Tags

, ,

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?