Tags

, , ,

Image result for narendra modi sarkar itself giving astras to opposition cartoons

ఎం కోటేశ్వరరావు

కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వం రానున్న లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందేందుకు సరిగ్గా నోటిఫికేషన్‌కు ముందు ప్రతిపక్షాల వూహకు అందని అస్త్రాలను బయటకు తీస్తోందని ఆ పార్టీతో పాటు దానికి కొమ్ముకాసే మీడియా ప్రచారం చేసింది. బడ్జెట్‌ తాయిలాలతో ఆ పర్వం ముగిసి అస్త్రాలు అయిపోయాయని అనుకోవాలి. ఇన్ని చేసినా తమకు అధికారం దక్కదేమో అనే అనుమానం తలెత్తితే ఇంకా వేటిని బయటకు తీస్తారో తెలియదు. తమది వ్యత్యాసంతో కూడిన పార్టీ అని బిజెపి స్వయం కితాబు ఇచ్చుకుంది. మన కష్టజీవులకు కానప్పటికీీ నరేంద్రమోడీకి అత్యంత మిత్రదేశమైన అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం(ఓడిఎన్‌ఐ) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. బిజెపి పాలిత ప్రాంతాలలో ఎన్నికలకు ముందు మతఘర్షణలు జరగవచ్చని దానిలో చెప్పినందున చివరకు ఆ మారణాస్త్త్రాలను ప్రయోగిస్తే చెప్పలేము. రామాయణంలో రావణుడిని ఎలా చంపాలో విభీషణుడు చెబితేనే రాముడికి సాధ్యమైంది. ఆ తరువాత రావణకాష్టం గురించి తెలిసిందే. ఇప్పటికే అనేక రామాయణాలు ప్రచారంలో వున్నాయి. బిజెపి రామాయణం కొత్తది. మోడీని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలకు ఆ పార్టీలోని విభీషణుల అవసరం లేదు. మీడియా వర్ణించినట్లు మోడీ అస్త్రాలను బయటకు తీశారా లేక మోడీయే ప్రతిపక్షాలకు అస్త్రాలను అందించారా ?

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్న సామెత తెలిసిందే. అలాగే తాను భిన్నమైన పార్టీ అని బిజెపి స్వంతడబ్బా ఏమికొట్టుకున్నప్పటికీ కాంగ్రెస్‌కూ దానికీ పెద్ద తేడా లేదని,దేశంలోని వ్యవస్ధలను దెబ్బతీయటం, దుర్వినియోగం చేయటం, జనానికి విశ్వాసం లేకుండా చేయటంలో కాంగ్రెస్‌ కంటే రెండాకులు ఎక్కువే చదివిందని ఇటీవలి కాలంలో స్పష్టంగా నిరూపించుకుంది. కాంగ్రెస్‌ పాలనా కాలంలో జనం మీద మోపే భారాలను ముందుగానే ప్రకటించి బడ్జెట్లను భారాలు లేనివిగా ప్రకటించుకొని ఆ ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చారు. దాన్ని గతంలో బిజెపి కూడా కొనసాగించింది. తాజాగా జిఎస్‌టి విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆ రేట్ల తగ్గింపు హెచ్చింపు అన్నది ఇష్టమొచ్చినపుడు చేసే అవకాశం వుండటంతో పధకాల ప్రకటన మినహా బడ్జెట్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వడ్డించేవారు మనవారైతే కడబంతిలో వున్నా మనకు అన్నీ అందుతాయన్న లోకోక్తి తెలిసిందే. బడ్జెట్‌ కూడా అంతే. తమకేమి ఒరగబెడతారా అని సామాన్యులు, మధ్యతరగతి ప్రదర్శించే ఆతృత ధనికులు, కార్పొరేట్లలో కనిపించదు. ఎందుకంటే ప్రభుత్వం తమది కనుక గుట్టుచప్పుడు కాకుండా తమ సింహభాగాన్ని తాము చక్కపెట్టుకొనేందుకు వారేమీ హడావుడి చెయ్యరు.

బడ్జెట్‌ సమర్పణ గురించి సంప్రదాయాలు, స్వయం నిబంధనలు తప్ప ఒక నమూనా లేదు. బ్రిటీష్‌ వారి పాలనలో మన దేశంలో ఆప్రక్రియ మొదలైంది గనుక వారి పద్దతిని, ప్రవేశ సమయాన్ని మనదేశంలో కూడా అమలు జరిపారు. సమగ్ర చర్చకు అవకాశం లేని పరిస్ధితుల్లో మూడునెలలకు సరిపడా అవసరాలకు ఖజానా నుంచి నిధులు తీసుకొనేందుకు అనుమతించే ప్రక్రియను ఓట్‌ఆన్‌ అకౌంట్‌ అంటారు. ఎన్నికలు జరగబోయే తరుణంలో అధికారంలోకి వచ్చే సర్కార్‌ ఎవరిదో, బడ్జెట్‌ ప్రాధాన్యతలు ఏమిటో తెలియవు గనుక ఈ పద్దతిని అనుసరించటం ఆనవాయితీగా వచ్చింది. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్‌ దాన్ని తుంగలో తొక్కింది. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. నిధుల విడుదలకు ఆమోదం తెలపటం తప్ప దీని మీద జరిగే చర్చ ఏమీ వుండదు. తమ ఐదేండ్ల పాలనతో ప్రజల విశ్వాసం పొంది తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం బిజెపిలో లేదని ఈ బడ్జెట్‌ స్పష్టం చేసింది. ఏదైన ఒక చట్టం లేదా చట్ట సవరణ అవసరాలను బట్టి వెనుకటి తేదీ నుంచి అమలులోకి తీసుకురావటం కొత్తేమీ కాదు. కానీ ఓట్ల కోసం రైతుల నిధి ఏర్పాటు, దాన్నుంచి చిన్న రైతులకు మూడు విడతలుగా రెండేసి వేల చొప్పున ఆరువేల రూపాయల అందచేత పధకాన్ని వచ్చే ఏడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టి దాన్ని గత ఏడాది నుంచి అమలయ్యే విధంగా చూశారంటే ఎన్నికల ఆపదమొక్కులు తప్ప మరొకటి ఎలా అవుతుంది.బడ్జెట్‌ ప్రహసనం ప్రతిపక్షాలకు మోడీ అందించిన అస్త్రం కాదా ?

తాము అధికారానికి వస్తే రామాలయ నిర్మాణం చేస్తామన్నది బిజెపి వాగ్దానం. అది సమర్ధనీయమా కాదా అన్నది ఒక అంశమైతే ఎందుకు అమలు జరపలేదో, ఎవరు అడ్డమొచ్చారో బిజెపి చెప్పాలా లేదా ? ఎప్పుడో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అయోధ్య భూమిలో వివాదాస్పదం గాని స్ధలాన్ని యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టు అనుమతి కోరుతూ సరిగ్గా ఎన్నికలకు ముందుకు కేంద్రం పిటీషన్‌ దాఖలు చేయటం ఎన్నికల ఎత్తుగడ కాదా ? దీన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించవా? దాని వెనుక వున్న వాస్తవాన్ని జనం ముందుంచవా ? బాబరీ మసీదు వున్న స్దలంపై హక్కు వివాదంలో దాఖలైన అన్ని పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు నిర్ణయం ఆకస్మికంగా జరగలేదు. దానిపై తీర్పు ఎన్నికలకు ముందే వస్తుందన్న నమ్మమూ లేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రయాగలో విశ్వహిందూపరిషత్‌ నిర్వహించిన ధర్మసంసద్‌లో ప్రసంగించిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌భగవత్‌ చెప్పిందేమిటి? ‘వారు(బిజెపి) రామాలయం గురించి మాట్లాడేది కేవలం ఓట్లు పొందేందుకే.అయితే విశ్వాసాన్ని దృష్టిలో వుంచుకొని ఆలయ నిర్మాణం జరుగుతుంది. మూడు నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకుంటే మంచిదే, లేనట్లయితే నాలుగు నెలల తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతుంది.’ దీనికి రెండు రోజుల ముందు శంకరాచార్యల్లో ఒకరైన స్వరూపానాంద సరస్వతి అక్కడే మాట్లాడుతూ ఫిబ్రవరి 21న అయోధ్యయాత్ర చేసి అదే రోజు ఆలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తామని, ఇంకేమాత్రం ఆలస్యం కాకూడదని చెప్పారు. వివాదం లేని చోట రామాలయం కట్టేందుకు ఎవరూ అడ్డపడలేదే? లేదూ బాబరీ మసీదు స్ధలంలోనే కట్టాలనుకుంటే దాని యాజమాన్యంపై దాఖలైన పిటీషన్లపై కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి, కోర్టు తీర్పునకు కట్టుబడి వుండాలి.ఓట్ల కోసం నాటకాలు గాకపోతే ఏమిటిది?

ప్రపంచంలో మన రిజర్వుబ్యాంకు, మన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ వ్యవస్ధలకు ఒక ప్రత్యేకత వుంది. 2007లో ప్రపంచ ధనిక దేశాలలో బ్యాంకులు కుప్పకూలటంతో ప్రారంభమైన ఆర్దిక సంక్షోభానికి మన బ్యాంకులు, ఆర్ధిక వ్యవస్ధ అంతగా ప్రభావితం గాకపోవటానికి, నిలబడటానికి రిజర్వుబ్యాంకు విధానాలే కారణం. దాని అధిపతితో నిమిత్తం లేకుండా ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతీసుకున్నారు. దాని వలన జరిగిన నష్టం ఏమిటో తెలిసిందే. రద్దు నిర్ణయ సమయంలో మాట్లాడటం తప్ప ఇంతవరకు మోడీ నోరు విప్పలేదు. నల్లధనమేమీ బయటకు రాకపోగా దాన్ని కలిగిన వారంతా తెల్లధనంగా మార్చుకున్నారు.దేశ ఆర్ధిక వ్యవస్ధకు, ప్రత్యేకించి సామాన్యులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ప్రభుత్వం దాని మీద చర్చ జరిపేందుకు భయపడింది, అసలేమీ జరిగిందో చెప్పేందుకు కూడా ముందుకు రాలేదు. రిజర్వుబ్యాంకు సైతం తేలుకుట్టిన దొంగలా ఏడాదిన్నర తరువాత వార్షిక నివేదికలో వివరాలు వెల్లడించటం తప్ప ఇతరంగా ప్రశ్నించటానికి అవకాశం ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు తమతో సంప్రదించగా ఆ చర్యను వ్యతిరేకించామని, తమతో సంబంధం లేకుండానే రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని రాజీనామా చేసిన తరువాత రిజర్వుమాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వెల్లడించారు. ఇతరుల మాదిరి రెండోసారి పదవీకాలాన్ని పొడిగించేందుకు మోడీ సర్కార్‌ తిరస్కరించింది. రాజన్‌ స్ధానంలో వచ్చిన గవర్నర్‌ వుర్జిత్‌ పటేల్‌ను అర్ధంతరంగా పదవి నుంచి తప్పుకొనేట్లు చేసింది మోడీ సర్కార్‌. తాము కోరిన విధంగా పెద్ద మొత్తంలో డివిడెండ్‌ రూపంలో ఆర్‌బిఐ నిల్వనిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని వత్తిడి చేయగా తిరస్కరించిన పటేల్‌ రాజీనామా చేసి తప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు దేశ, విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికి తీస్తే ప్రతి ఒక్కరికి 15లక్షల రూపాయల వంతున పంచవచ్చునంటూ కబుర్లు చెప్పిన పెద్దమనిషి గత ఐదేండ్లలో ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోమారో తెలియదు. తాజా మధ్యంతర బడ్జెట్లో తన ప్రభుత్వం నల్లధనం వెలికితీతకు కట్టుబడి వుందంటూ పెద్ద జోక్‌ పేల్చారు.

విదేశాలలో మన దేశ ప్రతిష్టను పెంచేందుకు, పెట్టుబడుల కోసమే తాను విదేశీ పర్యటనలు చేశానని, ఏటా రెండు కోట్ల వుద్యోగాలు, నైపుణ్యశిక్షణ కలిగించి మెరుగైన వుపాధి కల్పించామంటూ వూదరగొట్టిన అతి పెద్ద బెలూన్‌ గాలిని గత నాలుగున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సంస్ధ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా నివేదిక తుస్సుమనిపించింది. నాలుగేండ్లమోడీ పాలన తరువాత ఆరున్నర కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగా వున్నారని వెల్లడించింది. అత్యవసర పరిస్ధితికి ఐదు సంవత్సరాల ముందు గరీబీ హఠావో నినాదంతో ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన తరువాత దేశంలో పరిస్ధితి మరింత దిగజారింది. దానికి తోడు రాజకీయంగా తగిలిన ఎదురు దెబ్బల నుంచి తప్పించుకొనేందుకు అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. దానికి రెండు మూడు సంవత్సరాల ముందున్న స్ధాయికి తిరిగి ఇప్పుడు నిరుద్యోగం పెరిగిందన్నది తాజా నివేదిక సారాంశం. 2017జులై నుంచి 2018జూన్‌ మధ్యకాలంలో సేకరించిన సమాచారం మేరకు 6.1శాతం నిరుద్యోగులున్నారు. వారం వారం సేకరించే సమాచార విశ్లేషణ ప్రకారం తాజా వారంలో నిరుద్యోగశాతం 8.9గా నమోదైందంటే ఎంత వేగంగా పరిస్ధితి దిగజారుతోందో అర్ధం చేసుకోవచ్చు.

మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు ఎక్కువ బాధ అన్నది కొత్త నుడికారం. తన ఏలుబడిలో వుపాధి అంత అధ్వాన్నంగా వుందన్న నివేదికాంశాల కంటే అది బయటకు వచ్చిన తీరు నరేంద్రమోడీని తగలరాని చోట దెబ్బతీసింది. నష్ట నివారణకు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. తిట్టబోతే అక్క కూతురు-కొట్టబోతే కడుపుతో వుంది అన్నట్లు పరిస్ధితి తయారైంది. వుపాధి గురించి నివేదిక రూపొందించింది ప్రభుత్వ సంస్ధ. అది బయటకు వస్తే ఎన్నికలలో ప్రభావం చూపుతుందని మోడీకి అర్ధమైంది.జాతీయ గణాంక కమిషన్‌ ఆ నివేదికను ఆమోదించింది. దాన్ని బహిర్గతం చేసేందుకు మోడీ కార్యాలయం అడ్డుపడటంతో నిరసన తెలుపుతూ ఇద్దరు కమిషన్‌ సభ్యులు ఈ మధ్యనే రాజీనామా చేశారు. సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడినట్లుగా దాచి పెట్టేందుకు ప్రయత్నించిన నివేదిక బయటకు వచ్చినదాని కంటే దానిలోని అంశాలను ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు, అది తాత్కాలికమైనది అని అటూఇటూ తిప్పి నష్టనివారణకు నీతి ఆయోగ్‌ వున్నతాధికారి చెప్పటం తగలరాని చోట మోడీ సర్కార్‌మీద దెబ్బ వేసినట్లయింది. నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న వుపాధి కల్పన పధకాలు గణనీయంగా వుద్యోగాలను కల్పిస్తాయంటూ ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుల మండలి సభ్యుడు వివేక్‌ దేవరాయ్‌ చెప్పిన వీడియోను రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తన ఫేస్‌బుక్‌లో ఈ సందర్భంగా పోస్టు చేయటం గమనించాల్సిన అంశం. తన శాఖకు సంబంధం లేని అంశాన్ని ఆమె ఎందుకు పోస్టు చేశారో తెలియదు. బహుశా ప్రధాని ‘రక్షణ’ కోసం అనుకుందాం.

ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు పనిచేస్తాయా అన్నది అపూర్వ చింతామణి ప్రశ్న. గత ఏడు దశాబ్దాలుగా అధికార పార్టీలు పట్టువదలని విక్రమార్కుడిలా జిమ్మిక్కులకు పాల్పడినా మొత్తం మీద పని చేయలేదు. మట్టి కరచిన వుదంతాలే ఎక్కువ.తాజాగా బిజెపి నాయకత్వ తీరు తెన్నులను, జరుగుతున్న పరిణామాలను చూస్తే కారల్‌ మార్క్స్‌ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్ధ లాభాల కోసం వస్తువులతో పాటు తన గోరీ కట్టే కార్మికులను కూడా తయారు చేసుకుంటుందన్నారు. దాన్ని కొద్దిగా మార్పు చేస్తే మార్క్స్‌ చెప్పినట్లు నరేంద్రమోడీ తన పదవిని పదిల పరుచుకొనేందుకు కొన్ని అస్త్రాలను బయటకు తీయటంతో పాటు తన మీద సంధించే బలమైన అస్త్రాలను కూడా ప్రత్యర్ధులకు అందిస్తున్నారు అని చెప్పక తప్పదు.