Tags

, , ,

Image result for What Narendra Modi hide, What ANI did not asked

ఎం కోటేశ్వరరావు

మిన్నువిరిగి మీద పడితే తప్ప ప్రధాని నరేంద్రమోడీ మీడియా గోష్టిలో ముఖాముఖీ మాట్లాడని భారత తొలి ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించటం ఖాయమని తేలిపోయింది. బహుశా ప్రపంచంలోనే తొలి ప్రజాప్రతినిధి కూడా అయి వుండవచ్చు. పది సంవత్సరాల కాలంలో మూడంటే మూడు సార్లు మాత్రమే మీడియాతో మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మౌనముని అని ఎద్దేవా చేసిన వారిలో బిజెపి కూడా వుంది. సోనియగాంధీ అనుమతి ఇవ్వని కారణంగా మన్మోహన్‌ అలా చేసి వుండవచ్చు. నాకు 56 అంగుళాల ఛాతీ వుంది, రిమోట్‌ కంట్రోలు లేదు అని చెప్పుకొనే నరేంద్రమోడీ ఒక్కసారి కూడా మాట్లాడకపోవటానికి కారణాలేమిటో ? అయితే ఏ ప్రధానీ ఇవ్వనన్ని ఫోజులు మీడియా కెమెరాలకు ఇచ్చారు కదా అని ఆయన భక్తకోటి దెబ్బలాటకు దిగవచ్చు. అలాంటి పెద్ద మనిషి నరేంద్రమోడీ జనవరి ఒకటవ తేదీన, హిందూత్వశక్తులు, అసలు సిసలు భారతీయతకు ప్రతీకలం అని చెప్పుకొనే వారు మొహాలు ఎక్కడో పెట్టుకొని సిగ్గుపడే విధంగా ఎఎన్‌ఐ అనే వార్తా సంస్ధకు ఆంగ్ల సంవత్సరాది రోజు 95నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. అది యాదృచ్చికం తప్ప ఆంగ్ల సంవత్సరాదికి మోడీ ఇంటర్వ్యూకు సంబంధం లేదని వితండవాదం లేదా భాష్యం చెప్పే బాపతు కూడా మనకు తగలవచ్చు.

బ్రిటన్‌లో చాలా కాలం కిందట రాజు గారి తరువాత రాణీగారి ప్రతిపక్షంగా వ్యవహరించే పార్టీలు వుండేవి. అంటే రాజు, రాణీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అణగిమణగి ప్రశ్నించే పక్షాలవి. అలాగే నరేంద్రమోడీ మన దేశంలో అలాంటి మీడియాను రంగంలోకి తెచ్చిన ఆద్యుడిగా చెప్పుకోవాలి. ఒక యాంకర్‌గా చర్చలో పాల్గనేవారి మీదకు ఎక్కే ఆర్నాబ్‌ గోస్వామి నక్క వినయాలతో నరేంద్రమోడీని ఇంటర్య్వూ చేసిన విషయం తెలిసిందే. అంటే ముందుగానే ఏ ప్రశ్నలు అడగాలో ఏమి జవాబులు చెబుతారో, వాటి మీద వుప ప్రశ్నలు వేయకుండా ఎలా నోరు మూసుకోవాలో అన్నీ ముందే నిర్ణయం అవుతాయి. ఒక వేళ నోరు జారితే ఆ భాగాన్ని తొలగిస్తారనుకోండి అది వేరే విషయం. జనవరి ఒకటిన ఎఎన్‌ఐ ఇంటర్వ్యూ కూడా అలాంటి ముందస్తు ఏర్పాటుతో జరిగిందే అని వేరే చెప్పనవసరం లేదు. ఆ షరతుకు ఒప్పుకుంటేనే తన గదిలో మోడీ నోరు విప్పుతారు.

కొంత మంది ఓటమి లేదా తప్పిదాలను ఒక పట్టాన ఒప్పుకోరు, అందునా అవకాశవాద రాజకీయ నాయకులు కిందపడ్డా మాదే విజయం అంటారు. రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ చేసిన పెద్ద నోట్లను రద్దు గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పిందేమిటి? ఇదేమీ ఝట్కా (ఆకస్మిక నిర్ణయం) కాదు, ఏడాది క్రితమే మీ దగ్గర నల్లధనం ఏదైనా వుంటే డిపాజిట్‌ చేయండి, అపరాధరుసుం చెల్లించండి, మీకు సాయం దొరుకుతుంది అని హెచ్చరించా. అయినప్పటికీ ఇతరుల మాదిరే మోడీ కూడా వ్యవహరిస్తారులెమ్మని కొంతమందే స్వచ్చందంగా ముందుకు వచ్చారు. నోట్ల రద్దుకు ముందు సమాంతర ఆర్ధిక వ్యవస్ధ వుంది, అది అంతర్గతంగా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసింది. సంచుల్లో దాచిన కరెన్సీ బ్యాంకింగ్‌ వ్యవస్ధలోకి తిరిగి వచ్చింది.’ అన్నారు మోడీ.

మోడీ మహాశయుడు నోట్ల రద్దు గురించి చెప్పిందాంట్లో కొత్తదేమీ లేదు. సాధించింది ఏమిటో చెప్పాలి కదా ! ఎంత నల్లధనం బయపడింది, దానిని ఎలా వుపయోగించారు, దాని వలన ఆర్ధిక వ్యవస్ధకు జరిగిన మేలేమిటి? బ్యాంకింగ్‌ వ్యవస్ధకు పెద్ద మొత్తంలో కరెన్సీ వస్తే ఇప్పుడు బ్యాంకులకు ప్రభుత్వం మూలధనం సమకూర్చేందుకు రిజర్వుబ్యాంకుల వద్ద వున్న మిగులును ఇమ్మని ఎందుకు అడుగుతున్నట్లు ? వీటి గురించి ఎంత తరచినా కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వుబ్యాంకు అధికారికంగా ఒక్క ప్రకటనా చేయలేదు. ఒక సాధారణ అంశం మాదిరి, 2018 ఆగస్టులో తన వార్షిక నివేదికలో తప్పదు కాబట్టి వివరాలను పొందుపరచింది. దాని ప్రకారం రద్దయిన నోట్లలో 99.3శాతం తిరిగి బ్యాంకులకు వచ్చాయి. ఆ మిగిలిన 0.7శాతం కూడా చిరిగిపోయి, ధ్వంసమై చెలామణిలో లేని లేదా ఆమాయకంగా మార్చుకోకుండా తమవద్దే వుంచుకున్న అమాయక సామాన్యుల వద్ద వుండిపోయింది తప్ప అది నల్లధనం కాదు. రద్దు వలన వచ్చిన లాభం కంటే జరిగిన నష్టమే ఎక్కువని అందరికీ తెలిసిన అంగీకరించటానికి 56 అంగుళాల ఛాతీకి ధైర్యం చాల్లేదు.

రిజర్వుబ్యాంకు గవర్నర్‌ వుర్జిత్‌ పటేల్‌ రాజీనామా గురించి నరేంద్రమోడీ పెద్ద జోక్‌ పేల్చారు. మొదటిసారిగా బయట పెడుతున్నానంటూ రాజీనామాకు ఆరేడు నెలల ముందే తాను తప్పుకుంటానని చెప్పారని, వ్యక్తిగతంగా తనకు రాతపూర్వకంగా తెలియచేశారని నరేంద్రమోడీ చెప్పారు. రాజీనామా సమయంలోనే ఈ విషయం ఎందుకు చెప్పలేదు, అదేమైనా రహస్యమా, దేశ భద్రతకు సంబంధించిన అంశమా ? రిజర్వుబ్యాంకు వద్ద వున్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించమని పటేల్‌ను వత్తిడి చేసిన అంశం బహిరంగ రహస్యం. మిగులు నిధులు, ఇతర కొన్ని అంశాలలో తాము చెప్పినట్లు చేయకపోతే కుదరదని తెగేసి చెప్పటమే గాక దేశ చరిత్రలో తొలిసారిగా రిజర్యుబ్యాంకు చట్టంలోని సెక్షన్‌ ఏడును ప్రయోగించింది. దాని ప్రకారం ప్రభుత్వం చెప్పినట్లు రిజర్వుబ్యాంకు వ్యవహరించాల్సి వుంటుంది. ఒక స్వతంత్ర ప్రతిపత్తిగలిగిన సంస్ధకు అధిపతిగా వున్న వ్యక్తిలో ఏ కాస్త ఆత్మగౌరవం వున్నా దానికి నిరసనగా రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదు. వుర్జిత్‌ పటేల్‌ ఆ పని చేయకుండా తన వ్యక్తిగత కారణాలు చూపి తప్పుకున్నాడు. అయినా నరేంద్రమోడీ ఈ విషయం గురించి పిట్టకథలు చెబుతున్నారు. రాజీనామాకు అనుమతించాలంటూ ఆరేడు నెలల క్రితం పటేల్‌ రాసిన లేఖను మోడీ బయట పెట్టి వుంటే ఆయన చెబుతున్న మాటలకు విశ్వసనీయత వుండేది.

రాజకీయాల గురించి ఎంత జాణతనంతో మాట్లాడినా చెల్లుతుంది. రైతాంగరుణ భారం వంటి తీవ్ర సమస్యల గురించి ప్రధాని మోడీ చాలా చులకనగా మాట్లాడారు. రుణాల రద్దు లాలీపాప్‌ వంటివన్నారు. అదే నిజమైతే ఆయన పార్టీ మంత్రులు ఎందుకు రుణాల రద్దు గురించి మాట్లాడుతున్నట్లు ? మోడీ మాట్లాడటానికి ఒక రోజు ముందే తమకు ఒడిషాలో అధికారమిస్తే రైతుల రుణాలను రద్దు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా మోడీ తీరు వుంది. రుణాల రద్దు కొద్ది మందికే వుపయోగపడుతున్నాయని, బ్యాంకుల నుంచి తీసుకొనే వారు తక్కువ, వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకొనే వారే ఎక్కుని కూడా మోడీ సెలవిచ్చారు.ఆయనకు వాస్తవాలు తెలియవా, నివేదికలు చదవరా ? చదివించుకోరా ? అర్ధంగాకపోతే వివరించమని అధికారులను అడగరా ? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనే రైతులు చాలా తక్కువని ప్రధానే చెప్పారంటే అర్ధం ఏమిటి? బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వటం లేదనే కదా ? అదే నిజమైతే కేంద్రం గత ఐదేండ్లుగా ఏమి చేస్తున్నట్లు, ప్రాధాన్యతా రంగంగా ప్రకటించిన వ్యవసాయానికి రుణాలు తగినన్ని ఇవ్వలేదని బ్యాంకులను ఎందుకు నిలదీయలేదు. అసలు వాస్తవం ఏమంటే 2018ఆగస్టులో నాబార్డు వెల్లడించిన అధ్యయనం ప్రకారం 52.5శాతం రైతు కుటుంబాలు రుణభారంలో కూరుకుపోయాయి. వీరిలో కేవలం 11.5శాతమే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నారు. మోడీ చెప్పిందేమిటి ?

సర్జికల్‌ దాడులు తీవ్రముప్పుతో కూడుకున్నవి గనుక ఎక్కువ సేపు సాగించకుండా తెల్లవారక ముందే పూర్తి చేసి రమ్మని తాను స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను జారీచేసినట్లు ప్రధాని చెప్పుకున్నారు. వినేవారుంటే చెప్పేవారు ఎన్నయినా పిట్టకథలు చెబుతారు. ఇలాంటి దాడుల గురించి గతంలో వాటిని నిర్వహించిన వారు చెప్పాలి. లేని గొప్పలు చెప్పుకోవటం తప్ప ఏ అనుభవంతో మోడీ మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్లు? గతంలోనూ అనేక దాడులు జరిపారు అయినా ఏ ప్రధానీ వాటిని ఇంతగా గొప్పలు చెప్పుకోలేదు. గోవధల పేరుతో మూకదాడులు చేసిన వారి గురించి మోడీ ఖండించారు. మరోవైపు ఆయన మంత్రులు చేసిందేమిటి? దాడులకు పాల్పడి శిక్షలు పడిన ఎనిమిది మంది నేరగాండ్లు బెయిలు మీద బయటకు వచ్చినపుడు హజారీబాగ్‌లో పూలదండలు వేసి మరీ కేంద్ర మంత్రి జయంత సిన్హా స్వాగతం పలికారు. ఇదేమి పనయ్యా అని అడిగితే అది భావ ప్రకటనా స్వేచ్చ అంటూ మరో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గడుసుతనంతో తప్పించుకున్నారు. దాద్రి హత్య కేసులో నిందితుడు చస్తే శవం మీద జాతీయజండాను కప్పి ఒక నేరగాడికి గౌరవం ఇచ్చిన మరో మంత్రి మహేశ్‌శర్మలు మోడీగారి ఈ సమయంలో గుర్తు లేదా లేక మంత్రులను ఖండించినట్లా ? ఎందుకీ వంచన? వుత్తర ప్రదేశ్‌లో గోరక్షకులుగా చెప్పుకొనే ఒక పోలీసు అధికారినే హత్య చేసిన విషయం తెలిసిందే.

Image result for Narendra Modi hypocrisy

రాఫెల్‌ విమాన ఒప్పందం గురించి మోడీ అతి తెలివి తర్కానికి పాల్పడ్డారు. అదానీ, అంబానీలకు లబ్ది చేకూర్చారు కదా అన్న ప్రశ్నకు వ్యక్తిగతంగా నా పేరు చెప్పలేదు కదా ప్రభుత్వాన్ని అన్నారు, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎంత ఇచ్చారో చెప్పమనండి అని అడ్డుసవాలు విసిరారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు తమ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని అన్నారు. అయితే మోడీగారు చెప్పనిది, ఇంటర్వ్యూ చేసిన వారు అడగనిది ఏమిటి ? 126 విమానాల కోసం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి అధిక ధరలకు 36విమానాలు ఎందుకు కొన్నారు ? ఎంతో అనుభవం వున్న హాల్‌ను విస్మరించి ఎలాంటి అనుభవం లేని అనిల్‌ అంబానికి కాంట్రాక్టు ఎందుకిచ్చారు? అంబానీ కంపెనీ దివాలా తీసిందా లేదా ? విమానాల ధరల వివరాలను పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీకి కాగ్‌ ఇచ్చినట్లు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అలాంటిదేమీ లేదని కమిటీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధికారయుతంగా చెప్పారు. 2జి స్పెక్ట్రమ్‌ మాదిరి సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ ఎందుకు జరపరు? భారత ప్రభుత్వమే అంబానీ కంపెనీ పేరు సిఫార్సు చేసిందని ఫ్రెంచి మాజీ అధ్యక్షుడు హోలాండే ప్రకటించినదాని సంగతేమిటి ?

ముమ్మారు తలాక్‌ అంశం లింగవివక్షకు సంబంధించింది, శబరిమల అంశం సాంప్రదాయం అని మోడీ మహిళల పట్ల వివక్షను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు మెజారిటీ న్యాయమూర్తుల తీర్పును విస్మరించి వివక్షను సమర్ధించిన మహిళా న్యాయమూర్తి ఇందు మల్హోత్రా చెప్పిన అంశాలను ప్రధాని వివరించారంటే దేశానికి ఏ సందేశం పంపినట్లు ? అన్ని కేసులలోనూ మైనారిటీ న్యాయమూర్తుల వ్యతిరేక తీర్పులనే సమర్ధిస్తారా ? అదే ప్రాతిపదిక అయితే ఆధార్‌ కేసులో ఆ పధకాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ మైనారిటీ తీర్పు చెప్పిన చంద్రచూడ్‌ వైఖరిని అనుసరించి ఆధార్‌ను రద్దు చేస్తారా ? శబరిమలలో మహిళల పట్ల వివక్షను ప్రధాని సమర్ధిస్తున్న సమయంలోనే కేరళ మహిళా మానవహారంలో పాల్గన్నట్లు చెబుతున్న 30 నుంచి 50లక్షల మంది వరకు మహిళలు ప్రధాని వైఖరిని ఖండించినట్లే. ఇలా అనేక అంశాలను మోడీ కావాలనే విస్మరించారు, ఇంటర్వ్యూ చేసిన వారికి అవన్నీ తెలిసి కూడా అడగకుండా దాటవేశారు.