Tags
another big lie from Donald Trump, Donald trump, donald trump motormouth, policing the world, U.S. Military Bases Worldwide, US World Police Cap
ఎం కోటేశ్వరరావు
లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే ! అమెరికా పాలకవర్గమూ అలాంటిదే ! వారికి యుద్ధమూ లాభమే, పోరు నిలిపివేతా లబ్ది చేకూర్చేదే అయితే దేనికైనా సిద్ధపడతారు ! అది ఆసియా ఖండమా, ఐరోపానా అన్నదానితో నిమిత్తం లేదు ! అందుకు డెమోక్రాట్లు- రిపబ్లికన్లూ అన్న తేడా లేదు ! అవసరమైతే పార్లమెంటులో రెండు పార్టీలు కలసి ఎవరు అధ్యక్షుడిగా వున్నా అడ్డుకుంటాయి లేదా మద్దతు ఇస్తాయి ! ఆ రెండు పార్టీల మధ్య తగాదా అధికారం దగ్గర తప్ప కార్పొరేట్ల ప్రయోజనాల గురించి కాదు. తమ లక్ష్యాన్ని చేరుకొనేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలు, అనుసరించాల్సిన మార్గాల మీద తప్ప లక్ష్యం మార్పు రద్దు గురించి కాదు. అమెరికా రాజకీయాలు, విధానాలను నిర్ణయించేది అక్కడి గుత్త సంస్ధలు తప్ప సామాన్యులు కాదు. రాజకీయ నేతలు వాటి తోలుబమ్మలే. అందుకే వారు ఎలా ఆడిస్తే అలా ఆడతారు. అమెరికా ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అన్నింటా అగ్రస్ధానం తమదే అనే దాని ఆటలు సాగటం లేదు. అదిరింపు, బెదిరింపు, బుజ్జగింపు, లాలింపు, తప్పదనుకుంటే రాజీ ఇదీ ఇప్పటి దాని స్ధితి. ఇలా చెప్పటం అంటే అమెరికా పని అయిపోయిందని కాదు. అగ్రరాజ్యానికి కూడా అనువుగాని పరిస్ధితులు ఎదురైనపుడు సింహం కూడా ఒకడుగు వెనక్కు వేయకత తప్పదు. ఏమిటా పరిస్ధితి, ఎందుకీ పరిణామాలు !
సిరియా నుంచి పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సగం మంది సైనికులను వుపసంహరించనున్నట్లు ట్రంప్ సంచలన ప్రకటన, దానికి నిరసనగా దేశ రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ రాజీనామా, ఆ తరువాత మెక్సికో సరిహద్దులో గోడకు నిధుల కేటాయింపుపై పార్లమెంట్‌లో వ్యతిరేకత, అది ప్రభుత్వ స్ధంభనకు దారితీత, ఇది కొనసాగుతుండగానే ఆకస్మికంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో తిష్టవేసిన అమెరికన్ దళాల వద్దకు వెళ్లి ఇంకేమాత్రం అమెరికా ప్రపంచ పోలీసుగా వుండబోదని ఒక ప్రకటన. ఇవన్నీ పక్షం రోజుల్లో వరుసగా జరిగిన పరిణామాలు. అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సంక్షోభం, సమస్యల తీవ్రతకు ప్రతిబింబాలు. ఒక వారంలో ఒకదాన్ని సంచలనాంశంగా మారిస్తే మరో వారంలో మరో అంశాన్ని ముందుకు తెస్తున్న ట్రంప్ తీరుతెన్నులు ప్రపంచానికి పజిల్‌గా వుంటున్నాయి. ఒక ప్రకటన చేయటం దాని మీద స్పందనలు ఎలా వుంటాయో చూడటం, దానికి అనుగుణ్యంగా తదుపరి చర్యలు. వీటిలో ప్రపంచ పోలీసుగా అమెరికా పాత్ర గురించి వివరంగా పరిశీలించుదాం. చరిత్రలో తొలి ప్రపంచ పోలీసుగా బ్రిటన్ వ్యవహరిస్తే తదుపరి ఆ పాత్రను అమెరికా పోషిస్తోంది. కర్రవున్నవాడిదే గొర్రె అన్నట్లుగా ప్రపంచంపై పెత్తనం కోసం తమకు తాముగా కర్రపెత్తనం చలాయించటం తప్ప ఈ దేశాలకు ఎవరూ ఆ బాధ్యతను అప్పగించలేదు. ఆ పాత్రలో తామింక వుండలేమని ట్రంప్ చెప్పటం వెనుక పరమార్ధం ఏమిటి?
రేపటి నుంచి మిమ్మల్ని తినబోనని పులి చెబితే మేకలు నమ్ముతాయా, ట్రంప్ మారుమనస్సు పుచ్చుకున్నాడా ? ఎందుకింత పెద్ద అబద్దం చెప్పాడు. అమెరికా సమాజానికి ఇది ఒక ప్రజాకర్షక అంశంగా తయారైంది. అందుకే ఇటీవలి కాలంలో ఎవరు అధికారంలో వున్నా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాల్సివస్తోంది. ప్రపంచ పోలీసు పాత్రలో వుండాలనుకోవటం లేదు అన్న మాటలు కాదు, కొనసాగింపు అంశం ముఖ్యం. ‘ భారం మొత్తం మేమే భరించటం సముచితం కాదు. మమ్మల్ని, నిస్సందేహమైన మా మిలిటరీని తమ రక్షణకు వుపయోగించుకోవాలని ఇతర దేశాలు చూడటాన్ని ఇంకేమాత్రం మేము కోరుకోవటం లేదు.’ అన్నాడు.ప్రస్తుత స్ధాయిలో అమెరికా మిలిటరీ ఖర్చు వెర్రి తప్ప మరొకటి కాదు, అదుపులేని ఆయుధపోటీగా మారినందున అర్ధవంతమైన ముగింపు పలకాలి, ఒక రోజు తాను, చైనా, రష్యా నాయకులు దీని గురించి చర్చ ప్రారంభించకతప్పదు అని గతంలో ట్రంప్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.జనాభాలో సగం, జిడిపిలో పదోవంతు కలిగిన పొరుగుదేశం వుత్తర కారియానుంచి రక్షణ కోసం దక్షిణ కొరియాను అమెరికా ఎందుకు కాపాడాలి. అమెరికా కంటే రష్యాకు మరింతదగ్గరగా వుంది జర్మనీ, తూర్పు నుంచి (రష్యా) నుంచి వస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది జిడిపిలో ఒక శాతం కూడా ఖర్చు చేయటం లేదు వాటికోసం అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి అని కూడా ప్రశ్నించాడు. గత కొద్ది సంవత్సరాలుగా తమ మిలిటరీ రక్షణ పొందాలని చూసే దేశాలు అందుకయ్యే ఖర్చులో అధికభాగం భరించాలని అమెరికా సందర్భం వచ్చినపుడల్లా చెబుతోంది, వత్తిడి తెస్తోంది. దక్షిణ కొరియాలో ఏటా మూడున్నర బిలియన్ డాలర్లు ఖర్చు చేసి తమ సైన్యాన్ని అక్కడ ఎందుకు కొనసాగించాలని ట్రంప్ గతేడాది ప్రశ్నించాడు. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా వుండాలంటే కొనసాగించక తప్పదని సిరియానుంచి సైనిక దళాల వుపసంహరణను వ్యతిరేకిస్తూ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మాటిస్ స్పష్టం చేశాడు. ఇస్లామిక్ తీవ్రవాదులను అణచే పేరుతో సిరియాలో ఏటా 15, ఆఫ్ఘనిస్తాన్‌లో 45 బిలియన్ డాలర్లను ఏటా అమెరికా ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేసి సాధించేదేమిటి? అనే ప్రశ్నకు పాలకులు సూటిగా సమాధానం చెప్పే స్ధితిలో లేరు.
పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల విశ్లేషణ, అవగాహన ప్రకారం ఒక దేశ రక్షణ ఖర్చు కంటే అప్పుల చెల్లింపు ఎక్కువైన దేశాలు కుప్పకూలిపోతాయి. గతంలో కమ్యూనిజాన్ని, తరువాత ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అణచే పేరుతో లేదా వాటి నుంచి దేశాలను రక్షించే సాకుతో ప్రపంచ వ్యాపితంగా అమెరికా తన సేనలను మోహరించింది. ప్రత్యక్షంగా ఆయా దేశాల గడ్డమీద లేదా ఏ క్షణంలో అయినా జోక్యం చేసుకొనేందుకు వీలుగా సమీప ప్రాంతాలలో వేసిన తిష్టవలన గానీ 150 దేశాల్లో అమెరికా సైన్యాలు వున్నట్లు లెక్క. ప్రస్తుతం అమెరికా జాతీయ రుణ భారం 21లక్షల కోట్ల డాలర్లు.2012లో ఫెడరల్ లోటు బడ్జెట్ లక్ష కోట్లు దాటగా 2018లో 779 బిలియన్ డాలర్లుంది.2020 నాటికి ఐదుశాతం రక్షణతో సహా ప్రతి శాఖ కోత విధించాలని ట్రంప్ కోరాడు. రుణ చెల్లింపులు రక్షణ ఖర్చుకంటే ఎక్కువైన కారణంగానే రోమన్ సామ్రాజ్యం, సోవియట్ యూనియన్ దివాలా తీశాయని, అమెరికా ఇప్పుడు దానికి దగ్గరగా వస్తోందని హార్వర్లు ప్రొఫెసర్ నియాల్ ఫెర్గూసన్ హెచ్చరించాడు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా సైనిక కేంద్రాలు వివిధ ప్రాంతాలు, సముద్రాలలో ఐరోపాలో 330, ఆసియాలో 210, మధ్య ప్రాచ్యంలో 73, లాటిన్ అమెరికాలో 71, పసిఫిక్‌లో 66, ఆఫ్రికాలో 24,కెనడా లేదా గ్రీన్‌లాండ్‌లో నాలుగు, అట్లాంటిక్‌లో రెండు చొప్పున మొత్తం 750 వున్నాయి.
ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ కార్యాలయం(సిబిఓ) తెలిపిన సమాచారం ప్రకారం 2018లో జాతీయ అప్పు మీద చెల్లించిన వడ్డీ 371బిలియన్ డాలర్లు, ఇది రక్షణ బడ్జెట్‌లో సగం. ప్రస్తుత బడ్జెట్ పోకడలను బట్టి ఐదు సంవత్సరాలలో రక్షణ కంటే వడ్డీ చెల్లింపులకు కేటాయించాల్సిన మొత్తం పెరగనుంది. పది సంవత్సరాలలో వడ్డీ,సామాజిక భద్రత వంటి పధకాలకు పన్ను వసూళ్లలో 85శాతం ఖర్చు అవుతుందని, జిడిపిలో 2018లో 3.1శాతంగా వున్న రక్షణ బడ్జెట్ 2028నాటికి 2.6శాతానికి తగ్గనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఐరోపాలోని ధనిక దేశాల రక్షణ ఖర్చు గణనీయంగా పెరగనుంది. వడ్డీ రేట్ల పెరుగుదల అంచనా కంటే వేగంగా వుంటే ఇంకా ముందే ఏడాదికి వడ్డీ చెల్లింపులు 900బిలియన్ డాలర్లకు చేరి రక్షణ ఖర్చును మించి పోవచ్చు. చైనా, ఐరోపా యూనియన్ దేశాల రక్షణ ఖర్చు జిడిపిలో రెండుశాతానికి చేరితే త్వరలోనే అమెరికాతో సమం కావచ్చు. ఇప్పుడున్న తీరు తెన్నులను బట్టి 2035నాటికి చైనా, ఐరోపా యూనియన్‌లు అమెరికాను అధిగమించనున్నాయి.
సామ్రాజ్యం అంటే వలసలు లేదా అధీన రాజ్యాలు కలిగి వుండటం అన్నది సాంప్రదాయ అర్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆ పరిస్ధితి అంతరించింది కనుక ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ఎన్ని సైనిక కేంద్రాలు, ఎందరు సైనికులున్నారన్నది సామ్రాజ్యవాదానికి తాత్పర్యంగా చెప్పవచ్చు.దీనికి ముందే చెప్పుకున్న సైనిక కేంద్రాలే నిదర్శనం. చమురు రవాణా సక్రమంగా జరిగేందుకు నావల ప్రయాణించే మార్గాలు, పైపులైన్ల రక్షణ మొదలు అనేక వ్యూహాత్మక అవసరాలకు అమెరికా ఈ కేంద్రాలను, సైన్యాన్ని వినియోగిస్తున్నది. వీటికి ఏటా 156 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతున్నది. సాంప్రదాయక సామ్రాజ్యవాదం అది బ్రిటన్ లేదా ఫ్రెంచి, డచ్, పోర్చుగీసు, స్పెయిన్ ఏదైనా కావచ్చు, వందల సంవత్సరాలు వలస దేశాలలో తిష్టవేసి ప్రధానంగా వాటిని తమ పరిశ్రమలకు ముడివస్తువులను సరఫరా చేసే దేశాలుగానూ, పారిశ్రామిక వస్తువులకు మార్కెట్లగానూ వినియోగించుకున్నాయి. కానీ అమెరికా సామ్రాజ్యవాదం వీటితో పాటు అంతకు ముందు లేని కమ్యూనిజం వ్యాప్తి నిరోధం, కమ్యూనిస్టు దేశాల అణచివేతను కూడా జోడించి వివిధ ప్రాంతాలలో కుట్రలకు తెరలేపింది, నియంతలను బలపరిచింది, యుద్ధాలను, వాటికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ ఆర్ధికంగా లబ్దిపొందుతున్నది. ఈ కారణంగానే మిలిటరీ పారిశ్రామిక కార్పొరేట్‌లు అవతరించాయి.వుదాహరణకు మనకందరకు తెలిసిన బోయింగ్ కంపెనీ ప్రయాణీకుల విమానాలతో పాటు యుద్ధ జెట్ విమానాలతో పాటు అనేక మారణాయుధాలను కూడా తయారు చేస్తున్నది. అవి నిత్యం పని చేస్తూ వుండాలంటే ప్రపంచంలో నిత్యం ఏదో ఒక మూల ఒక దేశం మరొక దేశంతో కొట్లాడుకోవాలి లేకపోతే అమెరికాయే ప్రత్యక్షంగా ఎక్కడో ఒక చోట దాడులకు తెగబడుతూ వుండాలి. రక్షణ ఒప్పందాలు, ముప్పు పేరుతో అనేక దేశాలను తన గుప్పెటలోకి తెచ్చుకొని నిరంత ఆయుధ విక్రయాలతో దోపిడీ సాగిస్తున్నది. అలాంటి దేశం తెల్లవారేసరి తాను ప్రపంచ పోలీసు పాత్రనుంచి తప్పుకోవాలను కుంటుందా ? తన ఆయుధ పరిశ్రమలను మూసివేసుకుంటుందా ? లాభాలను వదులుకుంటుందా ?
విదేశాలలోని సైనిక స్ధావరాలలో అమెరికా లక్షన్నర మంది సైనికులను మోహరించింది. నిజానికి పాతికేండ్ల క్రితం ప్రచ్చన్న యుద్ధంలో విజయం సాధించామని, కమ్యూనిజం అంతరించిందని చెప్పిన అమెరికా విదేశాల్లోని సగం సైనిక కేంద్రాలనైనా తక్షణమే మూసి వుండాల్సింది. కానీ కేంద్రాల సంఖ్యతో పాటు సైనికులను మోహరించిన దేశాల సంఖ్య కూడా 40 నుంచి 80కి పెరిగింది.సహజంగానే ఖర్చు కూడా తడిచి మోపెడు అవుతుంది. ఈ ఖర్చు ఎంతో నిజానికి బయటి ప్రపంచానికి తెలియదు. విదేశీ స్ధావరాల వార్షిక ఖర్చు ఎంత అని పార్లమెంట్ కోరితే 21 లేదా 22 బిలియన్ డాలర్లని పేర్కొన్నారు. అయితే దీన్నెవరూ నమ్మటం లేదు, ఏడాదికి కనీసం 250 బిలియన్ డాలర్లని కొందరి అంచనా. పైకి చెప్పకపోయినప్పటికీ జపాన్‌లో 113, దక్షిణ కొరియాలోని 83 సైనిక కేంద్రాలు నిజానికి ఏక్షణంలో అయినా చైనా లేదా రష్యాతో యుద్ధానికి తలపడే సన్నద్దతతో గత ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. దీని వలన సామాన్యజనానికి భారం తప్ప వారికి ఒరుగుతున్నదేమీ లేదు. ఆయుధ పరిశ్రమలకు నిరంతరం లాభాలు వస్తున్నాయి.నిరంతరం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అమెరికా 33 అప్రజాస్వామిక దేశాలలో సైనిక కేంద్రాలను నడుపుతున్నదని ఒక మాజీ అధికారి పేర్కొన్నాడు. ఇవే కాదు సైనిక స్ధావరం వున్న ప్రతి దేశం అమెరికా ఆయుధాలు, వస్తువులకు అవి మార్కెట్లుగా వున్నాయని వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే ట్రంప్ మరో పచ్చి అబద్దం ఆడాడని చెప్పాల్సి వస్తోంది.