Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో జోక్యం చేసుకో నుందా ? మరోసారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన వామపక్ష మదురోను కూలదోసేందుకు ప్రత్యక్షంగా తన సైన్యాన్ని పంపుతుందా? పశ్చిమాసియా, ఇతర ప్రాంతాల్లో తగిలిన ఎదురు దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని పరిసర దేశాల మిలిటరీతో తన లక్ష్యాన్ని నెరవేరుస్తుందా లేక వెనెజులా మిలిటరీని ప్రభావితం చేసి తిరుగుబాటు చేయిస్తుందా ? ప్రస్తుతం వెనెజులాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తలెత్తుతున్న ప్రశ్నలివి. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో వెనెజులాలో మిలిటరీ జోక్యం ఆ ఒక్క దేశానికే పరిమితం అవుతుందా? ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుందా ! అసలు వెనెజులాలో, దానికి సంబంధించి బయట ఏమి జరుగుతోంది?

బుధవారం నాడు అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సైనిక తిరుగుబాటుకు, ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో వునికిలో లేని పార్లమెంట్‌ అధ్యక్షుడు జువాన్‌ గుయైడోకు అమెరికా వుపాధ్యక్షుడు మైక్‌ పెనెస్‌ మద్దతు ప్రకటించి ప్రత్యక్ష జోక్యానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి తిరుగుబాటు చేసిన వారిలో 27 మందిని అరెస్టు చేశారని, మరికొందరని అరెస్టు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్ష భవనానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఒక సైనిక అవుట్‌ పోస్టును స్వాధీనం చేసుకున్న కొందరు సైనికులు రెండు మిలిటరీ ట్రక్కులు,కొన్ని ఆయుధాలు తీసుకొని బయలు దేరగా వారిని అరెస్టుచేసినట్లు తొలి వార్తలు తెలిపాయి. అంతకు కొన్ని గంటల ముందు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చిన అనేక వీడియోలలో సైన్యంలోని నేషనల్‌ గార్డ్స్‌ తాము మదురోను అధ్యక్షుడిగా గుర్తించటం లేదని తమకు మద్దతుగా జనం వీధుల్లోకి రావాలని చెప్పినట్లుగా వుంది. అరెస్టులకు ముందు సామాజిక మాధ్యంలో దర్శనమిచ్చిన వీడియోలో పార్లమెంటు నేత, తాత్కాలిక అధ్యక్షుడంటూ ప్రకటించిన జువాన్‌ గుయైడో మాట్లాడుతూ తిరుగుబాటు చేయాలని, కాల్పులు జరపాలని తాము కోరటం లేదని, మన పౌరుల హక్కుల కోసం తమతో పాటు కలసి రావాలని కోరుతున్నామని సైనికులకు విజ్ఞప్తి చేశాడు. మదురోను వదలి వచ్చిన మిలిటరీ, ఇతర పౌర అధికారులకు తాము క్షమాభిక్ష పెడతామని పార్లమెంటు ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే సుప్రీం కోర్టు ఒక ప్రకటన చేస్తూ మదురో అధ్యక్ష స్వీకారం చెల్లదంటూ కొద్ది రోజుల క్రితం పార్లమెంట్‌ చేసిన తీర్మానం చెల్లదని, రాజ్యాంగ వుల్లంఘనకు పాల్పడిన పార్లమెంట్‌ నేతలు నేరపూరితంగా వ్యవహరించారో లేదో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. గతంలో కూడా ఇలాంటి చెదురుమదురు తిరుగుబాట్లు, మదురోపై హత్యాయత్నాల వంటివి జరిగాయి. ఈ వుదంతం కూడా అలాంటిదేనా అన్నది చూడాల్సి వుంది. రానున్న కొద్ది రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ శక్తుల కుట్రల పర్యవసానాలు మరింతగా వెల్లడి అవుతాయి.

లాటిన్‌ అమెరికాలో వామపక్షం అధికారంలోకి వచ్చిన దేశాలలో ఒకటి వెనెజులా ! హ్యూగో ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఇంటా బయటి శక్తులు చేయని యత్నం లేదు. ఆయన రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురోకు వ్యతిరేకంగా కూడా అదే జరుగుతోంది. గత ఏడాది మేనెలలో జరిగిన ఎన్నికలలో మదురో మరో ఆరు సంవత్సరాలకు తిరిగి ఎన్నికయ్యారు. ఈనెల పదవ తేదీన తిరిగి అధికారాన్ని స్వీకరించారు. 2015లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రతిపక్షం మెజారిటీ సాధించింది. తరువాత మదురోను తొలగించాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.2017లో సుప్రీం ట్రిబ్యునల్‌ పార్లమెంట్‌ అధికారాలను రద్దు చేసింది. అధికారంలేని పార్లమెంట్‌ కొనసాగుతోంది. తరువాత నూతన రాజ్యాంగ రచనకు రాజ్యాంగపరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.2018 మే నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రెండవసారి మదురో ఎన్నికను అమెరికా మరికొన్ని దేశాలు గుర్తించేందుకు నిరాకరించాయి. రెండవ సారి ప్రమాణ స్వీకారానికి బలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డైయాజ్‌ కానెల్‌, నికరాగువా అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా, సాల్వడోర్‌ అధ్యక్షుడు సాల్వడోర్‌ శాంఛెజ్‌ సెరెన్‌ వంటి నేతలు హాజరు కాగా చైనా ప్రత్యేక ప్రతినిధిని పంపింది. మొత్తం 94దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదురో మాట్లాడుతూ తమ పార్టీ 19ఏండ్ల పాలనా కాలంలో 25ఎన్నికలు జరిగాయని ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని చెప్పారు. వెనెజులా మిలిటరీ మదురోకు విధేయత ప్రకటించింది.

మదురో అధికార అపహర్త అంటూ అధికారాలు లేని పార్లమెంట్‌ జనవరి 11న ఒక తీర్మానం చేసి జువాన్‌ గుయైడోను అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించింది. అధికార వ్యవస్ధలో శూన్యం ఏర్పడినపుడు నూతన అధ్యక్షుడిని నియమించే అధికారం తమకుందని చెప్పుకుంది. ఈనెల 23న మదురోకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయాలని, సైన్యం తిరుగుబాటు చేసి పార్లమెంట్‌కు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. తదుపరి ఎన్నికలు జరిగే వరకు తనది ఆపద్ధర్మ ప్రభుత్వమని గుయైడో చెప్పుకున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం, మిలిటరీలోని మధ్య, దిగువ సిబ్బంది తిరుగుబాటు చేసి తమకు మద్దతు ఇస్తారని ప్రతిపక్ష శిబిరం చెప్పుకుంటోంది. వెనెజులా ఆస్ధులు, ఖాతాలను స్దంభింప చేయాలంటూ పార్లమెంట్‌ 46దేశాలకు లేఖలు రాసింది. మరిన్ని ఆంక్షల అమలుకు తాము ప్రయత్నిస్తామని అమెరికా ప్రకటించింది. రెండోసారి మధురో అధికార స్వీకరణను అమెరికాతో పాటు లిమా బృందంగా పరిగణించబడే 13దేశాలు గుర్తించేందుకు నిరాకరించాయి. వాటికి కొలంబియా, బ్రెజిల్‌ నాయకత్వం వహిస్తున్నాయి.

బస్సు డ్రైవర్ల యూనియన్‌ నేతగా రాజకీయ జీవితం ప్రారంభించిన మదురో ఏడు సంవత్సరాల పాటు ఛావెజ్‌ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఛావెజ్‌ కాన్సర్‌ నుంచి కోలుకొనే అవకాశం లేని స్ధితిలో ఆయన తన రాజకీయ వారసుడిగా మదురోను గుర్తించారు. 2013లో తొలిసారి మదురో పోటీ చేసినపుడు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డాయి. పదకొండు మంది పాలకపార్టీ కార్యకర్తలను హత్యచేశాయి. 2015లో ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ఎన్నికలలో మెజారిటీ సాధించిన వెంటనే ఆరునెలల్లో మదురోను పదవీచ్యుతుని గావిస్తామని ప్రకటించాయి. పార్లమెంట్‌ -అధ్యక్షుడి మధ్య తలెత్తిన వివాదం చివరకు 2017లో సుప్రీం కోర్టు పార్లమెంట్‌ అధికారాలను రద్దు చేయటంతో ముగిసింది. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తూనే వున్నాయి. పార్లమెంట్‌ స్ధానంలో ఎన్నికైన నూతన రాజ్యాంగ సభ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాల్సి వుంది.

మదురోను గద్దె దింపేందుకు తక్షణమే ట్రంప్‌, ఇతరులు కదలనట్లయితే ఇంకో అవకాశం వుండదని, మరొక క్యూబా మాదిరి మారిపోతుందని అమెరికా, లాటిన్‌ అమెరికాలోని వామపక్ష వ్యతిరేకశక్తులు తొందర పెడుతున్నాయి. అమెరికా, ఐరోపా యూనియన్‌, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలు ఇంతకు ముందే గతేడాది జరిగిన మదురో ఎన్నికను గుర్తించటం లేదని ప్రకటించాయి. ఇంత హడావుడి చేస్తున్నప్పటికీ ప్రతిపక్ష జువాన్‌ గుయైడో ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేసినట్లు ప్రకటించలేదు, తరువాత చేస్తానని మాత్రమే చెబుతున్నాడు. ఈనెల 23న మదురోకు వ్యతిరేకంగా జనాన్ని వీధుల్లో ప్రదర్శనలు చేయించాలని, ఈలోగా మిలిటరీలో తిరుగుబాటు రెచ్చగొట్టాలన్నది ప్రతిపక్షం రూపొందించిన అనేక పధకాలలో ఒకటి. సుప్రీం కోర్టు, మిలిటరీ మద్దతు లేని ఏ ప్రభుత్వమూ ఇప్పుడున్న స్దితిలో వెనెజులాలో నిలిచే అవకాశం లేదు. అయితే పధకంలో భాగంగా కెనడా, బ్రెజిల్‌, అమెరికా దేశాల సంస్ధ పార్లమెంట్‌ తీర్మానాన్ని అభినందిస్తున్నామని, గుర్తిస్తామని చెప్పటం ద్వారా గుయైడోను అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు పరోక్షంగా తెలిపాయి. అధికారిక ప్రకటన చేస్తే గుయైడోను వెంటనే అరెస్టు చేసే అవకాశం వుంది. దాని బదులు అతగాడు నియమించే రాయబారులను గుర్తిస్తూ మదురో సర్కార్‌ నియమించిన వారిని ఖాళీ చేయించటం ద్వారా తమ మద్దతును వెల్లడించవచ్చన్నది ఒక సమాచారం. ఒక వేళ అలా కానట్లయితే ఏదో ఒక దేశ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం కల్పించి అక్కడి నుంచి సమాంతర ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన చేయించే ఆలోచన కూడా లేకపోలేదు. అది చేస్తే మదురో సర్కార్‌ రాయబార కార్యాలయం మీదకు సైన్యాన్ని పంపకపోవచ్చని బ్రెజిల్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి చెప్పారు. గుయైడో ద్వారా వెనెజులాకు మానవతా పూర్వక సాయ అభ్యర్ధన ప్రకటన చేయించి సరిహద్దులకు కొంత మొత్తం సాయాన్ని పంపితే మదురో సర్కార్‌ దానిని అనుమతించదని, ఆ చర్య జనంలో మదురో పట్ల వ్యతిరేకతను పెంచవచ్చని మదురో వ్యతిరేక శక్తులు ఆశిస్తున్నాయి.

Image result for us supported military coup against venezuela president nicolas maduro

తాజా పరిణామాల్లో వెనెజులా వ్యవహారాలలో కెనడా ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో తన పట్టు పెంచుకోవాలని గత కొంతకాలంగా కెనడా పాలకవర్గం అవకాశాల కోసం చూస్తోంది. దానిలో భాగంగానే మదురో రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయకముందే మదురో పాలన చట్టబద్దమైనదిగా తాము పరిగణించటం లేదని ప్రకటించింది. లిమా బృందంలో మెక్సికో కూడా సభ్యురాలిగా వున్నప్పటికీ తాత్కాలికంగా అయినా అది మదురో వ్యతిరేక వైఖరికి దూరంగా వుంది. మెక్సికోలో నూతనంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ వెనెజులా నేత మదురోకు ఆహ్వానం పంపారు. అమెరికా విషయానికి వస్తే నిరంతరం వెనెజులా మిలిటరీలో తిరుగుబాటు, చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. తన చేతికి మట్టి అంటకుండా వ్యవహరించాలని అమెరికా చూస్తున్నది. అందుకే కెనడా వంటి వాటిని ముందు పెడుతున్నది. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి ఆల్మగారో కుట్రను ప్రోత్సహిస్తున్నవారిలో ఒకడు. గుయైడో తానేమిటో చెప్పుకోక ముందే వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడంటూ స్వాగతం పలికాడు. ఈనెల పదిన మదురో ప్రమాణ స్వీకార సమయంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ఒక ప్రకటన చేస్తూ తక్షణమే తిరుగుబాటు ద్వారా మదురోను బర్తరఫ్‌ చేయాలని వెనెజులా మిలిటరీని బహిరంగంగా కోరాడు. మరుసటి రోజు గుయైడోకు ఫోన్‌ చేసి మద్దతు ప్రకటించాడు.ఈ నెల 12న విదేశాంగశాఖ ఒక ప్రకటన చేస్తూ పాలకుల మార్పులో భాగంగా మిలిటరీ తిరుగుబాటుకు తమ మద్దతు వుంటుందని ప్రకటించింది. గూఢచార సంస్ద సిఐఏ సంగతి సరేసరి. అధికారులను ప్రలోభాలకు గురిచేయటం, బ్లాక్‌మెయిల్‌ చేయటం, అనేక పుకార్లను వ్యాపింపచేయటంలో తన పని తాను చేస్తున్నది.

లాటిన్‌ అమెరికాలో పచ్చి నియంతలను నిస్సిగ్గుగా సమర్ధించిన అమెరికా నిర్వాకాన్ని అక్కడి జనం అంత తేలికగా మరచిపోతారనుకుంటే వారి చైతన్యాన్ని తక్కువగా అంచనా వేయటమే. నియంతలకు వ్యతిరేకంగా పోరాడి అధికారానికి వచ్చిన వామపక్ష శక్తులు నయావుదారవాద విధానాల పునాదుల మీద సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి గతకొన్ని సంవత్సరాలుగా ప్రజాభిమానం పొందారు. అయితే అది దీర్ఘకాలం సాగదని, దోపిడీ సంబంధాలను తెంచివేసి ప్రత్నామ్నాయ విధానాలను అమలు జరిపినపుడే జనం మద్దతు వుంటుందని స్పష్టమైంది. కొన్ని చోట్ల వామపక్ష ప్రభుత్వాల మీద తలెత్తిన అసంతృప్తితో జనం అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల మితవాద, ఫాసిస్టు శక్తులను గద్దెనెక్కించారు. అచిర కాలంలోనే వాటి విధానాల మీద జనం వీధులకు ఎక్కుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి నిరంతరం కబుర్లు చెప్పే అమెరికా, కెనడా వంటి దేశాలు, అమెరికా దేశాల సంస్ధ వెనెజులా లేదా మరొక చోట మిలిటరీ చర్యలు, మిలిటరీ తిరుగుబాట్లను ప్రోత్సహించి సమర్ధించుకోవటం అంత తేలిక కాదు. అయితే వైరుధ్యాలు ముదిరినపుడు సామ్రాజ్యవాదులకు మీన మేషాల లెక్కింపు, ఎలాంటి తటపటాయింపులు వుండవు.