ఎం కోటేశ్వరరావు
మూడు నెలలపాటు వాణిజ్య యుద్ధ దాడులకు విరామం ఇద్దామని అమెరికా-చైనా నిర్ణయించాయి. ఇంతలోనే అమెరికా మరో యుద్దానికి తెరలేపింది. అదే టెక్నాలజీ యుద్ధం. చైనాలోని ప్రముఖ హైటెక్ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ హువెయి యజమాని కుమార్తె, కంపెనీ సిఎఫ్‌ఓ మెంగ్ వాన్‌జౌ అరెస్టు దానికి నాంది అని కొందరంటుంటే పర్యవసానాలపై గత ఇరవై రోజులుగా అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు కెనడాలో అరెస్టు చేసిన మెంగ్‌ను కోర్టుకు హాజరుపరిచారు. తమను రెచ్చగొట్టే ట్రంప్ సర్కార్ చర్యమీద చైనా ఇప్పటి వరకు ఎంతో సంయమనంతో వ్యవహరించింది. మెంగ్ అరెస్టు అయిన నాటి నుంచి తన కనుసన్నలలో వ్యవహరించే దేశాల మీద అమెరికా వత్తిడి తెస్తోంది. హువెయి కంపెనీ పరికరాలు, ఫోన్లు కొనవద్దని కోరుతోంది. దానిలో భారత్ కూడా ఒకటి. ఈ వ్యవహారం నరేంద్రమోడీ సర్కార్‌కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే చైనాతో వాణిజ్యలోటు కొండలా పెరిగిపోతోంది.మన వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ చైనాతో సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. ఆవు పేడను తయారు చేయటం తప్ప మోడీ మేకిన్ ఇండియా పధకం ముందుకు సాగటం లేదు. అమెరికా ఆదేశాల మేరకు హువెయి కంపెనీ వుత్పత్తుల కొనుగోలు నిలివి పేస్తే మరొక అగ్రదేశం తయారు చేసే ఐదవ తరం పరికరాల కోసం ఎదురు చూడటం తప్ప మనకు మరొక మార్గం లేదు. అదే చేస్తే చైనాకు ఇప్పుడు మనం చేస్తున్న ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఈ చర్య కారణంగా మరింతగా స్వదేశీయ పరిజ్ఞానం మీద ఆధారపడాలనే కసితో చైనా వ్యవహరించకూడదు అని హాంకాంగ్ నుంచి వెలువడే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక సౌత్ చైనా మోర్నింగ్ పోస్టు తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాకు ఎదురైన చేదు అనుభవాలంటూ కొన్ని అంశాలను పేర్కొని టెక్నో జాతీయవాదం తెలివితక్కువ తనమని, వాణిజ్యదారులను మూసివేస్తుందని, భద్రతను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెంగ్ అరెస్టుపై నోరు మూసుకొని గత నాలుగు దశాబ్దాలుగా మార్కెట్‌ను తెరిచినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా వ్యవహరించకపోతే ఇప్పటి వరకు సాధించిన ప్రగతి దెబ్బతింటుందని పరోక్షంగా బెదిరించిందని చెప్పవచ్చు. ప్రపంచ కార్పొరేట్ల ప్రతినిధి అయిన మీడియా సంస్ధ నుంచి ఇలాంటివి వెలువడటంలో ఆశ్చర్యం లేదు.
డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలోని వాంకోవర్‌లో మెంగ్ ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారుతున్న సమయంలో కెనడా పోలీసులు ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య ఆమె మానవ హక్కులను హరించటమే అని చైనా పేర్కొనగా, ఆ చర్య కిడ్నాపింగ్ తప్ప మరొకటి కాదని చైనా మీడియా వర్ణించింది. అరెస్టులో తమ సర్కార్ ప్రమేయం లేదని కొద్ది రోజుల ముందే నోటీసు ఇచ్చామని కెనడా ప్రధాని ట్రడేవ్ ఆరు రోజుల తరువాత ప్రకటించారు. కొద్ది నెలల ముందే అరెస్టు వారంటు జారీ చేసినట్లు అమెరికా చెప్పింది. అమెరికా ఆంక్షలను వుల్లంఘిస్తూ ఇరాన్‌తో వ్యాపారం చేసేందుకు హువెయి కంపెనీ స్కైకామ్ అనే హాంకాంగ్ సంస్ధను అనధికార అనుబంధ సంస్ధగా వుపయోగించుకొని ద్య్రవ్య సంస్ధలను మోసం చేసేందుకు కుట్రపన్నిందని, తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా దాని చర్యలున్నాయని బెయిలు విచారణ సమయంలో అమెరికా చేసిన ఆరోపణలను కెనడా సర్కార్ వల్లించింది.అరెస్టయిన పదకొండవ రోజున వాంకోవర్‌లోని ఆమె ఇంటి నుంచి బయటకు పోకుండా షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు కెనడియన్లను భద్రతా కారణాలతో అరెస్టుచేసినట్లు చైనా అధికారులు ప్రకటించారు. అరెస్టు చేసిన మెంగ్‌ను తమకు అప్పగించాలని అమెరికా కోరింది. ఈ కేసులో 30సంవత్సరాల శిక్షపడే అవకాశం వుంది. అదే జరిగితే అమెరికా-చైనా సంబంధాలు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేము.
ఇటీవలి కాలంలో హైటెక్ వుత్పత్తులలో ఇతర దేశాలకు చైనా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. మనందరికీ తెలిసిన శాంసంగ్ కంపెనీ సెల్‌ఫోన్లు, టెలికమ్యూనికేషన్ల పరికరాల తయారీలో మొదటి స్ధానంలో వుండగా చైనా హువెయి కంపెనీ రెండవ స్ధానానికి ఎదిగింది. ఇప్పుడు అది 5జి సాంకేతిక రంగంలో ముందున్నదని, ఒకటవ స్ధానానికి ఎదగ నుందని వార్తలు వచ్చాయి. వ్యాపారంలో తలెత్తిన పోటీయే కంపెనీ సిఎఫ్‌ఓ అరెస్టుకు అసలు కారణమని చెబుతున్నారు. చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్ చైనా కంపెనీల పరికరాలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆరోపించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే అమెరికా పౌరులు హువెయి కంపెనీ సెల్‌ఫోన్లు, సంస్ధలు పరికరాలను వాడవద్దనే నిషేధాలను విధించారు. అమెరికా కనుసన్నలలో కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కూడా నిషేధం విధించాయి.ఈ ఐదు దేశాలకు చెందిన గూఢచార సంస్ధలు ‘ఫైవ్ ఐస్’ (ఐదు నేత్రాలు) పేరుతో చైనా కంపెనీ పరికరాలలో రహస్య పరికరాలు వున్నట్లు నివేదికలను రూపొందించాయి. జూలై 17న ఐదుగురు గూఢచార అధిపతులతో కెనడా ప్రధాని కెనడాలోని అట్టావాలో ఒక రహస్య సమావేశం నిర్వహించారు. దీనిలో సిఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్, బ్రిటన్ ఎం16 అధిపతి మైఖేల్ యంగర్ పాల్గన్నారు. ఈ సమావేశం గురించి ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్ దీన్నొక సాదాసీదా సమావేశంగా వార్తను ప్రచురించింది. ఆ తరువాతే చైనా, రష్యాల మీద పెద్ద ఎత్తున ప్రచార దాడిని ప్రారంభించారు. హువెయి కంపెనీ పరికరాలను కొన వద్దనే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. కంపెనీ అధికారిణి అరెస్టు దానికొనసాగింపు.జపాన్ ప్రభుత్వం, మూడు టెలికాం కంపెనీలు కూడా హువెయి పరికరాల కొనుగోలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.
ప్రపంచంలో అన్ని దేశాలలో గూఢచర్యం జరిపే అమెరికాకు ఇప్పుడు తన నీడను చూస్తే తానే భయపడుతున్నట్లుగా వుంది. తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలు దానిలో భాగమే. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆధునిక పరికరాలతో గూఢచర్యం ఎలా జరపవచ్చో అమెరికాకు వేరొకరు చెప్పనవసరం లేదు. అవే అస్త్రాలతను తమ మీద కూడా ప్రయోగిస్తున్నారని అది కంగారు పడుతోంది. ఈ రోజు ప్రతి దేశం తన అవసరాల కోసం, ఇతరుల కుట్రల గురించి జాగ్రత్తలు తీసుకొనేందుకు గూఢచర్యం జరపటం సాధారణ విషయం. దానిలో చైనా, మరొక దేశానికి ఎలాంటి మినహాయింపులు వుండవు. ఇప్పుడు అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో వున్నాయి. స్మార్ట్ ఫోన్లను అక్కడ తయారు చేయటం లేదు. చైనా ఫోన్లమీదే అమెరికన్లు ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో డెలాయిట్ కన్సల్టింగ్ విడుదల చేసిన ఒక నివేదికలో ఐదవ తరం(5జి) నెట్‌వర్క్ ఏర్పాటు పరుగులో అమెరికా మీద చైనా విజయం సాధించనున్నది.అమెరికా వెంటనే రంగంలోకి దిగకపోతే భవిష్యత్‌లో నూతన కంపెనీల ఏర్పాటులో తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించింది. ఈ రంగంలో ముందున్న వారికి వెనుకబడినవారితో పోల్చితే ఎంతో ఆర్ధిక ప్రయోజనం వుంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి హెచ్చరికలనే చేశాయి.
రెండుసార్లు సిఐఏ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మైఖేల్ మోరెల్ వాషింగ్టన్ పోస్టుకు రాసిన వ్యాఖ్యానంలో ఇది వాణిజ్య యుద్దం కాదు, సాంకేతిక యుద్ధం, ఐదవతరం పోటీలో మైలు దూరంలో అమెరికా వెనుకంజలో ఓడిపోతోందని మరింత స్పష్టంగా పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు తరచుగా వాణిజ్య యుద్ధం గురించి చెబుతాడు, నిజానికి అమెరికా సాంకేతికపరమైన ప్రచ్చన్న యుద్దం చేస్తోంది. ఐదవతరం నెట్‌వర్క్‌లతో గతంలో ఎన్నటి కంటే వేగంగా ఎక్కువ సమాచారాన్ని సేకరించవచ్చు, ఈ నెట్‌వర్క్‌ల ద్వారా గూఢచర్యమే కాదు, విద్రోహానికి కూడా పాల్పడవచ్చు, ఈ రంగంలో పై చేయి సాధించిన వారు ఆర్ధికంగా ముందుంటారు, తమ రహస్యాలను పదిలపరుచుకోవటంతో పాటు ఇతరుల వాటిని తెలుసుకోవటంలో ముందుంటారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నపుడు అమెరికా ఆందోళనపడక తప్పదని హెచ్చరించాడు.
ఐదవతరం ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన, అభివృద్దిలో హువెయి కంపెనీ ఏటా 14బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా కంటే ముందున్నది. చైనా మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరిచిన సమయంలో అమెరికాకు చెందిన మైక్రోసాప్ట్, ఫేస్‌బుక్, గూగుల్, ఐఫోన్ వంటి సంస్దలు తమ పరికరాల ద్వారా పెద్ద ఎత్తున చైనా గూఢచర్యానికి పాల్పడ్డాయి. నిజానికి అమెరికన్లు అన్ని దేశాలలో అలాంటి చర్యలకు పాల్పడ్డారు. జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఫోన్ వర్తమానాలను దొంగిలించారు. చైనా అధ్యక్షుడు ప్రయాణించే బోయింగ్ 737 విమానంలో అమర్చిన రహస్య పరికరాన్ని చైనీయులు తొలగించారు. అమెరికా పరికరాలనే వుపయోగించి ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా రహస్య సమాచారాన్నే పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్నదంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఐదవ తరం పరిజ్ఞానంలో అమెరికా ఎందుకు వెనుకబడిపోయినట్లు? చైనాలో పరిశోధనలు చేయకుండా అది ముందుకు ఎలా పోయినట్లు ? నిజానికిది ప్రచార దాడి తప్ప ఒకసారి తస్కరించినట్లు తేలితే ఏ దేశమైనా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటుందా ?
గతేడాది అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగింది. మేడిన్ చైనా 2025 పేరుతో అది కొన్ని లక్ష్యాలను దేశం ముందుంచింది. దాని కొనసాగింపుగానే అధ్యక్షుడు గ్జీ జింపింగ్ అనేక చర్యలను చేపట్టారు. అన్ని రంగాలలో సాంకేతిక పరంగా పై చేయి సాధించాలన్నదే ఆ లక్ష్యాల, చర్యల సారాంశం. అది యుద్ధ ప్రాతిపదిక మీద అమలు జరుగుతోందా సాదాసీదాగా జరుగుతోందా అంటే గత నాలుగు దశాబ్దాల చైనా అభివృద్ధిని చూసినపుడు వారు ఏ లక్ష్యాన్ని సాదాసీదాగా అమలు జరపలేదు. నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని చేరేందుకు ప్రతి అంశంలోనూ యుద్ధం మాదిరి పని చేశారు. గతంలో సూపర్ కంప్యూటర్లంటే అమెరికా తప్ప మరొకపేరు వినపడేది కాదు. గత రెండు దశాబ్దాల్లో పరిస్ధితి మారిపోయింది. టాప్ 500 పేరుతో ఒక సంస్ధ రూపొందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 500 వేగవంతమైన కంప్యూటర్లలో 206 చైనా వద్ద, 124 అమెరికా వద్ద వున్నాయి. నాలుగు అగ్రశ్రేణి కంప్యూటర్లలో రెండు చైనా వద్ద వున్నాయి, ఇటీవలనే అమెరికా మూడవదానిని రూపొందించి మొదటి స్దానం తిరిగి పొందింది. పోటీలో నువ్వానేనా అన్నట్లుగా అమెరికా-చైనా వున్నాయి. మైక్రోచిప్స్ విషయంలో చైనా ఎంతో వెనుకబడి వుంది. అమెరికా పది తయారు చేస్తే చైనాలో ఒకటి మాత్రమే వుత్పత్తి అవుతోంది. 2025నాటికి అమెరికాతో ఢీకొనేందుకు చైనా 30బిలియన్ డాలర్లు కేటాయించింది.ప్రపంచమంతా ఇపుడు కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతోంది. 2030నాటికి ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండేందుకు చైనా 150బిలియన్ డాలర్లను కేటాయించి పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిజ్ఞానం రెండంచుల పదును కలది అటు మానవ కల్యాణానికి, వినాశకరమైన మిలిటరీ అవసరాలకు రెండింటికీ వినియోగపడుతుంది. ఐదవ తరం టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ ఏర్పాటులో అమెరికా ఇంకా ఆలోచనలోనే వుండగా చైనా దూసుకుపోయి కీలకమైన సాంకేతిక ప్రమాణాలను ప్రపంచం ముందుంచింది. మిగతా ప్రపంచం చైనాను అసుసరించటం తప్ప మేం కూడా వచ్చేంతవరకు మీరు ముందుకు పోవటానికి వీల్లేదంటే కుదరదు. క్వాంటమ్ కంప్యూటర్ తయారీకి ఇప్పుడు అగ్రరాజ్యాలు పోటీపడుతున్నాయి. దానిలో కూడా చైనా వెనుకబడి లేదు. ఇప్పటికే పది బిలియన్ డాలర్లతో పని ప్రారంభించింది. అదే అమెరికా రానున్న ఐదు సంవత్సరాలలో 1.25 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేయనున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా దుష్ట స్వభావం గురించి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్ధికవేత్త జెఫ్రీ శాచస్ సిబిసి టీవీతో చెప్పిన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం.
‘ మెంగ్ అరెస్టు మరో ప్రచ్చన్న యుద్దానికి నాంది అవుతుంది, అందుకు అమెరికాను కెనడా ప్రేరేపించింది. ఎట్టి పరిస్ధితుల్లో అయినా చైనా ఎదుగుదలను అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.ప్రత్యర్ధి ఆర్ధిక ఎదుగుదలను దెబ్బతీసేందుకు తన అధికారాన్ని వుపయోగించే అమెరికా వైఖరి బాగా తెలిసిందే, ఇది చాలా చెడ్డది, ప్రమాదకరమైంది, వాస్తవానికి ప్రపంచానికి మరొక కొత్త ప్రచ్చన్న యుద్ధాన్ని తెచ్చేది.