Tags
BJP pseudo patriotism, Gujarat studens roll call, patriotism, pseudo patriotism, Real patriotism
ఎం కోటేశ్వరరావు
‘ఒక దుర్మార్గుడి అంతిమ ఆశ్రయం (దిక్కు) దేశభక్తి ‘ అని 18వ శతాబ్దపు బ్రిటన్ రచయిత శామ్యూల్ జాన్సన్ చేసిన వ్యాఖ్య కొందరి విషయంలో నిజమే అనిపిస్తోంది కదూ! మన దేశాన్ని ఆక్రమించి మనలను పాలించిన మొఘలాయీ, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వారిని దేశభక్తులు, జాతీయ వాదులు అని పిలిచారు, జనం గౌరవించారు. స్వాతంత్య్రం వచ్చి మనలను మనమే పాలించుకుంటున్నాం. బ్రిటీష్ వారి కాలంలో వారితో చేతులు కలిపిన వారి వ ారసులు ఇన్ని దశాబ్దాల తరువాత మేమే అసలు సిసలు జాతీయవాదులం, దేశభక్తిలో మాకు సాటి లేదు, దానిలో 24గంటలూ మునిగి తేలుతున్నాం, మాతో మునగని వారందరూ దేశద్రోహులే అంటున్నవారిని ఏమని పిలవాలి ?
అవును నిజం ! ఇప్పటి వరకు ఎస్ సర్ లేదా ఎస్ మిస్, ప్రజెంట్ సర్ లేదా మిస్ లేదా మేడం అన్న అందరినీ వారికి తెలియకుండానే దేశద్రోహుల ఖాతాలో జమ చేసేందుకు పూనుకున్నారు. దానిలో భాగంగానే హాజరు వేసే సమయంలో జై హింద్ లేదా జై భారత్ అని చెప్పాలట. ఎస్ సర్ అన్న వారి కంటే జైహింద్ అన్న వారికే గుజరాత్ టీచర్లు రాబోయే రోజుల్లో సర్టిఫికెట్లు ఇవ్వాల్సి వుంటుంది. జై హింద్ అనని వారు దేశభక్తులు, భావి భారత పౌరులు కాదు, దేశవ్యతిరేకులు. పిచ్చి ముదురుతోంది. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లు దేశభక్తి లేదా బ్రిటీష్ వ్యతిరేక జాతీయవాదంతో ఏమాత్రం సంబంధం లేని వారి వారసులు ఇప్పుడు కొత్త దేశభక్తుల అవతారం ఎత్తారు. తాజాగా గుజరాత్ బిజెపి సర్కార్ జైహింద్, జై భారత్ ఆదేశాలు జారీ చేసింది. చిన్న వయస్సు నుంచి పిల్లలకు జాతీయ వాదంలో తర్ఫీదునిచ్చేందుకు తామీ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నది.
జై హింద్, భారత్ అంటే తప్పేమిటి అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. తప్పేమీ లేదు. అనేక యుద్ధాల్లో ప్రాణాలర్పించిన మన సైనికులు బడుల్లో హాజరు కోసం జై హిందు అనలే, అయినా సైన్యంలో చేరారా లేదా, వారికి దేశభక్తి లేకుండానే అలా నడుచుకుంటూ వెళ్లారా? సింధు నాగరికత వర్ధిల్లిన ప్రాంతాన్ని పరదేశీయుల పలుకు నుంచి వచ్చిన హిందు పదంతో ఎవరికీ అభ్యంతరం లేదు. హిందూ మతానికి దేశానికి పెడుతున్న లంకెతోనే వస్తున్న ఇబ్బంది. జర్మన్ హిట్లర్ కూడా తనది జాతీయ సోషలిస్టు కార్మిక పార్టీ అని చెప్పుకొని ఆ పేరుతో చరిత్రలో కనీవిని ఎరుగని మారణకాండకు పాల్పడ్డాడు. నాజీల మేడిపండు జాతీయ సోషలిజం అవగాహనను ప్రతి విద్యార్ధి ఆమోదించాలని వత్తిడి చేశారు. వ్యతిరేకించిన పిల్లలను విడిగా వుంచి భయపెట్టారు. అతగాడి భావజాలాన్ని అరువు తెచ్చుకున్న ఆర్‌ఎస్‌ఎస్, దాని సృష్టి బిజెపి, ఇతర సంస్దలన్నీ తాము జాతీయవాదులని తామే అసలు సిసలు జాతీయ వాదులమని, తమది హిందూత్వ జాతీయవాదమని, ఒక జీవన విధానమని ఒళ్లంతా రాసుకొని వూరేగుతున్నారు. దాన్ని వ్యతిరేకించే వారే కాదు, అంగీకరించని వారిని కూడా దేశద్రోహులని ముద్రవేస్తున్నారు కనుకనే అభ్యంతరం తెలియచేయాల్సి వస్తున్నది. 1947కు ముందు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మనమంతా జాతీయవాదులం, ఇప్పుడు మనం భారతీయులమని గర్వంగా చెప్పుకోవచ్చు తప్ప భారత జాతీయవాదులం అంటే మిగతా దేశాలు ఒప్పుకోవు. ఈ తరహా జాతీయవాదంతోనే గతంలో జర్మనీ,ఇటలీ,జపాన్ వంటి దేశాలలో హిట్లరు, ముస్సోలినీ, టోజో వంటి నియంతలు తయారై ప్రపంచాన్ని నాశనం చేశారు. వారిని ఆదర్శంగా తీసుకున్న ఆర్‌ఎస్‌ఎస్ చెప్పే అఖండ భారత్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్ధాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ వరకు అన్నీ భారత్‌లో భాగమే.
మమ్మల్ని రాజకీయంగా వ్యతిరేకిస్తే అభ్యంతరం లేదుగానీ ప్రతి నిత్యం, ప్రతి సందర్భంలోనూ మీరు మాత్రం మేము చెబుతున్న తరహా దేశభక్తిని నిరూపించుకోవాలనే ఒక అప్రజాస్వామిక అభిప్రాయాన్ని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి శక్తులు వ్యాపింప చేస్తున్నాయి. పరిణితి చెందిన ఏ దేశంలోనూ ప్రతిక్షణం ప్రతి ఒక్కరూ దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలనే ధోరణి లేదు. అమెరికా విద్యా సంస్ధలలో హియర్( వున్నాను) అంటారు తప్ప జై యుఎస్‌ఏ లేదా లాంగ్ లివ్ అమెరికా అనరు. వారికి దేశభక్తి లేనట్లా, లేక నేర్పనట్లా ? జర్మనీలో నియంత హిట్లర్‌ను పొగిడే విధంగా టీచర్లను మలచారు, హై హై నాయకా అన్నట్లు టీచరు వచ్చీ రావటంతోనే హిట్లర్ నామ జపం చేయగానే పిల్లలందరూ పొలో మంటూ ప్రతిజ్ఞ చేసినట్లుగా పొగిడే వారు. ఏదైనా అతి చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. గోవులనే తీసుకోండి. గోమాత రక్షణ పేరుతో గోగూండాలను ప్రోత్సహించిన వారిలో వుత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఒకరు. ఆ పెద్దమనిషి చర్యలతో పాలివ్వని పశువులకు గడ్డిపెట్టలేని రైతులు వాటిని రోడ్ల మీదకు వదలి వేశారు. ఇప్పుడవి మేతకోసం పంటపొలాల మీద పడుతున్నాయి. గగ్గోలు పెట్టిన రైతులు కొన్ని చోట్ల వాటిని తోలుకుపోయి ప్రభుత్వ పాఠశాలల్లో వుంచి తాళాలు వేశారని వార్తలు. అనేక చోట్ల అవి పంటలను నాశనం చేయకుండా రైతులు పొలాల చుట్టూ కంచెలు వేసుకోవటం, కాపాలా కాయటం చేయాల్సి వస్తోంది. సమాజాన్ని వెనక్కునడపాలని చూసే వారికి ఇలాంటి అంశాలు ఎదురైనా వాటి నుంచి పాఠాలు తీసుకోకుండా మరింతగా వెనక్కు నడిపేందుకు చూస్తారు.
సినిమా హాళ్లలో దేశభక్తి నింపేందుకు ఎలాంటి ప్రహసనం నడిచిందో చూశాము. ఎందుకు నిలబడాలని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చూసిన అనుభాలను ఇంకా మరచి పోలేదు. తొలుత ప్రభుత్వ నిర్ణయంగా సినిమా హాళ్ల దేశభక్తిని సమర్ధించిన సుప్రీం కోర్టు తరువాత ఆ నిర్ణయం మీద దాఖలైన అప్పీళ్ల సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైనవి. కాళ్లూ, చేతుల మీద తమ దేశభక్తి ప్రదర్శన చేయాలని జనాన్ని బలవంతం చేయలేము, జాతీయ గీతం పాడుతున్నపుడు ఒక వ్యక్తి లేచినిలబడనప్పుడు అతనిలో దేశభక్తి తక్కువని అనుకోకూడదు అని పేర్కొన్నది. అంతే కాదు ప్రభుత్వం సినిమాలకు వచ్చేవారు టీ షర్టులు, పొట్టి నిక్కర్లు వేసుకోకూడదు, అలాంటి దుస్తులతో జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలవటం అవమానించటమే అని నిర్ణయిస్తే పరిస్ధితి ఏమిటి అని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇపుడు గుజరాత్ లేదా ఒకవేళ ఇదేదో ఓట్లు కురిపించేట్లుందే అని రేపటి నుంచి దాన్ని అనుసరించే ఇతర బిజెపి రాష్ట్రాలలో కూడా అమలు చేస్తే ఇదే పరిస్ధితి ఎదురవుతుంది.గతంలో కేరళ కేసులో జాతీయ గీతాలాపన సందర్భంగా నిబంధనల ప్రకారం లేచి నిలబడాలి తప్ప గీతాన్ని ఆలపించాలన్న నిబంధన ఎక్కడా లేదని, ఆలపించని కారణంగా ఎవరిమీదైనా చర్యలు తీసుకోవటం చెల్లదని సుప్రీం కోర్టు చెప్పింది. గుజరాత్ సర్కార్ లాజిక్కు ప్రకారం చూస్తే దేశంలో ఫోన్లు, ప్రతి కార్యాలయం, ఫ్యాక్టరీ, బజారుల్లో కూడా దేశభక్తిని నేర్పేందుకు జై హింద్, జై భారత్ అని పలకరించుకోవాల్సి వుంటుంది. ఏది తినాలో ఏది తినకూడదో, ఏది ధరించాలో ఏదికూడదో, ఎవరిని వివాహం చేసుకోవాలో ఎవరిని కూడదో చెబుతున్న కాషాయ దళాలు ఇప్పటికే దేశంలో ఎక్కడబడితే అక్కడ తామరతంపరగా పుట్టుకు వస్తున్నాయి. గుజరాత్ చర్యలు ఈశక్తులను మరింతగా రెచ్చిపోయేట్లు చేసేవి తప్ప వేరు గాదు. పిచ్చి మరింత ముదిరి పిల్లలందరూ జాతీయ జండా రంగులతో లేదా కాషాయ యూనిఫారాలు వేసుకోవాలని నిర్ణయించినా ఆశ్చర్యం ఏముంటుంది. దేశభక్తి, దేశ ద్రోహాన్ని కూడా ఓట్లవేటలో వ్యాపారంగా మార్చివేస్తున్నారని గ్రహించటం అవసరం. అందుకే ఒక దుర్మార్గుడి అంతిమ ఆశ్రయం (దిక్కు) దేశభక్తి అన్న శామ్యూల్ జాన్సన్‌ను గుర్తు చేయాల్సి వచ్చింది.