Tags

, ,

Image result for four decades of china reforms

ఎం కోటేశ్వరరావు

ఏమి చెయ్యాలో చెయ్య కూడదో చైనాను నిర్దేశించే స్ధితిలో ఎవరూ లేరు, మా బాటలో మేము ప్రయాణిస్తాం ! ఇదీ తమ సంస్కరణల నలభయ్యవ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన చైనా అధ్యక్షుడు గ్జీ గింగ్‌పింగ్‌ డిసెంబరు 18న ప్రపంచానికి స్పష్టం చేసిన అంశం. చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు పధానికి మరియు సోషలిజానికి, దాని అభివృద్ధికి కట్టుబడి వుంటూ ముందుకు పోతామని ప్రపంచానికి తెలిపారు. సంస్కరణల పట్ల ప్రజల విశ్వాసాన్ని, సంస్కరణలను పెంచుతామని కూడా చెప్పారు. చైనీయులు మాట్లాడేది తక్కువ ఆచరించేది ఎక్కువ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. సంస్కరణల విషయాన్ని గతంలో కూడా పదే పదే స్పష్టం చేశారు గనుక పునశ్చరణ అవసరం లేదు. మావో మరణానంతరం బాధ్యతలు స్వీకరించిన డెంగ్‌ సియావో పింగ్‌ నాయకత్వంలోని పార్టీ ఎన్నో తర్జన భర్జనలు పడిన తరువాత ఎంతో ముందు చూపుతో, ఆత్మ విశ్వాసంతో ప్రారంభించిన సంస్కరణలు చైనాలో అద్భుతాలను ఆవిష్కరించాయంటే అతిశయోక్తి కాదు.

సోషలిస్టు వ్యవస్ధలను ఫలానా విధంగా నిర్మించాలనే ఒక నమూనా లేదు. అన్ని దేశాలలో ఒకే విధంగా నిర్మించటమూ సాధ్యం కాదన్నది స్పష్టం. తమ దేశ లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నామని చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది.చైనాలో నిర్మాణం చేస్తున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదని, ప్రభుత్వ రంగంలోని పెట్టుబడిదారీ వ్యవస్ధ్ద అని మరొకటని కొందరు వర్ణించవచ్చు.వారికా స్వేచ్చ వుంది. చిత్రం ఏమిటంటే ఒకవైపు కమ్యూనిస్టులుగా చెప్పుకొనే వారు అక్కడ వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదని తిరస్కరిస్తుంటే, మరోవైపు అసలు సిసలు పెట్టుబడిదారీ విధానం కాదంటూ పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దేశాలు చైనాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా తరహా సోషలిస్టు విధానంలో కనిపించిన తప్పులు ఒప్పులతో చర్చించటం, మెరుగుపడేందుకు తోడ్పడటం ఒక ఎత్తు. అలాగాక ఏ పేరుతో వ్యతిరేకించినా అది సామ్రాజ్యవాదులు, సోషలిస్టు వ్యతిరేకులకే ప్రయోజనం. ఈ పూర్వరంగంలో గత నాలుగు దశాబ్దాలలో చైనా సాధించిన అభివృద్ధిని, అది ఎలా సాధ్యమైందో ఒకసారి సింహావలోకనం చేసుకోవటం అవసరం.

చైనా సమాజ మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దేశ ఆర్ధిక వ్యవస్ధను మరింతగా విదేశాలకు తెరవాలని అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు ఒకవైపుకు లాగుతున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్ధ, సమాజంలోని అన్ని అంశాల మీద మ్యూనిస్టు పార్టీ అదుపులో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేయాలని గ్జీ జింగ్‌పింగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ మరోవైపు ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్ధితిలో చైనా ఎటు ప్రయాణిస్తుంది అన్నది సహజంగానే కమ్యూనిస్టుల్లో, వ్యతిరేకుల్లో కూడా ఆసక్తి కలిగించే అంశమే. డెంగ్‌సియావో పింగ్‌ చెప్పినట్లుగా పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పట్టగలిగినంత వరకు అది ఏ రంగుదైనా ఫర్లేదు. చైనాతో పాటు భారత్‌తో సహా అనేక దేశాలు సంస్కరణల పేరుతో తమ మార్కెట్లను విదేశీకార్పొరేట్లకు తెరిచాయి. వాటిలో ప్రజాస్వామ్యం, నియంతల పాలనలో వున్నవీ వున్నాయి కానీ సోషలిస్టు చైనా మాదిరి అభివృద్ధి చెందలేదు. పెత్తందారీ అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలను సవాలు చేసే స్ధితిలో లేవు. ప్రపంచంలో అత్యధిక జనాభాతో, అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనాలో ప్రస్తుతం వున్నది సోషలిజమా-పెట్టుబడిదారీ విధానమా అనే మీమాంసలో కూరుకుపోతే ప్రధాన అంశాన్ని మరచిపోయినట్లే. అసలు సమస్య చైనా జనానికి తిండిపెట్టటం, దానికి ఏది పని చేస్తుంది అన్నది ముఖ్యం. ఈ పూర్వరంగంలో చైనాలో వున్న ప్రత్యేక పరిస్ధితులను గమనంలో వుంచుకొని అక్కడి పార్టీ నాయకత్వం తనదైన మార్గాన్ని ఎంచుకుంది. ఇంకా సమస్యలున్నప్పటికీ ఆకలి దారిద్య్రాల నుంచి జనాన్ని బయటపడవేసింది. తానేమిటో ప్రపంచానికి చాటింది. చైనా వ్యవస్ధ కూలిపోతుందని అనేక మంది పశ్చిమ దేశాల పండితులు ఇప్పటికి ఎన్నో జోశ్యాలు చెప్పారు. తమ వ్యవస్ధలు ఎదుర్కొన్న సంక్షోభాలను వారు పసిగట్ట లేకపోయారు, లేదా తెలిసినా మూసిపెట్టారు. సంక్షోభాలను నివారించలేకపోయారు. ప్రపంచీకరణలో భాగంగా లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్దలుగా మారిపోయి అప్పులపాలై దివాలా తీసి, తీవ్ర సామాజిక, ఆర్ధిక సమస్యలను ఎదుర్కొనటం మన కళ్ల ముందే చూశాము. ఇతర దేశాల మీద ఆధారపడిన ఎగుమతి ఆర్ధిక విధానాన్ని చైనా ప్రధానంగా అనుసరించినప్పటికీ గత నలభై సంవత్సరాలలో లాటిన్‌ అమెరికా లేదా ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి సమస్యలను ఎదుర్కోలేదు. అనేక ముందు జాగ్రత్తలను తీసుకొని వ్యవహరించిన కారణంగా కొన్ని సంవత్సరాలలో అభివృద్ధి రేటు తగ్గినా మొత్తం మీద రెండంకెల ప్రగతిని సాధించింది. మరే దేశంలోనూ ఈ తీరు కనిపించదు. చైనా అనుసరిస్తున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అని వర్ణించే వారు సైతం ప్రభుత్వేతర పెట్టుబడిదారీ విధానం కంటే ఇదే మెరుగైనదని, మిగతా విధానాలు వైఫల్యం చెందాయని అంగీకరించకతప్పదు. ఒక దేశం అనుసరిస్తున్నది పెట్టుబడిదారీ విధానమా దానికి భిన్నమైనదా అనేందుకు కొలబద్ద పౌరుల జీవన పరిస్ధితుల మెరుగుదల మాత్రమే.

Image result for four decades of china reforms

చైనా అధ్యక్షుడు గ్జీ గింగ్‌పింగ్‌

దారిద్య్రనిర్మూలన పెట్టుబడిదారీ విధానానికి ఒక నినాదం మాత్రమే. దానికి భిన్నమైన విధానాలకు ఒక బృహత్తర కార్యక్రమం, సవాలు. దానికి చక్కటి వుదాహరణలు భారత్‌, చైనాలే. 1971లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇందిరా గాంధీ గరీబీ హఠావో పేరుతో పేదరిక నిర్మూలన నినాదమిచ్చి ఘనవిజయం సాధించారు. చైనా విషయానికి వస్తే అలాంటి నినాదాలేమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు గానీ 1978లో విదేశీ కార్పొరేట్లకు తన మార్కెట్‌ను తెరుస్తూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వాటిలో దారిద్య్ర నిర్మూలన లక్ష్యం కూడా ఒకటి. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్ధలన్నీ చెప్పినదాని ప్రకారం గత నాలుగు దశాబ్దాలలో 70 నుంచి 80 కోట్ల మందికి( జనాభాలో 90శాతం నుంచి రెండుశాతానికి) దారిద్య్రం నుంచి విముక్తి కలిగించింది. 2030నాటికి ప్రపంచ వ్యాపితంగా దారిద్య్రనిర్మూలన సాధించాలన్న ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది లక్ష్యాలకు అనుగుణ్యంగా పని చేయటాన్ని చూస్తే పది సంవత్సరాల ముందే నూటికి నూరుశాతం మందిని దారిద్య్రరేఖకు ఎగువకు చేర్చాలని ప్రయత్నిస్తున్నది. చైనా జాతీయ గణాంక సంస్ధ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం 1978-2017 మధ్య 74కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తెచ్చింది. సరాసరి ఏటా కోటీ 90లక్షల మందికి విముక్తి కలిగించింది.తాజాగా విడుదల చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆహారం, దుస్తులు, విధిగా పిల్లలకు తొమ్మిది సంవత్సరాల విద్య, మౌలిక వైద్య, గృహవసతి కల్పించాల్సి వుంది. దీనికి అనుగుణంగా 2020 నాటికి మిగిలిన వారికి ఆ వసతులు కల్పించేందుకు వచ్చే ఏడాది 13బిలియన్‌ డాలర్ల మేర ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఒక వ్యక్తికి వార్షికాదాయం 2,300 యువాన్లు లేదా 337 డాలర్ల కంటే తక్కువ లభిస్తే దారిద్య్రంలో వున్నట్లు లెక్క. ప్రపంచబ్యాంకు తాజాగా ప్రకటించినదాని ప్రకారం రోజుకు 1.9డాలర్ల కంటే తక్కువ వచ్చే వారు దారిద్య్రంలో వున్నట్లు లెక్క. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ(యుఎన్‌డిపి) సంస్ధ బహుఅంశాల దారిద్య్ర సూచిక (ఎంపిఐ-మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌) 2018 ప్రకారం 2015-16 సర్వే ప్రకారం భారత్‌ సూచిక 0.121, జనాభాలో 27.51శాతం మంది దారిద్య్రంలో వున్నారు. అదే చైనాలో 2014 సర్వే ప్రకారం సూచిక 0.017గానూ, 4.11శాతం మంది దారిద్య్రంలో వున్నారు. ఈ లెక్కన త్వరలో నూటికి నూరుశాతం మంది చైనాలో దారిద్య్రం నుంచి బయటపడనుండగా మన దేశం 2030లక్ష్యాన్ని చేరుకోగలదా అన్నది సమస్య. అందువలన ఏ విధంగా చూసినా చైనా మనకంటే ఎంతో ముందుంది. చైనా సమాజంలో ఆర్ధిక అసమానతలు వున్నాయని ప్రభుత్వమే స్వయంగా చెబుతోంది. మొత్తంగా అసమానతలతో పాటు గ్రామీణ- పట్టణ అసమానలు ఒక సమస్య. పట్టణ పేదరిక సమస్య దాదాపు పూర్తిగా నిర్మూలన అయింది. గ్రామాలు, బాగా వెనుకబడిన ప్రాంతాలలో మిగిలి వున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రీకరణ చేపట్టింది.

Image result for four decades of china reforms

డెంగ్‌సియావో పింగ్‌

అభివృద్ధిలో పోటీపడి ఏ దేశమైనా తన పౌరుల జీవన పరిస్ధితులను మెరుగుపరిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. గత కొద్ది సంవత్సరాలుగా త్వరలో చైనాను అధిగమించి భారత్‌ పురోగమించనుందని అనేక మంది చెబుతున్నారు. రెండు దేశాలను పోల్చి కొన్ని అంకెలను కూడా చెబుతున్నారు. విమర్శనాత్మకంగా పరిశీలించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని జాతివ్యతిరేకులుగా వర్ణించే ప్రమాదకర పోకడలు పెరుగుతున్నాయి. 2018 మార్చినాటికి భారత జిడిపి 2.6లక్షల కోట్లుగానూ, 2023 మార్చినాటికి నాలుగు లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని నీతిఅయోగ్‌ తాజా అంచనాలో తెలిపింది. అభివృద్ధి రేటు ఎనిమిది నుంచి పదిశాతం మధ్య వుంటుందనే అంచనాతో ఈ జోస్యం చెప్పారు. ప్రస్తుతం 14లక్షల కోట్ల డాలర్లుగా వున్న చైనా జిడిపి 2023నాటికి 21.5లక్షల కోట్లకు పెరుగుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఒక వేళ చైనా అభివృద్ది పూర్తిగా ఆగిపోతుందని అనుకుంటే ఇప్పుడున్న చైనా స్ధాయికి చేరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. 2.6లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షలకోట్లకు ఐదు సంవత్సరాలు పడితే ఊఏటా పదిశాతం అభివృద్ది రేటు వుంటే గింటే 2034 నాటికి గాని మనం చైనా స్ధాయికి చేరుకోలేమన్నది అంచనా. అందువలన ప్రస్తుత విధానాలతో త్వరలోనే మనం చైనాను అధిగమించుతామని చెప్పటం అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటమే. మన ఆర్ధికవేత్తలు, ఇతరులు చెబుతున్నట్లు మన దేశం ఏటా 7.5శాతం అభివృద్ధి సాధిస్తే మన ఆర్ధిక వ్యవస్ధ 0.195లక్షల డాలర్ల మేర పెరుగుతుంది. అదే చైనా 6.9శాతం వున్నా 0.86లక్షల కోట్లు పెరుగుతుంది. 2018 ప్రపంచ ఆర్ధిక వేదిక సంఘటిత అభివృద్ధి సూచిక ప్రకారం మన దేశంలో ప్రతి పదిమందిలో ఆరుగురు రోజుకు 3.20 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో వున్నారు. చైనాలో అది ప్రతి పది మందికి 1.2 మంది మాత్రమే అలా వున్నారు. సంఘటిత అభివృద్ధి పధంలో వున్నాయని ఆ సంస్ధ ఎంపిక చేసిన 74 దేశాలలో చైనా 26వదిగా వుండగా మన దేశం 62వ స్ధానంలో వుంది. చైనా సాధించిన విజయాల గురించి కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులు పెదవి విరుస్తుంటారు. చెబుతున్న అభివృద్ధికి రుజువుల్లేవంటారు, మేం నమ్మం అంటారు. ఎయిడ్స్‌ వైరస్‌కు చికిత్సలేదు. మాకు నమ్మకం లేదు అనేది కూడా అలాంటి చికిత్సలేని వ్యాధే. అలాంటి వారిని ఒప్పిందచేందుకు పూనుకోవటం వృధా ప్రయాసే. ఎయిడ్స్‌ రోగుల మాదిరి సానుభూతి చూపాల్సిందే.