Tags

, , ,

Image result for cuba organic agriculture

ఎం కోటేశ్వరరావు

చమురు నుంచి తయారయ్యే రసాయనాలు అందుబాటులో వున్నప్పటికీ అవి లేకుండా వ్యవసాయం చేస్తున్నారా ? అవి లేకుండా వ్యవసాయాన్ని మీరు ఎంచుకుంటారా ? అని హవానా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను అమెరికాకు చెందిన వ్యవసాయ పరిశోధకులు, విద్యార్దులు, రైతులతో కూడిన 13 మంది బృందం అడిగిన ప్రశ్న. హవానా శాస్త్రవేత్తలు సేంద్రీయ వ్యవసాయ రంగంలో తాము కనిపెట్టిన అంశాలను అమెరికన్లకు వివరించిన తరువాత వేసిన ప్రశ్న ఇది. ఆ బృందంలోని ముగ్గురు రైతులు తప్ప మిగతావారికి నిరంతర వ్యవసాయ అధ్యయనం ప్రధానం. ఆ బృందానికి ఆతిధ్యం ఇచ్చిన క్యూబన్లకు జీవన్మరణ సమస్య. అప్పటికే సోవియట్‌ కూలిపోయి పది సంవత్సరాలు గడుస్తున్నది. ఆ కాలాన్ని ప్రత్యేకమైనదిగా పిలిచారు. కోటీ పదిలక్షల మంది జనాభాకు ఆకస్మికంగా చమురు లభ్యత నిలిచిపోయింది. వ్యవసాయం రంగంతో సహా వాటితో నడిచే యంత్రాలన్నీ మూతబడ్డాయి. చేతిలో పంచదార తప్ప ఆహార పదార్ధాలను కొనుగోలు చేసేందుకు డబ్బు లేదు. మరొక దేశం నుంచి గతంలో మాదిరి ఆహారం, ఇతర అవసరాలు వచ్చే స్ధితి లేదు. ఆ నేపధ్యంలోంచే ఆహార సరఫరాకు నిరంతర వ్యవసాయ పద్దతుల పాటింపు ఒక అనివార్య పర్యవసానం. అనేక దేశాలలో ప్రాచుర్యంలో వున్న సేంద్రీయ వ్యవసాయానికి, క్యూబాలో చేస్తున్నదానికి తేడా వుంది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల దుష్ఫలితాలకు దూరంగా వుండాలన్న ధనిక తరగతి అవసరాల కోసం స్వచ్చమైన వుత్పత్తుల సాగు ఒకటి. దానికి భిన్నంగా రసాయన ఎరువులు, పురుగు మందులు కొనటానికి డబ్బులేని పరిస్ధితుల్లో జనానికి సాధారణ ఆహార సరఫరా కోసం క్యూబా సోషలిస్టు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మరొకటి. ఆ దిశగా అక్కడ సాధించిన విజయం గురించి అనేక మందిలో ఆసక్తి తలెత్తింది. అయినప్పటికీ ఈ విధానం ఎంతో సంక్లిష్టమైనదని మేము చెప్పదలచాము అని ఒకటిన్నర దశాబ్దాల తరువాత అమెరికా బృంద సభ్యుడొకరు క్యూబా వ్యవసాయం గురించి రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. సిద్ధాంత నిబద్దతతో సాధించిన పురోగతిగాక మరేమిటని ప్రశ్నించారు.

నిరంతర అభివృద్ధి సామాజిక పురోగమనానికి తోడ్పడుతుంది. కానీ తమకు అది సాధ్యమే కాదు అవసరం అని కూడా క్యూబన్లు నిరూపించారు. చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికిన చేపలు ఎదురీదుతాయి. ప్రతికూలతలను అధిగమించేందుకు సోషలిస్టు భావజాలం ఎలా వుత్తేజం కలిగిస్తుందో క్యూబాను చూస్తే అర్దం అవుతుంది. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబా అంటే చెరకు,పంచదారకు మారుపేరు. సోషలిస్టు విప్లవం తరువాత అది సోవియట్‌ సాయంతో చెరకుతో సహా ఇతర పంటలను ఆధునిక యంత్రాల సాయంతో సాగు చేసింది.1991లో సోవియట్‌ కూలిపోయిన తరువాత ఒక్కసారిగా ఆ యంత్రాలన్నీ మూలనపడితే, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కారణం అందరికీ తెలిసిందే, సోవియట్‌ నుంచి సాయంగా అందిన చమురు సరఫరా ఆగిపోయింది, ఎరువులు, పురుగుమందులు లేవు. తిరిగి గుర్రాలతో వ్యవసాయం చేసే స్ధితికి తిరోగమించింది. దానికి తోడు కరవు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు. పంచదారను కొనే వారు లేరు. కనీస అవసరాలను దిగుమతి చేసుకుందామంటే అమెరికా దిగ్బంధం, అంక్షలు. ఈ పరిస్ధితి మరొక విప్లవానికి దారి తీసిందంటే అతిశయోక్తి కాదు. అదే చమురు, యంత్రాలు, పురుగు మందులు, రసాయనిక ఎరువులతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసి జనాల కడుపు నింపటం ఎలా అన్నదే ఆ విప్లవ లక్ష్యం. సోషలిస్టు భావజాలంతో వుత్తేజితులై, దానికి కట్టుబడి వున్న నాయకత్వం, తమ బాటలో జనాన్ని నడిపించిన తీరు క్యూబాలో సేంద్రీయ వ్యవసాయ విప్లవానికి దారితీసింది. దీని అర్ధం క్యూబా సమస్యలన్నింటినీ పరిష్కరించింది అని కాదు. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబాలో ఆహారధాన్యాల స్వయం సమృద్ధి లేదు. అరవై నుంచి ఎనభై శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఇప్పటికీ విదేశాల మీద ఆధారపడుతున్నప్పటికీ ఆహార రంగంలో గణనీయ పురోగతి సాధించింది.

ముందే చెప్పుకున్నట్లు సోవియట్‌ కూలిపోయిన దగ్గర నుంచి క్యూబాలో ప్రత్యేక పరిస్ధితి ఏర్పడింది. శాంతి సమయంలో ప్రేత్యేక కాలమిది అని కాస్ట్రో వర్ణించారు. పంచదార ఎగుమతులతో విదేశీమారక ద్రవ్యం సంపాదించాలంటే ఎవరినీ కొనుగోలు చేయనివ్వకుండా అమెరికన్‌ ఆంక్షలు. వున్నంతలో పొదుపు చేసి చమురు, ఇతర అవసరాలను దిగుమతి చేసుకొందామంటే డబ్బు లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా చమురు, యంత్రాలు, ఎరువులు, పురుగుమందులు లేకుండా పంటలు పండించే పద్దతులను కనుగొనేందుకు పూనుకున్నారు. అవసరమైన సేంద్రీయ పద్దతుల మీద శాస్త్రవేత్తలు పని చేశారు. భూమి ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే వుంది. సంస్కరణల ఫలితంగా పండించి, పంటలను అమ్ముకొనే హక్కు మాత్రమే జనానికి వుంది. వంద ఎకరాలకు తక్కువగా వున్న కమతాలలో సేంద్రీయ సాగు పద్దతులను ప్రవేశపెట్టి అనేక విజయాలను సాధించారు. దిగుమతులను గణనీయంగా తగ్గించగలిగారు.

సేంద్రీయ వ్యవసాయం ఒక ఎండమావి కాదు, మా దేశ పంచదార కర్మాగారాలలో సగాన్ని మూసివేయటం మా ఆహార స్వయం ఆధారదిశగా వేసి తొలి అడుగు అని వ్యవసాయ పరిశోధకుడు ఫెర్నాండో ఫ్యూన్స్‌ మోంనోజోట్‌ అన్నారు. సోవియట్‌ నుంచి చమురు, ఎరువులు, పురుగు మందులు వచ్చే నావలు ఆకస్మికంగా ఆగిపోయాయి, అవింకేమాత్రం వచ్చే అవకాశం లేదు, మనకు ఈ రసాయనాలన్నీ అవసరమా అని జనం అడగటం ప్రారంభించారు అని ఒక సేంద్రీయ క్షేత్ర యజమాని మిగుయెల్‌ ఏంజెల్‌ సాల్సిని చెప్పారు . ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించింది. వుత్పత్తులను స్ధానికంగా విక్రయించేందుకు అనుమతించింది. సేంద్రీయ పద్దతి జయప్రదం అవుతుందనే హామీ లేకపోయినప్పటికీ, నెమ్మదిగా జరిగినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధ మెరుగైంది. మంత్లీ రివ్యూ అనే పత్రిక జరిపిన ఒక అధ్యయనంలో తేలిన అంశాల ప్రకారం 1988-2007 మధ్య కాలంలో పురుగుమందుల వినియోగం 72శాతం తగ్గింది, కూరగాయల వుత్పత్తి 145శాతం పెరిగింది. ఫ్రెంచి వ్యవసాయ శాస్త్రవేత్త రెనె డ్యూమోంట్‌ తగిన యాజమాన్య పద్దతులతో క్యూబా ప్రస్తుతం వున్న జనాభాకంటే ఐదు రెట్ల మందికి తగిన విధంగా తిండిపెట్టగలదు అన్నారు. 2010లో తన జనానికి అది కడుపునింపే స్ధితిలో లేదు, అది వినియోగించే ఆహారంలో 80శాతం దిగుమతి చేసుకొనేది, దానిలో 35శాతం అమెరికా నుంచి వచ్చేది. అన్నింటికి మించి క్యూబాలోని సగం భూమి వ్యవసాయానికి పనికి రానిది లేదా వృధాగా వుంది.

నియంత బాటిస్టా, అంతకు ముందున్న పాలకుల హయాంలో సారవంతమైన భూమిని చెరకుసాగుకు వుపయోగించారు. పంచదారను అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతి చేశారు.ఆరుదశాబ్దాల క్రితం విప్లవం తరువాత ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అనివార్య పరిస్ధితులలో అంతకు ముందు మాదిరే పంచదారను తయారు చేసి అమెరికా బదులు సోవియట్‌, ఇతర దాని మిత్ర దేశాలకు ఎగుమతి చేశారు. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1990-94 మధ్య వ్యవసాయ వుత్పత్తి గణనీయంగా పడిపోయింది. పెద్ద క్షేత్రాలలో యంత్రాలతో వ్యవసాయం చేసే స్ధితి లేదు. చిన్న రైతాంగం వాటిని నిర్వహించలేరు. అమెరికా దిగ్బంధం మరింత పెరిగింది. ఆహార వినియోగం తగ్గి సగటున ప్రతి ఒక్కరు పది కిలోల వరకు బరువు తగ్గారు. ఈ పూర్వరంగంలో ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ క్షేత్రాల యాజమాన్య పద్దతులను మార్చింది. స్వతంత్ర సహకార క్షేత్రాలతో పాటు ప్రయివేటు క్షేత్రాలను కూడా అనుమతించింది. స్వతంత్ర వ్యవసాయ క్షేత్రాలు వేటిని వుత్పత్తి చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చింది. అయితే వుత్పత్తులను నిర్ణీత ధరలకు ప్రభుత్వానికి విక్రయించాల్సి వుంటుంది. ఇప్పుడు 70శాతం మేరకు ప్రయివేటు క్షేత్రాలలో వుత్పత్తి అవుతోంది. వుత్పత్తిలో 80శాతం ప్రభుత్వానికి, మిగిలినదానిని ప్రయివేటుగా విక్రయించుకోవచ్చు. ఇటీవల చేసిన మార్పుల ప్రకారం 35లక్షల ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కమతాలుగా విభజించి వుచితంగా రైతులకు కౌలుకు ఇచ్చారు. దానిని వారి వారసులకు బదలాయించే వీలు కల్పించారు. స్ధానిక కమిటీలకు వుత్పత్తి విషయాలలో స్వయంప్రతిపత్తి, అధికారాలను ఎక్కువగా కల్పించారు. ప్రయివేటు సహకార సంస్ధలు కూడా ఇప్పుడు ఆహారపంపిణీలో భాగస్వాములు కావచ్చు. ఇన్ని చేసినప్పటికీ దేశంలో ఆహార సమస్య వుంది.

వుష్ణమండల పర్యావరణంలో తెగుళ్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఇతర వ్యాధులు ఎక్కువే.భూ సారం, మంచినీటి నిర్వహణ కూడా అంతతేలిక కాదు. చిన్న, పెద్ద పట్టణ ప్రాంతాలలో అందుబాటులో వున్న ప్రతి నేలలో సేంద్రీయ పద్దతిలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.గణనీయ భాగం ఇక్కడ వుత్పత్తి అవుతోంది. ఒకే పంటకు బదులు బహుళ పంటల సాగును ప్రోత్సహించారు. పంటలు ఆరోగ్యంగా పెరిగేందుకు సహజ పద్దతులను అనుసరించారు. పరపరాగ సంపర్కాన్ని జరిపే కీటకాలను ఆకర్షించేందుకు బంతిపూలను వినియోగించారు.నత్రజని వున్న బీన్స్‌ను సేంద్రియ ఎరువుగా వుపయోగించారు. హానికారక క్రిమి, కీటకాలను దూరంగా వుంచేందుకు మిత్ర కీటకాలను ప్రయోగించారు. పోషక పదార్ధాలున్న కంపోస్టును పెద్ద ఎత్తున తయారు చేశారు. 1988లో వినియోగించిన రసాయనాలలో నాలుగోవంతుతోనే 2007లో మరింత ఆహారాన్ని వుత్పత్తి చేయటం నిజమైన వ్యవసాయ విజయమే. గత కొద్ది సంవత్సరాలలో మారిన పరిస్ధితులలో వెనెజులా రసాయన ఎరువులను పంపుతోంది. దాంతో సేంద్రీయ వ్యవసాయం ఎందుకు అనే అభిప్రాయం కూడా కొంత మందిలో తలెత్తింది. వాటితో పని లేకుండానే గణనీయ విజయాలు సాధించినపుడు తిరిగి వెనుకటి కాలానికి వెళ్లటం ఎందుకు అనేవారు కూడా గణనీయంగా వున్నారు. ప్రభుత్వ వుద్యోగాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పట్టణ ప్రాంతాలలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువగా వుండటంతో అనేక మంది వుద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయానికి పూనుకున్నారు.

Image result for cuba organic agriculture

సేంద్రియ వ్యవసాయ పద్దతి క్యూబన్ల కడుపు నింపుతుందా అన్నది ఒక ప్రశ్న. గత్యంతరం లేని స్ధితిలో ఏటికి ఎదురీదినట్లుగా సోషలిస్టు చైతన్యంతో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జనం సేంద్రీయ పద్దతుల్లో చిన్నతరహా కమతాలలో సాగు చేస్తూ అనేక దేశాలకు తమ అనుభవాలను పంచుతున్నారంటే అతిశయోక్తి కాదు. అనేక మందికి చెరకు తోటలు, పంచదార ఫ్యాక్టరీల్లో పని చేయటం తప్ప మరొకటి రాదు అలాంటి వారు నేడు ఇతర వుత్పాదక రంగంలో భాగస్వాములు అవుతున్నారు. క్యూబా ప్రస్తుతం మొక్క జన్నలను బ్రెజిల్‌, బియ్యాన్ని వియత్నాం, రొట్టెలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. పట్టణాలలో పెరటి తోటలు, ఇండ్లపైన కోళ్ల పెంపకం వంటివి గతంలో వుండేవి. ఇప్పుడు పాడుపడిన పట్ణణ, పంచదార ఫ్యాక్టరీల ప్రాంతాలలో కూరగాయలు, పండ్లవంటి వాటిని ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ సాగు చేస్తున్నారు. క్యూబాను సందర్శించే పర్యాటకులకు కొన్ని చోట్ల అవి దర్శనీయ స్ధలాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. తాము సాధించిన విజయాల గురించి క్యూబన్లు అతిశయోక్తులు చెప్పుకోవటం లేదు. ‘ సేంద్రీయ వ్యవసాయం పెద్ద మొత్తాలలో దిగుబడులు సాధించటానికి తోడ్పడదు, మా సమస్యలన్నింటినీ పరిష్కరించదు, కానీ అనేక సమస్యలను అది పరిష్కరించింది. అసలు ఆ పద్దతిని ప్రారంభించటమే ప్రాధాన్యత సంతరించుకుంది. దడాలున తగిలిన దెబ్బ వాస్తవం నుంచి తేరుకొనేందుకు పర్యావరణ వ్యవసాయ సాగు తలెత్తింది.సోవియట్‌ కూలిపోవటమే ఆ వాస్తవం, ఆ రోజులు ఎంతో కష్టమైనవి, ఏదో విధంగా ఎక్కడో ఒక చోట ఆహారాన్ని వుత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది ‘ అని వ్యవసాయ శాఖ అధికారి జాన్‌ జోస్‌ లియోన్‌ చెప్పారు. సేంద్రీయ సాగు అంటే పాటించాల్సిన ప్రమాణాలేమిటో తెలియదు, స్ధానికంగా పండిన దానిని సాగు చేయటమే సోషలిస్టు క్యూబా భవిష్యత్‌ అవసరం అని కొందరు భావిస్తే మరి కొందరు పుదీనా వంటి అమెరికా, ఐరోపా మార్కెట్లకు అవసరమైనవి సాగు చేసే అవకాశంగా కొందరు భావించారు. మొత్తంగా సాగు మీద ఆసక్తిని కలిగించటంలో ప్రభుత్వం జయప్రదమైంది. ప్రభుత్వం కేటాయించిన భూమిలో సేంద్రీయ వ్యవసాయమే చేయాలి, ఫలానా పంటలనే పండించాలనే నిబంధనలేమీ పెట్టలేదు. స్ధానిక వ్యవసాయ పద్దతులను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది, ప్రభుత్వ మార్గదర్శనం, సంస్ధాగత నియంత్రణ, సోషలిస్టు చైతన్యంతో పాటు ఈ కార్యక్రమానికి సానుభూతిపరులైన విదేశీయుల సాయం కూడా తీసుకున్నారు. కెనడా, ఐరోపా యూనియన్‌కు చెందిన అనేక ధార్మిక సంస్ధలు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చాయి. ఈ కార్యక్రమం, సహకారంలో భాగంగా సేంద్రియ సాగు మెళకువలు, నాణ్యమైన విత్తనాల అందచేత, వుత్పిత్తి విక్రయాలకు కొనుగోలుదార్లతో సంబంధాలను ఏర్పాటు చేయటం వంటి అంశాలున్నాయి.

సాధించిన విజయాలతో పాటు సేంద్రియ సాగుతో క్యూబన్‌ రైతులు సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఆశించిన స్ధాయిలో ఆహార వుత్పత్తి పెరగటం లేదు. దిగుబడులు తక్కువగా వుంటున్నాయి. దశాబ్దం క్రితం నామ మాత్రంగా వున్న వుత్పత్తి ఇప్పుడు మొత్తం వుత్పత్తిలో 20శాతం వరకు సేంద్రియ సాగు వాటా వుంది. ‘విదేశాల్లో వున్నవారు నిరంతర వ్యవసాయం సాగించే ఒక స్వర్గంగా మమ్మల్ని చూస్తున్నారు. మేము అలా అనుకోవటం లేదు. ఒక చెడు వ్యవసాయ పద్దతి నుంచి బయటపడుతూ అంతకంటే మెరుగైన దానిని అనుసరిస్తున్నాము అని హవానా జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న మైకేల్‌ మార్కెవెజ్‌ వ్యాఖ్యానించాడు.