Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

‘ఐరోపాను ఒక భూతం వెన్నాడుతోంది ! ఆ భూతం కమ్యూనిజం !! పాత ఐరోపాలోని అధికార కేంద్రాలైన పోప్‌, జార్‌, మెట్టర్‌నిచ్‌ (నాటి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి), గుయిజోట్‌(ఫ్రెంచి 17వ ప్రధాని) , ఫ్రెంచి తీవ్రవాదులు, జర్మన్‌ పోలీసు గూఢచారులు ఆ దయ్యాన్ని వదిలించుకొనేందుకు ఒక పవిత్ర కూటమిగా తయారయ్యారు.’ 1848లో ప్రచురితమైన కమ్యూనిస్టు మానిఫెస్టోను కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌లు పై మాటలతో ప్రారంభించారు. ఈనెల ఐదవ తేదీ రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ పార్లమెంట్‌ వుభయ సభల నుద్ధేశించి చేసిన రెండవ ప్రసంగాన్ని చూస్తే సోషలిజం అనే భూతం ట్రంప్‌ను అంటే అమెరికా పాలకవర్గాన్ని వెన్నాడుతోందని స్పష్టమైంది. అనేక మంది అమెరికా అధ్యక్షులు, సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా నానా చెత్త మాట్లాడారు. కొంత మంది విశ్లేషకుల సమాచారం ప్రకారం తొలిసారిగా ఒక అమెరికా అధ్యక్షుడు పార్లమెంట్‌లో సోషలిజం గురించి ప్రకటన చేయటం ఇదే ప్రధమం. బహుశా ఈ కారణంగానే కావచ్చు ఒక మీడియా సంస్ధ ‘సోషలిజం విజేత ‘ అని వుపశీర్షిక పెట్టింది. ట్రంప్‌ అనూహ్యంగా చేసిన ప్రస్తావనతో అనేక మంది మీడియా పండితులు దానికి భాష్యాలు చెప్పటం ప్రారంభించారు. ఇంతకీ ట్రంప మహాశయుడు చెప్పిందేమిటి?

Image result for A specter is haunting US , the specter of socialism

‘ ఇక్కడ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, మన దేశం సోషలిజాన్ని స్వీకరించాలన్న కొత్త పిలుపులు మనలను జాగరూకులను చేశాయి. అమెరికా స్వేచ్చ, స్వాతంత్య్రాలతో స్ధాపించబడింది తప్ప ప్రభుత్వ బలవంతం, ఆధిపత్యం, అదుపులతో కాదు. మనం స్వేచ్చతో జన్మించాం, స్వేచ్చగానే వుంటాం. అమెరికా ఎన్నడూ సోషలిస్టు రాజ్యంగా వుండేదిలేనే సంకల్పాన్ని ఈ రాత్రి పునరుద్ఘాటిస్తున్నా.’ ఎవరు అవునన్నా కాదన్నా ఎలా గింజుకున్నా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనూహ్యరీతిలో సోషలిజాన్ని అజెండాగా చేశాయి. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా తనకు మద్దతు ఇవ్వాలంటూ పోటీలోకి వచ్చిన సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకొని మరీ గోదాలోకి దిగాడు. గతేడాది జరిగిన మధ్యంతర ఎన్నికలలో డెమొక్రటిక్‌ సోషలిస్టు పార్టీ అభ్యర్ధులిరువురు సోషలిస్టులమని చెప్పుకొని మరీ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.

చరిత్ర పునరావృతం అవుతుంది అంటే అర్ధం కొత్త రూపంలో అని తప్ప గతంలో జరిగిన మాదిరే అని కాదు. గతంలోప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రంగా ఐరోపా వుంది గనుక అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు దాని కేంద్రం అమెరికాకు మారినందున అక్కడ నాంది పలికిందని చెప్పవచ్చు. నాడు ఐరోపాలో కమ్యూనిస్టు భావజాలం ప్రాచుర్యం పొందిన సమయంలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి దానిని వ్యతిరేకిస్తున్న వారే చెప్పారు. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్దిస్తున్న వారే అది వైఫల్యం చెందిందని, పని చేయటం లేదని బాహాటంగా చెప్పటం విశేషం. అమెరికాలో మీరు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తున్నారా, సోషలిజాన్ని సమర్ధిస్తున్నారా అంటూ ఇప్పుడు జరుగుతున్న సర్వేలవంటివి కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన సమయంలో లేవు. గత కొద్ది సంవత్సరాలుగా పెట్టుబడిదారీ వ్యవస్ధకు కట్టుబడి వున్న సంస్ధల సర్వేలు చెబుతున్నదేమిటి? అమెరికాలో పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందుతున్నదని, సోషలిజం కావాలని చెబుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువలన అటు డెమోక్రటిక్‌ పార్టీ ఇటు రిపబ్లికన్‌ పార్టీలో కూడా కింది నుంచి వస్తున్న వత్తిడితో ట్రంప్‌ సోషలిజం గురించి భయపడటంలో ఆశ్చర్యం లేదు. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండబోదని ప్రకటించిన సమయంలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మితవాది అయిన పార్లమెంట్‌ దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ సహజంగానే చప్పట్లతో తబ్బిబ్బు అయ్యారు. పురోగామి సెనెటర్‌గా ముద్ర పడిన ఎలిజబెత్‌ వారెన్‌ తన స్దానం నుంచి లేచి మరీ సోషలిజం మీద ప్రకటించిన ట్రంప్‌ ప్రకటించిన యుద్ధానికి చప్పట్లు చరిచారు.

Image result for A specter is haunting US , the specter of socialism

మరుసటి రోజు వుదయం అమెరికా విత్త మంత్రి స్టీవ్‌ నుచిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రీకృత ప్రణాళికాబద్ద ఆర్ధిక వ్యవస్ధ మీద రిపబ్లికన్లకు నమ్మకం లేదని సోషలిజానికి మరలేది లేదని చెప్పాడు. నిజానికి ట్రంప్‌ సోషలిజం గురించి మాట్లాడటం వెనుక అమెరికన్లను తప్పుదారి పట్టించే ఎత్తుగడ వుంది. వెనెజులాలో సైనిక జోక్యానికి ఐదువేల మంది సైనికులను పక్కనే వున్న కొలంబియాలో మోహరించిన ట్రంప్‌ ఒక సాకుకోసం చూస్తున్నాడు. సోషలిజం కారణంగానే వెనెజులాలో పరిస్ధితులు దిగజారాయని అరోపించిన వెంటనే అమెరికా సోషలిజం గురించి ట్రంప్‌ ప్రస్తావించాడు. నిజానికి అక్కడ ఆర్ధిక పరిస్దితి దిగజారటానికి అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆంక్షలు, దిగ్బంధనమే ప్రధాన కారణం. ముందే చెప్పుకున్నట్లు రోజు రోజుకూ పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాల గురించి జనం ప్రస్తావిస్తున్నారు. నిజానికి 80శాతం మంది అమెరికన్లు పని చేస్తే తప్ప గడవని స్ధితిలో వున్నారు. నిజవేతనాలు నాలుగు దశాబ్దాల నాటి కంటే తక్కువగా వున్నాయి. మెడికల్‌ బిల్లులు అనేక మందిని దివాలా తీయిస్తున్నాయి. విద్యార్దుల అప్పుల సంగతి సరేసరి. కోట్లాది మంది వుద్యోగ విరమణ తరువాత తమ పరిస్ధితి ఏమిటనే ఆందోళనలో వున్నారు. వెనెజులాను సాకుగా చూపి సోషలిజం మీద సైద్ధాంతిక దాడి చేస్తే అమెరికాలో పెరుగుతున్న ప్రాచుర్యాన్ని అరికట్టవచ్చని ట్రంప్‌ భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. ఇప్పుడు మరింతగా అమెరికాలో సోషలిజం గురించి చర్చ జరగటం అనివార్యం. మీడియాలో గత రెండు రోజులుగా వెలువడుతున్న విశ్లేషణలే అందుకు నిదర్శనం. ‘ అమెరికాలో సోషలిజం ఒకనాడు సమాజ ప్రధాన స్రవంతికి దూరమైన సిద్దాంతం. ట్రంప్‌ ప్రసంగానికి ముందే అది స్పష్టంగా మారుతోంది. అమెరికా సోషలిస్టు యువత ప్రమాదం గురించి భయపడుతున్న తగరగతులతో ఫాక్స్‌ న్యూస్‌ నడుస్తోంది. అయితే పార్లమెంట్‌ వుభయ సభల్లో జరిగిన దాడి తరువాత సోషలిజం సమయం వచ్చినట్లు అనుకోవచ్చు. అదిప్పుడు ప్రధాన స్రవంతి భావజాలం అధ్యక్షుడి ఆగ్రహానికి గురికావలసినదే. ఒక శత్రువు కలకు అంతగా తోడ్పడేందుకు ఎవరు సాహసిస్తారు ?’ అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.

సోషలిజంపై పార్లమెంట్‌లో ట్రంప్‌ దాడికి వారం రోజుల ముందు వెలువడిన ఒక సర్వే వివరాలు ట్రంప్‌ను భయపెట్టి వుంటాయి. సహస్రాబ్ది తరంతో(1981-1996 మధ్య పుట్టిన వారు) పాటు అనంతర జడ్‌ లేదా యూట్యూబ్‌ తరం(1996 తరువాత పుట్టినవారు) కూడా సోషలిజంవైపు ఎక్కువగా మొగ్గుతున్నారని దానిలో తేలాయి.పదింట ముగ్గురే ట్రంప్‌ సరిగా పని చేస్తున్నారని కూడా వెల్లడైంది. 2010లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింతగా ప్రయత్నించాలని సహస్రాబ్దితరంలో 53శాతం పేర్కొనగా ఇప్పుడు రెండుతరాల్లో అలా అభిప్రాయపడుతున్నవారు 64,70శాతం మంది వున్నారు. ముప్పై అయిదు సంవత్సరాల లోపు యువత సోషలిజం పట్ల ఎక్కువ మంది సానుకూలంగా వున్నారు. సర్వేల పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతోందని కూడా చెప్పువచ్చు. తాజా సర్వే ప్రకారం 18-24 మధ్య వయస్సు వారిలో 76శాతం, 25-44 వయస్సు వారిలో 60శాతం ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధ న్యాయంగా లేదని, ధనికులకే అనుకూలంగా వుందని అభిప్రాయపడుతున్నారని తేలింది.

అమెరికాలో సోషలిజం ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణం ఏమిటంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే 2008లో తలెత్తిన ప్రపంచ సంక్షోభం అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.ఆ సంక్షోభం ఆర్దిక బాధను కలిగించటమే కాదు సామాజిక వ్యవస్ధను కూడా దెబ్బతీసింది.2016లో బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ పేర్కొన్నదాని ప్రకారం 70లక్షల మంది అంటే 12శాతం పురుషులు పని చేయటం లేదని పేర్కొన్నది.1970దశ కంలో స్వేచ్చా వాణిజ్యం ఒక విధానంగా అమెరికాలో, ప్రపంచంలో ముందుకు వచ్చింది.2000 సంవత్సరంలో చైనా ప్రపంచ వాణిజ్య సంస్ధలో ప్రవేశించిన తరువాత అమెరికాలో 34లక్షల వుద్యోగాలు నష్టపోయినట్లు ఎకనమిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ అంచనా వేసింది. తరువాత నాలుగేండ్లకు వుత్తర అమెరికా స్వేచ్చావాణిజ్య ఒప్పందం (నాఫ్టా) వలన మరొక పదిలక్షల వుద్యోగాలు పోయినట్లు పేర్కొన్నది. వీటికి తోడు ఈ కాలంలో మరింత యాంత్రీకరణ జరగటంతో ఒకప్పుడు పాఠశాల విద్య చదువుకున్న వారికి కూడా మంచి వుద్యోగాలు దొరికిన అమెరికాలో నైపుణ్యం లేని, తక్కువ వేతనాలు లభించే వుద్యోగాలన్నింటినీ రోబోట్లు, ఇతర కృత్రిమ మేధ యంత్రాలు భర్తీ చేశాయి. దాంతో మరిన్ని లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. మధ్యతరగతి అంతరించేదిశగా పరిణామాలున్నాయి. పర్మనెంటు స్ధానంలో తాత్కాలిక లేదా కాంట్రాక్టు వుద్యోగాలు గణనీయంగా పెరిగాయి. మానవ శ్రమ స్ధానంలో యంత్రాలను ఎంత ఎక్కువగా ప్రవేశపెడితే పెట్టుబడి పోగుపడటంతో పాటు లాభాలు పెరుగుతాయి. మరోవైపున కాంట్రాక్టు లేదా తాత్కాలిక కార్మికుల వేతనాలు పడిపోతాయి. ఇది ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు, కార్మిక భద్రత వంటి కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ పరిణామాలన్నింటినీ పెట్టుబడిదారీ విధాన వైఫల్యంగానూ, అది పనిచేయకపోవటంగానూ నూతన తరం చూస్తున్నది.

Image result for A specter is haunting USA , socialism

అమెరికా అంతా సజావుగా వుందని ఒకవైపు చెబుతూనే అసంతృప్తిని చల్లార్చేందుకు గత రెండు సంవత్సరాల కాలంలో ట్రంప్‌ చేయని యత్నం లేదు. అమెరికా వస్తువులను దిగుమతి చేసుకొనే విధంగా చైనాపై వత్తిడి తెస్తూ వాణిజ్య యుద్ధానికి దిగాడు. విదేశాల నుంచి వలసలు వచ్చేవారితో స్వదేశీ కార్మికులకు వుపాధి సమస్యతో పాటు వేతనాలు పడిపోతున్నాయంటూ వలసను ఆపేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టాలని ప్రచారం చేస్తున్నాడు. నాఫ్టా ఒప్పందం బదులు మరొక కొత్త ఒప్పందంతో అమెరికాలో వుపాధి అవకాశాలను పెంచుతానని నమ్మబలుకుతున్నాడు. 2008 నుంచి అంతకు ముందున్న పాలకులు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసినా విఫలమయ్యారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం పని చేయటానికి ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలున్నాయి. అయితే ఆ వ్యవస్ధ సరిగా పనిచేయటం లేదని అసంతృప్తి చెందుతున్న యువతరమే కాదు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులే చెప్పటం గతంలో ఎన్నడూ వినలేదు. అమెరికాలో బ్రిడ్జివాటర్‌ అనే పెట్టుబడుల కంపెనీ అధిపతి రే డాలియో ‘ పెట్టుబడిదారీ వ్యవస్ధ మెజారిటీ పౌరులకోసం పని చేయటం లేదు. అది ఒక వాస్తవం’ అని గతేడాది నవంబరు నెలలో లాస్‌ ఏంజల్స్‌ నగరంలో జరిగిన సభకు పంపిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘నేడు జనాభాలోని ఒకశాతం ఎగువ వారిలో వున్న సంపద విలువ జనాభాలో 90శాతంగా వున్నవారితో సమంగా వుంది. 1930దశకంలో జరిగిన మాదిరే పరిస్ధితి వుంది. అత్యవసరం అయితే 40శాతం మంది పెద్దల చేతుల్లో నాలుగు వందల డాలర్లు వుండటం లేదు. ఈ పరిస్దితి మీకు ధ్రవణత గురించి ఒక అవగాహన కలిగిస్తుంది, అదే నిజమైన ప్రపంచం, అదొక సమస్య కూడా.’ అన్నారు. అయితే వాస్తవ సమస్య పెట్టుబడిదారీ విధానంతో కాదని సహజసిద్దమైన ముక్తాయింపు ఇచ్చారనుకోండి. జనంలో పెరుగుతున్న అసంతృప్తిని జోకొట్టేందుకు ధనవంతులు చేసే ఎదురుదాడి ఇది.