Tags

, , , ,

Image result for science congress 2019

ఎం కోటేశ్వరరావు

పరస్పర విరుద్దశక్తులు నిరంతరం పని చేస్తూనే వుంటాయి. ఒకటి వెనక్కు లాగుతుంటే మరొకటి ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పోరులో ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా మొత్తం మీద పురోగామి శక్తుల విజయమే. అయినా సరే ఎప్పటికప్పుడు తిరోగామి శక్తులు తమ పని తాము చేస్తూనే వుంటాయి. జనవరి మూడు నుంచి ఏడవ తేదీ వరకు పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 106వ సమావేశాలలో కూడా జరిగింది అదే. అక్కడ చేసిన కొన్ని వుపన్యాసాలు, సమర్పించిన పత్రాలు ప్రపంచంలో మనల్ని నగుబాట్లపాలు చేశాయి. ప్రపంచ మీడియా వీటి గురించి బహుళ ప్రచారమిచ్చింది.రెండు సంవత్సరాల క్రితం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన బయాలజిస్ట్‌, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన వి రామకృష్ణన్‌ తాను హాజరైన సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో సైన్సు గురించి చర్చించింది తక్కువని తానింకోసారి ఇలాంటి సమావేశాలకు హాజరు కానని చెప్పిన మాటలు ఇంకా మన చెవుల్లో గింగురు మంటున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా సదరు వుపన్యాసాలను అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. గత మూడు సమావేశాలలోనూ జరిగింది అదే. తాజా సమావేశాలు భవిష్యత్‌ భారత్‌ : శాస్త్రము, సాంకేతికము అనే ఇతివృత్తంగా జరిగాయి. ఆందోళనకరమైన అంశం ఏమంటే గత సమావేశాల అనుభవాలను చూసి అలాంటి శక్తులు ఆ వేదికను వుపయోగించుకోవటాన్ని అడ్డుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అశాస్త్రీయ విషయాలను నిరూపిత అంశాలుగా చిత్రిస్తున్న వారిని ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సమావేశాలలో నిలదీసి ప్రశ్నించకపోవటం మన శాస్త్రవేత్తల భావదారిద్య్రానికి నిదర్శనమా ! లేక తాము నమ్మిన, పరిశోధించిన అంశాలమీదే అపనమ్మకమా ? రెండూ ప్రమాదకరమే !

న్యూటన్‌ పుట్టక ముందే గురుత్వాకర్షణ శక్తి వుంది, డార్విన్‌ తాను చెప్పిన పరిణామ క్రమంలో భాగంగానే ఒక మానవుడిగా పుట్టాడు. వాటిని ఒక శాస్త్రీయ పద్దతిలో వివరించటమే వారు చేసింది. ఆ రంగాలలో నిష్ణాతులైన వారు వాటిని అంగీకరించారు. అవి ప్రపంచం ముందుకు వచ్చినపుడు ఏ వేద లేదా సంస్కృత పండితుడు అవన్నీ తమకు ఎప్పుడో తెలుసని సవాలు చేసిన వారుగానీ, వివరించిన వారు గానీ లేరు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఆ సిద్ధాంతాలు తప్పని ఆధారాలతో నిరూపిస్తే ఆ నూతన సిద్ధాంతాలను సమాజం అంగీకరిస్తుంది, అనుకరిస్తుంది. అదేమీ లేకుండా ఫలానా సిద్దాంతాన్ని నేను తప్పు అంటున్నాను, లేకపోతే ఇవన్నీ వేదాల్లోనే వున్నాయనో పిచ్చివారెవరైనా చెబితే శాస్త్రవేత్తలు ప్రశ్నించలేకపోవటం నిజంగా మన దౌర్భాగ్యం కదూ ! ఇతర దేశాలతో పోటీపడి మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సభలు జరుగుతున్నాయంటే ఆ రంగంలో మన పురోగతి, సాధించిన విజయాలను సమాజం ముందుంచి శాస్త్రవిషయాల పట్ల భావిభారత పౌరుల్లో ఆసక్తికలిగించాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నదేమిటి? దానికంటే ఆశాస్త్రీయ విషయాలను ముందుకు తెచ్చి వేదాల్లో అన్నీ వున్నాయష అనే రోజుల్లోకి తీసుకుపోతున్నారు. నిజానికి ఇదొక మానసిక వ్యాధి లక్షణంలా వుంది. ప్రతి సమాజం ఘనమైన గతంతో పాటు సిగ్గుపడాల్సిన అంశాలను కూడా కలిగి వుంటుంది. గత సమాజాల్లో అంతా ఘనతే వుంటే జనం మార్పులను ఎందుకు కోరుకున్నట్లు ?

జలంధర్‌ సైన్స్‌ సభల్లో కొందరు చేసిన ప్రవచన అంశాలు దేశాన్ని వెనక్కు తీసుకుపోయేవిగా వున్నాయి. అవేమిటో సంక్షిప్తంగా చూద్ధాం. మహాభారత కాలం నాటికే మన దేశంలో బడ్డు తాడు కణాల పరిశోధన వుంది, వంద కుండల్లో వంద అండాలను పెట్టి కౌరవులను పుట్టించారు, ఇది టెస్ట్‌ ట్యూబ్‌ పిల్లల పరిజ్ఞానం కాదా అంటూ ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ జి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ పేరుమోసిన విద్యావేత్త మేధస్సు అంతవరకే పరిమితం కాలేదు, రావణుడికి ఎందరు ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే పుష్పక విమానం వుండటమే కాదు, లంకలో ఇరవైనాలుగు చిన్నా పెద్ద విమానాలు, ఎన్నో విమానాశ్రయాలు వుండేవని, సైనిక అవసరాలకువిమానాలను వాడారని కూడా రామాయణం చదివితే మనకు తెలుస్తుందని కూడా సెలవిచ్చారు. అంతేనా చార్లెస్‌ డార్విన్‌ పరిణామ సిద్ధాంతం కంటే ముందే దాని గురించి మనకు తెలుసని డార్విన్‌ చెప్పినదాని ప్రకారం తొలి జీవి నీటి నుంచి ప్రారంభమైందని దశావతారాల్లో మత్స్యావతారం మొదటిదని అంటే దశావతారాలు పరిణామ సిద్దాంతమని కూడా నాగేశ్వరరావు చెప్పారు. విష్ణువు దగ్గర లక్ష్యాన్ని చేధించి తిరిగి వచ్చే నియంత్రిత క్షిపణుల మాదిరి శంఖుచక్రం వుందని కూడా చెప్పారు.

రావణుడి గురించి చెప్పిన రావుగారు రాముడి విమానాల గురించి చెప్పలేదు. పురాణాల ప్రకారం సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాల్లో రకరకాల విమానాలున్నాయి. వాటిలో ఎక్కువ భాగం మానసిక శక్తితోనే నడిచాయి. అలాంటపుడు రాముడికి విమానాలెందుకు లేవు, అడవులకు రధాల మీద, నదులు దాటేందుకు పడవలు ఎందుకు ఎక్కారు. విమానాల మీద పోవచ్చు కదా ! రావణుడు అడవిలోని సీతను అపహరించేందుకు రధంలో వచ్చాడు, సీతను రధంలో ఎక్కించుకొని పోయి సముద్రాన్ని ఎలా దాటాడు, రధాన్ని ఎక్కడ వుంచాడు, సముద్ర ప్రయాణానికి ఓడను వుపయోగించాడా ? విష్ణుమూర్తి అవతారంగా చెబుతున్న రాముడి దగ్గర నియంత్రిత క్షిపణి శంఖుచక్రం బదులు విల్లు, బాణాలు ఎందుకున్నాయి, విమానాలు ఎందుకు లేవు? లంకను చేరుకొనేందుకు రాముడి దగ్గర ఓడలు కూడా లేవా, వుంటే వానర సైన్య సాయంతో వారధిని ఎందుకు కట్టించినట్లు ? రావణుడిని సంహరించేందుకు క్షిపణి ప్రయోగం ఎందుకు చేయలేదు. హనుమంతుడు లంకా దహనం చేశాడని రాశారు తప్ప రావణుడి దగ్గర వున్న పుష్పక విమానాన్ని, ఇతర విమానాలను, లంకలోని విమానాశ్రయాలను దహనం చేయలేదా, వానర లేదా రాముడి సేనలపై రావణుడు వైమానిక దాడులు ఎందుకు చేయలేదు, రావణుడిని వధించిన తరువాత రాముడు ఆ విమానాలను స్వాధీనం చేసుకోలేదా ? ఆ తరువాత ఆ విమానాలు, క్షిపణులు ఏమయ్యాయి అనే ప్రశ్నలకు కూడా వైస్‌ ఛాన్సలర్‌గారు సమాధానాలు చెప్పాల్సి వుంది. మన వేదాలు లేదా సంస్కృత గ్రంధాలను పరదేశీయులు అపహరించారు, వాటి ఆధారంగా నూతన అవిష్కరణలు చేశారు అని చెబుతారు. ఇలాంటి కాకమ్మ కధలు వినటానికి వీనుల వింపుగా వుంటాయి. మనమెందుకు చేయలేదు ? ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి.

Image result for science congress 2019,protests

సమస్య ఏమంటే మన శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రచారాన్ని ఖండిస్తూ ఎందుకు ముందుకు రావటం లేదు. వేదికలపై ఎందుకు అనుమతిస్తున్నారు. దీనికి ప్రధానంగా ఒకటి కనిపిస్తోంది. ప్రభుత్వం సైన్స్‌ కాంగ్రెస్‌ వంటి వాటికి ధన, ఇతర రూపాలలో కొంత సాయం చేస్తున్నది. వాటిని ప్రారంభిస్తున్న ప్రధాని, కేంద్ర మంత్రులు స్వయంగా ఇలాంటి అశాస్త్రీయ విషయాలను తమ సందేశాలలోవెల్లడిస్తున్నారు. అందువలన వారికి లేదా వారి దివాలాకోరు భావజాలానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తే సాయం ఆగిపోవచ్చు, నిర్వాహకుల వుద్యోగాలకు ముప్పు రావచ్చు, ప్రమోషన్లు ఆగిపోవచ్చు, అలాంటపుడు ఎవరేమి చెబితే మన కెందుకు అనే దిగజారుడుతనం తప్ప మరొకటి కనిపించటం లేదు. వినాయకుడికి ఏనుగు తల అతికించటాన్ని బట్టి మనకు గతంలోనే ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసుని సాక్షాతూత ప్రధాని నరేంద్రమోడీయే చెప్పిన తరువాత గతంలో ఒక సైన్స్‌ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఆల్జీబ్రా, పైధాగరస్‌ సిద్ధాంతాలను ప్రపంచానికి భారత్‌ ఇచ్చిందని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది. ముంబై విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ అధిపతి గౌరీ మహులీకర్‌ ఒక పత్రికలో రాసిన వ్యాసంలో జామెట్రిక్‌ ఫార్ములా గురించి క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల క్రితమే సులభ సూత్ర అనే గ్రంధంలో బౌధాయన రాశాడని వాటినే పైథాగరస్‌ సిద్దాంతం అంటున్నామని ఆ పెద్దమనిషి పేర్కొన్నాడు. ఏడు వేల సంవత్సరాల క్రితమే భరద్వాజ మహర్షి విమానాల గురించి రాశాడని యుద్ధాలకు వుపయోగించే వాటిలో ఒక్కోదానికి 30 ఇంజన్లు వుండేవని, అవి ఎటు కావాలంటే అటు తిరిగి, ఎగిరేవని కెప్టెన్‌ ఆనంద్‌ జె బోడాస్‌ చెప్పాడు. కిరణ్‌ నాయక్‌ అనే మరో పెద్దమనిషి అయితే మహాభారత యుద్ధకాలంలో విమానాలతో యుద్ధం చేసిన వారు తలకు హెల్మెట్లు వాడారని నేను చెప్పేది నమ్మకపోయినా అలాంటి ఒక హెల్మెట్‌ను నాసా కనుగొన్నదని కావాలంటే గూగుల్‌లో తెలుసుకోవచ్చని పేర్కొన్నాడు. ఇలాంటి చెత్తను సమర్ధించుకోవటానికి నాసా పేరును వుపయోగించుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారింది.తాజా సమావేశాలలో శాస్త్రవేత్తను అని చెప్పుకొన్న కెజె కృష్ణన్‌ అనే వ్యక్తి న్యూటన్‌, ఐనిస్టీన్‌లకు పెద్దగా భౌతిక శాస్త్రం గురించి తెలియదని, ప్రపంచాన్ని మోసం చేశారంటూ తాను చెప్పేదాన్ని అంగీకరిస్తే భవిష్యత్‌కు మరింత వుపయోగమన్నాడు. ఇప్పుడు ప్రపంచానికంతకూ తెలిసిన గురుత్వాకర్షణ తరంగాలకు నరేంద్రమోడీ తరంగాలని పేరు పెట్టాలని, గురుత్వాకర్షక కాంతికి హర్షవర్దన్‌(కేంద్రమంత్రి) పేరు పెట్టాలని ఒక శాస్త్రవేత్తకు వుండకూడని తన లక్షణాన్ని చక్కగా బయట పెట్టాడు. ఏ శాస్త్రవేత్తయినా కొత్త సిద్ధాంతం లేదా పద్దతిని కనిపెడితే అనేక సందర్భాలలో అతను లేదా ఆమె పేరు పెడతారు. ఈ పెద్దమనిషి ఎలాగూ తనను శాస్త్రలోకం ఆమోదించదు కనుక గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుగా మోడీ, హర్షవర్ధన్‌ పేర్లు పెట్టాలని కోరాడు. అబ్దుల్‌ కలాం కంటే భవిష్యత్‌లో కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ పెద్ద శాస్త్రవేత్త అవుతారని కృష్ణన్‌ సెలవిచ్చాడు. కొంత మంది అతితెలివి గల వారు సంస్కృత అనువాదాలు కాదు అసలు రాతలను చదివితేనే వాటిలో చెప్పిన సిద్ధాంతాలను వెలికి తీయవచ్చునని వాదిస్తారు. ఎవరు వద్దన్నారు ? పాలకులకు ఇలాంటి విషయాలు ఇష్టంగా వున్నట్లు గమనించిన తరువాత ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి మెప్పించర సుమతీ అన్నట్లు చెప్పేవారు తయారైతే అదుపు చేయాల్సిన వారు కూడా మన కెందుకులే అని వూరుకుంటున్నారు.

సైన్స్‌ కాంగ్రెస్‌లో అశాస్త్రీయ ప్రకటనలు చేయటాన్ని సభకు హాజరైన వారు ఖండించకపోయినా బెంగళూరులో కొందరు శాస్త్రవేత్తలైనా నిరసించి పరువు కాపాడారు. ఇదేమాత్రం చాలదు. వివిధ సంస్ధలకు చెందిన వున్నతాధికారులేమి చేస్తున్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ అజెండా నిర్ణయంలో ప్రభుత్వానికేమీ పాత్ర వుండదని ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కె విజయ రాఘవన్‌ చెప్పారు. అంధ్రవిశ్వవిద్యా లయ వైస్‌ ఛాన్సలర్‌ నాగే శ్వరరావు చెప్పిన అంశాలను విమర్శిస్తూ అతని మీద ఒక ఫిర్యాదును దాఖలు చేయాలన్నారు. ఒక ప్రముఖ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా వున్న బయాలజిస్ట్‌ నాగేశ్వరరావు చెత్త మాట్లాడుతున్నపుడు శాస్త్రవేత్తల్లో వేడి పుట్టాలని అన్నారు. నాగేశ ్వరరావు, కృష్ణన్‌ మాట్లాడిన అంశాలు అపహాస్యం పాలుగావటంతో వాటితో తమకేమీ సంబంధం లేదని సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రేమేందు పి మాధుర్‌ ప్రకటించారు. తదుపరి తమ సమావేశాల్లో ప్రసంగించే వారికి సంబంధించి నిబంధనలు సవరించనున్నామని, వారేమి మాట్లాడేది తెలుసుకొని, ఇతర విషయాలు మాట్లాడబోమనే హామీలు తీసుకొని సరైన వారిని ఎంపిక చేస్తామని చెప్పారు. తానే గనుక ప్రసంగ సమయంలో అక్కడ వుండి వుంటే ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించేవాడినని, ఆధారం చూపమని కోరి వుండే వాడినని అన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మనోజ్‌ చక్రవర్తి విలేకర్లతో మాట్లాడుతూ నాగేశ్వరరావు మాటలతో తాను దిగ్భ్రాంతి చెందానని, అతనికి ఈ విషయాలు ఎలా తెలుసు, ఏదైనా ఆధారం వున్నదా, శాస్త్ర సమాజం దిగ్భ్రాంతి చెందింది అని వ్యాఖ్యానించారు. తాము కొల్‌కతా వెళ్లిన తరువాత అతను చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ లాంఛనంగా ఒక ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఈ ప్రకటనలతో వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావుకు ఏమైనా పరువు ప్రతిష్టలుంటే పదవి నుంచి తప్పుకొని వుండాల్సింది.

ఇలాంటి చెత్త మాట్లాడేవారి గురించి సైన్స్‌ కాంగ్రెస్‌ పెద్దలకు గతంలో ఫిర్యాదులు అందలేదా అంటే మూడు సంవత్సరాల క్రితమే ముంబై సమావేశం తరువాత తాము ఆందోళన చెందుతున్న అంశాల గురించి సైన్స్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామని బెంగళూరుకు చెందిన బ్రేక్‌ త్రూ సైన్స్‌ సొసైటీ కార్యదర్శి కెఎస్‌ రజని చెప్పారు. తరువాత మైసూరు, తిరుపతి, ఇపుడు జలంధర్‌లో అదే పునశ్చరణ అయిందని, ఇలాంటి వాటిని ఎలా అనుమతిస్తున్నారని జనం నిర్వాహకులను నిలదీయాలని అన్నారు. ప్రముఖ రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌ సిఎఆర్‌ రావు మాట్లాడుతూ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు తాను రావటం లేదని, వస్తే ఇలాంటి ప్రకటనలను ఆమోదించినట్లు అవుతుందని అన్నారు.

గత పాతిక సంవత్సరాలుగా డైనోసార్లపై పరిశోధనలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్న పంజాబ్‌ విశ్వవిద్యాలయ జియాలజిస్టు అషు ఖోస్లా ఈ సమావేశాలకు సమర్పించిన ఒక పత్రంలో బ్రహ్మ ఒక పెద్ద శాస్త్రవేత్త అని, డైనోసార్ల గురించి వేదాల్లో ప్రస్తావన వుందని, అసలు వాటికా పేరు మన సంస్కృతం నుంచే వచ్చిందన్నారు. భారతీయ డైనోసార్‌ అస్దికలను తమ బృందం గుజరాత్‌లోని ఖేదా జిల్లాలో కనుగొన్నదని చెప్పారు. నిజంగానే కనుగొని వుండవచ్చు, కానీ బ్రహ్మ పెద్ద శాస్త్రవేత్త, ఈలోక సృష్టికర్త, ఆయనకు డైనోసార్ల గురించి తెలుసు అని చెప్పిన మాటలతో అతని పరిశోధనను అనుమానించాల్సి వస్తోంది.

https://vedikapress.files.wordpress.com/2019/01/ff809-1465846477930.png

ప్రపంచం మీద ప్రభావం చూపిన నాలుగువేల మంది శాస్త్రవేత్తలలో భారతీయులు కేవలం పది మందే అన్నది టెక్‌2 న్యూస్‌ విశ్లేషణ. ప్రతి ఏటా ప్రపంచవ్యాపితంగా ఎక్కువగా వుటంకించిన శాస్త్రవేత్తల జాబితాను క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే సంస్ధ గత ఐదు సంవత్సరాలుగా ప్రచురిస్తున్నది.2018 జాబితాలో పేర్కొన్న పది మందిలో సిఎన్‌ఆర్‌ రావు (ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, బెంగళూరు),దినేష్‌ మోహన్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌), రాజీవ్‌ వర్షనే (వ్యవసాయ శాస్త్రవేత్త, ఇక్రిశాట్‌), అశోక్‌ పాండే, టాక్సికాలజీ పరిశోధకులు, అవినిష్‌ అగర్వాల్‌, అలోక్‌ మిట్టల్‌, జ్యోతి మిట్టల్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సు), రజనిష్‌ కుమార్‌(కెమికల్‌ ఇంజనీరింగ్‌), సంజీవ్‌ సాహు(నానో టెక్నాలజీ), శక్తివేల్‌ రత్నస్వామి(కంప్యుటేషనల్‌ మాథమాటిక్స్‌). నాలుగువేల మంది శాస్త్రవేత్తలు 60దేశాలకు చెందిన వారు. వీరిలో 80శాతం మంది కేవలం పదిదేశాలకు చెందిన వారైతే 70శాతం ఐదుదే శాల నుంచి వున్నారు. దేశాల రీత్యా అమెరికా 2,639,బ్రిటన్‌ 546, చైనా 482, భారత్‌ 10 మంది వున్నారు. సంస్ధల రీత్యా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 186మందితో అగ్రస్ధానంలో వుంది. ఒకే అంశం మీద పరిశోధన చేసే వారినే గతంలో జాబితాలో చేర్చగా ఈ ఏడాది వివిధ రంగాలలో పని చేస్తున్నవారికి చోటు కల్పించటంతో మన సంఖ్య పదికి చేరిందట. పదిహేను సంవత్సరాల క్రితం చైనా-భారత్‌ ఒకే స్దాయిలో వుండేవి, ఇప్పుడు ప్రపంచ శాస్త్ర పరిశోధన ఫలితాల్లో చైనా 15-16 శాతం సమకూర్చుతుండగా మన దేశ వాటా నాలుగు శాతమే అని సిఎన్‌ఆర్‌ రావు చెప్పారు. సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలు దీనికి దోహదం చేసే అంశాలలో వున్నాయి. ఇవిగాక పారిశ్రామిక భాగస్వామ్యాలు, పెట్టుబడులు కూడా ప్రభావం చూపుతాయి.

పురాతన భారత దేశం వేదాలకే కాదు, వాటి ప్రామాణ్యతను ప్రశ్నించిన చార్వాకులకు కూడా నిలయమే. ప్రపంచంలో ప్రతి మతం తాను ప్రవచించిన దానిని వ్యతిరేకించిన లేదా ప్రశ్నించిన వారిని నాశనం చేసింది. దానికి మన దేశం మినహాయింపు కాదు.వేదాలను లేదా వాటిలో చెప్పిన అంశాల ప్రాతిపదికగా వున్న నాటి మతం, దాన్ని ఆశ్రయించిన నాటి పాలకులు చార్వాకులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా నాశనం చేశారు. విమర్శిస్తూ రాసిన వారి రచనల నుంచే చార్వాకులు ఏమి చెప్పారనేది మనకు తెలుస్తున్నది. ప్రత్యక్ష ప్రమాణం ప్రాతిపాదికగా వారు వ్యవహరించారన్నది స్పష్టం. చార్వాకులు లేదా లోకాయతుల అణచివేత తరువాత కాలంలో ఆ దృష్టి మన సమాజంలో కొరవడింది. చివరకు అది బ్రాహ్మలు మాత్రమే వేదాలు చదవాలి. క్షత్రియుడు మాత్రమే కత్తి పట్టాలి. శూద్రులు వ్యవసాయమే చేయాలి. పంచములు వూరికి దూరంగా వుండాలి. స్త్రీలు ఏ సామాజిక తరగతిలో వున్నా వారికి స్వాతంత్య్రం లేదు. చదువు అవసరం లేదు. సముద్ర ప్రయాణాలు చేసిన వారికి ప్రోత్సాహం సంగతటుంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేదాకా పోయింది. ఇలా సమాజంలో అనేక బంధనాలు, ఆటంకాలను సృష్టించిన సమాజం కొన్ని వందల, వేల సంవత్సరాలు కొనసాగిన కారణంగా మన జనంలో శాస్త్ర స్పృహ అడుగంటింది. కుల వృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా అన్నట్లుగా ఎదుగూబదుగూ లేకుండా సాగింది.

ప్రతి సమాజం అనేక వూహలకు నిలయమైంది. వాస్తవంతో పని లేకుండా వూహలతో నిండిన సాహిత్యాన్ని సృష్టించారు. అందుకు మన దేశం మినహాయింపు కాదు. వాటినే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ నుంచి వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావు వంటి వారి వరకు అనేక మంది పురాతన శాస్త్రంగా చెప్పటమే కాదు, ఆధునిక ఆవిష్కరణలకు జోడించి చెబుతున్నారు. ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా మానవుడికి ఏనుగుకు పరిమాణంలో ఎంతో తేడా వుంటుంది. వినాయకుడికి అంత పెద్ద ఎనుగు తలను అతికిస్తే ఆ భారాన్ని ఎలా భరించేవాడు, దాన్ని వేసుకొని అతి చిన్న ఎలుకవాహనం మీద ఎలా ఎక్కేవాడు, అన్నింటికీ మించి ప్లాస్టిక్‌ సర్జరీ నిపుణులు వుంటే తెగిన వినాయకుడి తలనే ఎందుకు అతికించ కుండా, ఏనుగు తలను ఎందుకు తెచ్చారు, అంతకంటే చిన్న జంతువులు దొరకలేదా అనే సందేహాలు రానవసరం లేదా ?

ఆశాస్త్రీయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న పాలకులు, వారికి వంత పలికే కుహనా లేదా ఆత్మను చంపుకొని తాము చదివిన దానికి భిన్నంగా కుహనా శాస్త్ర అంశాలను చెప్పేవారిని ఎదిరించేందుకు ధైర్యం చేయని అశక్తులు అసలు సైన్సు సమావేశాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇటు వంటి సమావేశాలే సమాజంలో సైన్సు పట్ల ఆసక్తి కలిగిస్తాయని చెప్పలేము గానీ ఇవొక అవకాశం. పరిశోధన, ప్రచారానికి తగిన నిధులు కేటాయించేందుకు రానురాను పాలకులు విముఖత చూపుతున్నారు. సమాజాన్ని తిరోగమనంలో నడపాలని చూసే వారికి శాస్త్రీయ, ప్రత్యామ్నాయ విధానాల అవగాహన పెరగటం ఏమాత్రం ఇష్టం వుండదు. పరిశోధన, అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించని దేశమూ, సమాజమూ ముందుకు పోయిన దాఖలా మనకు కనపడదు. యధారాజా తధా ప్రజ అన్నట్లు ఆ పని చేయని పాలకులు వున్నపుడు వారికి వంతపాడే మేథావులు కూడా ఇష్టగానాలు, నృత్యాలే చేస్తారు. జలంధర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో జరిగింది అదే. ఇలాంటి ధోరణులను ప్రతిఘటించకపోతే రాబోయే సమావేశాల్లోనూ అదే పునరావృతం అవుతుంది.