూర్తి స్ధాయి మద్దతు ప్రకటించటాన్ని ప్రయివేటు వాణిజ్యాలకు ఇంకచోటు లేదని చెప్పటమే అని అనేక మంది ఆర్ధికవేత్తలు నమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధ చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ కేంద్రం ఒకదాని సందర్శన సందర్భంగా గ్జీ మాట్లాడుతూ ‘ ప్రభుత్వ రంగ సంస్ధలు వుండకూడదు, మనకు చిన్న ప్రభుత్వ సంస్ధలే వుండాలి’ అనే ప్రకటనలు తప్పు, ఏకపక్షమైనవి అన్నారు. చైనా అధ్యక్షుడు మిలిటరీ, మీడియా, పౌర సమాజం మీద పూర్తిగా పార్టీ అదుపు వుండాలని కోరతారు. ఇప్పుడు వాణిజ్యం మీద దృష్టి సారిస్తున్నారు. పెద్ద ఇంటర్నెట్ కంపెనీలలో నేరుగా వాటాలు తీసుకోవటం గురించి పరిశీలిస్తోంది. విదేశీ కంపెనీలతో సహా అన్నింటిలో కమ్యూనిస్టు పార్టీ కమిటీలకు పెద్ద పాత్ర కల్పించేందుకు నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వామపక్ష పండితులు, బ్లాగర్స్(వివిధ అంశాల మీద విశ్లేషణలు, అభిప్రాయలు రాసేవారు) ప్రభుత్వ అధికారులు సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన మద్దతు తెలియచేస్తున్నారు. ప్రయివేటు యాజమాన్యాలను తొలగించాలని జనవరిలో(2018) బీజింగ్‌లోని రెనిమిన్ విశ్వవిద్యాలయ మార్క్సిజం ప్రొఫెసర్ జౌ గ్జిన్‌చెంగ్ కోరారు. అభివృద్ధి లక్ష్యాన్ని ప్రయివేటు రంగం పూర్తి చేసిందని ఇప్పుడు దానికి స్వస్తి పలకాలంటూ వు గ్జీయపింగ్ అనే అంతగా తెలియని బ్లాగర్ రాసిన అంశం ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. మానవ వనరులు, సాంఘిక భద్రత వుప మంత్రి క్వి గ్జియపింగ్ ప్రయివేటు సంస్ధలలో ప్రజాస్వామిక యాజమాన్య పద్దతులు వుండాలని, యజమానులు-కార్మికులు సంయుక్తంగా వాటిని నడపాలని కోరారు. ప్రభుత్వ చర్యల వలన రుణాలపై ఆధారపడి నడిచే ప్రయివేటు కంపెనీలకు డబ్బు దొరకటం కష్టంగా మారింది, ఇదే సమయంలో ప్రభుత్వ రంగ కంపెనీలకు కొత్త రుణాలు పొందటంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవటం లేదు. ఒకప్పుడు అసలు వూహల్లోకి కూడా రాని వాటిని ఇప్పుడు కొన్ని ప్రయివేటు సంస్దలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఇంతవరకు 46 ప్రయివేటు కంపెనీలు సగానికిపైగా వాటాలను ప్రభుత్వానికి విక్రయించినట్లు వార్తలు వచ్చాయి.చైనా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే సంఖ్య చాలా చిన్నది అయినప్పటికీ ప్రయివేటు కంపెనీలకు వాటాలను విక్రయించే ప్రభుత్వ కంపెనీల రెండు దశాబ్దాల ధోరణికి ఇది వ్యతిరేకం.
కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగానికి ప్రత్యక్ష పాత్ర కల్పించిన తరువాత కొత్త వీడియో గేమ్స్‌కు అనుమతులు స్ధంభించాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ, వీడియో గేమ్‌ల్లో పేరు ప్రఖ్యాతులున్న టెన్‌సెంట్ కంపెనీమార్కెట్ విలువ దాదాపు మూడోవంతు పడిపోయింది. కొత్తగా తెచ్చిన చట్ట ప్రకారం ఆన్‌లైన్ వ్యాపారం చేసే కంపెనీలు ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి, పన్నులు చెల్లించాలి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్ కంపెనీలలో ఒకటైన అలీబాబా గ్రూప్‌ను దెబ్బతీస్తుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ కంపెనీలకు ఇది మంచి సంవత్సరం. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఏడాది తొలి ఏడునెలల్లో ప్రయివేటు కంపెనీలతో పోటీ పడి మూడురెట్లు లాభాలు సాధించాయి. అధిక సామర్ద్యం, కాలుష్యనివారణ చర్యలు ఎక్కువగా ప్రయివేటు కంపెనీల మీద మోపుతున్న ప్రభుత్వ ప్రయత్నాలు కూడా దీనికి కారణం.
చైనా మ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన మార్గంలోనే సంస్కరణలు నడుస్తున్నాయా? లేదూ న్యూయార్క్ టైమ్స్ విశ్లేషకుడు చెబుతున్నట్లు ప్రభుత్వ రంగ అదుపులోకి తిరిగి చైనా అర్ధిక వ్యవస్ధ వెళ్ల నుందా? ఎంతకాలం పడుతుంది? వీటిన్నింటి గురించి చైనా వెలుపల కూడా చర్చించవచ్చు. అభిప్రాయాలను వెల్లడించవచ్చు. కోర్టు తీర్పులను విమర్శించవచ్చు గానీ న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు అన్నట్లుగా చైనా కమ్యూనిస్టు నాయకత్వానికి దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారి విధాన మంచి చెడ్డలను సమీక్షించవచ్చు. సోవియట్ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మాదిరి చైనాలో కూడా తప్పిదాలకు పాల్పడితే అనే పెద్ద సందేహం ఎవరికైనా తలెత్తవచ్చు. ఇప్పటికైతే అది వూహాజనిత సమస్య. సోవియట్, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు సోషలిజం అనే భావజాలానికి కాలం చెల్లిందని అమెరికా ప్రకటించింది. అదే చోట ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం పనికిరాదు, అది కాలం చెల్లిన సిద్ధాంతం అని నమ్ముతున్నవారు, సోషలిజాన్ని అభిమానిస్తున్నవారు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నారు. సమాజ మార్పుకోరే పురోగామి శక్తులకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలవచ్చు గాని చరిత్ర ముందుకే పోతుంది, అంతిమ విజయం వారిదే.