Tags

, , ,

Image result for france yellow vest protests : green tax deferred

ఎం కోటేశ్వరరావు

పరిమితికి మించి బరువులెత్తిన నావ గడ్డిపోచను కూడా ఓపలేదు. జనం కూడా అంతేనా ? కాకపోతే కుటుంబానికి నెలకు పది యూరోలు లేదా 14 డాలర్ల అదనపు భారం(మన రూపాయల్లో 850) మోపే చమురు పన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ నవంబరు 17 నుంచి ఫ్రాన్స్‌లో జనం వీధులకెక్కటం, అధ్యక్షుడు మక్రాన్‌కు ముచ్చెమటలు పట్టించటాన్ని ఏమనాలి? 2013, సెప్టెంబరు 16న హిందూస్తాన్‌ పెట్రోలియం(హెచ్‌పిసిఎల్‌) ప్రకటించిన వివరాల ప్రకారం నాడు ఢిల్లీలో పెట్రోలు ధర రు.76.10. 2018 డిసెంబరు నాలుగవ తేదీన రు.71.78లు. నాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 117.58 డాలర్లు నేడు 60డాలర్లకు అటూ ఇటూగా వుంది. అంతర్జాతీయ ధర సగం పడిపోయినా ఆ దామాషాలో మన దగ్గర తగ్గకపోయినా మనకు చీమకుట్టినట్లు కూడా లేదు. దీన్ని బట్టి దేన్నయినా తట్టుకోగలిగిన విధంగా మన(చర్మాలు)ం తయారైనట్లు అనుకోవాలి. మోపిన భారాన్ని మనం భుజం మార్చుకోకుండా భరిస్తుంటే, వేయబోయే బరువు ప్రకటనతో ముందే ఫ్రెంచి జనాలు ఆందోళన ప్రారంభించారు. అంటే వారికి ఇంకే మాత్రం తట్టుకొనే శక్తి లేదన్నది స్పష్టం. ఆందోళనల్లో పాల్గంటున్నవారంతా నిరుద్యోగులు కాదు, ఇప్పటికే నెలలో 20వ తేదీ దాటితే జేబులు, ఇంట్లో ఫ్రిజ్‌లు ఖాళీ అవుతున్నాయి, ఇప్పుడు ఇదొకటా అంటూ పర్యావరణ పరిరక్షణ పేరుతో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రకటించిన ‘ఆకుపచ్చ’ పన్నుకు వ్యతిరేకంగా ‘పచ్చ చొక్కా’ యూనిఫారాలతో మూడువారాలుగా నిరసన తెలుపుతున్నవారిలో గణనీయ భాగం చిరుద్యోగులు కావటం విశేషం. పార్టీలు లేవు, నాయకులు అంతకంటే లేరు, ఎవరికి వారే కార్యకర్తలుగా భావించి వీధుల్లోకి వచ్చారు.

ఇప్పటి వరకు వివిధ సంఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.కొందరు తిరగబడ్డారు, దెబ్బలు తిన్నారు, పోలీసులకు దెబ్బ రుచి చూపారు.డీజిల్‌ ధరలు తగ్గించాలన్న డిమాండ్‌తో ప్రారంభమైన వుద్యమం కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చింది.సాధారణంగా పట్టణాలలో ప్రారంభమయ్యే ఆందోళనలు మెల్లగా పల్లెలకు పాకుతాయి. దీనికి విరుద్దంగా ఈ ఆందోళన గ్రామాలతో మొదలైంది. ఎందుకంటే పట్టణవాసులతో పోలిస్తే పల్లెటూరి వారు ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. మన దేశంలో ఒకపుడు ఇంటికి విద్యుత్‌ వుంటే, తరువాత టీవీ, ఇప్పుడు మోటార్‌ సైకిల్‌ వుంటే సంక్షేమ పధకాలకు అనర్హులని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాన్స్‌లో కూడా గ్రామీణ, చిన్న పట్టణాలలో సంక్షేమ పధకాలకు అనర్హులైన వారు, వచ్చే ఆదాయాలతో అస్తుబిస్తుగా గడుపుతూ ఇంకే మాత్రం భారం భరించలేని వారు ఆందోళనకు ఆద్యులయ్యారు. ఒక నాయకుడు లేదా ఒక పార్టీ ఇచ్చిన పిలుపు కాదిది, సామాజిక మాధ్యమంలో అభిప్రాయాలు కలిసిన వారి స్పందన. మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడు అన్న సామెత మాదిరి ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించే ఒక ప్రతిభాశాలిగా ఏడాదిన్నర క్రితం పరిగణించిన అధ్యక్షుడు మాక్రాన్‌ను జనం ఇప్పుడు అన్నింటికీ అతనే కారణం అంటున్నారు. సంస్కరణల పేరుతో ధనికుల మీద సంపద పన్ను తగ్గించాడు. కార్మిక చట్టాలను మరింతగా నీరుగార్చాడు, చమురు భారాలు మోపటం వంటి వాటిని జనం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

పది సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌లో మోటారు వాహన చట్టానికి తెచ్చిన సవరణ ప్రకారం బండ్లను నడిపే వారు విధిగా కాంతి పడినపుడు వెలుగు నిచ్చే పచ్చచొక్కాలను ధరించాలి.(మన దగ్గర రాత్రుళ్లు పనిచేసే మునిసిపల్‌ కార్మికులు వేసుకొనే వెలుగుపడితే మెరిసే జాకెట్ల మాదిరి) ఇప్పుడు వాటితోనే పన్ను భారానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళన రాజధాని పారిస్‌లో హింసాత్మకంగా మారి మరో మలుపు తిరిగాయి. తొలుత పెంచిన పన్ను తగ్గించాలన్న డిమాండ్‌కు ఇప్పుడు పన్నులు పోగా నెలకు కనీసవేతనం 1350 డాలర్లు వుండేట్లుగా నిర్ణయించాలన్న డిమాండ్‌ తోడైంది. కొందరు పార్లమెంట్‌కు కొత్తగా ఎన్నికలు జరపాలని, అధ్యక్షుడు రాజీనామా చేయాలని కూడా నినాదాలు వినిపించారు. పాలకపార్టీ, ప్రభుత్వ నేతల బలహీనత వెల్లడైన తరువాత ఆ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ ఆందోళనను పక్కదారి పట్టించేందుకు, వక్రీకరించే ఎత్తుగడల్లో భాగంగా ఆందోళనల కారణంగా జరుగుతున్న నష్టం అంటూ మీడియా బూతద్దంలో చూపుతున్నది.ఈ ఆందోళనకు 73-84శాతం మధ్య జనం మద్దతు తెలిపారు. ఆందోళనకారులు రోడ్ల దిగ్బంధన సమయంలో ముగ్గురు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవటంతో సహజంగానే హింసాకాండను కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనతో దిక్కుతోచని సర్కార్‌ తొలుత చర్చలు జరిపేందుకు విముఖత చూపినా శనివారం నాడు జరిగిన హింసాత్మక ఘటనల తరువాత మాట్లాడేందుకు ముందుకు వచ్చింది. వుపశమన చర్యలను ప్రకటిస్తామని ప్రకటించింది. పద్దెనిమిది నెలల తరువాత మక్రాన్‌కు ప్రజావ్యతిరేకత అనూహ్యరూపంలో ఎదురైంది.

Image result for france yellow vest protests : green tax deferred

గత రెండు సంవత్సరాలలో డీజిల్‌ ధరలు 14 మరియు 22శాతాల చొప్పున 36శాతం పెంచారు. దీనిలో ప్రపంచ మార్కెట్లో పెరిగిన చమురు ధరల వాటాతో పాటు స్ధానికంగా పెంచిన పన్నుల మొత్తం కూడా కలిసింది.ఈ ఏడాది ఒక లీటరు డీజిల్‌ మీద 7.6సెంట్లు, పెట్రోలు మీద 3.9సెంట్లు పెంచారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పన్నులను మరో 6.5, 2.9శాతాలను జనవరి ఒకటి నుంచి పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పెంపుదలలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరల కంటే పన్ను భారమే ఎక్కువగా వుందని, దాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబరులో ఒక పౌరబృందం ఇంటర్నెట్‌లో ఒక పిటీషన్‌ తయారు చేసి సంతకాల సేకరణ వుద్యమాన్ని ప్రారంభించింది. జనాన్ని మభ్యపెట్టేందుకు అధ్యక్షుడు మక్రాన్‌ నవంబరు ప్రారంభంలో ఒక ప్రకటన చేస్తూ ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు.పర్యావరణం దెబ్బతినటానికి ప్రధాన కారణం లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారుల వైఖరి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఫ్రాన్స్‌లో కొందరు పర్యావరణ పరిరక్షణను ముందుకు తెస్తూ మక్రాన్‌ సర్కార్‌ తీసుకున్న చర్యల సమర్ధనకు దిగుతున్నారు.కాలుష్యానికి కారణమయ్యే డీజిల్‌ మోటార్‌ వాహనాల తయారీకి రాయితీలు ఇచ్చి మరీ ప్రోత్సహించిన వాటిలో ఫ్రెంచి ప్రభుత్వం కూడా ఒకటి. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి అపరిమిత సంపదలు కూడబెట్టుకున్న కంపెనీలు, ఇతర ధనికుల మీద అధిక పన్నులు విధించి దామాషా ప్రకారం సామాన్యుల మీద కూడా విధిస్తే అదొక తీరు. పెట్టుబడిదారుల లాభాల వేటకు బలైందీ కార్మికవర్గమే, ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు మూల్యం చెల్లించాల్సి వస్తున్నదీ కార్మికవర్గమే.

ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల ఆందోళన సమీప ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్‌లో ప్రతిధ్వనించింది. నవంబరు 17న ఫ్రాన్స్‌లో దాదాపు మూడులక్షల మంది వివిధ ప్రాంతాలలో రోడ్డు దిగ్బంధనంతో ప్రత్యక్ష ఆందోళన ప్రారంభమైంది. ప్రతిశనివారం పెద్ద ఎత్తున సమీకరణలు జరుగుతున్నాయి.డిసెంబరు ఒకటిన తొలిసారిగా మక్రాన్‌ రాజీనామా డిమాండ్‌ ముందుకు వచ్చింది.గతనెల 21న ఫ్రెంచి పాలనలోని రీయూనియన్‌ దీవిలో హింసాకాండ చెలరేగటంతో సైన్యాన్ని దింపాల్సి వచ్చింది. బెల్జియంలో అనేక పెట్రోలు బంకుల వద్ద నిరసనలు చెలరేగాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన శక్తులు ప్రయత్నిస్తున్నాయి. నెదర్లాండ్స్‌లోని అనేక నగరాల్లో పసుపు చొక్కాలతో ప్రదర్శనలు చేశారు. అయితే ఇటలీలో ప్రభుత్వ వ్యతిరేకతకు బదులు తమ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న ఐరోపాయూనియన్‌కు వ్యతిరేకంగా పసుపు చొక్కాలతో నిరసన తెలుపుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Related image

గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం పొదుపు పేరుతో తీసుకున్న ప్రజావ్యతిరేక చర్యల కారణంగా ప్రస్తుతం మక్రాన్‌ పలుకుబడి 26శాతానికి పడిపోయింది. వచ్చే ఏడాది జరగనున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికలలో పచ్చిమితవాద నేషనల్‌ ఫ్రంట్‌ లేదా ర్యాలీ పార్టీ పోటాపోటీగా తయారవుతుందని అంచనా. గత పది సంవత్సరాలలో ఫ్రెంచి రాజకీయాలలో ఒకసారి అధికారానికి వచ్చిన పార్టీ లేదా నేత మరోసారి గెలిచింది లేదు. రోడ్డుదాటటమే తరువాయి, నేను అధికారానికి రావటమే తరువాయి నీకు ఒక వుద్యోగం సిద్ధంగా వుంటుంది అన్నంతగా భ్రమలు కల్పించిన మక్రాన్‌ ఏడాదిన్నరలోనే యువత, మధ్యతరగతి ఆశలను ఏడాదిన్నరలోనే దెబ్బతీశాడు. తొలిసారిగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. గత నాలుగు దశాబ్దాల కాలంలో అన్ని ధనిక దేశాల మాదిరే ఫ్రాన్స్‌లో కూడా నూతన ఆర్ధిక విధానాలకు మూల్యం చెల్లించింది కార్మికవర్గమూ, మధ్యతరగతి వారే అంటే మొత్తంగా సమాజమే దెబ్బతిన్నది. విజయవంతమైందని చెప్పుకొనే ప్రపంచీకరణ నమూనా వారిని దెబ్బతీసింది. సంపదలు పెరుగుతూనే వున్నాయి. వాటితో పాటు నిరుద్యోగం, అభద్రత, దారిద్య్రమూ పెరుగుతున్నాయి. పట్టణీకరణ జరిగిన ఐరోపాలో పెద్ద నగరాల్లోనే పెట్టుబడులు దానికి అనుగుణంగా వుపాధి అవకాశాలుండగా గ్రామీణ, చిన్న పట్టణాలలో అలాంటి పరిస్ధితి లేదు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావన సర్వత్రా వెల్లడి అవుతున్నది. తదుపరి ఐరోపాలో కూడా అదే జరగనుంది. మధనం ప్రారంభమైంది. సోషల్‌డెమోక్రటిక్‌ పార్టీలు, మితవాద పార్టీలు జనాన్ని ఇంతకాలం మభ్యపెట్టాయి. కమ్యూనిస్టు పార్టీలు మితవాదానికి గురైదెబ్బతిన్నాయి. పచ్చిమితవాద శక్తులు తాత్కాలికంగా అయినా జనాకర్షక నినాదాలతో ముందుకు వస్తున్నాయి. ఫ్రెంచి పచ్చచొక్కాల వుద్యమానికి కొన్ని పరిమితులు వున్నాయి.వాటిని అధిగమించి మరింత ముందుకు పోకుండా చూసేందుకు పన్ను పెంపుదలను ఆరునెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆందోళనకూ అంతేవిరామం వస్తుంది. అసంఘటితంగా వున్న వారు ఇచ్చిన పిలుపుకే ఇంత స్పందన వస్తే రానున్న రోజుల్లో ప్రతిఘటన మరింత సంఘటితంగా వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. పసుపు చొక్కాల వుద్యమం ఒక విధంగా భారాలు మోపే ప్రభుత్వానికి, దానికి తగిన ప్రతిఘటన చూపని ప్రతిపక్షాలకూ ఒక పెద్ద హెచ్చరిక. కోడి కూయనంత మాత్రాన సూర్యోదయం ఆగనట్లే, వుద్యమాలు కూడా ఆగవు.