ఎం కోటేశ్వరరావు
మూడు దశాబ్దాల క్రితం నాటి సోవియట్‌తో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు గతేడాది మధ్యంతర ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినపుడు ఓట్ల కోసం అని అందరూ అనుకున్నారు. కానీ మరొక అడుగు ముందుకు వేస్తూ దాన్ని నిర్ధారిస్తూ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్లు గత శుక్రవారం నాడు అమెరికా అన్నంత పనీ చేసింది. వెంటనే మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ తామూ వైదొలుగుతున్నట్లు రష్యా చెప్పేసింది. అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి నిషేధిత భూ వుపరితలం నుంచి ప్రయోగించే క్షిపణుల తయారీకి పూనుకుంటున్నట్లు ప్రకటించింది. రెండు దేశాల మాటలు వాస్తవ రూపందాలిస్తే ఆరునెలల్లో పార్లమెంట్ల అనుమతితో ఆప్రక్రియ పూర్తి అవుతుంది. దీని మీద ఐరోపా వైఖరి బహిర్గతం కావాల్సి వుంది. ఈ ఒప్పందం మీద వుభయ దేశాలు ఆరోపణల, ప్రత్యారోపణల పూర్వరంగంలో 2014 నుంచి అనేక దఫాలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. అయితే రెండు దేశాలకూ, ఐరోపాను, మొత్తంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఈ పరిణామం గురించి రెండు దేశాలకు వున్న సమస్యల కారణంగా పునరాలోచించే అవకాశాలు కూడా లేకపోలేదు.ఒప్పందాన్ని రష్యా వుల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తూ ఒప్పందం నుంచి తాము వైదొలనున్నట్లు చెబుతోంది. ఫిబ్రవరి రెండవ తేదీ వరకు తాము గడువు ఇస్తున్నామని ఆలోగా సానుకూలంగా స్పందించకపోతే తాము వైదొలుగుతామని డిసెంబరులోనే పాంపియో సూచన ప్రాయంగా చెప్పారు.నిషేధిత పరిధిలోని క్షిపణులను తాము పరీక్షించలేదని, తాము వుల్లంఘించినట్లు ఆరోపణలు గాక రుజువులు చూపాలని రష్యా ప్రతిస్పందించింది. అమెరికాయే ఒప్పందానికి విరుద్ధంగా ఐరోపాలో క్షిపణులను మోహరించిందని పేర్కొన్నది.
ఎందుకీ ఒప్పందం అవసరమైంది?
ప్రచ్చన్న యుద్దంలో భాగంగా సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపా ధనిక దేశాలు అమెరికాతో చేతులు కలిపాయి. దాంతో తన వ్యూహంలో భాగంగా పశ్చిమ ఐరోపా దేశాల మీద దాడి చేయగల ఎస్‌ఎస్20 మధ్యంతర శ్రేణి క్షిపణులను సోవియట్ తన గడ్డమీద మోహరించింది. దానికి ప్రతిగా అమెరికన్లు ఇటలీ, బ్రిటన్, జర్మనీలో తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు. ఈ మోహరింపును అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూర్వరంగంలో మధ్య, స్వల్ప శ్రేణి అణు బలాల ఒప్పందం(ఐఎన్‌ఎఫ్) పేరుతో తమ వద్ద వున్న మధ్య,లఘు శ్రేణి క్షిపణులను తొలగించుకొనేందుకు 1987 డిసెంబరు ఎనిమిదిన గోర్బచెవ్-రోనాల్డ్ రీగన్ మధ్య కాలపరిమితి లేని ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జూన్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. తరువాత సోవియట్ రద్దు కావటంతో దాని వారసురాలిగా రష్యా ఒప్పందంలోకి వచ్చింది.ఆ మేరకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు వున్న లఘు, వెయ్యి నుంచి 5,500 కిలోమీటర్లకు వుండే మధ్య శ్రేణి అణు, సాంప్రదాయ క్షిపణులను రెండు దేశాలు తొలగించాల్సి వుంటుంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలో లేవు. ఒప్పందం ప్రకారం 1991నాటికి అమెరికా 846 సోవియట్ లేదా రష్యా 1,846 క్షిపణులను నాశనం చేశాయి.
ఒప్పంద రద్దుకు అమెరికాను ప్రేరేపిస్తున్న అంశాలేమిటి?
గత ఐదు సంవత్సరాల పరిణామాలను చూసినపుడు ఒప్పందం రద్దు గురించి అమెరికన్ల గళమే ఎక్కువగా వినిపిస్తున్నది. రష్యా నుంచి అటువంటి ప్రకటనలు లేవు. తాజాగా ట్రంప్, విదేశాంగ మంత్రి పాంపియో ప్రకటనల వెనుక ఆంతర్యం గురించి కూడా పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి. 1987 ఒప్పందం తరువాత అమెరికా తయారు చేస్తున్న లేదా ఇప్పటికే తయారు చేసిన అధునాతన అణ్వాయుధాలను ప్రపంచం ముందుంచాలంటే రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ఆటంకంగా వుంది. రష్యా, చైనా వంటి సుదూర లక్ష్యాలను చేరగల క్షిపణిని తయారు చేస్తున్నట్లు అమెరికా ఇంధన శాఖ సూచన ప్రాయంగా ఇటీవలనే వెల్లడించింది.1987 ఒప్పందంలో చైనా లేని కారణంగా అది స్వంత అణ్వాయుధ మరియు అన్ని శ్రేణుల సాంప్రదాయ క్షిపణులను తయారు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని, ఐఎన్‌ఎఫ్ ఒప్పందం ఐరోపా కేంద్రంగా చేసుకున్నదని అమెరికా-చైనా మిలిటరీ బలాబలాలను పరిగణనలోకి తీసుకోవలేదని, ఆ అంశం ఇటీవలి కాలంలో అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిందని అమెరికాలో కొత్త వాదనలు లేవనెత్తారు. గత మూడు దశాబ్దాలలో అనేక దేశాలు అధునాతన అణ్వాయుధాలను తయారు చేశాయి. ఇది రెండు దేశాలకే పరిమితమైనందున వాటిని నియంత్రించే అవకాశం లేదు. అందువలన దానికి ఎందుకు కట్టుబడి వుండాలని, గతంలో కుదిరిన ఒప్పందాలన్నీ అమెరికాను అదుపు చేసే లక్ష్యంతోనే జరిగాయని, అందువలన వాటికెందుకు కట్టుబడి వుండాలని యుద్ధోన్మాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. దీనికి అనుగుణ్యంగానే అధికారానికి వచ్చినప్పటి నుంచి ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరోవైపు ఒబామా, ట్రంప్ ఎవరు అధికారంలో వున్నా ఏటేటా రక్షణ బడ్జెట్ పెంపుదల వెనుక నూతన ఆయుధాల తయారీ వుందన్నది స్పష్టం.ఒప్పందం నుంచి వైదొలుగుతామని ప్రకటించటంలో ముందుండటమే కాదు, దాని ప్రారంభంలోనే తూట్లు పొడిచింది. ఒప్పందం కుదిరిన నాలుగు సంవత్సరాల తరువాత 1991లో అమెరికా తన తొలి దీర్ఘశ్రేణి అణ్వాయుధాల తయారీకి పూనుకుంది. దాన్ని చూపి మిగతా దేశాలు కూడా తమ ప్రయత్నాల్లో తాము నిమగ్నమయ్యాయి.
ఒప్పంద రద్దు పర్యవసానాలేమిటి ?
ఒప్పందం రద్దు పర్యవసానాల గురించి కూడా చర్చ జరుగుతోంది.అమెరికా, రష్యా చర్యలు ప్రపంచంలో నూతన ఆయుధ పోటీకి తెరలేపుతాయని భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ పోటీ రెండు దేశాలకే పరిమితం కాగా నూతన పరిస్ధితుల్లో చైనా కూడా అనివార్యంగా రంగంలోకి దిగాల్సి వుంటుంది. నిజంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అమెరికా, రష్యా, చైనా మధ్య నూతన తరహా ప్రచ్చన్న యుద్ధం వంటి పరిస్ధితి తలెత్తుతుందని, గతం కంటే ఇప్పుడు రష్యా, చైనాలు మరింత సన్నిహితంగా వున్న విషయాన్ని మరచిపోరాదని అమెరికా గూఢచార సంస్ధలు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.నిజంగానే రద్దు చేసుకుంటే రష్యాతో ఎలా వ్యవహరించాలన్నది తక్షణం అమెరికా ముందున్న సమస్య. 2021లో నూతన వ్యూహాత్మక అణ్వాయుధ ఒప్పందం(న్యూ స్టార్ట్) కుదిరే అవకాశాలు లేవు. అది లేకుండా అణ్వస్త్రవ్యాప్తి నిరోధ అమలు సాధ్యం కాదు. అన్నింటికీ మించి అణ్వాయుధాలు అనేక దేశాల దగ్గర వున్నందున వాటన్నింటినీ కట్టడి చేయటానికి అవసరమైన పెద్ద సంఖ్యలో ఆయుధాలు తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వుత్పాదక శక్తి, ఆర్ధిక సామర్ధ్యం లేదన్నది ఒక అంచనా. వాటన్నింటినీ అధిగమించి అన్ని దేశాలకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను మోహరిస్తే అమెరికా మరింతగా ఒంటరిపాటు కావటం ముఖ్య రాజకీయ పర్యవసానం అవుతుంది. ఆయుధాలను మోహరించటం తప్ప ప్రయోగించే పరిస్ధితి లేనపుడు ఇలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోవటం ఎందుకన్నది మౌలిక సమస్య. ఇప్పటికే అమెరికా తమ మీద పెత్తనం చేస్తున్నదని, తమ భద్రత తాము చూసుకోగలమని ఐరోపా ధనిక దేశాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు నాటో ఖర్చును ఐరోపా దేశాలే ఎక్కువగా భరించాలని అమెరికా వత్తిడి తెస్తోంది. ఇప్పుడు నూతన ఆయుధాలను మోహరించాలంటే అది రష్యాతో వైరాన్ని పెంచటమే గాక తమ జనాన్ని ఒప్పించటం ఐరోపా దేశాలకు అంత తేలిక కాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు గత అనుభవాల రీత్యా అవసరమైన నూతన ఆయుధాలను తయారు చేసుకొనే వరకు వున్న ఒప్పందాలను కొనసాగించక తప్పని స్ధితిలో అమెరికా వుంటుందన్నది ఒక అభిప్రాయం. ఒప్పందం నుంచి వైదొలిగితే ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్నట్లు ఐరోపాలో అమెరికా మరిన్ని కొత్త ఆయుధాలను మోహరించటం, దానికి ప్రతిగా రష్యా చర్యలు వుంటాయి. నిజంగా ఒప్పందం రద్దయితే జర్మనీ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఐరోపా భద్రతకు, వ్యూహాత్మక సమతుల్యానికి ఒప్పందం కొనసాగటం అవసరమని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మక్రాన్ వ్యాఖ్యానించగా, అమెరికా ఆయుధాల మోహరింపు బహుముఖ ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని చైనా పేర్కొన్నది.మధ్యంతర ఎన్నికల సమయంలో ట్రంప్ చేసిన ప్రకటనతో నాటో కూటమి దేశాలలో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా వ్యక్తమైంది. తాజా పరిస్ధితికి రష్యాదే పూర్తి బాధ్యత అని అమెరికా నాయకత్వంలోని నాటో తాజాగా వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం లేదు. డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ ఎడ్వర్డ్ జె మార్కే మాట్లాడుతూ ప్రమాదకరమైన ఆయుధపోటీకి దారి కల్పిస్తూ ట్రంప్, అతని యుద్ధ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని విమర్శి ంచారు. నాటో విస్తరణ ముసుగులో పోలాండ్, ఇతర బాల్టిక్ దేశాలలో ఆయుధాలను మోహరించేందుకు అమెరికా పూనుకుంది. ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి వైదొలిగి ఆయుధాలను మోహరిస్తే అవి కొన్ని నిమిషాల్లోనే రష్యాలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. అందువలన వాటికి ప్రతిగా తాము వంద మెగాటన్నుల విధ్వంసక బాంబులను తీసుకుపోయే క్షిపణులను తయారు చేయక తప్పదని రష్యన్లు హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో అమెరికా అంతర్జాతీయ వ్యవస్ధ నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నది. వాతావరణ మార్పులు, భూతాపం తదితర అంశాలున్న పారిస్ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అణు ఒప్పందం, అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అవన్నీ ఒక ఎత్తయితే తాజా ప్రకటన అత్యంత ప్రమాదకర చర్యల, అంతర్జాతీయ భద్రత మీద ఎంతో పభావం చూపనుంది. తమ వద్ద వున్న పాత తరం అణ్వాయుధాలను వదలించుకొనేందుకు ఒప్పందంలో అమెరికా భాగస్వామి అయిందనే ఒక అభిప్రాయం వుంది. ఇప్పుడు అంతకంటే అధునాతన ఆయుధాలున్నందున మరోసారి ప్రపంచాన్ని భయపెట్టేందుకు పూనుకుందని చెప్పాలి. రెండవ ప్రపంచ యుద్ధం దాదాపుగా ముగిసిన తరువాత ప్రపంచాన్ని భయపెట్టేందుకు అమెరికన్లు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించిన ‘లిటిల్ బోయ్, ఫాట్ మాన్ ‘ అణుబాంబులు ఇప్పటి వాటితో పోల్చితే చాలా చిన్నవి. అయినా అవెంత మారణకాండకు కారణమయ్యాయో ఇప్పటికీ ఆ ప్రాంతంలో అణుధార్మికత ఎలా వుందో చూస్తున్నాము.మరోసారి ప్రపంచ యుద్దమంటూ వస్తే మిగిలే దేశం ఒక్కటీ వుండదు.ప్రచ్చన్న యుద్దం 35వేల అణ్వాయుధాల తయారీకి దారితీసింది. వాటితో ప్రపంచాన్ని ఎన్నిసార్లు నాశనం చేయవచ్చో వూహించుకోవాల్సిందే. అలాంటి పోటీని మరింతగా పెంచేందుకు అమెరికా పూనుకుంది. ఇది అత్యంత దుర్మార్గం.నిజంగానే ఒప్పందం రద్దయితే ఆ చారిత్రాత్మక ఎదురుదెబ్బకు బాధ్యురాలు అమెరికానే అవుతుంది.